నా ఐరోపా యాత్ర - 8 (పోలాండ్)
పదవ బారక్ ఆడవాళ్ళ పాలిట నరక కూపం. అందులో జర్మన్ డాక్టర్లు ఆడవాళ్ళపై రక రకాల ప్రయోగాలు చేసేవారట. గర్భిణి స్త్రీలకి ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండానే లోపల పిండం ఎలా ఉందో అని కోసి చూసేవారు. ఇంకా స్త్రీల అవయవాలన్నీ కోసి వాటిపై పరిశోధనలు చేసారు. రకరకాల ఔషధాలని ప్రయోగించి అవి పనిచేస్తునాయో లేదో అని పరీక్షించేవారు. ఇవన్నీ బతికున్న మనుషులపైన ఎటువంటి మత్తు మందు లేకుండా జరిపిన పాశవిక హత్యా కాండ. ఆ బారక్ లో లోపలి వెళ్ళిన వారెవరూ ప్రాణాలతో బయటకి వచ్చేవారు కాదు. మిగతా వారికి ఆ బారక్ లో ప్రవేశం నిషిద్ధం. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా. ఈ పని ఏ ఆటవిక ప్రజలు కూడా చేసి ఉండరు. అందుకే హిట్లర్ అనే ఒక మానవుడిని మృగం తో పోల్చినా పాపమే.ఇక ఒక నాజీ అధికారి భార్య చేసిన పని వింటే రక్తం మరిగిపోతుంది. గ్యాస్ చాంబర్లలో మరణించిన యూదుల ఆడవారి స్తనాలని కోసి ఆ చర్మంతో ఫాన్సీ పర్సులు కుట్టేది. యుద్ధం ముగిశాక ఈమె బ్రిటన్ సైన్యానికి చిక్కి జైల్లోనే ఆత్మహత్య చేసుకుంది. అసలు ఇక్కడ ఎం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలిసేది కాదు.ఇక్కడ ఖైదీలందరికీ ఒక యునిఫామ్ ఉంది. కాంపులోకి ప్రవేశించగానే చేతిపై వారి నంబర్ ని పచ్చ పొడిచేవారు. చచ్చేదాకా వాడిని ఆ నెంబర్ తోనే పిలిచేవారు. కొందరికి ఆ పచ్చ పొడవటం వల్ల అయిన గాయం సెప్టిక్ అయ్యి మరణించేవారు.
మేము చూస్తున్నంత సేపు సందర్శకులలో చాలామంది ఏడుస్తూనే ఉన్నారు.యుద్ధం ముగిసాక కాని ఈ కాంపుల్లో అకృత్యాలు బయటి ప్రపంచానికి తెలియలేదు. యుద్ధంలో ఓడిపోయామని తెలియగానే ఇక్కడి అధికారులు రికార్డులన్నీ తగలబెట్టేసారు. అమెరికా, బ్రిటన్ సైన్యాలు వచ్చేటప్పటికి సగం కాలుతున్న శవాలు, ఆస్థి పంజరాలు, కుళ్ళిపోయిన వేలాది మంది శవాలు మీదుగా నడవాల్సి వచ్చిందట. 1941 నుండి 1944 వరకు ఈ కాంపుకి తీసుకొచ్చిన వారిలో ఒక్కరు కూడా యుద్ధం ముగిసే నాటికి జీవించి లేరు. 1945 లో మూడు నెలలకి ముందు తీసుకు వచ్చిన వారు మాత్రమే యుద్ధం ముగిసాక బయట పడ్డారు.ఇక యుద్ధం అయ్యాక పట్టుబడిన నాజీ అధికారులని జర్మనీ లో ఉన్న న్యురేం బర్గ్ లో న్యాయ విచారణ చేసారు. అందరికీ మరణ శిక్ష విధించారు. ఇక కాంపులో అత్యాచారాలకి పాల్పడిన నాజీ అధికారులని ఇక్కడే తమ ముందే ఉరి తీయాలని యూదులు కోరడంతో కొంతమందిని ఇక్కడే ఉరి తీసారు. కాని ఎన్ని శిక్షలు విధించినా పోయిన 60 లక్షలమంది ప్రాణాలు, బతికుండగానే జీవచ్చవాలు గా మిగిలిన లక్షలాది మంది జీవితాలు తిరిగి రావుగా.ఎన్నో పసి మొగ్గలు నాజీల దురహంకారం కింద నలిగిపోయాయి. ప్రపంచంలోనే జరిగిన అతి పెద్ద మానవ హననం ఈ యూదుల మారణ కాండ. దీనిని హాలో కాస్ట్ అంటారు. ఈ పేరుతొ జర్మనీ లోనూ అమెరికాలోనూ పలు మ్యుజియాలు ఉన్నాయి.
పోలాండ్ వాసులకి జర్మనీ అంటే ఎంత కోపమో, తమని కాపాడిన రష్యా అన్నా అంతే కోపం.1945 నుండి 1989 వరకు ఇది రష్యా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కాని పోలిష్ ప్రజలు ఆ కమ్యూనిస్టు విధానాలకి వ్యతిరేకం. జర్మనీ నుండి 1945 లో విముక్తి చేశామనే సాకుతో రష్యా ఈ దేశాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. సోవియట్ యూనియన్ ముక్కలయ్యాక పోలాండ్ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. 2004 లో యూరోపియన్ యూనియన్ లో భాగస్వామ్య దేశం అయ్యింది. అయినప్పటికీ మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే ఆర్ధిక ప్రగతిలో ఈ దేశం ముందు ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కరెన్సీ యూరో కి మారకపోవటం వల్లే పోలాండ్ స్థిమితంగా ఉందనేది నా అభిప్రాయం. కరెన్సీ ల మధ్య వ్యత్యాసం ఉంటేనే ఒక దేశపు ప్రజలు మరొక దేశానికి విహారానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. యూరప్ దేశాల ప్రజలు ఎక్కువ విహారాన్ని ఇష్టపడతారు. సెలవలు వస్తే ఇతర దేశాలకి వెళుతూ ఉంటారు.అన్ని దేశాలకి ఉన్న ప్రధాన ఆదాయ వనరు టూరిజం. అన్ని దేశాలలో యూరో కరెన్సీ ఉంటే ఒక దేశం అవలంబించే ఆర్ధిక విధానాల వల్ల మాంద్యం ఏర్పడితే ఆ ప్రభావం యూరో మీద పడి యూరో చలామణి లో ఉన్న మిగతా దేశాల ఆర్ధిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపుతుంది. కరెన్సీ లో వ్యత్యాసం ఉంటే ఏదైనా దేశం ఆర్ధిక సంక్షోభంలో పడినప్పుడు ఆ దేశపు కరెన్సీ తో యూరో మారకం విలువ పెరుగుతుంది.యూరో చలామణిలో ఉన్న దేశస్తులు చవకలో వినోదం పొందటానికి ఆ దేశానికి వెళతారు. దాని ద్వారా ఆ దేశం సంక్షోభం నుండి సునాయాసంగా గట్టేక్కవచ్చు. ఉదాహరణకి ఇటలీలో ఒక పిజ్జా ఖరీదు 12 యూరోలు, అదే పిజ్జా పోలాండ్లో 14 జిలోటీలు. ఒక యూరోకి 4.50 జిలోటి లు వస్తాయి.అంటే ఇటలీ లో కంటే మూడో వంతులో పోలాండ్ లో వినోదం దొరుకుతుంది. ఇటాలియన్స్ వీకెండ్స్ కి , సెలవలకి పోలాండ్ వచ్చి హాయిగా గడపచ్చు. అదే ఇక్కడ కూడా యూరో ఉంటే వచ్చేవారికి అంత ఆసక్తి ఉండదు. ఇటీవల సైప్రస్, స్పెయిన్, గ్రీస్ లలో ఆర్ధిక సంక్షోభం వచ్చింది. వాటిని నిలబెట్టటానికి యూరోప్ యూనియన్ మొత్తం పూనుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ ని ఆయా దేశాల్లో యధా తధంగా ఉంచటం మంచిది.ఇక ఆశ్విత్జ్ చూసాక అత్యంత బాధా తప్త హృదయంతో అక్కడినుండి బయలుదేరాం. మా తరువాతి గమ్యం క్రాకో నగరంలో ఉన్న సాల్ట్ మైన్. ( ఉప్పుగని )