వార్సా అనేది పోలాండ్ రాజధాని నగరం. నేను మొత్తం 3 సార్లు ఈ నగరాన్ని సందర్శించటం జరిగింది. ఇప్పుడు మేము వెళుతున్నది అక్కడున్న ఇండియన్ ఎంబసీ నుండి జన్మదిన ధృవీకరణ పత్రం తీసుకోవటానికి. నేను మొదట్లో చెప్పినట్లుగా ఇక్కడ అన్నీ స్థానిక పరిపాలనలోనే జరుగుతాయి. మేము నివసించే మింజు జేర్జ్ నగర కార్యాలయంలోనే నివాస ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుంది. ఆ కార్డ్ కాల పరిమితి కూడా ఆయా స్థానిక అధికారే నిర్ణయిస్తాడు. ఆ కార్డు ఉంటే యూరప్ లో ఉన్న 24 దేశాలకి ఎటువంటి వీసా అవసరం లేదు. దానినే మన పాస్ పోర్ట్ గా పరిగణిస్తారు. ఆ కార్డ్ కావాలంటే ఇండియన్ ఎంబసీ నుండి జన్మదిన ధృవీకరణ పత్రం తీసుకుని స్థానిక ఆఫీసులో ఇస్తే మనకి రెసిడెన్స్ కార్డు జారీ చేస్తారు. ఉదయ్ అమ్మణ్ణ , నేను దాదాపు ఒకేసారి పోలాండ్ వచ్చాం. అంతకుముందు 10 సంవత్సరాలు అమ్మణ్ణ అమెరికాలో వర్జీనియాలో ఉన్న బ్రాంచ్ లో పని చేసి ఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయ్యాడు. సోజో జార్జ్ అనే మలయాళీ ఇక్కడ 5 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. తన పాస్ పోర్ట్ కాలపరిమితి ముగియటంతో అది పునరుద్ధరించుకోవటానికి ఇండియన్ ఎంబసి కి వస్తున్నాడు. యూరప్ దేశాలన్నీ రైలు మార్గంతో అనుసంధానించబడ్డాయి. కొన్ని రైళ్ళ వేగం గంటకి 300 కిలోమీటర్లు కూడా ఉంటుంది. ఏ దేశానికా దేశపు రైలు వ్యవస్థ తో పాటు యూరో రైల్ అనేది అన్ని దేశాలని కలుపుకుంటూ పోయే వ్యవస్థ. పోలాండ్లో రైల్ సంస్థ ని పోల్ రైల్ అంటారు. మేము వార్సా వెళ్ళాలంటే పోజ్ నాన్ వెళ్లి అక్కడినుండి ట్రైన్ లో వెళ్ళాలి. మింజు జేర్జ్ నుండి పోజ్ నాన్ గంట ప్రయాణం. ట్రైన్ 6.30 నిమిషాలకి కావటంతో మేము 4 గంటలకల్లా మింజు జేర్జ్ లో బయలుదేరితే ఆ ట్రైన్ ని అందుకోగలం. 4 గంటలకల్లా రెడీ గా ఉండమని కంపెనీ ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్ ఆడమ్ చెప్పాడు. ఇక్కడ ఆడమ్ గురించి కొంత చెప్పాలి. మా కంపెనీ పునాది వేసిన దగ్గరనుండి ఆడం మా కంపెనీకి పని చేస్తున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడటం రావటంతో కంపెనీ కి వచ్చే అతిధులని తీసుకు రావటానికి కంపెనీ అతనినే పురమాయించేది. ఇక్కడ ఉన్న ఇండియన్స్ అందరికీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడమ్ టాక్సీ లోనే వెళ్ళే వాళ్ళం. అతను కేవలం మా కంపెనీ పనులకు మాత్రమే టాక్సీ ని నడుపుతాడు. మేము టాక్సీ లో పోజ్నాన్ చేరేటప్పటికి 4.15 అయ్యింది. అక్కడున్న కౌంటర్ లో టికెట్ తీసుకుని ప్లాట్ ఫారం మీదికి వెళ్ళాం. పోలిష్ భాషలో ప్లాట్ ఫారంని పెరోన్ అంటారు. మేము ఎక్కింది పోల్ రైల్, అంటే కేవలం పోలాండ్లో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే రైల్ మాత్రమే.
ఒక అరగంట నిరీక్షించాక ట్రైన్ బయలు దేరింది. దాదాపు 3 గంటలు ప్రయాణించాక వార్సా చేరుకున్నాం. అప్పటిదాకా జనాలు పెద్దగా కనిపించని రూరల్ ఏరియాలు మాత్రమే చూసిన నాకు పెద్ద నగరాన్ని చూడటం కొత్తగా అనిపించింది. యూరప్ లో పెద్దగా స్కై స్క్రాపర్స్ కనిపించవు. అన్నీ వందల ఏళ్ళ నాటి భవంతులే ఉంటాయి. వార్సా అతి పురాతన నగరం. రెండవ ప్రపంచ యుద్ధ పతనం ప్రారంభమైంది ఇక్కడే. నాజీలు ఈ నగరాన్ని బాంబులతో నేల మట్టం చేశారు. యూదులు అందరినీ ఇక్కడ ఘెట్టో లో ( యూదులు నివసించే ప్రాంతాన్ని ఘెట్టో అంటారు ) బంధించి హింసిస్తుంటే కొంతమంది యువకులు ప్రతిఘటించి నాజీలని ఎదిరించి పోరాడారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పతనానికి నాంది ఇక్కడే మొదలైంది. అప్పటిదాకా యుదులంతా తమపై జరుగుతున్న దాడులని ఎక్కడా ప్రతిఘటించలేక పోయారు. వార్సా ఘెట్టో ఆ ప్రతిఘటనకి వేదికైంది. రైల్వే స్టేషన్ నుండి ఇండియన్ ఎంబసీకి టాక్సీలో వెళ్ళాలి. సోజో ఇంతకుముందు వెళ్ళిన అనుభవం ఉండటంతో తనే టాక్సీ ని పిలిచి అడ్రెస్ చెప్పాడు.10 నిమిషాల తర్వాత టాక్సీ ఒక పదంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది. ఆ బిల్డింగ్ ఎనిమిదో ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ లో ఇండియన్ ఎంబసీ ఉంది. నేను ఇంతకుముందు పోలాండ్ వీసా కోసం నేను మన దేశంలో ఉన్న పోలాండ్ ఎంబసీ కి వెళ్ళాను. డిల్లీ లో చాణక్య పురి లో అన్ని దేశాల ఎంబసీలు కొలువై ఉంటాయి. ఒక్కోటి 2 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో విశాలంగా ఉండటం చూశాను. కాని ఇక్కడ మన ఎంబసీని చూశాక చాలా ఆశ్చర్య పోయాను. అగ్గిపెట్టె లాంటి చిన్న లిఫ్ట్ లో 8 వ అంతస్తుకి వెళితే కనీసం విజిటర్స్ కూర్చోవటానికి సరైన కుర్చీలు కూడా లేవు. దేశం కాని దేశంలో కూడా వచ్చిన వారితో అక్కడి ఉద్యోగులు కనీస మర్యాదలు కూడా పాటించటం లేదు. మేము వచ్చిన పని చెప్పి మా పాస్ పోర్ట్ ఇచ్చి నిలబడ్డాం. దాదాపు గంట నిరీక్షణ తరువాత లోపలికి పిలిచి మాకు కావాల్సిన లెటర్స్ ఇచ్చారు. సోజో జార్జ్ కి కూడా రెన్యువల్ అయిన పాస్ పోర్ట్ ఇచ్చారు. మళ్లీ తిరుగు ప్రయాణానికి చాలా సమయం ఉంది. సిటీ చూద్దామని బయటకి వచ్చాము. అక్కడికి కొద్ది దూరంలోనే పెద్ద పార్క్ ఉంది. ఆ పార్క్ లో రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి గుర్తుగా కట్టిన ఒక స్థూపం దగ్గర నిలబడి చూస్తున్నాం. మమ్మల్ని చూసిన ఒక 70 ఏళ్ల మహిళ మా దగ్గరకి వచ్చి ఆవేశంగా ఆ స్థూపాన్ని చూపిస్తూ ఏదో చెప్పింది. మేమిద్దరం కొత్త కావటంతో మాకు ఆ పోలిష్ భాషలో ఏమి చెప్తుందో అర్ధం కాలేదు. సోజో కి పోలిష్ భాష రావటంతో ఆమె చెప్పేది విని మాకు వివరించాడు. యుద్ధం జరిగినపుడు నాజీలు ఎన్ని అకృత్యాలకి పాల్పడ్డారో చెపుతూ ఆ పార్క్ లో నే జరిగిన నర మేధం గురించి చెప్పింది.
అక్కడ కాసేపు గడిపాక బయటకి వచ్చాం. రోడ్డు మధ్యలో ట్రాములు తిరుగుతున్నాయి,నేను ట్రాము చూడటం అదే మొదటి సారి. రోడ్ల మధ్యన ట్రాఫిక్ కి , నడిచేవాళ్ళకి ఇబ్బంది లేకుండా నడుస్తున్న వాటిని చూస్తే కొంచెం ఆశ్చర్యం వేసింది. సిగ్నలింగ్ వ్యవస్థ అంతా రోడ్లకి, ట్రాము మార్గానికి సమకాలీకరించి ఉంది. జూన్ 8 నుండి యూరో ఫుట్ బాల్ క్రీడలు జరుగుతున్నాయి. మేము వెళ్ళిన రోజు వార్సా లో మాచ్ ఉంది. ఆ రోజు వార్సా అంతా ఎటు చూసినా పోలాండ్ జండాలతో పట్టుకుని ఫుట్ బాల్ ఫీవర్ తో జనాలంతా ఉత్సాహంగా ఉన్నారు.మనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో ఇక్కడ వాళ్ళకి ఫుట్ బాల్ అంటే అంత పిచ్చి.కాసేపు ఆ హడావుడి అంతా చూశాక పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్ళాము. ప్రపంచీకరణ మొదలయ్యాక కొన్ని ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా ఒకేరకంగా అన్పిస్తాయి. నేను హైదరాబాదు లో చూసిన షాపింగ్ మాల్స్ కి ఇతర దేశాలన్నిటిలో చూసిన షాపింగ్ మాల్స్ కి ఎక్కడా తేడా లేదు. షాపింగ్ మాల్ ఫార్మాట్ అంతా అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటుంది. భారత దేశంలో ఉన్న పేరొందిన మౌలిక సదుపాయాల కల్పన కంపెనీలన్నీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులని నిర్మిస్తుండటంతో, ఆధునిక నిర్మాణాలలో మిగతా దేశాలలో నిర్మాణాలకి, మన వాటికి పెద్ద తేడా కనిపించదు. అందుకే ఆ మాల్ చూస్తున్నంత సేపు నాకు ఏ జివికె లోనో, ఇనార్బిట్ మాల్ లోనో ఉన్నట్లే ఉంది. చాన్నాళ్ళకి కే ఎఫ్ సి కనపడటంతో లంచ్ అక్కడే కానిచ్చేసి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము. ఇప్పుడు మేము వెళ్లబోయేది యూరో రైల్. వార్సా నుండి బెర్లిన్ వెళ్ళే రైలు అది. మేమున్న ప్రాంతానికి వెళ్ళటానికి బోశినేక్ అనే స్టేషన్లో దిగాలి. పోల్ రైల్ కంటే యూరో రైల్ స్పీడ్ ఎక్కువ,అలాగే టికెట్ రేట్ కూడా ఎక్కువే.ప్రతి ఆరుగురికి ఒక కాబిన్ ఉంటుంది. ట్రైన్ లో పెద్దగా జనాలు లేకపోవటంతో ఒక కాబిన్ లో ముగ్గురం కూర్చున్నాం. ఒక గంట తరువాత ఒక అమ్మాయి మేమున్న కాబిన్ లోకి వచ్చి కూర్చుంది. ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఆ అమ్మాయిని మీరేం చేస్తుంటారని అడిగాను.తను ఒక బస్సుల తయారీ కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నానని చెప్పింది. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతోంది. కాసేపు ఇండియా కల్చర్ మీద పోలాండ్ కల్చర్ మీద కొంత ఆసక్తి కరమైన విషయాలు చర్చించాము. తనకి ఒక హిందీ పదం వచ్చు అని చెప్పింది. ఏంటో చెప్పమని అడిగాం, మైనే ప్యార్ కియా అని నవ్వింది. ఇంతకుముందు పోలాండ్ లో జరిగిన ఒక ఎక్స్ పో లో ఇండియన్ స్టాల్ లో పని చేసినపుడు ఒకతను ఆ పదం నేర్పించాడట. దాని అర్ధం కూడా తనకి తెలుసు అని చెప్పింది. కాసేపటికి పోజ్ నాన్ స్టేషన్ రావటంతో ఆమె ఆ స్టేషన్లో దిగిపోయింది.
మేము ఇప్పడు పోజ్ నాన్ లో దిగకుండా తర్వాతి స్టేషన్ లో దిగాలి. మేము దిగగానే ఆడం మాకోసం స్టేషన్ బయట సిద్ధంగా ఉన్నాడు. వార్సా కాకుండా మేము తరచుగా సులేచిన్, పోజ్ నాన్, గోజుఫ్, జెలన గోర నగరాలకి తరచుగా వెళ్తుండే వాళ్ళం. సులేచిన్ లో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. పోజ్ నాన్ లో కూడా 2 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కాని మేము ఒక్కటే చూసాము. మధ్య ప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి దీనిని నడుపుతున్నాడు. జెలన గోర కొంచెం పెద్ద నగరం, అక్కడ నమస్తే ఇండియా అనే ఒక రెస్టారెంట్ ఉంది. హర్యానా కి చెందిన వ్యక్తి ఇక్కడ స్థానిక యువతిని వివాహమాడి ఇక్కడే స్థిర పడ్డాడు. సులేచిన్ లో తాజ్ మహల్ అనే రెస్టారెంట్ ఉంది, కాని ఇక్కడ వంట వాడు బంగ్లాదేశ్ కి చెందినవాడు. యూరోపియన్ దేశాలలో అత్యంత చవకగా నివసించగలిగిన దేశం పోలాండ్.మిగతా దేశాలలో నివసించే ఖర్చులో 50 శాతంలోనే ఇక్కడ జీవించవచ్చు. ఇప్పుడిప్పుడే భారత విద్యార్ధులు పోలాండ్ వైపు చూస్తున్నారు. వార్సా లో ఉన్న పలు యూనివర్సిటీలు ఇంగ్లీష్ భోధనా మాధ్యమంలో మన వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఒక్క భాషా సమస్యని మినహాయిస్తే ఇక్కడి ప్రజలు చాలా మంచి వారు. వర్ణ వివక్ష, అసూయా ద్వేషాలనేవి వారిలో మచ్చుకైనా కనిపించలేదు. సహాయ పడటంలోనూ స్నేహం చేయటంలోనూ వారి తరువాతే ఎవరైనా. ఇప్పటికీ అక్కడి కుటుంబాలతో మా స్నేహం అవిచ్చిన్నంగా కొనసాగుతోంది. పోలాండ్ తరువాత నేను చూసిన దేశం స్వీడన్.
No comments:
Post a Comment