Saturday, June 29, 2013

నా ఐరోపా యాత్ర - 3 (పోలాండ్)




నా ఐరోపా యాత్ర - 3 (పోలాండ్)

నేను ఒక్కడినే కావటంతో అదే సంస్థ లో పనిచేస్తున్న శశి అనే ఒక తమిళియన్ ఫ్లాట్ లో నాకు వసతి ఏర్పాటు చేసారు. టాక్సీ డ్రైవర్ సామాను తీసుకుని 4 వ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ కి తీసికెళ్ళాడు. ఇక్కడ అయిదు ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్ల కి కూడా లిఫ్ట్ లేదు. మెట్ల ద్వారానే బ్యాగ్ మోసుకుంటూ పైకి వెళ్లాను. ఈ శశి అనే వ్యక్తి కూడా ముద్రణా రంగంలో పట్టబద్రుడు. పరస్పర మిత్రుల ద్వారా అంతకుముందే ఫోన్ లో పరిచయం చేసుకోవటంతో మేము ఒకరికొకరం తెలుసు. ఆతను నాకంటే 6 నెలలు ముందు నుండే అక్కడ ఉంటున్నాడు. మేము కాకుండా మరో పదిమంది వరకు భారతీయులు అక్కడ అదే సంస్థలో పని చేస్తున్నారు. తెలుగువాడిని మాత్రం నేనొక్కడినే.

మేము నివసించిన అపార్ట్మెంట్స్ 
మింజు జెర్జ్ అనేది 20000 జనాభా గల ఒక చిన్న పట్టణం. మింజు జేర్జ్ అంటే పోలిష్ భాషలో రెండు నదుల మధ్య ఉండే ప్రాంతం అని అర్ధం. ఓబ్రా మరియు పాక్లిసా అనే రెండు నదులు పట్టణానికి ఇరువైపులా ప్రవహిస్తుంటాయి. ఇది పోలాండ్ కి పశ్చిమ భాగాన ఉంది. ఇక్కడినుండి జర్మనీ రాజధాని బెర్లిన్ 150 కిలోమీటర్లు మాత్రమే. 80 కిలోమీటర్ల లోనే జర్మనీ బోర్డర్ ఉంటుంది. పోలాండ్ రాజధాని వార్సా కి మాత్రం 500 కిలోమీటర్లు దూరం. అందుకే ఇక్కడి ప్రజలు బెర్లిన్ ఎయిర్ పోర్ట్ నే ఎక్కువ వినియోగిస్తుంటారు. నేను ఫ్లాట్ కి చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది. అప్పటికి ఇంకా సూర్యాస్తమయం కాలేదు. ముందుగా చెప్పుకునట్లు వేసవి కాలంలో రాత్రి 10 గంటల వరకు సూర్యుడు ఉంటాడు. అదే చలికాలంలో అయితే మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. నేను వెళ్ళింది శుక్రవారం కావటంతో మరుసటి రెండు రోజులు సెలవు దినాలు. నేను వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ఇండియన్ మిత్రులు అందరూ ఆ రెండు రోజుల్లో కలిశారు. చిన్న చిన్న పోలిష్ పదాలు కొన్ని నేర్చుకున్నాను. (హాయ్ చెప్పాలంటే చేష్, థాంక్యూ అంటే జిన్కుయా, గుడ్ మార్నింగ్ అంటే జిందాబ్రే, ) పోలిష్ భాష చాలా కష్టమైనది. ఆ  పదాలని పలకటం చాలా కష్టం. కొంచెం ఓపిక, శ్రమ పడితే తప్పకుండా నేర్చుకోవచ్చు. మింజు జెర్జ్ అన్నీ సౌకర్యాలు గల మినీ పట్టణం. స్థానిక సంస్థలు ఎంత సమర్ధవంతంగా పని చేస్తాయో ఇక్కడి పాలక వ్యవస్థ చూశాక అర్ధం అయ్యింది. మనం ఉండే నివాస ప్రాంతం వివరాలు వారంలోపుగా ఆయా మున్సిపాలిటీ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఊరుకి ఒక టౌన్ హాల్, మరియు స్క్వేర్ (కూడలి) తప్పనిసరిగా ఉంటాయి. అభివృద్ధి అంతా స్థానిక మేయర్లు ,ప్రజా ప్రతినిధుల చొరవతోనే జరుగుతుంది. పట్టణ మేయర్ ఒక సామాన్య వ్యక్తిలాగే నివసిస్తుంటాడు. ఎటువంటి హంగులు,ఆర్భాటాలు ఉండవు.

మింజు జెర్జ్ టౌన్ హాల్
ఇక్కడి ఆహరం బ్రెడ్ మరియు మాంసం. చికెన్ మరియు పోర్క్ ఎక్కువగా తింటారు. బర్గర్, పిజ్జా లు కూడా ఎక్కువే. మన వాళ్ళు ఇతరదేశాలకి వెళ్ళినపుడు ఆ రేట్లు అన్నీమన రూపాయల్లోకి లెక్కవేసుకుని చూసుకోవటం చాలామందికి అలవాటు. పోలాండ్ కరెన్సీ పేరు PLN . పోలిష్ భాషలో జిలోటి అంటారు. ఒక జిలోటి కి మన డబ్బులు 17 రూపాయలు వస్తాయి. యూరప్ దేశాలన్నీ ఒక్కటి అయినా, కరెన్సీ విషయంలో మాత్రం ఇంకా ఒక్కటి కాలేదు. యూరో చలామణీ లో ఉన్న దేశాల ఆర్ధిక వ్యవస్థలని చూశాక మిగతా దేశాల ప్రజలు యూరో విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. పోలాండ్ ప్రభుత్వం కూడా 2014 నాటికల్లా యూరోని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నా, ప్రజల నుండి ప్రతికూలత ఎదురవుతోంది. ఒకరకంగా ఐరోపా సమితి బలవంతంగా యూరోని అన్ని దేశాలమీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఏకీకృత నగదు విధానం మంచిదే అయినా,దానిని ప్రవేశ పెట్టటంలో మాత్రం పాటించిన విధానాలు, కొన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలని పతనం చేశాయి. దానికి పెద్ద ఉదాహరణ గ్రీసు దేశం. యూరోని వాళ్ళ స్థానిక కరెన్సీకి సమాన విలువతో ప్రవేశ పెట్టటంలో విఫలం అవ్వటం వల్ల అక్కడి ప్రజల సంపద సగానికి సగం తరిగిపోయింది. వస్తువుల ధరలు, ఆహార పదార్ధాల ధరలు యూరోకి మారాక, ఇంతకుముందు కరెన్సీ ధరతో పోల్చుకుంటే రెట్టింపు అయ్యాయి. నేను చూసిన యూరప్ దేశాల్లో అత్యంత చవకైన దేశం పోలాండ్ మాత్రమే. అన్ని వస్తువుల ధరలు, ఆహార పదార్ధాల ధరలు మన రూపాయల్లో పోల్చి చూసుకుంటే దాదాపు ఒక్కటే. ఇక్కడి సూపర్ మార్కెట్లలో బియ్యం దొరుకుతాయి. కూరగాయలు మాత్రం పరిమితం. బంగాళా దుంపలు, టమోటాలు మనకంటే చవుక. ఏదైనా మన మసాలాలు, కూరగాయలు కావాలంటే వార్సాలో ఉన్న లిటిల్ ఇండియా అనే స్టోర్ నుండి తెచ్చుకోవాలి. మరో విశేషం ఏమిటంటే ఈ స్టోర్ నడుపుతోంది గన్నవరానికి చెందిన తెలుగువాడు కాట్రగడ్డ చందు. ఉన్నత విద్య కోసం 2007 లో పోలాండ్ వచ్చిన చందు ఇక్కడి స్థానిక యువతిని వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. ఏదైనా కూరగాయలు, ఇండియన్ మసాలా లు కావాలంటే ఫోన్ చేసి చెప్తే చాలు మరుసటి రోజుకల్లా కొరియర్ లో వచ్చేస్తాయి. మన వాళ్ళంతా వేరే దేశాలకి వెళ్ళినపుడు కూడా మన ఆహరం కోసం వెతుకుతుంటారు. స్విట్జెర్లాండ్ వెళ్లి కూడా ఇడ్లీ,దోశ కోసం వెతకటంలో అర్ధం లేదనేది నా అభిప్రాయం. ఏ దేశపు ఆహారపు అలవాట్లైనా అక్కడి స్థానిక వాతావరణ పరిస్థితులు, అక్కడ నివసించే వాళ్ళ శరీరానికి అనుకూలంగా ఉండేటట్లు ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రాంతానికి వెళ్ళినపుడు అక్కడి ఆహరం తీసుకుంటేనే మన శరీరం ఆ వాతావరణానికి తగినట్లుగా అలవాటు అవుతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ దొరికే ఆహారాన్ని తినటానికే ఆసక్తి చూపిస్తుంటాను.
Continued...



Monday, June 24, 2013

నా ఐరోపా యాత్ర - 2


ఖతర్ నుండి వేరే విమానంలో ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళాలి. ఆ ఫ్లైట్ కి ఇంకా మూడుగంటల సమయం ఉంది. ఖతర్ విమానాశ్రయం చాలా పెద్దది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకి ఇక్కడినుండి విమానాలు ఉన్నాయి. ఆసియా దేశాలనుండి అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకి  వెళ్ళే ప్రయాణీకులకి ఇది జంక్షన్. ఇక్కడే ఎక్కువ మంది ఫ్లైట్ మారాల్సి ఉంటుంది. ఖతర్ కరెన్సీ పేరు రియాల్. ఒక్క రియాల్ కి మన డబ్బుల్లో 16 రూపాయలు వస్తాయి. మనం మారే ఫ్లైట్ కి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉంటె ఎయిర్ పోర్ట్ లోనే వీసా తీసుకుని బయటకి వెళ్లి చూసి రావచ్చు. గల్ఫ్ దేశాల్లో ఫోన్ చార్జీలు చాలా ఎక్కువ. 30 రియాల్స్ తో ఒక ఫోన్ కార్డ్ తీసుకుంటే పబ్లిక్ ఫోన్ నుండి 16 నిమిషాలు ఇండియాకి మాట్లాడవచ్చు. అమెరికా డాలర్ కి పోటీగా యూరో ని ప్రవేశపెట్టాక, అన్ని చోట్ల యూరో కూడా కామన్ కరెన్సీగా వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు కరెన్సీ లు చెల్లుబాటు అవుతాయి. దారి ఖర్చులకోసమని యూరోలు హైదరాబాదులోనే మార్చుకుని ఉండటంతో 8 యూరోలు చెల్లించి ఒక కాలింగ్ కార్డ్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి క్షేమంగా ఖతర్ వరకు చేరుకున్నట్లు చెప్పి,కాఫెటేరియా లో కాఫీ తాగాక, మూడుగంటల నిరీక్షణ తరువాత ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళే విమానం ఎక్కాను. ఖతర్ నుండి ఫ్రాంక్ ఫర్ట్ 6 గంటల ప్రయాణం. హైదరాబాదు నుండి వచ్చిన విమానం కంటే ఇది చాలా పెద్దది. ముదురు ఎరుపు రంగు ఏకరూప దుస్తులు, అదే రంగు టోపీ ధరించిన అమ్మాయిలు చక చకా తిరుగుతూ ఎవరికి ఏమి కావాలో ఆర్డర్ తీసుకుంటున్నారు.
ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన లంచ్ మెనూ చూసి నాన్ వెజ్ ఆర్డర్ చేసాను. కాసేపటికి ఫ్లైట్ అంతా సాల్మన్ చేప మరియు చికెన్ వాసనతో నిండిపోయింది. 4 గంటల తర్వాత వాతావరణంలో మార్పు మొదలైంది. ఎండలతో భగ భగ లాడే మధ్య ప్రాచ్యం నుండి శీతల దేశాలైన ఐరోపా ఖండానికి దగ్గరలో విమానం ప్రయాణిస్తోంది. జర్మనీ లో ఉన్న ఒకానొక పెద్దనగరం ఫ్రాంక్ ఫర్ట్. నేను ఫ్రాంక్ ఫర్ట్ లో విమానం దిగి  అక్కడినుండి పోలాండ్ దేశీయ విమాన సంస్థ అయిన లాట్ పోలిష్ ఎయిర్వేస్ విమానంలో పోలాండ్ లో ఉన్న పోజ్ నాన్ అనే పట్టణానికి చేరుకోవాలి.కొంత సేపటికి విమానం ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో లాండ్ అయ్యింది.ఇమ్మిగ్రేషన్ మరియు వీసా పరిశీలన పూర్తి చేసుకుని, ఫ్రాంక్ ఫర్ట్ లోఎక్కువ నిరీక్షించే సమయం లేకపోవటంతో నేరుగా దేశీయ విమానాలు ఎక్కే టెర్మినల్ కి చేరుకొని అక్కడున్న కౌంటర్ లో బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం ఎక్కాను. ఈ విమానం ఎంత చిన్నదంటే మన వోల్వో బస్సు లానే ఉంది. అంతా కలిపినా 50 మంది కూడా లేరు ఫ్లైట్ లో. చాలా పాత విమానం కావటంతో ఇంజిన్ మోత కర్ణ కఠోరంగా అనిపించింది.అక్కడినుండి పోజ్ నాన్ గంట ప్రయాణం .పోలాండ్ రాజధాని వార్సా. పోజ్నాన్ అనేది వార్సాకి 500 కిమీ దూరంలో ఉన్న చిన్న పట్టణం. అచ్చం మన విజయవాడ అంత ఉంటుందేమో. పోజ్నాన్ ఎయిర్ పోర్ట్ మరీ చిన్నదేమీ కాదు. అక్కడినుండి ఐరోపాలోని అన్ని దేశాలకి విమానాలు ఉన్నాయి. చౌక విమానాలన్నీ ఇలాంటి ఎయిర్ పోర్ట్ ల ద్వారానే రాకపోకలు సాగిస్తాయి. తరువాత కాలంలో ఈ ఎయిర్ పోర్ట్ నుండే పలు దేశాలకి ప్రయాణించాను.
పోజ్ నాన్ విమానాశ్రయం
అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకి పోజ్నాన్ విమానాశ్రయంలో విమానం లాండ్ అయ్యింది. మనకంటే పోలాండ్ కాలమానం మూడున్నర గంటలు వెనుక. అంటే మన దేశంలో సమయం అప్పుడు రాత్రి 9 30 నిమిషాలు. నా ఇమ్మిగ్రేషన్ చెక్ ఫ్రాంక్ ఫర్ట్ లోనే అయిపొవటంతో ఇక్కడ ఎటువంటి చెకింగ్ లేకుండా నేరుగా బయటకి వచ్చేశాను. యూరప్ లో ఉన్న 24 దేశాల్లో ఏ దేశంలో అయితే ముందుగా అడుగు పెడతామో అక్కడే మన పాస్ పోర్ట్ చెకింగ్ అయిపోతుంది.24 దేశాల్లో ఎక్కడా చెకింగ్ ఉండదు.(దీని గురించి తరువాత భాగాలలో వివరిస్తాను) బయటకి రాగానే నాకోసం వచ్చిన టాక్సీ డ్రైవర్ నా పేరుతో ఉన్న బోర్డ్ పట్టుకుని ఉన్నాడు.నేను వెళ్ళాల్సింది అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మింజు జెర్జ్ అనే చిన్న పట్టణం. నేను వెళ్ళింది మే నెలలో అయినా ఇంకా అక్కడ చలి తగ్గలేదు. ఆ రోజు ఉష్ణోగ్రత 5 డిగ్రీలు ఉంది.కార్లో హీటర్ ఉండటంతో పెద్దగా చలి తెలియలేదు. రోడ్లన్నీ ఎంత అందంగా ఉన్నాయంటే,అద్దం లా వాడుకుని తలదువ్వుకోవచ్చు అనిపించింది. ఎటు చూసినా పచ్చటి నేల. పోలాండ్ లో ఉన్న ప్రకృతి రమణీయత మాత్రం నేను పర్యటించిన మిగతా దేశాల్లో ఎక్కడా చూడలేదు.వీళ్ళకి వ్యవసాయం అనేది కేవలం మే నుండి సెప్టెంబర్ లోపు మాత్రమే. మిగతా నెలలన్నీ మంచుతోనే కప్పబడి ఉండి వ్యవసాయం అనుకూలంగా ఉండదు. మనలాగా ప్రతి ఎకరా రెండు ఎకరాలకి గట్లు ఉండవు. వందలాది ఎకరాలని ఒకే ప్రాంతంగా సాగు చేస్తారు. మన సినిమాల పుణ్యమా అని యూరప్ అందాల్ని వెండితెర మీద చూసినా, ప్రత్యక్షంగా మొదటిసారి చూస్తునపుడు ఆ అనుభవమే వేరు. డ్రైవర్ ని మాట్లాడించే ప్రయత్నం చేశాను,ఇంకా ఎంత దూరం అని. అతనికి ఇంగ్లీష్ అర్ధం కాకపోవటంతో నా ప్రశ్న కి జవాబు రాలేదు. పోలాండ్ లో ప్రజలు మాట్లాడే భాష పోలిష్. రాయటంలో ఇంగ్లీష్ కి దగ్గరగానే ఉన్నా, మాట్లాడటంలో మాత్రం ఇంగ్లీష్ కి భిన్నంగానే ఉంటుంది. యూరప్ లో అన్ని దేశాలలో స్థానిక భాషలదే హవా. కంప్యూటర్లు, సైన్ బోర్డులు, ప్రభుత్వ ప్రకటనలు అన్నీ స్థానిక భాషల్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ మాట్లాడేవారు చాలా అరుదు. సిటీల్లో కొంచెం పరవాలేదు కాని ఒకమాదిరి పట్టణాల్లో అయితే చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలు కూడా ఇక్కడి వాళ్ళకి తెలియవు. ఈ భాష కష్టాలు నా తరువాతి అనుభవాల్లో వస్తాయి.గంటన్నర ప్రయాణించాక మింజు జేర్జ్ చేరుకున్నాం. యూరప్ లో రాత్రి 10 గంటలకి కాని సూర్యాస్తమయం ఉండదు. ఇండిపెండెంట్ ఇళ్ళు అన్నీ విసిరేసినట్లు అక్కడొకటి, అక్కడొకటి ఉన్నా అపార్ట్మెంట్లు మాత్రం ఒకే చోట పది, పదిహేను ఉన్నాయి.అలాంటి ఓ అపార్ట్మెంట్ల సమూహం ముందు టాక్సీ ఆగింది. 
Continued...
Dated : 23.06.2013

Friday, June 14, 2013

నా ఐరోపా యాత్ర - I


జీవితంలో కొన్ని అనుకోని అవకాశాలు మన జీవన గమనాన్నే మార్చేస్తాయి. సంవత్సరానికి కేవలం 2830 రూపాయలు ఫీజు కట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న ప్రింటింగ్ టెక్నాలజీ చదువు నన్ను ఈ ప్రపంచంలో 12 దేశాల్లో పర్యటించటానికి దోహదం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. చదువు పూర్తీ చేసుకున్న ఏడాది లోనే దుబాయ్ వెళ్ళే అవకాశం రావటం జీవితంలో పెద్ద మలుపు. నా ఆలోచనల పరిధి అమాంతంగా పెరిగిపోవటానికి ఆ అవకాశం మరియు అక్కడ పనిచేసిన రెండు సంవత్సరాల కాలం ఎంతో ఉపయోగపడింది.బయటనిలబడి చూస్తుంటే భారతదేశం అప్పటిదాకా తెలియని కొన్ని కొత్త అంశాలని తెలుసుకునేలా చేసింది. విభిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, మన దేశంలోనే నాకు తెలియని ఎన్నో విశేషాలు అక్కడే తెలిసాయి. మధ్య ప్రాచ్యం లో ఉన్న రాచరికం,చమురుతో సుసంపన్నం అయిన ఆ దేశాలు అతిత్వరగా అభివృద్ధి చెందటానికి గల కారణాలని అధ్యయనం చేసే వీలు చిక్కింది.తరువాత హైదరాబాదులోనే ఉద్యోగం రావటంతో ఇండియాకి తిరిగివచ్చి ఉద్యోగం చేస్తూనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఇంజినీరింగ్ పూర్తీ చేశాను.పనిచేస్తున్న సంస్థలో సంతృప్తిగానే సాగుతుండటంతో ఇక వేరే చోటకి వెళ్ళాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. పోలాండ్ లో మేనేజర్ గా అవకాశం ఉంది, మీకు ఆసక్తి ఉందా ? అంటూ ముంబై నుండి వచ్చిన ఫోన్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. కాని నేను మొదట చెప్పిన సమాధానం నాకు ఆసక్తి లేదు అని. అసలు పోలాండ్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. మళ్లీ రెండోసారి కాల్ చేసి మంచి ఆఫర్ అని చెప్పటంతో సరే చూద్దాం అని ఇంటర్వ్యూ కి వెళ్ళటం వెంటనే సెలెక్ట్ అవటం జరిగిపోయాయి. పోలాండ్ యూరోపియన్ యూనియన్ లో భాగం కావటంతో నేను అక్కడి పనిచేసిన కాలంలో జర్మనీ, స్వీడన్, ఇటలీ, లిచ్టేన్ స్టెయిన్, ఆస్ట్రియా, స్విట్జెర్లాండ్, ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించటం జరిగింది. అక్కడి సామాజిక, రాజకీయ,చారిత్రక అంశాలమీద లోతుగా అధ్యయనం చేసే అవకాశం దక్కింది. హిట్లర్ అంటే చిరంజీవి నటించిన ఒక సినిమాగా మాత్రమే తెలిసిన నాకు అసలు ఆ పదం ఈ యుగంలోనే స్మరించరానిది అని అర్ధం అయ్యింది. ఇప్పటి తరానికి అవగాహన లేక హిట్లర్ ని ఒక హీరోగా, అతను చెప్పిన మాటలని వేదవాక్కులుగా  సామాజిక సంభందాల వెబ్ సైట్ లలో పోస్ట్ చెయ్యటం చూశాక, నేను నా అనుభవాలు రాయటం అవసరం అనిపించింది. అసలు హిట్లర్ ఏం చేశాడు? నియంతకి ప్రత్యామ్నాయ పదం హిట్లర్ మాత్రమేనా? 2 కోట్ల మంది ని ఊచకోత కోసిన నరరూప రాక్షసుడు ఈ తరానికి హీరోనా? యుద్ధాన్ని ఒక దైనందిన కార్యక్రమంలా చేస్తూ, మనుషుల్ని చంపటానికి డెత్ ఫ్యాక్టరీలు పెట్టి, రోజువారి టార్గెట్ లతో ఒక్కొక్క ఫాక్టరీలో మిలియన్లమందిని గ్యాస్ చాంబర్లలో హతమార్చిన నాజీల నాయకుడు ఈ తరానికి ఆదర్శమా? నేను 1948 తెలంగాణా విముక్తి పోరాటాల గురించి చదువుతున్నపుడు చదివిన ఒక పాటలో ఉన్న ఓ పదం ఇక్కడ జ్ఞాపకం వచ్చేది. నాజీల మించినవురో నైజాము సర్కరోడా అని.కాని అప్పటికి నాజీలు ఎవరో తెలియదు. తెలిసాక నాజీలని మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరని అర్ధం అయ్యింది.కేవలం హిట్లర్ గురించి తెలుసుకోవటానికే నేను మూడుసార్లు జర్మనీ లో ప్రయాణించాను. వెళ్ళిన ప్రతి దేశంలోనూ రెండవ ప్రపంచయుద్ధపు మారణ హోమానికి సంభందించిన గుర్తులు వెతికాను. వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ నాజీలు ఇక్కడికి వచ్చారా అని స్థానిక గైడ్ లని అడుగుతుంటే తోటి మిత్రులంతా ఏంటి నీకీ హిట్లర్ పిచ్చి అని నవ్వుకున్నారు.హిట్లర్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క యూదుల పట్ల సాగించిన మారణ హోమం పట్ల ఆవేదన పెల్లుబుకేది. 1945 లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక మిగిలిన శిధిలాల నుండి ఎదిగిన యూరప్ దేశాలు,ఇప్పుడు చూస్తుంటే నిజంగా అధ్బుతమే అనిపించింది.శతాబ్దాల క్రితం జరిగిన పానిపట్టు యుద్ధాలు, తుళ్ళికోట యుద్ధాలు గురించి, పల్నాటి యుద్ధాల గురించి చదువుతున్నపుడు కలిగిన ఆశ్చర్యం, ఆసక్తి కంటే ఈ శతాబ్దంలో కేవలం అరవై ఏళ్ల క్రితం, ఇప్పుడు అత్యంత ప్రశాంతంగా కనిపించే యూరప్ ఖండంలో హిట్లర్ నాజీ పాలన అనేక దేశాల్లో యూదుల మీద, కమ్యూనిస్టుల మీద, ప్రజాస్వామ్యం మీద పరమ భయంకరమైన మారణకాండను రుద్దుతుంటే ప్రపంచం మౌనంగా ఎందుకు ఉండిపోయిందో అర్ధం కాలేదు. యుద్ధాన్ని ప్రారంభించి, యూరప్‍లో ఒక్కో దేశాన్నే కబళిస్తూ, వేలాదిమంద్ని నరమేధం సాగిస్తూ హిట్లర్ ముందుకు కదులుతుంటే, శక్తిమంతంగా ఎందుకు ఈ బూర్జూవా ప్రజాస్వామిక దేశాలు అడ్డుకోలేకపోయాయో అర్ధం కాలేదు. సాటి మనిషిని ఎటువంటి శత్రుత్వం లేకుండా అత్యంత క్రూరంగా చంపగల మనస్తత్వాలని నాజీలకి హిట్లర్ ఎలా నూరిపోయగాలిగాడో అర్ధం కాని విషయం.ఈ నరమేధానికి నాంది ఇప్పుడు నేను వెళ్తున్న పోలాండ్ దేశం. రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా జర్మన్ సైన్యం మొదటగా విరుచుకు పడింది పోలాండ్ మీదే. 
 


ఫోటో వివరాలు: రష్యా సైన్యం జర్మనీ రాకుండా నిలువరించటానికి పోలాండ్ సరిహద్దు వెంబడి హిట్లర్ నిర్మించిన 32 కిలోమీటర్ల పొడవున భూగర్భం లో ఉన్న బంకర్. 

ఈ చరిత్రంతా తెలియకుండానే మే 4, 2012 న హైదరాబాదు రాజీవ్ గాంధి విమానాశ్రయం నుండి తెల్లవారుఝామున 3 గంటలకి ఖతర్ ఎయిర్వేస్ విమానం ఎక్కాను. పోలాండ్ కి నేరుగా విమానాలు లేకపోవటంతో ఖతర్ లో వేరే ఫ్లైట్ మారాలి. హైదరాబాదు నుండి ఖతర్ 4 గంటల ప్రయాణం. మనం ఖతర్ కంటే గంటన్నర ముందు ఉంటాం. మధ్య ప్రాచ్యం లో ఉన్న అత్యంత సంపన్న దేశం ఖతర్. ఇక్కడ ప్రతి 1000 మంది లో 147 మంది కోటీశ్వరులు.నేను ఎక్కిన ఫ్లైట్  అక్కడ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకి ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయ్యింది. To be contnued....

Dated : 15.06.2013