ఎటు చూసినా గుంపులు గా సందర్శకులు ఉన్నారు. లోపల మెట్లు, తలుపులు అన్నీ చెక్కతో చేసినవే ఉన్నాయి. గైడ్ అన్నీ వివరంగా చెప్తూ ముందుకు వెళుతోంది. నా అమ్ములపొదిలో ఎప్పుడూ ఉండే ఆ మొదటి ప్రశ్న అడిగేశాను. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినపుడు నాజీలు ఇక్కడికి కూడా వచ్చారా అని. యుద్ధం మొదలైన దగ్గరనుంచి ఇది కొన్నాళ్ళు నాజీల ఆధ్వర్యంలోనే ఉందని గైడ్ చెప్పింది. ఇప్పుడు మేము తిరుగుతున్న ప్రాంతం అంతా గత కొన్నేళ్లుగా ఉప్పు కోసం తొలచిన గుహ. ఇది ఒక చిన్నపాటి నగరమంత ఉంది. కాని మొత్తం ఏరియా లో మేము చూసింది నాలుగు శాతమే. ఇంకా 250 కిలోమీటర్ల మేర ఈ గని విస్తరించి ఉంది. ఈ గనిలో పని చేస్తున్న కార్మికులు దీనిని ఒక దేవాలయంగా మార్చేసారు. ఎటు చూసినా పోలాండ్ రాజుల విగ్రహాలు , క్రీస్తు, మేరి మాత విగ్రహాలే ఉన్నాయి. ఇవన్నీ ఆ ఉప్పు రాతితో చేసినవే.
అసలు విషయం మర్చిపోయా, రాతి నుంచి కూడా ఉప్పు తీస్తారని నాకు తెలిసింది ఇప్పుడే. ఆ రాయి కూడా నీళ్ళతో కలిసిన ఘన పదార్ధంలా ఉంది. కింద తయారయిన ఉప్పుని పైకి పంపడానికి కప్పీల సాయంతో పెద్ద లిఫ్ట్ ఉంది. గుర్రాల సాయంతో ఆ కప్పీలని తిప్పటం ద్వారా ఉప్పు ట్రాలీ పైకి వెళుతుంది. 13 వ శతాబ్దం నుండి పని వారు ఉప్పుని తీయడానికి ఉపయోగించిన పద్ధతులన్నీ బొమ్మల రూపంలో చెక్కారు. అక్కడక్కడా నీళ్ళ కొలనులు కూడా ఉన్నాయి. మన వాళ్ళు గోదారిలో, కృష్ణ లో చిల్లర వేసినట్లే, ఇక్కడ వాళ్ళు కూడా ఆ తటాకాలలో నాణేలు వేస్తున్నారు.
దాదాపు లోపల ఇవన్నీ చూసుకుంటూ 3 కిలోమీటర్లు నడిచాం.అంతిమంగా ఇంకా కిందకి 50 మీటర్ల లోతులో ఉన్న చర్చి కి చేరుకున్నాం, ఇక్కడే పెళ్ళిళ్ళు , ఫంక్షన్లు చేసుకోవచ్చు. ఆ రోజు కూడా ఏదో పెళ్లి జరుగుతోంది. ఇక్కడ పెళ్ళిళ్ళు మనలాగా వేలాది మందిని పిలిచి భోజనాలు పెట్టి హంగు ఆర్భాటాలతో చెయ్యరు.మహా అయితే ఒక 50 మంది ని పిలుస్తారేమో.ఇక్కడి వాళ్ళకి మన వివాహ పరిశ్రమ గురించి చెపితే వీళ్ళు నోళ్ళు తెరిచారు.1000 మందికి భోజనాలా ? అన్ని లక్షల ఖర్చు ఎందుకు ? అని వాపోయారు. ఇక ఈ మధ్య జరిగిన సెలబ్రిటీల పెళ్ళిళ్ళు యూ ట్యూబులో చూపించేసరికి వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఆ చర్చ్ లో క్రీస్తు జీవితానికి సంభందించిన పలు సంఘటనలని గోడలపై చెక్కారు. ది లాస్ట్ సప్పర్ వృత్తాంతం తెలిపే చిత్రం ముందు ఒక ఫోటో తీసుకున్నాను. ఇక అక్కడితో గైడ్ మాకు వీడ్కోలు చెప్పేసి పైకి ఎలా వెళ్ళాలో దారి చూపించింది.
అక్కడ సావనీర్ షాపులో ఆ గనిలో రాళ్లతో చేసిన రక రకాల గొలుసులు ఆభరణాలు ఉన్నాయి. ఖరీదు కొంచెం ఎక్కువే. రంగు రంగుల్లో ఉప్పు సీసాలు కూడా ఉన్నాయి. తన భార్య కోసం మార్చిన్ ఒక డబ్బా కొన్నాడు. అది నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే మంచిదట. ఒక్కోటి 10 జిలోటిలు. నేను కూడా ఒకటి కొన్నాను. ఇక అక్కడున్న లిఫ్ట్ ద్వారా పైకి చేరుకున్నాం. అప్పటికే సమయం 8 గంటలు అయ్యింది. మసక మసకగా చీకటి పడుతోంది. ఇక ఆ రాత్రికి క్రాకో లోనే బస చేసి మరుసటి రోజు ఉదయం జాకోపానా అనే పర్వతాలు చూడటానికి వెళ్దాం అనుకున్నాం. నేను ఏదైనా హోటల్ బుక్ చేద్దామంటే శశి ఒప్పుకోలేదు. యూత్ హాస్టల్ కి వెళదాం అన్నాడు. నాకెందుకో హాస్టల్ అనగానే అంత సౌకర్యంగా ఉంటుందనిపించలేదు. కాని శశి అప్పటికే ఒకసారి యూరప్ అంతా తిరిగి ఉన్నాడు. సరే తనకి అన్నీ తెలుసు కదా అని అందరం ఓకే అన్నాం. ఐపాడ్ సాయంతో క్రాకోలో ఉన్న హాస్టళ్ళ వివరాలు వెతికితే తక్కువ ధరలో ఒక యూత్ హాస్టల్ దొరికింది. యూరప్ లో ఉన్న అన్ని దేశాలలో ఈ హాస్టల్స్ ఉంటాయి. విద్యార్ధులు ఉండే వసతి గృహాలలో పర్యాటకులు కూడా ఉండవచ్చు. వీటినే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ అని కూడా అంటారు.ఒక రాత్రి బస మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ తో అద్దెకి ఇస్తారు.పర్యాటకులకి ఎంతో సౌకర్యంగా, అతి తక్కువ బడ్జెట్ లో ఉండటంతో ఎక్కువ శాతం మంది వీటిని వినియోగిస్తారు. క్రాకో సిటీ స్క్వేర్ లోనే ఒక బిల్డింగ్ లో మూడవ అంతస్తులో ఈ హాస్టల్ ఉంది. మార్చిన్ అడ్రెస్ కనుక్కుని కార్ ఒక ప్రైవేటు పార్కింగ్లో పెట్టేసి అక్కడినుంచి ఒక కిలోమీటరు నడుచుకుంటూ సిటీ స్క్వేర్ చేరుకున్నాం. ఆరోజు సన్నగా వాన పడుతోంది, మేము హాస్టల్ కి చేరుకునేటప్పటికి వాన పెద్దదైంది.మాకు క్రాకోలో ఒక్క నూతన భవంతి కూడా కనపడలా. అన్నీ వందల ఏళ్ల నాటి పెద్ద పెద్ద పురాతన భవనాలే ఉన్నాయి. సిటీ స్క్వేర్ చాలా పెద్దది, అక్కడ కార్లకి ప్రవేశం లేదు. ఎటు చూసినా జనాలంతా ఆరుబయట రెస్టారెంట్ లలో కాంతులీనే లైట్ల మధ్య బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.ఒక పక్క వాన పడుతున్నా రెస్టారెంట్ గొడుగుల కింద అలాగే ఉన్నారు.మరుసటి రోజు శనివారం కావటంతో కొన్ని వేలమంది వీకెండ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.అసలు క్రాకో లో ఉన్న ప్రజలంతా ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. పర్యాటకుల్ని ఆ స్క్వేర్ చుట్టూ తిప్పటానికి గుర్రపు బగ్గీలు ఉన్నాయి. సూటు వేసుకుని ఉన్న ఆజానుబాహులు తమ బగ్గీలని ఠీవిగా అలంకరించి, వచ్చేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.హాస్టల్ రిసెప్షన్ కి వెళ్లి మార్చిన్ రూమ్ గురించి అడిగాడు. మేము ఐదుగురం కావటంతో ఒకే రూములో అందరికీ వసతి దొరికింది.అది 8 మంది ఉండగలిగే గది.అసలు రూమ్ ఎంత నీట్ గా ఉందంటే అప్పటిదాకా అసలు హాస్టల్ అంటే ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మాతో పాటు పోలాండ్ కే చెందిన మరో ఇద్దరు కూడా ఆ గదిలో ఉన్నారు.నేను అప్పటికే బాగా అలసిపోయి ఉండటంతో స్నానం చేసి కింద ఉన్న రెస్టారెంట్ లో అందరికీ పిజ్జా ఆర్డర్ చేసి తినేసి పడుకుండి పోయాను.మిగతా వాళ్ళంతా తిన్న తర్వాత వర్షం తగ్గటంతో మళ్ళీ కిందకి వెళ్లి కాసేపు చూసి వచ్చారు.తెల్లవారుఝాము 3 గంటలదాకా ఆ కోలాహలం అలాగే ఉంది.
క్రాకో సిటి స్క్వేర్ లో
పొద్దునే 8 గంటలకి అందరం లేచి బ్రేక్ ఫాస్ట్ చేసి బయలు దేరాం. మా కార్ దగ్గరికి వెళ్ళేదారిలో సిటీ అంతా చూసుకుంటూ అక్కడొక పురాతన పాలస్ ఉందని మార్చిన్ చెప్పటంతో కొండ మీద ఉన్న ఆ పాలస్ కి వెళ్ళాం. ఆ పాలస్ పై నుండి క్రాకో నగరం అంతా కనిపించింది.రోడ్ల మీద జనాలు పల్చగా ఉన్నారు.ట్రాములు, బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. జనాలకి వీకెండ్ హంగోవెర్ ఇంకా దిగలేదు అనుకున్నాం. క్రాకో అంతా పెద్ద పెద్ద వీధులు, రోడ్లమీదే నడిచే ట్రాములు తో ప్రశాంతంగా ఉంది. ఎన్ని వేల ఏళ్ల నాటి నగరమో అనిపించింది. ప్రాచీన కట్టడాలని వీళ్ళు పరిరక్షించినట్లు ఇంకెవరూ చేయలేదు. సామాన్యుడి ఇల్లు దగ్గర్నుంచి రాజుల భవంతుల వరకూ అన్నిట్లోనూ భారీ తనం ఉట్టి పడుతుంది. ఆ ప్రాచీన కట్టడాలని అలాగే ఉంచి అందులోనే వీళ్ళు ఆధునికతని చూపించటం యూరప్ ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించేలా చేసింది. ఆ వీధుల లో నడుస్తుంటే కలిగిన అనుభూతి మాటలలో చెప్పలేనిది. పాలస్ నుండి కారు దగ్గరికి చేరుకున్నాం.ఇక్కడి నుండి జాకోపానా పర్వతం 109 కిలోమీటర్లు.క్రాకో జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకుని మా ప్రయాణం జకోపాన వైపు మొదలైంది...