Friday, December 26, 2014

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం. మన దేశం తర్వాత నేను నివసించటానికి అత్యంత ఇష్టపడే ప్రాంతం ఇది. నేను యూరప్ లో కొంత కాలం నివసించినా నాకు దుబాయ్ అంటేనే ఎక్కువ ఇష్టం. నేను తొలిసారి చూసిన విదేశం దుబాయ్. అందుకేనేమో ఈ దేశం అన్నా ఇక్కడి ప్రభుత్వ విధానాలన్నా నాకు అమితమైన ఇష్టం , ఆసక్తి . మొత్తంగా నేను ఈ దేశంలో నివసించింది 4 సంవత్సరాలు. మూడు జాతీయ దినోత్సవాలని ఈ దేశంలో చూశాను. ఈరోజు డిసెంబర్ 2 , 2014 న జరుపుకుంటున్న ఈ దేశపు 43 వ జాతీయ దినోత్సవం నేను చూస్తున్ననాలుగవది. మన దేశంలోనూ , ఇక్కడా కొన్ని సారూప్యత కలిగిన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు, గతంలో ఆ రెండూ సమైక్యంగా ఉన్నప్పటి పరిస్తితులు, మళ్ళీ విడిపోవటానికి కారణాలు, ఇక్కడి పరిస్థితులకి కొంత సారూప్యంగాఉంటాయి. అందులో ఒకటి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వివాదాలుగా మారుతున్న పేర్ల వివాదం. మన భారత దేశం లో , అలాగే తెలుగు రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా ప్రభుత్వ భవనాలకి, రోడ్లకి నాయకుల పేర్లు పెట్టే సంస్కృతి ఉంది. నిర్మించిన ప్రతి భవనానికి, ప్రతి హైవే కి ప్రభుత్వమే పేర్లు పెడుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం కాదు కనుక నిర్ణయాధికారం రాజు దే. ఆందోళనలు , ప్రజల మనోభావాలు లాంటి పదాలు ఇక్కడ వినిపించవు. అలా అని ప్రజా వ్యతిరేక విధానాలు కూడా కనిపించవు. ఈ అంశం గురించి చెప్పేముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి కొంత చెప్పాలి.ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. 1970 కాలంలో దుబాయి, ఆబుధాబి, షార్జా, ఆజ్మాన్, ఉమ్మాల్ ఖ్వాయిస్, ఫుజిరా, రాస్ అల్ ఖైమాలు వేర్వేరు జెండాలు, వేర్వేరు విధానాలతో విభిన్న తెగలకు చెందిన రాజులు పరిపాలిస్తున్న వేర్వేరు దేశాలు.ఈ రాజ్యాలన్నీ కూడా కీలకమైన అరేబియా సముద్ర తీరంలో ఉన్నాయి. అన్ని దేశాలకూ రేవు కేంద్రాలు ఉన్నాయి. కొందరి వద్ద చమురు సంపాదన ఉండగా మరికొందరి వద్ద లేదు. 1971లో రాస్ అల్ ఖైమా మినహా మిగిలిన దేశాలన్నీ కలిసి సమైక్యంగా సమాఖ్య రూపంలో ఉండడానికి తీర్మానం చేసుకొన్నాయి (మరుసటి సంవత్సరం రాస్ అల్ ఖైమా కూడా చేరింది). ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాల వరకు ఒక ఎమిరేట్ నుంచి మరో ఎమిరేట్‌కు వెళ్ళడానికి పాస్‌పోర్టు అవసరమయ్యేది.
ఏడు ఎమిరేట్లు వేర్వేరుగా ఉన్నప్పుడు సరిగ్గా రహదారులు లేని ఎడారి ప్రాంతాలు, సమైక్యంగా మారిన తర్వాత వాటి దశ, దిశ తిరిగిపోయింది.అనూహ్య అభివృద్ధి సాధించడానికి ఏడు రాజ్యాలు కూడా పరస్పరం గౌరవించుకోవడం, వనరుల పంపిణీలో సమ న్యాయం ప్రధాన కారణాలు.ఈ పరస్పరంగౌరవించుకోవడం గురించే ఇప్పుడు చర్చ. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. ఎవరీ షేక్ జాయేద్ ? ప్రస్తుతం అబుదాబి రాజు షేక్ ఖలీఫా తండ్రి. ఈయనే మిగతా ఆరు రాజ్యాలతో కలిసి సమాఖ్యగా ఉండాలని అందరిని ఒప్పించి ఒక దేశంగా ఏర్పరిచాడు. ఈ రోడ్డు దుబాయ్ లో ఉన్నంత మేరా దానిపేరు షేక్ జాయేద్ రోడ్డు. ఎప్పుడైతే అబుదాబి సరిహద్దులు మొదలవుతాయో అక్కడినుండి ఈ రోడ్డు పేరు షేక్ రషీద్ రోడ్డు. ఎవరీ షేక్ రషీద్ ? ప్రస్తుత దుబాయ్ రాజు తండ్రి షేక్ రషీద్. దుబాయ్ లో నిర్మించిన ప్రపంచంలో ఎత్తైన భవనం పేరు బుర్జ్ ఖలీఫా. అబుదాబి ప్రస్తుత రాజైన షేక్ ఖలీఫా పేరుని ఆయన చేసిన సహాయానికి ప్రతిఫలంగా మాత్రమే కాదు,ఆయన మీద గౌరవముతో దుబాయ్ రాజు తమ ప్రాంతంలో ఉన్న భవనానికి పెట్టారు. ఇటీవల అబుదాబి లో నిర్మించిన 2 టవర్ల కి షేక్ రషీద్ టవర్స్ అని దుబాయ్ రాజు పేరుని అబుదాబి ప్రభుత్వం పెట్టింది. ఇవే కాకుండా షార్జా లో చాలా రోడ్లకి, వీధులకి దుబాయ్ , అబుదాబి నాయకుల పేర్లు ఉంటాయి. అలాగే షార్జా నాయకుల పేర్లు కూడా ఇతర ఎమిరేట్ లలో కనిపిస్తాయి. ఎప్పుడైతే పక్కవారి గొప్పతనాన్ని గుర్తించే ఔన్నత్యం మనకుంటుందో మన గొప్పతనాన్ని ఇతరులు గుర్తిస్తారు. ఎప్పుడయితే ఆత్మగౌరవం దెబ్బతిని దానికి విఘాతం కలుగుతుందో అప్పుడు వేర్పాటు ఉద్యమం ఊపందుకొంటుంది.1972 లో ఒక్కటిగా కలిసిన ఈ ఏడు ఎమిరేట్స్ లో మూడు మాత్రమే (అబుదాబి , షార్జా , దుబాయ్ ) ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన ఆబుధాబి రాజ్యం యావత్తు ప్రపంచం నుంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో దానికి అనుకొని ఉన్న షార్జా , దుబాయ్ ఎమిరేట్లు లాభపడినా ఏనాడూ కూడా మిగతా నాలుగు ఎమిరేట్స్ ఈ సమాఖ్య నుంచి వేరుగా ఉండాలని ఏమాత్రం కోరుకోకపోవడానికి కారణం వారి హక్కులు, అభివృద్ధి వాటాలో ఏ మాత్రం లోటులేకపోవడం. 60 ఏళ్ళు కలిసున్న సమైక్య రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పని చేసిన ఒక వ్యక్తి పేరుని కొత్త రాష్ట్రం లో ఒక టెర్మినల్ కి పెడితేనే ఓర్చుకోలేని కురచ దృక్పధాలున్న మన నాయకులు ఇక్కడి సంస్కృతిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే అవశేష రాష్ట్రంలో కూడా ప్రాంతాలకతీతంగా సాటి తెలుగు నాయకుల పేర్లు పెట్టడం కూడా అవసరం. చిత్తూరులోని మదనపల్లె వైపు ఉన్న పరిస్థితులకు, నగరి వైపు ఉన్న పరిస్థితులకు తేడా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు వైపు పరిస్థితులకు, ఆదిలాబాద్ వైపు పరిస్థితులకు వ్యత్యాసం ఉన్నది. కేవలం జిల్లాస్థాయి ప్రాంతాల్లోనే తేడాలు ఉన్నప్పుడు వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దేశాల్లో తేడాలు ఉండడం సహజం. వాటన్నిటిని అధిగమించి 43 సంవత్సరాలుగా సమైక్య స్పూర్తిని కొనసాగిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు.
Date
02.12.2014