Sunday, June 17, 2012

స్మశాన వైరాగ్యం

మృత్యువు. ఈ పదం అంటే మనలో భయం లేనిదెవరికి? ఈ చావును తప్పించుకోవటానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఒక మనిషి బతకడని తెలిసిన తరువాత కూడా చివరి క్షణం వరకూ అతణ్ణి బతికించటం కోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడం.. మనకు చావంటే అంత భయం. మరి చనిపోయిన తర్వాత??? ప్రతి మనిషి వెళ్ళాల్సిన చోటు ఒక్కటే. స్మశానం అతి పవిత్రం.. ఈశ్వరుడు  తాను దగ్గరుండి జీవులను తనలో ఐక్యం చేసుకునే స్మశానం.. ఏమిటీ స్మశానం ప్రత్యేకత? ఇక్కడ అంతిమ సంస్కారం కోసం ఎందుకు తాపత్రయ పడాలి?ఈ ప్రశ్నలకి సమాధానం నాకు గుడ్లవల్లేరు లో స్మశానవాటిక చూడగానే తెలిసింది. తండ్రి బతికున్న వాళ్ళు స్మశానం వెళ్ళకూడదనే ఓ నమ్మకం  ఉండటంతో  చాలామంది స్మశానం లోకి వెళ్ళరు. కానీ అది సాయంకాలం పూట సరదాగా తిరగటానికి వెళ్ళే పార్క్ లాగా ఉంటే? అసలు స్మశానం అనే అనుభూతి కలగపోతే? సరిగ్గా అలాంటి అనుభూతే గుడ్లవల్లేరు స్మశానాన్ని చూసినప్పుడు కలిగింది. ఆధునిక సమాజంలో ఆడవాళ్ళు సైతం తల్లిదండ్రులకి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. గొప్ప వ్యక్తులు చనిపోయినప్పుడు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొంటున్న విషయాల్ని గమనిస్తున్నాం. కానీ దానికి తగ్గ మౌలిక వసతులు మన స్మశానం లో ఉన్నాయా? ఇప్పుడు గ్రామంలో ఎవరైనా చనిపోతే పాడె కట్టే మనుషులు ఉన్నారా? ఆ శవాన్ని మోసే నలుగురు గోత్రికులు దొరుకుతారా? ఒక వేళ దొరికినా వారికి మోసే ఓపిక ఉందా? అన్ని విషయాల్లోనూ హైటెక్ వసతుల్ని, కార్పోరేట్ సంస్కృతిని వంటబట్టించుకుంటున్న మనం, ఆలోచించాల్సిన మరో అంశం ఈ స్మశానం. గ్రామం లో ఇటీవల స్మశానాన్ని అభివృద్ధి చెయ్యాలనే ప్రతిపాదనతో, ముందుగా ఏదైనా మోడల్ స్మశానాన్ని చూడాలి అనుకుని సదరు కమిటీ సభ్యులు శ్రీ మూల్పూరి చెన్నారావు గారు, శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, శ్రీ కొండపల్లి రామకృష్ణ గార్లు గుడ్లవల్లేరు వెళుతూ నాకు కబురు పంపారు. ఆరోజే నేను గ్రామం నుంచి హైదరాబాదు వెళ్తుండటంతో దారిలో ఇది చూసుకుని వెళదాం అని బయలుదేరాం. గుడ్లవల్లేరు చేరుకోగానే అప్పటికే అక్కడ మాకోసం వేచి చూస్తున్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు మమ్మల్ని రిసీవ్ చేసుకుని స్మశానం చూపించి, గ్రామస్తులంతా పలు దఫాలుగా దానిని అభివృద్ధి చేసుకున్న తీరుని వివరించారు.
అసలు బయటనుండి ఆ స్మశానాన్ని చూడగానే ఏదో తెలీని శక్తి లోపలి నడిపించినట్లైంది. ఆ ప్రదేశం లో గడిపిన సమయంలో అసలు అది స్మశానం అనే భావన ఏ కోశానా కలగలేదు. శవాలని తీసుకు రావటానికి ప్రత్యేక వాహనం,దహన సంస్కారాలకి అవసరమైన అన్ని ఏర్పాట్లు నిర్వాహక కమిటీనే చేస్తుంది. దీనికి ఎటువంటి రుసుము లేదు. దాదాపు ఎకరంన్నర  విస్తీర్ణం లో ఉన్న ఆ ప్రదేశం పార్క్ ని తలపించింది.ఎటు చూసిన పూల మొక్కలు, పచ్చిక బయలు, విశ్రాంతి మందిరాలు. మనిషి ఆత్మ భౌతిక దేహాన్ని వదిలి శివైక్యం  చెందేటప్పుడు , కపాలమోక్షం కలిగే టప్పుడు ఎంతటి ప్రశాంతత? లక్షలు ఖర్చుపెట్టి మనిషిని బ్రతికించటానికి తాపత్రయ పడే మనం,ఆ మనిషి చనిపోయాక కనీసం కాలు పెట్టటానికి కూడా భయపడే స్మశానంలో అత్యంత దుర్భరమైన ప్రదేశం లో ఆ ఆఖరి ఘట్టాన్ని ముగిస్తున్నాం. ఇక మన గ్రామం లో కూడా అదే స్థాయిలో స్మశానాన్ని అభివృద్ధి చెయ్యటానికి బీజం పడింది. ఇక ఆ బీజాన్ని మహా వృక్షం గా మలచాల్సిన భాధ్యత మనందరిది. గుడిలో ప్రత్యేక దర్శనానికి వందల రూపాయలని చెల్లిస్తాం. అభిషేకానికి,పూజలకి కూడా టికెట్లు కొనుక్కునే సంస్కృతి లోకి మనం ప్రవేశించి చాలా కాలమే అయింది. భక్తి తో లక్షల, కోట్ల రూపాయల్ని దేవాలయాల అభివృద్దికి వెచ్చిస్తున్న చాలామంది, తమ మరణం అనంతరం చేరుకోవాల్సిన ఈ దేవాలయాన్ని గుర్తిస్తే బావుంటుంది. ప్రముఖ ఫిలాసఫర్ ఓషో తన రచనల్లో స్మశానాన్ని రాజధాని తో పోలుస్తాడు. రాజధాని అంటే మనుషులు స్థిరంగా, శాశ్వతంగా ఉంటేచోటు. రాజధానిలో జనం నివసిస్తారు. ఉంటారు. కానీ ఎవరూ అక్కడ శాశ్వతంగా ఉండరు. రోజు కొంతమంది పుడుతూ, మరికొంతమంది చనిపోతూ ఉంటారు. అది శాశ్వత జనావాసం కాదు. ఈ రోజు కనిపించిన జనం రేపు కనిపించరు. అక్కడ నివసించే జనమంతా మృత్యువు కోసం ఎదురు చూసేవాళ్ళే. అందుకే ఆయన రాజధానిని స్మశానమంటాడు . స్మశానాన్ని రాజధాని అంటాడు. ఎందుకంటే ఎవరయితే స్మశానానికి వస్తారో వాళ్ళు స్థిరపడిపోయినట్లే. వాళ్ళు ఇక అక్కణ్ణించే కదిలే అవకాశమే లేదు. ఊరు వెళ్ళినప్పుడల్లా మనం స్మశానం మీదుగానే వెళ్ళాలి.ప్రసిద్ధ శైవక్షేత్రం గా ప్రసిద్ధి చెందిన మన గ్రామానికి శివుడికి ఇష్టమైన స్మశానం ముఖద్వారంగా ఉండటం యాద్రచ్చికమే. సరిగ్గా ఏడాదిన్నర క్రితం మొట్టమొదటిసారి మన గ్రామ స్మశానం అభివృద్ధి చెయ్యాలనే ప్రతిపాదన ఉందని తెలిసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో నేనూ ఒకడిని. కానీ అది సమగ్ర రూపం దాల్చేవరకు ఎవరికీ చెప్పవద్దని ఆ వ్యక్తి కోరటంతో ఎక్కడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ ఎందుకో ఆ ప్రతిపాదన నాలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. అప్పటికే గుంటూరు లోని హైటెక్ స్మశాన వాటిక గురించి వినటంతో (అక్కడ ఆడవాళ్ళు కూడా స్మశానానికి వెళతారు) మన గ్రామంలో కూడా అలాంటి సౌకర్యాలతో కూడిన స్మశానం చూడాలని అప్పట్నుంచే ఉబలాటం మొదలైంది.
ఆ ప్రతిపాదన ఒక రూపానికి చేరుకున్నాక ఆ వ్యక్తే మళ్లీ నాకు కాల్ చేసి చెప్పటం తో ఆ సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా అందరికి తెలియచేయటం జరిగింది. ఆయనే వీరపనేని సుబ్రహ్మణ్యం. ఎప్పుడు కలిసినా ఏదో ఒక తత్త్వం గురించి,మనిషి జీవితంలో ఒక వయస్సు వచ్చాక, సంపాదన ఒక దశ కి చేరుకున్నాక ఉండాల్సిన ధార్మిక మైన ఆలోచనలు గురించి చెప్తూ ఉండేవారు. మనం సంపాదించని వాటికి మనం హక్కుదారులం కాదు అనే ఆయన తత్త్వం నన్ను బాగా ప్రభావితం చేసేది. కానీ అది కార్యాచరణ లో చేసి చూపించాక ఆ వ్యక్తిత్వం నన్ను మరింత ముగ్దుడిని చేసింది. చిన్నపుడు స్కూల్ లో చదివేటప్పుడు పక్కనున్న స్నేహితుల్ని కొంతమంది అనేవాళ్ళు వాడికేమిటిరా వాళ్ళ తాత  పాతిక ఎకరాల ఆసామి, ఆ పొలం కౌలుకిచ్చినా బతికేయచ్చు అని. సిటీ కి వెళ్ళాక కొంచెం అటు ఇటుగా అదే మాటలు, వాడి బాబు బిజినెస్  లో కోట్లు సంపాదించాడు, రెండు ఇళ్ళు కట్టాడు, ఇక వీడు చదివి ఏం చెయ్యాలి. వాటి అద్దెల మీదే బతికేయచ్చు అని. కానీ తమ తాతలు ఇచ్చిన ఆస్తిని ఒక్క పైసా తీసుకోకుండా మొత్తాన్ని ధార్మిక కార్యక్రమాలకే వెచ్చించాలని నిర్ణయం తీసుకున్న వీరపనేని సోదరులు సుబ్రహ్మణ్యం,ఆనంద్ తమ ఆలోచనని స్మశానం అభివృద్ధి తో ఆచరణ లో పెట్టారు. మాకు గుడ్లవల్లేరు స్మశానాన్నిచూపించిన సుబ్బారావు గారు ఆనంద్ గారికి బావ. బహుశా ఆ స్మశానాన్ని చూసాకే వారికి మన గ్రామం లో కూడా అలాంటి అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన వచ్చిందేమో. గొర్రెపాటి విద్యా ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యం లో శ్రీ మూల్పూరి చెన్నారావు గారు సలహాదారుగా, శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ ఈ నిర్మాణ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.దీనికి సంభందించిన ప్రకటనని శ్రీ  గొర్రెపాటి రంగనాధ బాబు గారు ఇటీవలె విడుదల చేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, విరాళంగా ఇచ్చే ప్రతి రూపాయికి మరొక రూపాయి వీరపనేని సోదరులు జత చేస్తామనటం ద్వారా మిగతా వారందరికి కూడా ఇందులో భాగస్వామ్యాన్ని కల్పించారు.అంటే అందరు కలిసి 25 లక్షలు ఇస్తే వారొక్కరే ఆ 25 లక్షలు ఇస్తారు. ఒక వేళ అందరూ ఇచ్చినవి 50 లక్షలైతే వారు 50 లక్షలు ఇస్తారు. ఒక రకంగా ఇది చాలా మంచి ఆలోచన. కోటిరూపాయలున్న ఒక వ్యక్తి పదివేలు విరాళం గా ఇవ్వగలిగినప్పుడు లక్షరూపాయలున్న వ్యక్తి వంద రూపాయలు విరాళం గా ఇవ్వటం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. సినిమాల్లో చూపించినట్లు మనల్ని మోసే  నలుగురు కొన్నాళ్ళకి కాగడా పెట్టి వెతికినా మనకి దొరకరు.శవయాత్ర ఇక ట్రాలీ ఆటో లోనే. రాజధాని నగరం లో చావు కూడా పెళ్ళిలాంటిదే అని సినీకవి అన్నట్లు,స్మశానం మన  రాజధాని, మన పెద్దలు శాశ్వతం గా ఉండే చోటు....మన దేవాలయం.


Dated : 03.06.2012
www.managhantasala.net

అమ్మో ఘంటసాల అమ్మాయిలా??


'
ఇటీవలే మన గ్రామ వాసికి ఎదురైన అనుభవం ఇది.పాతికేళ్ల క్రితం పాతుకు పోయిన భావాలు ఇప్పటికి సజీవం గానే ఉన్నాయనటానికి నిదర్శనం ఈ సంఘటన.

సరదాగా చెప్పుకుంటే ,ఇటీవలే ఒక మిత్రుడు తమకి తెలిసిన వాళ్ల అమ్మాయికి సంభంధం చూడటానికి తమ దూరపు బంధువులని సంప్రందించాడు.మంచి కుటుంబం ,మంచి అమ్మాయి, అయినా సరే,  వాళ్లనుంచి అతనికెదురైన సమాధానానికి ఆశ్చర్యపోయాడు.అమ్మో ఘంటసాల అమ్మాయిలా?? మనవాడికి అర్ధం కాలేదు.ఇదెప్పుడో పాతమాట, ఈ తరానికి బొత్తిగా తెలియని విషయం.ఆశ్చర్యం కాక మరేమిటి.

సహజం గానే అటు దివిసీమ,ఇటు మచిలీపట్నం తీరప్రాంతాలతో పోల్చుకుంటే మనది మెరక ప్రాంతం.(ఎత్తులో ఉన్న ప్రాంతం) పాత సామెత ఏమిటంటే మెరక ఊళ్ల ఆడవాళ్లతో గెలవలేము అని. సహజం గానే మన ఊరి అమ్మాయిలంటే గడుసు వాళ్లు అని పేరు అట.ఇప్పటి తరం గురించి తెలీదు కాని,అప్పట్లో మన ఊరి వాళ్లతో వియ్యమందాలంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలొచించేవాళ్లంట. వీళ్లతో మనం ఇమడగలమా అని.అయినా మన ఊరి అమ్మాయిలని చేసుకోవాలనే ఆశ మాత్రం మనసులో ఉండేది, ఎందుకంటే మన వాళ్ల మర్యాదలు పెట్టిపోతలు అలా ఉండేవి మరి.ఈనాటికీ అవి అలాగే ఉన్నాయనుకోండి.కాని ఘంటసాల అమ్మాయిలంటే ఆ భయం మాత్రం ఇప్పటికీ అలాగే ఉందనటానికి సాక్ష్యం  పైన జరిగిన సంఘటన.ఇక మన వాళ్లనే అడిగితే అది నిజమే కదా అని నవ్వుతూ చెప్తారు.మనం అధికులమని ఎవరైనా భయపడుతుంటే లోలోపల ఆనందం సహజమే కదా.కాని కుటుంబం గురించి,పిల్లల గురించి మన ఊరి ఆడవాళ్ల అలోచనలే వేరు.ఎప్పుడూ తన పిల్లలు తన భర్త నంబర్ వన్ గా ఉండాలనే తాపత్రయం అడుగడుగునా కనిపిస్తుంది.పిల్లల భవిష్యత్తు కోసం,తమవైన భాధ్యతలను పణం గా పెట్టే తెగువ మన ఊరి ఆడవాళ్ల సొంతం.బహుశా ఆ తాపత్రయమే వాళ్లని గడుసువాళ్లు గా లోకానికి చూపించిందేమో?

విలక్షణ క్షణాలు


విలక్షణ క్షణాలు

జలుబు చేసినపుడు తుమ్ము వస్తే చిరంజీవ అంటారు పెద్దవాళ్ళు ,కానీ మన ఊర్లో మాత్రం చిరంజీవ తో పాటు ఇంకో మాట కూడా అనటం అలవాటు,గోపాలకృష్ణ తాత దగ్గర మందు బిళ్ళ తెచ్చుకో అని. చిన్నపాటి దగ్గు జలుబు వస్తే ముందు గుర్తొచ్చే పేరు మందులషాపు గోపాలకృష్ణ. నా మటుకు నేను ఆరోగ్యం బాగోలేనపుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సందర్భాలకంటే గోపాలకృష్ణ తాత దగ్గరికి వెళ్ళిన సందర్భాలే ఎక్కువ. నాకే కాదు ఊర్లో పెరిగిన చాలామందికి కూడా ఇదే అలవాటు. ఎప్పుడూ తెల్లటి పాంటు, షర్టు ,పచ్చటి వర్చస్సు ,చిరాకు కనపడని మోము ,చిరునవ్వుల పలకరింపు,చిన్నవాళ్ళని మనవడా అని అప్యాయం గా నూ,వరుస అయిన వాళ్ళని అల్లుడూ పలకరించే గోపాలకృష్ణ తాత అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ,గౌరవం. ఆయన జీవితాన్ని తరచి చూసిన వాళ్ళు లేరు.ఆ విలక్షణ వ్యక్తిత్వం గురించి ఆసక్తి ని ప్రదర్శించిన వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అది అయన మీద మనకున్న గౌరవం. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 35 ఏళ్ల పాటు చుండూరి అప్పారావు గారి మిద్దె లో సాగిన గోపాలకృష్ణ మెడికల్ ఎంపోరియం ప్రస్థానం ఎన్నో చర్చలకి వేదిక అయ్యింది. ఎంతో మంది పెద్దల వాదోపవాదాలకు, మేధోమధనానికి సాక్షి గా నిలిచింది. అన్నిటిని మించి ఆయన పేదోడి డాక్టర్, పెద్దోడి కాంపౌండర్.

ఏడుపదుల జీవితం, నాలుగు దశాబ్దాల మందుల షాపు వ్యాపకం లో ఇంటినుంచి బయలుదేరితే మందుల షాపు కి తప్ప ఆ అడుగు ఊర్లో ఇంకో దిక్కుకి తిరిగిన దాఖలాల్లేవు.ఈ నాలుగు దశాబ్దాలలో అయన మన ఊర్లో వెళ్ళిన ఒకే ఒక ఇల్లు కొండపల్లి రంగారావు గారిది.అది కూడా అయన కుమార్తె వివాహానికి రమ్మని బలవంతం గా తీసికెళ్తెనే. ఇంకోటి నేనెరిగిన సందర్భం, తన మేనల్లుడి కుమార్తె వివాహానికి పొరుగునే ఉన్న కొత్తపల్లి వెళ్ళటం.ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఆయన్ని ఆశ్చర్యంగా చూడటం నాకు గుర్తు. ఈ రెండు మినహా ఈ 40 ఏళ్లలో అయన ఎక్కడికి వెళ్ళిన సందర్భాలు లేవు.అదే కుర్చీ, అదే టేబుల్,దాని నిండా  దినపత్రికలు,ఇదే అయన ప్రపంచం అదో విలక్షణ జీవన విధానం. ఒక రోజు నేనే అడిగా ఒకే పని ఇన్నేళ్ళుగా చేస్తుంటే బోర్ కొట్టదా తాతా . ఇలాగే ఉండాలి అని నియమం ఏమన్నా పెట్టుకున్నారా,ఈ జీవితం మీకు సంత్రుప్తినిచ్చిందా అని.ఆ ప్రశ్నల అనంతరం ఆయన చెప్పిన సమాధానాలు అయన తో కూర్చున్న క్షణాలు నా జీవితం లో నేను గడిపిన విలక్షణ క్షణాలు.అలా ఉండటం వెనుక బలీయమైన కారణాలేవీ అయన చెప్పలేదు.అందరికంటే నేనే ప్రత్యేకం అని గర్వపడలేదు. తెలుపంటే చదువుకునేప్పటినుంచి ఇష్టం అందుకే అవే దుస్తులు.మొదట్లో ఎవరైనా సందర్భానికి పిలిస్తే వెళ్ళేవాడిని కాదు తర్వాత తర్వాత నేను ఎలాగూ రానని పిలవటం మానేశారు. నాకూ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇక సంతృప్తి గురించి ఇపుడు నువ్వు అడిగే దాక నేను ఆలోచించలేదు. ఇవీ అయన సమాధానాలు. భార్యా వియోగం ఆయన్ని క్రుంగ దీసినా ఆ తాలూకు ఛాయలు మచ్చుకైనా ముఖం లో ప్రతిబింబించని గంభీరుడు గోపాలకృష్ణ తాత. ఇన్నేళ్ళుగా మందులషాపు నడుపుతున్నా ఆయన సంపాదించినదేమి లేదు ఒక్క మనమిచ్చే ప్రేమ గౌరవం తప్ప. ఎందుకంటే అయన చేస్తుంది వ్యాపారం కాదు,వ్యాపకం.
ప్రస్తుతం ఆ షాపు వీరయ్య గారి కాంప్లెక్స్ లోకి మారింది. స్థానం తో పాటు కూర్చునే మనుషులూ మారారు.ఆనాటి పెద్దలు లేరు ,ఆ చర్చలు లేవు. కానీ గోపాల కృష్ణ తాత పయనం మాత్రం ఆగలేదు.

28.08.2011
www.managhantasala.net