Sunday, October 20, 2013

నా ఐరోపా యాత్ర - 11(పోలాండ్)


జాకోపాన అనేది గ్రామం పేరు. అక్కడున్న పర్వతాల్ని Tatra Mountains అంటారు. క్రాకో నుండి 110 కిలోమీటర్లు ప్రయాణించాక జాకోపాన చేరుకున్నాం. ఆదివారం కావటంతో అక్కడికి వెళ్ళే కార్లతో అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దారిలో చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ, ఎత్తైన కొండలు మధ్యలో విశాలమైన రోడ్డు మీదుగా అత్యంత ఆహ్లాద కరంగా మా ప్రయాణం సాగింది. మధ్యలో ఒక ఊరుని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఊర్లోనే జన్మించాడు అని.జాకోపాన చేరుకున్నాక ఊరు మొదట్లోనే కార్ పార్క్ చెయ్యాలి. అక్కడినుండి పర్వతాల పైకి వెళ్ళే చోటుకు బస్సు లో కాని గుర్రపు బగ్గీలో కాని వెళ్ళాలి. పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడికి వాహనాలు నిషేధం. నాతొ పాటు ఉన్నవాళ్ళంతా నడిచి వెళ్దాం అన్నారు. కాని నా వల్ల కాదు అని గుర్రపు బండిలో వెళ్దాం అని చెప్పాను.నా జీవితంలో అప్పటిదాకా గుర్రపు బండి ఎక్కలేదు.ఆ ముచ్చట కూడా తీరినట్లుంటుందని గుర్రపు బండి ఎక్కాము. అది ఎక్కిన తర్వాత దిగేదాకా ముక్కు మూసుకునే ఉన్నాం. ఆ గుర్రం నుండి ఒకటే వాసన.
మొత్తం మీద ఒక కిలోమీటర్ పైగా ఏటవాలు ప్రాంతంలోకి ప్రయాణించాక పర్వతాల దగ్గరకి చేరుకున్నాం. పర్వతాలకి ఆవైపున స్లోవేకియా దేశం ఉంది. జెకోస్లోవేకియా దేశం 1993 లో చెక్ రిపబ్లిక్ మరియు స్లోవేకియా అనే రెండు దేశాలుగా విడిపోయింది. జాకోపానా పర్వతాలు పోలాండ్ లోనే అతి ఎత్తైన ప్రాంతం. వీటి విస్తీర్ణం 785 చదరపు కిలోమీటర్లు. ఎత్తు 2600 మీటర్లు. ఈ పర్వతాలలో 22 % స్లోవేకియాలో , మిగతా భాగం పోలాండ్ లో ఉన్నాయి.ఆ రోజు ఉష్ణోగ్రత 5 డిగ్రీలు ఉంది,పర్వతాల పైన -5 డిగ్రీలు చూపిస్తోంది.పర్వతాల పైకి వెళ్ళటానికి కేబుల్ కార్లు ఉన్నాయి.కొంతమంది హ్యాండ్ స్టిక్స్ పట్టుకుని ట్రెక్కింగ్ కి వెళుతున్నారు. మరికొంతమంది వెళ్ళేటప్పుడు కేబుల్ కార్ లో వెళ్లి వచ్చేటప్పుడు నడిచి వస్తున్నారు. టికెట్ కౌంటర్ దగ్గర ఒక 50 మందికి పైగా క్యూ లో ఉన్నారు.పైకి వెళ్లి కిందకి రావటానికి మనిషికి 50 జిలోటీలు. నేను, మార్చిన్ క్యూ లో నిల్చున్నాం.
ఆ క్యూ పక్కనే ఒక వయసు పైబడిన వ్యక్తి సన్నని రాగి తీగలతో ఒక వస్తువు తయారు చేయటం గమనించాను. విద్యుత్ వైర్లలో ఉండే కాపర్ తీగలని సమాన మైన ముక్కలుగా చేసి ఒకే కోణంలో వాటిని వంచి అతను తయారు చేసిన వస్తువు రకరకాల ఆకృతులలోకి మారుతోంది. అతను వేసుకున్న కోటు అంతా చిరుగులే. ఇల కాస్టుయ ( ile koszt) అని పోలిష్ భాషలో ప్రశ్నించాను. దానికతను 10 జిలోటీ అని బదులిచ్చాడు. అతని పని తనానికి అది చాలా తక్కువ అనిపించింది. నేను రెండు కొని మిగతావాళ్ళ చేత తలా ఒకటి కొనిపించాను.అందరూ డబ్బులిచ్చాక అతని కళ్ళలో కృతజ్ఞతా భావం కనిపించింది. టికెట్ తీసుకుని కేబుల్ కార్ స్టేషన్ లోకి నడిచాం.దూరం నుండి పైనుండి కిందకి వచ్చే యాత్రీకులు ఉన్న కేబుల్ కార్ కనిపించింది. అసలు అంత ఎత్తువరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర కింద అంతా అడవి ఉన్న ప్రాంతంలో ఆ కేబుల్ ఎలా వేసారో అంతు పట్టలేదు.ఈ నిర్మాణాన్ని 1936 లోనే నిర్మించారు,అప్పుడు కేవలం ఒక చైర్ కార్ మాత్రమే ఉండేది. కాల క్రమేణా వాటి స్వరూపం మారుతూ వచ్చింది. అప్పటి చిత్రాలన్నీ అక్కడ ప్రదర్శన కి ఉన్నాయి. కాని అప్పట్లో అంతమంది యాత్రీకులు వచ్చేవారు కాదట. 1980 వ దశకం నుండే ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎక్కువైంది. సాధారణంగా పోలాండ్ వాసులంతా వేసవి సెలవలకి ఇక్కడికి వస్తారు.మేము వెళ్ళింది అటు వేసవికాలం ఇటు చలికాలం కాని సమయం.
కేబుల్ కార్ రాగానే అక్కడ నిరీక్షిస్తున్నవారంతా వడి వడిగా అందులోకి ఎక్కాము. ఇక్కడ కూడా మేము మాత్రమే ఇండియన్స్. 2600 మీటర్ల ఎత్తులోకి మా ప్రయాణం మొదలైంది.10 నిమిషాలు ప్రయాణించా క మధ్యలో ఒక స్టేషన్లో ఆగింది. అంత దూరం కేబుల్ ని వెయ్యటం సాధ్యం కాదు కాబట్టి మధ్యలో ఒక స్టేషన్ ని ఏర్పాటు చేశారు. అక్కడ దిగి మరో కార్ ఎక్కాలి. అక్కడనుంచి మరో 10 నిమిషాలు ప్రయాణించాకపర్వతాల పైకి చేరుకున్నాం.కేబుల్ కార్ దిగి బయటకి రాగానే జివ్వుమంటూ చలిగాలి శరీరాన్ని తాకింది.చుట్టూ చూడగానే మేఘాలు, పొగమంచు తో ప్రకృతి కను విందు చేసింది.ఎటు చూసినా యాత్రికులంతా హ్యాండ్ స్టిక్స్ తో అక్కడున్న గుట్టలపైన ట్రెక్కింగ్ చేస్తున్నారు. అక్కడ ఒక రెస్టారెంట్, సావనీర్స్ అమ్మే షాపు,కొన్ని బొమ్మల దుకాణాలు ఉన్నాయి.
యూరప్ లో ప్రతి సందర్శనీయ స్థలంలో ఆ నిర్మాణం తాలూకు మినియెచర్, కాయిన్స్, ఫొటోస్ లభిస్తాయి. వెళ్ళిన టూరిష్టులంతా మెమరీ కోసం అవి కొంటుంటారు. పైన దాదాపు 5కిలోమీటర్ల మేర నడిచే ప్రాంతం ఉంది. చుట్టూ ఉన్న పర్వతాల అంచులలో చీమలలగా జనాలు కనిపిస్తున్నారు.మేము కూడా సరదాగా ఫోటోలు తీసుకుంటూ 2 కిలోమీటర్లు నడిచాం. పర్వతాల పైన సిగరెట్ తాగటం నిషేధం.అది పర్వతాలలో అగ్ని ప్రమాదానికి దారి తీస్తే వాటిని నియంత్రించటం ఎవరి వల్లా కాదు.నియమాలని పాటించటంలో పోలాండ్ వాసులు ముందు ఉంటారు. ఒకవేళ సిగరెట్ కాల్చినా దానిని నీటితో ఆర్పి పారేస్తున్న సందర్శకులు చాలామంది కనిపించారు.ఆ పర్వతాలమీద అన్నిటికంటే ఎత్తులో ఉన్న హై పాయింట్ కి చేరుకున్న్నాం.
అప్పటికి మధ్యాహ్నం 2 గంటలైంది. మళ్లీ కేబుల్ కార్ లోనే కిందకి వచ్చేసాం. అప్పటికే ఆకలి దంచేస్తుండటం తో ఏమైనా తిందామని అక్కడున్న రెస్టారెంట్ కి వెళ్ళాం. కాని శశికి అవేమి నచ్చకపోవటంతో దారిలో తిందాం అని కార్ దగ్గరికి బయలు దేరాం. ఇప్పుడు మాత్రం గుర్రపు బండి ఎక్కకుండా, బస్సు ఎక్కాము.బస్ చార్జ్ ఒక్కొక్కరికి 3 జిలోటీలు.జాకోపాన నుండి కారులో మా తిరుగు ప్రయాణం మొదలైంది.దారిలో మెక్ డొనాల్డ్స్ కనిపించటంతో ప్రాణం లేచివచ్చింది.ఆబగా బిగ్ మాక్ లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి,అందరూ నిద్రలోకి జారుకున్నారు.నేను ముందు సీట్లో ఉండటంతో మార్చిన్ కి నిద్ర రాకుండా కబుర్లు చెపుతూ ఉన్నాను. ఇంకా మింజు జేర్జ్ 500 కిలోమీటర్లు ఉంది. వెళ్ళేటపుడు ఉత్సాహంగా వెళ్ళినా, తిరిగి వచ్చేటపుడు మాత్రం ఇంత దూరమా అనిపించింది.ఆ రోజుతో సెలవలు ముగియటంతో రోడ్లన్నీ తిరిగి వెళ్ళే జనాలతో జామ్ అయిపోయాయి. మేము అక్కడక్కడా షార్ట్ కట్స్ వెతుకుంటూ చిన్న చిన్న రోడ్లలోనుండి 4 గంటలు ప్రయాణించాక హైవే ని చేరుకున్నాం.నా దగ్గర ఐపాడ్ ఉండటంతో అందులో మాప్స్ ద్వారా ఎప్పటికపుడు మేమున్న ప్రాంతాన్ని తెలుసుకోగలిగాం.దాదాపు 7 గంటలు ప్రయాణించాక రాత్రి 11 గంటలకి మింజు జేర్జ్ చేరుకున్నాం.ఇలా నా మొదటి పోలాండ్ యాత్ర ముగిసింది.ఈ యాత్ర కాకుండా నేను చూసిన మరో పట్టణం పోలాండ్ రాజధాని వార్సా.ఇక్కడే మన ఇండియన్ ఎంబసీ ఉంది.పోలాండ్ లో భారతీయులకి ఎవరికైనా రెసిడెన్స్ వీసా కావాలంటే మన ఎంబసీ నుండి జనన ధృవీకరణ పత్రం కావాలి. ఇదంతా పెద్ద ఫార్సు వ్యవహారం.పుట్టిన తేదీ ఆల్రెడీ పాస్ పోర్ట్ మీద ఉంటుంది. అయినా సరే వీళ్ళకి ఆ లెటర్ కావాలి. మింజు జేర్జ్ నుండి వార్సా 550 కిలోమీటర్లు.పోజ్ నాన్ నుండి ట్రైన్ లో వెళ్ళాలి.నేను పోలాండ్ వెళ్ళిన నెల రోజులకి జూన్ 14న ఉదయం నేను, ఉదయ్ అమ్మణ , అప్పటికే 5 సంవత్సరాలనుండి అక్కడ పనిచేస్తున్న సోజో జార్జ్ అనే మలయాళీ కలిసి బయలుదేరాం. 

Dated : 17.10.2013