Friday, August 23, 2013

నా ఐరోపా యాత్ర - 8 (పోలాండ్)


నా ఐరోపా యాత్ర - 8 (పోలాండ్)
పదవ బారక్ ఆడవాళ్ళ పాలిట నరక కూపం. అందులో జర్మన్ డాక్టర్లు ఆడవాళ్ళపై రక రకాల ప్రయోగాలు చేసేవారట. గర్భిణి స్త్రీలకి ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండానే లోపల పిండం ఎలా ఉందో అని కోసి చూసేవారు. ఇంకా స్త్రీల అవయవాలన్నీ కోసి వాటిపై పరిశోధనలు చేసారు. రకరకాల ఔషధాలని ప్రయోగించి అవి పనిచేస్తునాయో లేదో అని పరీక్షించేవారు. ఇవన్నీ బతికున్న మనుషులపైన ఎటువంటి మత్తు మందు లేకుండా జరిపిన పాశవిక హత్యా కాండ. ఆ బారక్ లో లోపలి వెళ్ళిన వారెవరూ ప్రాణాలతో బయటకి వచ్చేవారు కాదు. మిగతా వారికి ఆ బారక్ లో ప్రవేశం నిషిద్ధం. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా. ఈ పని ఏ ఆటవిక ప్రజలు కూడా చేసి ఉండరు. అందుకే హిట్లర్ అనే ఒక మానవుడిని మృగం తో పోల్చినా పాపమే.ఇక ఒక నాజీ అధికారి భార్య చేసిన పని వింటే రక్తం మరిగిపోతుంది. గ్యాస్ చాంబర్లలో మరణించిన యూదుల ఆడవారి స్తనాలని కోసి ఆ చర్మంతో ఫాన్సీ పర్సులు కుట్టేది. యుద్ధం ముగిశాక ఈమె  బ్రిటన్ సైన్యానికి చిక్కి జైల్లోనే ఆత్మహత్య చేసుకుంది. అసలు ఇక్కడ ఎం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలిసేది కాదు.ఇక్కడ ఖైదీలందరికీ ఒక యునిఫామ్ ఉంది. కాంపులోకి ప్రవేశించగానే చేతిపై వారి నంబర్ ని పచ్చ పొడిచేవారు.  చచ్చేదాకా వాడిని ఆ నెంబర్ తోనే పిలిచేవారు. కొందరికి ఆ పచ్చ పొడవటం వల్ల అయిన గాయం సెప్టిక్ అయ్యి మరణించేవారు.
మేము చూస్తున్నంత సేపు సందర్శకులలో చాలామంది ఏడుస్తూనే ఉన్నారు.యుద్ధం ముగిసాక కాని ఈ కాంపుల్లో అకృత్యాలు బయటి ప్రపంచానికి తెలియలేదు. యుద్ధంలో ఓడిపోయామని తెలియగానే ఇక్కడి అధికారులు రికార్డులన్నీ తగలబెట్టేసారు. అమెరికా, బ్రిటన్ సైన్యాలు వచ్చేటప్పటికి సగం కాలుతున్న శవాలు, ఆస్థి పంజరాలు, కుళ్ళిపోయిన వేలాది మంది శవాలు మీదుగా నడవాల్సి వచ్చిందట. 1941 నుండి 1944 వరకు ఈ కాంపుకి తీసుకొచ్చిన వారిలో ఒక్కరు కూడా యుద్ధం ముగిసే నాటికి జీవించి లేరు. 1945 లో మూడు నెలలకి ముందు తీసుకు వచ్చిన వారు మాత్రమే యుద్ధం ముగిసాక బయట పడ్డారు.ఇక యుద్ధం అయ్యాక పట్టుబడిన నాజీ అధికారులని జర్మనీ లో ఉన్న న్యురేం బర్గ్ లో న్యాయ విచారణ చేసారు. అందరికీ మరణ శిక్ష విధించారు. ఇక  కాంపులో అత్యాచారాలకి పాల్పడిన నాజీ అధికారులని ఇక్కడే తమ ముందే ఉరి తీయాలని యూదులు కోరడంతో కొంతమందిని ఇక్కడే ఉరి తీసారు. కాని ఎన్ని శిక్షలు విధించినా పోయిన 60 లక్షలమంది ప్రాణాలు, బతికుండగానే జీవచ్చవాలు గా మిగిలిన లక్షలాది మంది జీవితాలు తిరిగి రావుగా.ఎన్నో పసి మొగ్గలు నాజీల దురహంకారం కింద నలిగిపోయాయి.  ప్రపంచంలోనే జరిగిన అతి పెద్ద మానవ హననం ఈ యూదుల మారణ కాండ. దీనిని హాలో కాస్ట్ అంటారు. ఈ పేరుతొ జర్మనీ లోనూ అమెరికాలోనూ పలు మ్యుజియాలు ఉన్నాయి.
పోలాండ్ వాసులకి జర్మనీ అంటే ఎంత కోపమో, తమని కాపాడిన రష్యా అన్నా అంతే కోపం.1945 నుండి 1989 వరకు ఇది రష్యా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కాని పోలిష్ ప్రజలు ఆ కమ్యూనిస్టు విధానాలకి వ్యతిరేకం. జర్మనీ నుండి 1945 లో విముక్తి చేశామనే సాకుతో రష్యా ఈ దేశాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. సోవియట్ యూనియన్ ముక్కలయ్యాక పోలాండ్ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. 2004 లో యూరోపియన్ యూనియన్ లో భాగస్వామ్య దేశం అయ్యింది. అయినప్పటికీ మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే ఆర్ధిక ప్రగతిలో ఈ దేశం ముందు ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కరెన్సీ యూరో కి మారకపోవటం వల్లే పోలాండ్ స్థిమితంగా ఉందనేది నా అభిప్రాయం. కరెన్సీ ల మధ్య వ్యత్యాసం ఉంటేనే ఒక దేశపు ప్రజలు మరొక దేశానికి విహారానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. యూరప్ దేశాల ప్రజలు ఎక్కువ విహారాన్ని ఇష్టపడతారు. సెలవలు వస్తే ఇతర దేశాలకి వెళుతూ ఉంటారు.అన్ని దేశాలకి ఉన్న ప్రధాన ఆదాయ వనరు టూరిజం. అన్ని దేశాలలో యూరో కరెన్సీ ఉంటే ఒక దేశం అవలంబించే ఆర్ధిక విధానాల వల్ల మాంద్యం ఏర్పడితే ఆ ప్రభావం యూరో మీద పడి యూరో చలామణి లో ఉన్న మిగతా దేశాల ఆర్ధిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపుతుంది. కరెన్సీ లో వ్యత్యాసం ఉంటే ఏదైనా దేశం ఆర్ధిక సంక్షోభంలో పడినప్పుడు ఆ దేశపు కరెన్సీ తో యూరో మారకం విలువ పెరుగుతుంది.యూరో చలామణిలో ఉన్న దేశస్తులు చవకలో వినోదం పొందటానికి ఆ దేశానికి వెళతారు. దాని ద్వారా ఆ దేశం సంక్షోభం నుండి సునాయాసంగా గట్టేక్కవచ్చు. ఉదాహరణకి ఇటలీలో ఒక పిజ్జా ఖరీదు 12 యూరోలు, అదే పిజ్జా పోలాండ్లో 14 జిలోటీలు. ఒక యూరోకి 4.50 జిలోటి లు వస్తాయి.అంటే ఇటలీ లో కంటే మూడో వంతులో పోలాండ్ లో వినోదం దొరుకుతుంది. ఇటాలియన్స్ వీకెండ్స్ కి , సెలవలకి పోలాండ్ వచ్చి హాయిగా గడపచ్చు. అదే ఇక్కడ కూడా యూరో ఉంటే వచ్చేవారికి అంత ఆసక్తి ఉండదు. ఇటీవల సైప్రస్, స్పెయిన్, గ్రీస్ లలో ఆర్ధిక సంక్షోభం వచ్చింది. వాటిని నిలబెట్టటానికి యూరోప్ యూనియన్ మొత్తం పూనుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ ని ఆయా దేశాల్లో యధా తధంగా ఉంచటం మంచిది.ఇక ఆశ్విత్జ్ చూసాక అత్యంత బాధా తప్త హృదయంతో అక్కడినుండి బయలుదేరాం. మా తరువాతి గమ్యం క్రాకో నగరంలో ఉన్న సాల్ట్ మైన్. ( ఉప్పుగని )

Friday, August 16, 2013

నా ఐరోపా యాత్ర - 7 (పోలాండ్)

      

అక్కడ ఉన్న టూరిస్టులు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అందరి వదనాల్లో విచారమే తప్ప ఉత్సాహం లేదు. రుస్కి ఎంట్రన్స్ అంటే రష్యా యుద్ధ ఖైదీలని తీసికెళ్ళే ద్వారం అది. ఇప్పుడు కాంపులోకి వెళ్ళటానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. వెళ్ళే దారిలో ఆ ప్రాంతాన్ని దర్శించి నివాళులర్పించిన వివిధ దేశాల అధ్యక్షుల వివరాలన్నీ ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టారు.వాటిని దాటుకుంటూ టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. ఇంగ్లీష్ గైడ్ కావాలంటే మనిషికి 25 జిలోటీ లు పోలిష్ భాష అయితే 15 జిలోటీలు ప్రవేశ రుసుము. 20 మందికి ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్ చెప్పేది వినటానికి ఒక ఎలెక్ట్రానిక్ రేడియో మరియు హెడ్ ఫోన్స్ ఇస్తారు. మనం గుంపులో ఉన్నా ఆ గైడ్ చెప్పేది స్పష్టంగా వినపడుతుంది. ఈ కాంపు మూడు భాగాలుగా నిర్మించారు. ఆష్విత్జ్ - 1 లోకి మేము ఇప్పుడు వెళ్ళబోయేది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ఖైదీలని, యూదులని ఉంచటానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ ప్రాంతాన్ని ప్రతిపాదించాడు. రైలు మార్గం అనువుగా ఉండటంతో అన్ని దేశాలనుండి యూదులని ఇక్కడికి తరలించటానికి అనువుగా ఉంటుందని జర్మన్ నాజీ ఆఫీసర్ హిమ్లర్ ఈ ప్రాంతంలో నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ గ్రామంలో అప్పటికే ఉన్న 1200 మందిని ఖాళీ చేయించి 40 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతాన్ని నాజీ సైన్యం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. 300 మంది యూదుల చేత దీనికి పునాది రాళ్ళు వేయించి, తరువాతి కాలంలో ఇక్కడి ఖైదీల చేతనే మిగతా 2 బ్లాకులు కట్టించారు.
ఇక్కడికి రైళ్ళలో ఒక్కో పెట్టెలో 200 మందిని కుక్కి 3 రోజుల పాటు ప్రయాణించాక రైళ్ళు ఇక్కడికి చేరుకునేవి. అవి ఇక్కడికి చేరుకునేలోపే ఆ పెట్టెల్లో సగం మంది చనిపోయేవారు. మిగిలిన వారిని ఇక్కడ చంపేసేవారు.కేవలం ఈ ఆశ్విత్జ్ కాంపుల్లో చంపబడ్డ మనుషుల సంఖ్య దాదాపు 12 లక్షలు. మనుషుల్ని తీసుకురావటానికి నేరుగా రైలు మార్గాన్ని కాంప్ లోపలికే నిర్మించారు. యూరప్ లో అన్ని దేశాలనుండి యూదులని, యుద్ధఖైదీలని రైళ్ళలో ఈ కాంపుకి తరలించేవారు. రైలు దిగగానే నాజీ డాక్టర్లు, కమాండర్లు వారిని పరీక్షించేవారు. కొంచెం శారీరకంగా ధృడంగా ఉన్నవారిని ఒక పక్కకి, మిగతా వారిని నేరుగా చంపటానికి వేరు చేసేవారు. ఆరోగ్యం గా ఉన్నవారిని కొంతకాలం పని చేయించుకుని వారిలో సత్తువ అయిపోగానే చంపేసేవారు. కొత్త బాచ్ మనుషులు వచ్చినపుడు గదులు ఖాళీ లేకపోతే వెంటనే వచ్చిన వారిని చంపేయటమో లేక అప్పటికే కాంపులో బలహీనంగా ఉన్న వారిని ఆఘమేఘాల మీద కాల్చేసి, కొత్తవారిని ఆ గదుల్లో ఉంచేవారు. మా గైడ్ తో పాటు ఉన్న 20 మందిలో మేము నలుగురం ఇండియన్స్ ,మార్చిన్ కూడా మాతోనే ఉన్నాడు. గైడ్ ని అనుసరిస్తూ ఆ సువిశాల ప్రాంగణంలోకి ప్రవేశించాం. అప్పటికే అక్కడ చాలామంది టూరిస్టులు ఉన్నారు.అక్కడ నిర్మించిన బ్లాకులన్నీ దేశాల వారిగా పేర్లు పెట్టారు. అంటే ఆక్రమిత దేశాలనుండి తీసుకు వచ్చే యూదులందరినీ ఆయా దేశాల పేరుతో నిర్మించిన బ్లాకులో ఉంచేవారు. మేము ప్రవేశించిన బ్లాకు కి పేరు ఏమీ లేదు. అక్కడి యుద్ధ ఖైదీలు వాడిన దుస్తులు, బూట్లు, వారి వస్తువులు, వికలాంగులు వాడే చేతి కర్రలు అక్కడ కుప్పలుగా పోసి ఉన్నాయి. వచ్చిన ఖైదీలకి బంగారు దంతాలు ఉంటే వాళ్ళు బతికుండగానే నాజీలు అవి పీకేసేవారట. మొదటి బ్లాకు చూడటం పూర్తవగానే శశి బయటకి వచ్చి అక్కడ ఒక మెట్టు దగ్గర కూలబడిపోయాడు. అసలేం జరిగింది ఇక్కడ ? అసలు మనుషుల్ని ఇలా చంపటం ఏంటి అంటూ ఇక నేను చూడలేను మీరు వెళ్ళండి అని అక్కడే ఉండిపోయాడు. ఉదయ అమ్మణ్ణ నాతో పాటే వచ్చాడు. మార్చిన్, నేను, చోటు రామ్ కలిసి తరువాతి బ్లాకు కి వెళ్ళాం. మార్చిన్ కి అన్నీ తెలిసి ఉండటంతో మేము మా గ్రూపు నుండి విడిపోయి సొంతంగా తిరగటం మొదలు పెట్టాం. తరువాతి బ్లాకులో ఆ కాంపులో చంపబడ్డ మనుషుల ఫోటోలు వారు వాడిన తిండి పాత్రలు ఉన్నాయి. హిట్లర్ యుద్ధాన్ని ఒక సంస్థ ని నడిపినట్టే నడిపాడు. బతికున్న ముడి పదార్ధాలని నిర్జీవంగా చెయ్యటం ఈ ఫాక్టరీ యొక్క పని.  మనుషుల్ని చంపటానికి నాజీలు ఉపయోగించిన పద్ధతులు వింటే మన హృదయం ద్రవించక మానదు. రోజుకి 4000 మంది నుండి 6000 మందిని చంపాలనేది టార్గెట్. గాస్ చాంబర్లు, శవాలని కాల్చే ఫర్నేస్ లు 24 గంటలు పని చేస్తూ ఉండేవి. వారానికొకసారి స్నానం అనే నెపంతో టాయ్లెట్ అని రాసున్న గదుల్లోకి ఖైదీలని పంపేవారు. ఒక్కో బాత్రూంలోకి 50 మందిని పంపి పైన ఉన్న షవర్ ఆన్ చెయ్యగానే గ్యాస్ విడుదలయ్యి లోపల ఉన్న వాళ్ళంతా శవాలుగా మారేవాళ్ళు. ఆ తరువాత పక్కనే ఉన్న ఫర్నేస్ లో వారిని తగలబెట్టేసేవాళ్ళు ఇదంతా 20 నిముషాల్లో పూర్తయ్యేది. రోజూ కొన్ని వేల శవాలు కాలుతుండటంతో ఈ ప్రాంతం అంతా పొగ, దుర్వాసనతో నిండి ఉండేది.
వాటి మధ్యే మిగిలిన ఖైదీలు ఉండేవారు. నాజీలు ఎంత కర్కోటకులంటే ఏదైనా బారక్ లో ఖైదీ కనపడకపోతే ఆ బారక్ లో ఉన్న మిగతా పదిమందిని చంపేసే వాళ్ళు. ఆ భయంతో తోటి వాళ్ళు తప్పించుకోకుండా సహా ఖైదీలే కాపలా కాసేవాళ్ళు. ఆ కాంపులోకి తీసుకు వచ్చిన ప్రతి ఖైదీ వివరాలు రికార్డ్ చేశారు. వాళ్ళు పట్టుబడిన ప్రాంతం,కాంపులోకి తీసుకు వచ్చిన తేదీ,వారిని చంపిన తేదీ, అందుకు వాడిన పద్ధతులు కూడా రికార్డ్ చేశారు. అంతే కాక ప్రతి వ్యక్తినీ ఫోటో తీశారు. కాంపుకి వచ్చినపుడు తీసిన ఫోటోకి తరువాతి మూడునెలల తర్వాత అదే మనిషి ఫోటోకి అసలు పోలికలే లేవు. ఆ ఫోటోలన్నీ ఇక్కడ ప్రదర్శనలో చూడచ్చు.మగ వాళ్ళకి ఆడవాళ్ళకి విడి విడిగా బారక్ లు ఉన్నయి.ఇక్కడికి వచ్చిన వాళ్ళ సగటు జీవితం మూడు నెలల కంటే ఎక్కువ ఉండేది కాదట.ఒక్కో గదిలో 400 మందిని ఉంచేవారు. ఆ మంచాలు ఇప్పటికీ యధాతధంగా ఉన్నాయి. ఎలుకలు, చలి తో సహవాసం. ఎవరికీ అక్కడినుంచి తప్పించుకునే ఆలోచన కూడా వచ్చేది కాదట.ఇన్ని లక్షలమందిలో తప్పించుకోవటానికి చూసిన 802 మందిలో 700 మంది తిరిగి పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారంతా కొద్ది గంటల్లోనే చంపబడ్డారు. పట్టుబడగానే ఒక గోడ ముందు నిలబెట్టి తుపాకీతో కాల్చేసే వారు. ఇప్పుడు ఆ గోడ లేదు కాని అదే నమూనాతో గోడని నిర్మించారు. అక్కడ చనిపోయిన వారి స్మారకార్ధం సందర్శకులు కొవ్వొత్తులు పెడతారు. మేము ఆ గోడ దగ్గర నిలబడి కాసేపు శ్రద్ధాంజలి ఘటించాం.
ఈ కాంపు కి ఖైదీల తాకిడి ఎక్కువవటంతో సామర్ధ్యం సరిపోక అస్విత్జ్ - 2 ఆస్విత్జ్ -3 కాంపులని 1942 - 43 ప్రాంతాల్లో నిర్మించారు. కొంచెం బలిష్టంగా ఉన్న యూదులని అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాక్తరీల్లో పని చెయ్యటానికి తీసుకు వెళ్ళేవాళ్ళు. ఒక ఎండిపోయిన బ్రెడ్ మరియు సూప్ ఆహారంగా ఇచ్చి రోజంతా పని చేయించేవాళ్ళు. రెండు మూడు నెలల్లోనే వారు నీరసించి మరణించే వాళ్ళు. ఒకసారి గ్యాస్ కొరత ఏర్పడి జనాలని చంపటానికి ఇబ్బంది ఏర్పడటంతో, కొన్ని వేల మందిని మంచులో నడిపించుకుంటూ కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్ళారు. నడక పూర్తయ్యేలోపు సగం మంది ఆ చలికి దారిలోనే ప్రాణాలు వదిలారు. నడవలేని వారిని నాజీలు ఎక్కడికక్కడ కాల్చి చంపారు. చరిత్రలో దీనిని డెత్ వాక్ గా పిలిచారు. 22 వ బారక్ లో అతిచిన్న డార్క్ రూము చూశాం. ఒక మనిషి నిలబడగల రూం అది. అందులో 4గురు మనుషుల్ని పెట్టేవారు, వారు నిలబడే ఉండాలి గాలి వెలుతురూ లేదు,ఒక రోజులోనే ఆ నలుగురూ శవాలయ్యేవారు. యూదుల రక్తంతో వారి హాహాకారాలతో ఈ నేల ఎంతటి పాపాలకి వేదిక అయ్యిందో తలచుకోగానే కళ్ళ వెంట అప్రయత్నంగానే జల జలా నీళ్ళు కారాయి. నాతో పాటు ఉన్న మార్చిన్ కూడా ఒక్కో చోట నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎందుకంటే 30 లక్షలమంది పోలాండ్ వాసులే ఈ యుద్ధంలో చనిపోయారు. అది కూడా తమ దేశంలో నిర్మించిన ఈ మృత్యు సౌధంలో 12 లక్షలమంది చంపబడ్డారు.10 వ నంబర్ బారక్ వైపు చూపిస్తూ మార్చిన్ చెప్పిన విషయం వింటే కడుపులో దేవినట్లైంది.....

Friday, August 9, 2013

నా ఐరోపా యాత్ర - 6 (పోలాండ్)


యూదులు పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు. క్రీస్తు పూర్వం ఈ మతం ఉంది. వీరి దేవుడు మెసయ్య ఎప్పటికైనా వస్తాడని నమ్ముతారు . వీరి ప్రార్ధనా మందిరాలని సినగోగాస్ అంటారు. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. అక్కడ  ఏసుక్రీస్తును శిలువ చేసి చంపిన తరువాత యూదులు భయకంపితులై ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి చెల్లాచెదురుగా ఐరోపా, అమెరికాలకు వలస పోయి అక్కడ స్థిరపడ్డారు.మరి కొంతమంది అమెరికా కి వెళ్లారు. ఇలా వెళ్ళిన వారంతా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఆ దేశపు పౌరులుగానే ఉండిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ తరపున ఎంతో మంది యూదులు పోరాడారు. మెడల్స్ సంపాదించారు. కాని హిట్లర్ కి ఎందుకో యూదుల వల్లే కుట్ర జరిగి మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని నమ్మాడు. వారి నిర్మూలనే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. మనుషుల్లో ఉండే జెనెటిక్ లక్షణాల ఆధారంగా వారిని వేర్వేరు జాతులుగా పేర్కొన్నాడు. జర్మనీ వాసుల లక్షణాలు ఎలా ఉంటాయో వివరించి వారిని మిగతా జాతుల వారితో కలవకూడదని ఆజ్ఞాపించాడు. తాను 1934 లో అధికారంలోకి రాగానే ఈ యూదు విద్వేష  చర్యల్ని చేపట్టాడు. యూదులని అధమజాతి పౌరులుగా ప్రకటించి వారిని తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు. 1938 లో ఒక యూదు ఈ పరిణామాలకి ఎదురు తిరగటంతో దానికి ప్రతీకారంగా నవంబర్ 9 రాత్రి నాజీ సైన్యం ఒక్కసారిగా యూదులపై విరుచుకు పడింది. 91 మందిని కాల్చి చంపారు. 30000 మందికి ఒకేసారి అరెస్ట్ చేసి concentration camp కి తరలించారు. యూదుల ప్రార్ధనా మందిరాలు తగులబెట్టారు. వారి షాపుల అద్దాలన్నీ పగలగొట్టారు. బెర్లిన్ అంతా గాజుముక్కలతో నిండిపోయింది. అందుకే దీనికి జర్మన్ భాషలో  Crystal Nacht అని పేరు వచ్చింది. అంటే "అద్దాలు పగిలిన రాత్రి".
 
ఇక అక్కడినుండి యూదుల నిర్భందం ప్రారంభమైంది. జైళ్ళు చాలక  concentration camp లు నిర్మించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కాంపుల్లో కుక్కారు. ఇక హిట్లర్ జర్మనీ విస్తరణ దిశగా దృష్టి సారించాడు. పశ్చిమాన  ఉన్న పోలాండ్ ని జర్మనీ తో కలిపేయాలని భావించాడు.అసలు ప్రపంచ పటంలో పోలాండ్ అనే దేశం ఉండరాదు అనేది హిట్లర్ ఆలోచన. అప్పటికి అత్యధికంగా 30 లక్షలమంది యూదులు ఉన్న దేశం పోలాండ్. అయితే పోల్స్ ఈ ప్రతిపాదన కి అంగీకరించలేదు. ఈలోగా రష్యా అధ్యక్షుడు స్టాలిన్ తో హిట్లర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలాండ్ ని తూర్పునుండి రష్యా, పశ్చిమం నుండి జర్మనీ ఆక్రమించుకోవాలని ఆ ఒప్పంద సారాంశం. దీనికి ప్రతిగా రష్యా జర్మన్ ఇతర ఆక్రమిత దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. దీని ప్రకారం సెప్టెంబర్ 1, 1939 న జర్మన్ బాంబర్లు ఎటువంటి హెచ్చరికా లేకుండానే పోలాండ్ ఆర్మీ పై విరుచుకు పడ్డాయి. మొదట్లో తీవ్రంగా ప్రతిఘటించినా జర్మన్ నాజీల ధాటికి తట్టుకోలేక పోలాండ్ లొంగిపోయింది. సెప్టెంబర్ 17 న రష్యా తూర్పునుండి పోలాండ్ ని ఆక్రమించింది. ఈ విధంగా పోలాండ్ దేశం 1945 వరకు అస్తిత్వం లేకుండా ఇరు దేశాల ఆక్రమణలో ఉండిపోయింది. 30 లక్షలమంది యూదులు మరియు ఇతర పోల్స్ లక్షలాది మంది ఈ కాలంలో చంపబడ్డారు. వీళ్ళందరినీ చంపటానికి మొత్తం 48 డెత్ ఫాక్టరీ లు concentration camp ల పేరుతో పోలాండ్ మరియు జర్మనీ లలో నిర్మించారు. అత్యంత పెద్ద డెత్ ఫాక్టరీ పోలాండ్ లో auschwitz అనే ప్రాంతంలో నిర్మించారు. పోలాండ్లో నేను చూసిన తరువాతి ప్రదేశం ఇదే. చాలామంది మిత్రులు అది చూడవద్దని వారించారు. వారెందుకు అలా అన్నారో నాకు అర్ధం కాలేదు. కాని నేను ఈ ప్రదేశం చూశాక ఒక మనిషిగా చలించిపోయాను. చెలియల కట్ట కూడా ఆపలేని అశ్రువులు ధారగా కారుతుంటే అంతకుమించిన ఆవేదన నా మనసుని చిద్రం చేసింది. అసలు ఈ ప్రాంతం చూడకుండా ఉంటే బావుండేది అనిపించింది. ఇప్పటికీ,ఎప్పటికీ  ఆ డెత్ కాంప్ నేను మరువలేని మరణ సౌధం. సాటి మనుషుల్ని చంపటానికి మనుషులే నిర్మించిన ఆ సువిశాల మరణ ప్రాంగణం ఎన్ని రోదనలని భరించిందో, ఎంతమంది పసి వాళ్ళ ప్రాణాలు గ్యాస్ చాంబర్ల ఆకలికి బలై పోయాయో తలుచుకునప్పుడల్లా గుండె చెమ్మగిల్లిపోతుంది. 

Auschwitz అనే ప్రదేశం మేము ఉన్న మింజు జెర్జ్ కి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవంబర్లో వరుసగా వారం రోజులు సెలవు కావటంతో అక్కడి మాతోపాటు పనిచేసే స్థానిక మిత్రుడు మార్చిన్ క్రదోహా ( Marcin Krajdoha) ని అడిగితే తను తీసుకువెళ్తా అని చెప్పాడు. తరువాతి కాలంలో నేను చూసిన అన్ని ప్రదేశాలకి తానే గైడ్ గా వ్యవహరించాడు. మా స్నేహ బంధం ఇప్పటికీ అంతే ఆత్మీయంగా కొనసాగుతోంది.మింజు జేర్జ్ నుండి నవంబర్ న తోటి భారతీయ మిత్రులు ముగ్గురు ఉదయ్ అమ్మణ్ణ , శశి కుమార్, చోటురాం లతో కలిసి మార్చిన్ కారులో బయలుదేరాం. Auschwitz చూసి అక్కడినుంచి పోలాండ్ ఒకప్పటి రాజధాని అయిన క్రాకో పట్టణం మరియు జాకోపానా అనే పర్వతాలు చూడాలి అనేది మా ప్లాన్. పోలాండ్ కి దక్షిణంగా 5 గంటలు ప్రయాణించాక Auschwitz చేరుకున్నాం. దానిని ఇప్పుడు ఆష్విత్జ్ మ్యూజియం గా పిలుస్తున్నారు. మేము వెళ్ళే దారిలో ఉన్న పాడుబడిన రైలు పట్టాలని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు, ఈ పట్టాలమీదుగానే రైలు ఆ డెత్ కాంపులోకి వివిధ దేశాలనుంచి మనుషుల్ని తీసుకు వచ్చేది అని. పార్కింగ్ లో కార్ పార్క్ చేసి రుస్కి ఎంట్రన్స్ అనే గేటు గుండా టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. బయట 50 కి పైగా టూరిస్ట్ బస్సులు ఉన్నాయి. అంతమంది జనాలు అక్కడ ఉన్నా కాని ఆ ప్రాంతం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది.

Friday, August 2, 2013

నా ఐరోపా యాత్ర - 5 (పోలాండ్)

నా ఐరోపా యాత్ర - 5 (పోలాండ్)


నేను ఎంతోమంది గొప్పవాళ్ళ ఆటో బయోగ్రఫీలని చదివాను. జీవితంలో వారి ప్రతి లక్ష్యం వెనుక ఒక ఆశయం కనపడింది. అది వారికైనా మేలు చేసేది,లేక సమాజానికైనా మేలు చేసేదిగా ఉండేది. నాకు అర్ధం కానిది, నాకు ఇప్పటికీ అంతు చిక్కనిది హిట్లర్ జీవితం, అతని ఆశయం. నియంతృత్వంతో ప్రపంచాధిపత్యం సాధించాలనే కోరికతో ఎంతోమంది యుద్ధ పిపాసులు నియంతలుగా అవతరించారు. తన సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని మట్టు బెడుతూ మాత్రమే వారు నియంతృత్వంతో వ్యవహరించారు. కాని ఎవరూ లక్ష్యాన్ని చేరుకోకుండానే మరణించారు. కాని అలాంటి వారికి భిన్నమైన మనస్తత్వం హిట్లర్ ది. తనతో ఏకీభవించని వారిని మాత్రమే కాకుండా, అసలు తనకు ఏమాత్రం సంభంధం లేని యూదులు, జెర్మనీ అభివృద్ధి కి ఆటంకాలుగా ఉన్నారనే అసత్య ఆరోపణలతో, జర్మనీ నుండి యూదుల నిర్మూలనే నా లక్ష్యం అనే నినాదంతో పార్టీని స్థాపించి, ప్రజల మధ్య జాతి విద్వేషాలని రెచ్చగొట్టి తాను అధికారంలోకి వచ్చాక 60 లక్షలమంది యూదులని అత్యంత కిరాతంగా మట్టుబెట్టాడు. చాలామందికి హిట్లర్ అంటే నియంతగా మాత్రమే తెలుసు. కాని తెలియని మరో కోణం ఈ యూదు విద్వేషం, జాత్యహంకారం.

మొదటి ప్రపంచ యుద్ధం 
 
యూరప్ లో ఉన్న సెర్బియా దేశస్థుడు తమ దేశపు వ్యక్తిని హత్య చేయటంతో ఆస్ట్రియా, హంగరీ ఆ దేశంపై యుద్ధం ప్రకటించాయి. ఆ యుద్ధం పెరిగి సెర్బియాకి మద్దతుగా ప్రపంచంలో 28 దేశాలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. వీటిలో ముఖ్యమైనవి అమెరికా,బ్రిటన్ ,ఫ్రాన్స్ . వాటికి ప్రత్యర్ధులుగా జర్మనీ, ఆస్ట్రియా ,హంగరీ, బల్గేరియా అక్షరాజ్యాలుగా అవతరించాయి. ఈ మిత్ర రాజ్యాలు,అక్ష రాజ్యాల మధ్య జరిగిన యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం. 1918 వరకు యుద్ధం జరిగింది. ఎంతో ప్రాణ నష్టం , ధన నష్టం జరిగింది. జర్మనీ ఆర్ధికంగా చితికిపోయింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెయిమర్ రిపబ్లిక్ ప్రభుత్వం యూదులకి స్వేచ్చనిచ్చింది. వారు ఆర్ధికంగా సంక్షోభంలో ఉన్న జర్మనీ ని గాడిలో పెడతారని నమ్మింది. యూదులు మంచి వ్యాపార దక్షత కలవారు. వీరు అంతర్జాతీయ బాంకర్లుగా కూడా పిలవబడ్డారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ యూదు మేధావి. ఈ కాలంలోనే థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆవిష్కరించాడు. జర్మనీకి గర్వకారణం అంటూ వెయిమర్ ప్రభుత్వం ఆయన్ని కీర్తించింది. కాని జర్మనీ కి కాలం కలిసి రాలేదు. యుద్ధంలో ఓడిపోవటంతో గెలిచిన దేశాలు తమకు జరిగిన నష్టానికి పరిహారం కట్టమన్నాయి. దీనిని వేర్సైల్స్ సంధి అంటారు. ఫ్రాన్సు లో ఉన్న వేర్సైల్స్ రాజ ప్రాసాదంలో ఈ ఒడంబడిక జరిగింది. ఈ దెబ్బతో జర్మనీ ఆర్ధికంగా కుదేలయింది.డబ్బు కట్టటం కోసం కరెన్సీ అధికంగా ముద్రించారు. దీని వల్ల దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారింది. ఇక డబ్బు కట్టలేమని జర్మనీ చేతులెత్తేయటంతో ఫ్రాన్సు ఆ దేశపు బొగ్గు పరిశ్రమ ని స్వాధీనం చేసుకుంది. 1929 నాటికి దేశంలో The great Depression మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో జర్మన్స్ కి దేవుడిలా కనపడ్డాడు అడాల్ఫ్ హిట్లర్.
 
                                              అడాల్ఫ్ హిట్లర్ ఏప్రిల్ 20, 1889 న బ్రౌనౌ అం ఇన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా, జర్మనీ దేశ సరిహద్దులలో ఉంది. ఆరుగురు పిల్లలలో హిట్లర్ నాలుగోవవాడు మరియు మూడవ మగ బిడ్డ. హిట్లర్ తండ్రి అలోఇస్ హిట్లర్ (అసలు పేరు శ్చిక్క్ల్ గ్రుబర్) వాణిజ్య శాఖలో గుమాస్తా. హిట్లర్ తల్లి క్లారా పోల్జ్ (1860–1907), అలోఇస్ కు రెండవ మరదలు మరియు మూడవ భార్య. వీరికి కలిగిన ఆరుగురు సంతనంలో హిట్లర్ మరియు అతని చెల్లెలు పౌలా మాత్రమే బతికారు. అలోఇస్ జూనియర్, ఏంజెలా, ఈ ఇద్దరు అలోఇస్ కు రెండవ భార్య వలన కలిగిన సంతానం. అలోఇస్ మొదటి భార్యకు పిల్లలు లేరు. అలోఇస్ హిట్లర్ (హిట్లర్ తండ్రి) ఆక్రమ సంతానం. తన జీవితపు తొలి 39 సంవత్సరాలు అతడు తన తల్లి ఇంటి పేరునే తన ఇంటి పేరుగా చేర్చుకున్నాడు. 1876 లో జనాభా లెక్కల ప్రకారం ఒక గుమస్తా ఇతని సవతి తండ్రి 'జోహాన్న్ గెఒర్గ్ హైడ్లార్' ను అలోఇస్ తండ్రిగా పేర్కొన్నాడు. ఆ పేరు రకరకాలుగా పిలవబడి చివరకు 'హిట్లర్' గా స్థిరపడింది. పురాతన జర్మన్ భాషలో 'హిట్లర్' అంటే గుడిశె లో నివసించే వాడని అర్థం. యుక్త వయసు వచ్చేనాటికి సరిహద్దు అధికారుల కళ్లుగప్పి జర్మనీ లోకి ప్రవేశించాడు. హిట్లర్ గొప్ప చిత్రకారుడు,కొన్నాళ్ళు  రోడ్డు మీద రక రకాల ;బొమ్మలు వేసి పొట్ట పోసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యం లో చేరాడు. యుద్ధ మెళకువల్ని రాజకీయాలని అక్కడే వంటబట్టిన్చుకున్నాడు. 1918 లో జర్మనీ యుద్ధంలో ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక పోయాడు.ఆ ఓటమికి యూదులే కారణం అని వారి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు.1920 లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలో చేరి దానికి నాయకుడయ్యాడు. దాని పేరుని నేషనల్ సోషలిస్ట్ పార్టీ గా మార్చాడు.దీనినే క్లుప్తంగా నాజీ పార్టీ అన్నారు.దీనికి పనిచేసిన సైన్యం నాజీలుగా పిలవబడ్డారు.  పార్టీ గుర్తుగా స్వస్తిక్ ని హిట్లర్ రూపొందించాడు.పార్టీ అన్నీ తానై వ్యవహరించాడు.జర్మన్స్ అంటే ఆర్య జాతికి చెందిన వారని, వారికి మాత్రమె ప్రపంచాన్ని ఏలగల సత్తా ఉందని ప్రజలలో ప్రచారం చేశాడు.జర్మన్స్  మాత్రమే జర్మనీ లో ఉండాలని పిలుపునిచ్చాడు. 1923 లో అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని కవాతు చేయించాడు. ఇది ఒక బీర్ హాల్ దగ్గర జరగటంతో చరిత్ర లో ఇది బీర్ హాల్ పుష్ గా పిలిచారు.
 
ఇందుకుగాను అప్పటి ప్రభుత్వం హిట్లర్ ని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఆ సమయాన్ని హిట్లర్ వృధా చేసుకోలేదు. ది మెయిన్ కాంఫ్ అనే పుస్తకాన్ని రాసాడు. జర్మనీ ఎలా ఉండాలో తాను ఎలాంటి జర్మనీ ని చూడాలనుకుంటున్నాడో అందులో రాసాడు. జర్మనీ వాసులు ఆర్యజాతి అని మిగతా వాళ్ళంతా సెమిటిక్ జాతులు గా వర్ణించాడు. ఆర్యులు మాత్రమే గొప్పజాతిగా ఉండాలని,ప్రపంచాన్ని ఏలాలని ఉద్బొదించాడు. ఆ పుస్తకం 1925 నాటికి  240000 కాపీలు అమ్ముడు పోయింది.యుద్ధం ముగిసే నాటికి 10 లక్షల కాపీలు అమ్ముడు పోయిందని ఒక అంచనా.1924 లో జైలు నుండి విడుదలయ్యాక నాజీ పార్టీని మరింత బలోపేతం చెయ్యటం మొదలు పెట్టాడు. 1929 మొదలైన సంక్షోభం 1933 నాటికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సమయంలో హిట్లర్ ఆవేశ పూరిత ప్రసంగాలు జర్మనీ ప్రజలని ఆకట్టుకున్నాయి. యూదులు లేని జర్మనీ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని నాజీల చేత చేయించిన ప్రతిజ్ఞలు జర్మనీ వాసుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. హిట్లర్ జర్మనీ రక్షకుడుగా వారికి కనిపించాడు. 1933 ఎన్నికలలో మెజారిటీ కూడగట్టుకున్న హిట్లర్,1934 నాటికి దేశాధ్యక్షుడు హిండెన్ బర్గ్ మరణించటంతో పూర్తి స్థాయి జర్మనీ అధ్యక్షుడుగా అవతరించాడు.ఇక అక్కడ్నుంచే యూదులకి, జర్మనేతర జాతులకి కష్టాలు మొదలయ్యాయి. యూదుల వ్యాపారాల్ని నిషేదించారు. వారు నగరాల మధ్యలో ఉండకూడదని ఆంక్షలు విధించారు. అసలు ఈ యూదులంటే ఎవరు? ఎందుకు జర్మనీలో ఉన్నారు ? హిట్లర్ కి వాళ్ళంటే ఎందుకు అంత కోపం? 
 
Date : 30.07.2013

Thursday, July 25, 2013

నా ఐరోపా యాత్ర - 4 (పోలాండ్)





మింజు జేర్జ్ లో ఇంటి అద్దెలు తక్కువే, మన డబ్బుల్లో 25000 పెడితే రెండుగదుల విలాసవంతమైన ఫ్లాట్ దొరుకుతుంది. నాకు మా సంస్థే అన్ని ఏర్పాట్లు చెయ్యటం వల్ల ఆ ఖర్చు లేదు. TESCO అనేది ఇక్కడ అతిపెద్ద హైపర్ మార్కెట్. బ్రిటన్ కి చెందిన ఈ గొలుసుకట్టు చిల్లర వాణిజ్య సంస్థ మన దేశంలో FDI ల పుణ్యమా అని త్వరలో భారత దేశంలో  అన్ని ప్రాంతాల్లో తమ స్టోర్ లని తెరవనుంది. దీనితోపాటు పోలాండ్ దేశానికే చెందిన పలు సూపర్ మార్కెట్లు కూడా మింజు జేర్జ్ లో ఉన్నాయి. మన రాష్ట్రంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగే ఇక్కడి ప్రభుత్వం కూడా ఒక మాదిరి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామిక వాడలని కేటాయించింది. అందులో మింజు జేర్జ్ కూడా ఒకటి. స్థానికులకి ఉపాధి కల్పనే వీటి వెనుక ధ్యేయం. దీనివల్ల సిటీలకి వలసలు తగ్గుతాయి. ఉన్న ఊర్లోనే ఉద్యోగం ఉండటంతో స్థానికులకి మంచి జీవితం. గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీల నిర్వహణ వ్యయం కూడా తక్కువే. జర్మనీ కి దగ్గరగా ఉండటం ఈ ప్రాంతానికి బాగా కలిసి వచ్చిన అంశం. యూరప్ లో ఉద్యోగులు చాలా ఖరీదు. వ్యాపారాల్లో చిన్న చిన్న పనులకి మనుషుల్ని నియమిస్తే వారి జీతం కూడా రాదు. అందుకే చాలా వరకు వెండింగ్ మిషన్లే కనిపిస్తాయి.ఇక్కడి ప్రజలు కాఫీ ప్రియులు, ఏ దుకాణానికి గాని షాపింగ్ మాల్ కి వెళ్ళినా కాఫీ వాసన ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఇక్కడి పెట్రోల్ బంకుల్లో ఎవరికి వారే పెట్రోల్ నింపుకోవాలి. తర్వాత అక్కడ ఉన్న కౌంటర్ కి వెళ్లి నగదు చెల్లించాలి. పెట్రోల్ బంకుల్లో పెద్ద పెద్ద క్యూ లు ఏమీ ఉండవు కాబట్టి ఈ ప్రక్రియ బాగానే ఉంది.మోసాలు, దొంగతనాలు అనేవి వారికి తెలియని పదాలు. ఇక్కడ ఉన్న పెట్రోల్ బంకుల్లో  సూపర్ మార్కెట్, కాఫీ షాప్, వాష్ రూమ్స్ తప్పని సరిగా ఉంటాయి. పోలాండ్ లో ప్రతి ఇంటికి ఒక పెంపుడు జంతువు తప్పనిసరిగా ఉంటుంది. సహజీవనం చేసే జంటలు ఎక్కువే, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనేవారు ఉన్నారు. కాని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ బంధానికి విలువ ఇస్తారు. చాలామంది సహజీవనం చేసేటపుడే విడిపోతారు కాబట్టి పెళ్లి అయ్యాక విడాకులు అనేవి పెద్దగా ఉండవు. మన దేశంలో ఉన్న అరేంజ్డ్ మారేజ్ విధానం వీరికొక పెద్ద వింత. అమ్మాయిని అసలు పరిచయం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది వీరికొక పెద్ద పజిల్. నేను మొట్ట మొదటగా పోలాండ్ లో సందర్శించిన ప్రదేశం బంకర్స్.

మింజు జేర్జ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో బెర్లిన్ వెళ్ళే దారిలో ఈ బంకర్స్ ఉన్నాయి. తోటి భారతీయ మిత్రులు మరియు అక్కడి స్థానిక మిత్రుడితో కలిసి అవి చూడటానికి వెళ్ళాం. మొట్ట మొదటిసారి రెండవ ప్రపంచ యుద్ధం గురించి, హిట్లర్ గురించి విన్నది అక్కడే. జ్యూయిష్ అనే ఒక మతం ఉందని, వారినే యూదులు అంటారని అప్పుడే తెలిసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో పోలాండ్ పశ్చిమ భాగాన్ని రష్యా, తూర్పు భాగాన్ని జర్మనీ ఆక్రమించుకున్నాయి. రష్యా సైన్యం జర్మనీ ని ఆక్రమించాలంటే ఈ దారి గుండానే వెళ్ళాలి. వారిని నియంత్రించటం కోసం సరిహద్దులో భూమిలో 300 అడుగుల లోతున ఈ బంకర్ ని నిర్మించారు. దీని మొత్తం పొడవు 32 కిలోమీటర్లు. కాని కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే సందర్శనీయ ప్రాంతంగా ఉంది. అక్కడ ఇంగ్లీష్ గైడ్ కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. స్థానిక మిత్రుడు ముందుగానే ఏర్పాట్లు చెయ్యటంతో అప్పటికే మాకోసం ఎదురు చూస్తున్న గైడ్ సహాయంతో బంకర్ లోపలకి వెళ్ళాం. అతి ఇరుకైన తలుపు గుండా కిందకి 300 మీటర్లు మెట్లు దిగాక పొడవాటి వీధులు ఉన్న నిర్మాణంలోకి ప్రవేశించాం. లోపల ఉష్ణోగ్రత - 5 డిగ్రీలు. లోపల సైనికులు ప్రయాణించటానికి చిన్న ట్రైన్ కూడా ఉంది.అప్పుడు నాజీ సైనికులు వాడిన టూత్ పేస్టు, బూట్లు,టెలిఫోను, రేడియో ఇప్పటికీ అలాగే ఉంచారు.

అసలు అది 1940 లో కట్టిన నిర్మాణం అనిపించలా, పటిష్టమైన గోడలు, ఎక్కడా చెక్కు చెదరని ఈ నిర్మాణాన్ని ఒక క్రమ పద్దతి లో ప్రణాళికా బద్ధంగా నిర్మించారు. హిట్లర్ యుద్ధాన్ని ఒక పరిశ్రమ లాగే భావించాడు. దానికి తగ్గట్టే యుద్ధానికి అవసరమైనవి అన్నీ శాశ్వత ప్రాతిపదికనే నిర్మించాడు. అత్యాధునిక యుద్ధ సామాగ్రిని ఆ రోజుల్లోనే సమకూర్చుకున్నాడు. యుద్ధం కోసం రోడ్లు వేసారు, మనుషుల్ని చంపటానికి కాన్ సన్ ట్రేషన్ కాంపుల పేరుతో మృత్యు కుహరాలని నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక కాని రష్యన్ రెడ్ ఆర్మీ ఈ బంకర్ని చేరుకోలేదు. ఇందులో ఏమైనా సంపద దాచారేమో అని అక్కడక్కడా రెడ్ ఆర్మీ దీనిని ధ్వంసం చేసింది. అందుకే లోపల గోడలకి అక్కడక్కడా రంద్రాలు, బులెట్ గుర్తులు ఉన్నాయి. ఈ బంకర్ ఉన్నంత మేరా భూమి పైన డ్రాగన్ వే ఉంటుంది. యుద్ధ టాంకర్లు ఈ సరిహద్దుని దాటకుండా కొంత ఎత్తులో సిమెంట్ దిమ్మలు నిర్మించారు.

రష్యా సైన్యం ఈ దారిని వినియోగించకపోవటంతో ఈ బంకర్ నిర్మించిన ఉద్దేశం సఫలీకృతం కాలేదు. దీని నిర్మాణం జరుగుతున్నపుడు హిట్లర్ ఇక్కడికి వచ్చాడని గైడ్ చెప్పాడు. ఈ బంకర్ లో కొన్నాళ్ళు నాజీ సైనికుల కాంప్ ఉండేది. యుద్ధం ముగిసి జర్మనీ ఓడిపోయాక ఇందులో ఉన్న సైనికులంతా చెల్లా చెదురుగా పారిపోయారు. పోలాండ్ లో జర్మనీ ఆక్రమిత భాగాన్ని కూడా రష్యా ఆక్రమించుకుంది. 1989 లో కమ్యూనిస్టు పాలన అంతమై సోవియట్ యూనియన్ ముక్కలయ్యేవరకు పోలాండ్ దేశం రష్యా ఆధీనంలోనే ఉంది. ఇవన్నీ విషయాలు గైడ్ చెప్తుంటే తలపంకించి వింటూ ఉండిపోయాను. నా అసలు అన్వేషణ అప్పుడే మొదలైంది. అసలు యుద్ధం ఎందుకొచ్చింది? ఈ హిట్లర్ ఎవరు ? యూదుల్ని ఎందుకు అంత క్రూరంగా చంపాడు ? నాజీలంటే ఎవరు ? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కొంత హిట్లర్ గురించి పరిచయం అవసరం. అసలు సిసలు జాత్యహంకారానికి ప్రతిరూపం హిట్లర్, మానవత్వం లేకుండా సాటి మనుషుల్ని డెత్ ఫాక్టరీల్లొ అమానుషంగా చంపిన నాజీల కధ తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. 
Dated : 18.07.2013

Saturday, June 29, 2013

నా ఐరోపా యాత్ర - 3 (పోలాండ్)




నా ఐరోపా యాత్ర - 3 (పోలాండ్)

నేను ఒక్కడినే కావటంతో అదే సంస్థ లో పనిచేస్తున్న శశి అనే ఒక తమిళియన్ ఫ్లాట్ లో నాకు వసతి ఏర్పాటు చేసారు. టాక్సీ డ్రైవర్ సామాను తీసుకుని 4 వ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ కి తీసికెళ్ళాడు. ఇక్కడ అయిదు ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్ల కి కూడా లిఫ్ట్ లేదు. మెట్ల ద్వారానే బ్యాగ్ మోసుకుంటూ పైకి వెళ్లాను. ఈ శశి అనే వ్యక్తి కూడా ముద్రణా రంగంలో పట్టబద్రుడు. పరస్పర మిత్రుల ద్వారా అంతకుముందే ఫోన్ లో పరిచయం చేసుకోవటంతో మేము ఒకరికొకరం తెలుసు. ఆతను నాకంటే 6 నెలలు ముందు నుండే అక్కడ ఉంటున్నాడు. మేము కాకుండా మరో పదిమంది వరకు భారతీయులు అక్కడ అదే సంస్థలో పని చేస్తున్నారు. తెలుగువాడిని మాత్రం నేనొక్కడినే.

మేము నివసించిన అపార్ట్మెంట్స్ 
మింజు జెర్జ్ అనేది 20000 జనాభా గల ఒక చిన్న పట్టణం. మింజు జేర్జ్ అంటే పోలిష్ భాషలో రెండు నదుల మధ్య ఉండే ప్రాంతం అని అర్ధం. ఓబ్రా మరియు పాక్లిసా అనే రెండు నదులు పట్టణానికి ఇరువైపులా ప్రవహిస్తుంటాయి. ఇది పోలాండ్ కి పశ్చిమ భాగాన ఉంది. ఇక్కడినుండి జర్మనీ రాజధాని బెర్లిన్ 150 కిలోమీటర్లు మాత్రమే. 80 కిలోమీటర్ల లోనే జర్మనీ బోర్డర్ ఉంటుంది. పోలాండ్ రాజధాని వార్సా కి మాత్రం 500 కిలోమీటర్లు దూరం. అందుకే ఇక్కడి ప్రజలు బెర్లిన్ ఎయిర్ పోర్ట్ నే ఎక్కువ వినియోగిస్తుంటారు. నేను ఫ్లాట్ కి చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది. అప్పటికి ఇంకా సూర్యాస్తమయం కాలేదు. ముందుగా చెప్పుకునట్లు వేసవి కాలంలో రాత్రి 10 గంటల వరకు సూర్యుడు ఉంటాడు. అదే చలికాలంలో అయితే మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. నేను వెళ్ళింది శుక్రవారం కావటంతో మరుసటి రెండు రోజులు సెలవు దినాలు. నేను వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ఇండియన్ మిత్రులు అందరూ ఆ రెండు రోజుల్లో కలిశారు. చిన్న చిన్న పోలిష్ పదాలు కొన్ని నేర్చుకున్నాను. (హాయ్ చెప్పాలంటే చేష్, థాంక్యూ అంటే జిన్కుయా, గుడ్ మార్నింగ్ అంటే జిందాబ్రే, ) పోలిష్ భాష చాలా కష్టమైనది. ఆ  పదాలని పలకటం చాలా కష్టం. కొంచెం ఓపిక, శ్రమ పడితే తప్పకుండా నేర్చుకోవచ్చు. మింజు జెర్జ్ అన్నీ సౌకర్యాలు గల మినీ పట్టణం. స్థానిక సంస్థలు ఎంత సమర్ధవంతంగా పని చేస్తాయో ఇక్కడి పాలక వ్యవస్థ చూశాక అర్ధం అయ్యింది. మనం ఉండే నివాస ప్రాంతం వివరాలు వారంలోపుగా ఆయా మున్సిపాలిటీ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఊరుకి ఒక టౌన్ హాల్, మరియు స్క్వేర్ (కూడలి) తప్పనిసరిగా ఉంటాయి. అభివృద్ధి అంతా స్థానిక మేయర్లు ,ప్రజా ప్రతినిధుల చొరవతోనే జరుగుతుంది. పట్టణ మేయర్ ఒక సామాన్య వ్యక్తిలాగే నివసిస్తుంటాడు. ఎటువంటి హంగులు,ఆర్భాటాలు ఉండవు.

మింజు జెర్జ్ టౌన్ హాల్
ఇక్కడి ఆహరం బ్రెడ్ మరియు మాంసం. చికెన్ మరియు పోర్క్ ఎక్కువగా తింటారు. బర్గర్, పిజ్జా లు కూడా ఎక్కువే. మన వాళ్ళు ఇతరదేశాలకి వెళ్ళినపుడు ఆ రేట్లు అన్నీమన రూపాయల్లోకి లెక్కవేసుకుని చూసుకోవటం చాలామందికి అలవాటు. పోలాండ్ కరెన్సీ పేరు PLN . పోలిష్ భాషలో జిలోటి అంటారు. ఒక జిలోటి కి మన డబ్బులు 17 రూపాయలు వస్తాయి. యూరప్ దేశాలన్నీ ఒక్కటి అయినా, కరెన్సీ విషయంలో మాత్రం ఇంకా ఒక్కటి కాలేదు. యూరో చలామణీ లో ఉన్న దేశాల ఆర్ధిక వ్యవస్థలని చూశాక మిగతా దేశాల ప్రజలు యూరో విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. పోలాండ్ ప్రభుత్వం కూడా 2014 నాటికల్లా యూరోని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నా, ప్రజల నుండి ప్రతికూలత ఎదురవుతోంది. ఒకరకంగా ఐరోపా సమితి బలవంతంగా యూరోని అన్ని దేశాలమీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఏకీకృత నగదు విధానం మంచిదే అయినా,దానిని ప్రవేశ పెట్టటంలో మాత్రం పాటించిన విధానాలు, కొన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలని పతనం చేశాయి. దానికి పెద్ద ఉదాహరణ గ్రీసు దేశం. యూరోని వాళ్ళ స్థానిక కరెన్సీకి సమాన విలువతో ప్రవేశ పెట్టటంలో విఫలం అవ్వటం వల్ల అక్కడి ప్రజల సంపద సగానికి సగం తరిగిపోయింది. వస్తువుల ధరలు, ఆహార పదార్ధాల ధరలు యూరోకి మారాక, ఇంతకుముందు కరెన్సీ ధరతో పోల్చుకుంటే రెట్టింపు అయ్యాయి. నేను చూసిన యూరప్ దేశాల్లో అత్యంత చవకైన దేశం పోలాండ్ మాత్రమే. అన్ని వస్తువుల ధరలు, ఆహార పదార్ధాల ధరలు మన రూపాయల్లో పోల్చి చూసుకుంటే దాదాపు ఒక్కటే. ఇక్కడి సూపర్ మార్కెట్లలో బియ్యం దొరుకుతాయి. కూరగాయలు మాత్రం పరిమితం. బంగాళా దుంపలు, టమోటాలు మనకంటే చవుక. ఏదైనా మన మసాలాలు, కూరగాయలు కావాలంటే వార్సాలో ఉన్న లిటిల్ ఇండియా అనే స్టోర్ నుండి తెచ్చుకోవాలి. మరో విశేషం ఏమిటంటే ఈ స్టోర్ నడుపుతోంది గన్నవరానికి చెందిన తెలుగువాడు కాట్రగడ్డ చందు. ఉన్నత విద్య కోసం 2007 లో పోలాండ్ వచ్చిన చందు ఇక్కడి స్థానిక యువతిని వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. ఏదైనా కూరగాయలు, ఇండియన్ మసాలా లు కావాలంటే ఫోన్ చేసి చెప్తే చాలు మరుసటి రోజుకల్లా కొరియర్ లో వచ్చేస్తాయి. మన వాళ్ళంతా వేరే దేశాలకి వెళ్ళినపుడు కూడా మన ఆహరం కోసం వెతుకుతుంటారు. స్విట్జెర్లాండ్ వెళ్లి కూడా ఇడ్లీ,దోశ కోసం వెతకటంలో అర్ధం లేదనేది నా అభిప్రాయం. ఏ దేశపు ఆహారపు అలవాట్లైనా అక్కడి స్థానిక వాతావరణ పరిస్థితులు, అక్కడ నివసించే వాళ్ళ శరీరానికి అనుకూలంగా ఉండేటట్లు ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రాంతానికి వెళ్ళినపుడు అక్కడి ఆహరం తీసుకుంటేనే మన శరీరం ఆ వాతావరణానికి తగినట్లుగా అలవాటు అవుతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ దొరికే ఆహారాన్ని తినటానికే ఆసక్తి చూపిస్తుంటాను.
Continued...



Monday, June 24, 2013

నా ఐరోపా యాత్ర - 2


ఖతర్ నుండి వేరే విమానంలో ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళాలి. ఆ ఫ్లైట్ కి ఇంకా మూడుగంటల సమయం ఉంది. ఖతర్ విమానాశ్రయం చాలా పెద్దది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకి ఇక్కడినుండి విమానాలు ఉన్నాయి. ఆసియా దేశాలనుండి అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకి  వెళ్ళే ప్రయాణీకులకి ఇది జంక్షన్. ఇక్కడే ఎక్కువ మంది ఫ్లైట్ మారాల్సి ఉంటుంది. ఖతర్ కరెన్సీ పేరు రియాల్. ఒక్క రియాల్ కి మన డబ్బుల్లో 16 రూపాయలు వస్తాయి. మనం మారే ఫ్లైట్ కి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉంటె ఎయిర్ పోర్ట్ లోనే వీసా తీసుకుని బయటకి వెళ్లి చూసి రావచ్చు. గల్ఫ్ దేశాల్లో ఫోన్ చార్జీలు చాలా ఎక్కువ. 30 రియాల్స్ తో ఒక ఫోన్ కార్డ్ తీసుకుంటే పబ్లిక్ ఫోన్ నుండి 16 నిమిషాలు ఇండియాకి మాట్లాడవచ్చు. అమెరికా డాలర్ కి పోటీగా యూరో ని ప్రవేశపెట్టాక, అన్ని చోట్ల యూరో కూడా కామన్ కరెన్సీగా వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు కరెన్సీ లు చెల్లుబాటు అవుతాయి. దారి ఖర్చులకోసమని యూరోలు హైదరాబాదులోనే మార్చుకుని ఉండటంతో 8 యూరోలు చెల్లించి ఒక కాలింగ్ కార్డ్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి క్షేమంగా ఖతర్ వరకు చేరుకున్నట్లు చెప్పి,కాఫెటేరియా లో కాఫీ తాగాక, మూడుగంటల నిరీక్షణ తరువాత ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళే విమానం ఎక్కాను. ఖతర్ నుండి ఫ్రాంక్ ఫర్ట్ 6 గంటల ప్రయాణం. హైదరాబాదు నుండి వచ్చిన విమానం కంటే ఇది చాలా పెద్దది. ముదురు ఎరుపు రంగు ఏకరూప దుస్తులు, అదే రంగు టోపీ ధరించిన అమ్మాయిలు చక చకా తిరుగుతూ ఎవరికి ఏమి కావాలో ఆర్డర్ తీసుకుంటున్నారు.
ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన లంచ్ మెనూ చూసి నాన్ వెజ్ ఆర్డర్ చేసాను. కాసేపటికి ఫ్లైట్ అంతా సాల్మన్ చేప మరియు చికెన్ వాసనతో నిండిపోయింది. 4 గంటల తర్వాత వాతావరణంలో మార్పు మొదలైంది. ఎండలతో భగ భగ లాడే మధ్య ప్రాచ్యం నుండి శీతల దేశాలైన ఐరోపా ఖండానికి దగ్గరలో విమానం ప్రయాణిస్తోంది. జర్మనీ లో ఉన్న ఒకానొక పెద్దనగరం ఫ్రాంక్ ఫర్ట్. నేను ఫ్రాంక్ ఫర్ట్ లో విమానం దిగి  అక్కడినుండి పోలాండ్ దేశీయ విమాన సంస్థ అయిన లాట్ పోలిష్ ఎయిర్వేస్ విమానంలో పోలాండ్ లో ఉన్న పోజ్ నాన్ అనే పట్టణానికి చేరుకోవాలి.కొంత సేపటికి విమానం ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో లాండ్ అయ్యింది.ఇమ్మిగ్రేషన్ మరియు వీసా పరిశీలన పూర్తి చేసుకుని, ఫ్రాంక్ ఫర్ట్ లోఎక్కువ నిరీక్షించే సమయం లేకపోవటంతో నేరుగా దేశీయ విమానాలు ఎక్కే టెర్మినల్ కి చేరుకొని అక్కడున్న కౌంటర్ లో బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం ఎక్కాను. ఈ విమానం ఎంత చిన్నదంటే మన వోల్వో బస్సు లానే ఉంది. అంతా కలిపినా 50 మంది కూడా లేరు ఫ్లైట్ లో. చాలా పాత విమానం కావటంతో ఇంజిన్ మోత కర్ణ కఠోరంగా అనిపించింది.అక్కడినుండి పోజ్ నాన్ గంట ప్రయాణం .పోలాండ్ రాజధాని వార్సా. పోజ్నాన్ అనేది వార్సాకి 500 కిమీ దూరంలో ఉన్న చిన్న పట్టణం. అచ్చం మన విజయవాడ అంత ఉంటుందేమో. పోజ్నాన్ ఎయిర్ పోర్ట్ మరీ చిన్నదేమీ కాదు. అక్కడినుండి ఐరోపాలోని అన్ని దేశాలకి విమానాలు ఉన్నాయి. చౌక విమానాలన్నీ ఇలాంటి ఎయిర్ పోర్ట్ ల ద్వారానే రాకపోకలు సాగిస్తాయి. తరువాత కాలంలో ఈ ఎయిర్ పోర్ట్ నుండే పలు దేశాలకి ప్రయాణించాను.
పోజ్ నాన్ విమానాశ్రయం
అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకి పోజ్నాన్ విమానాశ్రయంలో విమానం లాండ్ అయ్యింది. మనకంటే పోలాండ్ కాలమానం మూడున్నర గంటలు వెనుక. అంటే మన దేశంలో సమయం అప్పుడు రాత్రి 9 30 నిమిషాలు. నా ఇమ్మిగ్రేషన్ చెక్ ఫ్రాంక్ ఫర్ట్ లోనే అయిపొవటంతో ఇక్కడ ఎటువంటి చెకింగ్ లేకుండా నేరుగా బయటకి వచ్చేశాను. యూరప్ లో ఉన్న 24 దేశాల్లో ఏ దేశంలో అయితే ముందుగా అడుగు పెడతామో అక్కడే మన పాస్ పోర్ట్ చెకింగ్ అయిపోతుంది.24 దేశాల్లో ఎక్కడా చెకింగ్ ఉండదు.(దీని గురించి తరువాత భాగాలలో వివరిస్తాను) బయటకి రాగానే నాకోసం వచ్చిన టాక్సీ డ్రైవర్ నా పేరుతో ఉన్న బోర్డ్ పట్టుకుని ఉన్నాడు.నేను వెళ్ళాల్సింది అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మింజు జెర్జ్ అనే చిన్న పట్టణం. నేను వెళ్ళింది మే నెలలో అయినా ఇంకా అక్కడ చలి తగ్గలేదు. ఆ రోజు ఉష్ణోగ్రత 5 డిగ్రీలు ఉంది.కార్లో హీటర్ ఉండటంతో పెద్దగా చలి తెలియలేదు. రోడ్లన్నీ ఎంత అందంగా ఉన్నాయంటే,అద్దం లా వాడుకుని తలదువ్వుకోవచ్చు అనిపించింది. ఎటు చూసినా పచ్చటి నేల. పోలాండ్ లో ఉన్న ప్రకృతి రమణీయత మాత్రం నేను పర్యటించిన మిగతా దేశాల్లో ఎక్కడా చూడలేదు.వీళ్ళకి వ్యవసాయం అనేది కేవలం మే నుండి సెప్టెంబర్ లోపు మాత్రమే. మిగతా నెలలన్నీ మంచుతోనే కప్పబడి ఉండి వ్యవసాయం అనుకూలంగా ఉండదు. మనలాగా ప్రతి ఎకరా రెండు ఎకరాలకి గట్లు ఉండవు. వందలాది ఎకరాలని ఒకే ప్రాంతంగా సాగు చేస్తారు. మన సినిమాల పుణ్యమా అని యూరప్ అందాల్ని వెండితెర మీద చూసినా, ప్రత్యక్షంగా మొదటిసారి చూస్తునపుడు ఆ అనుభవమే వేరు. డ్రైవర్ ని మాట్లాడించే ప్రయత్నం చేశాను,ఇంకా ఎంత దూరం అని. అతనికి ఇంగ్లీష్ అర్ధం కాకపోవటంతో నా ప్రశ్న కి జవాబు రాలేదు. పోలాండ్ లో ప్రజలు మాట్లాడే భాష పోలిష్. రాయటంలో ఇంగ్లీష్ కి దగ్గరగానే ఉన్నా, మాట్లాడటంలో మాత్రం ఇంగ్లీష్ కి భిన్నంగానే ఉంటుంది. యూరప్ లో అన్ని దేశాలలో స్థానిక భాషలదే హవా. కంప్యూటర్లు, సైన్ బోర్డులు, ప్రభుత్వ ప్రకటనలు అన్నీ స్థానిక భాషల్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ మాట్లాడేవారు చాలా అరుదు. సిటీల్లో కొంచెం పరవాలేదు కాని ఒకమాదిరి పట్టణాల్లో అయితే చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలు కూడా ఇక్కడి వాళ్ళకి తెలియవు. ఈ భాష కష్టాలు నా తరువాతి అనుభవాల్లో వస్తాయి.గంటన్నర ప్రయాణించాక మింజు జేర్జ్ చేరుకున్నాం. యూరప్ లో రాత్రి 10 గంటలకి కాని సూర్యాస్తమయం ఉండదు. ఇండిపెండెంట్ ఇళ్ళు అన్నీ విసిరేసినట్లు అక్కడొకటి, అక్కడొకటి ఉన్నా అపార్ట్మెంట్లు మాత్రం ఒకే చోట పది, పదిహేను ఉన్నాయి.అలాంటి ఓ అపార్ట్మెంట్ల సమూహం ముందు టాక్సీ ఆగింది. 
Continued...
Dated : 23.06.2013

Friday, June 14, 2013

నా ఐరోపా యాత్ర - I


జీవితంలో కొన్ని అనుకోని అవకాశాలు మన జీవన గమనాన్నే మార్చేస్తాయి. సంవత్సరానికి కేవలం 2830 రూపాయలు ఫీజు కట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న ప్రింటింగ్ టెక్నాలజీ చదువు నన్ను ఈ ప్రపంచంలో 12 దేశాల్లో పర్యటించటానికి దోహదం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. చదువు పూర్తీ చేసుకున్న ఏడాది లోనే దుబాయ్ వెళ్ళే అవకాశం రావటం జీవితంలో పెద్ద మలుపు. నా ఆలోచనల పరిధి అమాంతంగా పెరిగిపోవటానికి ఆ అవకాశం మరియు అక్కడ పనిచేసిన రెండు సంవత్సరాల కాలం ఎంతో ఉపయోగపడింది.బయటనిలబడి చూస్తుంటే భారతదేశం అప్పటిదాకా తెలియని కొన్ని కొత్త అంశాలని తెలుసుకునేలా చేసింది. విభిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, మన దేశంలోనే నాకు తెలియని ఎన్నో విశేషాలు అక్కడే తెలిసాయి. మధ్య ప్రాచ్యం లో ఉన్న రాచరికం,చమురుతో సుసంపన్నం అయిన ఆ దేశాలు అతిత్వరగా అభివృద్ధి చెందటానికి గల కారణాలని అధ్యయనం చేసే వీలు చిక్కింది.తరువాత హైదరాబాదులోనే ఉద్యోగం రావటంతో ఇండియాకి తిరిగివచ్చి ఉద్యోగం చేస్తూనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఇంజినీరింగ్ పూర్తీ చేశాను.పనిచేస్తున్న సంస్థలో సంతృప్తిగానే సాగుతుండటంతో ఇక వేరే చోటకి వెళ్ళాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. పోలాండ్ లో మేనేజర్ గా అవకాశం ఉంది, మీకు ఆసక్తి ఉందా ? అంటూ ముంబై నుండి వచ్చిన ఫోన్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. కాని నేను మొదట చెప్పిన సమాధానం నాకు ఆసక్తి లేదు అని. అసలు పోలాండ్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. మళ్లీ రెండోసారి కాల్ చేసి మంచి ఆఫర్ అని చెప్పటంతో సరే చూద్దాం అని ఇంటర్వ్యూ కి వెళ్ళటం వెంటనే సెలెక్ట్ అవటం జరిగిపోయాయి. పోలాండ్ యూరోపియన్ యూనియన్ లో భాగం కావటంతో నేను అక్కడి పనిచేసిన కాలంలో జర్మనీ, స్వీడన్, ఇటలీ, లిచ్టేన్ స్టెయిన్, ఆస్ట్రియా, స్విట్జెర్లాండ్, ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించటం జరిగింది. అక్కడి సామాజిక, రాజకీయ,చారిత్రక అంశాలమీద లోతుగా అధ్యయనం చేసే అవకాశం దక్కింది. హిట్లర్ అంటే చిరంజీవి నటించిన ఒక సినిమాగా మాత్రమే తెలిసిన నాకు అసలు ఆ పదం ఈ యుగంలోనే స్మరించరానిది అని అర్ధం అయ్యింది. ఇప్పటి తరానికి అవగాహన లేక హిట్లర్ ని ఒక హీరోగా, అతను చెప్పిన మాటలని వేదవాక్కులుగా  సామాజిక సంభందాల వెబ్ సైట్ లలో పోస్ట్ చెయ్యటం చూశాక, నేను నా అనుభవాలు రాయటం అవసరం అనిపించింది. అసలు హిట్లర్ ఏం చేశాడు? నియంతకి ప్రత్యామ్నాయ పదం హిట్లర్ మాత్రమేనా? 2 కోట్ల మంది ని ఊచకోత కోసిన నరరూప రాక్షసుడు ఈ తరానికి హీరోనా? యుద్ధాన్ని ఒక దైనందిన కార్యక్రమంలా చేస్తూ, మనుషుల్ని చంపటానికి డెత్ ఫ్యాక్టరీలు పెట్టి, రోజువారి టార్గెట్ లతో ఒక్కొక్క ఫాక్టరీలో మిలియన్లమందిని గ్యాస్ చాంబర్లలో హతమార్చిన నాజీల నాయకుడు ఈ తరానికి ఆదర్శమా? నేను 1948 తెలంగాణా విముక్తి పోరాటాల గురించి చదువుతున్నపుడు చదివిన ఒక పాటలో ఉన్న ఓ పదం ఇక్కడ జ్ఞాపకం వచ్చేది. నాజీల మించినవురో నైజాము సర్కరోడా అని.కాని అప్పటికి నాజీలు ఎవరో తెలియదు. తెలిసాక నాజీలని మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరని అర్ధం అయ్యింది.కేవలం హిట్లర్ గురించి తెలుసుకోవటానికే నేను మూడుసార్లు జర్మనీ లో ప్రయాణించాను. వెళ్ళిన ప్రతి దేశంలోనూ రెండవ ప్రపంచయుద్ధపు మారణ హోమానికి సంభందించిన గుర్తులు వెతికాను. వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ నాజీలు ఇక్కడికి వచ్చారా అని స్థానిక గైడ్ లని అడుగుతుంటే తోటి మిత్రులంతా ఏంటి నీకీ హిట్లర్ పిచ్చి అని నవ్వుకున్నారు.హిట్లర్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క యూదుల పట్ల సాగించిన మారణ హోమం పట్ల ఆవేదన పెల్లుబుకేది. 1945 లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక మిగిలిన శిధిలాల నుండి ఎదిగిన యూరప్ దేశాలు,ఇప్పుడు చూస్తుంటే నిజంగా అధ్బుతమే అనిపించింది.శతాబ్దాల క్రితం జరిగిన పానిపట్టు యుద్ధాలు, తుళ్ళికోట యుద్ధాలు గురించి, పల్నాటి యుద్ధాల గురించి చదువుతున్నపుడు కలిగిన ఆశ్చర్యం, ఆసక్తి కంటే ఈ శతాబ్దంలో కేవలం అరవై ఏళ్ల క్రితం, ఇప్పుడు అత్యంత ప్రశాంతంగా కనిపించే యూరప్ ఖండంలో హిట్లర్ నాజీ పాలన అనేక దేశాల్లో యూదుల మీద, కమ్యూనిస్టుల మీద, ప్రజాస్వామ్యం మీద పరమ భయంకరమైన మారణకాండను రుద్దుతుంటే ప్రపంచం మౌనంగా ఎందుకు ఉండిపోయిందో అర్ధం కాలేదు. యుద్ధాన్ని ప్రారంభించి, యూరప్‍లో ఒక్కో దేశాన్నే కబళిస్తూ, వేలాదిమంద్ని నరమేధం సాగిస్తూ హిట్లర్ ముందుకు కదులుతుంటే, శక్తిమంతంగా ఎందుకు ఈ బూర్జూవా ప్రజాస్వామిక దేశాలు అడ్డుకోలేకపోయాయో అర్ధం కాలేదు. సాటి మనిషిని ఎటువంటి శత్రుత్వం లేకుండా అత్యంత క్రూరంగా చంపగల మనస్తత్వాలని నాజీలకి హిట్లర్ ఎలా నూరిపోయగాలిగాడో అర్ధం కాని విషయం.ఈ నరమేధానికి నాంది ఇప్పుడు నేను వెళ్తున్న పోలాండ్ దేశం. రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా జర్మన్ సైన్యం మొదటగా విరుచుకు పడింది పోలాండ్ మీదే. 
 


ఫోటో వివరాలు: రష్యా సైన్యం జర్మనీ రాకుండా నిలువరించటానికి పోలాండ్ సరిహద్దు వెంబడి హిట్లర్ నిర్మించిన 32 కిలోమీటర్ల పొడవున భూగర్భం లో ఉన్న బంకర్. 

ఈ చరిత్రంతా తెలియకుండానే మే 4, 2012 న హైదరాబాదు రాజీవ్ గాంధి విమానాశ్రయం నుండి తెల్లవారుఝామున 3 గంటలకి ఖతర్ ఎయిర్వేస్ విమానం ఎక్కాను. పోలాండ్ కి నేరుగా విమానాలు లేకపోవటంతో ఖతర్ లో వేరే ఫ్లైట్ మారాలి. హైదరాబాదు నుండి ఖతర్ 4 గంటల ప్రయాణం. మనం ఖతర్ కంటే గంటన్నర ముందు ఉంటాం. మధ్య ప్రాచ్యం లో ఉన్న అత్యంత సంపన్న దేశం ఖతర్. ఇక్కడ ప్రతి 1000 మంది లో 147 మంది కోటీశ్వరులు.నేను ఎక్కిన ఫ్లైట్  అక్కడ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకి ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయ్యింది. To be contnued....

Dated : 15.06.2013

Wednesday, May 8, 2013

పారిస్ లో మనఘంటసాల

పారిస్ అనగానే ముందు గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. అక్కడికి వెళ్లేముందు ఈఫిల్ టవర్ చూడబోతున్నామనే ఉత్సుకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని గత వారం పారిస్ వెళ్తున్నా అనుకోగానే నేను ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యింది మాత్రం ఈఫిల్ టవర్ కోసం కాదు. అక్కడ ఉన్న గుయ్ మెట్ అనే మ్యూజియం చూడాలి అని. దీని వెనుక కధ తెలియాలంటే 90 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1923 లో గ్రామ రైతు కోట దిబ్బల దగ్గర పొలం దున్నుతుండగా పాలరాతి శిల్పాలు బయట పడ్డాయి. అప్పట్లో ప్రజలకు అవగాహన లేక దొరికిన ఇలాంటి శిల్పాలన్ని అక్కడక్కడా గుట్టలుగా వేసి పెట్టేవాళ్ళు. కొంతమంది వాటిని బట్టలు ఉతుక్కునే బండలుగా వాడేవారు. 1927 లో పారిస్ నుంచి వచ్చిన డూబ్రి యెల్ అనే చరిత్ర పరిశోధన కారుడు ఆ శిల్పాలన్ని సేకరించి పారిస్ లో గుయ్ మెట్ మ్యూజియంకి తరలించాడు. ఈ మ్యూజియంలో పలు ఆసియా దేశాలలో దొరికిన వేల ఏళ్ల నాటి శిల్పాలు,వంట పాత్రలు, అలనాటి వస్త్రాలు, చైనా , కంబోడియా దేశాల్లో దొరికిన ఎన్నో అపురూప శిల్పాలు భద్రపరిచారు. నేను ఈ వెబ్సైట్ రూపకల్పన లో చేసిన పరిశోధనలో మూడేళ్ళ క్రితం ఈ విషయం గురించి విన్నాను.  ఘంటసాల చరిత్ర పుస్తకంలో  1966 లో నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన ముందుమాటలో ఈ విషయాన్ని ఉటంకించారు.

కేవలం ఈ శిల్పాలు చూడటానికే ఆయన పారిస్ వెళ్ళినట్లుగా చెప్పారు. ఆ తరువాత ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరూ వెళ్లి చూడలేదు కూడా. నేను కూడా పారిస్ వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమాచారం రాసేటప్పుడు కూడా అదొక విషయం లాగే అనుకున్నాను తప్ప ఎప్పుడూ వెళ్లి చూస్తా అనుకోలేదు. నేనుండే పోలాండ్ దేశం యూరప్ యూనియన్ లో భాగం కావటంతో ఆ ఖండంలో ఉన్న 24 దేశాలకి ఎటువంటి వీసా అవసరం లేకుండానే వెళ్ళవచ్చు. ఈ దేశాలని షెన్ జెన్ దేశాలు అంటారు. ఏ ఒక్క దేశానికి సంభందించిన వీసా ఉన్నా మిగతా అన్ని దేశాలకి వెళ్ళవచ్చు. దాదాపు సంవత్సరం నుంచి వెళ్దామని అనుకుంటూనే ఉన్నా,పెళ్ళయ్యాక శ్రీమతితో వెళ్తే ఆ హనీమూన్ కూడా అయినట్లు ఉంటుందని  నేను ఏప్రిల్ 30 వ తేదిన పారిస్ చేరుకున్నాను. ఆ రోజు నాకున్న వ్యక్తిగత పనులని చక్కబెట్టుకుని, మరుసటి రోజు ఈఫిల్ టవర్ మరియు ఇతర ప్రదేశాలని చూడాలని ప్లాన్ చేసుకున్నాం. పారిస్ నగరం భూమి పైన ఎంత ఉందో అంత కు అంత భూగర్భం లో ఉంది. ఎక్కడినుంచి ఎక్కడికైనా భూగర్భంలో ఉన్న మెట్రో రైలులో కొద్ది నిమిషాల్లోనే చేరుకోవచ్చు. పారిస్ అంతా రాజప్రాసాదాలు, మ్యూజియంలు, సీల్ నదిపై ఎక్కడికక్కడ నిర్మించిన బ్రిడ్జిల మయం. ప్రతి మెట్రో స్టేషన్లో సిటీ మాప్ తో పాటు చూడాల్సిన ప్రదేశాల వివరాలు,వాటిని చేరుకోవటానికి అవసరమైన మెట్రో రైలు, బస్సు, టూరిస్ట్ గైడ్ ల వివరాలు ఉంటాయి. పారిస్ లాండ్ మార్క్ అయిన Arc de Triompe కి కొద్ది దూరం లోనే ఈ మ్యూజియం ఉంది. మెట్రో స్టేషన్ పేరు లేనా. ఈ స్టేషన్లో దిగితే కింద నుంచి పైకి రాగానే కన్పించే మొదటి బిల్డింగ్ ఇదే. దీనికి ఎదురుగా రాయల్ ప్యాలస్ ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా మే 1 న హోటల్ నుంచి బయలుదేరి పది గంటలకల్లా మ్యూజియంకి చేరుకున్నాం. కాని ఆ రోజు మేడే అనే సంగతి అక్కడికెళ్ళాక గుర్తు వచ్చింది. ఆరోజు సెలవు దినం కావటంతో లోపలికి అనుమతి లేదు. నా షెడ్యుల్ ప్రకారం ఆరోజు రాత్రికే పారిస్ నుండి బయలుదేరాలి. కాని అంతదూరం వెళ్లి మన ఊరు శిల్పాలని చూడకుండా రావటానికి మనసొప్పలేదు. ఇక ఆరోజుకి మిగతా ప్రదేశాలు చూసి మరుసటి రోజుకి కూడా షెడ్యూల్ మార్చుకున్నాను. మే 2 న పొద్దునే పదిగంటల కల్లా లేనా స్టేషన్ చేరుకున్నాం. మ్యూజియమ్  ప్రవేశ రుసుము  8 యూరోలు . టికెట్ తీసుకుని ముందుకు వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇండియా, కంబోడియా దేశాల శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక ఫ్లోర్ లో రెండు దేశాల చొప్పున మొత్తం నాలుగు అంతస్తుల్లో వివిధ ఆసియా దేశాలలో వర్ధిల్లిన బౌద్ధం, హిందూ మతాల అవశేషాలు, వేల ఏళ్ల నాటి నాగరికత కి గుర్తులైన రాతి పాత్రలు, పలు దేవతల విగ్రహాలు, శిధిల శిల్పాలు ప్రజల సందర్శనార్ధం  ఉంచారు. గుయ్ మెట్ అనేది ఒక ప్రత్యేకమైన మ్యూజియం, కేవలం ఆసియాకి సంభందించిన అవశేషాలని మాత్రమే అక్కడ చూడవచ్చు.
ప్రతి శిల్పం దగ్గరా అది దొరికిన ప్రదేశం, సేకరించిన వ్యక్తి వివరాలు ఉన్నాయి. ఆత్రుతగా ఘంటసాల అనే పేరు కోసం వెతికాను. అమరావతి పేరు ముందు కనిపించింది. నాకంటే ముందే నా శ్రీమతి ఘంటసాల పేరు ఉన్న రెండు శిల్పాలని గుర్తించింది. అవి చూడగానే నా సంతోషం అలవి కానిది. సేకరించిన వ్యక్తి పేరు, సంవత్సరం యధాతధంగా ఉన్నాయి.హెడ్ ఫోన్స్ సాయంతో ఆ శిల్ప వృత్తాంతాన్ని వినవచ్చు. ఆ రెండు శిల్పాల్ని ఫోటో తీసుకుని మిగతా శిల్పాలు చూస్తుండగా అవన్నీ అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ ప్రాంతాల్లో దొరికినవే. కొద్దిగా ముందుకి వెళితే మధ్య ప్రదేశ్, తమిళనాడు,కేరళ ప్రాంతపు అవశేషాలు కనిపిస్తాయి. కొద్దిగా పక్కకి తిరిగితే మన గ్రామం పేరుతో మరో శిల్పం కనిపించింది. మొత్తం మూడు శిల్పాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. చాలా సేపు అక్కడే గడిపి అన్నీ ఫోటోలు వీడియో తీసుకువచ్చాను. ఒకరకంగా ఆ శిల్పాలు అక్కడ ఉండటమే కరెక్ట్ అనిపించింది. దేశ విదేశాలనుంచి వచ్చే లక్షల మంది యాత్రికులు ఆ మ్యూజియాన్ని సందర్శిస్తారు. వారంతా మన గ్రామాన్ని గురించి తెలుసుకుంటారు కదా అని ఒకింత గర్వంగా కూడా అనిపించింది. శంఖంలో పోస్తేనే ఏదైనా తీర్ధం అవుతుంది. మన గ్రామానికి సంభందించిన మరిన్ని శిల్పాలు మద్రాస్ మ్యూజియం లో కూడా ఉన్నాయి. ఎక్కడి ఘంటసాల, ఎక్కడి పారిస్ ? 90 ఏళ్ల క్రితం తరలించిన మన ఊరి శిల్పాలని చూడగలగటం నిజంగా అదృష్టమనే అనుకోవాలి. అవి చూసి బయటకి వచ్చాక గుండెలనిండా నింపుకున్న సంతోషం, ఉప్పొంగిన హృదయంతో పారిస్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యాను.
 See the video in below Link

 http://www.youtube.com/watch?v=4mZvybBfTgE
www.managhantasala.net

Sunday, November 25, 2012

అమ్మో ఘంటసాల అమ్మాయిలా ??



ఇటీవలే ఒక మిత్రుడికి ఎదురైన అనుభవం ఇది.పాతికేళ్ళ క్రితం పాతుకుపోయిన భావాలు నేటికీ సజీవంగా ఉన్నాయనటానికి నిదర్శనం ఈ సంఘటన.సరదాగా చెప్పుకుంటే ఓ మిత్రుడు తనకి తెలిసిన అమ్మాయికి సంభంధం చూడటానికి తమ దూరపు బంధువులని సంప్రదించాడు. మంచి కుటుంబం, మంచి అమ్మాయి, అయినా సరే వాళ్ళనుంచి అతనికి ఎదురైన సమాధానానికి ఆశ్చర్యపోయాడు. అమ్మో ఘంటసాల అమ్మాయిలా ?? మనవాడికి అర్ధం కాలేదు. ఇదెప్పుడో పాతమాట. ఈ తరానికి బొత్తిగా తెలియని విషయం. ఆశ్చర్యం కాక మరేమిటి.
 

సహజంగానే అటు దివిసీమ ఇటు మచిలీపట్టణం ప్రాంతాలతో పోలిస్తే మనది మెరక ప్రాంతం. పాత నానుడి ఏంటంటే మెరక ఊర్ల ఆడవాళ్ళతో గెలవలేము అని. మన ఊరి ఆడవాళ్లంటే గడుసు వాళ్ళు అని పేరు. ఈ మాట నేను కూడా చాలా సార్లు విన్నాను. ఇప్పటి తరం గురించి తెలియదు కాని, ఒకప్పుడు మన ఊరి వాళ్లతో వియ్యమందాలంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించే వాళ్ళట. వీళ్ళతో మనం ఇమడగలమా అని. అయినా మన ఊరి అమ్మాయిలని చేసుకోవాలనే ఆశ మాత్రం మనసులో ఉండేది. మన వాళ్ళ మర్యాదలు,పెట్టిపోతలు అలా ఉండేవి మరి. ఈనాటికీ అవి అలాగే ఉన్నాయనుకోండి. కాని ఘంటసాల అమ్మాయిలంటే భయం మాత్రం అలాగే ఉంది అనటానికి నిదర్శనం పైన జరిగిన సంఘటన. ఇదే మన వాళ్ళని అడిగితే అది నిజమే కదా అని నవ్వుతూ చెప్తారు. ఇది రాసే ముందు నాకు సన్నిహితంగా ఉండే కొంతమంది మన ఊరి ఆడపడుచులని ఇదే మాట అడిగితే అందులో ఏమన్నా డౌటా అని నన్నే ప్రశ్నించారు. మనం అధికులమని ఎవరైనా భయపడుతుంటే లోలోపల ఆనందం సహజం కదా. కాని కుటుంబం గురించి, పిల్లల గురించి మన ఊరి ఆడవాళ్ళ ఆలోచనలే వేరు. ఎప్పుడూ తన పిల్లలు,తన భర్త నెంబర్ వన్ గా ఉండాలనే తాపత్రయం అడుగడుగునా కనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం తమవైన సుఖాల్ని, భాద్యతలని, పణంగా పెట్టే తెగువ మన ఊరి ఆడవాళ్ళ సొంతం. బహుశా ఆ తాపత్రయమే వాళ్ళని గడుసువాళ్ళుగా లోకానికి చుపించిందేమో.

గత పది సంవత్సరాల్లో అమెరికాలోనూ,ఆస్ట్రేలియాలోనూ,లేక దేశంలో ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళ విజయాల వెనుక ఇలాంటి గడుసు వాళ్ళ త్యాగాలే ఉన్నాయి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, వాళ్ళని వివాహం చేసుకున్న ఘంటసాల అల్లుడైనా, కోడలైనా, ఇప్పుడు హాయిగా ఉన్నారంటే ఈ గడుసు వాళ్ళ త్యాగమే. స్కూల్ దశ నుండి కొంతమంది, కాలేజి దశ నుండి కొంతమంది, కేవలం పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ ఆలనా పాలన తామే చూసుకోవాలనే తాపత్రయంతో భర్తని, ఇంటి భాద్యతలని వదిలేసి బెజవాడలో, హైదరాబాదులో, చల్లపల్లిలో కూడా ఉండి పిల్లల్ని చదివించుకున్న ఎంతో మంది ఇల్లాళ్ళని నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఇక్కడ చదువయ్యాక MS కోసం లేక ఉద్యోగం కోసమో వాళ్ళు వెళ్ళిపోతే ఆ తరువాత గ్రామానికి తిరిగివచ్చేవాళ్ళు. కేవలం అమ్మలే కాదు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఇందులో భాగస్వాములే. వారి అవసరాలని చూసుకుంటూ వారానికో, నెలకో మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళుతూ, ఊర్లో వ్యవసాయాన్ని చూసుకుంటూ, గ్రామం నుంచి కూరగాయలు, పాలు రోజు పొద్దున్నే ఆరున్నర్ర కల్లా బెజవాడ బస్సులో టంచన్ గా ఇచ్చే తండ్రులు లేకపోతే వారి త్యాగం పరిపూర్ణం అయ్యేదే కాదు.(ఇప్పుడు పంపట్లేదు కాని పదేళ్ళ క్రితం మాత్రం అన్నీ గ్రామం నుంచే పంపేవారు.అక్కడ దొరకవని కాదు,ఏదో మన దొడ్లో మొక్క, మన గేద పాలు అని.) ఘంటసాల అమ్మాయిలని లేక అబ్బాయిలని పెళ్లి చేసుకునే వాళ్ళంతా కేవలం వాళ్ళ గడుసు తనాన్ని మాత్రమే కాదు దాని వెనుక ఉన్న తాపత్రయాన్ని, త్యాగాన్ని కూడా గుర్తించాలి.

కాని ఇది మన గ్రామానికే పరిమితం అంటే నేను ఏకీభవించను. నేను పని చేసే సంస్థలో నా పైస్థాయి అధికారి నెల్లూరుకి చెందిన వ్యక్తి. నేను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళకి ఏదో సందర్భంలో మీ కృష్ణాజిల్లా వాళ్ళకి ఎకరాలు ఉన్నా లేకపోయినా నకరాలు మాత్రం తగ్గవయ్యా అన్నాడు. అది నవ్వుతూనే అన్నా అందులో వాస్తవం లేకపోలేదు. మన వాళ్ళ నకరాల ముందు ఎదుటి వాడికి ఎకరాలు ఉన్నా అవి దిగదుడుపే...
 
Dated : 24.11.2012

Saturday, October 27, 2012

ఆఖరి హత్య



1988 - 89 ప్రాంతాల్లో మా ఇంట్లో ఒక ఫోటో ఉండేది,తర్వాత చూస్తే మరికొందరి ఇళ్ళకి వెళ్ళినపుడు కూడా ఆ ఫోటో కనిపించేది.ఎప్పుడైనా గుడికి వెళ్ళినపుడు గుడి ముందున్న  ఒక స్మారక స్తూపం లోనూ మళ్లీ అదే ఫోటో, అప్పుడు నాకు అయిదేళ్ళు. చాలా కాలం ఆ ఫోటో నన్ను వెంటాడింది.ఆయనెవరో నాకు తెలీదు ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు కూడా. కానీ ఆ ఫోటో మాత్రం ఇప్పటికీ ఉరిలో ఎక్కడోచోట నాకు కనిపిస్తూనే ఉంటుంది.కొంచెం ఊహ తెలిసాక ఎవరో ఒక పెద్దాయన్ని అడిగాను ఆయనెవరు అని, సమాధానం తెలిసింది. కానీ అది ఇప్పుడు అప్రస్తుతం.
 
                                            గొర్రెపాటి వెంకట రత్నం (బుజ్జి)         స్మారక స్తూపం 
 
వెంకట సుబ్బయ్య గారు బౌద్ధ యుగం తో మొదలుపెట్టి,గాంధీ యుగం జమిందారియుగం,సాంఘిక చరిత్ర తో
1966 లో ఘంటసాల చరిత్ర  గ్రంధాన్ని ముగించారు.మరి ఆ తరువాత ఆ గ్రంధాన్ని కొనసాగించాల్సి వస్తే దాన్ని మొదలుపెట్టాల్సింది రాజకీయ చరిత్ర నుంచే ,కానీ 1966 తరువాత ఉరిలో జరిగింది రాజకీయ చరిత్ర మాత్రమే కాదు రక్త చరిత్ర కూడా. 70 వ దశకం నుంచి 1987 వరకు గ్రామం కక్షల తో నూ హత్య ల తోనూ పార్టీ తగాదాలతో నూ అట్టుడికి పోయింది. ఆ పరంపర కి ముగింపు ఈ ఆఖరి హత్య. 30.12.1987 న జరిగిన ఈ ఉదంతం గ్రామం లో అన్నీ కక్షలకి ముగింపు పలికింది.1 జనవరి 1988 న ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే మన ఊరు మాత్రం పోలీసు పహారా లో బిక్కు బిక్కు మంటూ గడిపింది.
ఆ చరిత్రకి ఇప్పుడు జీవిత చరమాంకం లో ఉన్న కొంతమంది కారకులు,మరికొందరు సాక్షులు. కానీ ఆ కక్షలు కార్పణ్యాలు ఇప్పుడు లేవు ఆ మూర్ఖత్వపు పట్టుదలలు లేవు.మనుషుల ఆలోచనల్లోనూ మానసిక పరిణతి లోనూ ఎంతో మార్పు.కానీ గతాన్ని తలుచుకున్నపుడల్లా ఒక్కసారి ఉలిక్కి పడతారు.అప్పటికి ఇప్పటికి ఉరిలో ఎంత తేడా? అప్పట్లో ప్రతి కేసులోనూ ప్రతి గొడవ లోనూ ఉన్న కొంతమంది ఇప్పుడు గడిపే జీవితం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు,మనవడు,మనవరాళ్ళు,వాళ్ళ ముచ్చట్లు, కనీసం పక్కవాడి గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా వారు గడిపే సాధు జీవితం చూస్తుంటే అసలు ఈయనేనా అప్పుడలా ఉండేవాడు అనిపిస్తుంది.అలా అని ఆ గొడవలకి హత్యలకి నేనేమి ప్రత్యక్ష సాక్షి ని కాదు.ఈ వయసులో అవన్నీ ప్రస్తావించి వివాదాల్ని కొని తెచ్చుకోవటం నాకూ ఇష్టం లేదు.కానీ వెబ్ సైట్ రూపకల్పన సమయం లో నేను కలిసిన ఎంతో మంది పెద్దల దగ్గర నేను తెలుసుకున్న విషయాలు ఎంతో ఆసక్తికరం గా ఉండేవి.అవన్నీ ఎప్పటికైనా వెబ్ సైట్ ద్వారా కానీ  గ్రంధ రూపం లో కానీ  తీసుకురావాలి అనిపించేది.కానీ నేను చూడని విషయాలు,ఎవరో చెప్పిన విషయాలు,నేను రాయటం సముచితం కాదు అనిపించింది.కానీ అప్పటి ఘటనలలో అకారణం గా నిందలు పడిన వ్యక్తుల్నీ కలిసాను,మేమే చేసాం అని ఒప్పుకున్న వ్యక్తుల్ని కూడా కలిసాను.
ఈ ఉపోద్గాతమంతా ఎందుకంటే ఈ మధ్య నే ఘంటసాల చరిత్ర గ్రంధాన్ని పునర్ముద్రించిన విషయం మీకు విదితమే.ఆ ప్రయత్నం లో నేను ఉన్నపుడు చాలామంది పెద్దలు ఆ పుస్తకం 1966 దాకా మాత్రమే ఉంది. ఈ 45 ఏళ్ల చరిత్ర ని కూడా దానికి అనుసంధానించి ఒకే పుస్తకం గా చేస్తే బాగుంటుంది అని. నిజమే మరి బావుంటుంది కూడా. కానీ రాసే వాళ్లేరి? ఒకవేళ రాయాలనుకున్నా ఏమి రాయాలి ? ఈ 45 ఏళ్ల లో జరిగిన అన్నీ ఘటనలకి సాక్షులైన వారు పెదవి విప్పితే,రాసిన అంశాలకి బాధ్యత వహిస్తే ఎప్పటికైనా రెండవ భాగం తీసుకురావాలని ఆశ. అదే కనుక జరిగితే ఆ పుస్తకం పేరు
 
ఘంటసాల చరిత్ర - కొన్ని నిజాలు

Sunday, October 21, 2012

చేయూత లేని చేనేత



మాకు దగ్గరి బంధువులంతా కొత్తపల్లి, కొడాలి, గుండుపాలెం ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారు. తరచుగా మా ఇంటికి రాకపోకలు ఉండేవి. వచ్చేటపుడు వారి స్నేహితులనో లేక బంధువులని కూడా తోడుగా తీసుకొచ్చేవాళ్ళు. అలా మా ఇంటికి వచ్చిన బంధువులంతా పొద్దునే వచ్చి కుశల ప్రశ్నలు, మంచి చెడ్డా మాట్లాడుకున్నాక సాయంకాలానికి నేత చీరలకోసం పద్మశాలీల దుకాణానికో లేక కొంతమంది నేత కార్మికుల ఇళ్ళకి చీరలు కొనటానికి వెళ్ళేవాళ్ళు. వాళ్లకి తోడుగా మా అమ్మ , తనకి తోడుగా నేను వారివెంట వెళ్ళిన జ్ఞాపకాలున్నాయి. అప్పుడు చాలా చిన్నతనం,ఆ చీరల నుంచి వచ్చే గంజి వాసన భలే ఉండేది. వాళ్ళు చీరలు చూస్తుంటే  నేను ఆ బేరాలు వింటూ ఉండేవాడిని. ఆ బేరాలు తెగేవి కాదు ముడి పడేవి కాదు. ఘంటసాల పురాతన గ్రామంగా ఎంత పేరు ఉందో,చేనేత వస్త్రాలకి అంతే పేరు ఉంది.
 
 
బీద గొప్ప తారతమ్యాలు లేకుండా అన్నీ తరగతుల వాళ్ళు మన ఊరి చీరలంటే నాణ్యత కలవిగా భావించేవాళ్ళు. స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న పలువురు పెద్దలకి పంచెలు నేసి ఇచ్చిన ఘనత మన వాళ్ళ సొంతం. ఆ రోజుల్లో తరచూ పార్టీ కార్యక్రమాల కోసం, కవితా గోష్టుల కోసం వచ్చే అతిధులందరూ మన గ్రామంలో ఖద్దరుని, నేత చీరలని కొనుగోలు చెయ్యకుండా వారి ప్రయాణం ముగిసేది కాదంటే అతిశయోక్తి కాదేమో. చేనేత మాత్రమే కాకుండా పౌరోహిత్యంలోనూ జ్యోతిష శాస్త్రంలోనూ ప్రావీణ్యత కలవారు కూడా ఈ సామాజిక వర్గం లో ఉన్నారు. మా పక్కింటికి ప్రతి నెల వెంకటేశ్వరరావు అనే ఆయన TVS 50 మీద చీరల మూటల్ని పెట్టుకుని వచ్చేవారు. మా వీధి వాళ్ళంతా ఆ రోజున ఆ యింట్లో చేరే వాళ్ళు. పాపం అయన ఓపికకి మాత్రం మెచ్చుకోవాలి, ఆయన్ని కొట్టటం ఒకటే తక్కువేమో. ఒక్కోసారి ఆ బేరాలు వింటుంటే అదో గొడవలాగా వినిపించేది. కానీ ఇటీవల వారి ఇళ్ళకి,ఆ వీధులకి వెళ్ళినపుడు ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న డాబాలు మాత్రం వెలిశాయి. ఒకప్పుడు మన గ్రామం లో 400 మగ్గాలు ఉండేవట. షష్టి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం మగ్గానికి పావలా చొప్పున విరాళాలు ఇచ్చేవారు పద్మసాలీలు. మన గ్రామంలో ఇప్పుడు అత్యధిక జనాభా వీరిదే. వీరి మద్దతు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవటం ఎవరి వల్లా కాదు. 1935 లో చేనేత సహకార సంఘాలు ఏర్పడ్డాక జిల్లా లోనే అత్యధిక ఉత్పత్తిని సాధించిన సంఘంగా రికార్డులలో నిలిచిన సంఘం మన గ్రామానిదే. అందె జలధిలింగం ప్రెసిడెంట్ గా తుమ్మలచర్ల వెంకట సుబ్బయ్య సెక్రటరీ గా ఏర్పడ్డ శ్రీ విజయలక్ష్మీ చేనేత సహకార సంఘం ఎక్కువ కాలం సాగలేదు. అంతర్గత విభేదాలతో కొద్దికాలానికే ఇది మూతబడింది. దాని నుంచి బయటకి వచ్చి కొందరు పెట్టిన భారతీ రంగా చేనేత సంఘం కూడా కొద్ది కాలానికే అంతరించింది. తరువాత మళ్లీ చేనేతల వెతలు మొదలు అయ్యాయి. సంపాదన కరువు అవ్వటంతో ఆకలి తో అలమటించే చేనేత కార్మికులకి గంజి కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఇదంతా చూసిన కొందరు ఔత్సాహికులు మళ్లీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్లి అడగటంతో మొదట ఆయన తీవ్రంగా మందలించారు. అంతర్గత కలహాలు లేకుండా ఐకమత్యంతో పని చేసుకుంటాం మాకు 'జ్ఞానోదయం' అయ్యింది అని వారు చెప్పటంతో, వారు చెప్పిన ఆ మాట తోనే 'జ్ఞానోదయ' చేనేత సంఘం పేరిట 1952 లో మరొక సంఘాన్ని ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో శ్రీనివాస వీవర్స్ సొసైటీ , పూర్వపు పేరుతో విజయలక్ష్మీ వీవర్స్ సొసైటీ ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇవే మన గ్రామంలో ఉన్న చేనేత సంఘాలు.
 
 
భావనా రుషి వీరి ఆరాధ్య దైవం, పద్మసాలీలకి యజ్ఞోపవీతం ధారణ గావించిన సంఘ సంస్కర్త ఈయనే. జలధీశ్వరాలయానికి దక్షిణ భాగంలో ఉన్న ఈ రుషి ఆలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఈ సామాజిక వర్గం నుంచే గత కొద్దికాలం వరకు అందె జగదీశ్ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసారు. ఆయన కాలం లోనే పంచాయితీ సంత మార్కెట్ ఏర్పాటు అయ్యింది. అన్ని చేతి వృతులు అంతరిస్తునట్లుగానే క్రమ క్రమంగా మన గ్రామంలో ఇది కూడా అంతరిస్తోంది. ఈ తరం వారెవ్వరూ దీనిని ఉపాధి మార్గం గా ఎంచుకోవటం లేదు. కానీ ఇంకా దీని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు మన గ్రామం లో ఎక్కువమందే ఉన్నారు. కాబట్టి మరికొన్నాళ్ళు మన చేనేత వైభవం వెలుగొందుతుంది. కానీ ఆ చేనేత వెలుగు కి మన చేయూత కావాలి....
 

Thursday, October 4, 2012

పెద్దలకి మాత్రమే



ఆ మధ్య పెద్దలారా మన్నించండి కాలమ్ రాసాక చాలా మంది నన్ను అభినందించారు. పెద్దల పట్ల మనం చూపిస్తున్న నిరాదరణకి అద్దం పట్టినట్లుంది అని. కానీ నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి అంశానికి రెండవ పార్శ్వం కూడా ఉంటుంది. కమల్ హాసన్ నటించిన విరుమాండి (తెలుగు లో పోతురాజు) సినిమా చూడండి, ఒకే కధని హీరో చెప్తున్నపుడు ఒకలాగా, విలన్ చెప్తున్నపుడు మరోలా ఉంటుంది. ఎవరికి వారికి తమ కోణం లో చూస్తే తాము చేసేది కరెక్ట్ గానే కనిపిస్తుంది.
 భిన్న దృక్పధాల నుంచి చూస్తున్నపుడు ఒకే అంశంలో భిన్నకోణాలు ఆవిష్కృతమవుతాయి. ఎంత సేపూ పెద్దలని నిర్లక్ష్యం చేస్తున్న పిల్లల గురించే మాట్లాడతాం. నేను కూడా ఈ తరం వాడినే, అందరిలాగే వీకెండ్ సరదాలు, సినిమాలు, షికార్లు, మార్కెట్ లో న్యూ ట్రెండ్స్, వీటన్నిటికి ఏమీ అతీతుడిని కాదు. ప్రస్తుతం యువతరం అనుసరిస్తున్న ఈ ట్రెండ్స్ ని విమర్శిస్తూ తమ చాదస్తంతోనో లేక కాలానుగుణం గా వచ్చే మార్పులని ఆహ్వానించలేక ఈ తరం పద్ధతుల్లో ఇమడలేక పిల్లల మనస్తత్వాలని అర్ధం చేసుకోకుండా వారి చేత నిరాదరణ కి గురవుతున్న పెద్దలూ ఉన్నారు. మా అత్తగారికి చాదస్తం మరీ ఎక్కువండీ అంటూ ఓ కోడలు వాపోతుంది. మా తాత కి నేను జీన్స్ వేస్తేనే నచ్చదురా,మా రోజుల్లో అయితేనా అంటూ మొదలెడతాడు అని స్నేహితుడి దగ్గర చెప్తుంటాడు ఓ కాలేజి స్టూడెంట్. ఇది ఈ తరం వాళ్ళ వెర్షన్. అందుకే పెద్దలు మారాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ముందు మీ పాత కళ్ళజోడు మార్చేయండి. దానితో పాటు కుటుంబాన్ని లోకాన్ని చూసే దృక్కోణాన్ని మార్చుకోండి.ఒక తరం లో పంచెకట్టు ఫాషన్, మీ తరం వచ్చేటప్పటికి బెల్ బాటం, మా తరానికి వచ్చేటప్పటికి జీన్స్ ఫాషన్. ఒకప్పుడు కోరమీసం యువతరాన్ని ఊపేస్తే ఇప్పుడు పిల్లి గడ్డం ఈ తరాన్ని ఏలేస్తోంది. మా రోజుల్లో అయితేనా  అంటూ మొదలుపెడితే ఇప్పుడు వినే ఓపిక ఎవరికీ లేదు. ఎందుకంటే మీ రోజులు మీవే, మావి కాదు. నలభై ఏళ్ల క్రితం బెల్ బాటం, కోరమీసం తో మీరు ఫాషన్ సముద్రాన్ని ఈదినట్లే. ఇప్పటి తరం చిరుగుల జీన్స్ ట్రెండ్ లో కొట్టుకుపోతోంది. వళ్ళంతా టాటూలు వేయించు కొచ్చిన మనవరాలని సంప్రదాయాల పేరు తో బెదరగొట్ట కండి.బావుందమ్మా ఇది లేటెస్ట్ దా అని ముద్దుగా ఆశ్చర్యపొండి. ఒకప్పటి ఉద్యోగాలు వేరు వాటికి అవసరమైన వేషధారణా వేరు. వాటితో పోల్చుకుని అప్పట్లాగా ఉండటం ఇప్పుడు కుదరదు. అంతెందుకు ఒకప్పుడు మీరు తీసుకున్న నెల జీతం మీ అబ్బాయి ఒక గంట కి సంపాదిస్తున్నాడు. మరి మీలాగా అదే జీతానికి పని చెయ్యమని మీరు చెప్పగలరా? కోడలు కాఫీ ఇవ్వటం లేదని చిన్నబుచ్చుకోవటం  ఎందుకు,మీరే వేడిగా కోడలికి ఒక టీ ఇవ్వండి. మీ తరం లో ఒత్తిడి అనే పదమే ఉండేది కాదు .కానీ ఇప్పుడలా కాదు.భార్య భర్తలిద్దరూ పరిగెత్తాల్సిన పరిస్తితి.ఆ పరుగు లో తమను తామే మరిచిపోతున్నారు. వారికి ఇంటికి రాగానే కావాల్సిన ఉపశమనం అందించాల్సింది మీరే. బాల్యం లా,యవ్వనంలా,వృద్ధాప్యామూ ఒక దశ. ఆనందం గా ఆస్వాదించండి.మనసారా జీవించండి. ఇంతకాలం పరిగెత్తి అలసిపోయారు ఇక విశ్రాంతి తీసుకోండి. మీ పిల్లలు, మనవళ్ళు,మనవరాళ్ళకి వారి భాధ్యతని మాత్రమే గుర్తుచెయ్యండి. భాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం రెండూ వృధానే. మీ జ్ఞాపకాలు మీవే, వాటిని పదిలపరచుకోండి.ఈ తరం అలవాట్లని జీవన విధానాన్ని ప్రశ్నించకండి.ఓ సినిమా లో హీరో అంటాడు పాతికేళ్ళ కుర్రాడంటే నాలాగే ఉంటాడు అమ్మా నాన్న కి చెప్పకుండా సినిమాలకి వెళ్తాడు.ఫ్రెండ్స్ తో  షికార్లకి వెళతాడు.వాడలా ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్లు లేదంటే ఎవరైనా డాక్టర్ కి చూపించాలి అని. మీ తరం లో ఏదన్నా పెళ్లి సంబంధం వస్తే అసలు మా అబ్బాయికి వక్కపొడి అలవాటు కూడా లేదండి అని చెప్పుంటారు. కానీ ఇప్పుడు అలా చెప్పండి ఒక్క అమ్మాయి అయినా మీ అబ్బాయిని చేసుకుంటుందేమో. మరీ పప్పు సుద్దలా ఉన్నాడే అనుకుంటారు. అలాగే అసలు మా అమ్మాయి వంచిన తల ఎత్తదు అని చెప్పినా చేసుకోటానికి అబ్బాయిలేవరూ సిద్ధంగా లేరు. కాలం తో పాటు వచ్చిన మార్పులకనుగుణం గా ప్రతి మనిషి తమను తాము మలుచుకోవాలి మార్చుకోవాలి. లేదంటే ఈ పోటి ప్రపంచం లో ముందుకు వెళ్ళటం కష్టం అనే విషయాన్ని గ్రహించండి.  మీ ముందు తరం వాళ్ళు చెయ్యలేని ఎన్నో అద్భుతాలని మీరు సృష్టించారు. అలాగే మీరు సాధించలేని ఎన్నో ఆవిష్కరణల్ని ఈ తరం ఇప్పటికే సాధించింది. కుటుంబ పరిస్తితుల కారణంగా వృద్ధాశ్రమాల్లో గడపాల్సి వస్తే క్రుంగిపోకండి. కొత్త స్నేహితుల్ని కొత్త వాతావరణాన్ని ఆస్వాదించండి. సవాలక్ష మజిలీల్లో ఇది ఒకటి అనుకోండి. ఆశావాదం జీవితం మీద సరికొత్త ఆశల్ని కల్పిస్తుంది....

Saturday, September 22, 2012

ముందుచూపు



కవి , తత్వవేత్త తమ కాలం కంటే ముందు ఉంటారనేది నిర్వివాదాంశం. మిగతా వాళ్ళంతా ఆ రెండూ కాదు కాబట్టి గతించిన కాలంలో జరిగిన మార్పుల్నిమాత్రం విశ్లేషిస్తూ ఉంటారు. ఇది ఒకరకంగా అలాంటి విశ్లేషణ. ఒక్క 20 సంవత్సరాలు వెనక్కి వెళదాం. గ్రామంలో గత ఇరవై సంవత్సరాల్లో మనం ఊహించనివి, భవిష్యత్తులో ఇలా కూడా అవుతుంది అని ఎవరూ ఏ మాత్రం అంచనా వెయ్యని కొన్ని సంఘటనలు, మార్పులు తలచుకుంటే నిజంగా ఆశ్చర్యమే. ఇది మన గ్రామానికే పరిమితం అని కాదు నా ఉద్దేశం. ఇది మన వెబ్ సైట్ కాబట్టి మన వరకు మాట్లాడుకుందాం. ఘంటసాలలో మంచినీళ్ళు కొనుక్కుని తాగుతారని అసలు మనం ఊహించి కూడా ఉండము. పెద్దవాడైనా, పేద వాడైనా ఊరి చివర చేతి పంపు నీళ్ళే తాగేవాళ్లు. కాకపొతే ఉన్నవాళ్ళకి పాలేర్లు, లేని వాళ్ళు సొంతంగానూ కావిళ్ళతో నీళ్ళు చేరవేసుకునే వాళ్ళు. Bisleri Water బాటిల్స్ ని ఎప్పుడో తప్ప గ్రామంలో చూడటం అరుదు. మరి ఇప్పుడు? అందరికీ సురక్షిత మంచినీరు, లీటర్ రూపాయికి అమ్మినా, పది రూపాయలకి అమ్మినా అందరం కొనుక్కునే తాగుతున్నాం. సిటీలలో అద్దె ఇళ్ళలో స్థలం లేక కళ్యాణ మండపాలలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. గ్రామంలో పశువుల దొడ్లు, విశాలమైన వాకిళ్ళు, వీధిలో షామియానాలలో భోజనాలతోనే ఆ తంతు ముగిసిపోయేది. మరిప్పుడు? చిన్నపాటి కార్యక్రమాలకి కూడా కళ్యాణ మండపమే వినియోగిస్తున్నాం. ఇంటిలో పెళ్ళనేది మానేసి చాలాకాలం అయ్యింది. ఒకరో ఇద్దరో బఫే డిన్నర్ కూడా పెట్టినట్లు గుర్తు. అందరూ బఫే పెట్టే రాజులు కూడా త్వరలోనే ఉన్నాయి. ఇంట్లో ఫంక్షన్లకి మామయ్యలు బాబాయిలు వడ్డన చేయటం మానేసి చాలా కాలమే అయ్యింది. మన ఊర్లో   కళ్యాణ మండపమా ? అని ఆశ్చర్యం,అసహనం వ్యక్తం చేసిన వాళ్లే చక్కగా దానిని వాడుకుంటున్నారు. గ్రామంలో కళ్యాణ మండపం కొందరు వ్యక్తుల ముందు చూపుకి, సంకల్పానికి, విరాళాలిచ్చి ప్రోత్సహించిన వితరణ శీలుర దాతృత్వానికి ప్రతీక. 
 
మాతరం ఊహ తెలిసే నాటికి దిగువ మధ్య తరగతి కుటుంబాలకి మరుగు దొడ్లు ఏర్పడ్డాయి. మన తండ్రుల కాలంలో కూడా కాలకృత్యాలకి బయటికే వెళ్ళే వాళ్ళట. ఇది ఒక భూస్వామి స్వయంగా నాతో చెప్పిన మాట. నా చిన్నతనంలో స్నానాల దొడ్లు ఇంటి బయట ఉండేవి. మెల్ల మెల్లగా అందరికి మరుగు దొడ్లు ఏర్పాటు కావటం నా చిన్నతనం నుంచి నేను గమనించిన ఒక అంశం. కానీ మన ఊర్లో ఆటాచ్డ బాత్రూంతో బెడ్రూములు కడతారని ఎప్పుడూ అనుకోలా. ఇక AC ల విషయం,, ఉషా ఫాన్ అంటే పెద్ద గొప్ప ఒకప్పుడు. కరెంట్ ఉన్నా ఒక్క గదిలోనే ఫాన్ ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న డాబాల్లో కూడా AC లు, గదికి ఒక ఫాన్. ఇంకొక ముఖ్యమైన అంశం టెలిఫోన్ సౌకర్యం. 1962 లో ఊరికి ఫోన్ సౌకర్యం వస్తే 1995 దాకా మన గ్రామంలో ఉన్న ఫోన్ల సంఖ్య వంద కూడా లేదు. అమెరికాలో ఉన్న పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి తమ ఇంటికి ఫర్లాంగు దూరంలో ఫోన్ ఉన్న వాళ్ళింటికి ఫోన్ చేసి తమ వాళ్ళని పిలవమని, వాళ్ళు వచ్చాక మళ్లీ కాల్ చేసి మాట్లాడటం నాకు గుర్తుంది. ఇది ఎప్పుడో 80 లలో అనుకునేరు సుమా, 1997 లో. ఇక ఆ తర్వాత నుంచి ల్యాండ్ ఫోన్ల వరద ప్రారంభం అయ్యింది. ఇక సెల్ ఫోన్ విప్లవం, ఈ మార్పుని నేను గ్రామంలో దగ్గరగా చూడలేదు. ఎందుకంటే అప్పటికే హైదరాబాదు వెళ్ళిపోవటం వల్ల ప్రత్యక్షంగా ఆ మార్పుని గమనించలేదు. కానీ సెలవలకి వెళ్ళినప్పుడల్లా దశల వారీగా ఆ మార్పుల్ని చూసేవాడిని. మొదట కాస్త డబ్బున్న వాళ్ళు, తెల్లటి సిల్కు ఖద్దరు చొక్కాల్లో 500 రూపాయల నోటు మాత్రం కనిపించేలా పెట్టే  షోకిల్లా రాయుళ్ళు దానితో పాటు సెల్ ఫోన్ కూడా పెట్టటం ప్రారంభించారు. మాది వ్యవసాయ కుటుంబం, ట్రాక్టర్లు కిరాయికి తిప్పే బిజినెస్ కావటంతో నా చిన్నతనంలో తెల్లారేటప్పటికి మా ఇంటి చుట్టూ ఒక పదిమంది వచ్చి ఉండేవాళ్ళు. తమ పొలాలు దున్ని పెట్టాలనో లేక ఇసుక తోలి పెట్టాలనో. లాండ్ ఫోన్స్ వచ్చాక ఆ ఫ్లో కొంత తగ్గింది. ఇప్పుడు అయితే ఒక్కళ్ళు కూడా రావట్లా. అన్నీ ఫోన్లలోనే. మెల్లగా ట్రాక్టర్ ఓనర్లు, వాళ్లతోపాటే డ్రైవర్లు, కొన్నాళ్ళకి ముఠా మేస్త్రీలు, ఇప్పుడు ముఠా కూలీలు అందరికీ సెల్. కూలి బేరం కుదరకపోతే క్షణాల్లో అందరికీ సమాచారం వెళ్ళిపోతుంది లొకేషన్ చేంజ్ అని (వేరే పొలానికి). సెల్ ఫోన్ల పుణ్యమా అని ఒక మంచి మాత్రం జరిగింది. మనం అణాలు, బేడలు వినటమే తప్ప చూడలేదు వాడలేదు. కనీసం మాటల్లో కూడా మనం అని ఉండము. మన ముందు వాళ్ళతోనే అవి అంతరించిపోయాయి. సెల్ ఫోన్ కాల్ చార్జీల వల్ల కనుమరుగైపోయిన పైసలు వాడుకలో లేకపోయినా, మాటల్లో వాడుతున్నారు, సెకను కి పైసా అని అరపైసా అని. నేను అయిదు పైసల నాణెం చూసాను, ఖర్చు పెట్టాను కూడా. ఇపుడు బిక్షగాళ్ళకి రూపాయి వేస్తేనే అదోలా చూస్తున్నారు. ఇంతకుముందు పావలాకి ఏమొస్తది అంటే సమాధానం ఉండేది కాదు. ఇప్పుడు ధైర్యంగా చెప్పచ్చు 25 నిమిషాలు టాక్ టైం వస్తుంది అని. ఇక జలధీశ్వరాలయంలో షష్టి లాంటి పండుగలకి తప్ప మామూలు రోజుల్లో నర మానవుడు కూడా ఆ గుడిలో కనిపించేవాడు కాదు. ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం నుంచి రోజూ వచ్చే జనం. రేపో మాపో దర్శనానికి టికెట్ పెట్టినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ రోజుని కూడా మనం తప్పకుండా చూస్తామని నా గట్టి నమ్మకం. ఇది కూడా కొందరు వ్యక్తుల ముందు చూపుకి నిదర్శనం. దీనికి కూడా పెదవి విరుపులు, అసహనాలు యధాతధం.
ఈ మార్పులన్నీ జరుగుతున్నపుడు మనం గమనించలేదు, ఇలా కూడా అవుతుంది అని ఊహించలేదు. ఒక వేళ ఎవరన్నా ఊహించి చెప్పినా ఇదంతా అయ్యే పనులు కావులే అని పెదవి విరిచిన వాళ్ళే ఎక్కువ ఉండి ఉంటారు. మనం పెదవి విరవటానికి కారణం బహుశా సమాజంలో జరుగుతున్న మార్పుల్ని తెలుసుకుని వాటిని అందిపుచ్చుకోలేకపోవటం కావచ్చు. దానికి సమాచార లోపమూ ఒక కారణం .కానీ అవన్నీ జరిగాయి. ఇప్పటి దాకా జరిగిన వాటికి మనం విశ్లేషకులుగానే మిగిలిపోదామా? లేక ఇకనుంచైనా ఆ ముందుచూపుతో అవసరాలని, అవకాశాలని అందిపుచ్చుకుందామా? ఇప్పుడు సమాచార లోపం లేదు, ప్రపంచం లో ఎక్కడ ఏ మార్పు జరిగినా క్షణాల్లో మారుమూల గ్రామాలకి సైతం తెలిసిపోతోంది. ఈ మధ్య టీవిలో ఒక వార్త ని చూసాను,విజయవాడలో స్వర్గపురి అని నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన స్మశానం అని. (వీడియో  దృశ్యాలు ఇక్కడ చూడండి.) కానీ ఈ అంశాన్ని రెండు సంవత్సరాలకి ముందే ఆలోచించిన కొంతమంది దార్శనికులు మన గ్రామంలోనూ దానికి శ్రీకారం చుట్టారు. షరా మాములుగానే ఆ ఇదంతా అవుతుందా,అవసరమా అనే పెదవి విరుపులు కూడా అయిపోయాయి. కానీ ఆల్రెడి సమాజం లో మార్పు మొదలైంది, ఇంకా మనం దానిని అందిపుచ్చుకోలేకపోతే ఈ మార్పు కూడా విశ్లేషణల కోవలోకే వెళ్ళిపోతుంది. మనల్ని మనం దార్శనికులుగా నిరూపించుకోవటానికి తక్షణం మన ముందు ఉన్న అంశం ఇది. గుడికి వందలు పెట్టి టికెట్ కొనుక్కుని దర్శనానికి వెళ్ళే మనం స్మశానానికి కూడా టికెట్ పెట్టుకుని వెళ్ళే రోజులు వచ్చేసాయి. కానీ అవి పెద్ద పెద్ద సిటీ లలోనే కావచ్చు. కానీ మనమే నిర్మించుకునే ఈ స్వర్గపురి ఆ సౌకర్యాలని పేద గొప్ప తేడా లేకుండా అందరికీ ఉచితంగానే అందించే ప్రయత్నంలోనే ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకున్న చాలామంది స్పందించటం ఎంతో ఆనందించదగ్గ విషయం. కానీ ఈ బృహత్తర ప్రణాళికకి చాలా మంది పెద్దల పెద్ద మనసులు కావాలి. లేదంటే ఇంకో పదేళ్ళ తరువాత ఇది కూడా పైన విశ్లేషించుకున్న మార్పుల చెంతన మన ప్రమేయం లేకుండానే జరిగిన మార్పుగా మిగిలిపోతుంది. ముందుచూపుతో ఎవరు దీనికి కారకులు అవుతారో, ఎవరు కేవలం సాక్షులుగా మిగిలిపోతారో కాలమే నిర్ణయిస్తుంది.

Thursday, September 20, 2012

సత్ర విచిత్రం


నేను ఇరవై ఏళ్ళు ఊర్లో పెరిగినా ఇప్పటికీ ఒక్కసారి కూడా చూడని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.దూరపు కొండలు నునుపు అని, ఎక్కడెక్కడో ఉండే చారిత్రక ప్రదేశాలని చూడటానికి ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వెళతాం. కానీ మనం పుట్టిన ఊరులో ఉన్న చారిత్రక ప్రదేశాలని మాత్రం విస్మరిస్తూ ఉంటాం.చిన్నపట్నుంచి కొన్ని వేల సార్లు సత్రం సెంటర్ అనే పదాన్ని ఉపయోగించి ఉంటాం. కానీ నేను ఖచ్చితం గా చెప్పగలను,ఈ కధనం చదువుతున్న వాళ్ళలో నూటికి తొంభైమంది సత్రం మాత్రం చూసి ఉండరు.
  అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనుకోండి. కానీ ఎందుకో ఆ సత్రం ఎలా ఉంటుందో లోపల  చూడాలనే కుతూహలంతో ఆ మధ్య ఊరు వెళ్ళినప్పుడు మందుల షాపు వాసు గారిని అడిగాను. అడిగిందే తడవుగా అయన నాతో పాటు బయలుదేరి ఆ సత్రం లోపలి ఆవరణని, విశేషాల్ని, భవిష్యత్తు కార్యాచరణని వివరించారు. ఎన్నో సార్లు ఆ సత్రం ముందు నుంచి నడిచినా ఒక్కసారిగా లోపల చూసేటప్పటికి ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళిన అనుభూతి. ఏమిటో చెప్పకుండా ఆ ఫోటో చూపిస్తే మాత్రం మన ఊరు వాళ్ళు ఒక్కళ్ళు కూడా అది మన ఊర్లో బిల్డింగ్ అని అనుకోరు.
1928 లో మన గ్రామానికి వచ్చే యాత్రికుల నివాసం కోసం చుండూరి నాగభూషణం గారు ఈ సత్రాన్ని కట్టించారు. అప్పట్లో దీనికి అయినా ఖర్చు 6000 రూపాయలు. దీనికి ఉపయోగించిన  కారురాయి ఇప్పుడు ఎక్కడా దొరకదు. అందుకే ఇన్నేళ్ళయినా ఆ నిర్మాణం చెక్కు చెదరలేదు. తదనంతర కాలం లో నాగభూషణం గారి కుమారుడు చుండూరి వెంకటరెడ్డి గారు సున్నం వేయించి మరమ్మత్తులు చేయించారు. ప్రస్తుతం వీరి వారసులు ఎవరూ లేరు. అందుకీ ఈ సత్రాన్ని గ్రామంలో వైశ్య సంఘానికి అప్పగించారు. వారి ఆధ్వర్యం లోనే ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఏదైనా చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి,ఆధ్యాత్మిక ప్రవచన భోధనా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి దీనిని ఉపయోగిస్తున్నారు. గ్రామంలో పాత భవనాలన్నీ ఇటీవల కొత్త అందాల్ని సంతరించుకుంటున్న తరుణంలో త్వరలో సత్రం కూడా తన రూపుని మార్చుకోబోతుంది.
  దీని గురించి పూర్తి వివరాలని ఇక్కడ వ్యాఖ్యానించలేను కానీ, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో కళ్యాణ మండపం గ్రామ నడిబొడ్డున తలెత్తుకు చూస్తుందని మాత్రం చెప్పగలను. ఆ తరువాత ఈ పాత నిర్మాణాన్ని చూసే అవకాశం ఈ తరానికి ఉండకపోవచ్చు. అందుకే ఆ సత్ర చిత్రాలు ముందుగానే పదిలపరచబడ్డాయి.