Saturday, October 31, 2015

నా ఐరోపా యాత్ర - 26 (బెల్జియం )

లక్సెంబర్గ్ నుండి బ్రస్సెల్స్ 240 కిలోమీటర్లు. మేము బయలుదేరేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. నేరుగా ప్రయాణించి సాయంత్రం 6 గంటలకల్లా బ్రస్సెల్స్ చేరుకున్నాం. ముందు రోజు రాత్రి కూడా నిద్ర లేకపోవటంతో నేరుగా హోటల్ కి చేరుకొని ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నాం. మరుసటి రోజు ఉదయం మే 4 వ తేది 2013 మా అదృష్టమో లేక యాద్రుచ్చికమో తెలియదు కాని ఆ రోజున మేము బ్రస్సెల్స్ లో ఉండగలిగాం. హిట్లర్ పాలనకి రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన నరమేధానికి చరమ గీతం పాడిన రోజు అది. 1945 మే 4 న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరి సారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే 4 న సోవియెట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించటంతో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది.ఈ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్య రాజ్య సమితి నెలకొల్పబడింది. మరోవంక, ఈ యుద్ధం కారణంగానే  ఐరోపా దేశాలన్నీ ఏకీకరణ దిశగా అడుగులు పడటం మొదలయింది. అటువంటి చారిత్రాత్మక రోజున ఐరోపా రాజకీయ రాజధాని అయిన బ్రస్సెల్స్ లో ఉండటం మా అదృష్టమనే చెప్పాలి.
ఐరోపా రాజకీయ రాజధాని అని ఎందుకన్నానంటే యూరోపియన్ సమాఖ్య పార్లమెంట్ భవనం బ్రస్సెల్స్ లోనే ఉంది. ఐరోపా సభ్య దేశాల నుండి ఎన్నికైన ప్రతినిధులంతా ఇక్కడి పార్లమెంట్ భవనంలోనే సమావేశమవుతారు.ఐరోపా సమాఖ్య తీసుకునే పలు కీలకమైన నిర్ణయాలకి ఓటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఈ సమాఖ్య రూప కల్పనలో కీలకంగా వ్యవహరించిన 5 దేశాల్లో బెల్జియం ఒకటి. అందుకే ఈ భవనాన్ని ఇక్కడ నిర్మించారు. 1952 లో ఇక్కడ తొలి సమావేశం జరిగింది. కొత్త దేశాలు ఈ యూనియన్ లో చేరాలన్నా, ఏదైనా సంక్షోభంలో ఉన్న దేశాలని ఆదుకోవాలన్నా ఈ పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. మేము మాములుగానే ఆ పార్లమెంట్ చూద్దామని ఉదయం 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళాం. ఆరోజు అంతా అక్కడ సందడిగా ఉంది జనాలంతా పార్లమెంట్ ముందు క్యూ లో నిలబడ్డారు. అప్పుడే మాకు మే 4 అనే విషయం గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజున ప్రజలందరినీ పార్లమెంట్ చూడటానికి అనుమతిస్తారు. అంతే కాదు నేరుగా పార్లమెంట్ సమావేశాలు జరిగే హాల్ లోకి వెళ్లి కూర్చోవచ్చు. పార్లమెంట్ పని తీరు , ఓటింగ్ జరిగే ప్రక్రియ అంతా అక్కడ చూడవచ్చు. నేను మాక్ ఓటింగ్ జరిగే చోటుకి వెళ్లి అసలు ఆ విధానం ఎలా ఉంటుందో అని చూసి నేను కూడా ఓటింగ్ లో పాల్గొన్నాను. పార్లమెంట్ హలో కూర్చొని మాక్ పార్లమెంట్ లో మాట్లాడటం మరిచిపోలేని అనుభవం.




హాల్ బయట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండవ ప్రపంచ యుద్ధం తాలూకు ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. యుద్ధం ముగిసిన దగ్గరనుండి ఐరోపా సమాఖ్య ఏర్పాటు వరకు జరిగిన వివిధ ఘట్టాలని ఫోటోల రూపంలో వలయాకారపు ఓపెన్ ఆడిటోరియం లో చుట్టూ ఉంచారు. సందర్శకులందరికీ గుర్తుగా వారి ఫోటోని ప్రింట్ చేసి షర్ట్స్ ఉచితంగా ఇస్తున్నారు. సావనీర్లు, ఫోటోలకైతే లెక్కే లేదు. మేము కూడా ఆ పార్లమెంట్ సందర్శించినట్లు గా వారి నుండి ఒక అధికారిక ఫోటో తీసుకున్నాం. సందర్శకులంతా అక్కడ ఒక పచ్చటి పలక పై తమ సందర్శనకి గుర్తుగా సంతకాలు చేస్తున్నారు. మేము కూడా మా పేర్లు రాసి ఇండియా అని రాసాము. దాదాపు 4 గంటల సమయం అక్కడే గడిపి అక్కడినుండి సిటీ చూద్దామని బయటకి వచ్చాము. బెల్జియం లో ఎక్కువశాతం మంది కాథలిక్కులు అయినా అన్ని మతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. 2007 లో బౌద్ధులు తమ మతాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెల్జియంలో ఐదు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. అక్కడక్కడా మసీదులు కూడా కనిపించాయి, కాకపొతే మిగతా దేశాల్లో కనిపించే ఆకృతిలో కాకుండా ఒక బిల్డింగ్ లో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో బురఖాని నిషేదించిన మొట్ట మొదటి యూరప్‌ దేశంగా బెల్జియం నిలిచింది. 2010 లో బ్రస్సెల్స్‌ ఫెడరల్‌ పార్లమెంటు దేశీయ వ్యవహారాల కమిటీ పాక్షికంగా, లేదా సంపూర్ణంగా బహిరంగ ప్రదేశాల్లో బురఖాని ధరించకుండా నిషేధం విధిస్తూ శాసనంద్వారా ఏకగ్రీవ తీర్మానం చేసింది. మేము వెళుతుండగా St. Michael and St. Gudula Cathedral కనిపించింది. ఇది అత్యంత పురాతనమైన ఎత్తైన చర్చి. 11 వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభిస్తే 1519 నాటికి గాని పూర్తి కాలేదు.కారు లోనుండే ఆ చర్చి ఫోటో తీసుకున్నాను.

అక్కడినుండి నేరుగా ఆటామియం దగ్గరికి వెళ్ళాము. 1958 లో ఒక ఎగ్జిబిషన్ నిమిత్తం దీనిని నిర్మించారు. బ్రస్సెల్స్ ఎక్స్ పో భవనం ముందు కొద్ది దూరంలో ఇది ఉంది. దీని ఎత్తు 335 అడుగులు, బెల్జియం లో ఇది వింతైన నిర్మాణం. పైకి వెళ్ళటానికి మెట్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఒక మ్యూజియం. పైకి వెళ్ళాలంటే టికెట్ ఉంది.

దీనికి పక్కనే మినీ యూరోప్ మ్యూజియం కూడా ఉంది. ఒక్కో దేశం నుండి ఒక్కో నిర్మాణాన్ని తీసుకుని వాటి మినీ రూపాలని ఇక్కడ నిర్మించారు. యురోపియన్ సమాఖ్యలో ఉన్న అన్ని దేశాల ఐకానిక్ భవనాలన్నీ మినియెచర్ రూపంలో ఇక్కడ చూడవచ్చు. బ్రస్సెల్స్ వెళ్తే మాత్రం చాక్లెట్ వాఫ్ఫెల్ తినకుండా మాత్రం రావద్దు. ఇక్కడ ఈ ఐటెం చాలా ఫేమస్ ఆటామియం పక్కనే చిన్న వాన్ లో వాఫెల్ అమ్ముతుంటే అక్కడే తిన్నాం. అప్పటికే హోటల్ చెక్ అవుట్ చెయ్యటంతో అక్కడినుండి నేరుగా నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాంకి బయలుదేరాం. 

Thursday, October 29, 2015

నా ఐరోపా యాత్ర - 25 (లక్సెంబర్గ్)

పారిస్ నుండి నేరుగా బెల్జియం వెళ్దామని అనుకున్నాం. అలా వెళితే కేవలం 4 గంటల్లో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరుకోవచ్చు. కాని ఈలోపు మార్చిన్ మరో ఆలోచన చేశాడు నేరుగా బెల్జియం వెళ్లి ఏమి చేస్తాం అర్దరాత్రి పూట అని కారుని లక్సెంబర్గ్ వైపు పోనిచ్చాడు. అలా మా ప్లాన్ లో లేకుండానే మరో దేశం వెళ్ళాము. వెర్సైల్స్ నుండి లక్సెంబర్గ్  430 కిలోమీటర్లు దూరం. అప్పటికి సమయం రాత్రి 9 గంటలు అవుతోంది.అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఈ వాతావరణంలో గొప్పతనమో లేక రోడ్ల మహత్యమో కాని ఎంత దూరం ప్రయాణం చేసినా అలసట ఉండేది కాదు. మార్చిన్ అయితే ఏకధాటిగా 600 కిలోమీటర్లు డ్రైవ్ చేసినా అసలు అలిసిపోయేవాడు కాదు. మేము లక్సెంబర్గ్ చేరుకునేటప్పటికి ఉదయం 8 గంటలు అయ్యింది. పెద్దగా జన సంచారం లేదు.

యూరోపియన్ యూనియన్ ఆవిర్భావానికి , ఏకీకృత వీసా విధాన ఒప్పందం జరిగింది ఈ దేశంలోనే. 1985 జూన్ 14 న బెల్జియం, లక్సెంబర్గ్ , ఫ్రాన్స్ , నెదర్లాండ్స్, పశ్చిమ జర్మనీ (అప్పటికి తూర్పు జర్మనీ వేరుగా ఉండేది 1990 లోనే బెర్లిన్ గోడని కూల్చటం ద్వారా జర్మనీ ఏకం అయ్యింది) దేశాలు లక్సెంబర్గ్ లో ఉన్న Schengen అనే పట్టణంలో మొదటిసారి యూరోపియన్ యూనియన్ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఒక దేశానికి మరో దేశానికి మధ్య సరిహద్దుల్ని తీసివేసి ఒకే వీసా తో ఈ 5 దేశాలు వెళ్ళగలిగే సౌకర్యాన్ని కల్పించాయి. తరువాత దశల వారీ గా మరో 23 దేశాలు ఇందులో భాగస్వాములయ్యి ప్రస్తుతం 28 దేశాలు ఈ ఒప్పందం కిందకి వచ్చాయి. ఈ ఒప్పందం Schengen అనే పట్టణంలో జరిగింది కాబట్టి యూరోప్ వీసా ని Schengen వీసా అంటారు.ఇప్పుడు మేము ఉన్నది ఆ Schengen ఉన్న దేశంలోనే. రాత్రి పెద్దగా ఏమీ తినకపోవటంతో ఆకలి దంచేస్తోంది.కార్ పార్క్ చేసిన వెంటనే ఎదురుగా మెక్ డొనాల్డ్స్ కనిపించటంతో ప్రాణం లేచి వచ్చింది.

ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మెక్ డొనాల్డ్స్ లో మాత్రం ఒకే రుచిలో ఒకే ధరలో ఆహరం దొరుకుతుంది. మేము తిరిగిన 10 రోజుల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, అన్నీ ఎక్కువ సార్లు మెక్ డొనాల్డ్స్ లోనే తిన్నాం. ప్రపంచ వ్యాప్తంగా 33000 అవుట్ లెట్స్ ఉన్న అతి పెద్ద చైన్ రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్. యూరప్ హైవేల మీద ప్రతి 20 కిలోమీటర్లకి ఒక మెక్ డొనాల్డ్స్ కనిపిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేసి బయటకి రాగానే పక్కన షాపులో అద్దాలలో నుండి ఒక హాండ్ బాగ్ కనిపించింది. భార్గవికి అది బాగా నచ్చటంతో లోపలి వెళ్లి 25 యూరోలు పెట్టి అది కొనుక్కుంది.అప్పటిదాకా ఏది కొనుక్కోమని చెప్పినా యూరోని ఇండియా డబ్బుల్లో లెక్క వేసేసుకుని బాబోయ్ నాకొద్దు అంటూ వచ్చేసేది. మొత్తమ్మీద లక్సెంబర్గ్ లో ఒక హ్యాండ్ బాగ్ కొనుక్కుంది. అక్కడినుండి సిటీ మొత్తం కారులోనే తిరుగుతూ చూశాము. 

లక్సెంబర్గ్ ఐరోపాలో 8 వ తక్కువ జనాభా కలిగిన దేశం.మొత్తం జనాభా 5 లక్షలు. దీని ముఖ్య నగరం కూడా లక్సెంబర్గ్. ఇటీవలే ఈ దేశ ప్రధాని తన సహచరుడుని వివాహమాడాడు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఒక దేశాధ్యక్షుడు చేసుకున్న" గే " వివాహంగా ఇది పేరు పొందింది.2014 లో యునైటెడ్ నేషన్స్ సర్వే  ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక  తలసరి ఆదాయం కలిగి అత్యధిక GDP తో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడింది. ప్రపంచంలో ఉన్న బహుళ జాతి కంపెనీలు అన్నీ ఇక్కడొక ఆఫీసుని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టాక్స్ విధానాలన్నీ చాలా సరళీకృతం గా ఉంటాయి. మీరు తెచ్చే డబ్బులకి లెక్కలు అవసరంలేదు. మన దేశంలో ఉన్న బ్లాక్ మనీ ని తెల్ల డబ్బుగా మార్చుకోవాలంటే ఇక్కడొక కంపెనీ ని తెరిచి దాని ద్వారా విదేశీ పెట్టుబడి కింద మన దేశంలోని కంపెనీలకి తరలించవచ్చు. మారిషస్ , సైప్రస్ ,లక్సెంబర్గ్ ఇంకొన్ని దేశాల్లో ఈ సౌకర్యం ఉంది. ఇక్కడ పెట్టె కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలుగా పిలుస్తారు. కేవలం డబ్బుని దాచుకోవటానికి , ఇతర దేశాల్లో ఉన్న తమ కంపెనీలు ఉత్పత్తుల అమ్మకాల పై సేల్స్ టాక్స్ ఎగ్గొట్టటానికి బిల్లులన్నీలక్సెంబర్గ్ ఆఫీసునుండి తయారు చేస్తారు.ఈ కామర్స్ వచ్చాక ఈ ప్రక్రియ మరింతగా విస్తరించింది. మీరు కొన్ని వెబ్ సైట్లలో కొనే ఉత్పత్తులు మీకు తెలీకుండానే లక్సెంబర్గ్ నుండి బిల్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూస్తే ఆ విషయం అవగతమవుతుంది. లక్సెంబర్గ్ లో మూడు లుక్సంబర్గిష్, ఫ్రెంచ్ మరియు జర్మన్ అధికార భాషలు. లౌకిక దేశం అయినప్పటికీ లక్సెంబర్గ్ ప్రధాన మతం రోమన్ కాథలిక్. లక్సెంబర్గ్ సిటీ చూశాక అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియాన్ డెన్ (Vianden) అనే నగరానికి వెళ్లాం. అక్కడ 11 వ శతాబ్దంలో నిర్మించిన పాలెస్ ఒకటి ఉంది దీనిని Vianden castle అంటారు.కొండ మీద నిర్మించబడిన ఈ పాలస్ కింద లోయలు కొండలు కనిపిస్తాయి.చాలామంది అక్కడినుండి కిందికి లోయలోకి ట్రెక్కింగ్ కి వెళుతున్నారు. మేము పాలస్ బయటనుండే చూశాము. 

ఈ పట్టణ జనాభా కేవలం 1800.నగర వైశాల్యం 9 చదరపు కిలోమీటర్లు. మొత్తం రెండు వీధుల్లోనే ఇళ్ళన్నీ ఉన్నాయి. లక్సెంబర్గ్ లో అత్యధికులు దర్శించే పర్యాటక ప్రాంతం ఇదే. లోయలోనుండి కొండపైకి ఛైర్ రోప్ వే ఉంది. దాంట్లో పైకి వెళ్లి కాసేపు ఆ కొండ మీద గడిపి మళ్ళీ మన ఇష్టం వచ్చినప్పుడు కిందకి రావచ్చు. టికెట్ 5 యూరోలు. మేము అందరం ఆ చైర్ కార్ ఎక్కాం.సగం దూరం వెళ్ళాక కింద చూస్తే పెద్ద లోయ , ఒక్కసారిగా భయం వేసింది. కొండమీద నుండి దేశం మొత్తం కనిపించింది.కాసేపు అక్కడే గడిపాక కిందకి వచ్చేశాం. అప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది.పొద్దున్న తిన్న బ్రేక్ ఫాస్ట్ అరిగిపోయి అప్పటికి అరగంట అయిపొయింది. మళ్ళీ మెక్ డొనాల్డ్స్ జిందాబాద్ అంటూ లంచ్ కానిచ్చేసి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్  వైపు కారుని పోనిచ్చాడు మార్చిన్. 



Sunday, October 25, 2015

నా ఐరోపా యాత్ర - 24 (పారిస్)

ముందు రోజు రాత్రి బాగా ఆలస్యమవటం, ప్రయాణ బడలిక తీరకపోవటంతో మరుసటి రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా నిద్ర లేచాం. ఆరోజు నేను చూడాలనుకున్న గుయ్ మెట్ మ్యూజియం కి వెళ్లి అదయ్యాక రాత్రికి బెల్జియం వెళ్ళాలని అనుకున్నాం. అసలు నేను అనుకున్నమ్యూజియం అదో కాదో అనే సందేహంతో పాటు మా ఊరి శిల్పాలు అక్కడ ఉన్నాయో లేదో అనే సందేహం మరొకటి. రామాయణం లో పిడకల వేట లాగా ఈ శిల్పాల గొడవేంటి అనుకుంటున్నారా ? వీటి కధ దాదాపు 90 ఏళ్ల క్రితం జరిగింది.


1923 లో మా ఘంటసాల గ్రామంలో ఒక రైతు పొలం దున్నుతుండగా పాలరాతి శిల్పాలు బయట పడ్డాయి. అప్పట్లో ప్రజలకు అవగాహన లేక దొరికిన ఇలాంటి శిల్పాలన్ని అక్కడక్కడా గుట్టలుగా వేసి పెట్టేవాళ్ళు. కొంతమంది వాటిని బట్టలు ఉతుక్కునే బండలుగా వాడేవారు. 1927 లో పారిస్ నుంచి వచ్చిన డూబ్రి యెల్ అనే చరిత్ర పరిశోధన కారుడు ఆ శిల్పాలన్ని సేకరించి పారిస్ లో గుయ్ మెట్ మ్యూజియంకి తరలించాడు. ఈ మ్యూజియంలో పలు ఆసియా దేశాలలో దొరికిన వేల ఏళ్ల నాటి శిల్పాలు,వంట పాత్రలు, అలనాటి వస్త్రాలు, చైనా , కంబోడియా దేశాల్లో దొరికిన ఎన్నో అపురూప శిల్పాలు భద్రపరిచారు. నేను మా ఊరి చరిత్రని పరిరక్షించే వెబ్సైట్ రూపకల్పనలో చేసిన పరిశోధనలో మూడేళ్ళ క్రితం ఈ విషయం గురించి విన్నాను. 1966 లో ప్రచురితమైన "ఘంటసాల చరిత్ర" అనే మా గ్రామ చరిత్ర పుస్తకంలో అప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన ముందుమాటలో ఈ విషయాన్ని ఉటంకించారు. కేవలం ఈ శిల్పాలు చూడటానికే ఆయన పారిస్ వెళ్ళినట్లుగా చెప్పారు. ఆ తరువాత ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరూ వెళ్లి చూడలేదు కూడా. నేను కూడా పారిస్ వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు.ఆ సమాచారం రాసేటప్పుడు కూడా అదొక విషయం లాగే అనుకున్నాను తప్ప ఎప్పుడూ వెళ్లి చూస్తా అనుకోలేదు.
ఇక మే 1 వ తేదిన ఎంతో ఉత్సాహంగా హోటల్ నుంచి బయలుదేరి పది గంటలకల్లా మ్యూజియంకి చేరుకున్నాం. మెట్రో స్టేషన్ పేరు లేనా. ఈ స్టేషన్లో దిగితే కింద నుంచి పైకి రాగానే కన్పించే మొదటి బిల్డింగ్ ఇదే. దీనికి ఎదురుగా రాయల్ ప్యాలస్ ఉంటుంది.  కాని ఆ రోజు మేడే అనే సంగతి అక్కడికెళ్ళాక గుర్తు వచ్చింది. ఆరోజు సెలవు దినం కావటంతో లోపలికి అనుమతి లేదు. మా షెడ్యుల్ ప్రకారం ఆరోజు రాత్రికే పారిస్ నుండి బయలుదేరాలి. కాని అంతదూరం వెళ్లి మన ఊరు శిల్పాలని చూడకుండా రావటానికి మనసొప్పలేదు. నేను దిగాలు పడటం చూసి నా శ్రీమతి మరియు మార్చిన్ దంపతులు ఇంకో రోజు ఉండి నీ కోరిక ప్రకారం ఈ మ్యూజియం చూశాకే వెళదాం అన్నారు. అప్పటికప్పుడు ఆరోజు అందుబాటులో ఉన్న హోటల్ బుక్ చేశాం. ఇక ఆరోజుకి మిగతా ప్రదేశాలు చూసి మరుసటి రోజుకి మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకున్నాం. పారిస్ లాండ్ మార్క్ అయిన Arc de Triompe దీనికి పక్కనే నడిచే దూరంలోనే ఉంది. 
Arc de Triompe అనేది ఒక స్థూపం. ఫ్రెంచ్ విప్లవంలో అసువులు బాసిన వ్యక్తుల స్మృతి చిహ్నంగా 1806 లో దీని నిర్మాణాన్ని ప్రారంభించి 1836 లో నెపోలియన్ హయాంలో పూర్తి చేశారు. ఆ విప్లవంలో చనిపోయిన వారి పేర్లు దీని గోడలపై చెక్కారు. పారిస్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈఫిల్ టవర్ తో పాటు ఇక్కడ ఫోటో దిగకుండా మాత్రం రారు. దీనిలోపల మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఒక సైనికుడి సమాధి ఉంది. ఇతని వివరాలు అక్కడ లేవు. ఈ కట్టడం రోడ్డు మధ్యలో ఉంది. దీనికి చుట్టూ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. మేము అక్కడికి చేరుకొని కాసేపు ఫోటోలు తీసుకున్నాం. ఆ రాత్రికి మేము బుక్ చేసుకున్న హోటల్ అక్కడికి 40 కిలోమీటర్లు ఉండటంతో 6 గంటలకల్లా బయలుదేరి హోటల్ కి వెళ్ళిపోయాం.  

మరుసటి రోజు మే 2 న పొద్దునే పదిగంటల కల్లా లేనా స్టేషన్ చేరుకున్నాం. మ్యూజియమ్  ప్రవేశ రుసుము  8 యూరోలు. టికెట్ తీసుకుని ముందుకు వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇండియా, కంబోడియా దేశాల శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక ఫ్లోర్ లో రెండు దేశాల చొప్పున మొత్తం నాలుగు అంతస్తుల్లో వివిధ ఆసియా దేశాలలో వర్ధిల్లిన బౌద్ధం, హిందూ మతాల అవశేషాలు, వేల ఏళ్ల నాటి నాగరికత కి గుర్తులైన రాతి పాత్రలు, పలు దేవతల విగ్రహాలు, శిధిల శిల్పాలు ప్రజల సందర్శనార్ధం  ఉంచారు. గుయ్ మెట్ అనేది ఒక ప్రత్యేకమైన మ్యూజియం, కేవలం ఆసియాకి సంభందించిన అవశేషాలని మాత్రమే అక్కడ చూడవచ్చు. ప్రతి శిల్పం దగ్గరా అది దొరికిన ప్రదేశం, సేకరించిన వ్యక్తి వివరాలు ఉన్నాయి. ఆత్రుతగా ఘంటసాల అనే పేరు కోసం వెతికాను. అమరావతి పేరు ముందు కనిపించింది. నాకంటే ముందే నా శ్రీమతి ఘంటసాల పేరు ఉన్న రెండు శిల్పాలని గుర్తించింది. అవి చూడగానే నా సంతోషం అలవి కానిది. సేకరించిన వ్యక్తి పేరు, సంవత్సరం యధాతధంగా ఉన్నాయి.హెడ్ ఫోన్స్ సాయంతో ఆ శిల్ప వృత్తాంతాన్ని వినవచ్చు. ఆ రెండు శిల్పాల్ని ఫోటో తీసుకుని మిగతా శిల్పాలు చూస్తుండగా అవన్నీ అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ ప్రాంతాల్లో దొరికినవే. కొద్దిగా ముందుకి వెళితే మధ్య ప్రదేశ్, తమిళనాడు,కేరళ ప్రాంతపు అవశేషాలు కనిపిస్తాయి. కొద్దిగా పక్కకి తిరిగితే ఘంటసాల గ్రామం పేరుతో మరో శిల్పం కనిపించింది. మొత్తం మూడు శిల్పాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. చాలా సేపు అక్కడే గడిపి అన్నీ ఫోటోలు వీడియో తీసుకున్నాను. 


ఒకరకంగా ఆ శిల్పాలు అక్కడ ఉండటమే కరెక్ట్ అనిపించింది. దేశ విదేశాలనుంచి వచ్చే లక్షల మంది యాత్రికులు ఆ మ్యూజియాన్ని సందర్శిస్తారు. వారంతా మా గ్రామాన్ని గురించి తెలుసుకుంటారు కదా అని ఒకింత గర్వంగా కూడా అనిపించింది. శంఖంలో పోస్తేనే ఏదైనా తీర్ధం అవుతుంది. మా గ్రామానికి సంభందించిన మరిన్ని శిల్పాలు మద్రాస్ మ్యూజియం లో కూడా ఉన్నాయి. ఎక్కడి ఘంటసాల, ఎక్కడి పారిస్ ? 90 ఏళ్ల క్రితం తరలించిన మా ఊరి శిల్పాలని చూడగలగటం నిజంగా అదృష్టమనే అనుకోవాలి. అవి చూసి బయటకి వచ్చాక గుండెలనిండా నింపుకున్న సంతోషం, ఉప్పొంగిన హృదయంతో నేను ఆకలి కూడా మర్చిపోయాను. మార్చిన్ ఇక తిందామా అనటంతో భోజనం సమయం అయ్యిందని గుర్తొచ్చింది. పక్కనే ఉన్న హోటల్ లో భోజనం చేసి అక్కడినుండి లౌవ్ర్ మ్యూజియం వెళ్దాం అనగానే ముగ్గురూ నన్ను తినేసేలా చూశారు. ఇప్పటిదాకా చూసిన మ్యూజియంలు చాలలేదా అంటూ విసుక్కున్నారు. నిజమే మరి నాకు ఉన్న ఆసక్తి వాళ్ళకి ఉండాలిగా. ఇప్పటికీ భార్గవి కి నాతో ఎక్కడికన్నా రావాలంటే అదే భయం. మ్యూజియంకి వెళ్ళను అంటేనే ఎక్కడికైనా వస్తాను అంటుంది. అందుకే నేను బిజినెస్ ట్రిప్ లు వెళ్ళినపుడు ఇలాంటివన్నీ కవర్ చేస్తుంటా. మేమిద్దరం వెళితే కేవలం హాలిడే స్పాట్స్ మాత్రమే. లౌవ్ర్ మ్యూజియం లోనే డావిన్సి గీసిన మోనాలిసా చిత్రం ఉంది నాకేమో అది చూడాలని కోరిక. మిగతా వాళ్ళెవరికి ఓపిక లేదు. సరే కనీసం బయట నుండి అయినా ఆ మ్యూజియం చూద్దాం అని ఒప్పించి అక్కడికి తీసికెళ్ళాను. అక్కడికెళ్ళాక ఒక బెంచి చూసుకుని, ఈ బొమ్మలూ, చిత్రాలూ, శిల్పాలూ ఏం చూసుకుంటారో చూసుకుని ఇక్కడికే రండి..నా వల్ల కాదు అని భార్గవి అక్కడే కూర్చుంది.తనతో పాటు కాషా , మాక్సిం కూడా కూలబడ్డారు. మార్చిన్ కొంచెం ఇలాంటివంటే ఆసక్తి ఉన్నవాడే, మేమిద్దరం కలిసి ఆ ఆవరణలో కాసేపు తిరిగి ఫోటోలు తీసుకున్నాము. ఇది ప్రపంచంలో మూడో అతి పెద్ద మ్యూజియం. తిండి నిద్ర లేకుండా ఒక్కొక్క మాస్టర్ పీస్ ను  మూడంటే మూడు సెకన్లు చూస్తూ వెళితే ఆ మొత్తం  మ్యూజియం చూడటానికి మూడు నెలలు పడుతుందంట. 
నేను తరువాత బిజినెస్ ట్రిప్ లో మళ్ళీ పారిస్ వెళ్ళినపుడు ఈ మ్యూజియం కి వెళ్లి చూసి వచ్చాను.అప్పుడు తీసుకున్నదే ఈ మోనాలిసా ఫోటో. 

పారిస్ కి సంభందించిన మరో ముఖ్య విషయం, ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.  లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని,  తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా  ఎదిగాడు బ్రెయిలీ.  పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై  చాలా చాలా కృషిచేసాడు. 
1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.  ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది.  అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా  తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు.  బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని  పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే. 
ఫ్రెంచ్ చక్రవర్తుల పాలస్ లూ, ఫ్రెంచ్ విప్లవాల, వారి యుద్దాల, విజయాల స్మారక చిహ్నాలు, చర్చిలూ, మ్యూజియం లూ, చివరకి సీన్ నది మీద కట్టిన ప్రతి బ్రిడ్జీ, వందలాది ఏళ్ల చరిత్ర ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుండగా.. గాలేరియాలూ, గట్రా మనం అడుగు పెడితేనే మాసిపోతాయన్నట్టు ఉన్నాయి. భార్గవి అక్కడ ఏదైనా కొందాం అని కొన్ని షాపుల్లోకి వెళ్లి ధరలు చూసి మాట్లాడకుండా బయటకి వచ్చి ఇక నడవండి అంది.పర్లేదు నచ్చింది కొనుక్కోమన్నా వినలేదు. 

ఇక ఆఖరున  వేర్సైల్స్ రాజ భవనం చూడటానికి బయల్దేరాం. ఆరు తరాల ఫ్రెంచ్ చక్రవర్తులు నివసించిన ఆ పాలస్ కోసం పారిస్ నగర శివార్లలో ఉన్న వేర్సైల్స్ నగరానికి వెళ్లాం. అప్పటికే సమయం మించిపోయింది. చీకటి పడుతుండటంతో 6 గంటలకల్లా ప్రవేశం నిలిపివేశారు. కానీ బయట నుండి ఆ రాజ భవనం, వేల ఎకరాల్లో ఉద్యానవనాలూ, బంగారు తాపడాలతో జిగేల్ మంటున్న పాలస్ చూస్తే మతిపోయింది. అసలు దీనిలో నివసించిన వాళ్ళు వారి జీవిత కాలం మొత్తంలో అయినా ఈ పాలస్ మొత్తం చూసి ఉండరని నా గట్టి నమ్మకం. ఆ పాలస్ చుట్టూ ఉన్న రోడ్ మీద మేము కార్ లో తిరగటానికే 30 నిమిషాలు పట్టింది. అక్కడినుండి పారిస్ నగరం వదిలి మా కారు బెల్జియం వైపు సాగిపోతోంది. కానీ నాకు మాత్రం పారిస్ మనస్సులో ఉండిపోయింది. ఎంత అందమైన నగరం, ఏమి కట్టడాలు, గాలరీలు, చర్చిలు, రాజ భవనాలు, వాళ్ల రోడ్ సైడ్ కఫెలూ, మెట్రో లో ప్రయాణాలూ,  ఫాషనబుల్ బట్టల్లో నానా జాతుల వారు, కట్టడాలూ కళ్లల్లో మెదులుతూ ఉండగానే..అనిపించింది పారిస్ మొత్తం చూడటానికి ఒక మనిషి జీవిత కాలం సరిపోదని. 

Friday, October 23, 2015

నా ఐరోపా యాత్ర - 23 (పారిస్)

జూరిచ్ నుండి పారిస్ 600 కిలోమీటర్లు. భార్గవి, కాషా వెనుక సీట్లో కునికి పాట్లు పడుతున్నారు. మాక్సిమ్ అప్పటికే నిద్రపోయాడు. నేను మార్చిన్ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మధ్యలో 2 టోల్ గేట్స్ వచ్చాయి. మన దగ్గర లాగా మనుషులెవరూ అక్కడ లేరు. మనం అవసరమైన చిల్లర వేస్తే ఎలక్ట్రానిక్ గేటు తెరుచుకుంటుంది. సరిపడినంత చిల్లర లేకపోవటంతో నేను క్రెడిట్ కార్డులోనే పే చేసాను. నాకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. కాసేపటి తరువాత కారు ఒక విశాలమైన పెట్రోల్ బంక్ ఆవరణలో ఆగింది. మార్చిన్ కి కూడా నిద్ర రావటంతో 4 గంటల తరువాత ఆ పెట్రోల్ స్టేషన్లో ఆపాడు. 2 గంటలు తను కూడా నిద్రపోయి మళ్లీ ఫ్రెష్ అయ్యాక ప్రయాణం మొదలు పెట్టాడు. అప్పటికే తెల తెల వారుతోంది. మరో 2 గంటల తరువాత మరో దగ్గర బ్రేక్ ఫాస్ట్ కోసం కార్ ఆపాడు మార్చిన్. యూరప్ లో పెట్రోల్ బంకులన్నీ అన్ని సౌకర్యాలతో ఉంటాయి. మరీ ముఖ్యంగా దేశాల మధ్య ఉండే హైవే రోడ్లపైన ఉండే పెట్రోల్ బంకుల్లో హోటల్,వాష్ రూమ్స్ మరియు రెస్ట్ రూమ్ ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని బయలు దేరాము. అక్కడికి ఫ్రాన్సు బోర్డర్ ఇంకో 100 కిలోమీటర్లు ఉంది. పారిస్... ఐరోపా సాంస్కృతిక రాజధాని.. కళాకారుల కలల నగరం.. ఫాషన్ ప్రపంచ రాజధాని కూడా కదా .. ఎన్ని నవలల్లో చదివాం.. ఎన్ని రకాలు గా ఊహించుకున్నాం..మూడు రోజులు పారిస్ లో ఉంటామనగానే ఒక రకమైన ఉద్విగ్నత.. పారిస్ నగరమనగానే అందరికీ ఈఫిల్ టవర్ చూడాలని ఉంటుంది. కాని నేను చూడాలనుకున్నది మాత్రం గుయ్ మెట్ అనే మ్యూజియం.నేను జన్మించిన ఘంటసాల గ్రామానికి చెందిన అపురూప బౌద్ధ శిల్ప సంపద 100 ఏళ్ల క్రితం పారిస్ లో ఉన్న గుయ్ మెట్ అనే మ్యూజియం కి తరలించబడింది. ఘంటసాల చరిత్రలో ఆ మ్యూజియం పేరు తప్ప మరే ఇతర వివరాలు లేవు. నేను పోలాండ్ రాగానే ఎప్పటికైనా పారిస్ వెళ్లి ఆ శిల్పాలు చూడాలి అనుకున్నాను. అందుకే బయలుదేరేముందు గూగుల్ లో ఆ మ్యూజియం వివరాలు అన్నీ వెతికి సేకరించి పెట్టుకున్నాను. నేనిలా ఆలోచనల్లో ఉండగానే పారిస్ నగరం మాకు కనిపించ సాగింది. మరి కొద్ది దూరం వెళ్ళగానే దూరంగా ఈఫిల్ టవర్  పై భాగం కనిపించసాగింది. అది చూడగానే మాక్సిం ఐఫ్లా అంటూ ఉత్సాహంతో అరిచాడు. స్కూల్ లో మా స్నేహితులందరికీ అందరికీ చెప్తాను నేను ఐఫ్లా టవర్ చూసా అని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. (పోలిష్ భాషలో ఈఫిల్ టవర్ ని ఐఫ్లా టవర్ అంటారు) నేను ముందుగానే హోటల్ బుక్ చేసి ఉండటంతో నేరుగా హోటల్ కి వెళ్ళిపోయాం. పారిస్ లో పెద్ద సమస్య పార్కింగ్, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది.మా హోటల్ కి దగ్గరలో ఒక ప్రైవేటు పార్కింగ్ ఉంది. రోజుకి 24 యూరోలు పార్కింగ్ ఫీజు.పార్కింగ్ మొత్తం భూమి లోపలే ఉంటుంది. అక్కడే కార్ పార్క్ చేసేసి హోటల్ కి వెళ్లి అందరం ఫ్రెష్ అయ్యాం. హోటల్ పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. పారిస్ నగరం భూమి పైన ఎంత ఉందో అంత కు అంత భూగర్భం లో ఉంది. ఎక్కడినుంచి ఎక్కడికైనా భూగర్భంలో ఉన్న మెట్రో రైలులో కొద్ది నిమిషాల్లోనే చేరుకోవచ్చు. పారిస్ అంతా రాజప్రాసాదాలు, మ్యూజియంలు, సీల్ నదిపై ఎక్కడికక్కడ నిర్మించిన బ్రిడ్జిల మయం. ప్రతి మెట్రో స్టేషన్లో సిటీ మాప్ తో పాటు చూడాల్సిన ప్రదేశాల వివరాలు,వాటిని చేరుకోవటానికి అవసరమైన మెట్రో రైలు, బస్సు, టూరిస్ట్ గైడ్ ల వివరాలు ఉంటాయి.చరిత్రను భద్రపరుచుకోవటం పారిస్ దగ్గర నుంచే నేర్చుకోవాలి.సీన్ నది చుట్టూ శతాబ్దాల నాటి భవనాల అందం ఒకెత్తయితే, ఎవరి ప్రపంచంలో వారు విహరిస్తున్న మనుషులు  ఒకెత్తు.వివరాల్లోకి వెళ్లేముందు నేను చెప్పాల్సింది ఒకటుంది. జీవితంలో మీరెప్పుడైనా పారిస్ వెళ్ళా లనుకుంటే మాత్రం పెళ్ళయాక భార్యతో వెళ్ళండి.లేదా పిల్లలు పుట్టాక వాళ్లకి ఒక 10 ఏళ్ళు వచ్చాక ఇద్దరూ  వెళ్ళండి. బ్రహ్మచారిగా నో లేక కేవలం మీ మిత్రులతో కలిసి మాత్రం పారిస్ వెళ్ళటం శుద్ధ దండగ. పారిస్ ఒక రొమాంటిక్ నగరం, చరిత్ర మిగిల్చిన వందల ఏళ్ల  శిల్పాల నుండి నేటి ఆధునిక ఫాషన్ ప్రపంచం దాకా అడుగడుగునా శృంగార సౌందర్యం ఉట్టిపడుతుంది. అప్పటిదాకా మేము చూసిన యూరప్ దేశాలన్నీ చల్లగా , ప్రకృతి ఒడిలో సేదదీరుతునట్లు ఉన్నాయి. కాని పారిస్ మాత్రం వందల ఏళ్ల నాటి రాచరికపు హంగులతో ఏదో ఒక రాజ్యంలో ఉన్నట్లు ఉంది. ఏ భవనాన్ని చూసినా తక్కువలో తక్కువ 200 ఏళ్ల క్రితం కట్టినవే ఉన్నాయి. మేము హోటల్ నుండి బయటపడేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది. మెట్రో స్టేషన్లో రోజు వారీ టికెట్లు ఉంటాయి ధర 11 యూరోలు. ఆ టికెట్ తో పారిస్ మొత్తం ఎక్కడినుండి ఎక్కడికైనా మెట్రో లో ప్రయాణించవచ్చు. మార్చిన్ కి ఇవన్నీ అవగాహన ఉన్నాయి కాబట్టి మేము మెట్రో లో వెళ్ళాము. లేదంటే ఏదైనా బస్ టూర్ తీసుకోవటం మంచిది.బస్ అయితే  2 రోజులకి 36 యూరోలు టికెట్ చార్జి. ఆడియో గైడ్ ఉంటుంది , అదీ కాకుండా రోడ్ మీద వెళుతూ పారిస్ వీదులన్నీ కూడా చూడవచ్చు. మెట్రో మొత్తం భూగర్భంలో ఉంటుంది కాబట్టి దిగిన చోట మాత్రమే చూడగలం. మేమున్న ప్రాంతం నుండి మేము మొదటగా వెళ్ళింది నోటార్ డాం అనే చర్చి.
మెట్రో స్టేషన్ నుండి బయటకి వచ్చి చూస్తే ఏముంది? అకస్మాత్తుగా ఒక టైం మషీన్ లో ఎక్కి మూడు వందల ఏళ్ల క్రితం రోజుల్లోకి వెళ్లామా అని ఆశ్చర్యం వేసింది. చుట్టూ పాతకాలపు రాజరిక చిహ్నాలున్న భవనాలు. 1160 లో ఈ చర్చి నిర్మాణం మొదలైతే 1345 నాటికి పూర్తయ్యింది, దాదాపు 200 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగింది.ఈ మధ్య కాలంలో ఎన్నో అవాంతరాలు ఎదురై కొంతకాలం నిర్మాణం కూడా ఆగిపోయింది.  పూర్తిగా ఫ్రెంచ్ గోతిక్ శైలి లో ఉన్న ఈ చర్చ్ రోమన్ కాథలిక్ లకి  ప్రార్ధనా స్థలం. అసలు అన్నేళ్ల క్రితం ఇది ఎలా కట్టారా అనిపించింది. మొత్తం దీని ఎత్తు 300 అడుగులు మత పెద్దలు బిషప్ ల విగ్రహాలు చుట్టూ చెక్కి ఉన్నాయి. సీన్ నది ఒడ్డునే ఈ చర్చ్ ఉంది. మాకు ఫోటో తీసుకోవాలంటే 100 అడుగులు వెనక నుండి తీస్తే కాని ఆ మొత్తం బిల్డింగ్ ని కవర్ చెయ్యలేకపోయాం.


 ఇక అక్కడినుండి ఈఫిల్ టవర్ వెళ్దామని మాక్సిం మారాం చెయ్యడం మొదలు పెట్టాడు. ఆ చిన్న పిల్లవాడికి ఈ చర్చ్ లు బిల్డింగ్ లు ఏం అర్ధం అవుతాయి. వాడికి ఈఫిల్ టవర్ మాత్రమే కావాలి. ఇక అక్కడినుండి మళ్ళీ మెట్రో ఎక్కి డైరెక్ట్ గా ఈఫిల్ టవర్ స్టేషన్లో దిగాము. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది , అప్పటిదాకా సినిమాల్లో చూసిన ఈ శతాబ్దపు ఏడో వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్  అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు.అసలు విషయం మర్చిపోయా మన తెలుగు సినిమాల్లో మన్మధుడు లో చూపించినట్లు గా పారిస్ ని ఇంకెవరూ చూపించలేదేమో. మేము పారిస్ లో ఉన్నంత సేపు ఎస్కలేటర్ చూసినా సీన్ నది మీద వంతెన చూసినా బ్రహ్మి డైలాగులే గుర్తొచ్చాయి. నీళ్ళంటే పారిస్ వాళ్ళకి కూడా భయమే అందుకే వంతెనలు కట్టారు అని  నేను భార్గవి అవన్నీ చెప్పుకుని నవ్వుకుంటుంటే మార్చిన్ వాళ్ళకి అర్ధం కాలేదు. మెట్రో స్టేషన్ లోంచి బయటకి రాగానే చాలా మంది రోడ్ల మీద నుంచుని బొమ్మలమ్ముకుంటున్నారు.. ఒకర్ని ఈఫిల్ టవర్ ఎక్కడుంది? అని అడగగానే.. నవ్వి వెనక్కి చూపించాడు. ఆకాశమంత ఎత్తులో టవర్.. గుగుర్పాటు గా అనిపించింది. ఆ అనుభూతి చెందిన క్షణం ఇప్పటికీ మరిచిపోలేనిది.మన్మదుడులో మొదటి సారి ఈఫిల్ టవర్  ని ఎలా చూపించాడో మేము చూసినపుడు కూడా అలాంటి దర్శనమే జరిగింది. లవ్ సిటీ అని పారిస్ ని ఎందుకంటారో ఈఫిల్ టవర్ దగ్గర టూరిస్ట్ లని చూడగానే అనిపించింది. 20 ఏళ్ల వయసున్న జంటల దగ్గరనుండి 70 ఏళ్ల వయసున్న జంటలు ఈఫిల్ టవర్ పైకి వెళ్ళటానికి క్యూ లో నిలబడి ఉన్నారు. పైకి వెళ్ళేటప్పుడు ఒకరి కొకరు అధరచుంబనాల తో తమ ప్రేమని వ్యక్తీకరించుకుంటున్నారు. టికెట్ కౌంటర్ పక్కనే ఈ టవర్ నిర్మాణ కర్త ఈఫిల్ విగ్రహం ఉంది. కొంతకాలం ఈఫిల్ ఈ టవర్ పై ఉన్న గదిలో నివాసం ఉండేవాడు. 
1889 లో దీనిని స్థాపించినప్పటి నుంచీ ఇరవై కోట్లు మందికి పైగా దీన్ని సందర్శించారు . వీరిలో 67,19,200 (అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు) మంది 2006 లో సందర్శించారు.దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది.దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.


ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు. దీనికి 2 అంతస్థులు ఉన్నాయి మొదటి అంతస్థు వరకే అయితే 11 యూరోలు టికెట్ , అదే చివరి వరకు అయితే 17 యూరోలు. మేము మొత్తం పైకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము టికెట్ తీసుకుని పైకి వెళ్ళటానికే గంట పట్టింది. ఇలా 365 రోజులు జనాలు క్యూ లో పైకి వెళుతూనే ఉంటారు. పై నుండి పారిస్ నగరం మొత్తం అద్భుతంగా కనిపించింది. నగరం మొత్తం అందులో భవనాలన్నీ ఎవరో పెయింట్ వేసిన కాన్వాస్ లా అనిపించింది. అక్కడి నుండే గుయ్ మెట్ మ్యూజియం ఎక్కడుందా అని వెతికాను. నా దగ్గరున్న మాప్ ప్రకారం చూస్తే  గుయ్ మెట్  ఈ టవర్ కి దగ్గరలోనే ఉండాలి. టవర్ కి అభిముఖంగా దగ్గరలోనే ఈ మ్యూజియం కనిపించింది. అక్కడినుండే ఒక ఫోటో తీశాను. 

అప్పటికె సమయం 6 గంటలు అవడంతో ఆరోజు మ్యూజియం కి వెళ్ళటం కుదరదు. రేపు వెళదామని మార్క్ చేసి పెట్టుకున్నాం. అక్కడి నుండి మార్చిన్ గార్ డు నార్డ్ అనే ప్రాంతానికి వెళదామా అని అడిగాడు. గార్ డు నార్డ్  అనేది సెంట్రల్ మెట్రో స్టేషన్.యూరప్ లో ఉన్న మిగతా దేశాల నుండి వచ్చే రైళ్ళు అన్నీ ఈ స్టేషన్ కే వస్తాయి. ప్రముఖ తమిళ రెస్టారెంట్ శరవణ భవన్ ఇక్కడే ఉంది. బయటి నుండి చూస్తే అక్కడ మన వాళ్ళు తప్ప మిగతా దేశాల వాళ్ళంతా మన ఫుడ్ లాగించేస్తున్నారు. మేము ఆ ప్రాంతమంతా తిరుగుతూ ఉండగానే చీకటి పడింది. వెంటనే భార్గవి రాత్రి పూట ఈఫిల్ టవర్ బావుంటుంది కదా మళ్ళీ వెళ్దామా అంది. మా అందరి ముఖాల్లో వెలుగు , అవును కదా ఇదెలా గుర్తురాలేదు మనకి అనుకుని హోటల్ కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్లమల్లా మళ్ళీ ఈఫిల్ టవర్ కి బయలుదేరాం. విద్యుద్దీపాల కాంతుల్లో ధగ ధగ లాడే ఈఫిల్ టవర్ మేము పగలు చూసినదానికంటే ఎన్నో రెట్లు అందంగా ఉంది. అందుకేనేమో మన్మధుడు సినిమా లో త్రివిక్రమ్ రాసినట్లు ఈఫిల్ టవర్ పగలు పెర్ఫ్యూమ్ బాటిల్ లాగ రాత్రి పూట షాంపేన్ బాటిల్ లాగా కనిపిస్తుంది. నిజంగానే షాంపేన్ కిక్ లా ఉంది అలా వెలుగుతున్న ఈఫిల్ ని చూస్తుంటే. అక్కడే కాసేపు గడిపి ఆ రోజుకి విశ్రాంతి తీసుకుని హోటల్ కి వెళ్ళిపోయాం. 

Saturday, October 17, 2015

నా ఐరోపా యాత్ర - 22 (స్విట్జర్లాండ్)

ఇప్పుడు మేము వెళ్ళబోయేది స్విట్జర్లాండ్ లో Schaffhausen లో ఉన్న రైన్ ఫాల్స్ అనే జలపాతం. ఇది ఆ దేశానికి ఉత్తరభాగాన ఉంది. అంటే మేము ఉన్న ఆస్ట్రియా సరిహద్దు నుండి 120 కిలోమీటర్లు. ఆస్ట్రియా కి స్విట్జెర్లాండ్ కి మధ్యలో ఒక నది ఉంది అదే ఆ రెండిటి మధ్య బోర్డర్. ఆ బోర్డర్ దగ్గర పోలీసులు కార్లు ఆపి చెక్ చేస్తున్నారు.మేము మా పాస్ పోర్ట్లు తీసుకుని చెక్ పోస్ట్ లోకి వెళ్లి చూపించాము. పోలాండ్ వీసా ఉండటంతో చెక్ చేసి వెంటనే ఇచ్చేసారు. 

యూరప్ లో ఉన్న అన్ని దేశాల్లోకి స్విట్జెర్లాండ్ చాలా ఖరీదైన దేశం.అందుకే కొంతమంది సరిహద్దు దేశాలనుండి బీరు, సిగరెట్లు లాంటివి తీసుకు వెళుతుంటారట. అందుకే ఈ చెకింగ్ అని మార్చిన్ చెప్పాడు. జర్మనీ తో పోలిస్తే కూడా పోలాండ్ చాలా చవకైన దేశం. మేము జర్మనీ వెళ్ళేటప్పుడు కూడా బోర్డర్ లో పెట్రోల్ బంకులన్నీ బిజీ గా ఉండేవి. జర్మన్ దేశస్తులు , పోలాండ్ మీదుగా జర్మనీ వెళ్ళేవారు , పోలాండ్ పెట్రోల్ బంకుల్లో ఫుల్ చేయించుకుని అక్కడే సిగిరెట్లు బీర్లు తదితర ఆహార పదార్ధాలని కొనుక్కుని వెళ్ళేవారు. ఆస్ట్రియా సరిహద్దు నుండి స్విట్జెర్లాండ్ లోకి ప్రవేశించగానే వర్షం చినుకులు ప్రారంభం అయ్యాయి. చిన్న చిన్న ఊర్లు , ఎటు చూసినా పచ్చటి పొలాల మధ్య నుండి దాదాపు గంటన్నర ప్రయాణించాక రైన్ ఫాల్స్ జలపాతం దగ్గరకి చేరుకున్నాం. 

అప్పటికే సాయంత్రం సమయం 5 గంటలు అయ్యింది.అక్కడ అన్నీ టూరిస్ట్ బస్సులు , కార్లు పార్క్ చేసి ఉన్నాయి. మన దేశం నుండి అందించే స్విట్జెర్లాండ్ టూర్ పాకేజీ లో ఈ రైన్ ఫాల్స్ అనేది తప్పకుండా ఉంటుంది.ఇండియా నుండి థామస్ కుక్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ గ్రూపు ఒకటి కనిపించింది. అందులో తెలుగు వాళ్ళు , తమిళియన్స్ కనిపించారు.అప్పటికే ఆ గ్రూప్ టూర్ పూర్తవటంతో తిరుగు ప్రయాణంలో ఉన్నారు. దాదాపు 11000 ఏళ్ల క్రితం ఈ జలపాతం ఏర్పడింది. సంవత్సరానికి సగటున 750 క్యూబిక్ మీటర్ల నీరు ఈ జలపాతం గుండా ప్రవహిస్తుంది. మొదట్లో దీనిని వాణిజ్య అవసరాలకి కి కూడా ఉపయోగించారు.19 వ శతాబ్దం లో ఈ నీటిని ఆధారంగా చేసుకుని ఒక ఐరన్ కరిగించే కర్మాగారం నెలకొల్పారు. ఆ తరువాత ఇక్కడ ఒక హైడ్రో పవర్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం కోసం ఆ కంపెనీ దరఖాస్తు చేసుకున్నపుడు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ ప్రతిపాదన నిలిపి వేశారు. తదనంతరం ఆ ఐరన్ కంపెని కూడా మూత పడింది. తర్వాత ఎన్నో ప్రతిపాదనలు వచ్చినా ఇప్పటికీ పూర్తి స్థాయి హైడ్రో పవర్ జనరేషన్ ప్లాంట్ పెట్టలేకపోయారు. ఈ నీటి సామర్ధ్యంతో 50 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చెయ్యవచ్చు. కాని విలువ పరంగా చూస్తే టూరిజం ద్వారా వచ్చే ఆదాయం దీనికి 2 రెండు రెట్లు ఎక్కువ. బహుశా అందుకోసమే ఆ ప్రాజెక్టు ముందుకి కదల్లేదేమో.
జలపాతం దగ్గరగా వెళ్ళటానికి అక్కడ బోటు సర్వీస్ లు ఉన్నాయి. కాని 5.30 వరకు మాత్రమె ఈ సర్వీసులు ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి ఆఖరి బోటు వెళ్ళిపోయింది. అయినా కూడా ఒక కిలోమీటరు చుట్టూ నడిచి మెట్లు ఎక్కితే జలపాతపు పై భాగాన్ని దగ్గరగా చూడవచ్చు. మేము అలా ఫోటోలు తీసుకుంటూ పై భాగానికి చేరుకున్నాము. నీళ్ళు భీకర శబ్దంతో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా 1921 లో ఒక్కసారి మాత్రమే ఈ జలపాతంలో తక్కువ ప్రవాహం నమోదు అయ్యిందట. 1965 లో అత్యంత ఎక్కువ ప్రవాహం 1250 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహించింది. అప్పటికే చీకటి పడటం ప్రారంభమైంది. 

మేము రాత్రికి హోటల్ కూడా బుక్ చేసుకోలేదు. మార్చిన్ కూడా స్విస్ లో చూడదగిన ప్రదేశాలన్నీ గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాయని చెప్పాడు. జురిచ్ లో మేము బస చేసినా అక్కడ చూడదగిన ప్రాంతాలు ఏమి లేవు. స్విస్ అందాలన్నీ ఇంటర్ లాకేన్ మరియు ఇతర గ్రామ ప్రాంతాల్లోనే బావుంటాయి. అక్కడినుండి జురిచ్ మీదుగా పారిస్ వెళ్దామని మార్చిన్ ప్రతిపాదించాడు. కాని నేను వారించాను అంత దూరం నిద్ర లేకుండా డ్రైవింగ్ చెయ్యటం కష్టం, జురిచ్ లో బస చేద్దాము అని. కాని మార్చిన్ వినలేదు , రేపు ఉదయానికల్లా పారిస్ చేరుకోవాలని , డ్రైవింగ్ విషయం తనకి వదిలేయమన్నాడు. కాని ఆ తరువాత తెలిసింది అతని డ్రైవింగ్ కెపాసిటీ ఏమిటో.మేము ఒక పక్క నిద్రపోతూ ఉంటె కూడా అత్యంత జాగ్రత్తగా కంటి మీద కునుకు అనేది రాకుండా కార్ నడిపేవాడు. యూరోపియన్లు చాలా జాగ్రత్త పరులు, సామర్ధ్యం లేకుండా ఎటువంటి సాహసాలకి ఒడిగట్టరు. ఇక్కడ డ్రైవింగ్ నిబంధనలు కూడా అలాగే ఉంటాయి. సరకులు రవాణా చేసే ట్రక్కులు , ప్రయాణీకులని చేరవేసే బస్సులు రోజుకి 8 గంటలకి మించి డ్రైవింగ్ చెయ్యకూడదు. ఒకవేళ అలా చేసినా ఆ వాహనాల్లో ఉన్న సెక్యురిటి సిస్టం లో రికార్డ్ అయిపోతుంది. అందుకే 8 గంటలు డ్రైవ్ చెయ్యగానే ఎక్కడో ఓ చోట ఆపేసి రెస్ట్ తీసుకుంటారు.ఎంత అవసరం ఉన్నా సరే ఇంజిన్ కూడా స్టార్ట్ చెయ్యరు. రైన్ ఫాల్స్ నుండి జురిచ్ 50 కిలోమీటర్లు అక్కడినుండి బయలుదేరితే గంట లోపల జురిచ్ చేరుకోవచ్చు. మేము జురిచ్ చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది.

2008 వరకు కూడా స్విట్జెర్లాండ్ కి వేరే వీసా తీసుకోవాల్సి వచ్చేది. 2004 లోనే యూరోపియన్ యూనియన్ లో చేరినా కొంత కాలం వీసా వేరుగానే ఉండేది. మా కారుని ఎక్కడైనా పార్క్ చేసి నడుస్తూ నగరాన్ని చూడాలని అనుకున్నాం. జురిచ్ లో వాకింగ్ టూర్ అని ఉంటుంది. మొత్తం నడుస్తూనే పాత నగరాన్ని , కొత్త నగరాన్ని  చూడవచ్చు. దానితోపాటు బోటు టూరు ఉంటుంది. నగరం మధ్యలో ఉండే లిమ్మట్ నది అన్ని ప్రదేశాలని కలుపుతూ ఉంటుంది. దాదాపు జురిచ్ అంతా ఈ నది కి అటు ఇటు ఉంటుంది. ఈ బోటుకి ట్రాము కలిపి ఒకే టిక్కెట్టు ఉంటుంది. అవసరమైన బోటు స్టేషన్ల దగ్గర దిగి నగరంలో ట్రాము ఎక్కి అక్కడి ప్రదేశాలు చూడవచ్చు. కార్ పార్కింగ్ కోసం ప్రత్యేకమైన భవనాలు ఉంటాయి, ఎక్కడికక్కడ పార్కింగ్ బోర్డులు కనిపిస్తుంటాయి. మేము ఒక ప్రైవేటు కార్ పార్కింగ్ చూసుకుని అందులో కార్ పార్క్ చేశాము. స్విస్ అధికారిక కరెన్సీ స్విస్ ఫ్రాంకులు. గంటకు 4 స్విస్ ఫ్రాంకులు పార్కింగ్ ఫీజు. అక్కడ ఆటోమాటిక్ వెండింగ్ మెషిన్ కేవలం ఫ్రాంకులు మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ బయటకి వచ్చి మా దగ్గరున్న యూరోలతో ఫ్రాంకులని మార్చుకున్నాం.

 ఇక అక్కడినుండి నడుస్తూ సిటీ అంతా చూసుకుంటూ లిమ్మట్ నది ఒడ్డున కాసేపు అలా కూర్చున్నాం. జురిచ్ అంతా మేము రాత్రి వేళలోనే చూడటం జరిగింది. జురిచ్ లో కత్తులు , చాకులు చాలా ఫేమస్ victronix అనేది మంచి బ్రాండ్ . మార్చిన్ వాళ్ళ నాన్న తన మనుమడికి ఆ నైఫ్ ఒక్కటి కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు. జూరిచ్ వచ్చీ రాగానే మాక్సిం వాళ్ళ నాన్న ని అడగటం మొదలు పెట్టాడు. అక్కడొక షాపింగ్ సెంటర్ లో ఆ నైఫ్ ఒక్కటి కొన్నాడు.

విండో షాపింగ్ లో వాచీలు , జ్యుయలరి అన్నీ చూసుకుంటూ దాదాపు 2 గంటలు అక్కడే గడిపాము. రోడ్ పై ఒక పక్కగా ఉన్న బావిలో అందరూ చిల్లర వేయటం గమనించాము. కాని ఎందుకో అర్ధం కాలేదు. ఇక్కడ అధికారిక భాష జర్మన్. ఫ్రెంచ్, ఇటాలియన్ , లాటిన్ భాషలు కూడా ఎక్కువగా మాట్లాడతారు.అప్పటికి సమయం 9 గంటలు అయ్యింది. ఎవరికీ పెద్దగా ఆకలి లేకపోవటంతో దార్లో తిందాములే అని పార్కింగ్ లో కార్ తీసుకుని పారిస్ వైపుగా మా ప్రయాణం ప్రారంభమైంది. 

Friday, October 16, 2015

నా ఐరోపా యాత్ర - 21 (ఆస్ట్రియా )

లిచ్టేన్ స్టెయిన్ నుండి మా తరువాతి ప్రయాణం ఆస్ట్రియా లోని రోల్స్ రాయ్స్ మ్యూజియం. ఈ మ్యూజియం ఒక ప్రైవేటు వ్యక్తిది. Franz Vonier అనే వ్యక్తి తనకున్న హాబీ తో దాదాపు 1000 రోల్స్ రాయస్ కార్లని సేకరించి మ్యూజియం గా ఏర్పాటు చేసాడు. ముందు రోజు రాత్రి మేము బస చేసిన హోటల్ లో ఈ మ్యూజియం తాలూకు వివరాలని చూడటంతో ఇది చూశాక అక్కడినుండి స్విట్జెర్లాండ్ వెళదామని అనుకున్నాం. లిచ్టేన్ స్టెయిన్ నుండి స్విట్జెర్లాండ్ వెళ్ళాలంటే ఆస్ట్రియా మీదుగానే వెళ్ళాలి. 

ఆస్ట్రియాలో మేము బస చేసిన హోటల్ 
 హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్,  ప్రపంచ ప్రఖ్యత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్,  సంగీత విద్వాంసుదు మోజార్ట్,  ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎర్పిన్ ష్రోడింగర్ లతో పాటు నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన దేశం ఇది. రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన ఒక నియంత జన్మించిన ప్రదేశం ఇప్పుడు ప్రశాంతత కి , ఆధునిక సంస్కృతి కి మారుపేరు గా విలసిల్లుతోంది.అన్నట్లు మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది సంఘటన జరిగింది ఈ దేశం కారణంగానే. బోస్నియా కి స్వాతంత్రం కావాలంటూ జూన్ 28 1914 న సెర్బియాకి చెందిన గావ్రిలో ప్రిన్సిప్ అనే పందొమ్మిదేళ్ల కుర్రాడు ఆస్ట్రియా ప్రభువు ఫ్రాంజ్ ఫెర్టినాండ్, ఆయన భార్య సోఫీని కాల్చి చంపాడు. ఈ ఘటన బోస్నియా రాజధాని సరయేవోలో జరిగింది. బోస్నియాకు ఆస్ట్రియా నుంచి స్వాతంత్రం కావాలని కోరుతూ ఈ కాల్పులు జరిపాడు ప్రిన్సిప్. అదే మొదటి ప్రపంచ యుద్ధంలో పేలిన తొలి తూటా.. అదే మొదటి ప్రపంచ యుద్ధానికి తొలి అడుగు.ఈఘటన రాజేసిన చిచ్చు.. సరిగ్గా నెలరోజులకు అంటే జూలై 28, 1914న ప్రపంచ మానవ చరిత్రకే ఓ చెరగని గాయంగా మారిన మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది. తద్వారా రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఈ దేశం నాజీలకి లొంగిపోయింది. తాను జన్మించిన ఈ దేశాన్ని జర్మనీ లో కలుపుకోవాలనేది హిట్లర్ ఆకాంక్ష. చెక్ రిపబ్లిక్ , జర్మనీ , హంగరీ , ఇటలీ , స్లోవేకియా , లిచ్టేన్ స్టెయిన్,స్లోవేనియా , స్విట్జెర్లాండ్ దేశాలు ఆస్ట్రియాకి సరిహద్దులుగా ఉన్నాయి. మేము చూసిన దేశాల్లో అత్యధిక పర్వత శ్రేణులు ఉన్న దేశం ఇది. ఆల్ఫ్స్ పర్వతాలు , హిమనీ నాదాలు దేశమంతా కనిపిస్తుంటాయి.

ఇళ్ళు కూడా పర్వత పాదాల్లో , కొన్ని పర్వతాల మీద విసిరేసినట్లు అక్కడొకటి , అక్కడొకటి కనిపించాయి. అసలు ఆస్ట్రియాలో ప్రయాణిస్తున్నంత సేపు ఆ ప్రకృతి రమణీయత మమ్మల్ని మరో లోకంలోకి తీసుకువెళ్ళింది. ఎటు చూసినా పచ్చిక బయళ్ళు , పచ్చటి కొండలు , ఆకులు అసలు కనపడని పూల తోటలు, అడవులు సైతం పద్దతిగా పెరిగినట్లు ఉన్నాయి. ఈ వాతావరణమే వీళ్ళ అదృష్టమేమో అనిపించింది.మన తెలుగు సినిమా పాటల కోసం దర్శక నిర్మాతలంతా వచ్చేది ఇక్కడికే. సినిమాల్లో పాటలలో కనిపించే ప్రకృతి అందాలన్నీ ఎక్కువ భాగం ఆస్ట్రియా లోనే చిత్రీకరించారు. ఇక్కడ అధికారిక భాష జర్మన్. స్లావెన్ క్రోషియన్ భాషలు కూడా మాట్లాడతారు. కరెన్సీ యూరో. ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం. ఇది దేశానికి ఒక మూలన ఉంటుంది.మేము ఈ నగరాన్ని చూడలేదు.

లిచ్టేన్ స్టెయిన్ నుండి రోల్స్ రాయస్ మ్యూజియం 50 కిలోమీటర్ల దూరంలో దోర్న్ బిర్న్ అనే ప్రాంతంలో ఉంది. ఒక పాత బట్టలమిల్లు ఉన్న ప్రదేశంలో ఈ మ్యూజియం నెలకొల్పారు. మేము వెళ్తున్న దారిలో చుట్టూ ఎత్తైన వృక్షాలు తో పాటు వీనులవిందుగా సవ్వడి చేస్తున్న జలపాతాల హోరు వినిపిస్తోంది. దాదాపు మేము వెళ్తున్న ప్రాంతం అంతా కొండలు , జలపాతాల మధ్యలోనే ఉంది. మార్చిన్ వాళ్ళ అబ్బాయి మాక్సిమ్ జలపాతం చూస్తానని మారాం చెయ్యటంతో ఒకచోట పక్కగా కారుని ఆపాడు మార్చిన్. అక్కడ దిగి కాసేపు ఆ జలపాతాన్ని చూస్తూ ఫోటోలు తీసుకున్నాం. తరువాత అక్కడినుండి కొద్ది దూరంలో ఉన్న మ్యూజియం ని చేరుకున్న మాకు నిరాశే ఎదురైంది. ఆరోజు మ్యూజియం కి సెలవు. మా ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లైంది. ఇక ఆ మ్యూజియం ముందు ఫోటో తీసుకుని వెనక్కి బయలుదేరాం. అప్పటికే సమయం మధ్యాహ్నం 2.30 అయ్యింది. అక్కడినుండి మా ప్రయాణం స్విట్జెర్లాండ్ లో ఉన్న రైన్ ఫాల్స్ ( Rhine Falls). 

మార్చిన్ మరియు వాళ్ళ అబ్బాయి మాక్సిమ్ తో ఆస్ట్రియాలో మేము బస చేసిన హోటల్  దగ్గర