Thursday, July 13, 2017

అర్మేనియా డైరీ

A quote from the Dalai Lama "Once a year, go somewhere you have never been before"
హైదరాబాదులో ఉన్న అబిడ్స్ ప్రాంతానికి ఆ పేరు రావటానికి కారణం అర్మేనియా దేశానికి చెందిన ఒక వ్యాపారి. ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ని పాలించే సమయంలో అర్మేనియాకి చెందిన ఆల్బర్ట్ అబిద్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఒక దుకాణం నడిపేవాడు.అందువల్ల ఆ ప్రాంతాన్ని అబిద్ షాప్ అని పిలిచేవారు. కాలక్రమేణా అది అబిడ్స్ అయ్యింది.ఇది మన తెలుగు నేలకి అర్మేనియా కి ఉన్న అనుభంధం. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి సెలవలకి వెళ్ళటం రివాజు. ఇంతకుముందు భార్గవి నేనూ యూరప్ దేశాలు, గత నాలుగేళ్లుగా దుబాయ్ లో నివాసం ఉండటంతో పక్కనున్న గల్ఫ్ దేశాలన్నీ కవర్ చేసేశాం. ఇక సంవత్సరం మాతో పాటు మా అబ్బాయి హన్ష్ కూడా మాకు తోడయ్యాడు. అర్మేనియా దేశాన్ని ఈ సంవత్సరం మా పర్యటనకి ఎంచుకున్నాం.
మే 19 వ తేదీ ఉదయం 11.40 గంటలకి దుబాయ్ నుండి ఫ్లై దుబాయ్ విమానంలో అర్మేనియా రాజధాని నగరమైన యెరవాన్ కి పయనమయ్యాం. టికెట్లు, హోటల్ ఏర్పాట్లు అన్నీ ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవటంతో మాకు పెద్దగా ఇబ్బంది ఏమి లేదు.దుబాయ్ నుండి యెరవాన్ మూడు గంటల ప్రయాణం.మధ్యాహ్నం మూడు గంటలకల్లా యెరవాన్ లోని జావార్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండ్ అయ్యాం.దుబాయ్ మరియు అర్మేనియా సమయాల్లో తేడా ఏమీ లేదు.ఈ రెండు దేశాలు భారత కాలమానం కంటే గంటన్నర వెనక వుంటాయి.
దుబాయ్ లో నివాస వీసా ఉండే భారతీయులకి అర్మేనియా ఆగమానంతర వీసా సదుపాయం కల్పిస్తోంది. ఎయిర్ పోర్ట్ లో పాస్పోర్ట్ చెక్ కంటే ముందే వీసా విభాగం ఉంది. వీసాకి చెల్లించాల్సిన పైకం ఆర్మేనియా కరెన్సీ లోనే చెల్లించాలి. అర్మేనియా కరెన్సీ పేరు డ్రామ్, ఒక డాలర్ కి 477 డ్రాములు వస్తాయి. 21 రోజులు మీరు ఆర్మేనియాలో ఉండాలంటే 3000 డ్రాములు వీసా ఫీజు చెల్లించాలి.అంటే 6 డాలర్లు, మన డబ్బుల్లో అయితే 400 రూపాయలు.18 ఏళ్ల వయసు లోపు వారికి వీసా ఉచితం.మా అబ్బాయి హన్ష్ వయసు 8 నెలలు కావటంతో తనకి వీసా చార్జీలు లేవు.వీసా కౌంటర్ పక్కనే ఉన్న కరెన్సీ ఎక్స్చేంజి లో 100 డాలర్స్ మార్చుకుంటే 47700 అర్మేనియా డ్రాములు వచ్చాయి.6000 డ్రాములు చెల్లించి నేను నా శ్రీమతి భార్గవి వీసా తీసుకున్నాం. ఎయిర్పోర్ట్ బయటకి రాగానే ట్రావెల్ ఏజెంట్ మా పేర్లు ఉన్న ప్లకార్డు తో నిలబడి ఉన్నాడు. మాతో పాటు దుబాయ్ నుండి మరో 9 మంది అదే ట్రావెల్ ఏజెంట్ ద్వారా వచ్చారు. అందరిని కలిపి 18 సీట్స్ ఉన్న ఒక మినీ బస్సులో కూర్చోబెట్టారు. మా గైడ్ పేరు మేరీ, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతోంది. మేము మొత్తం 4 రోజులు ఈ దేశంలో ఉండబోతున్నాం. అయితే కేవలం రెండు రోజులకి మాత్రమే మేము ట్రావెల్ ఏజెంట్ దగ్గర లోకల్ టూర్స్ తీసుకున్నాం. నాకు చరిత్ర అంటే ఉన్న ఆసక్తి వల్ల ఈ టూర్ ప్యాకేజీలో లేని కొన్ని ప్రదేశాలని సందర్శించాలని నిశ్చయించుకోవటంతో మిగతా 2 రోజులు వాటి కోసమే అట్టిపెట్టుకున్నాను.బస్సు బయలుదేరగానే మా గైడ్ మేరీ తనను తాను పరిచయం చేసుకుని మా వివరాలు అడిగింది. అందరం పరిచయం చేసుకున్నాక యెరవాన్ గురించి చెప్పటం ప్రారంభించింది.
ప్రపంచంలో ఉన్న అతి పురాతన నగరాల్లో యెరవాన్ ఒకటి. క్రీస్తు పూర్వం 782 వ సంవత్సరంలో ఆర్గిష్టి 1 అనే రాజు ఏరేబుని కోట నిర్మాణంతో ఈ నగరానికి పునాది వేసాడు. ఏరేబుని ఒక గొప్ప పరిపాలన మరియు మతపరమైన కేంద్రంగా, పూర్తిగా రాజధానిగా రూపొందించబడింది.తరువాత కొంత కాలానికి కొత్త రాజధాని నగరాలు స్థాపించబడి, యెరవాన్ ప్రాముఖ్యత తగ్గింది.ఇరాన్ మరియు రష్యన్ పాలనలో 1736 నుండి 1828 వరకు కొంత వైభవాన్ని పొందింది. 1850 నుండి 1917 వరకు ప్రత్యేక గవర్నరేట్ గా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక అర్మేనియా గణతంత్ర రాజ్యంగా మారిన పిమ్మట 1918 నుండి నేటి వరకు అర్మేనియాకి రాజధాని గా ఉంది.మొత్తం వెరసి 2800 సంవత్సరాల వయస్సున్న పురాతన నగరం యెరవాన్.
ఇక అర్మేనియా విషయానికి వస్తే అరారత్ పర్వతాల ఒడిలో దాదాపు 5000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న దేశం ఇది.కానీ ఏనాడు కూడా స్థిరత్వంగా ఉన్న దాఖలాలు లేవు. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్బైజాన్, దక్షిణాన ఇరాన్ మరియు అజర్బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్క్లేవ్లు ఉన్నాయి.ఇది ల్యాండ్ లాక్డ్ దేశం, అంటే భూబంధిత ప్రాంతం. నాలుగు వైపులా భూమి మాత్రమే సరిహద్దుగా ఉంది. ఈ దేశానికి సముద్ర తీర ప్రాంతం లేదు, కేవలం అక్కడపర్వత ప్రాంతాల్లో దొరికే రాగి , బంగారం, తగరం వంటి ఖనిజాల తవ్వకాల మీదనే ఈ దేశం ఆధారపడి ఉంది. ఒకప్పుడు దేశంలో భాగంగా ఉండి, దేశానికి జాతీయ చిహ్నంగా భావించే అరారత్ పర్వతాలు ప్రస్తుతం టర్కీ లో ఉన్నాయి. అయినా సరే వాటిని తమ దేశ జాతీయ చిహ్నంగా భావిస్తారు.బైబిల్ ప్రకారం జల ప్రళయం ఏర్పడినప్పుడు నోవా అనే పెద్దాయన కొన్ని ప్రాణులను ఒక నౌకలో పెట్టి రక్షిస్తాడు. ఆ నౌక అరారత్ అనే కొండ దగ్గరికి చేరుకుందని అర్మేనియన్లు నమ్ముతారు. కొంతకాలం పర్షియన్లు , బైజాంటైన్, మంగోలులు ఈ దేశాన్ని పరిపాలించారు. మరికొంత కాలం తూర్పు , పశ్చిమ అర్మేనియాలుగా విభజించి పశ్చిమాన్ని టర్కీ ఒట్టోమన్ ప్రభుత్వం , తూర్పు భాగాన్ని ఇరాన్ పాలించాయి. అర్మేనియాలో నివసించే జనాభా 30 లక్షలు అందులో దాదాపు 50 శాతం మంది రాజధాని నగరం యెరవాన్ లోనే నివసిస్తారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలలో ఉన్న ఆర్మేనియన్లు 80 లక్షలు. ఆది నుండి ఈ దేశం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవటంతో పలు దఫాలుగా ఇక్కడి పౌరులంతా వలసలు వెళ్లిపోయారు.
ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన మా బస్సు నగరం వైపు ప్రయాణిస్తోంది. ఇక్కడి ఇళ్ళు అన్నీ పింక్ మరియు లేత పసుపు రంగులో ఉండటం గమనించాం. దీని గురించి మా గైడ్ మేరీ ని అడగగా, ఆలా కనిపించటానికి కారణం ఇక్కడ నిర్మాణాలకు ఉపయోగించే టాఫ్ అనే ప్రత్యేకమైన రాయి. నగరంలో ఉన్న ఇళ్ళు , భవంతులు , పెద్ద పెద్ద కట్టడాలన్నీ ఈ రాతితోనే నిర్మిస్తారు. పింక్ మరియు లేత పసుపు రంగులో వల్కనో బూడిద నుండి ఏర్పడిన ఈ రాయి యెరవాన్ లోని కారాబాగ్ అనే ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. 2800 ఏళ్ల క్రితం ఈ నగర నిర్మాణం మొదలైనప్పటినుండి నేటి వరకు కూడా ఇదే రాయిని నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. అందుకే నగరమంతా ఎరుపు , లేతపసుపుల మిశ్రమంగా కనిపిస్తుంది. మేము ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళినపుడు కింద ఉన్న నిర్మాణాలన్నీ ఇదే రంగుల్లో కనిపించాయి. ఆధునిక నిర్మాణాలకు కూడా సిమెంట్ గాని సున్నం గాని వేయరు.కేవలం రాళ్ళని నిలబెట్టి వాటి మధ్యలో మాత్రం సిమెంటుతో పూడుస్తారు. పెద్ద ఫ్యాక్టరీల నుండి చిన్న ఇంటి వరకు కూడా ఇదే తరహాలో నిర్మాణం జరుగుతుంది. వేసవిలో చల్లగా , చలికాలంలో వెచ్చగా ఉండటంఈ రాయి ప్రత్యేకత.

ఇలా మేరీ అన్ని విషయాలు చెప్తుండగానే మా బస్సు నగరం మధ్యలో ఉన్న యెరవాన్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. అర్మేనియా రైల్వే వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందలేదు. కారణం మిగతా దేశాలతో పోలిస్తే అర్మేనియా లో రైలు వినియోగించేవారు తక్కువ. కేవలం స్థానికంగా రెండు మూడు ప్రాంతాలకి మాత్రమే రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక అంతర్జాతీయ కనెక్టివిటీ చూస్తే, పక్క నున్న టర్కీ , అజర్ బైజాన్ దేశాలతో ఉన్న వివాదాల వల్ల అంతర్జాతీయ రైల్వే వ్యవస్థ కూడా అభివృద్ధి కాలేదు 1993 నుండి టర్కీ , అజర్ బైజాన్ బోర్డర్లు మూసివేయటంతో ఆ రైల్వే లైన్ వినియోగంలో లేదు. కేవలం జార్జియా కి మాత్రమే ఒక రైలు ఉంది.ఆ రైల్వే స్టేషన్ ముందు ఫోటో తీసుకున్నాం.
అక్కడినుండి మా బస్సు రిపబ్లిక్ స్క్వేర్ కి చేరుకుంది.ఇది నగర కూడలి, అప్పటికే సాయంకాలం అవ్వటంతో కూడలి అంతా సందడిగా ఉంది. ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండటంతో అందరూ స్వేట్టర్లు తో కనిపించారు.ఈ కూడలి నిర్మాణం 1926 లో ప్రారంభమై 1977 వరకు నిర్మాణం కొనసాగింది. 1924 లో అలెగ్జాండర్ తామనియాన్ అనే వ్యక్తి ఈ కూడలికి రూపకల్పన చేశాడు.ఈ కూడలి మధ్యలో ఒక ఫౌంటెన్ మరియు చుట్టూ 5 భవనాల నిర్మాణం జరిగింది. ఈ భవనాలన్నీ కూడా అర్మేనియా సంస్కృతికి అనుగుణంగా నిర్మించారు. ఒక ప్రభుత్వ భవనం , చారిత్రక మ్యూజియం ,విదేశాంగ శాఖా కార్యాలయం, మారియట్ హోటల్ మరియు నేషనల్ గేలరీ భవనం ఉన్నాయి. 1950 నాటికి నాలుగు భవనాలు పూర్తవగా నేషనల్ గేలరీ మాత్రం 1977 లో పూర్తయ్యింది. మొదట్లో దీనిని లెనిన్ స్క్వేర్ అని పిలిచేవారట. ఇక్కడ లెనిన్ విగ్రహం కూడా ఉండేది. సోవియట్ నుండి అర్మేనియాకి స్వతంత్రం లభించాక , లెనిన్ విగ్రహాన్ని తొలగించి ఈ కూడలి పేరు కూడా మార్చారు. ఇక్కడ కార్లు, టాక్సీలు కూడా అన్నీ పాతవి మరియు చిన్న కార్లు. ఏదో అక్కడక్కడా తప్ప పెద్ద లగ్జరీ కార్లు కూడా కనపడలేదు.
ఈ విశేషాలన్నీ చూశాక అక్కడినుండి మా బస్సు విక్టరీ పార్క్ అనే ఉద్యానవనం వైపు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అర్మేనియా దళాలు రష్యా తరపున యుద్ధంలో పాల్గొన్నాయి. 1945 లో ఆ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ విక్టరీ పార్క్ ని నిర్మించారు. ఈ పార్క్ లో 22 మీటర్ల ఎత్తు ఉన్న "మదర్ ఆఫ్ అర్మేనియా" విగ్రహం ఉంది. గతంలో ఈ స్థానంలో రష్యా అధ్యక్షుడు స్టాలిన్ విగ్రహం ఉండేదట. 1953 లో స్టాలిన్ మరణించాక 1962 లో ఆయన విగ్రహాన్ని తీసేసి మదర్ ఆఫ్ అర్మేనియా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. పలు యుద్ధాల్లో భర్తలకు సహకరించిన అర్మేనియా మహిళల వీరత్వానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.ఈ విగ్రహం కింద ఒక మ్యూజియం కూడా ఉంది. మొదటి , రెండవ ప్రపంచ యుద్ధాలతో పాటు అర్మేనియా పాల్గొన్న యుద్ధాలలో వీరమరణం పొందిన సైనికుల వివరాలు , ఆయుధాలు ఇక్కడ ఉంచారు. మేము వెళ్ళేటప్పటికి ఆలస్యం అవటంతో మ్యూజియం చూడలేకపోయాం. అప్పటికి చలిగాలులతో సన్నటి వర్షం మొదలైంది.
ఇక ఆరోజుకి మా పర్యటన ముగించుకుని నగరానికి కొంచెం దూరంలో ఉన్న కాస్కస్ అనే హోటల్ కి వెళ్లిపోయాం. ఇది నగరానికి కొంచెం దూరంగా ఉన్న 5 నక్షత్రాల హోటల్. మా గైడ్ మేరీ ఆ రోజుకి సెలవు తీసుకుని ఉదయం 9 గంటలకల్లా హోటల్ రెసెప్షన్ లో రెడీగా ఉండమని చెప్పింది. రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యాక హన్ష్ కి రూమ్ లోనే సెరిలాక్ తినిపించేసి ముగ్గురం కిందకి వచ్చాము. బయట వర్షం పడుతోంది , బాగా చలిగా ఉంది.ఈ హోటల్ కి రెండు రెస్టారెంట్లు ఉన్నాయి.ఒక దాంట్లో హెచ్చు స్థాయి సంగీతంతో పార్టీ జరుగుతోంది.మేము పక్కనే ఉన్న మరో రెస్టారెంట్ కి వెళ్ళాం.వెళ్ళగానే బేరర్ ఇచ్చిన మెనూ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ధరలన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ధరల్లో మన కర్రీ పాయింట్ లో రెండు కూరలు కూడా రావు. అలాంటిది ఫైవ్ స్టార్ హోటల్ లో చికెన్, మటన్ , చేపతో కూడిన పూర్తి భోజనం లభిస్తోంది.నేను బార్బిక్యూ చికెన్ ఆర్డర్ చెయ్యగా, భార్గవి లాంబ్ విత్ రైస్ ఆర్డర్ చేసింది. మాతో పాటు ఉన్న దుబాయ్ నుండి వచ్చిన మరో ఇద్దరు కూడా అదే రెస్టారెంట్ కి వచ్చారు.అందరం డిన్నర్ ముగించి రూమ్ కి వెళ్లిపోయాం.
మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా హోటల్ ముందు మా గైడ్ మేరీ సిద్ధంగా ఉంది.అందరం అల్పాహారం ముగించుకుని బస్సు దగ్గరికి చేరుకున్నాం. హన్ష్ చిన్నవాడు కావటంతో అక్కడున్న అందరూ ముద్దు చేసేవారు. ముఖ్యంగా స్థానికులు వాడిని ఎత్తుకుని ఫొటోస్ తీసుకున్నారు. హోటల్ సిబ్బంది అక్కడున్న నాలుగు రోజులు వాడితో బాగా ఆడుకున్నారు. హన్ష్ కూడా ఎవరు ఎత్తుకున్నా అసలు మారాం చేసేవాడు కాదు.అందరి దగ్గరికీ వెళ్ళేవాడు.మేము అక్కడున్న నాలుగు రోజులు కూడా అసలు ఒక్క క్షణం కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాడు కూడా ట్రిప్ ని ఎంజాయ్ చేసాడు.
ఇప్పుడు మేము వెళ్ళబోయేది లేక్ సెవాన్ అనే మంచినీటి సరస్సు. ఇది సముద్ర మట్టానికి 6250 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు. మొదటిది లాటిన్ అమెరికాలోని టిటికాకా సరస్సు.ఇది బొలీవియాలో ఉంది. యెరవాన్ నుండి సెవాన్ 80 కిలోమీటర్లు. దాదాపు 2 గంటల ప్రయాణం. రోడ్లు మీద గుంతలు లాంటివి లేవు కానీ గొప్ప రోడ్లని కూడా చెప్పలేం. వాతావరణం బాగా చల్లగా ఉంది, ఉష్ణోగ్రత 10 డిగ్రీలు చూపిస్తోంది. మేము ప్రయాణించిన రెండు గంటల్లోనే వాతావరణంలో మార్పులన్నీ చూశాం. చలి , వర్షం , ఎండ అన్నీ రెండు గంటల్లో ఒకదాని తర్వాత మరోటి వచ్చాయి.ఇక్కడ వేసవి కాలం జూన్ నుండి సెప్టెంబరు మాసం వరకు ఉంటుంది.ఆ సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 22-36 డిగ్రీల సెల్షియస్ మధ్యలోనే ఉంటాయి. మేము వెళ్ళింది మే నెల చివర్లో కనుక ఇంకా వాతావరణం పలు మార్పులకి లోనవుతుంది. మేము వెళ్లే దారి పొడవునా పచ్చటి కొండలు , లోయలు , అక్కడక్కడా మేత మేస్తున్న ఆవులు కనిపించాయి.సగం దూరం వెళ్ళాక రోడ్డుకి పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. యెరవాన్ నుండి సెవాన్ కి రైల్ మార్గం ఉంది. ఇది మీటర్ గేజి కావటంతో చాలా చిన్న ట్రైన్ వెళ్తుంది. మా గైడ్ మేరీ చెప్తూ తాను చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి సరదాగా రైలు లోనే సెవాన్ కి వచ్చేవాళ్ళం అని చెప్పింది.మేము సెవాన్ సరస్సు చేరుకునేటప్పటికీ చలిగాలులు ఉదృతంగా వీస్తున్నాయి. మేము చలికి తగినట్లుగా సిద్ధపడి రావటంతో మా దగ్గర ఉన్న స్వేట్టర్లు , మంకీ కాప్ లు ధరించి కిందకి దిగాం. ఆ సరస్సు చాలా పెద్దది , ఈ గాలుల తాకిడికి సముద్రంలో వచ్చినట్లు సరస్సులో అలలు వస్తున్నాయి. మేము బస్సు దిగగానే గాలుల తాకిడి ఎక్కువవడంతో ఎదురుగా కొండపై ఉన్న ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్లి కూర్చున్నాం. కాసేపటికి ఆ గాలుల ధాటికి రెస్టారెంట్ అద్దాలు భళ్ళున పగిలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ అద్దాల దగ్గర ఎవరూ లేకపోవటంతో ఎవరికీ ఏమి కాలేదు.ఈ సరస్సు ఎదురుగా ఉన్న కొండపైనా ఒక పురాతన చర్చి ఉంది. అక్కడికి వెళ్తే సరస్సు మొత్తం కనిపిస్తుందట. ఆ గాలిలో మేము హన్ష్ ని తీసుకుని పైకి వెళ్లే సాహసం చేయలేకపోయాము. అక్కడే కాసేపు కూర్చుని కొంత గాలి తగ్గాక సరస్సు ముందు ఫోటోలు తీసుకున్నాం. ఒకప్పుడు 65 అడుగుల లోతు ఉన్న ఈ సరస్సు ఇప్పుడు 40 అడుగులకి తగ్గిపోయింది. చలికాలంలో ఈ సరస్సు గడ్డ కట్టిపోతుందట. అర్మేనియా కి అవసరమైన చేపలలో సింహభాగం ఈ సరస్సు నుండే వస్తాయట. అప్పటికే భోజన సమయం అవ్వటంతో సరస్సు ఒడ్డునే ఉన్న మరో రెస్టారెంట్ కి వెళ్ళాం. సెవన్ లో దొరికే అనేక రకాల చేపలలో సిగా అనేది అరుదైన చేప. మేము వెళ్లిన హోటల్ లో మాకు ఆరోజు అదే భోజనం. మా గైడ్ మేరీ ఈ చేప చాలా బావుంటుందని చెప్పటంతో ఎప్పుడూ అసలు చేప తినని భార్గవి కూడా మొదటిసారి ఆ చేపని రుచి చూసింది. నిజంగానే చేప అసలు వాసన లేకుండా చాలా రుచిగా ఉంది.
ఇక్కడి నుండి మేము వెళ్ళబోయేది గార్ని అనే పట్టణం.సెవన్ నుండి గార్ని 75 కిలోమీటర్లు, దారిలో అన్నీ చిన్న చిన్న గ్రామాల్ని దాటుకుంటూ దాదాపు గంటన్నర ప్రయాణం తరువాత గార్ని చేరుకున్నాం.గార్ని పట్టణం ఒకప్పటి అర్మేనియా రాజులకి వేసవి విడిది.అలాగే అక్కడ ఉన్న క్రీస్తు పూర్వం నాటి గార్ని దేవాలయం అర్మేనియాలో ముఖ్య సందర్శనీయ స్థలాల్లో ఒకటి.ఇది పాగన్ మతానికి చెందిన దేవాలయం. క్రైస్తవానికి పూర్వం అర్మేనియా లో పాగనిజం మరియు జోరాస్ట్రియన్ మతాలూ ఉండేవి. గార్ని దేవాలయం 2100 సంవత్సరాల నాటి నిర్మాణం.యునెస్కో వారసత్వ సంపదగా దీనిని గుర్తించింది. అర్మేనియాలో మిగతా ఏ సందర్శక ప్రాంతానికీ టికెట్ లేదు.ఈ ప్రాంతం చూడాలంటే మాత్రం 2 డాలర్లు రుసుము చెల్లించాలి. టికెట్ తీసుకుని లోపలి కొంత దూరం నడిచాక ఎదురుగా ఎత్తైన పర్వతాల మధ్యలో ఠీవిగా నిలబడ్డ నిర్మాణం కనిపించింది.మేము అందరికంటే ముందు వడి వడి గా ఆ నిర్మాణం లోపలికి చేరుకున్నాం. లోపల ఒక రాతి పీఠం మాత్రం ఉంది.అక్కడ ఒక వ్యక్తి సంగీతం వాయిస్తూ ఉన్నాడు. గైడ్ మేరీ దీని గురించి చెపుతూ ఈ నిర్మాణం చుట్టూ ఉండే 24 స్తంభాలు 24 గంటలని సూచిస్తాయట. అర్మేనియా లో గ్రీకు , రోమన్ శైలిలో నిర్మించబడిన ఏకైక నిర్మాణం ఇది. ఇది ఎప్పుడు కట్టారో సరిగ్గా ఎవరికీ తెలియదు. ఇక్కడ దొరికిన ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 77 వ సంవత్సరంలో నిర్మించారని ఒక అంచనా.క్రైస్తవ మతానికి పూర్వం యూరోప్ దేశాల్లో పాగన్ మతం ఉండేది.ఈ మత విశ్వాసాల్ని గురించి ఎక్కడా ఖచ్చితమైన వివరాలు లేవు.ఇది విగ్రహారాధక మతం.యూరోపియన్ మరియు స్కాండినేవియన్ దేశాల్లో క్రైస్తవీకరణ ప్రారంభమయ్యాక క్రమక్రమంగా ఈ పాగనిజం క్షీణించింది. అర్మేనియాలో 3 వ శతాబ్దానికే క్రైస్తవ మతం ప్రవేశించడంతో మిగతా మతాలన్నీ కనుమరుగయ్యాయి. కొంతమంది చరిత్ర కారుల వాదన ప్రకారం ఈ నిర్మాణం దేవాలయం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే క్రైస్తవ మతం వచ్చాక ఇంతకుముందు ఉన్న మతాల గురుతులన్నీ చెరిపివేయబడ్డాయి. ఆ క్రమంలో పాగన్ మతానికి చెందిన దేవాలయాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి. ఈ గార్ని దేవాలయం అనేది కేవలం సమాధి మాత్రమే అందువలనే దీనిని నాశనం చేయలేదు అని చెపుతారు. క్రైస్తవం వచ్చాక దీని పక్కనే దీనికన్నా ఎత్తైన చర్చి నిర్మాణం జరిగింది. అయితే ఆ 1679 లో వచ్చిన భూకంపం దాటికి చర్చి మొత్తం కూలిపోయింది. కాని గార్ని దేవాలయం మాత్రం పెద్దగా చెక్కు చెదరలేదు అక్కడక్కడా బీటలు వారింది.దీని పక్కనే కొద్దీ దూరంలో నేల మాళిగలో రోమన్ పవిత్ర స్నానానికి సంభందించిన గదులు ఉన్నాయి.

అర్మేనియాకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని అధికారికంగా స్వీకరించిన మొట్టమొదటి దేశం ఇది. క్రీస్తు ముఖ్య శిష్యులైన దాడియస్, బార్తోలోమేవ్ ప్రభావంతో క్రీస్తుశకం 301 వ సంవత్సరంలో అర్మేనియన్లు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. తద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి క్రైస్తవ దేశంగా అర్మేనియా గుర్తింపు పొందింది. మరో పది సంవత్సరాలకి రోమ్ నగరానికి ఆ హోదా లభించింది.
గార్ని దేవాలయం నుండి మా ప్రయాణం దానికి కొద్ది దూరంలోనే ఉన్న గెగార్డ్ అనే చర్చి దగ్గరకి. గార్ని వెళ్లిన ప్రతి ఒక్కరు తప్పకుండా చూసే ప్రాంతం గెగార్డ్ చర్చి. ఇవి రెండూ కూడా కొద్ది దూరంలోనే ఉంటాయి. మేము బస్ దిగి కొంచెం ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోకి నడిచి చర్చి లోపలి చేరుకున్నాం.ఇందులో మొత్తం 3 చర్చిలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే ఇవి అన్నీ ఒకే రాతిలో తొలిచిన నిర్మాణాలు. మొదటి చర్చి నాలుగు శతాబ్దంలో రాతి గుహ మాదిరిగా తొలిచారు. తరువాత వరుసగా 8, 10 వ శతాబ్దాల్లో మిగతా రెండు చర్చి లని పక్కనే ఉన్న మరో రాతిలో తొలిచారు. పైకి చూడటానికి మాత్రం ఇదంతా ఒకే నిర్మాణంలా అనిపిస్తుంది. కానీ లోపల మూడు నిర్మాణాలు ఉన్నాయి. వెలుగు కోసం పైన వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. అన్నేళ్ల క్రితం అలాంటి నిర్మాణం ఎలా చేశారా అని ఆశ్చర్యపోయాం. అక్కడినుండి బయటకి వస్తుండగా హల్వాలా కనిపించే కాండీ లు అమ్ముతున్నారు. ఒక దారానికి కాజు పిస్తా లాంటి డ్రైఫ్రూప్ట్స్ గుచ్చి వాటిని హల్వా లాంటి పదార్థంలో ముంచి కాండీ లాగ తయారు చేసి అమ్ముతున్నారు.దీనిని సుజుక్ అంటారు,ఇది చాలా మంచి పోషకాలు కలిగిన ఆహరం. పూర్వం యుద్ధాలకి వెళ్లే సైనికులు ఈ కాండీలని ఆహారంగా తీసుకెళ్లేవారట. ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు మంచి శక్తిని ఇస్తాయని వీటిని తినేవారట. మేము కూడా 4 క్యాండీలు కొన్నాం.అప్పటికే సాయంకాలం 5 గంటలు అయ్యింది.ఇక్కడి నుండి తిరుగు ప్రయాణం అయ్యి 2 గంటల తర్వాత యెరవాన్ రిపబ్లిక్ స్క్వేర్ కి చేరుకున్నాము. మా గ్రూప్ లో కొంతమంది షాపింగ్ కోసం అక్కడ దిగిపోయారు. మరుసటి రోజు టూర్ ప్లాన్ అంతా మిగతా వారికి చెప్పి గైడ్ మేరీ కూడా మా దగ్గర వీడ్కోలు తీసుకుని మధ్యలోనే దిగిపోయింది. మరుసటి రోజు వారందరూ యెరవాన్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరారత్ పర్వతాల దగ్గరకి వెళుతున్నారు.
మరుసటి రోజు మేము గైడ్ లేకుండానే కొన్ని ప్రాంతాలు చూడాలని నిర్ణయించుకోవటంతో, మాకు అంతకుముందే పరస్పర మిత్రుల ద్వారా పరిచయం అయిన ఆర్మేనియన్ నివాసి, మన తెలుగు వారు అయిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆర్మేనియాలో మెడికల్ యూనివర్సిటీ మరియు మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఇండియా నుండి పలువురు విద్యార్థులు ఏటా ఇక్కడ డాక్టర్ కోర్సు చెయ్యటానికి వస్తుంటారు. ఇండియాతో పోలిస్తే ఇక్కడ డాక్టర్ చదువు చాలా చవక. నివాస ఖర్చులు కూడా తక్కువే, మన దగ్గర అయ్యే ఖర్చులో కేవలం 20 శాతంతో ఇక్కడ డాక్టర్ చదువు అయిపోతుంది. అలాగే ఐదేళ్ల క్రితం ఇక్కడ మెడిసిన్ చదవటానికి వచ్చి ఇక్కడే స్థిరపడిన హైదరాబాద్ కి చెందిన లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడి భాషతో , ఈ దేశంతో మమేకమయ్యారు.అసలు భారతీయులే పెద్దగా కనపడని ఈ దేశంలో మన తెలుగు వారు ఉండటం చాలా సంతోషం అనిపించింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మణ్ గారు ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్ మాకోసం 9 గంటకల్లా వచ్చాడు. ఇక్కడ ఇంగ్లిష్ మాట్లాడే వారు చాలా అరుదు, టాక్సీ డ్రైవర్ కి కూడా ఇంగ్లీష్ రాదు. ఆ రోజు ప్లాన్ మొత్తం మేము లక్ష్మణ్ గారికి చెప్పటం ఆయన దానిని ఆర్మేనియన్ భాషలో ఆ డ్రైవర్ కి చెప్పటంతో పెద్ద సమస్య లేకుండానే మా మిగతా రెండు రోజుల పర్యటన జరిగింది. ఎప్పటికప్పుడు ఫోన్ లో మమ్మల్ని గైడ్ చేస్తూ , ప్రతి క్షణం జాగ్రత్తలు తీసుకున్న లక్ష్మణ్ కుమార్ గారి ఆదరణ ని ఎన్నటికీ మరచిపోలేము.
ఇంతకుముందు చెప్పుకున్నట్లు మొట్టమొదటగా క్రీస్తు ముఖ్య శిష్యులైన దాడియస్, బార్తోలోమేవ్ ప్రభావంతో క్రీస్తుశకం 301 వ సంవత్సరంలో అర్మేనియన్లు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. 301 మరియు 304 సంవత్సరాల మధ్యలో ఇంతకుముందు పాగన్ దేవాలయం ఉన్న Vagharshapat ప్రాంతంలో Etchmiadzin Cathedral అనే చర్చి నిర్మాణం గావించారు. ఇది ప్రపంచంలో నిర్మించిన తోలి క్రైస్తవ ప్రార్ధనా మందిరం. పర్షియన్ల పాలనా కాలంలో ఇది కొంత ధ్వంసం అయ్యింది. ఇప్పుడు మేము ఈ చర్చి చూడటానికే వెళుతున్నాం. మా హోటల్ నుండి ఈ ప్రాంతానికి 28 కిలోమీటర్లు దూరం ఉంది. హోటల్ నుండి యెరవాన్ నగరం మీదుగా గంట ప్రయాణించాక ఈ చర్చి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. సన్నగా చినుకులు పడుతున్నాయి. మమ్మల్ని గేట్ దగ్గర దింపేసి డ్రైవర్ పార్కింగ్ లోకి వెళ్ళిపోయాడు. హన్ష్ కార్ లోనే నిద్రపోవటంతో వాడిని ట్రాలీలో పడుకోబెట్టి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. ఆ చర్చి గోపురాలకు అన్నీ ఇనుప రాడ్లతో ఫెన్సింగ్ లాగా వేశారు. చర్చికి రిపేర్ పనులు జరుగుతున్నాయి. మేము ఆ ఆవరణ అంతా తిరిగి ఫోటోలు తీసుకుని చర్చి లోపలికి వెళ్ళాం. వేల ఏళ్ల క్రితం ఒక మతానికి సంభందించిన తోలి ప్రార్ధనా మందిరంలో ఉండటం గొప్ప అనుభూతి. అక్కడున్న చాలా మంది టూరిస్ట్ లలో అసలు ఇండియన్స్ ఎవరూ లేరు. అక్కడున్న కొంతమంది భార్గవి తో మాట్లాడి ఫోటో తీసుకున్నారు. మేము చర్చి లోపలికి వెళ్ళేటప్పటికి హన్ష్ కూడా నిద్ర లేచాడు. అక్కడున్న దాడియస్, బార్తోలోమేవ్ తైలవర్ణ చిత్రాలు అన్నీ చూసి బయటికి వచ్చాం.
అక్కడికి కొద్ది దూరంలోనే మరో చారిత్రక కట్టడం జీవర్నాట్స్ కాథెడ్రల్ ఉంది.క్రీస్తుశకం 7 వ శతాబ్దంలో అర్మేనియా లో ఎక్కువ భాగం బైజాంటైన్ ల పరిపాలనలో ఉండేది. సమయంలోనే మధ్య ప్రాచ్యంలో ఇస్లాం మతం కూడా ప్రభావం చూపుతోంది. 643 వ సంవత్సరంలో కొంతమంది కాథలిక్కుల సూచన మేరకు Etchmiadzin కేథడ్రల్ కి పెద్దగా వ్యవహరిస్తున్న గ్రెగరీ అప్పటి రాజైన ట్రిడేట్ 3 కి ఈ నిర్మాణం గురించి ప్రతిపాదించారు.అలా 643 లో ప్రారంభమైన ఈ నిర్మాణం 652 వ సంవత్సరంలో పూర్తయ్యింది.జీవర్నాట్స్ అంటే ఆకాశ దేవతలు అని అర్ధం. అర్మేనియా ఎయిర్పోర్ట్ పేరు కూడా జీవర్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పెట్టటానికి ఈ చారిత్రక కట్టడమే ఆధారం. చుట్టూ 32 స్తంభాలతో వృత్తాకారంగా ఉన్న ఈ కట్టడం మూడు అంతస్థులతో ఉండేదని చెపుతారు. ప్రస్తుతం మొండి స్తంభాలు, గోడలు మాత్రమే మిగిలాయి.10 వ శతాబ్దం నాటికే ఈ కాథెడ్రల్ ధ్వంసం అయ్యింది. ఇందుకు గల కారణాల్ని చరిత్రకారులెవ్వరు వివరించలేదు. మళ్ళీ 1901 నుండి 1907 వరకు ఇక్కడ తవ్వకాలు జరిగి , దీన్ని మళ్ళీ పునర్నిర్మించే ప్రతిపాదన జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తవ్వకాల్లో దొరికిన అవశేషాలు పక్కనే ఉన్న మ్యూజియంలో భద్రపరిచారు. సూర్య మానాన్ని సూచించే రాతి గడియారం మాత్రం ఈ ఆవరణలోనే బయట ఉంది. 2000 సంవత్సరంలో ఈ ప్రాంతం యునెస్కో వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందింది. దీనికి కూడా ప్రవేశ రుసుము 2 డాలర్లు.మేము ఈ కట్టడం చూస్తుండగానే ఒక ఆర్మేనియన్ యువతి వచ్చి మీరు ఇండియన్సా అని అడిగింది. అవునని చెప్పగానే తాను ఇండియన్ కాన్సులేట్ లో 5 సంవత్సరాలు పని చేశానని తనకు ఇండియన్ వంటలు అన్నీ బాగా వచ్చని చెప్పింది. హన్ష్ ని ఎత్తుకుని ముద్దాడుతూ మాతో కలిసి ఒక ఫోటో దిగింది. మేము ఈ రెండు చూసేటప్పటికి మధ్యాహ్నం 12.30 నిమిషాలు అయ్యింది.అక్కడినుండి బయలుదేరి భోజనానికి యెరవాన్ వైపు మా కారు బయలుదేరింది.లక్ష్మణ్ గారి సూచన తో టాక్సీ డ్రైవర్ మమ్మల్ని సిటీ మధ్యలో నేల మాళిగలో ఉన్న ఒక అత్యాధునిక రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. తనని కూడా మాతోనే భోజనం చెయ్యమని కోరటంతో తానూ మాతోనే భోజనం చేశాడు. 

ప్రపంచంలో రికార్దు చేయబడిన జాతి హత్యల ఘటనల్లో అర్మేనియా జెనోసైడ్ మొదటిది.భోజనం తర్వాత నేను జెనోసైడ్ మ్యూజియం చూడాలని లక్ష్మణ్ గారికి చెప్పటంతో ఆయన ఆ విషయాన్ని డ్రైవర్ కి చెప్పారు. 16 వ శతాబ్దం నుండి 19 వ శతాబ్దం వరకు అర్మేనియా పశ్చిమ భాగం టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.దీనిని టర్కిష్ అర్మేనియా అని పిలిచేవారు. ఆ సమయంలోనే రుస్సో - పర్షియా యుద్ధాలు జరగటం కొంతమంది ఆర్మేనియన్లు ఆ యుద్ధాల్లో రష్యన్లకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే నెపంతో 1895 నుండి 1920 వరకు పలుదఫాలుగా టర్కీ పాలకులు అక్కడ నివసించే వారిని మట్టుబెట్టటం ప్రారంభించారు. 1915-20 కాలంలో అత్యంత ఎక్కువగా 15 లక్షలమందిని వివిధ రకాల పద్ధతుల్లో చంపటం జరిగింది. ఆఖరున సిరియా ఎడారిలో లక్షల మందిని నడిపించి దారిలోనే వారిని చంపేశారు. ఈ అతి పెద్ద మానవ హననం ఆర్మేనియన్ జెనోసైడ్ గా పేరొందింది. దీనికి సంభందించిన మ్యూజియం యెరవాన్ నగరం మధ్యలో ఉంది. ఆ ఊచకోత తరువాత 1918 నుండి అర్మేనియా రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1990 వరకు సోవియట్ యూనియన్ లో సభ్య దేశంగా ఉంది. 1991 నాటికి సోవియెట్ రిపబ్లిక్ విచ్చిన్నమయ్యాక స్వతంత్ర దేశంగా అవతరించింది. 1985 లో ఈ ఆర్మేనియన్ జెనోసైడ్ ని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి ఒక రిపోర్ట్ పంపారు. కానీ టర్కీ మరియు దాని మిత్ర దేశమైన అజర్బైజాన్ జెనోసైడ్ అనే పదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాయి.1995 లో ఈ జెనోసైడ్ మ్యూజియం స్థాపించి, 1997 నుండి పలువురు విద్యార్థులు దీని మీద రీసెర్చ్ చేసి నివేదికలు సమర్పించగా 2017 నాటికి ప్రపంచంలో 29 దేశాలు ఆర్మేనియన్ జెనోసైడ్ ని అధికారికంగా గుర్తించాయి. ఇప్పటికీ మిగతా దేశాలన్నిటి గుర్తింపు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్మేనియన్లు పోరాడుతున్నారు. ఈ వివరాలన్నింటినీ సచిత్రంగా మ్యూజియంలో భద్రపరిచారు. భార్గవి కి ఇలాంటివి అంటే భయం, అందుకే తాను అలాంటివి చూడలేనని కార్లోనే ఉంటానని చెప్పింది. నేనొక్కడినే లోపలికి వెళ్లి అక్కడ ఉంచిన ఫోటోలు అన్నీ చూసి వచ్చాను.నేను ఇంతకుముందు పోలాండ్లో చూసిన యూదు కాన్సంట్రేషన్ కాంపుల్లో ఉన్న ఫొటోల్లాగే ఇక్కడ కూడా చంపబడిన వారి ఫోటోలు, మూకుమ్మడి హత్యల శవాలు, పుర్రెలు అన్నీ వీడియో మరియు ఫోటోల రూపంలో ఉన్నాయి. ప్రపంచంలో రికార్దు చేయబడిన జాతి హత్యల ఘటనల్లో అర్మేనియా జెనోసైడ్ మొదటిది.
అక్కడినుండి మా తదుపరి గమ్యం ఖోర్ విరాప్ అనే మరో క్రైస్తవ ఆశ్రమం. ఇది యెరవాన్ కి 40 కిలోమీటర్ల దూరంలో టర్కీ బోర్డర్ కి దగ్గరగా అరారత్ పర్వత భాగంలో ఉంది. యెరవాన్ నుండి అరారత్ వరకు 4 లేన్ల రహదారి ఉంది. ఆ రహదారిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా 35 కిలోమీటర్లు ప్రయాణించాక పోకర్ వేది అనే గ్రామం దగ్గర 7 కిలోమీటర్లు లోపలికి వెళితే ఎత్తైన కొండపైన ఖోర్ విరాప్ కనిపిస్తుంది. క్రీస్తు శకం7 వ శతాబ్దంలో క్రైస్తవ మతబోధకులంతా ఇక్కడ నుండి మతబోధనలు, ప్రార్ధనలు నిర్వహించేవారు. అప్పటి రాజు త్రిడేట్ 3 కూడా ఇక్కడ ముఖ్య మతబోధకుడైన గ్రెగరీ దగ్గర బాప్టిజం తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది చాలా ఎత్తైన కొండమీద ఉండటంతో పైకి వెళ్ళటానికి మెట్లతో పాటు రోడ్ కూడా ఉంది. మేము హన్ష్ ని ట్రాలీ లో తీసుకుని రోడ్ మీదుగా పైకి వెళ్ళాం. అక్కడినుండి చూస్తే అరారత్ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్న అద్భుత దృశ్యం కనులవిందు చేసింది. ఈ ఖోర్ విరాప్ చుట్టూ అన్నీ పంట పొలాలు, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. కొంత దూరంలో ఫెన్సింగ్ వేసి ఉన్న టర్కీ సరిహద్దు కనిపించింది. అర్మేనియా కి టర్కీ కి సత్సభందాలు లేకపోవటం వల్ల ఈ కంచే అని అర్ధం అయ్యింది. 643 వ సంవత్సరంలో ఈ చర్చి నిర్మాణం ప్రారంభించి ఒక్క చాపెల్ మాత్రమే నిర్మించారు. అందులోనే ప్రార్ధనలు జరిగేవి. తరువాత 1662 లో ఇప్పుడు ఉన్న పెద్ద చర్చి నిర్మించారు. మేము మొదటగా నిర్మించిన చాపెల్ లోకి వెళ్ళాం. అది చాలా చిన్నది, అందులోనే భూమిలోపల ఒక మాళిగ ఉంది. తరువాత బయటకి వచ్చి పక్కనున్న పెద్ద చర్చి లోకి వెళ్ళాం. మేము ఫొటోస్ తీసుకోవటానికి ఇబ్బంది పడటం చూసి అక్కడున్న ఒక ఆర్మేనియన్ మా చేతుల్లో ఉన్న హన్ష్ ని తీసుకుని మీరు తీసుకోండి అని మాకు సైగల ద్వారా చెప్పాడు. అతనికి థాంక్స్ చెప్పి అన్నీ ఫోటోలు తీసుకుని బయటికి వచ్చాం.
ఏదైనా షాపింగ్ చెయ్యాలని డ్రైవర్ కి చెప్పటంతో మళ్ళీ యెరవాన్ వచ్చాక దల్మా మాల్ అనే షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళాడు. అన్నట్లు చెప్పటం మర్చిపోయా అర్మేనియా లో దొరికే వైన్ మరియు బ్రాందీ చాలా ఫేమస్ మరియు చవక. ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఇవి దొరుకుతాయి. అరారత్ వైన్ అనేది ఇక్కడ మంచి బ్రాండ్. నగరం మధ్యలోనే అతి పెద్ద వైన్ ఫ్యాక్టరీ తో పాటు విస్కీ , బ్రాందీ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ లంచ్ మరియు డిన్నర్ లలో వైన్ అనేది సర్వ సాధారణం. కావాలంటే మనం వైన్ తయారు చేసే ఫ్యాక్టరీ ని కూడా చూడచ్చు. మేము ఇదే విషయం లక్ష్మణ్ గారికి చెప్పటంతో ఆయన వెంటనే డ్రైవర్ తో మాట్లాడి మరుసటి రోజు ఉదయం ఆ ఫ్యాక్టరీ ని సందర్శించే ఏర్పాట్లు చేశారు. ఇక ఆ రోజుకి మాల్ లో కొన్ని వస్తువులు కొనుక్కుని హోటల్ కి వెళ్ళిపోయాం.
మరుసటి రోజు ఉదయం టాక్సీ డ్రైవర్ మమ్మల్ని నేరుగా బ్రాందీ ఫ్యాక్టరీ దగ్గరకి తీసుకువెళ్ళాడు. యెరవాన్ అరారత్ బ్రాందీ ఫ్యాక్టరీ అనేది అర్మేనియాలో అతి పెద్ద వైన్ తయారీ దారు. ఇది నగరం నడిమధ్యలో అతి పెద్ద ప్రహరీ గోడతో ఉంటుంది. ఇది తయారు చేసే బ్రాండ్ పేరు నోయ్. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకి ఫ్యాక్టరీ లో ఇంగ్లీష్ గైడెడ్ టూర్ ఉంటుంది. కాకపోతే ముందు రోజు అప్పాయింట్మెంట్ తీసుకోవాలి. అంతకుముందే మా డ్రైవర్ ఫ్యాక్టరీకి కాల్ చేసి ఉదయం 10 గంటలకి అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు.మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఒక రష్యన్ మహిళ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. మాతో పాటు ఒక పోలాండ్ మహిళ , మరియు మా గ్రూప్ లో ఇద్దరు వచ్చారు.కేవలం ఫ్యాక్టరీ చూడాలంటే 3500 డ్రాములు చెల్లించాలి. ఫ్యాక్టరీ చూడటంతో పాటు వైన్ కూడా రుచి చూడాలంటే మరో 1500 డ్రాములు అదనం. ఆ వైన్ 70 సంవత్సరాల వయసుది అట. మాములుగా బయట కొనాలంటే ఒక్క బాటిల్ ఖరీదు ౩౦౦౦ డాలర్లు. మేము మా ఇద్దరికీ 7000 డ్రాములు చెల్లించి కేవలం చూడటానికి మాత్రమే టికెట్ తీసుకున్నాము. మాతో పాటు ఉన్న పోలిష్ మహిళ మాత్రం 5000 చెల్లించి వైన్ రుచి చూసింది. మేము ఫాక్టరీ ఆవరణలోకి వెళ్ళగానే ఎదురుగా పెద్ద ఫిరంగి మరియు ఒక పాత కారు కనిపించాయి. రష్యన్ గైడ్ వాటి గురించి చెపుతూ 1877 లో నేర్సేస్ తైరాన్ అనే వ్యాపారి ఈ ఫ్యాక్టరీని స్థాపించాడు.మొదటి పది సంవత్సరాలు కేవలం వైన్ మాత్రమే తయారు చేసేవారు. 1887 నుండి బ్రాందీ తయారు చెయ్యటం మొదలు పెట్టాడు. 1899 లో నికోలావ్ అనే ఒక ఉక్రేనియన్ కి లీజుకి ఇచ్చాడు. నికోలావ్ అప్పటికే రష్యా లో అతి పెద్ద వైన్ తయారిదారు. తరువాతి కాలంలో నికోలావ్ 50000 రూబుల్స్ కి ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని కొనుకున్నాడు. 1901 లో కొన్ని వైన్ సాంపిల్స్ ని పారిస్ లో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్ కి పంపాడు. అక్కడున్న వారంతా అది రుచి చూసి తయారీ దారు గురించి ఆరా తీయగా అది అర్మేనియా నుండి వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారట. అప్పటి నుండి నుండి నికోలావ్ యూరప్ దేశాలకి ఎగుమతి చెయ్యటం ప్రారంభించాడు. తన జీవితం మొత్తం వైన్ మరియు బ్రాందీ తయారీల మీదే గడిపాడట. రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ఈ వైన్ ని రుచి చూసినవాడే. ఒకసారి ఇంగ్లాండ్ అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్ కి ఓ సమావేశంలో ఒక గ్లాస్ బ్రాందీ ఇవ్వగా రుచిలో తేడాని గమనించి ఇది ఇంతకుముందు రుచిలా లేదు అనటంతో స్టాలిన్ వెంటనే ఆరా తీయగా ఫాక్టరీ కి సంభందించిన ముఖ్య సాంకేతిక నిపుణుడు ఖైదు చేయబడ్డాడని, అందువల్లనే వేరే వాళ్ళు ఆ మిశ్రమాన్ని కలపటం వల్ల రుచిలో మార్పు వచ్చిందని తెలుసుకున్నాడు. వెంటనే అతన్ని విడుదల చేయమని చెప్పి మళ్ళి ఫ్యాక్టరీలో ఉద్యోగిగా నియమించాడట. కొన్ని సంవత్సరాలకి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ఫాక్టరీ అనేక కారణాలతో మూతబడింది.దాదాపు 50 సంవత్సరాల పాటు ఇది తెరుచుకోలేదు. మళ్ళీ 2002 లో 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మల్టీ గ్రూప్ ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించింది. ఆ పునరుద్ధరణలో ఫ్యాక్టరీని కోసం తవ్వుతుండగా దొరికినదే ఈ ఫిరంగి అని చెప్పింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పడిన కొన్ని బాంబులు , ఆయుధాలు కూడా ఇక్కడ దొరికాయట. అక్కడున్న కార్ కూడా ఫ్యాక్టరీ మూతబడినప్పుడు వదిలేసినదే. లోపలికి వెళ్ళగానే ఈ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు వాడిన వస్తువులు, కుర్చీలు , అన్నీ ఒక గదిలో ప్రదర్శనకి ఉంచారు. అప్పట్లో వాళ్ళు వాడిన టెలిఫోన్ , మంచం ఇంకా చాలా వస్తువులు అక్కడ ఉన్నాయి. అక్కడినుండి వైన్ నిల్వ ఉంచే స్టోర్ కి తీసుకు వెళ్ళింది. పాత సినిమాల్లో చూపించినట్లు అన్నీ చెక్క పీపాలలో వైన్ నిల్వ చేసి ఉంది. అది చాలా పెద్ద స్టోర్. అక్కడినుండే నేరుగా పైప్ లో బాట్లింగ్ కి వెళుతుంది. ఈ ఫ్యాక్టరీ బయటే ఒక స్టోర్ ఉంది. బయట కంటే ఇక్కడ కొంచెం తక్కువ ధరలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 50 ఇయర్స్ వైన్ కూడా తయారవుతోంది.నోయ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన బ్రాందీ బ్రాండ్.
ఇదే రోజున మా తిరుగు ప్రయాణం. సాయంత్రం 4గంటలకి ఫ్లైట్ కావటంతో మేము 2 గంటకల్లా ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. అప్పటికే భోజన సమయం కావటంతో దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసి ఎయిర్పోర్ట్ కి పయనమయ్యాం. మాకంటే ముందుగా రెండేళ్ళ క్రితం మా గ్రామానికి చెందిన Gorrepati Narasimha Prasad గారుఈ దేశాన్ని సందర్శించటం వల్ల ఆయన ఇచ్చిన సలహాలు కూడా మా పర్యటనకి ఎంతో దోహదం చేశాయి. డాక్టర్ లక్ష్మణ్ కుమార్ గారి పరిచయం కూడా ఆయన వల్ల జరిగినదే.
అర్మేనియా లో నివాస ఖర్చు చాలా తక్కువ. ఒక కుటుంబానికి నెలకి అయ్యే ఖర్చు కేవలం 300 డాలర్లు.టూరిజం మీద ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఎక్కడా కూడా వ్యాపార ధోరణి కనపడదు. హోటల్స్, భోజనం మరియు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా మన దేశంలో కంటే చాలా తక్కువ.
ప్రపంచంలో ఎక్కువకాలం నుండి మనుషులు నివసిస్తున్న నగరాల్లో యెరవాన్ ఒకటి. ఇంతటి పురాతన నగరాన్ని , దేశాన్ని సందర్శించటం మాత్రం మరువలేని అనుభూతి. ఆ నాలుగు రోజుల అనుభవాలని ఆనందాన్ని మూటగట్టుకుని మళ్ళీ దుబాయ్ ఉరుకుల పరుగుల జీవితంలోకి వచ్చేశాం.