Saturday, October 17, 2015

నా ఐరోపా యాత్ర - 22 (స్విట్జర్లాండ్)

ఇప్పుడు మేము వెళ్ళబోయేది స్విట్జర్లాండ్ లో Schaffhausen లో ఉన్న రైన్ ఫాల్స్ అనే జలపాతం. ఇది ఆ దేశానికి ఉత్తరభాగాన ఉంది. అంటే మేము ఉన్న ఆస్ట్రియా సరిహద్దు నుండి 120 కిలోమీటర్లు. ఆస్ట్రియా కి స్విట్జెర్లాండ్ కి మధ్యలో ఒక నది ఉంది అదే ఆ రెండిటి మధ్య బోర్డర్. ఆ బోర్డర్ దగ్గర పోలీసులు కార్లు ఆపి చెక్ చేస్తున్నారు.మేము మా పాస్ పోర్ట్లు తీసుకుని చెక్ పోస్ట్ లోకి వెళ్లి చూపించాము. పోలాండ్ వీసా ఉండటంతో చెక్ చేసి వెంటనే ఇచ్చేసారు. 

యూరప్ లో ఉన్న అన్ని దేశాల్లోకి స్విట్జెర్లాండ్ చాలా ఖరీదైన దేశం.అందుకే కొంతమంది సరిహద్దు దేశాలనుండి బీరు, సిగరెట్లు లాంటివి తీసుకు వెళుతుంటారట. అందుకే ఈ చెకింగ్ అని మార్చిన్ చెప్పాడు. జర్మనీ తో పోలిస్తే కూడా పోలాండ్ చాలా చవకైన దేశం. మేము జర్మనీ వెళ్ళేటప్పుడు కూడా బోర్డర్ లో పెట్రోల్ బంకులన్నీ బిజీ గా ఉండేవి. జర్మన్ దేశస్తులు , పోలాండ్ మీదుగా జర్మనీ వెళ్ళేవారు , పోలాండ్ పెట్రోల్ బంకుల్లో ఫుల్ చేయించుకుని అక్కడే సిగిరెట్లు బీర్లు తదితర ఆహార పదార్ధాలని కొనుక్కుని వెళ్ళేవారు. ఆస్ట్రియా సరిహద్దు నుండి స్విట్జెర్లాండ్ లోకి ప్రవేశించగానే వర్షం చినుకులు ప్రారంభం అయ్యాయి. చిన్న చిన్న ఊర్లు , ఎటు చూసినా పచ్చటి పొలాల మధ్య నుండి దాదాపు గంటన్నర ప్రయాణించాక రైన్ ఫాల్స్ జలపాతం దగ్గరకి చేరుకున్నాం. 

అప్పటికే సాయంత్రం సమయం 5 గంటలు అయ్యింది.అక్కడ అన్నీ టూరిస్ట్ బస్సులు , కార్లు పార్క్ చేసి ఉన్నాయి. మన దేశం నుండి అందించే స్విట్జెర్లాండ్ టూర్ పాకేజీ లో ఈ రైన్ ఫాల్స్ అనేది తప్పకుండా ఉంటుంది.ఇండియా నుండి థామస్ కుక్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ గ్రూపు ఒకటి కనిపించింది. అందులో తెలుగు వాళ్ళు , తమిళియన్స్ కనిపించారు.అప్పటికే ఆ గ్రూప్ టూర్ పూర్తవటంతో తిరుగు ప్రయాణంలో ఉన్నారు. దాదాపు 11000 ఏళ్ల క్రితం ఈ జలపాతం ఏర్పడింది. సంవత్సరానికి సగటున 750 క్యూబిక్ మీటర్ల నీరు ఈ జలపాతం గుండా ప్రవహిస్తుంది. మొదట్లో దీనిని వాణిజ్య అవసరాలకి కి కూడా ఉపయోగించారు.19 వ శతాబ్దం లో ఈ నీటిని ఆధారంగా చేసుకుని ఒక ఐరన్ కరిగించే కర్మాగారం నెలకొల్పారు. ఆ తరువాత ఇక్కడ ఒక హైడ్రో పవర్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం కోసం ఆ కంపెనీ దరఖాస్తు చేసుకున్నపుడు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ ప్రతిపాదన నిలిపి వేశారు. తదనంతరం ఆ ఐరన్ కంపెని కూడా మూత పడింది. తర్వాత ఎన్నో ప్రతిపాదనలు వచ్చినా ఇప్పటికీ పూర్తి స్థాయి హైడ్రో పవర్ జనరేషన్ ప్లాంట్ పెట్టలేకపోయారు. ఈ నీటి సామర్ధ్యంతో 50 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చెయ్యవచ్చు. కాని విలువ పరంగా చూస్తే టూరిజం ద్వారా వచ్చే ఆదాయం దీనికి 2 రెండు రెట్లు ఎక్కువ. బహుశా అందుకోసమే ఆ ప్రాజెక్టు ముందుకి కదల్లేదేమో.
జలపాతం దగ్గరగా వెళ్ళటానికి అక్కడ బోటు సర్వీస్ లు ఉన్నాయి. కాని 5.30 వరకు మాత్రమె ఈ సర్వీసులు ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి ఆఖరి బోటు వెళ్ళిపోయింది. అయినా కూడా ఒక కిలోమీటరు చుట్టూ నడిచి మెట్లు ఎక్కితే జలపాతపు పై భాగాన్ని దగ్గరగా చూడవచ్చు. మేము అలా ఫోటోలు తీసుకుంటూ పై భాగానికి చేరుకున్నాము. నీళ్ళు భీకర శబ్దంతో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా 1921 లో ఒక్కసారి మాత్రమే ఈ జలపాతంలో తక్కువ ప్రవాహం నమోదు అయ్యిందట. 1965 లో అత్యంత ఎక్కువ ప్రవాహం 1250 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహించింది. అప్పటికే చీకటి పడటం ప్రారంభమైంది. 

మేము రాత్రికి హోటల్ కూడా బుక్ చేసుకోలేదు. మార్చిన్ కూడా స్విస్ లో చూడదగిన ప్రదేశాలన్నీ గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాయని చెప్పాడు. జురిచ్ లో మేము బస చేసినా అక్కడ చూడదగిన ప్రాంతాలు ఏమి లేవు. స్విస్ అందాలన్నీ ఇంటర్ లాకేన్ మరియు ఇతర గ్రామ ప్రాంతాల్లోనే బావుంటాయి. అక్కడినుండి జురిచ్ మీదుగా పారిస్ వెళ్దామని మార్చిన్ ప్రతిపాదించాడు. కాని నేను వారించాను అంత దూరం నిద్ర లేకుండా డ్రైవింగ్ చెయ్యటం కష్టం, జురిచ్ లో బస చేద్దాము అని. కాని మార్చిన్ వినలేదు , రేపు ఉదయానికల్లా పారిస్ చేరుకోవాలని , డ్రైవింగ్ విషయం తనకి వదిలేయమన్నాడు. కాని ఆ తరువాత తెలిసింది అతని డ్రైవింగ్ కెపాసిటీ ఏమిటో.మేము ఒక పక్క నిద్రపోతూ ఉంటె కూడా అత్యంత జాగ్రత్తగా కంటి మీద కునుకు అనేది రాకుండా కార్ నడిపేవాడు. యూరోపియన్లు చాలా జాగ్రత్త పరులు, సామర్ధ్యం లేకుండా ఎటువంటి సాహసాలకి ఒడిగట్టరు. ఇక్కడ డ్రైవింగ్ నిబంధనలు కూడా అలాగే ఉంటాయి. సరకులు రవాణా చేసే ట్రక్కులు , ప్రయాణీకులని చేరవేసే బస్సులు రోజుకి 8 గంటలకి మించి డ్రైవింగ్ చెయ్యకూడదు. ఒకవేళ అలా చేసినా ఆ వాహనాల్లో ఉన్న సెక్యురిటి సిస్టం లో రికార్డ్ అయిపోతుంది. అందుకే 8 గంటలు డ్రైవ్ చెయ్యగానే ఎక్కడో ఓ చోట ఆపేసి రెస్ట్ తీసుకుంటారు.ఎంత అవసరం ఉన్నా సరే ఇంజిన్ కూడా స్టార్ట్ చెయ్యరు. రైన్ ఫాల్స్ నుండి జురిచ్ 50 కిలోమీటర్లు అక్కడినుండి బయలుదేరితే గంట లోపల జురిచ్ చేరుకోవచ్చు. మేము జురిచ్ చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది.

2008 వరకు కూడా స్విట్జెర్లాండ్ కి వేరే వీసా తీసుకోవాల్సి వచ్చేది. 2004 లోనే యూరోపియన్ యూనియన్ లో చేరినా కొంత కాలం వీసా వేరుగానే ఉండేది. మా కారుని ఎక్కడైనా పార్క్ చేసి నడుస్తూ నగరాన్ని చూడాలని అనుకున్నాం. జురిచ్ లో వాకింగ్ టూర్ అని ఉంటుంది. మొత్తం నడుస్తూనే పాత నగరాన్ని , కొత్త నగరాన్ని  చూడవచ్చు. దానితోపాటు బోటు టూరు ఉంటుంది. నగరం మధ్యలో ఉండే లిమ్మట్ నది అన్ని ప్రదేశాలని కలుపుతూ ఉంటుంది. దాదాపు జురిచ్ అంతా ఈ నది కి అటు ఇటు ఉంటుంది. ఈ బోటుకి ట్రాము కలిపి ఒకే టిక్కెట్టు ఉంటుంది. అవసరమైన బోటు స్టేషన్ల దగ్గర దిగి నగరంలో ట్రాము ఎక్కి అక్కడి ప్రదేశాలు చూడవచ్చు. కార్ పార్కింగ్ కోసం ప్రత్యేకమైన భవనాలు ఉంటాయి, ఎక్కడికక్కడ పార్కింగ్ బోర్డులు కనిపిస్తుంటాయి. మేము ఒక ప్రైవేటు కార్ పార్కింగ్ చూసుకుని అందులో కార్ పార్క్ చేశాము. స్విస్ అధికారిక కరెన్సీ స్విస్ ఫ్రాంకులు. గంటకు 4 స్విస్ ఫ్రాంకులు పార్కింగ్ ఫీజు. అక్కడ ఆటోమాటిక్ వెండింగ్ మెషిన్ కేవలం ఫ్రాంకులు మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ బయటకి వచ్చి మా దగ్గరున్న యూరోలతో ఫ్రాంకులని మార్చుకున్నాం.

 ఇక అక్కడినుండి నడుస్తూ సిటీ అంతా చూసుకుంటూ లిమ్మట్ నది ఒడ్డున కాసేపు అలా కూర్చున్నాం. జురిచ్ అంతా మేము రాత్రి వేళలోనే చూడటం జరిగింది. జురిచ్ లో కత్తులు , చాకులు చాలా ఫేమస్ victronix అనేది మంచి బ్రాండ్ . మార్చిన్ వాళ్ళ నాన్న తన మనుమడికి ఆ నైఫ్ ఒక్కటి కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు. జూరిచ్ వచ్చీ రాగానే మాక్సిం వాళ్ళ నాన్న ని అడగటం మొదలు పెట్టాడు. అక్కడొక షాపింగ్ సెంటర్ లో ఆ నైఫ్ ఒక్కటి కొన్నాడు.

విండో షాపింగ్ లో వాచీలు , జ్యుయలరి అన్నీ చూసుకుంటూ దాదాపు 2 గంటలు అక్కడే గడిపాము. రోడ్ పై ఒక పక్కగా ఉన్న బావిలో అందరూ చిల్లర వేయటం గమనించాము. కాని ఎందుకో అర్ధం కాలేదు. ఇక్కడ అధికారిక భాష జర్మన్. ఫ్రెంచ్, ఇటాలియన్ , లాటిన్ భాషలు కూడా ఎక్కువగా మాట్లాడతారు.అప్పటికి సమయం 9 గంటలు అయ్యింది. ఎవరికీ పెద్దగా ఆకలి లేకపోవటంతో దార్లో తిందాములే అని పార్కింగ్ లో కార్ తీసుకుని పారిస్ వైపుగా మా ప్రయాణం ప్రారంభమైంది. 

Friday, October 16, 2015

నా ఐరోపా యాత్ర - 21 (ఆస్ట్రియా )

లిచ్టేన్ స్టెయిన్ నుండి మా తరువాతి ప్రయాణం ఆస్ట్రియా లోని రోల్స్ రాయ్స్ మ్యూజియం. ఈ మ్యూజియం ఒక ప్రైవేటు వ్యక్తిది. Franz Vonier అనే వ్యక్తి తనకున్న హాబీ తో దాదాపు 1000 రోల్స్ రాయస్ కార్లని సేకరించి మ్యూజియం గా ఏర్పాటు చేసాడు. ముందు రోజు రాత్రి మేము బస చేసిన హోటల్ లో ఈ మ్యూజియం తాలూకు వివరాలని చూడటంతో ఇది చూశాక అక్కడినుండి స్విట్జెర్లాండ్ వెళదామని అనుకున్నాం. లిచ్టేన్ స్టెయిన్ నుండి స్విట్జెర్లాండ్ వెళ్ళాలంటే ఆస్ట్రియా మీదుగానే వెళ్ళాలి. 

ఆస్ట్రియాలో మేము బస చేసిన హోటల్ 
 హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్,  ప్రపంచ ప్రఖ్యత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్,  సంగీత విద్వాంసుదు మోజార్ట్,  ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎర్పిన్ ష్రోడింగర్ లతో పాటు నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన దేశం ఇది. రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన ఒక నియంత జన్మించిన ప్రదేశం ఇప్పుడు ప్రశాంతత కి , ఆధునిక సంస్కృతి కి మారుపేరు గా విలసిల్లుతోంది.అన్నట్లు మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది సంఘటన జరిగింది ఈ దేశం కారణంగానే. బోస్నియా కి స్వాతంత్రం కావాలంటూ జూన్ 28 1914 న సెర్బియాకి చెందిన గావ్రిలో ప్రిన్సిప్ అనే పందొమ్మిదేళ్ల కుర్రాడు ఆస్ట్రియా ప్రభువు ఫ్రాంజ్ ఫెర్టినాండ్, ఆయన భార్య సోఫీని కాల్చి చంపాడు. ఈ ఘటన బోస్నియా రాజధాని సరయేవోలో జరిగింది. బోస్నియాకు ఆస్ట్రియా నుంచి స్వాతంత్రం కావాలని కోరుతూ ఈ కాల్పులు జరిపాడు ప్రిన్సిప్. అదే మొదటి ప్రపంచ యుద్ధంలో పేలిన తొలి తూటా.. అదే మొదటి ప్రపంచ యుద్ధానికి తొలి అడుగు.ఈఘటన రాజేసిన చిచ్చు.. సరిగ్గా నెలరోజులకు అంటే జూలై 28, 1914న ప్రపంచ మానవ చరిత్రకే ఓ చెరగని గాయంగా మారిన మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది. తద్వారా రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఈ దేశం నాజీలకి లొంగిపోయింది. తాను జన్మించిన ఈ దేశాన్ని జర్మనీ లో కలుపుకోవాలనేది హిట్లర్ ఆకాంక్ష. చెక్ రిపబ్లిక్ , జర్మనీ , హంగరీ , ఇటలీ , స్లోవేకియా , లిచ్టేన్ స్టెయిన్,స్లోవేనియా , స్విట్జెర్లాండ్ దేశాలు ఆస్ట్రియాకి సరిహద్దులుగా ఉన్నాయి. మేము చూసిన దేశాల్లో అత్యధిక పర్వత శ్రేణులు ఉన్న దేశం ఇది. ఆల్ఫ్స్ పర్వతాలు , హిమనీ నాదాలు దేశమంతా కనిపిస్తుంటాయి.

ఇళ్ళు కూడా పర్వత పాదాల్లో , కొన్ని పర్వతాల మీద విసిరేసినట్లు అక్కడొకటి , అక్కడొకటి కనిపించాయి. అసలు ఆస్ట్రియాలో ప్రయాణిస్తున్నంత సేపు ఆ ప్రకృతి రమణీయత మమ్మల్ని మరో లోకంలోకి తీసుకువెళ్ళింది. ఎటు చూసినా పచ్చిక బయళ్ళు , పచ్చటి కొండలు , ఆకులు అసలు కనపడని పూల తోటలు, అడవులు సైతం పద్దతిగా పెరిగినట్లు ఉన్నాయి. ఈ వాతావరణమే వీళ్ళ అదృష్టమేమో అనిపించింది.మన తెలుగు సినిమా పాటల కోసం దర్శక నిర్మాతలంతా వచ్చేది ఇక్కడికే. సినిమాల్లో పాటలలో కనిపించే ప్రకృతి అందాలన్నీ ఎక్కువ భాగం ఆస్ట్రియా లోనే చిత్రీకరించారు. ఇక్కడ అధికారిక భాష జర్మన్. స్లావెన్ క్రోషియన్ భాషలు కూడా మాట్లాడతారు. కరెన్సీ యూరో. ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం. ఇది దేశానికి ఒక మూలన ఉంటుంది.మేము ఈ నగరాన్ని చూడలేదు.

లిచ్టేన్ స్టెయిన్ నుండి రోల్స్ రాయస్ మ్యూజియం 50 కిలోమీటర్ల దూరంలో దోర్న్ బిర్న్ అనే ప్రాంతంలో ఉంది. ఒక పాత బట్టలమిల్లు ఉన్న ప్రదేశంలో ఈ మ్యూజియం నెలకొల్పారు. మేము వెళ్తున్న దారిలో చుట్టూ ఎత్తైన వృక్షాలు తో పాటు వీనులవిందుగా సవ్వడి చేస్తున్న జలపాతాల హోరు వినిపిస్తోంది. దాదాపు మేము వెళ్తున్న ప్రాంతం అంతా కొండలు , జలపాతాల మధ్యలోనే ఉంది. మార్చిన్ వాళ్ళ అబ్బాయి మాక్సిమ్ జలపాతం చూస్తానని మారాం చెయ్యటంతో ఒకచోట పక్కగా కారుని ఆపాడు మార్చిన్. అక్కడ దిగి కాసేపు ఆ జలపాతాన్ని చూస్తూ ఫోటోలు తీసుకున్నాం. తరువాత అక్కడినుండి కొద్ది దూరంలో ఉన్న మ్యూజియం ని చేరుకున్న మాకు నిరాశే ఎదురైంది. ఆరోజు మ్యూజియం కి సెలవు. మా ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లైంది. ఇక ఆ మ్యూజియం ముందు ఫోటో తీసుకుని వెనక్కి బయలుదేరాం. అప్పటికే సమయం మధ్యాహ్నం 2.30 అయ్యింది. అక్కడినుండి మా ప్రయాణం స్విట్జెర్లాండ్ లో ఉన్న రైన్ ఫాల్స్ ( Rhine Falls). 

మార్చిన్ మరియు వాళ్ళ అబ్బాయి మాక్సిమ్ తో ఆస్ట్రియాలో మేము బస చేసిన హోటల్  దగ్గర

Tuesday, July 21, 2015

నా ఐరోపా యాత్ర - 20 (లిచ్టేన్ స్టెయిన్)

​ఇక ఆరోజుకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని వాడుజ్ నుండి షాన్ పట్టణం మీదుగా ఆస్ట్రియా బోర్డర్ చేరుకున్నాము. 28 రాత్రికి ఆస్ట్రియాలో జుగెన్ బెర్గ్ లో బస చేసాం. మరుసటి రోజు ఉదయం బయలుదేరి షాన్ పట్టణానికి చేరుకున్నాం. వాడుజ్ కంటే కూడా షాన్ ఎంతో అందంగా కనిపించింది. అసలు అవి రోడ్లా లేక అద్దాలో తెలియలేదు. పార్కింగ్ మొత్తం భూమిలోపలే ఉంది. ఇక్కడ రోడ్ల మీద పాదచారులకే ప్రాధాన్యత ఎక్కువ. ఎవరైనా రోడ్డు దాటటానికి నిలబడితే చాలు,వాహనాలన్నీ ఆగిపోతాయి. పాదచారులు రోడ్డు దాటాకే కార్లు ముందుకి కదులుతాయి. ఇక్కడ 18 వ శతాబ్దంలో నిర్మించిన ఒక చర్చి ఉంది. ఆ చర్చి లోపల కొవ్వొత్తి వెలిగించి జీసస్ ని స్మరించుకున్నాం. ఇక్కడ నైట్ లైఫ్,పబ్ కల్చర్ ఎక్కువే. చాలావరకు పబ్బులు కనిపించాయి. యూరప్ లో ఉన్న అన్ని దేశాల లాగే ఇక్కడ కూడా రెస్టారెంట్లు అన్ని ఆరుబయటే సర్వ్ చేస్తున్నాయి. వేసవిలో ఇక్కడ ప్రజలంతా ఆరుబయట తినటానికి, తాగటానికి ఇష్టపడతారు.  బస్సు లలో ప్రయాణించేవారు తక్కువే అయినా Liechenstain Bus పేరుతో ప్రభుత్వం ఒక ట్రాన్స్ పోర్ట్ సంస్థ ని నడుపుతోంది. దేశంలో ఉన్న 11 నగరాలతో పాటు స్విట్జెర్లాండ్ మరియు ఆస్ట్రియా లకి బస్సు సౌకర్యం ఉంది. మేము చూసిన రెండు రోజులు బస్సులన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి. షాన్ బస్సు స్టేషన్ కొంచెం పెద్దది.

మేము అక్కడ ఉండగా ఒక వ్యక్తి ఇండియన్ లా అనిపించటంతో పలకరించాను. అతను ముంబై కి చెందిన వాడిగా చెప్పాడు. లండన్ లో చదువుకుంటున్నా అని ఈ దేశం గురించి తెలుసుకుని చూడటానికి వచ్చానని చెప్పాడు. లండన్ నుండి ఫ్లైట్ లో జురిచ్ వచ్చి అక్కడనుంచి బస్సు లో వచ్చాడట. ఎందుకంటే లిచ్టేన్ స్టెయిన్ లో ఎయిర్ పోర్ట్ లేదు. ప్రపంచంలో ఎయిర్ పోర్ట్ లేని అయిదు దేశాల్లో ఇదొకటి. కాని హెలిపాడ్ మాత్రం ఉంది. అండోరా,మొనాకో, సాన్ మారినో మరియు వాటికన్ సిటీ దేశాల్లో కూడా ఎయిర్ పోర్ట్ లేదు. ఇక సిటీ మధ్యలో గుటెన్ బర్గ్ అనే పేరుతో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ కనపడింది. బహుశా ఈ దేశంలో ఉన్న ఏకైక ముద్రణాలయం ఇదేనేమో. నేను వృత్తి రీత్యా ప్రింటింగ్ రంగంలో పనిచేస్తుండటంతో ఆసక్తిగా ఆ ప్రెస్ లోపలి వెళ్లి నన్ను పరిచయం చేసుకుని అక్కడ ఒక ఫోటో తీసుకున్నాను.

ఇక అక్కడినుంచి బయలుదేరి వాడుజ్ చేరుకున్నాం. వాడుజ్ లో బస్సు స్టేషన్ నుండి టూరిస్ట్ లకోసం ఒక టాయ్ ట్రైన్ ఉంది. పది యురోలు చెల్లిస్తే ఆ టాయ్ ట్రైన్లో 40 నిమిషాల్లో దేశం మొత్తం చూసేయచ్చు. మాకు కార్ ఉంది కాబట్టి మేము అది ఎక్కలేదు. ఇక అక్కడినుంచి పార్లమెంట్ కి చేరుకున్నాం. ఈ భవనం పెద్దదేమీ కాదు. కేవలం 11 నగరాలున్న ఈ దేశానికి సరిపోను ఉంది. ఈ దేశం రాచరిక పాలనతో పాటు ప్రజాస్వామ్యబద్ధమైన పార్లమెంట్ వ్యవస్థని కూడా కలిగి ఉంది. రాజుతో పాటు ప్రధాన మంత్రి కూడా ఉంటాడు. ప్రస్తుతం ఉన్న రాజు హాన్స్ ఆడమ్ 1989 నుండి పదవిలో ఉన్నాడు. కింగ్ పాలస్ కొండపైనే ఉంటుంది. అక్కడినుంచే రాజు దేశం మొత్తాన్ని చూడవచ్చు. ఐదు బిలియన్ డాలర్ల సంపదలో ప్రపంచంలో ఆరవ సంపన్నుడు హాన్స్ ఆడం. 

పార్లమెంట్ కి దగ్గరిలోనే పలు బాంకులు టూరిస్ట్ ఆఫీసులు ఉన్నయి. ఏకీకృత వీసా విధానం కాబట్టి యూరప్ లో ఎన్ని దేశాలు తిరిగినా ఆయా దేశాల వీసా స్టాంపింగ్ మన పాస్ పోర్ట్ మీద ఉండవు. కాని ఇక్కడ వీసా ఆఫీసులో కావాలంటే ఆ స్టాంప్ మన పాస్పోర్ట్ మీద వేయించుకోవచ్చు. నా శ్రీమతి ఇది చూసి మన పాస్ పోర్ట్ మీద వేయిద్దాం అంది. మన విజిట్ కి గుర్తుగా ఉంటుందని. కాని ఒక్కొక్క పాస్ పోర్ట్ కి రెండున్నర యూరోలు చెల్లించాలి. మా పాస్ పోర్ట్ ల మీద ఆ స్టాంప్ వేయించుకున్నాం. 
ప్రపంచంలో అతితక్కువ నిరుద్యోగం ఉన్న దేశాల్లో ఇది రెండవది. ఇక్కడ నిరుద్యోగుల శాతం కేవలం 1.5 %. అతితక్కువ అప్పు ఉన్న దేశాల్లో కూడా లిచ్టేన్ స్టెయిన్ దే అగ్రస్థానం. ప్రపంచంలో మరే ఇతర దేశంతో వీళ్లకి శత్రుత్వం లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా తటస్థంగా ఉన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. 
ఈ దేశంలో ఉన్న సౌకర్యాలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో నివసిస్తున్న ప్రజలున్న దేశాల్లో ఈ దేశం ఒకటి.మాకు అన్నీ లగ్జరీ కార్లు తప్ప కనీసం మీడియం సైజు కార్లు కూడా కనపడలా. 

కేవలం 36000 మంది జనాభానే కదా అని తక్కువ అంచనా వెయ్యటానికి లేదు. ప్రపంచం లో ఉన్న ప్రముఖ కార్ కంపెనీల షోరూం లు అన్నీ ఈ దేశంలో ఉన్నాయి. అవన్నీ చూసి మేము ఆశ్చర్యపోయాం. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఇక్కడ మిగతా దేశాలతో పోలిస్తే టాక్స్ చాలా తక్కువ. కాబట్టి చుట్టు పక్కల దేశాల వాళ్ళు చాలామంది కార్లు ఇక్కడే కొంటారట. స్విట్జెర్లాండ్ లాగే ఇక్కడ బ్యాంకుల్లో కూడా మీరు డిపాజిట్ చేసే డబ్బుకి లెక్కలు అడగరు. ఎంత డబ్బైనా బాంక్ లో దాచుకోవచ్చు. కార్పోరేట్ టాక్స్ కూడా తక్కువే అందుకే చాలా కంపెనీలు ఇక్కడ ఆఫీసులు తెరిచాయి. 

ఇక్కడ ఉద్యోగులపై ఉండే ఆదాయపు పన్ను కూడా మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అన్నిటినీ మించి ప్రకృతి ప్రసాదించిన అద్భుత దృశ్య కావ్యం ఈ దేశం.  ఇక ఆ రోజుకి వాడుజ్ లో ఉన్న మ్యూజియం చూసాం. ఆ దేశానికి సంభందించిన పలు పురాతన విశేషాలను అందులో పొందు పరచారు. ఇక అక్కడినుంచి ఆ దేశాన్ని వదలలేక కొంచెం మిస్ అవుతున్నామన్న దిగులుతోనే జురిచ్ కి బయలుదేరాం. కాని ఎందుకో ఐరోపాలో ఎన్ని దేశాలు చూసినా మాకు మాత్రం ఈ దేశమే బావుందనిపించింది.

Sunday, July 19, 2015

నా ఐరోపా యాత్ర - 19 (లిచ్టేన్ స్టెయిన్)

వెనిస్ చూసి వచ్చిన 15 రోజులకి మా అసలైన ఐరోపా యాత్ర ప్రారంభమైంది. మాతో పాటు నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ క్రదోహ దంపతులు వారి అబ్బాయి మాక్సిమ్ తో కలిసి కారులో 15 రోజుల పాటు జర్మనీ, ఆస్ట్రియా, లిచెన్ స్టైన్, స్విట్జెర్లాండ్, ఫ్రాన్స్, లక్సెం బర్గ్ , బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో మేము సాగించిన దాదాపు 4000 కిలోమీటర్ల ప్రయాణం ఇది. యూరప్ లో ఉన్న ఒకానొక అతి చిన్న దేశం లిచ్టేన్ స్టెయిన్. 

ఎప్పుడూ అందరూ వెళ్ళే పారిస్, స్విట్జెర్లాండ్ కాకుండా ఇంకేమన్నా కొత్త దేశాలున్నాయేమో అని నా శ్రీమతి ఇంటర్నెట్ లో వెతికి ఈ దేశపు వివరాలని తెలుసుకుంది. ఆస్ట్రియాకి స్విట్జెర్లాండ్ కి మధ్య కేవలం 61 చదరపు మైళ్ళ వైశాల్యంతో ఉన్న ఈ అతిచిన్న దేశం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కలగటంతో ముందుగా ఈ దేశాన్ని చూసి అక్కడ నుంచి స్విట్జర్లాండ్ మీదుగా మిగతా దేశాలన్నీ వెళదామని ప్లాన్ చేసుకున్నాం. సాధారణంగా యూరప్ టూర్ కి మే మొదటివారం నుండే అనుకూలం . అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ దేశాలన్నీ మంచుతో కప్పబడే ఉంటాయి.శీతా కాలం తరువాత వచ్చే వసంతాన్ని చూడటానికి రెండుకళ్ళూ చాలవు. భూమి అంతా ఆకుపచ్చని దుప్పటి కప్పుకున్నట్లు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి నయనానంద కరంగా ఉంటుంది. 2011 డిసెంబర్ నుండి  లిచ్టేన్ స్టెయిన్ Schengen దేశాలతో ఒకటిగా కలిసింది. దేశపు సరిహద్దుల్ని తొలగించింది కూడా అప్పుడే. ఐరోపా యూనియన్లో ఆఖరున 26 వ దేశంగా సభ్యత్వం పొందింది. 


 పోలాండ్ లో నేనుండే ప్రాంతం నుండి లిచ్టేన్ స్టెయిన్ 930 కిలోమీటర్లు,అక్కడనుండి స్విట్జెర్లాండ్ 150 కిలోమీటర్లు. పోలాండ్ నుండి జర్మనీలో బెర్లిన్ మీదుగా 880 కిలోమీటర్లు ప్రయాణించి ఆస్ట్రియాలో మరో 40 కిలోమీటర్లు ప్రయాణించాక ఆ దేశపు సరిహద్దు నుంచి పదికిలోమీటర్ల లోపే లిచ్టేన్ స్టెయిన్ రాజధాని వాడుజ్ చేరుకోవచ్చు. ఇక్కడి రోడ్లమీద సగటు వేగం గంటకి 120 కిలోమీటర్లు. వెయ్యి కిలోమీటర్లు ఏకదాటిన ప్రయాణించినా మనకి అలసట అనేది ఉండదు. ఎక్కడా చిన్న కుదుపు కాని గతుకులు కాని ఉండవు. హైవేలు అన్నీ ఇరుపక్కలా బారికేడ్స్ తో ఉండటంతో రోడ్ మధ్యలోకి ఎవరూ వచ్చే అవకాశం కూడా లేదు.దూరం ఎక్కువైనా కార్లో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తుంటే ఆ సంతోషమే వేరు. అందుకే ఏప్రిల్ 28 తెల్లవారిఝామున కార్లో బయలుదేరాం. చాలా మంది విదేశాలకి వెళ్ళినపుడు కూడా ఇండియన్ ఫుడ్ కోసం వెతుకుతుంటారు. స్విట్జెర్లాండ్ దాకా వెళ్లి ఇడ్లి తినాలా అనేది నా అభిప్రాయం. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళేది ఆ ప్రాంతపు విశేషాలు, ఆహారపు అలవాట్లు తెలుసుకోవటానికి,అలాంటప్పుడు అక్కడ లభించే ఆహారాన్ని రుచి చూడాలి తప్ప,మన ఆవకాయన్నం, పులిహోరా అవసరమా అనేది నా ఆలోచన. నా శ్రీమతి కూడా నాతొ ఏకీభవించటంతో అలాంటి ఫుడ్ పార్సిల్ ఏమి లేకుండానే బయలుదేరాం. ఆ రోజు వర్షం పడుతుండటంతో కొంచెం నెమ్మదిగానే డ్రైవ్ చేసుకుంటూ జర్మనీలోని బెర్లిన్ , న్యురేం బర్గ్ మీదుగా మధ్యాహ్నం మూడు గంటల కల్లా జర్మనీ- ఆస్ట్రియా సరిహద్దుకి చేరుకున్నాం. ఇతర దేశాల కార్లు ఆస్ట్రియా రోడ్లపై ప్రయాణించాలంటే టోల్ చెల్లించాలి. టోల్ రుసుము వారానికి 8 యూరోలు. బోర్డర్ దగ్గర ఆగి ఆ రుసుము చెల్లించి రసీదు తీసుకున్నాం. జర్మనీ ని ఆస్ట్రియా ని వేరు చేస్తూ మధ్యలో ఆల్ఫ్స్ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల కిందుగా 2 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ గుండా ప్రయాణించి ఆస్ట్రియాలో కి ప్రవేశించాం. ఆస్ట్రియా నుండి స్విట్జెర్లాండ్ వెళ్ళే హైవే పై 30 కిలోమీటర్లు ప్రయాణించాక ఫెడ్రిక్ అనే ప్రాంతం నుండి కుడివైపు పది కిలోమీటర్లు ప్రయాణించాక ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల మధ్య పారే రైన్ నది అందాల్ని ఆస్వాదిస్తూ fürstentum of Liechtenstein అనే బోర్డ్ ని దాటుకుని లిచ్టేన్ స్టెయిన్ రాజధాని వాడుజ్ చేరుకున్నాం.
fürstentum అంటే జర్మన్ భాషలో రాజ్యం అని అర్ధం.ఈ దేశం రాచరిక వ్యవస్థని కలిగి ఉంది కనుక అలా పిలుస్తారు. ఈ దేశానికి తూర్పున ఆస్ట్రియా, పడమర,దక్షిణాన స్విట్జెర్లాండ్ సరిహద్దు దేశాలు. స్విట్జెర్లాండ్ ని, లిచ్టేన్ స్టెయిన్ తో వేరు చేస్తూ రైన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దేశంలోకి వెళ్ళాలంటే ఈ నదిపై ఉన్న వంతెన మీదుగానే వెళ్ళాలి. లిచ్టేన్ స్టెయిన్ యూరప్ లో నాలుగవ అతి చిన్నదేశం(వాటికన్ సిటీ,మొనాకో,సాన్ మారినో వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి) మరియు ప్రపంచం లో ఆరవ చిన్న దేశం. దీని జనాభా కేవలం 36000. దేశం మొత్తం దాదాపు కొండవాలులోనే ఏటవాలుగా ఉంటుంది.

నగరంలోకి ప్రవేశించగానే అసలు మనం ఉన్నది భూమి మీదేనా అన్న భావన కలిగింది. ఎదురుగా పచ్చటి ఆల్ఫ్స్ పర్వతాలు, వాటి మీద అక్కడక్కడా ఇళ్ళు. స్వర్గం ఎలా ఉంటుందో ఎవ్వరూ చూడలేదు కాని,మాకు మాత్రం నిజంగా ఇదే స్వర్గమేమో అనిపించింది. రోడ్ల వెడల్పు తక్కువైనా అద్దాల్లా మెరిసిపోతూ మాకు స్వాగతం పలికాయి. అప్పటికే సాయంత్రం 4 గంటలు అయింది. యూరప్ లో రాత్రి 9 గంటలదాకా సూర్యుడు ఉంటాడు. పదిగంటలకి కాని చీకటి పడదు. ఈ దేశంలో ఉన్న పట్టణాల సంఖ్య పదకొండు. వాడుజ్ అనే పట్టణం దేశానికి రాజధాని. కాని ఎక్కువమంది నివసించేది మాత్రం షాన్ అనే పట్టణంలో. పది చదరపు మైళ్ళ వైశాల్యం, 5800 మంది జనాభాతో షాన్ పట్టణం అతి పెద్ద నగరంగా ఉంది. దేశరాజధాని వాడుజ్ లో 5300 మంది నివసిస్తారు. కేవలం నాలుగు పట్టణాలు మాత్రమే నేలమీద ఉంటాయి. మిగతా ఏడు పట్టణాలు కొండవాలులో మరియు కొండపైనే ఉంటాయి. ట్రైసన్ బెర్గ్ అనే పట్టణం పూర్తిగా కొండపైనే ఉంటుంది. ఎక్కువ టూరిస్టులు బస చేసేది ఇక్కడే. ఇకడ్నుంచి  చూస్తే దేశం మొత్తాన్ని ఒకే ఫ్రేం లో బంధించేయచ్చు. 
మా ప్లాన్ ప్రకారం ఆ రాత్రికే బయలుదేరి స్విట్జెర్లాండ్ లో జురిచ్ చేరుకొని బస చేయాలి. కాని ఎందుకో ఈ దేశాన్ని వదిలి వెళ్ళ బుద్ధి కాలేదు. ట్రైసన్ బెర్గ్ లో బస చేద్దామని హోటల్ కోసం వెతికాం. ఆరోజు ఆదివారం కావటంతో టూరిస్ట్ లతో హోటల్స్ అన్నీ నిండిపోయాయి. ఒక హోటల్ రిసెప్షనిస్ట్ ఆస్ట్రియాలో ఒక హోటల్లో ఖాళీ ఉందని చెప్పి అడ్రస్ తో సహా రాసి ఇచ్చాడు. ఇక్కడ మనుషులు ఎంత మంచివారంటే,మేము ఏదైనా అడిగితే వారికి ఇంగ్లీష్ రాకపోయినా మాకు ఎలాగోలా సహాయం చెయ్యాలనే తపన మమ్మల్నెంతగానో ఆకట్టుకుంది.అమెరికాలో స్థిరపడినంతగా మనవాళ్ళు యూరప్ లో లేకపోవటానికి ముఖ్యకారణం భాష మరియు వాతావరణం అనేది నా అభిప్రాయం. లిచ్టేన్ స్టెయిన్ అధికారిక భాష జర్మన్.జర్మన్ తో పాటు అల్మీనిక్ భాష కూడా మాట్లాడతారు. మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఈ దేశం పూర్తిగా ఆస్త్రియాతో సంభంధాలు కలిగి ఉండేది. ఆతరువాత స్విట్జెర్లాండ్ కి దగ్గరగా జరిగింది. ఇక్కడ అధికారిక కరెన్సీ కూడా స్విస్ ఫ్రాంకు లే. కాకపొతే యూరో కూడా చెల్లుబాటు అవుతుంది. ప్రతి షాపులో యూరో అయితే ఎంత చెల్లించాలొ, ఫ్రాంకు లైతే ఎంత చెల్లించాలొ ఉంటుంది.మొదటగా 1608 లో హోలీ రోమన్ ఎంపైర్ ఈ దేశాన్ని నిర్మించాడు. షెల్లేన్ బెర్గ్ మరియు వాడుజ్ పట్టణాలు మాత్రమే అప్పుడు నిర్మించబడ్డాయి. మిగతావన్నీ తరువాతి కాలంలో విస్తరించారు. తదనంతరకాలంలో రోమన్ సామ్రాజ్యం పతనం అవటంతో 1815 జూన్ నుండి జర్మన్ ఫెడరేషన్ లో ఉంది. ఆ తరువాత 1866 లో జర్మనీ నుండి వేరు పడి ఆస్త్రియాతో కలిసి స్వతంత్ర రాజ్యంగా ఉంది.మనదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్ట్ 15 రోజు ఈ దేశానికి స్వతంత్రం రావటం విశేషం. కాబట్టి ఆ రోజుని జాతీయ దినంగా జరుపుకుంటారు.1923 నుండి స్విట్జెర్లాండ్ తో సన్నిహితంగా ఉండటంతో దాదాపుగా ఆ సంస్కృతే ఇక్కడ కూడా కన్పిస్తుంది.  1836 లో ఇక్కడ తోలి ఫాక్టరీ ని నిర్మించారు. పింగాణి టైల్స్ ని తయారు చేసేవారు.ఇప్పటికీ ఇదే పెద్ద పరిశ్రమ. ఇక ఆరోజుకి ట్రైసన్ బెర్గ్ మరియు కొండ పై ఉన్న మరో చిన్నగ్రామంతో పాటు రాజు నివసించే పాలస్ కూడా చూసాం.
కొండలమీద ఆవులతోపాటు,మేకలు గొర్రెలు కూడా మేత మేస్తూ కనిపించాయి. కొండమీదకి ఎక్కుతున్నపుడు, దిగుతున్నప్పుడు రోడ్ కొంచెం భయంగా అనిపించినా అక్కడున్న ట్రాఫిక్ క్రమశిక్షణ వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవట. అన్ని ఇళ్ళు ఒకేచోట కాకుండా విసిరేసినట్లు అక్కడొకటి అక్కడొకటి కొండ మీద నిర్మించుకున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువ ప్రైవసీ ని ప్రశాంతతని కోరుకుంటారు. ఇక కిందకి దిగాక వాడుజ్ లో ఉన్న మ్యూజియం కి వెళ్ళాం. అప్పటికే సమయం మించిపోవటంతో ఆ రోజు ప్రవేశం లేదు.ఇక అక్కడనుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఆస్ట్రియా బోర్డర్ ఉంది. మేము వచ్చిన దారి కాకుండా ఆస్ట్రియా లో ప్రవేశించటానికి ఇది మరొక సరిహద్దు. 

Friday, July 3, 2015

నా ఐరోపా యాత్ర - 18 (వెనిస్)

కొత్తగా పెళ్ళైన జంటకి మొదటి డ్రీమ్ హనీమూన్ ప్రదేశం అంటే  వెనిస్ నగరమే. నేను బ్రహ్మ్మచారిగా సంవత్సరం పాటు యూరప్ లో నివసించినా , వెనిస్ వెళ్ళగల అవకాశం ఉండి కూడా అక్కడికి వెళ్ళలేదు. పెళ్ళయ్యాక సతీ సమేతంగా మాత్రమే  వెళ్ళాలనుకున్న నగరం వెనిస్. తరువాతి కాలంలో అన్ని దేశాలు ఏకకాలం లో చుట్టేసినా ,ఇటలీలో ఉన్న  వెనిస్ నగరాన్ని మాత్రం ప్రత్యేకంగా సందర్శించాము. మేము ఉండే పోలాండ్ కి వెనిస్ 1100 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే కష్టం. అలా అని మిగతా దేశాల సందర్శన తో పాటు కలుపుకుంటే చాలా వరకు సమయం డ్రైవింగ్ కే వృధా అవుతుంది. అందుకే ఈ ఒక్క నగరాన్ని ప్రత్యేకంగా చూడాలని అనుకున్నాం. ఏప్రిల్ 7, 2013 బెర్లిన్ లో బాద్షా చూసిన వారానికి అంటే సరిగ్గా ఏప్రిల్ 13 న వెనిస్ వెళదామని నిర్ణయించుకున్నాం. మేము పోలాండ్ లో ఉంటున్నా , మేము ఎక్కువగా ఉపయోగించేది జర్మనీ లో ఉన్న బెర్లిన్ ఎయిర్పోర్ట్. బెర్లిన్ లో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయ విమానాలు వచ్చే తెగెల్ ఎయిర్పోర్ట్. ఇంకోటి యూరప్ దేశాలకు చిన్న విమానాలు నడిపే శేనిఫోల్ద్ విమానాశ్రయం. 13 వ తేది ఉదయం 6 గంటలకి ఇక్కడినుండి వెనిస్ మార్కోపోలో కి ఈజీ జెట్ విమానం ఉంది. మేము బెర్లిన్ వెళ్ళాలంటే మింజుజేర్జ్ నుండి 2 గంటలు పడుతుంది. నా కొలీగ్ రఘునాథ్ బాబు మమ్మల్ని బెర్లిన్ లో డ్రాప్ చేస్తానని చెప్పాడు. మా ఆఫీస్ లో పనిచేస్తున్న భారతీయుల్లో కారు , డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది నాకు , రఘుకి మాత్రమే. అందుకే మిగతా వాళ్లకి ఏ సాయం కావాలన్నా మేమిద్దరమే వెళ్ళేవాళ్ళం. సరిగ్గా తెల్లవారు ఝామున 3 గంటలకి మింజు జేర్జ్ లో నేను , భార్గవి రఘు కార్ లో బయలుదేరాము. శేనిఫోల్ద్ విమానాశ్రయం బెర్లిన్ నగర సరిహద్దుల్లోనే ఉంది.5 గంటలకల్లా రఘు మమ్మల్ని డ్రాప్ చేసాడు. అనుకున్న సమయానికంటే గంట ఆలస్యంగా 7 గంటలకి ఈజీ జెట్ విమానం వెనిస్ వైపుగా టేక్ ఆఫ్ తీసుకుంది. సరిగ్గా గంటా నలభై నిమిషాల తరువాతా సముద్రానికి దగ్గరగా ఉన్న మార్కోపోలో విమానాశ్రయంలో దిగాం. నీటిలో తేలియాడే వెనిస్ నగరం ఉండే ప్రాంతం పేరు PIAZZALE ROMA. మార్కో పోలో నుండి ప్రతి పదినిమిషాలకి ఒక బస్ ఉంటుంది. అక్కడినుండి PIAZZALE ROMA 25 నిమిషాల ప్రయాణం. వెనిస్ నగరం అంతా నీళ్ళలో ఏమి ఉండదు PIAZZALE ROMA ప్రాంతం మాత్రం మనం విన్నట్లుగా నీళ్ళలో ఉంటుంది. నేను ముందుగానే హోటల్ బుక్ చేసుకోవటంతో ఆ హోటల్ ప్రతినిధి మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి బస్సు దగ్గరకి వచ్చాడు. మమ్మల్ని వెంటబెట్టుకుని అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న పెద్ద భవనం దగ్గరకి తీసికెళ్ళాడు. అసలు ఆ భవనాల తలుపుల ముందు మేము పిట్టల్లా ఉన్నాం. ఎన్నో ఏళ్ల క్రితం భారీ నిర్మాణంలా ఉంది. 4 అంతస్తులు లిఫ్ట్ లేకుండానే మెట్లు ఎక్కాం. అసలు ఆ భవనాలకి లిఫ్ట్ ఉండే అవకాశమే లేదు. 4 వ అంతస్తులో ఒక తలుపు తీసి మాకు తాళం ఇచ్చి ఆ వ్యక్తీ వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది విశాలమైన 4 బెడ్రూమ్స్ ఉన్న అపార్ట్మెంట్. అత్యంత పొందికగా ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చి ఉన్నాయి. 
 అప్పటికి సమయం ఉదయం 11 అయింది  ప్రయాణ బడలికగా ఉండటంతో కాసేపు విశ్రాంతి తీసుకుని కిందకి వచ్చి పిజ్జా తిని నీళ్ళలో తేలియాడే వెనిస్ నగర వీధుల్ని చూడాలనే ఉత్సాహంతో బయలుదేరాం. వెనిస్ ను క్రీ.శ 421 ప్రాంతంలో నిర్మించారు. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రం. తర్వాతి రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. పద్నాలుగో శతాబ్దంలో ఇక్కడ రెండు లక్షల మంది నివాసం ఉండేవారట. 1966 లో వచ్చిన వరద తాకిడికి వెనిస్ లో నీటిమట్టం మీటరు ఎత్తుకు పెరిగింది. అప్పటి నుంచీ అక్కడి జనాభా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు అసలు ఆ ఇళ్ళల్లో ఎవరూ నివసించటం లేదు. ఆ దీవి మొత్తం తిరగటానికి పడవలే ఆధారం ఇది దాదాపు 140 దీవుల సమూహం. ఒక దీవి నుండి మరో దీవికి పడవలో వెళ్ళటం అక్కడ దిగి కాసేపు ఆ ప్రాంతంలో గడిపి మళ్లీ అక్కడికి వచ్చే తరువాతి పడవ ఎక్కి వేరే దీవికి వెళ్ళటం. రోజుకి 11 యూరోలు కట్టి టికెట్ కొంటే ఆ రోజంతా ఆ దీవుల్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. నీళ్ళ ఒడ్డునే కట్టిన స్కూళ్ళు, ఆసుపత్రులు, ఆఫీసులు. ఇక్కడ బస్టాపులు, టాక్సీ స్టాండులు కూడా నీళ్ళల్లో తేలుతూ వుంటాయి.
మన ఒడ్డు వేపు నించీ ఎక్కి, రెండో పక్కన వున్న బస్సులు ఎక్కుతామన్నమాట!  మేము మొదటి రోజు పాస్ కొనలేదు. వెనిస్ నగర వీధుల్లో నడుస్త్తూ ఆ పురాతన భవంతుల  వైభవాన్ని చూస్తుంటే ఎన్నేళ్ళ క్రితం వాటిని నిర్మించారో అనిపించింది. ఎటు చూసినా సావనీర్లు అమ్మేషాపులు , రకరకాల ఫాషన్ దుస్తులు , ఆభరణాల దుకాణాలు కనిపిస్తాయి. భార్గవి అక్కడ షాపులో వస్తువులన్నీ చూసి వాటి ధరలు యూరోల్లో చూడగానే గబగబా ఇండియా రూపాయల్లో లెక్క వేసేసి మన హైదరాబాద్ లో అయితే ఇందులో సగం కంటే తక్కువే అని నిట్టూర్చేది. ఏది కొనుక్కోమని చెప్పినా నాకు అసలు ప్రాణం ఒప్పట్లేదంటూ తిరిగి వచ్చేసింది. చివరికి ఏవో ఐటమ్స్ మాత్రం బాగా నచ్చటంతో వదల్లేక కొనుక్కుంది. ఆ రోజంతా అక్కడ దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని చూస్తూ గడిపాం. కాసేపటికి  చీకటి పడేసరికీ అంతా మారిపోయింది .వెనిస్ అంతా  ఎన్నో వేల లైట్లతో వెలిగిపోతోంది . మూడు నాలుగు చోట్ల, కొంతమంది చిన్న స్టేజ్ మీద పియానో, వయోలిన్,  మొదలైన వాయిద్యాలతో చెవులకి ఎంతో హాయిగా వుండే సంగీతం. కొన్ని చోట్ల ఇటాలియన్ భాషలో మధురమైన పాటలు కూడా పాడుతున్నారు. అసలు రాత్రి పూట వెనిస్ చాలా రొమాంటిక్ గా అనిపించింది.
మళ్ళీ ఆత్మారాముడు గోల చేస్తుండటంతో అక్కడే నీటి మధ్యలోనే ఉన్న ఒక రెస్టారెంట్ ని చూసుకుని నేను   పిజ్జా తో పాటు వైన్ ఆర్డర్ చేశాను. భార్గవి మాత్రం తనకి పాస్తా కావాలి అంది.ఇండియా లో తినే ఇటాలియన్ పదార్దాలకీ, ఇటలీలో తినే వాటికీ చాలా  తేడా వుంది. చీజ్  ఎన్నో రకాలు ఉంటుంది . ఒకే పిజ్జా మీద రక రకాల చీజులు వేస్తారు.మాకు సర్వ్ చేసిన వ్యక్తి ఇటాలియన్ దేశస్తుడే. తను ఒకసారి పాకిస్తాన్ వెళ్ళాడట. ఏవో రెండు మూడు ఉర్దూ పదాలతో మమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. వెనిస్ లో అలా రాత్రి పూట వెలుగులో నీళ్ళలో తేలియాడుతూ భోజనం చేయటం తీయని అనుభూతిని ఇచ్చింది. ఇక ఆ రోజుకి మా సందర్శన ముగించుకుని అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి ఆ రోజు మొత్తం అక్కడున్న దీవుల్లో కొన్నైనా చూడాలనుకున్నాం.ముందుగా వెనిస్ లో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం. యూరప్లో ఉన్న మిగతా దేశాలనుండి అలాగే ఇటలీ లోని మిగతా నగరాలనుండి వచ్చే ట్రైన్స్ అక్కడ ఆగుతాయి. అక్కడ ఆగి ఉన్న కొన్ని రైళ్ళని చూశాం. బోగీలన్నీసకల వసతులతో ఉన్నాయి. నేను ఇంతకుముందు పోలాండ్ లో వెళ్ళిన వార్సా రైల్ కంటే ఇది చాలా బాగుంది. ఇక అక్కడినుండి 10 గంటలకల్లా డే టికెట్ తీసుకుని బోటులో బయలుదేరి ఒక్కో దీవి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా  వున్నాయి. 
అన్నిటిలోకి ముఖ్యమైనది సైంట్ మార్క్స్ స్క్వేర్. దీన్ని ఇటాలియన్ భాషలో శాన్ మార్కో పియాజాజ్ అనికూడా అంటారు. వెనిస్ వచ్చిన ప్రతి యాత్రీకుడు చూడవలసిన ప్రదేశం ఇది. ఎంతో అందంగా కట్టిన కట్టడాలు. మూడు పక్కలా ఎన్నో రెస్టారెంట్లు, ఆరు బయట షామియానాలు, కొన్ని గొడుగులు. వాటి క్రింద జనం కబుర్లు చెప్పుకుంటూ, వచ్చే పోయేవాళ్ళని చూస్తూ, పాస్టా తింటూ, కూర్చుని వుంటారు. ఎక్కడ చూసినా ఇటాలియన్ వైన్ సీసాలు. దాని పక్కనే సైంట్ మార్క్స్ బసీలికా చర్చి. చాలా అందమైన కట్టడం. లోపలా, బయటా కూడా బాగుంటుంది. ఆ పియాజాజ్ మధ్యలో ఎన్నో పావురాలు, ఆహారం పడేస్తుంటే అక్కడే ఎగురుతూ ఇంకా ఎంతో అందాన్నిస్తాయి. మేము ఎక్కువ సేపు ఈ ప్రాంతంలోనే గడిపాము. ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో మరో ముఖ్యమైనది గాలరీ డెల్ ఎకాడమియా. ఇక్కడ వెనీషియన్ చిత్రకారులు టిటియాన్, టింటరెట్టో మొదలైనవారి చిత్రాలు వున్నాయి. 
వెనిస్ వెళ్ళినవాళ్ళందరూ చేయవలసిన పని ఇంకొకటి వుంది. అదే ‘గండోలా’ బోటులో ‘లాహిరి లాహిరి’ విహారం. ఎనభై యూరోలు ఇస్తే దాదాపు నలభై ఐదు నిమిషాలు, మనల్ని ఆ చిన్న పడవలో సందుల గొందుల మధ్య తిప్పుతాడు. నేను వెళదాం అనేలోపు భార్గవి మాత్రం నాకు ఆసక్తి లేదు అంది. అప్పటిదాకా తిరిగింది కూడా పడవల్లోనే,  కాకపొతే గండోలా లో తిరుగుతుంటే మనమే ఒక రాకుమారుడు , రాకుమార్తె లాగా ఫీల్ అవుతాం. నీట్ గా డ్రెస్ చేసుకున్న వ్యక్తి ఆ గండోలలో రాచ మర్యాదలతో మనల్ని విహరింప చేస్తాడు. గండోలా విహారం వెన్నెల రాత్రులలో ఇంకా బాగుంటుంది. 
నేను తెలుసుకున్నదేమిటంటే, నీళ్ళల్లో పూర్తిగా మునిగిన చెక్కలు, ఆక్సిజన్ తగలక పాడవవు. అదే చెక్క నీళ్ళలో బయట వుంటే త్వరగా పాడవుతుంది. అదీకాక నీళ్ళని తగులుతున్న ప్రతి భవనం మొదటి అంతస్తు ఖాళీగా వుంచుతారుట. మనుష్యులు వుండేది రెండు, మూడు, ఆ పైన అంతస్తులలో. కాని ఇప్పుడు కొన్ని దీవుల్లో అసలు మనుషులే లేరు. అందరూ యాత్రీకులే. అప్పటికి సాయంకాలం అయ్యింది. మా తిరుగు ప్రయాణం అదే రోజు రాత్రి 9 గంటలకి. 6 గంటలకల్లా బస్ ఎక్కి 7 గంటలకల్లా మార్కోపోలో విమానాశ్రయానికి వెళ్ళిపోయాం. మళ్లీ ఈజీ జెట్ విమానంలోనే మరో రెండు గంటల్లో బెర్లిన్ చేరుకున్నాం. ఈసారి నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ క్రదోహా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చాడు. ముగ్గురం కలిసి మింజు జేర్జ్ బయలుదేరాం. నాకు వెనిస్ లో తిరుగుతున్నంత సేపు చిన్నప్పుడు చదివిన షేక్స్ పియర్ రాసిన కధ మర్చంట్ ఆఫ్ వెనిస్ గుర్తొచ్చింది. చందమామ పుస్తకాల్లో చదువుకున్న అభూత కల్పనల్ని వాస్తవంలో చూడలేకపోయినా మర్చంట్ ఆఫ్ వెనిస్ చదివి అదే వెనిస్ ని చూడటం చాలా అధ్బుతంగా అనిపించింది. 

Wednesday, July 1, 2015

నా ఐరోపా యాత్ర - 17 (బెర్లిన్)

అక్కడినుండి బయలు దేరి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో అందరం లంచ్ చేసాం. బెర్లిన్ రావటం నాకు రెండోసారి. మొదటిసారి IELTS test రాయటం కోసం వచ్చాను, అప్పుడు అంతా మంచు కురవటంతో నేను అంతగా బెర్లిన్ ని చూడలేదు. జర్మనీలో ఈశాన్య దిశలో గల బెర్లిన్‌ది యూరప్‌లో జనాభాలో ఏడవ స్థానం. వెస్ట్ ఫ్లావిక్ భాషలో దీని అసలు పేరు బెర్ల్‌బిర్. అంటే, బురదనేల. అది బెర్లిన్‌గా రూపాంతరం చెందింది. 13వ శతాబ్దంలో ప్రష్యా సామ్రాజ్యానికి ఇది రాజధాని. 1918లో, అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రష్యా సామ్రాజ్యం కూలిపోయాక జర్మన్ ఎంపైర్‌గా మారింది. హిట్లర్ ని అంతమొందించే క్రమంలో 1945 లో బెర్లిన్‌పై అనేక సైనిక విమానాలు బాంబులు కురిపించడంతో నగరంలో అధిక భాగం నాశనం అయింది. పన్నెండు రోజుల పాటు రష్యన్స్ రోజుకి నలభై కిలోమీటర్ల చొప్పున చొచ్చుకు వస్తూ దీన్ని మూడువైపుల నించి ముట్టడించారు. దీన్ని ‘బేటిల్ ఆఫ్ బెర్లిన్’ అంటారు. కాని జర్మన్ సైనికులు రష్యన్స్‌కి కాక అమెరికా మిత్ర సైన్యాలకే లొంగిపోయారు.  లంచ్ అయ్యాక అక్కడినుండి కార్ లో బెర్లిన్ గోడ చూడటానికి వెళుతున్నాం. ఒక సిగ్నల్ దగ్గర కార్ ఆగగానే కొంతమంది నల్ల యువకులు అద్దం దించ మంటూ కార్ దగ్గరికి వచ్చి సైగలు చేస్తున్నారు. మార్చిన్ మాత్రం వాళ్ళని పట్టించుకోలేదు. కొంతమంది అలా డబ్బులు కోసం చేస్తారని గ్లాస్ దించితే కార్ లో ఉన్నవి లాక్కుంటారని మార్చిన్ చెప్పాడు. యూరప్ లో నాకు ఇలాంటి తరహా అనుభవం మొదటిసారి. భార్గవి వాళ్ళని చూడగానే భయపడింది. 
                                  మార్చిన్ భార్య కాషా, వారి అబ్బాయి మాక్సిన్  తో భార్గవి, నేను 
బెర్లిన్ గోడ చూడాలని నాకు ఎప్పటినుండో కోరిక. హిట్లర్ చనిపోయి జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాక అమెరికా , రష్యాలు జర్మనీ ని రెండు భాగాలుగా పంచుకున్నాయి.రష్యా ఆధిపత్యంలో తూర్పు జర్మనీ, అమెరికా ఆధిపత్యంలో పశ్చిమ జర్మనీ ఉండేవి. రెండింటికీ అడ్డుగా ఈ గోడ నిర్మాణం ఆగష్టు 13, 1961 ప్రారంభమైనది.దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకుల చేతిల్లో ఉంటే పశ్చిమ జర్మనీ ప్రజాస్వామ్య ప్రభుత్వం చేతుల్లో ఉంది. తూర్పు జర్మనీనుంచి పశ్చిమ జర్మనీలోకి జనం వలసలు వెళ్ళకుండా కట్టుదిట్టం చేయడం కోసం తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్ని మూసివేయ నిర్ణయించి 1961లో గోడ నిర్మాణం చేశారు. ఈ చర్య తూర్పు పశ్చిమ జర్మనీలలోని ప్రజల్లో గొప్ప వేదన కలిగించింది. కొంతకాలం గడిచిన తర్వాత తూర్పునుంచి ఆ గోడను దాటడానికి యత్నించిన 136మందిని తూర్పు జర్మనీ భద్రతా దళాలు కాల్చిచంపాయి. వేలమందిని అదుపులోకి తీసుకొని జైలు పాలుజేశాయి. కాలగమనంలో 28 సంవత్సరాలు గడిచాయి. ప్రజల మధ్య గోడ నిర్మాణం పట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు, వారి మధ్య సౌహార్ధాన్ని నిలువరించడం ఇంక ఎంతమాత్రం సాధ్యమయ్యే పనికాదని గుర్తించిన తూర్పు జర్మనీ పాలకులు సోవియట్ యూనియన్ పతనం తరువాత గోడను 1989 నవంబర్ 9న పడగొట్టడంతో తిరిగి ఐక్య జర్మనీ ఏర్పాటైంది. జర్మనీవాసులు ప్రతియేటా ఈ రోజున పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటారు.​తరువాత కాలంలో ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలు ప్రజలే తొలగించడం మొదలుపెట్టారు. మిగిలిన భాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది.బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం అక్టోబర్ 3, 1990 లో పూర్తయింది.  బెర్లిన్ గోడ ఇంకొక కిలోమీటర్ ఉందనగానే అక్కడున్న పార్కింగ్ లో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళుతున్నాం. ఆ దారి మొత్తం బెర్లిన్ గోడ కి సంభందించిన ఫోటోలు ఉన్నాయి. ఆ గోడ ఎక్కుతూ చనిపోయిన వారివి , అమెరికన్ మరియు రష్యా పోలీసుల తూటాలకి బలయిన ఎంతోమంది జర్మన్ యువకుల వివరాలు కూడా ఉన్నాయి. మేము వెళుతున్న దారిలోనే అమెరికన్ ఎంబసీ ఉంది. మరో  147 దేశాల ఎంబసీలు బెర్లిన్ లో  ఉన్నాయి.  బెర్లిన్‌కి గ్రీన్ సిటీ అని పేరు.బెర్లిన్‌లో ఎంత ఖరీదైన జీవితాన్ని అనుభవించవచ్చో... సామాన్యమైన జీవితం కూడా అంతే సౌకర్యంగా ఉంటుంది. బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్స్ ఉంటాయి. వాటిలో చాలా తక్కువ ఖర్చుతో రోజులు గడపవచ్చు. చదువు, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లు ఆర్థికంగా స్థిరపడే వరకు ఇలా గడిపేయవచ్చు. తక్కువ ఖర్చు కాబట్టి కనీస సౌకర్యాలు, పరిశుభ్రత లోపం వంటివేమీ ఉండవు. సాధారణ వసతులతో శుభ్రంగా, సౌకర్యంగా ఉంటాయి. బెర్లిన్‌లో మంచి ఆహారం దొరుకుతుంది. స్థానిక భోజనం నుంచి కాంటినెంటల్ అన్ని రకాలూ దొరుకుతాయి. ఇండియన్ ఫుడ్‌లో చాలా రకాలుంటాయి. ఇండియన్లు నడుపుతున్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 
బెర్లిన్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే... సంస్కృతి, రాజకీయాలు, శాస్త్రసాంకేతిక, ప్రసార మాధ్యమం వంటి అన్ని ప్రధాన రంగాల్లోనూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరం. విశ్వవిద్యాలయాలు, సంగీత పరిశోధన సంస్థలు, మ్యూజియం, సమకాలీన కళలు, వైవిధ్యభరితమైన వాస్తుశైలి, క్రీడలకు కేంద్రస్థానం. ఈ నగరంలో పర్యటించటం గొప్ప అనుభూతిగా మిగులుతుంది. జర్మన్ భాషని ప్రపంచంలో తొమ్మిది కోట్ల మందికి పైగా మాట్లాడతారు. ఒక్క జర్మనీలోనే కాక, ఆస్ట్రియా, లైఎస్టెయిన్, లగ్జంబర్గ్ దేశాల్లో కూడా ఇది అధికారిక భాష. అందుకే మన వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ లలో చేరాలంటే జర్మన్ తప్పని సరిగా నేర్చుకుని రావాలి. చాలా వరకు ఆటో మొబైల్ , ఏరో నాటికల్ చదవటానికి మన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. బెర్లిన్‌లో ఉన్నత విద్యావంతుల సంఖ్య ఎక్కువ. ప్రతివారూ కనీసం సెకండరీ విద్య అయినా పూర్తి చేసి ఉంటారు. సంతోషంగా జీవించడం ఎలాగో వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే. ఇది చాలా ఓపెన్ సొసైటీ. అందరూ పీస్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఎవరిని పలకరించినా చిరునవ్వుతో మాట్లాడతారు. అడిగిన వివరాలు చెప్తారు. విదేశీయులనూ కొత్తవాళ్లలా చూడరు. ఎప్పటి నుంచో తెలిసినట్లు ఆత్మీయుల్లాగ మాట్లాడతారు. బెర్లిన్ గోడలో కొంత భాగాన్నైనా చూద్దామని ఆశపడిన నాకు అక్కడిదాకా వెళ్ళాక నిరాశే ఎదురైంది. కేవలం రెండు ముక్కలు మాత్రమే రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద నిలబెట్టి ఉన్నాయి. అసలు అక్కడ గోడ ఉండేది అనే ఆనవాలే లేకుండా ప్రజలే దానిని కూల్చేశారు. టూరిస్ట్ లు అందరూ ఆ రెండు ముక్కల ముందు నిలబడే ఫోటోలు తీసుకుంటున్నారు. భార్గవి కి అసలు ఈ చరిత్ర అంటే ఆసక్తి లేదు. ఏదో నా ఉత్సాహం చూసి నన్ను నిరుత్సాహ పరచటం ఇష్టం లేక నాతో పాటు వస్తుంటుంది.ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్దాం అంటే మ్యూజియం కి మాత్రం వద్దు అంటుంది. 

అక్కడినుండి వెనక్కి నడుస్తూ వస్తుండగా దాదాపు 4 ఎకరాల విస్తీర్ణం ఒక విచిత్రమైన నిర్మాణాలు కలిగిన ప్రదేశం కనిపించింది. మార్చిన్ చెప్పాడు , రెండవ ప్రపంచం లో ఊచకోత కోయబడిన యూదుల స్మారకార్ధం జర్మనీ ప్రభుత్వం నిర్మించిన హాలోకాస్ట్ మెమోరియల్ అది. భూమి ఉపరితలానికి సమాన ఎత్తులో ఆ సిమెంటు దిమ్మల్ని సమాధుల తరహాలో నిర్మించారు. వాటి మధ్య మనుషులు నడిచే దారులు ఉన్నాయి. ఆ ప్రాంతం మొత్తం లోతుగా తవ్వి ఒక్కో సమాధి ఒక్కో ఎత్తులో ఉండేట్లు నిర్మించి మనం లోపలి నుండి బయటికి వచ్చేటప్పుడు ఏటవాలుగా ఉంటుంది. ఆ వాలుకి తగ్గ ఎత్తులు భూమి సమానంగా ఈ సిమెంటు దిమ్మలు నిర్మించారు. వాటి మధ్యలోకి వెళితే ఎటు వస్తామో కూడా తెలియదు. ఒకప్పుడు బెర్లిన్ లో లక్షా యాభై వేల మంది యూదులు ఉండేవారట. రెండవ ప్రపంచంలో వారందరినీ హిట్లర్ చంపేసాక మిగిలిన వారు ఇజ్రాయిల్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 10 వేలమంది కూడా లేరు. యూదులకి సానుభూతిగా ప్రపంచంలో మరికొన్ని దేశాల్లో ఇలాంటి హోలోకాస్ట్ మెమోరియల్ నిర్మించారు.

ఇక్కడికి దగ్గరలోనే సిటీ స్క్వేర్ ఉంది దీనినే బ్రాన్దేన్ బర్గ్ గేటు అంటారు. బెర్లిన్ నగరానికి ఇది లాండ్ మార్క్. పర్యాటకులు అందరూ ఇది చూడకుండా మాత్రం వెళ్ళరు. అక్కడ ఒక పోలీస్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అందరి పాస్ పోర్ట్ ల మీద స్టాంప్ వేస్తున్నాడు. అది అధికారిక ఇమ్మిగ్రేషన్ ముద్ర లాగే ఉంది.తర్వాత నాకు అర్ధం అయిందేమిటంటే యూరప్ లో ఏ దేశంలో ముందుగా అడుగు పెడతామో ఆ దేశపు ఇమ్మిగ్రేషన్ స్టాంప్ మాత్రమే మన పాస్ పోర్ట్ మీద ఉంటుంది. మిగతా ఎన్ని దేశాలు తిరిగినా ఇమ్మిగ్రేషన్ చెక్ ఉండదు కనుక ఆయా దేశాల స్టాంప్ లు కూడా మన పాస్ పోర్ట్ లో ఉండవు. అందుకే పర్యాటకులంతా జర్మనీ ని దర్శించిన గుర్తుగా ఆ స్టాంప్ వేయించుకుంటున్నారు. దానికి ఆ వ్యక్తీ 5 యూరోలు తీసుకుంటున్నాడు. మేము ఆ స్టాంప్ వేయించుకోలేదు. అక్కడికి నడిచే దూరంలోనే జర్మనీ పార్లమెంట్ ఉంది. ఇది అతి పురాతనమైన భారీ నిర్మాణం.పెద్దగా సెక్యురిటి ఏమి లేదు. దాని చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకున్నాం. చలిగాలులు ఇంకా తగ్గకపోవటంతో ఎటు చూసినా అందరూ కోట్లు వేసుకునే తిరుగుతున్నారు. ఇక మా ప్రయాణాన్ని ముగించుకుని అందరం పోలాండ్ కి బయలుదేరాం. 

జర్మనీ పార్లమెంట్ ముందు మార్చిన్ భార్య కాషా తో భార్గవి


Friday, December 26, 2014

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం. మన దేశం తర్వాత నేను నివసించటానికి అత్యంత ఇష్టపడే ప్రాంతం ఇది. నేను యూరప్ లో కొంత కాలం నివసించినా నాకు దుబాయ్ అంటేనే ఎక్కువ ఇష్టం. నేను తొలిసారి చూసిన విదేశం దుబాయ్. అందుకేనేమో ఈ దేశం అన్నా ఇక్కడి ప్రభుత్వ విధానాలన్నా నాకు అమితమైన ఇష్టం , ఆసక్తి . మొత్తంగా నేను ఈ దేశంలో నివసించింది 4 సంవత్సరాలు. మూడు జాతీయ దినోత్సవాలని ఈ దేశంలో చూశాను. ఈరోజు డిసెంబర్ 2 , 2014 న జరుపుకుంటున్న ఈ దేశపు 43 వ జాతీయ దినోత్సవం నేను చూస్తున్ననాలుగవది. మన దేశంలోనూ , ఇక్కడా కొన్ని సారూప్యత కలిగిన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు, గతంలో ఆ రెండూ సమైక్యంగా ఉన్నప్పటి పరిస్తితులు, మళ్ళీ విడిపోవటానికి కారణాలు, ఇక్కడి పరిస్థితులకి కొంత సారూప్యంగాఉంటాయి. అందులో ఒకటి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వివాదాలుగా మారుతున్న పేర్ల వివాదం. మన భారత దేశం లో , అలాగే తెలుగు రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా ప్రభుత్వ భవనాలకి, రోడ్లకి నాయకుల పేర్లు పెట్టే సంస్కృతి ఉంది. నిర్మించిన ప్రతి భవనానికి, ప్రతి హైవే కి ప్రభుత్వమే పేర్లు పెడుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం కాదు కనుక నిర్ణయాధికారం రాజు దే. ఆందోళనలు , ప్రజల మనోభావాలు లాంటి పదాలు ఇక్కడ వినిపించవు. అలా అని ప్రజా వ్యతిరేక విధానాలు కూడా కనిపించవు. ఈ అంశం గురించి చెప్పేముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి కొంత చెప్పాలి.ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. 1970 కాలంలో దుబాయి, ఆబుధాబి, షార్జా, ఆజ్మాన్, ఉమ్మాల్ ఖ్వాయిస్, ఫుజిరా, రాస్ అల్ ఖైమాలు వేర్వేరు జెండాలు, వేర్వేరు విధానాలతో విభిన్న తెగలకు చెందిన రాజులు పరిపాలిస్తున్న వేర్వేరు దేశాలు.ఈ రాజ్యాలన్నీ కూడా కీలకమైన అరేబియా సముద్ర తీరంలో ఉన్నాయి. అన్ని దేశాలకూ రేవు కేంద్రాలు ఉన్నాయి. కొందరి వద్ద చమురు సంపాదన ఉండగా మరికొందరి వద్ద లేదు. 1971లో రాస్ అల్ ఖైమా మినహా మిగిలిన దేశాలన్నీ కలిసి సమైక్యంగా సమాఖ్య రూపంలో ఉండడానికి తీర్మానం చేసుకొన్నాయి (మరుసటి సంవత్సరం రాస్ అల్ ఖైమా కూడా చేరింది). ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాల వరకు ఒక ఎమిరేట్ నుంచి మరో ఎమిరేట్‌కు వెళ్ళడానికి పాస్‌పోర్టు అవసరమయ్యేది.
ఏడు ఎమిరేట్లు వేర్వేరుగా ఉన్నప్పుడు సరిగ్గా రహదారులు లేని ఎడారి ప్రాంతాలు, సమైక్యంగా మారిన తర్వాత వాటి దశ, దిశ తిరిగిపోయింది.అనూహ్య అభివృద్ధి సాధించడానికి ఏడు రాజ్యాలు కూడా పరస్పరం గౌరవించుకోవడం, వనరుల పంపిణీలో సమ న్యాయం ప్రధాన కారణాలు.ఈ పరస్పరంగౌరవించుకోవడం గురించే ఇప్పుడు చర్చ. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. ఎవరీ షేక్ జాయేద్ ? ప్రస్తుతం అబుదాబి రాజు షేక్ ఖలీఫా తండ్రి. ఈయనే మిగతా ఆరు రాజ్యాలతో కలిసి సమాఖ్యగా ఉండాలని అందరిని ఒప్పించి ఒక దేశంగా ఏర్పరిచాడు. ఈ రోడ్డు దుబాయ్ లో ఉన్నంత మేరా దానిపేరు షేక్ జాయేద్ రోడ్డు. ఎప్పుడైతే అబుదాబి సరిహద్దులు మొదలవుతాయో అక్కడినుండి ఈ రోడ్డు పేరు షేక్ రషీద్ రోడ్డు. ఎవరీ షేక్ రషీద్ ? ప్రస్తుత దుబాయ్ రాజు తండ్రి షేక్ రషీద్. దుబాయ్ లో నిర్మించిన ప్రపంచంలో ఎత్తైన భవనం పేరు బుర్జ్ ఖలీఫా. అబుదాబి ప్రస్తుత రాజైన షేక్ ఖలీఫా పేరుని ఆయన చేసిన సహాయానికి ప్రతిఫలంగా మాత్రమే కాదు,ఆయన మీద గౌరవముతో దుబాయ్ రాజు తమ ప్రాంతంలో ఉన్న భవనానికి పెట్టారు. ఇటీవల అబుదాబి లో నిర్మించిన 2 టవర్ల కి షేక్ రషీద్ టవర్స్ అని దుబాయ్ రాజు పేరుని అబుదాబి ప్రభుత్వం పెట్టింది. ఇవే కాకుండా షార్జా లో చాలా రోడ్లకి, వీధులకి దుబాయ్ , అబుదాబి నాయకుల పేర్లు ఉంటాయి. అలాగే షార్జా నాయకుల పేర్లు కూడా ఇతర ఎమిరేట్ లలో కనిపిస్తాయి. ఎప్పుడైతే పక్కవారి గొప్పతనాన్ని గుర్తించే ఔన్నత్యం మనకుంటుందో మన గొప్పతనాన్ని ఇతరులు గుర్తిస్తారు. ఎప్పుడయితే ఆత్మగౌరవం దెబ్బతిని దానికి విఘాతం కలుగుతుందో అప్పుడు వేర్పాటు ఉద్యమం ఊపందుకొంటుంది.1972 లో ఒక్కటిగా కలిసిన ఈ ఏడు ఎమిరేట్స్ లో మూడు మాత్రమే (అబుదాబి , షార్జా , దుబాయ్ ) ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన ఆబుధాబి రాజ్యం యావత్తు ప్రపంచం నుంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో దానికి అనుకొని ఉన్న షార్జా , దుబాయ్ ఎమిరేట్లు లాభపడినా ఏనాడూ కూడా మిగతా నాలుగు ఎమిరేట్స్ ఈ సమాఖ్య నుంచి వేరుగా ఉండాలని ఏమాత్రం కోరుకోకపోవడానికి కారణం వారి హక్కులు, అభివృద్ధి వాటాలో ఏ మాత్రం లోటులేకపోవడం. 60 ఏళ్ళు కలిసున్న సమైక్య రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పని చేసిన ఒక వ్యక్తి పేరుని కొత్త రాష్ట్రం లో ఒక టెర్మినల్ కి పెడితేనే ఓర్చుకోలేని కురచ దృక్పధాలున్న మన నాయకులు ఇక్కడి సంస్కృతిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే అవశేష రాష్ట్రంలో కూడా ప్రాంతాలకతీతంగా సాటి తెలుగు నాయకుల పేర్లు పెట్టడం కూడా అవసరం. చిత్తూరులోని మదనపల్లె వైపు ఉన్న పరిస్థితులకు, నగరి వైపు ఉన్న పరిస్థితులకు తేడా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు వైపు పరిస్థితులకు, ఆదిలాబాద్ వైపు పరిస్థితులకు వ్యత్యాసం ఉన్నది. కేవలం జిల్లాస్థాయి ప్రాంతాల్లోనే తేడాలు ఉన్నప్పుడు వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దేశాల్లో తేడాలు ఉండడం సహజం. వాటన్నిటిని అధిగమించి 43 సంవత్సరాలుగా సమైక్య స్పూర్తిని కొనసాగిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు.
Date
02.12.2014

Tuesday, November 25, 2014

విడిపోయిన జ్ఞాపకాలు

ఎన్నో భావోద్వేగాల మధ్య రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారికి రాజకీయ నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలు తప్ప సామాన్యుడి ఆవేదన, ఆక్రోశం తెలియకపోవచ్చు. ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు జరిగిన ప్రాణ నష్టం 68 ఏళ్ల తరువాత ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసును కలచి వేసే ఉదంతం అది. నాకు సంబంధించినంతవరకూ నా గొప్ప జ్ఞాపకాలన్నీ పొరుగు రాష్ట్రంలో ఉండిపోయాయి.
150 రూపాయలు తో టికెట్ కొని జేబులో 200, చేతిలో 50 కేజీల బియ్యం బస్తా తో వెంకటరమణా ట్రావెల్స్ బస్సు ఎక్కి 1999 సెప్టెంబర్ 24 న భవిష్యత్తు మీద కోటి ఆశలతో అడుగుపెట్టిన నాకు బోలెడంత భరోసా ఇచ్చి అక్కున చేర్చుకుంది భాగ్యనగరి. ఏదో అవ్వాలని, ఏదో చెయ్యాలని తపన తో వచ్చిన నాకు బస్సు దిగగానే ఇక ఏమీ పర్లేదు బిడ్డా మంచిగ అవుతావ్ గిదంతా మనదే అనే భావన కలిగించింది హైదరాబాద్.
అప్పుడు ECIL దగ్గర కమలా నగర్ లో మకాం. నెలకి 480 రూపాయల అద్దె. అగ్గిపెట్టెంత రూములో ముగ్గురం ఉండేవాళ్ళం. వంట అందులోనే. ఎప్పుడైనా బద్ధకం వేస్తె దగ్గరే సాయి మెస్సు లో ప్లేట్ భోజనం 15 రూపాయలు. ఫుల్ అయితే 18 రూపాయలు. నెలకి 1000 రూపాయల జీతంతో ప్రారంభమైన ప్రయాణం రోజుకి 1000 సంపాదించే వరకు హైదరాబాదులోనే సాగింది. మధ్యలో 6 సంవత్సరాల చదువు హైదరాబాదులోనే. 23 జిల్లాల నుండి వచ్చిన స్టూడెంట్స్ అంతా ఒకే చోట చదువుకున్నాము. విచిత్రం ఏమిటంటే ఏ ప్రాంతం వాడితో మాట్లాడేటప్పుడు ఆ ప్రాంతపు యాస నాకు తెలీకుండానే వచ్చేసేది.ఇంజినీరింగ్ చదివింది ముస్లిం మైనారిటీ కాలేజిలో అయినా ఏరోజూ ఆ బేధం తెలియలేదు. ప్రతి సంవత్సరం కనీసం 5, 6 ఇఫ్తార్ విందులు ఉండేవి. ఓల్డ్ సిటీ లో మిత్రుల ఇళ్ళకి ఇఫ్తార్ కి వెళ్లినపుడల్లా ఆ ఇంటి మర్యాదలు, ఆదరణ అద్భుతం. పాయ, నహారి , హైదరాబాద్ బిర్యాని సుష్టుగా తిన్నాక సేమ్యా ఖీర్ తో ఆ విందు ముగిసేది.
సికిందరాబాద్ బ్లూ సీ కేఫ్ లో ఇరానీ ఛాయ్ 3 రూపాయలు, ఉస్మానియా బిస్కట్ 50 పైసలు. 5 రూపాయలు ఇస్తే ఒక ఛాయ్ నాలుగు బిస్కట్స్ వచ్చేవి. స్నేహితులతో కలిసి మారేడ్ పల్లి నుండి సికిందరాబాద్ దాకా నడిచి వెళ్ళేవాళ్ళం. బద్దకిస్తే 38 నంబర్ బస్సు ఎలాగూ ఉండేది. ఇక బిర్యాని తినాలంటే బావర్చి నే. నలుగురం కలిసి వెళ్తే ఫ్యామిలీ పాక్, ఆరుగురం వెళ్తే జంబో పాక్. ఆర్టీసి క్రాస్ రోడ్లో ఆ బిర్యాని తినేసి మళ్లీ 1 నంబర్ బస్సు ఎక్కి సికిందరాబాద్ వచ్చేసే వాళ్ళం. నెలకి 60 రూపాయలు బస్సు పాస్ కడితే కనపడ్డ బస్సు నల్లా ఎక్కి ఫుట్ బోర్డు లో వేలాడిన రోజులు మర్చిపోకముందే ఇప్పుడు ఆంద్రోడికి బస్సు పాస్ ఇవ్వనంటోంది హైదరాబాద్.
తొలిసారి విదేశానికి వెళ్ళేటప్పుడు విమానం బేగం పేటలో ఎక్కాను. అందరిని వదిలి వెళ్తున్నాననే బాధ కంటే హైదరాబాదు ని మిస్ అవుతున్నాననే బాధతోనే నా హృదయం బరువెక్కింది. 21 ఏళ్ల కుర్రవాడు తొలి సారి విమానమేక్కబోతున్న అనుభవానికి, ఉత్సుకతకి ఉత్సాహానికి సాక్షిగా నిలిచింది బేగంపేట విమానాశ్రయం.
ఖాళీగా తిరిగే రోజుల్లో ఎక్కడ ఏ సినిమా కార్యక్రమం ఉందా అని పేపర్ చూసుకోవటం సాయంత్రానికల్లా అక్కడ వాలిపోయి సినిమా వాళ్ళని చూడటమే పని. హైదరాబాదులో ఉన్న అన్ని థియేటర్స్ లో సినిమా చూడాలనేది గోల్ అలా మూడు సంవత్సరాలలో 115 థియేటర్స్ లో సినిమాలు చూసిన రికార్డు నాదే. సినిమా రిలీజ్ అయితే, అప్పటిదాకా నేను చూడని ధియేటర్ లో ఆ మూవీ ఎక్కడుందో చూసుకోవటం మార్నింగ్ షో కి వెళ్ళిపోయేవాళ్ళం.
అర్ధరూపాయి, పావలా అనే పదాలు మర్చిపోయి ఆటాన చారానా అంటూ అక్కడి మాండలికంతో మమేకమయ్యాం. బాబాయ్ అనే పదం మరిచి కాకా అంటూ కలిసిపోయాం. గీనితో గిదే లొల్లిరా మామా అంటూ గొడవ అనే పదాన్నే మర్చిపోయాను. ఐ లవ్ హైదరాబాద్ అంటూ ఏ ప్రాంతానికి వెళ్ళినా గర్వంగా చెప్పుకున్నాం. అబిడ్స్ లో ఉన్న విశాలాంధ్ర పుస్తకాలయంలో నేను చదవని తెలంగాణా పోరాట పుస్తకం లేదు.
ఎన్ని దేశాలు తిరిగినా నా శరీరం మాత్రమే అక్కడుండేది మనసు మాత్రం ఎప్పుడో హైదరాబాదులో పారేసుకున్నాను. నా సంపాదనతో కొనుకున్న తోలి ఇల్లు హైదరాబాదులోనే ఉంది. నా తోలి ఉద్యోగం, తొలి విమాన ప్రయాణం, తొలి సంపాదన ని ఖర్చు పెట్టిన ఇరానీ కేఫ్ అన్నీ తెలంగాణా లోనే ఉన్నాయి. అదృష్టం ఏంటంటే ఆంధ్రోడు అనే పదం మీడియా లో రాజకీయ నాయకుల నోటి వెంట తప్ప, నా మిత్రుల నోటివెంట రాకపోవటం...

Sunday, August 17, 2014

నా ఐరోపా యాత్ర - 16 (బెర్లిన్)

నా ఐరోపా యాత్ర - 16 (బెర్లిన్)
 
​​నవంబర్లో స్వీడన్ పర్యటన తర్వాత ఎక్కడికీ వెళ్ళలేదు. అప్పటికే మంచు కురవటం మొదలయ్యింది. మళ్ళీ  మార్చ్ చివరిదాకా యూరప్ అంతా మంచుతో కప్పబడే ఉంటుంది. అక్టోబర్లో యూరప్ లో అన్ని దేశాల్లో సమయాన్ని ఒక గంట వెనక్కి మారుస్తారు. చలికాలం లో  పగలు చాలా తక్కువ సమయం ఉంటుంది. సాయంకాలం నాలుగు గంటలకే చిమ్మ చీకటి అయిపోతుంది.అదే వేసవి కాలంలో అయితే రాత్రి 9 గంటలవరకు సూర్యుడు ఉంటాడు.మళ్ళీ వేసవి రాగానే సమయాన్ని ఒక గంట ముందుకు మారుస్తారు. నాకు వివాహం నిశ్చయం కావటంతో నెల రోజులు సెలవు తీసుకుని జనవరి 31 న ఇండియా కి బయలుదేరాను. ఈసారి ఎమిరేట్స్ విమానంలో వయా దుబాయ్ రావాలి.31 ఉదయం 4 గంటల కి టాక్సీ డ్రైవర్ ఆదమ్ తో కలిసి పోజ్నాన్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాను.
 
పోజ్నాన్ నుండి జర్మనీ లో మ్యూనిచ్ వరకు యూరో లాట్ డొమెస్టిక్ విమానంలో వెళ్ళాలి. అక్కడినుండి ఎమిరేట్స్ లో దుబాయ్ వరకు ప్రయాణం. బెర్లిన్ , డ్రెస్ డెన్, ఫ్రాంక్ ఫర్ట్  నగరాల తరువాత జర్మనీ లో నేను చూసిన మరో నగరం మ్యూనిచ్. లాండ్ అయ్యేటప్పటికి సమయం ఉదయం 7.20 నిమిషాలు అయ్యింది. ఇక్కడ కొంతమంది తెలుగు కుటుంబాలు కూడా స్థిరపడ్డాయని విన్నాను.హిట్లర్ నివసించింది కూడా ఈ నగరంలోనే. ఈ ఎయిర్ పోర్ట్ చాలా పెద్దది. డొమెస్టిక్ నుండి ఇంటర్నేషనల్ టెర్మినల్ కి వెళ్ళటానికే అరగంట పట్టింది. మళ్ళీ నాకు మధ్యాహ్నం 2. 45 నిమిషాలకి దుబాయ్ విమానం. ఐపాడ్ ఓపెన్ చేసుకుని బుక్ చదువుతూ కూర్చున్నాను. చెక్ ఇన్ మొదలవగానే ఎక్కడెక్కడి వాళ్ళంతా వచ్చి క్యూ లో నిలబడ్డారు. ఇది A380 కావటంతో జనాలు ఎక్కువగా ఉన్నారు. నాకు దుబాయ్ లో చాలా మంది మిత్రులు ఉండటంతో 2 రోజులు దుబాయ్ లో వాళ్లతో గడిపి వెళ్దామని అనుకున్నాను. ఎయిర్ పోర్ట్ లోనే వీసా సౌకర్యం ఉన్నా, నా మిత్రుడు వెంకట్ ముందుగానే వీసా పంపాడు. మధ్యాహ్నం 3.00 గంటలకి మ్యూనిచ్ నుండి బయలు దేరిన విమానం దుబాయి చేరేటప్పటికి అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 11. 45 నిమిషాలకి లాండ్ అయ్యింది.
 
నేను వస్తున్నా అని తెలిసి మా గ్రామానికి చెందిన ప్రసాద్ మరియు మా బావగారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.3 రోజులు దుబాయ్ లోనే గడిపి మిత్రులందరినీ కలిశాక 4 వ తేది ఫిబ్రవరి న దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్నాను.
 
 
అదే నెల 14 న వివాహం అయ్యాక 24 న నా శ్రీమతి భార్గవి వీసా కోసం ఢిల్లీ లో ఉన్న పోలాండ్ ఎంబసీ కి వెళ్ళాము. ఒక సంవత్సరం క్రితమే నేను నా వీసా కోసం ఆ ఎంబసీకి వెళ్ళటంతో అక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా నన్ను గుర్తుపట్టి మమ్మల్ని ఇద్దరినీ వెంటనే లోపలికి పంపారు. అప్పుడే ఎదురైంది మాకు అనుకోని అనుభవం. ఫిబ్రవరి 24 న బుక్ చేయాల్సిన అప్పాయింట్మెంట్ పొరపాటున జనవరి 24 న బుక్ అయ్యింది. అంటే ఆరోజు మాకు అప్పాయింట్మెంట్ లేనట్లే. ఆ రోజు సాయంత్రానికే ఢిల్లీ నుండి మా తిరుగు ప్రయాణం. మార్చ్ 7 న మేమిద్దరం పోలాండ్ వెళ్లిపోవాలి. అక్కడున్న స్టాఫ్ ని అడిగితె ఒక ఆలోచన చెప్పారు. వెంటనే ఇప్పుడు నెట్ లో అందుబాటులో ఉన్న తేదిని బుక్ చేసుకోండి. మేము ప్రీ పోన్ చేసి రేపటికి ఇస్తాము అన్నారు. వెంటనే ఐపాడ్ లో చూస్తే 26 కి ఖాళీ ఉంది. ముందు ఆ తేదికి అప్పాయింట్మెంట్ బుక్ చేసేసుకున్నాను. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఢిల్లీ లో నివసించే రాము అన్నయ్య.
 
నా ప్రాణ స్నేహితుడు పసి కి పెద్దమ్మ గారి అబ్బాయి. నేను , పసి ఇంతకుముందు ఢిల్లీ వచ్చినపుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెంటనే పసి కి ఫోన్ చేసి రాము అన్నయ్య నంబర్ తీసుకున్నాను. అన్నయ్య కి కాల్ చెయ్యగానే ముందు ఇంటికొచ్చేయండి తర్వాత చూసుకుందాం అన్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఆఫీసుకి వెళ్లి ఆ రోజు టికెట్ ని మరుసటి రోజుకి మార్చుకున్నాం. మెట్రో లో అన్నయ్య చెప్పిన అడ్రస్ ప్రకారం ద్వారకా స్టేషన్ కి ఒక గంట ప్రయాణించాక చేరుకున్నాం. ఈలోపు రాము అన్నయ్య చెప్పటంతో దీప్తి వదిన ఆఫీస్ నుండి మధ్యలోనే వచ్చేసింది మేము ద్వారకా లో ట్రైన్ దిగేటప్పటికి దీప్తి వదిన మాకోసం వచ్చింది. మేము ఇంటికి చేరేటప్పటికి రాము అన్నయ్య కూడా ఆఫీస్ లో పర్మిషన్ పెట్టి వచ్చేసాడు. అసలు వాళ్ళు చూపించిన ప్రేమ, ఆప్యాయత మా జీవితంలో మరువలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
 
 
ఆ రోజు సాయంత్రం అక్షరధాం చూద్దామని అనుకున్నాం. నేను ఇంతకుముందు ఢిల్లీ వెళ్ళినపుడు ఆ గుడి చూసాను. భార్గవి కి కూడా చూపించాలని రాము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి ఆ గుడికి వెళ్ళాము. మరుసటి రోజు పొద్దున్నే 10 గంటలకల్లా పోలాండ్ ఎంబసీ కి చేరుకున్నాం. వాళ్ళు ప్రామిస్ చేసినట్లుగానే మా అప్పాయింట్మెంట్ ని ముందుకు జరిపి ఒక గంటలోనే భార్గవి వీసా ని స్టాంప్ చేసి ఇచ్చారు. ఇక ఆరోజు సాయంత్రం ఫ్లైట్ కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేశాం

మార్చ్ 7 న బంధువులంతా మమ్మల్ని పంపించటానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. భార్గవి బయటకి వెళ్ళటం అదే మొదటిసారి కావటంతో వాళ్ళ అమ్మ నాన్నలకి కొంచెం బెంగగా అనిపించింది. మేము పోలాండ్ చేరేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది.ఆ రోజు సన్నగా వర్షం పడుతోంది. అప్పటికి మంచు కురవటం ఆగిపోయింది. కాని 2 రోజుల తర్వాత మళ్ళీ మంచు కురవటం మొదలైంది. మరుసటి 2 రోజులు శనివారం, ఆదివారం కావటంతో మేము అక్కడికి వెళ్ళాక ఇండియన్ మిత్రులతో పాటు పోలాండ్ మిత్రులు కూడా ఇంటికి వచ్చి వెళ్లారు. అప్పటికి మిగతా దేశాల్లో పూర్తిగా మంచు కురవటం తగ్గిపోయింది కేవలం పోలాండ్ లోనే ఏప్రిల్ వరకు కూడా మంచు కురిసింది. ఆదివారం మింజు జేర్జ్ లో ఉన్న కొన్ని ప్రదేశాలకి భార్గవిని తీసుకెళ్ళాను. మాతో పాటు శశి కూడా వచ్చాడు. శశి కి తెలుగు రావటంతో భార్గవి కూడా తనతో తెలుగులోనే మాట్లాడేది. మేము అక్కడ ఉన్నన్ని రోజులు శశి మాకొక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉన్నాడు.
 
 
రిలీజ్ సినిమాని బెనిఫిట్ షో చూడటంలో ఉన్న కిక్కే వేరు. ఊర్లో ఉన్నంతకాలం ప్రతి రిలీజ్ సినిమాకి బందరు లేదా గుడివాడ వెళ్ళిపోవటం అలవాటు.ధియేటర్ ముందు ఈలలు, కటౌట్లకి దండలు. అభిమానంతో కట్టే పెద్ద క్లాత్ బానర్లు (తర్వాత ఫ్లేక్సీలు వచ్చాయి) ధియేటర్ లో స్క్రీన్ మీద హీరో ఎంటర్ అవగానే ఎగరేసే పూలు, కాగితాలు. సినిమా బాగోకపోయినా బయటకి రాగానే హిట్ సూపర్ హిట్ అంటూ ఎగురుంటూ ధియేటర్ బయటకి రావటం, అబ్బో ఆ మజానే వేరు. హైదరాబాద్ వచ్చాక రిలీజ్ సినిమాలు చూసినా బందరు గుడివాడలో చూసిన కిక్ మాత్రం ఉండేది కాదు. పోను పోను బెనిఫిట్ షోలు పోయి కాలేజి రోజుల్లో మార్నింగ్ షోలు చూడటం మొదలైంది. ఇక ఉద్యోగస్తుడిని అయ్యాక అది కాస్తా సాయంత్రం 6 గంటల షో కి మారింది.

ఇక యూరప్ వచ్చి సంవత్సరం అయినా ఇక్కడ ధియేటర్ లో తెలుగు సినిమా చూసే భాగ్యం కలగలేదు. స్వీడన్ వెళ్ళినపుడు మాత్రం తమిళ్ సినిమా చూసాను. ఇక్కడ మన వాళ్ళు చాలా తక్కువ అవటంతో పోలాండ్ లో తెలుగు సినిమాలు రావు. పొరుగున ఉన్న జెర్మనీలో రిలీజ్ సినిమాలు వస్తాయి. సరిగ్గా వచ్చిన నెల రోజులకి ఎన్ టి ఆర్ నటించిన బాద్షా రిలీజ్. భార్గవి ఇండియాలో ఉంటే ఎన్ టి ఆర్ సినిమా ఎప్పుడూ మిస్ అయ్యేది కాదు. అందుకే తనకి సర్ ప్రైజ్ ఇవ్వాలని బాద్షా ఎక్కడ రిలీజ్ అవుతుందో అని చూసాను. ఏప్రిల్ 5 శుక్రవారం ఇండియా లో సినిమా రిలీజ్ అయింది. మాకు వీకెండ్ ఆదివారం కావటంతో ఏప్రిల్ 7 వ తేదిన జర్మనీ లో వివిధ నగరాల్లో షో ఉంది. మాకు దగ్గరగా ఉన్న నగరం బెర్లిన్. వెబ్ సైట్ లో కాంటాక్ట్ నెంబర్ చూసి కాల్ చేసాను. కృష్ణా జిల్లా కంకిపాడుకి చెందిన దండమూడి బాలాజీ, జర్మనీ లో ఎం ఎస్ చేయటానికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. అతనే అక్కడ తెలుగు సినిమాలు తీసుకువస్తూ ఉంటాడు. 12.30 నిమిషాలకి బెర్లిన్ లో FSK KINO లో షో ఉందని చెప్పాడు. KINO అంటే జర్మనీ భాషలో సినిమా. మునిచ్ ,నురేం బర్గ్, దుస్సేల్ ద్రూఫ్, హాంబర్గ్, ఫ్రాంక్ ఫర్త్, స్టుట్ గార్డ్ నగరాల్లో అదే సమయానికి కొంచెం అటుఇటు గా ఒక్కటే షో ఉంది. వీటన్నిటిని బాలాజీ తో పాటు ఆయా నగరాల్లో చదువుకునే కొంతమంది తెలుగు విద్యార్ధులు కూడా సపోర్ట్ చేస్తున్నారు.టికెట్ రేట్ 13 యూరోలు, మన వాళ్ళు వెంటనే ఆ అమౌంట్ ని రూపాయల్లోకి లేక్కవేసేసుకుని అమ్మో అంత పెట్టి సినిమాకి అవసరమా అనుకుని నెట్ లో పైరసీ ప్రింట్ చూసేసి మమ అనిపించేస్తారు. అసలు ఆ 13 యూరోలే చాలా తక్కువ అనిపించింది నాకు. శుక్రవారం ఇండియాలో సినిమా రిలీజ్ అవగానే మొదటి షో కల్లా వెబ్ సైట్ లో రివ్యూ వచ్చేస్తోంది. జర్మనీ లో ఆదివారం కాని సినిమా రాదు. ఈలోపు ఫ్లాప్ అని తెలిసిపోతే ఆ వచ్చే జనం కూడా ధియేటర్ కి రారు. ఏదో హాబి కోసం చెయ్యటమే తప్ప అక్కడ మన వాళ్ళ జనాభాకి ధియేటర్ లో సినిమా ప్రదర్శిస్తే కనీసం ఖర్చులు వస్తాయేమో తప్ప పెద్దగా లాభం అనిపించలేదు. ఒకరకంగా వారంతా మన తెలుగు సమాజానికి సేవ చేస్తునట్లే భావించాలి. కొన్ని సినిమాలకి ఖర్చులు కూడా రాలేదని బాలాజీ వాపోయాడు. ఇప్పటికీ జెర్మనీ లో సినిమా షెడ్యుల్ నాకు మెయిల్స్ వస్తూనే ఉంటాయి.

బెర్లిన్ నగరం నాకు పెద్దగా తెలియదు. నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ ని బెర్లిన్ వెళ్దాం అని అడిగాను. ఎలాగు వీకెండ్ ఈ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ, మేము కలిసి వెళ్దాం అనుకున్నాం. తనకి తెలుగు సినిమా చూపిస్తాను రమ్మని అడిగాం. కాని వాళ్ళకి వేరే పని ఉండటంతో మమ్మల్ని ధియేటర్ దగ్గర డ్రాప్ చేసి సినిమా అయ్యాక మళ్ళీ వస్తాం అన్నారు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 20 మంది తెలుగు వాళ్ళు అక్కడ నిలబడ్డారు. 4 ఫ్యామిలీలు ఉన్నాయి. మిగతా వాళ్ళంతా స్టూడెంట్స్.సినిమా మొదలయ్యే టప్పటికి మరో 10 మంది వచ్చారు. 40 మందితో చిన్న ధియేటర్ లో సైలెంట్ గా ఎన్ టి ఆర్ సినిమా చూడటం ఓ కొత్త అనుభవం. మాతో పాటు ఒక జర్మన్ కూడా సినిమా చూసాడు. మరి అతనికేం అర్ధం అయ్యిందో సినిమా మాకు అర్ధం కాలేదు. కామెడీ సీన్లో మేము నవ్వుతుంటే అతను మాత్రం సీరియస్ గా సినిమా చూస్తున్నాడు.సినిమా అయిపోయి బయటకి వచ్చేసరికి మార్చిన్ మాకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 
 
Dated : 16.08.2014