మాకు దగ్గరి బంధువులంతా కొత్తపల్లి, కొడాలి, గుండుపాలెం ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారు. తరచుగా మా ఇంటికి రాకపోకలు ఉండేవి. వచ్చేటపుడు వారి స్నేహితులనో లేక బంధువులని కూడా తోడుగా తీసుకొచ్చేవాళ్ళు. అలా మా ఇంటికి వచ్చిన బంధువులంతా పొద్దునే వచ్చి కుశల ప్రశ్నలు, మంచి చెడ్డా మాట్లాడుకున్నాక సాయంకాలానికి నేత చీరలకోసం పద్మశాలీల దుకాణానికో లేక కొంతమంది నేత కార్మికుల ఇళ్ళకి చీరలు కొనటానికి వెళ్ళేవాళ్ళు. వాళ్లకి తోడుగా మా అమ్మ , తనకి తోడుగా నేను వారివెంట వెళ్ళిన జ్ఞాపకాలున్నాయి. అప్పుడు చాలా చిన్నతనం,ఆ చీరల నుంచి వచ్చే గంజి వాసన భలే ఉండేది. వాళ్ళు చీరలు చూస్తుంటే నేను ఆ బేరాలు వింటూ ఉండేవాడిని. ఆ బేరాలు తెగేవి కాదు ముడి పడేవి కాదు. ఘంటసాల పురాతన గ్రామంగా ఎంత పేరు ఉందో,చేనేత వస్త్రాలకి అంతే పేరు ఉంది.
బీద గొప్ప తారతమ్యాలు లేకుండా అన్నీ తరగతుల వాళ్ళు మన ఊరి చీరలంటే నాణ్యత కలవిగా భావించేవాళ్ళు. స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న పలువురు పెద్దలకి పంచెలు నేసి ఇచ్చిన ఘనత మన వాళ్ళ సొంతం. ఆ రోజుల్లో తరచూ పార్టీ కార్యక్రమాల కోసం, కవితా గోష్టుల కోసం వచ్చే అతిధులందరూ మన గ్రామంలో ఖద్దరుని, నేత చీరలని కొనుగోలు చెయ్యకుండా వారి ప్రయాణం ముగిసేది కాదంటే అతిశయోక్తి కాదేమో. చేనేత మాత్రమే కాకుండా పౌరోహిత్యంలోనూ జ్యోతిష శాస్త్రంలోనూ ప్రావీణ్యత కలవారు కూడా ఈ సామాజిక వర్గం లో ఉన్నారు. మా పక్కింటికి ప్రతి నెల వెంకటేశ్వరరావు అనే ఆయన TVS 50 మీద చీరల మూటల్ని పెట్టుకుని వచ్చేవారు. మా వీధి వాళ్ళంతా ఆ రోజున ఆ యింట్లో చేరే వాళ్ళు. పాపం అయన ఓపికకి మాత్రం మెచ్చుకోవాలి, ఆయన్ని కొట్టటం ఒకటే తక్కువేమో. ఒక్కోసారి ఆ బేరాలు వింటుంటే అదో గొడవలాగా వినిపించేది. కానీ ఇటీవల వారి ఇళ్ళకి,ఆ వీధులకి వెళ్ళినపుడు ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న డాబాలు మాత్రం వెలిశాయి. ఒకప్పుడు మన గ్రామం లో 400 మగ్గాలు ఉండేవట. షష్టి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం మగ్గానికి పావలా చొప్పున విరాళాలు ఇచ్చేవారు పద్మసాలీలు. మన గ్రామంలో ఇప్పుడు అత్యధిక జనాభా వీరిదే. వీరి మద్దతు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవటం ఎవరి వల్లా కాదు. 1935 లో చేనేత సహకార సంఘాలు ఏర్పడ్డాక జిల్లా లోనే అత్యధిక ఉత్పత్తిని సాధించిన సంఘంగా రికార్డులలో నిలిచిన సంఘం మన గ్రామానిదే. అందె జలధిలింగం ప్రెసిడెంట్ గా తుమ్మలచర్ల వెంకట సుబ్బయ్య సెక్రటరీ గా ఏర్పడ్డ శ్రీ విజయలక్ష్మీ చేనేత సహకార సంఘం ఎక్కువ కాలం సాగలేదు. అంతర్గత విభేదాలతో కొద్దికాలానికే ఇది మూతబడింది. దాని నుంచి బయటకి వచ్చి కొందరు పెట్టిన భారతీ రంగా చేనేత సంఘం కూడా కొద్ది కాలానికే అంతరించింది. తరువాత మళ్లీ చేనేతల వెతలు మొదలు అయ్యాయి. సంపాదన కరువు అవ్వటంతో ఆకలి తో అలమటించే చేనేత కార్మికులకి గంజి కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఇదంతా చూసిన కొందరు ఔత్సాహికులు మళ్లీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్లి అడగటంతో మొదట ఆయన తీవ్రంగా మందలించారు. అంతర్గత కలహాలు లేకుండా ఐకమత్యంతో పని చేసుకుంటాం మాకు 'జ్ఞానోదయం' అయ్యింది అని వారు చెప్పటంతో, వారు చెప్పిన ఆ మాట తోనే 'జ్ఞానోదయ' చేనేత సంఘం పేరిట 1952 లో మరొక సంఘాన్ని ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో శ్రీనివాస వీవర్స్ సొసైటీ , పూర్వపు పేరుతో విజయలక్ష్మీ వీవర్స్ సొసైటీ ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇవే మన గ్రామంలో ఉన్న చేనేత సంఘాలు.
భావనా రుషి వీరి ఆరాధ్య దైవం, పద్మసాలీలకి యజ్ఞోపవీతం ధారణ గావించిన సంఘ సంస్కర్త ఈయనే. జలధీశ్వరాలయానికి దక్షిణ భాగంలో ఉన్న ఈ రుషి ఆలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఈ సామాజిక వర్గం నుంచే గత కొద్దికాలం వరకు అందె జగదీశ్ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసారు. ఆయన కాలం లోనే పంచాయితీ సంత మార్కెట్ ఏర్పాటు అయ్యింది. అన్ని చేతి వృతులు అంతరిస్తునట్లుగానే క్రమ క్రమంగా మన గ్రామంలో ఇది కూడా అంతరిస్తోంది. ఈ తరం వారెవ్వరూ దీనిని ఉపాధి మార్గం గా ఎంచుకోవటం లేదు. కానీ ఇంకా దీని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు మన గ్రామం లో ఎక్కువమందే ఉన్నారు. కాబట్టి మరికొన్నాళ్ళు మన చేనేత వైభవం వెలుగొందుతుంది. కానీ ఆ చేనేత వెలుగు కి మన చేయూత కావాలి....
2 comments:
పద్మశాలీలు కు యజ్ఞోపవీతం ఇచ్చిన సంఘ సంస్కర్తవ బావనా ఋషి అని మీరు రాశారు . ఇది తప్పు . భృగు మహాముని మనవడైన మార్కండేయ మహాముని కుమారుడే భావనా రుషి ఈయన పుత్రులు నూరు మంది మీరేపద్మశాలీలు. మీరు బృగ వంశం అని చూడండి తెలుస్తుంది. దక్షిణ భారత బ్రాహ్మణులు జాబితా చూడండి తెలుస్తుంది. పద్మశాలీయలే బృగు బ్రాహ్మణులు.
పై కామెంట్ నాదే.నా పేరు తుమ్మలచర్ల.వెంకటేశ్వర్లు.టీచర్.నెల్లూరు.
ఫోన్ నం.9491459147.
మీకు ఇంకా పద్మశాలీయులు సమాచారం కోసం వికీపీడియా చూడండి.
Post a Comment