నా ఐరోపా యాత్ర - 9 (పోలాండ్)
ఆశ్విత్జ్ నుండి క్రాకో నగరంలో ఉన్న ఉప్పు గని 90 కిలోమీటర్లు. ఆష్విత్జ్ చూశాక మనసంతా భారంగా తయారయ్యింది. అందరం కారులో నిశబ్ధంగానే కూర్చున్నాం. మార్చిన్ కి ఇవన్నీ తెలిసి ఉండటంతో తను త్వరగానే ఆ మూడ్ నుండి బయటకి వచ్చాడు. GPS సహాయంతో ఇంకా ఎంత దూరం ఉందో చూసుకున్నాడు. మమ్మల్ని మూడ్ లోకి తీసుకు రావటానికి పోలిష్ జోక్స్ చెప్పటం ప్రారంభించాడు. మా సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో ఇంగ్లీషు మాట్లాడగలిగిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో మార్చిన్ ఒకడు. ఇండియన్స్ అందరికీ స్థానికంగా ఏ సహాయం కావాలన్నా తనే చేసేవాడు. ఒకరకంగా అతనికి ఇంగ్లీషు భాష రావటం అనేది మాకు బాగా దగ్గరయ్యేలా చేసింది. అక్కడ షాపింగ్ అయినా , ఏదైనా ప్రభుత్వ ఆఫీసుల్లో పని ఉన్నా మాకు మార్చిన్ తోడు రావాల్సిందే. అమెరికా తరహాలో మన వాళ్ళు యూరప్ లో ఎక్కువగా ఉండకపోవటానికి కారణం ఈ భాషా సమస్య. ఇక్కడంతా ఆయా దేశపు స్థానిక భాషలే మాట్లాడతారు. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా ఎవరికీ తెలియదు. ఇక ఆశ్విత్జ్ నుండి క్రాకో వైపు మా ప్రయాణం మొదలైంది. దారిలో ఒక చిన్న గ్రామాన్ని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు ఈ గ్రామంలోనే వారి పూర్వీకులు జన్మించారట.
సాల్ట్ మైన్ బయట నేను, మార్చిన్, చోటురాం, శశి కుమార్
క్రాకో అనేది పోలాండ్ లో ఉన్న రెండవ అతిపెద్ద పురాతన నగరం. పలు విశ్వ విద్యాలయాలు, బహుళ జాతి కంపెనీలు ఈ నగరంలో ఉన్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా వార్సా కంటే ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. మన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తరచుగా ప్రాజెక్టుల నిమిత్తం ఈ నగరానికే వస్తుంటారు. ఒకప్పుడు ఇక్కడ యూదుల జనాభా ఎక్కువగా ఉండేది. యుద్ధానంతరం వారి జనాభా తగ్గిపోయింది. తోలి ఇటలీయేతర పోప్ గా ఖ్యాతికెక్కిన జాన్ పాల్ II పోలాండ్ లోని క్రాకో లోనే జన్మించారు.పలు చారిత్రక భవనాలు, మ్యూజియం లు ఈ నగర వైభవాన్ని చాటుతాయి. దాదాపు గంటా 20 నిమిషాలు ప్రయాణించాక సాల్ట్ మైన్ అని రాసున్న బోర్డు కనిపించింది. ఈ ఉప్పు గని గురించి నేను ఇంతకుముందే ఒక బ్లాగు లో చదివాను. సంవత్సరానికి 12 లక్షలమంది ఈ గని ని సందర్శిస్తారట.13 వ శతాబ్దం నుండి 2007 వరకు ఈ గనిలో కార్యకలాపాలు కొనసాగాయి. రాతి నుండి ఉప్పుని తీసే అతి కొద్ది ప్రాచీన గనుల్లో ఇది కూడా ఒకటి. సాల్ట్ రేట్ తగ్గిపోవటం మరియు గనిలోకి నీళ్ళు రావటంతో 2007 లోనే మైనింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం ఇది కేవలం సందర్శనీయ స్థలం మాత్రమే. ఈ గనిలో పని చేసే కార్మికులు అప్పుడప్పుడు చెక్కిన రాతి విగ్రహాలు, అప్పటి పోలాండ్ సంస్కృతీ, పని విధానాలని ప్రతిబింబించే విధంగా చెక్కిన పలు బొమ్మలు, క్రీస్తు జీవిత వృత్తాంతాన్ని వివరించే పలు రాతి చిత్రాలు దీనిని మ్యూజియంగా మార్చేశాయి.
అంతే కాదు పెద్ద చర్చ్ కూడా లోపల ఉంది. ఇక్కడ వివాహాలు కూడా జరుగుతాయి. ఆకాశంలోనూ, నీళ్ళలోనూ పెళ్లి చేసుకోవటం ఫాషన్ అయినట్లే భూమికి 375 మీటర్ల లోతున పెళ్లి చేసుకోవటం కూడా అరుదైన విషయమే. కాకపోతే కాస్త కాసులెక్కువ సమర్పించుకోవాలి. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలైంది.బయట చాలా మంది సందర్శకులు ఉన్నారు. మొట్ట మొదటి సారి ఇండియన్ టూరిస్ట్ లని ఇక్కడే చూశాను. గనిలోపలికి ప్రవేశ రుసుము 50 పోలిష్ జీలోటీలు. టైం టేబుల్ ప్రకారం ఒక్కో భాష గైడ్ కి ఒక్కొక్క టైం ఉంది. ఇంగ్లీష్ గైడ్ కావాలంటే కొంచెం ఖరీదు ఎక్కువ. మేము పోలిష్ గైడ్ ని ఎంచుకున్నాం. మా బాచ్ కి ఇంకా గంటన్నర టైం ఉండటంతో ఏమన్నా తిందామని బయటకి వచ్చాం.సాల్ట్ మైన్ ఎదురుగానే ఒక రెస్టారెంట్ ఉంది. నేను సాల్మన్ ఫిష్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. శశి, ఉదయ్ , చోటు రామ్ చికెన్ ఆర్డర్ చేశారు. మార్చిన్ మాత్రం పోలిష్ సాంప్రదాయ వంటకం పిరోగి ఆర్డర్ చేసాడు. ఇక్కడ ఫుడ్ చాలా చవక.పిరోగి అనేది మన సమోసా లాగే ఉంటుంది. రెడీ మెడ్ గా కూడా దొరుకుతుంది. వేడి నీళ్ళలో కాసేపు ఉడికించి టమోటా సాస్ తో తినేస్తారు. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ లోనూ కూరగాయలతో చేసే సాలన్ తప్పకుండా ఇస్తారు. ఇక్కడ సర్వ్ చేసే ఫుడ్ కూడా అందంగా డెకరేట్ చేసి ఇస్తారు. అసలు ఆ డెకరేషన్ చూస్తేనే ఎంతో ముచ్చటగా ఉంటుంది. యూరప్ అంతా స్టైలిష్ లివింగ్, తినటంలోనూ నడవటంలోనూ డ్రెస్సింగ్ లో చాలా ఆధునికంగా ఉంటారు. ఇండియన్స్ చేతితో అన్నం తింటారని వీళ్ళకి కొంత ఆశ్చర్యం కూడా. ఫోర్క్ , నైఫ్ , స్పూన్ తో తప్ప ఆహారాన్ని చేతితో అసలు తినరు. వారి ఆహరం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. మొదట్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది, తర్వాత తర్వాత అలవాటు అయ్యింది.తినేటప్పుడు నైఫ్ కుడి చేత్తోనూ, ఫోర్క్ ఎడమ చేతితోనూ పట్టుకోవాలి. లంచ్ అయ్యాక మళ్ళీ లోపలకి వచ్చాం, మా బాచ్ వాళ్ళంతా అప్పుడప్పుడే వెయిటింగ్ హాల్లోకి చేరుకుంటున్నారు. అక్కడున్న గైడ్ అమ్మాయి అందరినీ లెక్కపెడుతోంది. మేము మా టికెట్స్ ఇచ్చి క్యూ లో నిలుచున్నాం. అందరూ వచ్చాక పోలిష్ భాషలో తనని తాను పరిచయం చేసుకుని లోపల ఉన్న ఉష్ణోగ్రత -3 డిగ్రీలుగా ఉందని చెప్పింది.ఈ గని లోతు 327 మీటర్లు, మొత్తం గని పొడవు 287 కిలోమీటర్లు. కాని అందులో 4 కిలోమీటర్లు మాత్రమే సందర్శనీయ స్థలంగా ఉంది. యునెస్కో దీనిని ప్రపంచ ప్రాచీన సంపదగా గుర్తించింది. ప్రపంచంలో ఉన్న సందర్శనీయ స్థలాలలో దీనిది 12 వ స్థానం. అక్కడున్న డోర్ గుండా లోపలకి వెళ్ళాక కిందకి వెళ్ళటానికి చెక్క మెట్లు ఉన్నాయి. 375 మీటర్ల లోతుకి ఆ మెట్ల గుండానే వెళ్ళాలి.మధ్యలో ఆగుతూ దిగుతున్న కొద్దీ చలి ఎక్కువ అవసాగింది. అందరం ముందే కోట్లు వేసుకుని ఉండటంతో పెద్దగా చలి తెలియలేదు. యూరప్ లో దాదాపు 8 నెలలు చలి కోటు ధరించటం తప్పని సరి. అసలు వీళ్ళకి మంచి బట్టలు వేసుకున్నా పాపం వాటిని బయటకి చూపించుకునే అదృష్టం లేదు కదా అనిపించేది. లోపల అంతా చీకటిగానూ మసక వెలుతురు మాత్రమే ఉంది. భూమికి 375 మీటర్ల అడుగున ఉన్నామన్న ఉహే అధ్బుతంగా అనిపించింది
No comments:
Post a Comment