పారిస్
అనగానే ముందు గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. అక్కడికి వెళ్లేముందు ఈఫిల్
టవర్ చూడబోతున్నామనే ఉత్సుకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని గత వారం పారిస్
వెళ్తున్నా అనుకోగానే నేను ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యింది మాత్రం ఈఫిల్ టవర్
కోసం కాదు. అక్కడ ఉన్న గుయ్ మెట్ అనే మ్యూజియం చూడాలి అని. దీని వెనుక కధ
తెలియాలంటే 90 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1923 లో గ్రామ రైతు కోట దిబ్బల
దగ్గర పొలం దున్నుతుండగా పాలరాతి శిల్పాలు బయట పడ్డాయి. అప్పట్లో ప్రజలకు
అవగాహన లేక దొరికిన ఇలాంటి శిల్పాలన్ని అక్కడక్కడా గుట్టలుగా వేసి
పెట్టేవాళ్ళు. కొంతమంది వాటిని బట్టలు ఉతుక్కునే బండలుగా వాడేవారు. 1927 లో
పారిస్ నుంచి వచ్చిన డూబ్రి యెల్ అనే చరిత్ర పరిశోధన కారుడు ఆ శిల్పాలన్ని
సేకరించి పారిస్ లో గుయ్ మెట్ మ్యూజియంకి తరలించాడు. ఈ మ్యూజియంలో పలు
ఆసియా దేశాలలో దొరికిన వేల ఏళ్ల నాటి శిల్పాలు,వంట పాత్రలు, అలనాటి
వస్త్రాలు, చైనా , కంబోడియా దేశాల్లో దొరికిన ఎన్నో అపురూప శిల్పాలు
భద్రపరిచారు. నేను ఈ వెబ్సైట్ రూపకల్పన లో చేసిన పరిశోధనలో మూడేళ్ళ క్రితం ఈ
విషయం గురించి విన్నాను. ఘంటసాల చరిత్ర పుస్తకంలో 1966 లో నార్ల
వెంకటేశ్వరరావు గారు రాసిన ముందుమాటలో ఈ విషయాన్ని ఉటంకించారు.
కేవలం
ఈ శిల్పాలు చూడటానికే ఆయన పారిస్ వెళ్ళినట్లుగా చెప్పారు. ఆ తరువాత ఎవరూ ఈ
విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరూ వెళ్లి చూడలేదు కూడా. నేను కూడా పారిస్
వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమాచారం రాసేటప్పుడు కూడా అదొక విషయం లాగే
అనుకున్నాను తప్ప ఎప్పుడూ వెళ్లి చూస్తా అనుకోలేదు. నేనుండే
పోలాండ్ దేశం యూరప్ యూనియన్ లో భాగం కావటంతో ఆ ఖండంలో ఉన్న 24 దేశాలకి
ఎటువంటి వీసా అవసరం లేకుండానే వెళ్ళవచ్చు. ఈ దేశాలని షెన్ జెన్ దేశాలు
అంటారు. ఏ ఒక్క దేశానికి సంభందించిన వీసా ఉన్నా మిగతా అన్ని దేశాలకి
వెళ్ళవచ్చు. దాదాపు
సంవత్సరం నుంచి వెళ్దామని అనుకుంటూనే ఉన్నా,పెళ్ళయ్యాక శ్రీమతితో వెళ్తే ఆ
హనీమూన్ కూడా అయినట్లు ఉంటుందని నేను ఏప్రిల్ 30 వ తేదిన పారిస్
చేరుకున్నాను. ఆ రోజు నాకున్న వ్యక్తిగత పనులని చక్కబెట్టుకుని, మరుసటి
రోజు ఈఫిల్ టవర్ మరియు ఇతర ప్రదేశాలని చూడాలని ప్లాన్ చేసుకున్నాం. పారిస్
నగరం భూమి పైన ఎంత ఉందో అంత కు అంత భూగర్భం లో ఉంది. ఎక్కడినుంచి
ఎక్కడికైనా భూగర్భంలో ఉన్న మెట్రో రైలులో కొద్ది నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
పారిస్ అంతా రాజప్రాసాదాలు, మ్యూజియంలు, సీల్ నదిపై ఎక్కడికక్కడ
నిర్మించిన బ్రిడ్జిల మయం. ప్రతి మెట్రో స్టేషన్లో సిటీ మాప్ తో పాటు
చూడాల్సిన ప్రదేశాల వివరాలు,వాటిని చేరుకోవటానికి అవసరమైన మెట్రో
రైలు, బస్సు, టూరిస్ట్ గైడ్ ల వివరాలు ఉంటాయి. పారిస్
లాండ్ మార్క్ అయిన Arc de Triompe కి కొద్ది దూరం లోనే ఈ మ్యూజియం ఉంది.
మెట్రో స్టేషన్ పేరు లేనా. ఈ స్టేషన్లో దిగితే కింద నుంచి పైకి రాగానే
కన్పించే మొదటి బిల్డింగ్ ఇదే. దీనికి ఎదురుగా రాయల్ ప్యాలస్ ఉంటుంది. ఎంతో
ఉత్సాహంగా మే 1 న హోటల్ నుంచి బయలుదేరి పది గంటలకల్లా మ్యూజియంకి
చేరుకున్నాం. కాని ఆ రోజు మేడే అనే సంగతి అక్కడికెళ్ళాక గుర్తు వచ్చింది.
ఆరోజు సెలవు దినం కావటంతో లోపలికి అనుమతి లేదు. నా షెడ్యుల్ ప్రకారం ఆరోజు
రాత్రికే పారిస్ నుండి బయలుదేరాలి. కాని అంతదూరం వెళ్లి మన ఊరు శిల్పాలని
చూడకుండా రావటానికి మనసొప్పలేదు. ఇక ఆరోజుకి మిగతా ప్రదేశాలు చూసి మరుసటి
రోజుకి కూడా షెడ్యూల్ మార్చుకున్నాను. మే 2 న పొద్దునే పదిగంటల కల్లా లేనా
స్టేషన్ చేరుకున్నాం. మ్యూజియమ్ ప్రవేశ రుసుము 8 యూరోలు . టికెట్ తీసుకుని ముందుకు వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇండియా, కంబోడియా దేశాల శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక
ఫ్లోర్ లో రెండు దేశాల చొప్పున మొత్తం నాలుగు అంతస్తుల్లో వివిధ ఆసియా
దేశాలలో వర్ధిల్లిన బౌద్ధం, హిందూ మతాల అవశేషాలు, వేల ఏళ్ల నాటి నాగరికత కి
గుర్తులైన రాతి పాత్రలు, పలు దేవతల విగ్రహాలు, శిధిల శిల్పాలు ప్రజల
సందర్శనార్ధం ఉంచారు. గుయ్ మెట్ అనేది ఒక ప్రత్యేకమైన మ్యూజియం, కేవలం ఆసియాకి సంభందించిన అవశేషాలని మాత్రమే అక్కడ చూడవచ్చు.
ప్రతి
శిల్పం దగ్గరా అది దొరికిన ప్రదేశం, సేకరించిన వ్యక్తి వివరాలు ఉన్నాయి.
ఆత్రుతగా ఘంటసాల అనే పేరు కోసం వెతికాను. అమరావతి పేరు ముందు కనిపించింది.
నాకంటే ముందే నా శ్రీమతి ఘంటసాల పేరు ఉన్న రెండు శిల్పాలని గుర్తించింది.
అవి చూడగానే నా సంతోషం అలవి కానిది. సేకరించిన వ్యక్తి పేరు, సంవత్సరం
యధాతధంగా ఉన్నాయి.హెడ్ ఫోన్స్ సాయంతో ఆ శిల్ప వృత్తాంతాన్ని వినవచ్చు. ఆ
రెండు శిల్పాల్ని ఫోటో తీసుకుని మిగతా శిల్పాలు చూస్తుండగా అవన్నీ అమరావతి,
భట్టిప్రోలు, నాగార్జున కొండ ప్రాంతాల్లో దొరికినవే. కొద్దిగా ముందుకి
వెళితే మధ్య ప్రదేశ్, తమిళనాడు,కేరళ ప్రాంతపు అవశేషాలు కనిపిస్తాయి.
కొద్దిగా పక్కకి తిరిగితే మన గ్రామం పేరుతో మరో శిల్పం కనిపించింది. మొత్తం
మూడు శిల్పాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. చాలా సేపు అక్కడే గడిపి అన్నీ
ఫోటోలు వీడియో తీసుకువచ్చాను. ఒకరకంగా ఆ శిల్పాలు అక్కడ ఉండటమే కరెక్ట్
అనిపించింది. దేశ విదేశాలనుంచి వచ్చే లక్షల మంది యాత్రికులు ఆ మ్యూజియాన్ని
సందర్శిస్తారు. వారంతా మన గ్రామాన్ని గురించి తెలుసుకుంటారు కదా అని ఒకింత
గర్వంగా కూడా అనిపించింది. శంఖంలో పోస్తేనే ఏదైనా తీర్ధం అవుతుంది. మన
గ్రామానికి సంభందించిన మరిన్ని శిల్పాలు మద్రాస్ మ్యూజియం లో కూడా ఉన్నాయి.
ఎక్కడి ఘంటసాల, ఎక్కడి పారిస్ ? 90 ఏళ్ల క్రితం తరలించిన మన ఊరి శిల్పాలని
చూడగలగటం నిజంగా అదృష్టమనే అనుకోవాలి. అవి చూసి బయటకి వచ్చాక గుండెలనిండా
నింపుకున్న సంతోషం, ఉప్పొంగిన హృదయంతో పారిస్ నుంచి తిరుగు ప్రయాణం
అయ్యాను.
See the video in below Link
http://www.youtube.com/watch?v=4mZvybBfTgE
See the video in below Link
http://www.youtube.com/watch?v=4mZvybBfTgE
www.managhantasala.net