Tuesday, November 24, 2015

నా ఐరోపా యాత్ర - 29 ( చెక్ రిపబ్లిక్ )

హైదరాబాద్ లో ఎర్రగడ్డ గోకుల్ ధియేటర్ ఎదురుగా రోడ్డులోకి వెళితే జెక్ కాలనీ అనే ఒక ప్రాంతం కనిపిస్తుంది. అసలు జెక్ కాలనీ వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా సిటీలో కలిసిపోయింది కాని ఒకప్పుడు ఇది సిటీ శివారు ప్రాంతం. అశోక్ లేలాండ్ , ఆల్విన్ , ఆస్బెస్టాస్ లాంటి ఎన్నో పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఉండేవి. దానికంటే ముందు నిజాం కాలంలో ఒక మందుగుండు ఫాక్టరీ ఇక్కడ ఉండేది. ఆ ఫాక్టరీ నిర్మాణ నిమిత్తం జెకోస్లోవేకియా దేశం నుండి ఇంజినీర్లని ఇక్కడికి పిలిపించారు. పిస్తోళ్ల తయారీకి చెకోస్లోవేకియా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే తుపాకులు ప్రపంచం నలుమూలలకీ ఎగుమతి అవుతాయి. బహుశా అందుకే నిజాం నవాబు వారిని ఇక్కడికి పిలిపించి ఉండవచ్చు. ఆ ఫాక్టరీ నడిచినంత కాలం ఆ దేశం నుండి వచ్చిన ఇంజినీర్ల కోసం 50 బంగ్లాలు నిర్మించి ఒక కాలనీగా ఏర్పాటు చేసారు. విశాలమైన రోడ్లు , పార్కులతో కాలనీ ని అందంగా తీర్చిదిద్దారు. కాల క్రమేణా ఆ ఫాక్టరీ మూతబడటంతో ఆ దేశస్థులంతా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు. చాలా కాలం వరకు ఆ బంగ్లాలు అలాగే ఉన్నాయి. కాలక్రమేణా అవన్నీ కూల్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు.ఆ జెక్ కాలనీ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదీ మనకి జెక్ రిపబ్లిక్ కి ఉన్న అనుభంధం.

 మే 6 వ తేదీన మా పర్యటన ముగించుకు వచ్చాక మళ్ళీ మే 11 వ తేదీన వీకెండ్ కావటంతో చెక్ రిపబ్లిక్ వెళదామని నిర్ణయించుకున్నాం. మార్చిన్ , కాషా కూడా ఆ దేశాన్ని చూడలేదు. ఒకప్పుడు ఈ దేశం పేరు చెకోస్లోవేకియా.1918 లో ఆస్ట్రియన్ హంగరీ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొంది చెకోస్లోవేకియా గా అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల చేతుల్లో ఉంది. యుద్ధానంతరం సోవియట్ యూనియన్ తో కలిసి కొనసాగింది 1989 లో సోవియట్ యూనియన్ పతనం తరువాత స్వతంతరంగా అవతరించి 1993 లో శాంతియుతంగా రెండు దేశాలుగా విడిపోయింది. భూబాగంతో పాటు పేరుని కూడా సమానంగా పంచుకుని చెకోస్లోవేకియా నుండి చెక్ రిపబ్లిక్ , స్లోవేకియా అనే రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. మేము ఇప్పుడు వెళ్ళబోతోంది అక్కడికే. మేమున్న మింజు జేర్జ్ నుండి ప్రాగ్ 360 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా వెళితే 4 గంటల ప్రయాణం. ఒక్కరోజులోనే వెళ్లి వద్దామని అనుకున్నాం. చెక్ కరెన్సీ పేరు క్రోనా. మన డబ్బుల్లో ఒక క్రోనా కి 2.50 రూపాయలు వస్తాయి. అదే ఒక యూరో కి 27 క్రోనాలు వస్తాయి.ఆరోజు ఉదయం త్వరగా బయలుదేరినా సగం దూరం వెళ్ళేటప్పటికి వర్షం మొదలైంది. వేరే ఇతర దేశాల వాహనాలు చెక్ రిపబ్లిక్ లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి. దారిలో ఉండే అన్ని పెట్రోల్ బంక్స్ లో ఇవి ఉంటాయి.

మేము వెళుతున్న దారిలోనే స్కోడా కార్ల ఫాక్టరీ కనిపించింది. మనం వాడే స్కోడా కార్లకి పుట్టినిల్లు ఈ దేశమే. దారిలో ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ మధ్యలో ఆగి అక్కడి పొలాలు , ఇళ్ళ మధ్య ఫొటోస్ తీసుకుంటూ వెళుతున్నాం. మధ్యలో ఒక చోట చిన్న రైల్వే క్రాసింగ్ వచ్చింది. అది ఆ దేశపు లోకల్ ట్రైన్ అనుకుంటా , మన ఊటీ లో తిరిగే చిన్న ట్రైన్ లా ఉంది. దాదాపు 4 గంటల 30 నిమిషాలు ప్రయాణించాక ప్రాగ్ చేరుకున్నాం. 1100 ఏళ్ల ఈ పురాతన పట్టణాన్ని స్థానికులు ప్రాహా అంటారు. జనాభా పదమూడు లక్షలు. ఇది చెక్ దేశంలోని అతిపెద్ద నగరం. మొదటి ప్రపంచ యుద్ధానంతరం చెకోస్లోవేకియాకి రాజధాని అయింది. స్లోవక్, చెక్ అధికారిక భాషలు. స్లోవక్ చెక్‌భాషలోని ఓ మాండలీకం. నలభై శాతం మంది దాన్నే మాట్లాడతారు.అసలు ఇక్కడ నిరుద్యోగమే లేదట. ముందు మా కార్ ని ఒక చోట భూగర్భంలో పార్క్ చేసేసాం.పార్కింగ్ ఖరీదు 180 క్రోనాలు.అక్కడికి దూరంగా ప్రాగ్ కేజిల్ కనిపిస్తోంది. దీని పేరు హ్రాడ్‌కని. పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించుకున్న వెయ్యి సంవత్సరాల ఈ కోట యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.

ప్రాగ్ మధ్యలో వ్లటావ నది ప్రవహిస్తుంది.ఆ నదికి రెండు వైపులా నగరం ఉంది. మేము ఆ ప్రాగ్ కాజిల్ కి ఇవతలి ఒడ్డున ఉన్నాం. దానిని చేరుకోవాలంటే వ్లటావ నదిని దాటాలి.చెక్ రిపబ్లిక్‌లో ఉత్తరం వైపు నుంచి ప్రవహించే అతి పొడవైన నది వ్లటావా. ఇది నాలుగు వందల ముప్ఫై కిలోమీటర్లు ప్రయాణించాక, మెల్‌నిక్ అనేచోట ఎల్బీ నదిలో కలుస్తుంది. వ్లటావా నది మీద 31 వంతెనలున్నాయి. వాటిలో అతి పురాతనమైనది చార్లెస్ బ్రిడ్జి. మేము ఛార్లెస్ బ్రిడ్జి మీదుగానే వ్లటావా ని దాటి అవతలకి వెళ్ళాలి. బొహీమియన్ శాండ్‌స్టోన్‌తో పూర్తయిన దీన్ని మొదట్లో స్టోన్‌బ్రిడ్జి లేదా ప్రాగ్ బ్రిడ్జి అనేవారు. పాతరోజుల్లో గుడ్డు సొనని సున్నంలో కలిపి దీన్ని నిర్మించారు. 1870 నించి మాత్రమే దీన్ని చార్లెస్ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. బ్రిడ్జి ఫెన్సింగ్ రాడ్లకి వేసిన వందలకొద్దీ తాళాలు చూసి నవ్వుకున్నాం. పారిస్ లో సీన్ నది ఒడ్డున కూడా ఇలాంటి తాళాలు చూసాం. వీటిని ‘లాక్స్ ఆఫ్ లవ్’ అంటారు. ప్రేమికులు ఇక్కడ తాళాలు వేస్తే వారి ప్రేమ సఫలీకృతం అవుతుందనే ఇక్కడివాళ్ళు నమ్ముతారు.1621 లో నరికిన మనుషుల తలలని ఈ బ్రిడ్జి మీద ఉంచి, చెక్ తిరుగుబాటుదారులు ప్రాగ్ కేజిల్‌కి రాకుండా ఆనాటి రాజు భయభ్రాంతులకి గురిచేశాడు. 1648లో స్వీడిష్ సైన్యం దాడి చేసినప్పుడు, ఈ బ్రిడ్జి మీద యుద్ధం చేయగా కొంత దెబ్బతింది. పూర్వం సైనికులు దీనిమీద నించి శత్రుసైన్యం వస్తోందేమోనని కాపలా కాసేవారు. ఎందుకంటే కోటలోకి ఈ బ్రిడ్జి మీద నించే వెళ్లాలి.ఇప్పుడు మేము కూడా ఈ బ్రిడ్జి మీదుగానే కోట లోకి వెళుతున్నాం.

ప్రాగ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు మాత్రం బావున్నాయి. ట్రాము , బస్సులతోపాటు వ్లటావ నదిలో బోట్లు కూడా ఉన్నాయి. బ్రిడ్జి దాటి అవతలకి చేరుకున్నాక కొంత ఎత్తైన ప్రాంతంలోకి వెళ్లి ఎదురుగా ఉన్న ఓ గేటులోంచి లోపలకు నడిచాం. ఆ గేటుకి అటూ ఇటూ నీలం యూనిఫామ్‌లో ఇద్దరు గార్డులు అటెన్షన్‌లో నిలబడి ఉన్నారు. గంటకోసారి ఇక్కడ జరిగే చేంజ్ ఆఫ్ గార్డ్స్ సెరమనీని పర్యాటకులు ఉత్సాహంగా గమనిస్తారు. ఆ గేట్ దాటి లోపలకి వెళ్తే ఎదురుగా పెద్ద కోర్ట్ యార్డ్. మధ్యలో ఓచోట ఆనాటి బావి. దాన్ని ఐరన్ మెష్‌తో మూసేశారు. దాని ఎదురుగా స్త్రీల ప్రాచీన మోనాస్ట్రీ, కుడివైపు 12వ శతాబ్దంలో నిర్మించిన రోమనెస్క్యూ ప్యాలెస్, ఎడమవైపు సెయింట్ వైటస్ కెథడ్రిల్ ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇక్కడే నివసిస్తున్నాడు. ప్రాగ్ లో అధ్యక్షుడు లేకపోతే ఆ భవనం పై జెండా ఉండదట.

అలాగే నడుచుకుంటూ వెనుక భాగాన ఉన్న సెయింట్ వైటస్ కెథడ్రిల్లోకి నడిచాం. అసలు ఎంత పెద్ద నిర్మాణం అది. మాకు తల ఎత్తి చూస్తే అసలు ఏమీ కనపడట్లా.దీని నిర్మాణం పూర్తవడానికి ఆరు వందల యేళ్లు పట్టిందట. 1344 లో చార్లెస్ IV దీని నిర్మాణాన్ని చేపట్టాడు. పదో శతాబ్దానికి చెందిన రొటుండా అనే భవంతిని పడగొట్టి, ఆ స్థలంలో ఈ కెథడ్రిల్ కట్టారు.  ఇది చెకోస్లోవేకియాలోని అతిపెద్ద చర్చి. దీన్ని గోథే ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. చెక్ రాజుల పట్టాభిషేకాలన్నీ ఇక్కడే జరిగాయి. సెయింట్ వెన్‌సెస్‌లాస్ మృతదేహాన్ని ఖననం చేశారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. చెక్‌ని పాలించిన చార్లెస్ IV, ఆయన నలుగురు భార్యలు ఇక్కడే సమాధి చేయబడ్డారు. నవంబర్ 1344లో దీన్ని తెరిచారు. ఇది రాజుల పట్టాభిషేకానికి, సమాధులకి, రాజవంశీయుల ఆభరణాలని దాచడానికి ప్రధానంగా ఉద్దేశించబడింది.బొహీమియన్ రాజులు పట్టాభిషేక సమయంలో ఉపయోగించిన బంగారు ఆభరణాలు భద్రపరిచిన క్రౌన్ చాంబర్‌ ఇందులోనే ఉంది . ఆ గది తలుపులు తెరవడానికి ఎనిమిది తాళం చెవులు అవసరం అవుతాయి. చెక్ అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ మొదలైన ఎనిమిదిమంది దగ్గర ఈ తాళం చెవులు ఉంటాయి. వారంతా వస్తే కాని ఆ తలుపు తెరిచేందుకు వీలుపడదు.

కోట వెనక భాగంలోంచి కిందకి దిగి ఓ చిన్న సందులోకి వెళ్లాం. దాన్ని గోల్డెన్ లేన్ అంటారు. 15వ శతాబ్దానికి చెందిన ఈ లేన్‌ని చూడటానికి పర్యాటకులు వస్తూండటంతో దాని యజమానులు తమ ఇళ్లు అపూర్వమైనవని గ్రహించి, వాటిని ఫర్నిచర్‌తో, రంగులతో అలంకరించి, కొన్ని నాణాలని తీసుకుని పర్యాటకులకు తమ ఇళ్లని చూపించసాగారు.1953లో చెకోస్లోవేకియా అధ్యక్షుడి కార్యాలయం, గోల్డెన్ లేన్‌లోని ఇళ్లన్నిటినీ కొనేసింది.
కొంతదూరం వెళ్లాక ఓ ఇరుకైన సందు ఉంది , అది ప్రపంచంలోని అతి చిన్న పాదచారుల సందు. ఒకళ్లు వెళ్తే ఇంకొకరు రాలేనంత చిన్న సందు కాబట్టి అక్కడ ట్రాఫిక్ లైట్లని అమర్చారు. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మాత్రమే వెళ్లాలి. లేదంటే మనిషి ఎదురొస్తాడు.మేము వెళ్ళగానే రెడ్ లైట్ ఉండటంతో కాసేపు ఆగాము. అక్కడి నుండి మళ్ళీ చార్లెస్ బ్రిడ్జి మీదుగా  నడుస్తూ టౌన్‌హాల్ స్క్వేర్‌కి చేరుకున్నాం. టౌన్‌హాల్ టవర్‌కి దక్షిణ గోడ దగ్గర 1410లో అమర్చిన ఓర్లోజ్ (ఆస్ట్రొనామికల్ గడియారం) ఉంది. ప్రపంచంలో ఉన్న అలాంటి మూడు గడియారాల్లో ప్రస్తుతం పనిచేసేది ఇదొక్కటే. టవర్ పైన ఉన్న ఈ డయల్ ఆకాశంలోని సూర్యచంద్రుల పొజిషన్‌ని, ఇతర ఖగోళ వివరాలని తెలియజేస్తుంది. కింద ఉన్న క్యాలెండర్ డయల్ నెలని చూపిస్తుంది. 14వ శతాబ్దంలో ప్రాగ్‌ని భూమికి కేంద్రంగా విశ్వసించేవారు. ఆ గడియారం మన సాలార్‌జంగ్ మ్యూజియమ్‌లో బొమ్మ బయటికి వచ్చి గంటలు కొట్టే లాంటి గడియారమే. ప్రాగ్ అంతా మరో పారిస్ లా అనిపించింది. కాకపొతే పారిస్ రాచరికంతో పాటు కొంత ఆధునిక ప్రపంచం కూడా కనిపిస్తుంది. ప్రాగ్ లో అన్నీ పాత వాసనలే ఉన్నాయి. మేము ఇవన్నీ తిరుగుతూ అసలు సమయం కూడా చూసుకోలేదు అప్పటికే సాయంత్రం 8 గంటలు అయ్యింది.అక్కడే కె ఎఫ్ సి లో డిన్నర్ కానిచ్చ్చేసి మళ్ళీ పోలాండ్ వైపు పయనమయ్యాం.



Saturday, November 21, 2015

నా ఐరోపా యాత్ర - 28 (నెదర్లాండ్స్)

ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు మాత్రమే కాదు, స్వలింగ సంపర్కులకి సంభందించిన ఏదో ముఖ్యమైన రోజు. అక్కడున్న మీటింగ్ పాయింట్ దగ్గర మగవాళ్ళంతా చేరి ఒకళ్ళనొకళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు. కొంతమంది బిగ్గరగా ఏదో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యం చూడగానే భార్గవి భయపడింది. మాక్సిం చిన్న వాడు కావటంతో మార్చిన్ దంపతులు కూడా అటు వైపు చూడకుండా తీసుకొచ్చేసారు. నాకు దీని గురించి తెలియటంతో పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిగా " గే " వివాహాలని చట్టబద్దం చేసిన దేశం నెదర్లాండ్స్. ఏప్రిల్ 1, 2001 న దీనికి సంభందించిన చట్టాన్ని ఆమోదించారు. కాబట్టి ఇలాంటి దృశ్యాలు ఇక్కడ కనబడటం చాలా కామన్. తరువాత అమ్ స్టర్ డాం లో మేము నడిచిన దారిలో పింక్ పాయింట్ పేరుతో చాలా షెల్టర్స్ కనిపించాయి. లెస్బియన్లు , గే లు కలుసుకునే ప్రదేశాలు అవి.
మనకి నచ్చని పనులని , మన సంస్కృతి కి విరుద్ధమైన పనులని ఎదుటి వాళ్ళు చేస్తుంటే ఛీ ఛీ అనటం భావ్యం కాదు. మనం చేసే పనులు మనకి నచ్చినట్లే , అవతలవాళ్ళకి తాము చేసే పనులు వాళ్ళకీ నచ్చుతాయి. మన సంస్కృతి మనకెంత గొప్పదో, అవతలి వాళ్ళకి వాళ్ళ సంస్కృతి అంతే గొప్పది. ప్రతి మనిషిలోను కొన్ని విపరీతమైన భావాలు ఉంటాయి.వాటి మీద కామెంట్ చేసే హక్కు మనకి లేదని నేను భావిస్తాను.మనం చెయ్యని , చెయ్యలేని కొన్ని పనులని ఎదుటి వాళ్ళు చేస్తుంటే విమర్శించే సంస్కృతి మంచిది కాదు. ఆడవాళ్ళు జీన్స్ వేసుకుంటేనే నోళ్ళు నొక్కుకునే సంప్రదాయం నుండే మనం ఇంకా బయట పడలేదు. ఇక ఇలాంటి వాటిని మన దేశంలో చట్ట బద్దం చేసినా ప్రజలు ఆమోదించాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో.అక్కడికి దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అప్పటికే సమయం 9 గంటలు అయింది , అప్పుడప్పుడే చీకటి పడుతోంది. మేము ఆ ఇండియన్ రెస్టారెంట్ లోనే డిన్నర్ చేసేసి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగ్మొండ్ అనే ప్రాంతానికి బయలుదేరాం. నేను కావాలనే అక్కడ హోటల్ బుక్ చేశాను. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఒడ్డున పొలాలు, గుర్రపుశాలల మధ్యలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ హోటల్ ఉంది. అమ్ స్టర్ డాం నుండి 45 నిమిషాలు ప్రయాణించాక ఎగ్మొండ్ ప్రాంతానికి చేరుకున్నాం.అప్పటికే చీకటి పడింది. ఆ ప్రాంతం మొత్తం ఫార్మ్ హౌస్ లు గుర్రపు శాలలు ఉన్నాయి. అదొక చిన్న పల్లెటూరులా ఉంది. మేము విడిది చేసిన హోటల్ పేరు " స్టే ఓకే ". మేము వెళ్ళే సరికి కౌంటర్ లో ఒక 20 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. ఇంటర్నెట్ లో బుక్ చేసిన పేపర్ చూపించగానే మాకు రూం కీస్ ఇచ్చాడు. కింద లాంజ్ లో రెస్టారెంట్ , బార్ ఉన్నాయి. రూం కి వెళ్లి ఫ్రెష్ అయిన తరువాత నేను మార్చిన్ కిందకి వచ్చాము. ఆ కుర్రవాడిని అడిగాను నువ్వు ఇక్కడ ఎన్నిరోజులనుండి పని చేస్తున్నావ్ అని. తానొక కాలేజి స్టూడెంట్ అని పగలు కాలేజికి వెళుతూ రాత్రి వేళ ఇక్కడ పనిచేస్తున్నా అని చెప్పాడు. నెలకి 600 యూరోలు జీతం వస్తుంది , దానితో నా చదువు , ఖర్చులు వెళ్ళిపోతాయి అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆహ్లాదకరమైన ప్రకృతి మమ్మల్ని కనువిందు చేసింది. మాతో పాటు హోటల్ లో ఉన్న టూరిస్టులు ,పిల్లలు అందరూ బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆడుతున్నారు. కొంతమంది జాకీలు గుర్రాలతో ఆ ప్రాంతంలో తిరుగుతుండటంతో పిల్లలంతా ఆ గుర్రాలతో ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా కాసేపు వాళ్ళని చూస్తూ కాలం గడిపాం. తరువాత మాక్సిం తో కలిసి మేము కూడా ఒక ఫోటో దిగాం.
అప్పటికి ఉదయం 10. 30 నిమిషాలు అయ్యింది. మార్చిన్ ఒకసారి అట్లాంటిక్ సముద్రం చూద్దాం అన్నాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళాం. అసలు ఆ నీళ్ళలో కాళ్ళు పెడితే గడ్డ కట్టేలా ఉన్నాయి. నేను చచ్చినా దిగను అని చెప్పా. మాక్సిం సముద్రం చూడగానే ఒకటే ఉత్సాహంతో పరుగులు పెడుతుంటే వాడితోపాటు భార్గవి ,మార్చిన్ ,కాషా కూడా కాసేపు ఆ నీళ్ళలో ఆడుకున్నారు. ఎంతసేపటికీ వాళ్ళు కదలకపోవటంతో నేనే తొందరపెట్టి తులిప్ తోటలకి వెళ్దాం అని అక్కడినుండి బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చాను.


15వ శతాబ్దంలో అభివృద్ధి చేసిన కూకెన్‌హఫ్ ఫ్లవర్ గార్డెన్ (Keukenhof) ప్రపంచంలో అతిగొప్ప ఉద్యానవనం. దీనినే ‘‘గార్డెన్ ఆఫ్ యూరోప్’’ అంటారు. దాదాపు 79 ఎకరాల విస్తీర్ణంలో  ఎటూ చూసినా పచ్చదనం, దానిమీద రంగురంగుల తులిప్ పుష్పాలు కనువిందు చేస్తాయి. దీన్ని చూసేందుకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ మూడు నెలల్లో సందర్శకులతో తులిప్ గార్డెన్స్ కళ కళ లాడుతాయి. మేము బస చేసిన ఎగ్మొండ్ నుండి కూకెన్‌హఫ్ 60 కిలోమీటర్లు. మేము అక్కడికి చేరేటప్పటికి మధ్యాహ్నం 1 అయింది. కార్ పార్కింగ్ దొరకటానికే చాలా సమయం పట్టింది. గార్డెన్ లోకి ఎంట్రీ టికెట్ 16 యూరోలు. ప్రతి సంవత్సరం నవంబర్లో నెదర్లాండ్స్ రాజు ఈ గార్డెన్ లో తోలి మొక్కని నాటటం ద్వారా ఈ గార్డెన్స్ ని ప్రారంభిస్తారు.3 నెలలలో మొక్క పెరిగి పూవులు పూసాక దీని జీవిత కాలం మూడు నెలలు మాత్రమే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ తోటలు ఉంటాయి.
మేము మే 5 న ఇక్కడికి వెళ్ళాము. మే 16 కల్లా ఈ గార్డెన్ మూతబడిపోతుంది.టికెట్ తీసుకుని లోపలి వెళ్ళగానే రకరకాల తులిప్ పూలు మాకు స్వాగతం పలికాయి. అసలు ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో కూడా చెప్పలేము. అక్కడ మాకు చాలామంది ఇండియన్స్ , అందునా తెలుగు వారు కనిపించారు. సాఫ్ట్ వేర్  ప్రాజెక్ట్ నిమిత్తం వచ్చిన మన కుర్రాళ్ళతో పాటు తెలుగు జంటలు బానే కనిపించాయి. 
మేము గార్డెన్ అంతా 2 గంటల పాటు తిరిగాము కాని మనం సినిమాల్లో చూసినట్లు పెద్ద పెద్ద తోటలు మాత్రం కనపడట్లా. ఒక్కో రంగు పువ్వులు 100 గజాల స్థలంలో పెంచబడి అలా ఆ గార్డెన్ అంతా దాదాపు 500 రకాల పుష్పాలు కనిపించాయి. తులిప్ గురించిన విశేషాలు , వాటికి సంభందించిన సాంకేతిక విశేషాల గురించి మ్యూజియం కూడా లోపల ఉంది.అంతా తిరిగాం కాని ఆ పెద్ద పెద్ద తోటలు చూడలేకపోయామే అనుకుంటూ అసంతృప్తిగా బయటకి వచ్చి కార్ లో మళ్ళీ అమ్ స్టర్ డాం కి బయలుదేరాం. ఈసారి గార్డెన్ వెనుక నుండి కార్ వెళుతోంది. ఒక్కసారిగా కొన్ని వందల ఎకరాల్లో ఉన్న తులిప్ తోటలు కనిపించాయి. అచ్చం మన సినిమాల్లో పాటల్లో కనిపించినట్లే ఉన్నాయి. ఒక్కసారిగా అందరం మళ్లీ వెళ్దాం అని గట్టిగా అరవగానే మార్చిన్ కార్ వెనక్కి పోనిచ్చాడు. అయితే ఆ పొలాలకి దగ్గరగా కార్ పార్కింగ్ లేదు. దాదాపు కిలోమీటర్ ముందు పార్క్ చేసి నడుచుకుంటూ ఆ తోటల దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎంట్రీ టికెట్ కూడా లేదు , అందరూ ఆ తోటల మధ్యలోకి వెళ్లి ఫోటో లు వీడియోస్ తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట వెడ్డింగ్ డ్రెస్ లోనే ఆ తోటల్లో ఫోటో షూట్ చేసుకుంటున్నారు. 

ఇంతకుముందు మ్యూజియం సందర్శించిన అనుభవాల దృష్ట్యా భార్గవి , కాషా నాతో పాటు ఎక్కడికోచ్చినా మ్యూజియంకి మాత్రం రాము అని చెప్పేయటంతో అమ్ స్టర్ డాంలో  కొన్ని మ్యూజియాలు చూద్దామనుకుని కూడా ఆ ఆలోచన విరమించుకున్నాను. కాకపొతే అన్నే ఫ్రాంక్ మ్యూజియంకి మాత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. నేను ఒక్కడినే వెళ్లి చూసి రావాలని, తామంతా బయటే ఉంటామనే ఒప్పందంతో ఆ తోటల మధ్యకాసేపు గడిపి అన్నే ఫ్రాంక్ మ్యూజియం చూడటానికి మళ్ళీ అమ్ స్టర్ డాం కి బయలుదేరాం. ఒక పక్క సమయం అయిపోతుందేమో అనే ఆందోళనతో నా మనసు అంతా కంగారుగా ఉంది. ఎందుకంటే నా వరకు నాకు అన్నే ఫ్రాంక్ మ్యూజియం చూడకపోతే నా యాత్రకి పరిపూర్ణత లేదు. అంతలా నన్ను కదిలించింది ఆ డైరీ అఫ్ యంగ్ గర్ల్ కధ. 

నా అదృష్టం కొద్దీ మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఎంట్రీ ఉంది. కాషా, భార్గవి , మాక్సిం కార్ లోనే ఉంటామన్నారు. మార్చిన్, నేను కలిసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. లోపల ఫోటోలు నిషేధం. ఆశ్విత్జ్ కాంప్ లో లానే ఇక్కడ కూడా అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. సన్నటి ఇరుకు మెట్ల గుండా ఆ ఇంటి పైభాగానికి చేరుకున్నాం. మన ఇళ్ళలో అటక మాదిరిగానే ఆ ఇంటి పై అంతస్తులో చెక్కతో కట్టిన అటక మీద అన్నే ఫ్రాంక్ కుటుంబం 25 నెలలు గడిపింది. యుద్ధం ముగియటానికి కేవలం మూడు నెలల ముందే ఒక ఆగంతకుడు నాజీలకి సమాచారం ఇవ్వటంతో ఒక రాత్రి పూట నాజీలు దాడి చేసి అన్నే ఫ్రాంక్ కుటుంబాన్ని కాన్సంట్రేషన్ కాంపుకి తరలించారు.యుద్ధం ముగిసేలోపే అన్నేఫ్రాంక్ తండ్రి తప్ప కుటుంబం అంతా మరణించారు. 1980 వరకు అన్నే ఫ్రాంక్ తండ్రి బతికే ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రభుత్వం ఈ ఇంటిని మ్యూజియం గా మార్చి అన్నే ఫ్రాంక్ వస్తువులని , ఆ అరలని అలాగే ఉంచి పరిరక్షిస్తోంది. లోపల అన్నే రాసిన డైరీ , అన్నే తో పాటు కాంపులో కొన్నాళ్ళు గడిపిన తన మిత్రుల జ్ఞాపకాలతో కూడిన వీడియో చూడవచ్చు. ఆ ఇంటికి బయట కొద్ది దూరంలోనే అన్నేఫ్రాంక్ విగ్రహం ఉంది.హౌస్ అంతా చూశాక బరువెక్కిన హృదయంతో బయటకి వచ్చాం. 

అక్కడినుండి  IAMSTERDAM అనే అక్షరాలతో కూడిన ఒక బోర్డ్ ఉన్న చోటుకి వెళ్ళాం. సందర్శకులంతా అమ్ స్టర్ డాం ని సందర్శించిన గుర్తుగా అక్కడ ఫోటో దిగుతారు. మేము కూడా అక్కడికి వెళ్లి ఫోటో తీసుకున్నాం.అప్పటికి సమయం సాయంత్రం 9.30 నిమిషాలు అయ్యింది. 

చీకటి అప్పుడప్పుడే పడుతోంది. మేము మింజు జేర్జ్ కి వెళ్ళాలంటే అక్కడినుండి 800 కిలోమీటర్లు ప్రయాణించాలి. తొందరపడకుండా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ మే 6 వ తేది ఉదయానికి పోలాండ్ చేరుకున్నాం. 
వచ్చేవారం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. 

Friday, November 20, 2015

నా ఐరోపా యాత్ర - 27 (నెదర్లాండ్స్)

బ్రస్సెల్స్ నుండి నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాం కి 250 కిలోమీటర్లు. సరిగా మధ్యాహ్నం 1.30 గంటలకి ఆటామియం నుండి బయలుదేరాం. దాదాపు గంటన్నర ప్రయాణించాక గూగుల్ మాప్స్ లో చూస్తే బెల్జియం - నెదర్లాండ్స్ బోర్డర్ అని కనిపించింది. హైవే మీద ఉన్న మెక్ డొనాల్డ్స్ దగ్గర లంచ్ కోసం కార్ ఆపాడు మార్చిన్. గంట తరువాత మా ప్రయాణం మళ్ళీ ప్రారంభమైంది.

క్రీ.పూ. 53లో జూలియస్ సీజర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలన చేశాడు. దాదాపు నాలుగు శతాబ్దాలు రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. క్రమంగా ఫ్రాంక్ రాజులు రోమన్‌లను పారద్రోలి ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. క్రమక్రమంగా వివిధ రాజులు పాలిస్తూ వచ్చారు. 6వ శతాబ్దంలో ఫ్రిసియన్ రాజులు పాలించారు. తిరిగి 10వ శతాబ్దంలో రోమన్‌లు ఈ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించారు. కాని వీరి పాలనలో ఐకమత్యం లేక స్థానికంగా చిన్న చిన్న డచ్చివారి ప్రైవేటు సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. 13వ శతాబ్దంలో ఇండోనేయల్, ఫ్రెంచి రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. 17వ శతాబ్దంలో డచ్చి పాలకులు మొత్తం నెదర్లాండ్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వీరి పరిపాలనను గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు. 17, 18 శతాబ్దాలలో బటావియన్ రాజకుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించింది. 19వ శతాబ్దంలో ఇంగ్లండ్, జర్మనీలు పరిపాలించాయి. క్రీ.శ.1581లోనే స్పెయిన్ నుండి స్వతంత్రదేశంగా ప్రకటింపబడినా, 1954లో స్వతంత్ర దేశంగా ఏర్పాటయింది.ఈ దేశంలో జనసాంద్రత ఎక్కువ. ఒక చదరపు కిలోమీటరుకు 404 మంది నివసిస్తున్నారు. ప్రజలు డచ్చి భాషను మాట్లాడుతారు ఇక్కడి ప్రజలు వాళ్ళ స్వంత భాషతో పాటు జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లిష్ వంటి విదేశీ భాషలు కూడా నేర్చుకుంటారు. ఇక్కడి ప్రజలంతా క్రైస్తవులు, వీరిలో క్యాథలిక్కులు అధికం. జనాభాలో అధికశాతం ప్రజలు దేవుణ్ణి నమ్మరు. దేశంలో బౌద్ధులు, హిందువులు ముస్లిముల జనాభా కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉంది.

నెదర్లాండ్స్ లో ప్రవేశించగానే మనకి కనిపించేవి విండ్ మిల్లులు. అంటే పెద్ద ఫాన్ ని ఒక టవర్ కి పైన బిగించి అది గాలికి తిరుగుతున్నపుడు ఆ శక్తి తో కింద పిండి మర నడిపిస్తారు. పూర్వ కాలంలో రొట్టెలు తయారు చేయటానికి పిండిని ఇలాగే తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా చోట్ల ఇలాంటి గాలి మరలు కనిపిస్తాయి. నెదర్లాండ్స్ సంస్కృతి ని కూడా ఇవి తెలియచేస్తుండటంతో కొన్ని పాత మిల్లులని అలాగే ఉంచేశారు. భార్గవి , కాషా నెదర్లాండ్స్ లో ఉండే తులిప్ తోటల ని చూడబోతున్నామనే ఉత్సాహంతో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళకి సహజంగానే పూలంటే ఇష్టం అందునా తులిప్ అందాలని వెండితెరమీద చూసిన తరువాత ఒక్కసారైనా ఆ తోటల్లో విహరించాలని అందరికీ ఉంటుంది. కాని నా మనసంతా అన్నే ఫ్రాంక్ హౌస్ చుట్టూనే తిరుగుతోంది. నన్ను ఈ యాత్ర చేయటానికి , ఈ పుస్తకం రాయటానికి ప్రేరేపించిన రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన రోజు ( మే 4, 1945) రోజే నా ఐరోపా యాత్ర చివరి మజిలీ చేరుకోవటం , అన్నిటి కంటే ఆఖరున నన్ను అత్యంత ప్రభావితం చేసిన అన్నే ఫ్రాంక్ హౌస్ సందర్శించటం అక్కడే మా యాత్రకి ఆఖరి రోజు కావటం అంతా యాదృచ్చికం. రెండవ ప్రపంచ యుద్ధంలో కాన్సంట్రేషన్ కాంపుల్లో చంపబడ్డ లక్షలాది యూదులు , చిన్నారులలో అన్నే ఫ్రాంక్ అనే చిన్నారి కధ మాత్రమే ప్రపంచానికి తెలిసింది.1939 -1945 మధ్య కాలం లో జరిగిన మానవ హననంలో లక్షలాది యూదు చిన్నారుల జీవితాలు నాజీల దౌష్ట్యం కారణంగా చిద్రమై పోయాయి. ఎన్నో చిన్ని గుండెలు వారి ఇనప బూట్ల పాదాల కింద నలిగిపోయాయి. 1929 జూన్ 12 న జర్మనీలో Frankfurt లో  జన్మించింది అన్నే ఫ్రాంక్ . వారిది యూదు కుటుంబం . తండ్రి బిజినెస్ మాన్, అందమైన కుటుంబం, 1935 లో నియంత హిట్లర్ అధికారం లోకి వచ్చాడు.1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది .జర్మనీ లో యూదులకి రక్షణ లేదని అర్ధమైన వెంటనే అన్నే ఫ్రాంక్ తండ్రి తమ కుటుంబాన్ని హాలండ్ కి మార్చాడు. తన వ్యాపారాన్ని తోటి జర్మన్ మిత్రులకి అప్పగించాడు. యూదులు ఎక్కడున్నా వేటాడి చంపించాడు హిట్లర్ .1942 లో అన్నే కుటుంబం రహస్య స్తావరాలలో దాక్కోవాల్సిన గతి పట్టింది .తల్లి అన్నే , సోదరి లకు కొందరు ఆశ్రయం ఇచ్చి దాచారు .ఒక అపార్ట్మెంట్ లో పై భాగంలో ఉన్న చిన్న అరల్లో 25 నెలలు జీవితాన్ని గడిపింది.ఈ విషయాన్ని అన్నే secret annex అన్నది .1942 జూన్ పన్నెండు న ఆమె పుట్టిన రోజున ఎవరో ఒక డైరీని కానుక గా ఇచ్చారామెకు .దానినే తన స్నేహితుని గా భావించి దిన చర్య రాయటం ప్రారంభించింది .అలా ఆ రెండు సంవత్సరాల్లో ఆమె రాసిన తన దినచర్య , తాను గడిపిన ఆ రెండేళ్ళ రహస్య జీవితం గురించి రాసిన విశేషాలు ఎ డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ గా పేరుగాంచింది. కాని దురదృష్టవశాత్తు ఎవరో వీళ్ళ గురించి సమాచారం ఇవ్వటంతో నాజీలు 1944 సెప్టెంబర్ 3 న దాడి చేసి కుటుంబం మొత్తాన్ని పోలాండ్ కు గొడ్లను తోలుకు వెళ్లి నట్లు తోలుకు వెళ్ళారు . ఆడవాళ్ళను ,పిల్లల్ని బట్టలు ఊడ దీయించి వర్షం లో నిలబెట్టారు. అన్నే ఫ్రాంక్ తండ్రిని మాత్రం వేరే కాంపుకి తరలించారు. అన్నే ఫ్రాంక్ అక్క మరియు తల్లి తన కళ్ళముందే బెల్షన్ కాంపులో చనిపోయారు. కొన్ని రోజులకి 16 వ ఏడు రాకుండానే అన్నే ఫ్రాంక్ టైఫాయిడ్ సోకి 1945 మార్చ్ లో అదే కాంప్ లో మరణించింది.

యుద్ధ సమయం లో ఎవరైనా డైరీలు రాసుకొని ఉంటె యుద్ధం పూర్తీ అయిన తర్వాత వాటిని ప్రచురిస్తామని 1944లో రేడియో లో ప్రకటన వచ్చింది . 1945 లో యుద్ధం ముగిశాక బ్రిటిష్ వాళ్ళు అందర్నీ వదిలేశారు. అయితే వేరే కాంప్ లో ఉన్న అన్నే ఫ్రాంక్ తండ్రి మాత్రం బతికే ఉన్నాడు. ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అన్నే రాసిన డైరీ దొరికింది .దానిని ఆయన 1947 లో కొద్దిగా మార్చి ప్రింట్ చేస్తే 25 మిలియన్ల  అమ్ముడయాయి ఎందరో నాజీ నిర్బంధాన్నిగురించి, వారు చేసిన దారుణాలను గురించి డైరీలు రాసినా అన్నే ఫ్రాంక్ డైరీ కున్న ప్రాధాన్యత దేనికీ రాలేదు . దాదాపు అరవై భాషల్లోకి అనువాదం పొందింది . బైబిల్ తర్వాతా అన్నే డైరీకి అంతగిరాకీ  వచ్చింది .దక్షిణాఫ్రికా స్వాతంత్ర ఉద్యమ నేత ,అధ్యక్షుడు నెల్సన్ మండేలాజైలు లో ఉండగా  అన్నే ఫ్రాంక్ డైరీని తానూ చదివానని ఏంతో  ప్రభావితం చేసిందని తోటి ఖైదీలకు కూడా చదివి వినిపించానని రాశాడు. ఈ పుస్తకమ్మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. నటాలీ పోర్ట్‌మన్ అనే అమెరికన్ నటి 1997లో ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ పుస్తకం ఆధారంగా నిర్మించిన బ్రాడ్‌వే చిత్రంలో అన్నే ఫ్రాంక్ పాత్ర పోషించింది. నటాలీ పోర్ట్‌మన్ కూడా రెండవప్రపంచ యుద్ధం తరువాత ఇజ్రాయిల్ వెళ్లి స్థిరపడ్డ యూదు కుటుంబానికి చెందిన యువతి. ఈ డైరీ కి ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ భార్య ముందు మాట రాసింది.అన్నే ఫ్రాంక్ తండ్రి  81 వ ఏట 1980 లో చని పోయాడు .అన్నే పేర ఒక ట్రస్ట్ ఏర్పడింది దాని ద్వారా ఎన్నో ప్రజోపకారమైన పనులు చేస్తున్నారు . ఆమె ఇంటిని స్మ్రుతి చిహ్నం గా మార్చారు . ప్రతి ఏటా కనీసం ఆరు లక్షల మంది దాన్ని సందర్శిస్తారు . అన్నే నివసించిన అరలు , ఆమె తాలూకు వస్తువులు , డైరీ ఒరిజినల్ ప్రతి , అన్నే ఫ్రాంక్ చిన్న వీడియో క్లిప్ ఈ ఇంట్లో చూడవచ్చు. ఇప్పుడు నేను చూడాలని అనుకున్నది అన్నే ఫ్రాంక్ మ్యూజియంగా పిలవబడుతున్న ఈ సీక్రెట్ అనెక్స్ అనే హౌస్. మార్చిన్ కి ఈ కధంతా తెలుసు , ఇలాంటి కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయారు కాని అన్నే ఫ్రాంక్ తండ్రి ధనవంతుడవ్వటం వల్ల ఇంతటి ప్రాచుర్యం వచ్చిందంటాడు మార్చిన్. ఇలా నా ఆలోచనలు అన్నే ఫ్రాంక్ చుట్టూ తిరుగుతుండగానే మేము అమ్ స్టర్ డాం లోకి ప్రవేశించాం. ఆరోజు బాగా చలిగా ఉంది అక్కడ. మేము బయలుదేరినప్పుడు బ్రస్సెల్స్ లో అంత చలిగా లేదు. మేము నేరుగా అన్నే ఫ్రాంక్ హౌస్ దగ్గరికి వెళ్ళాం, కాని అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు అవ్వటంతో ప్రవేశం నిలిపివేశారు. ఎలాగు మేము బస చేసేది ఆ రాత్రికి నెదర్లాండ్స్ లోనే. రేపు చూద్దాంలే అని సిటీ చూడటానికి కాలి నడకన బయలుదేరాం. 
అమ్ స్టర్ డాం ఇంచుమించు వెనిస్ లాగే అనిపించింది. అమ్ స్టాల్ అనే నది ఈ నగరం గుండా ప్రవహిస్తోంది. ఈ నది కెనాల్ లోనే బోటులో సందర్సకులంతా విహారానికి వెళుతున్నారు. ఒకరకంగా ఇది Venice of north europe అనవచ్చు. ఓపెన్ బోట్స్ తో పాటు హౌస్ బోట్స్ కూడా ఈ కెనాల్స్ లో ప్రయాణికులని చేరవేస్తున్నాయి. మాకు కార్ల కంటే ఎక్కువగా సైకిళ్ళు కనిపించాయి.ఎక్కువమంది సైకిల్లనే వాడుతున్నారు. సైకిళ్ళు అద్దెకిచ్చే షాపులు ఎక్కువగానే ఉన్నాయి. గంటకి అద్దె 5 యూరోలు అని రాసి ఉంది ఒకచోట. అలా మేము నడుస్తుండగానే జనాలంతా ఒకే వైపు వడి వడిగా పరుగులు పెట్టటం కనిపించింది. ఏమి జరుగుతోందో అని మేము కూడా అటు వైపు వెళ్ళాం. తీరా చూస్తే అది అమ్ స్టర్ డాం నగర కూడలి. అతి పెద్దదైన రాజ భవనాలు , టుస్సాడ్ మ్యూజియం మధ్యలో ఈ సిటీ కూడలి ఉంది. 15 నిమిషాల్లో దాదాపు 10000 మంది పోగయ్యారు. మాకు అప్పుడు కాని అర్ధం కాలేదు, బ్రస్సెల్స్ లో మేము చూసిన యుద్ధం ముగిసిన రోజు వేడుకలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అందరి మొహాల్లో విషాదం. కొంతమందైతే ఏడుస్తూ ఉన్నారు. పోలీసులు అంతా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాసేపటికి నెదర్లాండ్స్ రాజు తన సతీమణితో కలిసి ఆ కూడలి లో ఉన్న ఒక స్థూపం దగ్గరికి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన యూదులకి సైనికులకి అశ్రు నయనాలతో నివాళి అర్పించారు. వారి ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాలు అందరూ మౌనం పాటించారు. 10000 మంది ఓపెన్ ఏరియా లో ఉన్నా సూది పడినా విన్పించే నిశ్శబ్దం ఆవరించింది. మేము కూడా వారితోపాటు అక్కడే నిలబడి నివాళి అర్పించాము.
అప్పటికి సమయం సాయంత్రం 8 గంటలు అయ్యింది. ఇంకా చీకటి పడలేదు సూర్యుడు అప్పుడే అస్తమించే దశలో ఉన్నాడు. మేము అక్కడినుండి మళ్ళీ నడుచుకుంటూ మా కార్ పార్కింగ్ దగ్గరికి వస్తున్నాం. అమ్ స్టర్ డాం లో చెప్పుకోవాల్సింది కాఫీ షాప్స్. నాకు వాటి వెనుక కధ తెలియదు , మార్చిన్ నవ్వుతూ అడిగాడు కాఫీ తాగుదామా అని. ప్రతి కాఫీ షాపులోనూ విపరీతంగా జనాలు ఉన్నారు. సిగరెట్ పొగ, కాఫీ వాసనలతో ఆ షాపులన్నీ సందడిగా ఉన్నాయి. నన్ను మార్చిన్ ఒక షాప్ లోకి తీసికెళ్ళాడు. అక్కడ ఒక ఆకు బొమ్మ వేసి Its Legal Here అని రాసి ఉంది. దానితోపాటు గాజు సీసాల్లో రకరకాల ఎండిన ఆకులు ఉన్నాయి. వాటితో తయారు చేసే రకరకాల కాఫీ మెనూ ఉంది అక్కడ. మార్చిన్ ఎందుకు నన్ను కాఫీ తాగుతావా అని అడిగాడో అర్ధం అయ్యింది. అవన్నీ మన గంజాయి తరహా రకరకాల ఆకులు. ఆ కాఫీ తాగితే ఒకరకమైన నషా వస్తుంది. అక్కడ ఇదంతా కామన్ మరియు ప్రభుత్వ పరంగా అనుమతి కూడా ఉంది. అన్నిటితో పాటు నేను గమనించిన మరో ఆసక్తి కరమైన అంశం, అక్కడ అన్ని షాపుల్లో మన వినాయకుడి ఫోటోలు ఉన్నాయి. మార్చిన్ కి కూడా ఆ ఫోటో తెలియదు అప్పుడు నేను ఆవర్ ఇండియన్ గాడ్ అని చెప్పాను. అవి ఎందుకు పెట్టారో అడగాలని రెండు మూడు షాపుల్లోకి వెళ్లాను కాని అక్కడ వాతావరణం చూసి ధైర్యం చాలలేదు.
అలా చూసుకుంటూ ముందుకి రాగానే ఒక మీటింగ్ పాయింట్ కనపడింది. 200 మందికి పైగా అబ్బాయిలంతా అక్కడ ఉన్నారు. కొంతమంది అక్కడ నదిలో దీపాలు వదులుతున్నారు. ఏం జరుగుతోందో చూద్దామని దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎదురైన దృశ్యం చూసి భార్గవి నా చేతిని గట్టిగా పట్టుకుని ఛీ ఛీ అంటూ వెనక్కి తిరిగింది. మార్చిన్, కాషా కూడా ఏమైంది అంటూ వచ్చి వాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని చూసి మాక్సిం కళ్ళు మూసేసి వెనక్కి తీసుకొచ్చేసారు. ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ ?