మింజు జేర్జ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో బెర్లిన్ వెళ్ళే దారిలో ఈ బంకర్స్ ఉన్నాయి. తోటి భారతీయ మిత్రులు మరియు అక్కడి స్థానిక మిత్రుడితో కలిసి అవి చూడటానికి వెళ్ళాం. మొట్ట మొదటిసారి రెండవ ప్రపంచ యుద్ధం గురించి, హిట్లర్ గురించి విన్నది అక్కడే. జ్యూయిష్ అనే ఒక మతం ఉందని, వారినే యూదులు అంటారని అప్పుడే తెలిసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో పోలాండ్ పశ్చిమ భాగాన్ని రష్యా, తూర్పు భాగాన్ని జర్మనీ ఆక్రమించుకున్నాయి. రష్యా సైన్యం జర్మనీ ని ఆక్రమించాలంటే ఈ దారి గుండానే వెళ్ళాలి. వారిని నియంత్రించటం కోసం సరిహద్దులో భూమిలో 300 అడుగుల లోతున ఈ బంకర్ ని నిర్మించారు. దీని మొత్తం పొడవు 32 కిలోమీటర్లు. కాని కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే సందర్శనీయ ప్రాంతంగా ఉంది. అక్కడ ఇంగ్లీష్ గైడ్ కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. స్థానిక మిత్రుడు ముందుగానే ఏర్పాట్లు చెయ్యటంతో అప్పటికే మాకోసం ఎదురు చూస్తున్న గైడ్ సహాయంతో బంకర్ లోపలకి వెళ్ళాం. అతి ఇరుకైన తలుపు గుండా కిందకి 300 మీటర్లు మెట్లు దిగాక పొడవాటి వీధులు ఉన్న నిర్మాణంలోకి ప్రవేశించాం. లోపల ఉష్ణోగ్రత - 5 డిగ్రీలు. లోపల సైనికులు ప్రయాణించటానికి చిన్న ట్రైన్ కూడా ఉంది.అప్పుడు నాజీ సైనికులు వాడిన టూత్ పేస్టు, బూట్లు,టెలిఫోను, రేడియో ఇప్పటికీ అలాగే ఉంచారు.
అసలు అది 1940 లో కట్టిన నిర్మాణం అనిపించలా, పటిష్టమైన గోడలు, ఎక్కడా చెక్కు చెదరని ఈ నిర్మాణాన్ని ఒక క్రమ పద్దతి లో ప్రణాళికా బద్ధంగా నిర్మించారు. హిట్లర్ యుద్ధాన్ని ఒక పరిశ్రమ లాగే భావించాడు. దానికి తగ్గట్టే యుద్ధానికి అవసరమైనవి అన్నీ శాశ్వత ప్రాతిపదికనే నిర్మించాడు. అత్యాధునిక యుద్ధ సామాగ్రిని ఆ రోజుల్లోనే సమకూర్చుకున్నాడు. యుద్ధం కోసం రోడ్లు వేసారు, మనుషుల్ని చంపటానికి కాన్ సన్ ట్రేషన్ కాంపుల పేరుతో మృత్యు కుహరాలని నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక కాని రష్యన్ రెడ్ ఆర్మీ ఈ బంకర్ని చేరుకోలేదు. ఇందులో ఏమైనా సంపద దాచారేమో అని అక్కడక్కడా రెడ్ ఆర్మీ దీనిని ధ్వంసం చేసింది. అందుకే లోపల గోడలకి అక్కడక్కడా రంద్రాలు, బులెట్ గుర్తులు ఉన్నాయి. ఈ బంకర్ ఉన్నంత మేరా భూమి పైన డ్రాగన్ వే ఉంటుంది. యుద్ధ టాంకర్లు ఈ సరిహద్దుని దాటకుండా కొంత ఎత్తులో సిమెంట్ దిమ్మలు నిర్మించారు.
రష్యా సైన్యం ఈ దారిని వినియోగించకపోవటంతో ఈ బంకర్ నిర్మించిన ఉద్దేశం సఫలీకృతం కాలేదు. దీని నిర్మాణం జరుగుతున్నపుడు హిట్లర్ ఇక్కడికి వచ్చాడని గైడ్ చెప్పాడు. ఈ బంకర్ లో కొన్నాళ్ళు నాజీ సైనికుల కాంప్ ఉండేది. యుద్ధం ముగిసి జర్మనీ ఓడిపోయాక ఇందులో ఉన్న సైనికులంతా చెల్లా చెదురుగా పారిపోయారు. పోలాండ్ లో జర్మనీ ఆక్రమిత భాగాన్ని కూడా రష్యా ఆక్రమించుకుంది. 1989 లో కమ్యూనిస్టు పాలన అంతమై సోవియట్ యూనియన్ ముక్కలయ్యేవరకు పోలాండ్ దేశం రష్యా ఆధీనంలోనే ఉంది. ఇవన్నీ విషయాలు గైడ్ చెప్తుంటే తలపంకించి వింటూ ఉండిపోయాను. నా అసలు అన్వేషణ అప్పుడే మొదలైంది. అసలు యుద్ధం ఎందుకొచ్చింది? ఈ హిట్లర్ ఎవరు ? యూదుల్ని ఎందుకు అంత క్రూరంగా చంపాడు ? నాజీలంటే ఎవరు ? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కొంత హిట్లర్ గురించి పరిచయం అవసరం. అసలు సిసలు జాత్యహంకారానికి ప్రతిరూపం హిట్లర్, మానవత్వం లేకుండా సాటి మనుషుల్ని డెత్ ఫాక్టరీల్లొ అమానుషంగా చంపిన నాజీల కధ తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి.
Dated : 18.07.2013