Monday, December 23, 2013
Sunday, December 22, 2013
నా ఐరోపా యాత్ర - 13 (స్వీడన్)
పోలాండ్ తర్వాత నేను చూసిన తరువాతి దేశం స్వీడన్ . నా రూమ్మేట్ శశి వాళ్ళ తమ్ముడు స్వీడన్లో ఉంటున్నాడు. తమిళనాడులో ఇంజినీరింగ్ అయిపోయాక మాస్టర్స్ చేయటానికి స్వీడన్ వచ్చాడు. ఇప్పుడు చదువు అయిపోయి అక్కడే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. శశి తన తమ్ముడిని కలవడానికి వెళుతూ నవంబర్ 16, 2012 న నన్ను కూడా తనతో రమ్మని అనటంతో 3 రోజుల అక్కడ గడపటం కోసం ఇద్దరం బయలుదేరాం. విమానయాన సంస్థ విజ్జ్ ఎయిర్ పోలాండ్లోని పోజ్నాన్ నుండి స్వీడన్ కి విమానాలు నడుపుతుంది. నేను అప్పటికి కార్ కొనడంతో మేముండే మింజు జేర్జ్ నుండి పోజ్నాన్ వరకు కార్లో వెళ్లి ఎయిర్ పోర్ట్ లో కార్ పార్క్ చేసి వెళదామని నిర్ణయించుకున్నాం. ఆరోజు అంతా మబ్బుగా ఉండి అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకి మింజు జేర్జ్ నుండి బయలుదేరాం. మామూలుగా అయితే గంటన్నరలో పోజ్నాన్ చేరుకోవచ్చు. ఆరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో కొంచెం ఆందోళన పడుతూనే 4 గంటలకి ఎయిర్ పోర్ట్ చేరుకున్నాం. సాయంత్రం 5.45 నిమిషాలకి బయలుదేరాల్సిన విమానం కొంచెం ఆలస్యంగా 6.30 నిమిషాలకి బయలుదేరింది. యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలుగా ఉన్నా సరే స్వీడన్, నార్వే , డెన్మార్క్ దేశాలని మాత్రం స్కాండినేవియా దేశాలుగా పిలుస్తారు. కొన్ని సందర్భాలలో ఫిన్ లాండ్ మరియు ఐస్ లాండ్ కూడా ఈ కోవలోకే వస్తాయని చెపుతారు. ఈ మూడు దేశాల సంస్కృతీ, భాషని బట్టి వీటిని అలా పిలుస్తారు. యూరప్ లో అన్ని దేశాలు రోడ్డు, రైలు ద్వారా కలిసే ఉంటాయి కాని స్వీడన్ మాత్రం మధ్యలో సముద్రం ఉండటంతో కేవలం వాయు, జల మార్గాల ద్వారానే మిగతా దేశాలకి అనుసంధానించి ఉంది.ఇప్పుడు మేము వెళ్ళబోయేది స్వీడన్ రాజధాని స్టాక్ హోం నగరం.అక్కడ రెండు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. Stockholm Skavsta అనేది సిటీ కి కొంచెం దూరంగా ఉన్న ఎయిర్ పోర్ట్. మేము అక్కడ దిగి బస్సు లో నగరానికి చేరుకోవాలి. పోజ్నాన్ నుండి ఫ్లైట్ లో గంట ప్రయాణం అయితే మళ్లీ ఎయిర్ పోర్ట్ నుండి స్టాక్ హోం చేరుకోవటానికి బస్సు లో మరో గంట పట్టింది. ఈ టికెట్స్ అన్ని ఆన్ లైన్ లోనే శశి వాళ్ళ తమ్ముడు బుక్ చేయటంతో మేము ఎక్కడా ఆలోచించాల్సిన అవసరం రాలేదు. సరిగా 8. 45 నిమిషాలకి బస్సు ఒక మెట్రో స్టేషన్ ముందు ఆగింది. మాకోసం అప్పటికే శరవణన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మేము బస్సు దిగగానే ఆప్యాయంగా పలకరించి త్వరగా అంటూ భూగర్భంలో ఉన్న మెట్రో స్టేషన్ కి దారి తీసాడు. తను ఉండటంతో మేము స్వీడిష్ కరెన్సీ ఏమి తీసుకురాలేదు. స్వీడన్ కరెన్సీ పేరు క్రోనా. ఒక పోలిష్ జిలోటికి 2 క్రోనాలు వస్తాయి. ఖచ్చితంగా పోలాండ్ కరెన్సీ కి ఇది రెండింతలు అన్నమాట. మెట్రో స్టేషన్ కౌంటర్ లో 400 క్రోనాలు చెల్లించి మా ఇద్దరికీ చెరొక స్మార్ట్ కార్డు తీసుకున్నాడు. మేము స్టాక్ హోం లో ఉన్న మూడు రోజులూ ఆ కార్డుతో ఎక్కడికైనా ప్రయాణం చెయ్యచ్చు. బస్సు, ట్రాము, మెట్రో రైల్, వాటర్ బోటులు ఎందులోనైనా ఈ కార్డుతోనే ప్రయాణించవచ్చు. ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ఒకే గవాక్షం కిందే ఉండటం నాకు బాగా నచ్చిన అంశం.ఈ కార్డ్ పేరు ACCESS.
ఆ కార్డు తీసుకుని వడి వడిగా నడుచుకుంటూ మరో అంతస్తు కింద భూగర్భంలో ఉన్న మెట్రో స్టేషన్ లోకి వెళ్ళాము. అక్కడ నుండి 15 నిమిషాలు ప్రయాణించాక యూనివర్సిటీ స్టేషన్ కి చేరుకున్నాము. స్టేషన్ నుండి బయటకి వచ్చి శరవణన్ ఫ్లాట్ కి వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి. పోలాండ్ కంటే స్వీడన్ లో చలి కొంచెం ఎక్కువగానే ఉంది. పసిఫిక్ ధృవానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దేశాలలో హిమపాతం కూడా ఎక్కువే అని శరవణన్ చెప్పాడు.తనతో పాటు ఉండే మిత్రులు అన్బు , అరుణ్ లు తమ పని ముగిసాక ఆ సమయానికి అదే బస్ స్టాప్ కి చేరుకున్నారు. ఆ బస్ స్టాప్ లో తరువాతి బస్సు 9. 43 నిముషాలకి అని డిజిటల్ డిస్ ప్లే లో చూపిస్తోంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత ఖచ్చితంగా సమయానికి వస్తుందా అని శరవణన్ ని అడిగాను. తన దగ్గరున్న ఐ ఫోన్ లో ఒక అప్లికేషన్ చూపించి ఇక్కడ రవాణా వ్యవస్థ అంతా జిపిఎస్ తో అనుసంధానించి ఉంటుందని, ఆ అప్లికేషన్ సహాయంతో ఏ బస్సు ఎక్కడ ఉందో, ఎప్పుడు ఎక్కడికి వస్తుందో మనం కూడా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. ఒక వేళ ట్రాఫిక్ లో ఆలస్యం అయినా జిపిఎస్ ద్వారా ఆ బస్సు ఉన్న దూరాన్ని గ్రహించి ఆటోమాటిక్ గా అవి వచ్చే టైమింగ్స్ మారిపోతాయని చెప్పాడు. కాసేపటి తర్వాత అక్కడ చూపించినట్లు గానే సరిగా 9. 43 నిమిషాలకి మా ముందు బస్సు ఆగింది.యూనివర్సిటీ ఏరియా కావటంతో చాలామంది విద్యార్ధులే కనిపించారు. స్వీడన్ లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ. జి ఆర్ ఈ , టోఫెల్ లాంటి టెస్ట్ ఏమీ లేకుండానే నేరుగా యూనివర్సిటీ లోకి ప్రవేశం ఉంటుంది. ఐరోపా విద్యావ్యవస్థలోని అద్భుత లక్షణం... యూనివర్సిటీలకు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం. పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి యూనివర్సిటీలు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. వివిధ కోర్సులు చేసిన విద్యార్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి యూనివర్సిటీలు అవకాశం కల్పిస్తాయి. లైవ్ రిసెర్చ్ ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు. పాఠ్యప్రణాళికలో నవ్యత్వం ఉంటుంది. సాంస్కృతిక పరంగా కూడా ఐరోపా దేశాల్లో మరింత భిన్నత్వం, పోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త భాషలు నేర్చుకోవడానికి వీలుంటుంది. మంచి ఉద్యోగ అవకాశాలు సాధించడానికి ఇవి తోడ్పడతాయి. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడానికి అనుమతిస్తారు.అనేక ఇతర దేశాలతో పోల్చుకుంటే ఐరోపా దేశాల్లో నేరశాతం చాలా తక్కువ. పర్యావరణానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.నాకు ఎక్కువగా అక్కడ తమిళియన్స్ కనిపించారు.కాని వాళ్ళంతా ఇండియన్ తమిళ్ కాదు. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చి స్థిర పడ్డ మిళులే ఎక్కువ. లంకలో ఎల్ టి టి ఈ మీద నిషేధం ఉన్నపుడు స్విట్జెర్లాండ్, స్వీడన్, నార్వే దేశాలు చాలామంది తమిళులకి ఆశ్రయాన్ని కల్పించాయి. తదనంతర కాలంలో వారందరికీ ఆయా దేశాల సభ్యత్వం కూడా లభించింది. అయితే ఇక్కడ మెట్రోపాలిటన్ నగరాలను మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో జన సాంద్రత చ.కి.మీ కు 20 మాత్రమే. 84% శాతం మంది నగరాలలోనే నివసిస్తారు. నగరాల మొత్తం వైశాల్యం దేశ వైశాల్యంలో 1.3% మాత్రమే. దాదాపు జనాభా అంతా స్టాక్ హోం లోనే ఉంటుంది.శరవణన్ మిత్రులు అన్బు , అరుణ్ లతోపాటు ఒకటే ఫ్లాట్ లో నివసిస్తున్నారు. ఇక్కడ ఇంటి అద్దెలు చాలా ఖరీదు. కాని స్టూడెంట్ లకి మాత్రం ప్రభుత్వమే రాయితీలతో కొన్ని నివాస సముదాయాలని కేటాయిస్తుంది. అందుకే వీళ్ళ మాస్టర్స్ డిగ్రీ అయిపోయినా ఏదో కోర్సుల పేరుతో స్టూడెంట్ గానే నివసిస్తారు.అలాంటి ఫ్లాట్స్ లోనే వీరు ముగ్గురు ఉంటున్నారు. అందరం కలిసి ఫ్లాట్ కి చేరుకున్నాం.
ఆరోజు అరుణ్ పుట్టిన రోజు కావటంతో అక్కడ ఉండే స్థానిక మిత్రులంతా వారి ఫ్లాట్ కి వచ్చి ఉన్నారు.పరస్పర పరిచయాలయ్యాక 12 గంటలకు కేక్ కట్ చేసి అందరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు తుపాకి అనే తమిళ్ సినిమా రిలీజ్ అవుతోంది. అందరం వెళదాం అని అన్నారు. యూరప్ లో నేను ధియేటర్ లో చూసిన మొట్ట మొదటి సినిమా తుపాకి. నేను నా కెరీర్లో పని చేసిన అన్ని సంస్థలలోనూ తమిళ మిత్రులు ఉన్నారు.ఎందుకో ఆ భాష మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం . దుబాయిలో పని చేసే సమయంలో కొంత మంది మిత్రుల దగ్గర తమిళ్ మాట్లాడటం నేర్చుకున్నాను. కాబట్టి నాకు ఆ భాషా సమస్య కూడా లేదు. నేను తెలుగువాడిని అని తెలుసుకున్నాక అన్బు ఒక తెలుగు మిత్రుడిని నాకు పరిచయం చెయ్యాలని అతనికి కాల్ చేసాడు . ఆరోజు అతనికి వేరే పని ఉండటంతో రేపు వచ్చి కలుస్తానని చెప్పాడు. నేను యూరప్ వెళ్ళిన 6 నెలల తర్వాత కలుసుకున్న మొట్ట మొదటి తెలుగు వ్యక్తి ఇతనే. అతని పేరు మధ్యాహ్నపు నాగార్జున.
Monday, December 2, 2013
ఘంటసాల గ్రామ చరిత్ర kinige లో
ఘంటసాల గ్రామ చరిత్రను బౌద్ధుల కాలం నుండి ఆధునిక యుగం వరకు అలవోకగా వివరిస్తూ, ఆర్థిక, సాంఘిక, సామాజిక మార్పులను తెలియజేసే గ్రంథమే ఈ ఘంటసాల చరిత్ర.
Read the book in below link.
http://kinige.com/kbook.php?id=2377&name=Ghantasala+Charitra
ఈ గ్రంథాన్ని గొర్రెపాటి వెంకటసుబ్బయ్య 1946 ప్రాంతంలో మొదట రచించి ప్రచురించారు. ఇరవై సంవత్సరాల తర్వాత జరిగిన పరిశోధనలతో విస్తృత పరచి తిరిగి 1966లో పునర్ముద్రించారు. ఘంటసాల గతాన్ని 'ఆవిష్కరించడం' (1947), 'పునరావిష్కరించడం' (1966) గొర్రెపాటి వెంకట సుబ్బయ్య జీవితకాలంలో సాధించిన ఘనకార్యం.
ఈ అర్థశతాబ్దకాలంలో చరిత్ర రచనా పద్దతుల్లో వస్తున్న మార్పులను పక్కనబెట్టి, ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఈ గ్రంథ రచనలోని లోపాలు వారు జీవించిన కాలానివే గాని, వారివి కావు. పండిత గొర్రెపాటి తను జీవించిన కాలపు ప్రతినిధిగా స్థానిక చరిత్రాధ్యయనానికి గట్టి పునాదులు వేసి చరిత్రకారులకు మార్గదర్శకులైనారు.
ఈ గ్రంథంలో కూర్చిన చరిత్రక వివరాలు, చరిత్ర పరిశీలనా పద్ధతులు, కాలక్రమంలో ఘంటసాల నూతన సమాజ అవతరణకు కృషి చేసిన స్థానిక జనసమూహాల, సంఘటనల, వ్యవస్థల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు రచించిన ఈ గ్రంథం సామాన్య ప్రజలతో పాటు పరిశోధకులకు కూడా ఈనాటికీ ఎంతో ఉపయుక్తమని భావిస్తున్నాను.
- కుర్రా జితేంద్రబాబు
న్యాయవాది - చారిత్రక పరిశోధకులు
న్యాయవాది - చారిత్రక పరిశోధకులు
Read the book in below link.
http://kinige.com/kbook.php?id=2377&name=Ghantasala+Charitra
Subscribe to:
Posts (Atom)