Friday, December 26, 2014

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం. మన దేశం తర్వాత నేను నివసించటానికి అత్యంత ఇష్టపడే ప్రాంతం ఇది. నేను యూరప్ లో కొంత కాలం నివసించినా నాకు దుబాయ్ అంటేనే ఎక్కువ ఇష్టం. నేను తొలిసారి చూసిన విదేశం దుబాయ్. అందుకేనేమో ఈ దేశం అన్నా ఇక్కడి ప్రభుత్వ విధానాలన్నా నాకు అమితమైన ఇష్టం , ఆసక్తి . మొత్తంగా నేను ఈ దేశంలో నివసించింది 4 సంవత్సరాలు. మూడు జాతీయ దినోత్సవాలని ఈ దేశంలో చూశాను. ఈరోజు డిసెంబర్ 2 , 2014 న జరుపుకుంటున్న ఈ దేశపు 43 వ జాతీయ దినోత్సవం నేను చూస్తున్ననాలుగవది. మన దేశంలోనూ , ఇక్కడా కొన్ని సారూప్యత కలిగిన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు, గతంలో ఆ రెండూ సమైక్యంగా ఉన్నప్పటి పరిస్తితులు, మళ్ళీ విడిపోవటానికి కారణాలు, ఇక్కడి పరిస్థితులకి కొంత సారూప్యంగాఉంటాయి. అందులో ఒకటి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వివాదాలుగా మారుతున్న పేర్ల వివాదం. మన భారత దేశం లో , అలాగే తెలుగు రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా ప్రభుత్వ భవనాలకి, రోడ్లకి నాయకుల పేర్లు పెట్టే సంస్కృతి ఉంది. నిర్మించిన ప్రతి భవనానికి, ప్రతి హైవే కి ప్రభుత్వమే పేర్లు పెడుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం కాదు కనుక నిర్ణయాధికారం రాజు దే. ఆందోళనలు , ప్రజల మనోభావాలు లాంటి పదాలు ఇక్కడ వినిపించవు. అలా అని ప్రజా వ్యతిరేక విధానాలు కూడా కనిపించవు. ఈ అంశం గురించి చెప్పేముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి కొంత చెప్పాలి.ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. 1970 కాలంలో దుబాయి, ఆబుధాబి, షార్జా, ఆజ్మాన్, ఉమ్మాల్ ఖ్వాయిస్, ఫుజిరా, రాస్ అల్ ఖైమాలు వేర్వేరు జెండాలు, వేర్వేరు విధానాలతో విభిన్న తెగలకు చెందిన రాజులు పరిపాలిస్తున్న వేర్వేరు దేశాలు.ఈ రాజ్యాలన్నీ కూడా కీలకమైన అరేబియా సముద్ర తీరంలో ఉన్నాయి. అన్ని దేశాలకూ రేవు కేంద్రాలు ఉన్నాయి. కొందరి వద్ద చమురు సంపాదన ఉండగా మరికొందరి వద్ద లేదు. 1971లో రాస్ అల్ ఖైమా మినహా మిగిలిన దేశాలన్నీ కలిసి సమైక్యంగా సమాఖ్య రూపంలో ఉండడానికి తీర్మానం చేసుకొన్నాయి (మరుసటి సంవత్సరం రాస్ అల్ ఖైమా కూడా చేరింది). ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాల వరకు ఒక ఎమిరేట్ నుంచి మరో ఎమిరేట్‌కు వెళ్ళడానికి పాస్‌పోర్టు అవసరమయ్యేది.
ఏడు ఎమిరేట్లు వేర్వేరుగా ఉన్నప్పుడు సరిగ్గా రహదారులు లేని ఎడారి ప్రాంతాలు, సమైక్యంగా మారిన తర్వాత వాటి దశ, దిశ తిరిగిపోయింది.అనూహ్య అభివృద్ధి సాధించడానికి ఏడు రాజ్యాలు కూడా పరస్పరం గౌరవించుకోవడం, వనరుల పంపిణీలో సమ న్యాయం ప్రధాన కారణాలు.ఈ పరస్పరంగౌరవించుకోవడం గురించే ఇప్పుడు చర్చ. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. ఎవరీ షేక్ జాయేద్ ? ప్రస్తుతం అబుదాబి రాజు షేక్ ఖలీఫా తండ్రి. ఈయనే మిగతా ఆరు రాజ్యాలతో కలిసి సమాఖ్యగా ఉండాలని అందరిని ఒప్పించి ఒక దేశంగా ఏర్పరిచాడు. ఈ రోడ్డు దుబాయ్ లో ఉన్నంత మేరా దానిపేరు షేక్ జాయేద్ రోడ్డు. ఎప్పుడైతే అబుదాబి సరిహద్దులు మొదలవుతాయో అక్కడినుండి ఈ రోడ్డు పేరు షేక్ రషీద్ రోడ్డు. ఎవరీ షేక్ రషీద్ ? ప్రస్తుత దుబాయ్ రాజు తండ్రి షేక్ రషీద్. దుబాయ్ లో నిర్మించిన ప్రపంచంలో ఎత్తైన భవనం పేరు బుర్జ్ ఖలీఫా. అబుదాబి ప్రస్తుత రాజైన షేక్ ఖలీఫా పేరుని ఆయన చేసిన సహాయానికి ప్రతిఫలంగా మాత్రమే కాదు,ఆయన మీద గౌరవముతో దుబాయ్ రాజు తమ ప్రాంతంలో ఉన్న భవనానికి పెట్టారు. ఇటీవల అబుదాబి లో నిర్మించిన 2 టవర్ల కి షేక్ రషీద్ టవర్స్ అని దుబాయ్ రాజు పేరుని అబుదాబి ప్రభుత్వం పెట్టింది. ఇవే కాకుండా షార్జా లో చాలా రోడ్లకి, వీధులకి దుబాయ్ , అబుదాబి నాయకుల పేర్లు ఉంటాయి. అలాగే షార్జా నాయకుల పేర్లు కూడా ఇతర ఎమిరేట్ లలో కనిపిస్తాయి. ఎప్పుడైతే పక్కవారి గొప్పతనాన్ని గుర్తించే ఔన్నత్యం మనకుంటుందో మన గొప్పతనాన్ని ఇతరులు గుర్తిస్తారు. ఎప్పుడయితే ఆత్మగౌరవం దెబ్బతిని దానికి విఘాతం కలుగుతుందో అప్పుడు వేర్పాటు ఉద్యమం ఊపందుకొంటుంది.1972 లో ఒక్కటిగా కలిసిన ఈ ఏడు ఎమిరేట్స్ లో మూడు మాత్రమే (అబుదాబి , షార్జా , దుబాయ్ ) ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన ఆబుధాబి రాజ్యం యావత్తు ప్రపంచం నుంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో దానికి అనుకొని ఉన్న షార్జా , దుబాయ్ ఎమిరేట్లు లాభపడినా ఏనాడూ కూడా మిగతా నాలుగు ఎమిరేట్స్ ఈ సమాఖ్య నుంచి వేరుగా ఉండాలని ఏమాత్రం కోరుకోకపోవడానికి కారణం వారి హక్కులు, అభివృద్ధి వాటాలో ఏ మాత్రం లోటులేకపోవడం. 60 ఏళ్ళు కలిసున్న సమైక్య రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పని చేసిన ఒక వ్యక్తి పేరుని కొత్త రాష్ట్రం లో ఒక టెర్మినల్ కి పెడితేనే ఓర్చుకోలేని కురచ దృక్పధాలున్న మన నాయకులు ఇక్కడి సంస్కృతిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే అవశేష రాష్ట్రంలో కూడా ప్రాంతాలకతీతంగా సాటి తెలుగు నాయకుల పేర్లు పెట్టడం కూడా అవసరం. చిత్తూరులోని మదనపల్లె వైపు ఉన్న పరిస్థితులకు, నగరి వైపు ఉన్న పరిస్థితులకు తేడా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు వైపు పరిస్థితులకు, ఆదిలాబాద్ వైపు పరిస్థితులకు వ్యత్యాసం ఉన్నది. కేవలం జిల్లాస్థాయి ప్రాంతాల్లోనే తేడాలు ఉన్నప్పుడు వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దేశాల్లో తేడాలు ఉండడం సహజం. వాటన్నిటిని అధిగమించి 43 సంవత్సరాలుగా సమైక్య స్పూర్తిని కొనసాగిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు.
Date
02.12.2014

Tuesday, November 25, 2014

విడిపోయిన జ్ఞాపకాలు

ఎన్నో భావోద్వేగాల మధ్య రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారికి రాజకీయ నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలు తప్ప సామాన్యుడి ఆవేదన, ఆక్రోశం తెలియకపోవచ్చు. ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు జరిగిన ప్రాణ నష్టం 68 ఏళ్ల తరువాత ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసును కలచి వేసే ఉదంతం అది. నాకు సంబంధించినంతవరకూ నా గొప్ప జ్ఞాపకాలన్నీ పొరుగు రాష్ట్రంలో ఉండిపోయాయి.
150 రూపాయలు తో టికెట్ కొని జేబులో 200, చేతిలో 50 కేజీల బియ్యం బస్తా తో వెంకటరమణా ట్రావెల్స్ బస్సు ఎక్కి 1999 సెప్టెంబర్ 24 న భవిష్యత్తు మీద కోటి ఆశలతో అడుగుపెట్టిన నాకు బోలెడంత భరోసా ఇచ్చి అక్కున చేర్చుకుంది భాగ్యనగరి. ఏదో అవ్వాలని, ఏదో చెయ్యాలని తపన తో వచ్చిన నాకు బస్సు దిగగానే ఇక ఏమీ పర్లేదు బిడ్డా మంచిగ అవుతావ్ గిదంతా మనదే అనే భావన కలిగించింది హైదరాబాద్.
అప్పుడు ECIL దగ్గర కమలా నగర్ లో మకాం. నెలకి 480 రూపాయల అద్దె. అగ్గిపెట్టెంత రూములో ముగ్గురం ఉండేవాళ్ళం. వంట అందులోనే. ఎప్పుడైనా బద్ధకం వేస్తె దగ్గరే సాయి మెస్సు లో ప్లేట్ భోజనం 15 రూపాయలు. ఫుల్ అయితే 18 రూపాయలు. నెలకి 1000 రూపాయల జీతంతో ప్రారంభమైన ప్రయాణం రోజుకి 1000 సంపాదించే వరకు హైదరాబాదులోనే సాగింది. మధ్యలో 6 సంవత్సరాల చదువు హైదరాబాదులోనే. 23 జిల్లాల నుండి వచ్చిన స్టూడెంట్స్ అంతా ఒకే చోట చదువుకున్నాము. విచిత్రం ఏమిటంటే ఏ ప్రాంతం వాడితో మాట్లాడేటప్పుడు ఆ ప్రాంతపు యాస నాకు తెలీకుండానే వచ్చేసేది.ఇంజినీరింగ్ చదివింది ముస్లిం మైనారిటీ కాలేజిలో అయినా ఏరోజూ ఆ బేధం తెలియలేదు. ప్రతి సంవత్సరం కనీసం 5, 6 ఇఫ్తార్ విందులు ఉండేవి. ఓల్డ్ సిటీ లో మిత్రుల ఇళ్ళకి ఇఫ్తార్ కి వెళ్లినపుడల్లా ఆ ఇంటి మర్యాదలు, ఆదరణ అద్భుతం. పాయ, నహారి , హైదరాబాద్ బిర్యాని సుష్టుగా తిన్నాక సేమ్యా ఖీర్ తో ఆ విందు ముగిసేది.
సికిందరాబాద్ బ్లూ సీ కేఫ్ లో ఇరానీ ఛాయ్ 3 రూపాయలు, ఉస్మానియా బిస్కట్ 50 పైసలు. 5 రూపాయలు ఇస్తే ఒక ఛాయ్ నాలుగు బిస్కట్స్ వచ్చేవి. స్నేహితులతో కలిసి మారేడ్ పల్లి నుండి సికిందరాబాద్ దాకా నడిచి వెళ్ళేవాళ్ళం. బద్దకిస్తే 38 నంబర్ బస్సు ఎలాగూ ఉండేది. ఇక బిర్యాని తినాలంటే బావర్చి నే. నలుగురం కలిసి వెళ్తే ఫ్యామిలీ పాక్, ఆరుగురం వెళ్తే జంబో పాక్. ఆర్టీసి క్రాస్ రోడ్లో ఆ బిర్యాని తినేసి మళ్లీ 1 నంబర్ బస్సు ఎక్కి సికిందరాబాద్ వచ్చేసే వాళ్ళం. నెలకి 60 రూపాయలు బస్సు పాస్ కడితే కనపడ్డ బస్సు నల్లా ఎక్కి ఫుట్ బోర్డు లో వేలాడిన రోజులు మర్చిపోకముందే ఇప్పుడు ఆంద్రోడికి బస్సు పాస్ ఇవ్వనంటోంది హైదరాబాద్.
తొలిసారి విదేశానికి వెళ్ళేటప్పుడు విమానం బేగం పేటలో ఎక్కాను. అందరిని వదిలి వెళ్తున్నాననే బాధ కంటే హైదరాబాదు ని మిస్ అవుతున్నాననే బాధతోనే నా హృదయం బరువెక్కింది. 21 ఏళ్ల కుర్రవాడు తొలి సారి విమానమేక్కబోతున్న అనుభవానికి, ఉత్సుకతకి ఉత్సాహానికి సాక్షిగా నిలిచింది బేగంపేట విమానాశ్రయం.
ఖాళీగా తిరిగే రోజుల్లో ఎక్కడ ఏ సినిమా కార్యక్రమం ఉందా అని పేపర్ చూసుకోవటం సాయంత్రానికల్లా అక్కడ వాలిపోయి సినిమా వాళ్ళని చూడటమే పని. హైదరాబాదులో ఉన్న అన్ని థియేటర్స్ లో సినిమా చూడాలనేది గోల్ అలా మూడు సంవత్సరాలలో 115 థియేటర్స్ లో సినిమాలు చూసిన రికార్డు నాదే. సినిమా రిలీజ్ అయితే, అప్పటిదాకా నేను చూడని ధియేటర్ లో ఆ మూవీ ఎక్కడుందో చూసుకోవటం మార్నింగ్ షో కి వెళ్ళిపోయేవాళ్ళం.
అర్ధరూపాయి, పావలా అనే పదాలు మర్చిపోయి ఆటాన చారానా అంటూ అక్కడి మాండలికంతో మమేకమయ్యాం. బాబాయ్ అనే పదం మరిచి కాకా అంటూ కలిసిపోయాం. గీనితో గిదే లొల్లిరా మామా అంటూ గొడవ అనే పదాన్నే మర్చిపోయాను. ఐ లవ్ హైదరాబాద్ అంటూ ఏ ప్రాంతానికి వెళ్ళినా గర్వంగా చెప్పుకున్నాం. అబిడ్స్ లో ఉన్న విశాలాంధ్ర పుస్తకాలయంలో నేను చదవని తెలంగాణా పోరాట పుస్తకం లేదు.
ఎన్ని దేశాలు తిరిగినా నా శరీరం మాత్రమే అక్కడుండేది మనసు మాత్రం ఎప్పుడో హైదరాబాదులో పారేసుకున్నాను. నా సంపాదనతో కొనుకున్న తోలి ఇల్లు హైదరాబాదులోనే ఉంది. నా తోలి ఉద్యోగం, తొలి విమాన ప్రయాణం, తొలి సంపాదన ని ఖర్చు పెట్టిన ఇరానీ కేఫ్ అన్నీ తెలంగాణా లోనే ఉన్నాయి. అదృష్టం ఏంటంటే ఆంధ్రోడు అనే పదం మీడియా లో రాజకీయ నాయకుల నోటి వెంట తప్ప, నా మిత్రుల నోటివెంట రాకపోవటం...

Sunday, August 17, 2014

నా ఐరోపా యాత్ర - 16 (బెర్లిన్)

నా ఐరోపా యాత్ర - 16 (బెర్లిన్)
 
​​నవంబర్లో స్వీడన్ పర్యటన తర్వాత ఎక్కడికీ వెళ్ళలేదు. అప్పటికే మంచు కురవటం మొదలయ్యింది. మళ్ళీ  మార్చ్ చివరిదాకా యూరప్ అంతా మంచుతో కప్పబడే ఉంటుంది. అక్టోబర్లో యూరప్ లో అన్ని దేశాల్లో సమయాన్ని ఒక గంట వెనక్కి మారుస్తారు. చలికాలం లో  పగలు చాలా తక్కువ సమయం ఉంటుంది. సాయంకాలం నాలుగు గంటలకే చిమ్మ చీకటి అయిపోతుంది.అదే వేసవి కాలంలో అయితే రాత్రి 9 గంటలవరకు సూర్యుడు ఉంటాడు.మళ్ళీ వేసవి రాగానే సమయాన్ని ఒక గంట ముందుకు మారుస్తారు. నాకు వివాహం నిశ్చయం కావటంతో నెల రోజులు సెలవు తీసుకుని జనవరి 31 న ఇండియా కి బయలుదేరాను. ఈసారి ఎమిరేట్స్ విమానంలో వయా దుబాయ్ రావాలి.31 ఉదయం 4 గంటల కి టాక్సీ డ్రైవర్ ఆదమ్ తో కలిసి పోజ్నాన్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాను.
 
పోజ్నాన్ నుండి జర్మనీ లో మ్యూనిచ్ వరకు యూరో లాట్ డొమెస్టిక్ విమానంలో వెళ్ళాలి. అక్కడినుండి ఎమిరేట్స్ లో దుబాయ్ వరకు ప్రయాణం. బెర్లిన్ , డ్రెస్ డెన్, ఫ్రాంక్ ఫర్ట్  నగరాల తరువాత జర్మనీ లో నేను చూసిన మరో నగరం మ్యూనిచ్. లాండ్ అయ్యేటప్పటికి సమయం ఉదయం 7.20 నిమిషాలు అయ్యింది. ఇక్కడ కొంతమంది తెలుగు కుటుంబాలు కూడా స్థిరపడ్డాయని విన్నాను.హిట్లర్ నివసించింది కూడా ఈ నగరంలోనే. ఈ ఎయిర్ పోర్ట్ చాలా పెద్దది. డొమెస్టిక్ నుండి ఇంటర్నేషనల్ టెర్మినల్ కి వెళ్ళటానికే అరగంట పట్టింది. మళ్ళీ నాకు మధ్యాహ్నం 2. 45 నిమిషాలకి దుబాయ్ విమానం. ఐపాడ్ ఓపెన్ చేసుకుని బుక్ చదువుతూ కూర్చున్నాను. చెక్ ఇన్ మొదలవగానే ఎక్కడెక్కడి వాళ్ళంతా వచ్చి క్యూ లో నిలబడ్డారు. ఇది A380 కావటంతో జనాలు ఎక్కువగా ఉన్నారు. నాకు దుబాయ్ లో చాలా మంది మిత్రులు ఉండటంతో 2 రోజులు దుబాయ్ లో వాళ్లతో గడిపి వెళ్దామని అనుకున్నాను. ఎయిర్ పోర్ట్ లోనే వీసా సౌకర్యం ఉన్నా, నా మిత్రుడు వెంకట్ ముందుగానే వీసా పంపాడు. మధ్యాహ్నం 3.00 గంటలకి మ్యూనిచ్ నుండి బయలు దేరిన విమానం దుబాయి చేరేటప్పటికి అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 11. 45 నిమిషాలకి లాండ్ అయ్యింది.
 
నేను వస్తున్నా అని తెలిసి మా గ్రామానికి చెందిన ప్రసాద్ మరియు మా బావగారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.3 రోజులు దుబాయ్ లోనే గడిపి మిత్రులందరినీ కలిశాక 4 వ తేది ఫిబ్రవరి న దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్నాను.
 
 
అదే నెల 14 న వివాహం అయ్యాక 24 న నా శ్రీమతి భార్గవి వీసా కోసం ఢిల్లీ లో ఉన్న పోలాండ్ ఎంబసీ కి వెళ్ళాము. ఒక సంవత్సరం క్రితమే నేను నా వీసా కోసం ఆ ఎంబసీకి వెళ్ళటంతో అక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా నన్ను గుర్తుపట్టి మమ్మల్ని ఇద్దరినీ వెంటనే లోపలికి పంపారు. అప్పుడే ఎదురైంది మాకు అనుకోని అనుభవం. ఫిబ్రవరి 24 న బుక్ చేయాల్సిన అప్పాయింట్మెంట్ పొరపాటున జనవరి 24 న బుక్ అయ్యింది. అంటే ఆరోజు మాకు అప్పాయింట్మెంట్ లేనట్లే. ఆ రోజు సాయంత్రానికే ఢిల్లీ నుండి మా తిరుగు ప్రయాణం. మార్చ్ 7 న మేమిద్దరం పోలాండ్ వెళ్లిపోవాలి. అక్కడున్న స్టాఫ్ ని అడిగితె ఒక ఆలోచన చెప్పారు. వెంటనే ఇప్పుడు నెట్ లో అందుబాటులో ఉన్న తేదిని బుక్ చేసుకోండి. మేము ప్రీ పోన్ చేసి రేపటికి ఇస్తాము అన్నారు. వెంటనే ఐపాడ్ లో చూస్తే 26 కి ఖాళీ ఉంది. ముందు ఆ తేదికి అప్పాయింట్మెంట్ బుక్ చేసేసుకున్నాను. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఢిల్లీ లో నివసించే రాము అన్నయ్య.
 
నా ప్రాణ స్నేహితుడు పసి కి పెద్దమ్మ గారి అబ్బాయి. నేను , పసి ఇంతకుముందు ఢిల్లీ వచ్చినపుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెంటనే పసి కి ఫోన్ చేసి రాము అన్నయ్య నంబర్ తీసుకున్నాను. అన్నయ్య కి కాల్ చెయ్యగానే ముందు ఇంటికొచ్చేయండి తర్వాత చూసుకుందాం అన్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఆఫీసుకి వెళ్లి ఆ రోజు టికెట్ ని మరుసటి రోజుకి మార్చుకున్నాం. మెట్రో లో అన్నయ్య చెప్పిన అడ్రస్ ప్రకారం ద్వారకా స్టేషన్ కి ఒక గంట ప్రయాణించాక చేరుకున్నాం. ఈలోపు రాము అన్నయ్య చెప్పటంతో దీప్తి వదిన ఆఫీస్ నుండి మధ్యలోనే వచ్చేసింది మేము ద్వారకా లో ట్రైన్ దిగేటప్పటికి దీప్తి వదిన మాకోసం వచ్చింది. మేము ఇంటికి చేరేటప్పటికి రాము అన్నయ్య కూడా ఆఫీస్ లో పర్మిషన్ పెట్టి వచ్చేసాడు. అసలు వాళ్ళు చూపించిన ప్రేమ, ఆప్యాయత మా జీవితంలో మరువలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
 
 
ఆ రోజు సాయంత్రం అక్షరధాం చూద్దామని అనుకున్నాం. నేను ఇంతకుముందు ఢిల్లీ వెళ్ళినపుడు ఆ గుడి చూసాను. భార్గవి కి కూడా చూపించాలని రాము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి ఆ గుడికి వెళ్ళాము. మరుసటి రోజు పొద్దున్నే 10 గంటలకల్లా పోలాండ్ ఎంబసీ కి చేరుకున్నాం. వాళ్ళు ప్రామిస్ చేసినట్లుగానే మా అప్పాయింట్మెంట్ ని ముందుకు జరిపి ఒక గంటలోనే భార్గవి వీసా ని స్టాంప్ చేసి ఇచ్చారు. ఇక ఆరోజు సాయంత్రం ఫ్లైట్ కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేశాం

మార్చ్ 7 న బంధువులంతా మమ్మల్ని పంపించటానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. భార్గవి బయటకి వెళ్ళటం అదే మొదటిసారి కావటంతో వాళ్ళ అమ్మ నాన్నలకి కొంచెం బెంగగా అనిపించింది. మేము పోలాండ్ చేరేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది.ఆ రోజు సన్నగా వర్షం పడుతోంది. అప్పటికి మంచు కురవటం ఆగిపోయింది. కాని 2 రోజుల తర్వాత మళ్ళీ మంచు కురవటం మొదలైంది. మరుసటి 2 రోజులు శనివారం, ఆదివారం కావటంతో మేము అక్కడికి వెళ్ళాక ఇండియన్ మిత్రులతో పాటు పోలాండ్ మిత్రులు కూడా ఇంటికి వచ్చి వెళ్లారు. అప్పటికి మిగతా దేశాల్లో పూర్తిగా మంచు కురవటం తగ్గిపోయింది కేవలం పోలాండ్ లోనే ఏప్రిల్ వరకు కూడా మంచు కురిసింది. ఆదివారం మింజు జేర్జ్ లో ఉన్న కొన్ని ప్రదేశాలకి భార్గవిని తీసుకెళ్ళాను. మాతో పాటు శశి కూడా వచ్చాడు. శశి కి తెలుగు రావటంతో భార్గవి కూడా తనతో తెలుగులోనే మాట్లాడేది. మేము అక్కడ ఉన్నన్ని రోజులు శశి మాకొక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉన్నాడు.
 
 
రిలీజ్ సినిమాని బెనిఫిట్ షో చూడటంలో ఉన్న కిక్కే వేరు. ఊర్లో ఉన్నంతకాలం ప్రతి రిలీజ్ సినిమాకి బందరు లేదా గుడివాడ వెళ్ళిపోవటం అలవాటు.ధియేటర్ ముందు ఈలలు, కటౌట్లకి దండలు. అభిమానంతో కట్టే పెద్ద క్లాత్ బానర్లు (తర్వాత ఫ్లేక్సీలు వచ్చాయి) ధియేటర్ లో స్క్రీన్ మీద హీరో ఎంటర్ అవగానే ఎగరేసే పూలు, కాగితాలు. సినిమా బాగోకపోయినా బయటకి రాగానే హిట్ సూపర్ హిట్ అంటూ ఎగురుంటూ ధియేటర్ బయటకి రావటం, అబ్బో ఆ మజానే వేరు. హైదరాబాద్ వచ్చాక రిలీజ్ సినిమాలు చూసినా బందరు గుడివాడలో చూసిన కిక్ మాత్రం ఉండేది కాదు. పోను పోను బెనిఫిట్ షోలు పోయి కాలేజి రోజుల్లో మార్నింగ్ షోలు చూడటం మొదలైంది. ఇక ఉద్యోగస్తుడిని అయ్యాక అది కాస్తా సాయంత్రం 6 గంటల షో కి మారింది.

ఇక యూరప్ వచ్చి సంవత్సరం అయినా ఇక్కడ ధియేటర్ లో తెలుగు సినిమా చూసే భాగ్యం కలగలేదు. స్వీడన్ వెళ్ళినపుడు మాత్రం తమిళ్ సినిమా చూసాను. ఇక్కడ మన వాళ్ళు చాలా తక్కువ అవటంతో పోలాండ్ లో తెలుగు సినిమాలు రావు. పొరుగున ఉన్న జెర్మనీలో రిలీజ్ సినిమాలు వస్తాయి. సరిగ్గా వచ్చిన నెల రోజులకి ఎన్ టి ఆర్ నటించిన బాద్షా రిలీజ్. భార్గవి ఇండియాలో ఉంటే ఎన్ టి ఆర్ సినిమా ఎప్పుడూ మిస్ అయ్యేది కాదు. అందుకే తనకి సర్ ప్రైజ్ ఇవ్వాలని బాద్షా ఎక్కడ రిలీజ్ అవుతుందో అని చూసాను. ఏప్రిల్ 5 శుక్రవారం ఇండియా లో సినిమా రిలీజ్ అయింది. మాకు వీకెండ్ ఆదివారం కావటంతో ఏప్రిల్ 7 వ తేదిన జర్మనీ లో వివిధ నగరాల్లో షో ఉంది. మాకు దగ్గరగా ఉన్న నగరం బెర్లిన్. వెబ్ సైట్ లో కాంటాక్ట్ నెంబర్ చూసి కాల్ చేసాను. కృష్ణా జిల్లా కంకిపాడుకి చెందిన దండమూడి బాలాజీ, జర్మనీ లో ఎం ఎస్ చేయటానికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. అతనే అక్కడ తెలుగు సినిమాలు తీసుకువస్తూ ఉంటాడు. 12.30 నిమిషాలకి బెర్లిన్ లో FSK KINO లో షో ఉందని చెప్పాడు. KINO అంటే జర్మనీ భాషలో సినిమా. మునిచ్ ,నురేం బర్గ్, దుస్సేల్ ద్రూఫ్, హాంబర్గ్, ఫ్రాంక్ ఫర్త్, స్టుట్ గార్డ్ నగరాల్లో అదే సమయానికి కొంచెం అటుఇటు గా ఒక్కటే షో ఉంది. వీటన్నిటిని బాలాజీ తో పాటు ఆయా నగరాల్లో చదువుకునే కొంతమంది తెలుగు విద్యార్ధులు కూడా సపోర్ట్ చేస్తున్నారు.టికెట్ రేట్ 13 యూరోలు, మన వాళ్ళు వెంటనే ఆ అమౌంట్ ని రూపాయల్లోకి లేక్కవేసేసుకుని అమ్మో అంత పెట్టి సినిమాకి అవసరమా అనుకుని నెట్ లో పైరసీ ప్రింట్ చూసేసి మమ అనిపించేస్తారు. అసలు ఆ 13 యూరోలే చాలా తక్కువ అనిపించింది నాకు. శుక్రవారం ఇండియాలో సినిమా రిలీజ్ అవగానే మొదటి షో కల్లా వెబ్ సైట్ లో రివ్యూ వచ్చేస్తోంది. జర్మనీ లో ఆదివారం కాని సినిమా రాదు. ఈలోపు ఫ్లాప్ అని తెలిసిపోతే ఆ వచ్చే జనం కూడా ధియేటర్ కి రారు. ఏదో హాబి కోసం చెయ్యటమే తప్ప అక్కడ మన వాళ్ళ జనాభాకి ధియేటర్ లో సినిమా ప్రదర్శిస్తే కనీసం ఖర్చులు వస్తాయేమో తప్ప పెద్దగా లాభం అనిపించలేదు. ఒకరకంగా వారంతా మన తెలుగు సమాజానికి సేవ చేస్తునట్లే భావించాలి. కొన్ని సినిమాలకి ఖర్చులు కూడా రాలేదని బాలాజీ వాపోయాడు. ఇప్పటికీ జెర్మనీ లో సినిమా షెడ్యుల్ నాకు మెయిల్స్ వస్తూనే ఉంటాయి.

బెర్లిన్ నగరం నాకు పెద్దగా తెలియదు. నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ ని బెర్లిన్ వెళ్దాం అని అడిగాను. ఎలాగు వీకెండ్ ఈ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ, మేము కలిసి వెళ్దాం అనుకున్నాం. తనకి తెలుగు సినిమా చూపిస్తాను రమ్మని అడిగాం. కాని వాళ్ళకి వేరే పని ఉండటంతో మమ్మల్ని ధియేటర్ దగ్గర డ్రాప్ చేసి సినిమా అయ్యాక మళ్ళీ వస్తాం అన్నారు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 20 మంది తెలుగు వాళ్ళు అక్కడ నిలబడ్డారు. 4 ఫ్యామిలీలు ఉన్నాయి. మిగతా వాళ్ళంతా స్టూడెంట్స్.సినిమా మొదలయ్యే టప్పటికి మరో 10 మంది వచ్చారు. 40 మందితో చిన్న ధియేటర్ లో సైలెంట్ గా ఎన్ టి ఆర్ సినిమా చూడటం ఓ కొత్త అనుభవం. మాతో పాటు ఒక జర్మన్ కూడా సినిమా చూసాడు. మరి అతనికేం అర్ధం అయ్యిందో సినిమా మాకు అర్ధం కాలేదు. కామెడీ సీన్లో మేము నవ్వుతుంటే అతను మాత్రం సీరియస్ గా సినిమా చూస్తున్నాడు.సినిమా అయిపోయి బయటకి వచ్చేసరికి మార్చిన్ మాకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు
 
Dated : 16.08.2014

Sunday, July 27, 2014

తెలుగు వెలుగు విద్యార్థి

18 ఏళ్లకే ఫేస్బుక్ ని స్థాపించిన మార్క్స్ జుకర్ బెర్గ్ , కాలేజి రోజుల్లోనే గూగుల్ ని స్థాపించిన లారీపేజ్ ల గురించి ఆశ్చర్యంగా, అద్భుతంగా వర్ణించిన ఎన్నో కధనాలు మీరు చదివి ఉంటారు. కాని ఇవన్నీ సమాచార విప్లవం వచ్చాక గత 15 ఏళ్లలో జరిగిన విషయాలు. 60 ఏళ్ల క్రితం మన ఘంటసాల హైస్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధి తన 20 ఏళ్ల వయసులో స్థాపించిన ఓ మాస పత్రిక గురించి, 61 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఆ పత్రిక జైత్రయాత్ర గురించి , ఆ విద్యార్ధి గురించి రాయాలని చాలా సార్లు అనుకున్నాను..ఈ లింక్ చూడండి http://tinyurl.com/km8jcoy

Friday, March 28, 2014

నా ఐరోపా యాత్ర - 15 (స్వీడన్)



మరుసటి రోజున శరవణన్ కి ఆఫీస్ ఉండటంతో తను పొద్దుటే లేచి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. శశి , నేను తాపీగా రెడీ అయ్యి 10 గంటలకి శరవణన్ ఆఫీస్ కి చేరుకున్నాము. వాళ్ళ ఆఫీస్ అంతా తిప్పి చూపించాడు. మా తిరుగు ఫ్లైట్ ఆ రోజు సాయంత్రం కావటంతో సిటీ అంతా చూద్దామని శశి నేను బయలుదేరాం. అక్కడికి దగ్గరలోనే ఒక షిప్ మ్యూజియం ఉందని తెలియటంతో ముందుగా అది చూద్దామని బోటు ఎక్కాము. స్వీడన్ నగరం అంతా మధ్యలో సముద్రం వాటి మీద వంతెనలతో ఎంతో అందంగా ఉంటుంది.
పార్లమెంట్ దగ్గర 
 
నేను ఇంతకుముందు చెప్పినట్లు యాక్సెస్ కార్డు తో ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అయినా ప్రయాణం చెయ్యవచ్చు. అది ఉపయోగించి అక్కడున్న బోటు లో షిప్ మ్యూజియం కి చేరుకున్నాము. ఈ మ్యూజియం పేరు వాసా ముసీట్ (స్వీడిష్ భాషలో ముసీట్ అంటే మ్యూజియం). దీనికి ప్రవేశ రుసుము 200 స్వీడిష్ క్రోనాలు. ఈ నౌక వెనుక పలు ఆసక్తి కరమైన విషయాలు అక్కడున్న గైడ్ వివరించింది. 1626 లో స్వీడన్ రాజు Gaustav II Adolf పోలాండ్ మీద యుద్ధం చెయ్యటానికి ఒక యుద్ధనౌక ని నిర్మించాలని అనుకున్నాడు. దీనికోసం హెన్రీ అనే ఒక డచ్ ఇంజినీర్ ని నియమించాడు. స్టాక్ హోం షిప్ యార్డులో 1626 లో దీని నిర్మాణం ప్రారంభమై ఒక సంవత్సరం తరువాత 1627 సంవత్సరాంతానికి ఆ షిప్ నిర్మాణం పూర్తయ్యింది. దీనికిగాను టన్నుల కొద్దీ ఓక్ వృక్షాల కలపని వినియోగించారు.స్వీడన్లో విరివిగా లభించే రాగి మరియు ఇతర లోహాలని వినియోగించారు. ఈ నిర్మాణ కాలంలోనే షిప్ ఆర్కిటెక్ట్ అయిన హెన్రీ అనారోగ్యంతో మరణించాడు.మొత్తం 3 డెక్ లతో ఈ షిప్ నిర్మాణం జరిగింది. 1628 ఆగస్టు 10 వ తేదీన వాసా నౌక పోలాండ్ పై యుద్ధానికి బాల్టిక్ సముద్రపు జలాల్లోకి ప్రవేశించింది. కొన్ని వేలమంది స్వీడన్లు, మిగతా దేశాల అంబాసిడర్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడటానికి విచ్చేశారు. కాని అప్పుడే జరిగింది ఓ అనుకోని దురదృష్ట సంఘటన. సముద్రంలోకి ప్రవేశించిన 20 నిమిషాల్లోనే, అందరూ చూస్తుండగానే ఆ నౌక మునిగిపోయింది. కొన్ని వందలమంది అక్కడే జల సమాధి అయిపోయారు. ఏ లక్ష్యంతో అయితే ఆ నౌక ని వ్యయప్రయాసలకోర్చి నిర్మించారో అది నెరవేరకుండానే వాసా మునిగిపోయింది. ఇది స్వీడన్ కి కోలుకోలేని దెబ్బ.
 
 
అంత చిన్న దేశానికి ఆ ఖర్చుని తట్టుకొనే శక్తి అప్పటికి లేదు. అదీ కాకుండా మిగతా దేశాలముందు అవమానం. ఆగస్టు 27 నాటికల్లా Gaustav II Adolf ఈ ప్రమాదానికి సంభందించిన నివేదిక తెప్పించుకున్నాడు. నిర్మాణంలో లోపాలే కాకుండా, కెప్టెన్ తప్పిదము కూడా కారణమని తేల్చారు. ఈ ప్రమాదంలో బయటపడి ప్రాణాలు దక్కించుకున్న కెప్టెన్ హన్సన్ జైలు పాలయ్యాడు. ఆ నౌకలో ఉన్న కొన్ని ఫిరంగులను 1680 లో వెలికి తీసారు. అప్పటికే 50 సంవత్సరాలు అవటంతో షిప్ అంతా లోపల అంతా మట్టి పేరుకుపోయింది. ఆ తరువాత మళ్ళీ 1950 వరకు ఎవరూ దానిని పట్టించుకోలేదు. దాదాపు 333 సంవత్సరాల తరువాత ఆ నౌకని వెలికి తీయాలని స్వీడన్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా స్వీడిష్ నేవీ అధికారులు ప్రణాళిక తయారు చేసారు. అసలు అన్నేళ్ల తరువాత ఆ షిప్ యధాతధంగా ఉంటుందా అనే అనుమానాలు ఎదురయ్యాయి. మొత్తమ్మీద 18 లిఫ్ట్ ల సాయంతో 1959 సెప్టెంబర్ నాటికి సముద్రం అడుగునుండి 32 మీటర్ల ఎత్తుకి ఈ షిప్ ని లేపారు. అప్పటికే ఇనుము అంతా తుప్పు పట్టిపోయింది.ఇంకా 16 మీటర్లు పైకి లేపితే ఈ నౌక సముద్ర ఉపరితలం పైకి కనిపిస్తుంది. ఆ 16 మీటర్లు లేపటానికి మరో ఏడాది నర్ర పట్టింది. 
1961 ఏప్రిల్ 8 న మిగతా భాగాన్ని లేపటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మీడియా మొత్తం దీనిని కవర్ చేయటానికి స్టాక్ హోం చేరుకుంది. జరుగుతున్న ప్రక్రియ అంతా తమ కెమెరాల్లో బంధించారు. అంతిమంగా ఏప్రిల్ 24 న 333 ఏళ్ల తరువాత వాసా నౌక ప్రపంచానికి కనిపించింది.
 
వాసా మొదటిసారి ప్రపంచానికి కనిపించిన దృశ్యం
 
ఇక దానిని శుభ్రం చేయటానికే మరో ఏడాది పట్టింది. దీనికోసం హై ప్రెజర్ వాటర్ స్ప్రేయర్స్ ఉపయోగించారు. దాదాపు 40000 వస్తువులు ఈ నౌకలో లభించాయి. కాని విచిత్రమేమిటంటే 85 శాతం నౌక యధాతధంగా ఉంది. కలప పాడవటం కాని ముక్కలు అవటంగాని జరగలేదు. 333 ఏళ్ల క్రితం వేసిన పెయింట్ యధాతధంగా ఉంది. ఈ పెయింట్ లలో ఏమి ఉపయోగించారనే అంశం మీద ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి.
 
1961 నుండి 1988 వరకు తాత్కాలికంగా Wasavarvet అనే తాత్కాలిక మ్యూజియంలో ఈ షిప్ ని ఉంచారు. కాని సందర్శకులకి షిప్ మొత్తాన్ని ఒకేసారి చూడటం వీలయ్యేది కాదు.అలా అని ఈ షిప్ ని తరలించటం కష్ట సాధ్యమైన పని. అందుకోసమని 1981 లో స్వీడన్ ప్రభుత్వం ఈ షిప్ ఉన్న చోటునే ఉంచి దాని చుట్టూ మ్యూజియం నిర్మాణాన్ని ప్రారంభించింది.1990 నాటికి అది పూర్తయ్యి సందర్శకులకి అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక మినీ ధియేటర్ ఉంది. ఈ షిప్ వెలికి తీసిన 1968 నాటి దృశ్యాలు మరియు ఈ నౌక సమగ్ర చరిత్ర అంతా 20 నిమిషాల పాటు ప్రదర్శిస్తారు.కాని నిజంగా అన్నేళ్ల తరువాత కూడా ఆ షిప్ ని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. 2011 లో అత్యధికంగా టూరిస్టులు దీనిని దర్శించారు.అక్కడినుండి బయటకి రాగానే ఎదురుగా నోర్డికా ముసీట్ అనే మరో మ్యూజియం ఉంది. మాకు సమయం లేకపోవటంతో అక్కడినుండి ట్రాము ఎక్కి స్వీడన్ పార్లమెంట్ భవనం చేరుకున్నాం. ఇది చాలా పెద్దది, అక్కడినుండి అన్నీ చూసుకుంటూ శరవణన్ ఆఫీసుకి వెళ్లి పక్కనే ఉన్న ఇటాలియన్ రెస్టారెంటులో పిజ్జా తిని అందరం నడుచుకుంటూ స్వీడన్ సిటీ హాలుకి వెళ్ళాము.నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేసే హాలులో ఉన్నామన్న ఊహే అద్భుతంగా అనిపించింది.
 
 
​నోబెల్ బహుమతి ప్రదానం చేసే సిటీ హాల్ 
 
అక్కడినుండి మెట్రోలో బయలుదేరి బస్సు స్టేషన్ కి చేరుకున్నాము.మా పర్యటనలో శరవణన్, అన్బు మరియు వారి మిత్రులు చూపించిన ఆదరణ మరువలేనిది. స్వీడన్ జ్ఞాపకాలన్నీ పదిలంగా దాచుకుంటూ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాము. 6.30 నిమిషాలకి స్కవస్తా ఎయిర్ పోర్ట్ నుండి పోజ్ నాన్ కి బయలుదేరాము. 

ఇప్పటిదాకా నా ఐరోపా యాత్ర అంతా నేను బ్రహ్మచారిగా ఉన్న సమయంలోనే సాగింది. తరువాత నేను పర్యటించిన ఇటలీ, లిచెన్ స్టైన్, స్విట్జెర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, జర్మనీ దేశాలన్నీ 2013 ఫిబ్రవరిలో నాకు వివాహం అయ్యాక నా శ్రీమతి భార్గవితోనే ప్రయాణించాను.

వచ్చేవారం -  బాద్షా సినిమా కోసం మా బెర్లిన్ ప్రయాణం.

Friday, March 21, 2014

నా ఐరోపా యాత్ర - 14 (స్వీడన్)


మరుసటి రోజు సెలవు కావటంతో శరవణన్ నాకు, శశి కి నగరాన్ని చూపించటానికి బయలుదేరాడు. ఆ రోజు బాగా చలిగా ఉంది , ఉష్ణోగ్రత - 2 డిగ్రీలు గా చూపిస్తోంది. నవంబర్ నెల కావటంతో అప్పుడప్పుడే చలికాలం మొదలవుతోంది. స్వీడన్ లో కార్ల కంటే వాటిని మెయిన్ టైన్ చెయ్యటం చాలా ఖరీదు. ఫ్రీ పార్కింగ్ అనేది ఎక్కడా ఉండదు. పని చేసే ఆఫీసుల్లో సైతం పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే. కాలుష్యాన్ని అరికట్టటానికి , అలాగే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎక్కువ వినియోగించేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యల్ని తీసుకుంది. ఎక్కడ చూసినా బోర్డులు అన్నీ స్వీడిష్ భాషలోనే ఉన్నాయి. కాని స్వీడన్ వాళ్ళకి ఇంగ్లీష్ బాగానే వచ్చు. బస్సు డ్రైవర్స్ కూడా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐరోపా దేశాల వారికి తమ భాష అంటే ప్రాణం. ఇతర భాషలన్నీ అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తారు. కంప్యూటర్స్ అన్నీ స్థానిక భాషలోనే ఉంటాయి. మిగతా దేశాల విద్యార్ధులు, ఉద్యోగస్తులు మాత్రమే ఇంగ్లీష్ కంప్యుటర్ని వాడతారు. స్వీడన్ జనాభా మొత్తం 9 మిలియన్లు. అంటే మన రాష్ట్ర జనాభాలో 10 వ వంతు కంటే తక్కువే.మేము యూనివర్సిటీ మెట్రో స్టేషన్లో ఎక్కి 6 స్టేషన్ల తర్వాత దిగి బస్సు ఎక్కాము. ఆరోజు సన్నగా చిరుజల్లులు కూడా పడుతున్నాయి. సినిమా సాయంత్రం 6 గంటలకి కావటంతో కొంచెం సేపు టైం పాస్ చేద్దామని ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళాము. అందరూ ఉండటంతో సరదాగా బౌలింగ్ ఆడాము.
 
​శశి తమ్ముడు శరవణన్ తో పాలస్ దగ్గర 
 
స్టాక్ హోం చాలా ఖరీదైన నగరం. ఆహార పదార్ధాలు, వస్తువుల రేట్లన్నీ పోలాండ్ తో పోలిస్తే రెండింతలు ఉన్నాయి. చిన్న పాప ని ట్రాలీ లో తీసుకు వెళుతూ ఒక తెలుగు ఫామిలీ కనిపించారు. ఏదో సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ నిమిత్తం ఆయన అక్కడికి వచ్చారట.ఇక సాయంత్రం కాగానే అక్కడికి కొద్ది దూరంలో ఉన్న సినిమా థియేటర్ కి వెళ్ళాము. టికెట్ ధర 50 స్వీడిష్ క్రోనాలు ( 1 క్రోనా = 9 రూపాయలు.) ఎటు చూసినా తమిళ వాసనే. కాని ఎందుకో ఆ జనాలేవరూ మన దేశపు తమిళుల్లా అనిపించలేదు. కాని శరవణన్ చెప్పాడు, వాళ్ళంతా శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ తమిళులు అని. ఎక్కడున్నా తమిళులు అంతా ఒక్కటే. ఆ దేశం ఈ దేశం అనే బేధ భావాలు వారికి ఉండవు. కలిసున్నా మనమే ప్రాంతీయ విద్వేషాలతో రగిలిపోతున్నాం. ఎక్కడో వేరే దేశంలో ఉన్న వారి కోసం కూడా మన దేశ తమిళులు పోరాడుతున్నారు. ఎల్ టి టి ఈ ని సమర్ధిస్తూ థియేటర్ లో పోస్టర్లు కనిపించాయి. ఎల్ టి టి ఈ కి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చేది నార్వే, స్వీడన్లలో స్థిరపడ్డ తమిళులే. సినిమా చూస్తునంత సేపు తమిళనాడులో ఏదో మారుమూల టూరింగ్ టాకీస్ లో చూస్తున్న అనుభూతి కలిగింది.
 
సినిమా ముగిశాక ఆ రోజుకి మా ప్రోగ్రాం ముగించుకుని ఇంటికి చేరుకున్నాము. మేము ఇంటికి వెళ్ళగానే నాగార్జున వచ్చి కలుసుకున్నాడు.చాలా కాలం తరువాత ఒక తెలుగు వ్యక్తి తో నేరుగా మాట్లాడాను. నాగార్జునది  గన్నవరం. ఇంజినీరింగ్ మదురైలో చదివి ఎం ఎస్ కోసం ఇక్కడికి వచ్చాడు. 
వోల్వో, ఎరిక్ సన్, స్వాన్ స్కా, స్కైప్, ఐకియా, హె అండ్ ఎం, ఎలక్ట్రోలక్స్, భోఫోర్స్ లాంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకి పుట్టిల్లు స్వీడన్. మేము బస్సు లో వెళుతుండగా ఎరిక్సన్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ కనిపించాయి.  ​డైనమైట్‌ను కనుగొని మానవాళికి ఎంతో మేలు  ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ జన్మించింది ఈ నగరం లోనే. ఒక పాత స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు.  బోఫోర్స్ అనగానే మనకి కోట్ల కుంభకోణం గుర్తుకు వస్తుంది. ​మన నాయకుల అవినీతి, ఇప్పటికీ బయటపడని కోట్ల దోపిడీ గుర్తొస్తుంది. కానీ బోఫోర్స్ శతఘ్నులు లేకపోతే అలనాడు కార్గిల్ యుద్దాన్ని మనం జయించలేకపోయేవారమన్న నిజం చాలామందికి తెలియదు. 90 డిగ్రీల వాలులో పేలే శతఘ్ని ప్రపంచంలో అదొక్కటే.ఈయన పేరు మీదే నోబెల్ శాంతి బహుమతి ప్రతి ఏటా ఇస్తారు. మన దేశం నుండి మొట్టమొదటి సారి ఈ బహుమతి అందుకున్న వ్యక్తి  ​విశ్వకవి రవీంద్రనాధ్ ఠాకూర్. 1913 లో ఆయనకి ఈ పురస్కారం లభించింది.  నిజానికి యూరోపియన్ దేశాలకి చెందని రచయిత మొదటిసారిగా సాహిత్యపు బహుమతిని అందుకున్న మొదటి సందర్భం ఇదే. కాని అది అందుకోవటానికి ఆయన ఇక్కడికి రాలేదట. మరుసటి రోజున శశి , నేను, శరవణన్ కలిసి Drottningholm పాలస్ కి వెళ్ళాము. ఇది ఒకప్పుడు స్వీడన్ రాజులు నివసించిన భవంతి. ఇప్పుడు అక్కడ  లేదు. కేవలం సందర్శనీయ స్థలం మాత్రమే.
 
 
ఆ కట్టడాల్లో భారీతనం,యూరోపియన్ శైలి లో ఉన్న నిర్మాణాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆరోజు దీపావళి కావటంతో అక్కడున్న శ్రీ కృష్ణ టెంపుల్ లో ఇండియన్స్ అంతా కలిసి దీపావళి సెలెబ్రేట్ చేస్తున్నారని తెలిసింది. అక్కడినుండి మెట్రోలో మరో గంట ప్రయాణించి ఆ టెంపుల్ కి చేరుకున్నాం. టెంపుల్ అంటే మన దేశంలో లాగా కాదు. ఒక చిన్న ఇంటిలో దేవుడి విగ్రహాలని పెట్టి పూజిస్తూ ఉంటారు. కొంచెం సేపు అక్కడ గడిపి చీకటి పడటంతో తిరిగి మళ్ళీ రూముకి బయలుదేరాము.