Monday, December 23, 2013
Sunday, December 22, 2013
నా ఐరోపా యాత్ర - 13 (స్వీడన్)
పోలాండ్ తర్వాత నేను చూసిన తరువాతి దేశం స్వీడన్ . నా రూమ్మేట్ శశి వాళ్ళ తమ్ముడు స్వీడన్లో ఉంటున్నాడు. తమిళనాడులో ఇంజినీరింగ్ అయిపోయాక మాస్టర్స్ చేయటానికి స్వీడన్ వచ్చాడు. ఇప్పుడు చదువు అయిపోయి అక్కడే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. శశి తన తమ్ముడిని కలవడానికి వెళుతూ నవంబర్ 16, 2012 న నన్ను కూడా తనతో రమ్మని అనటంతో 3 రోజుల అక్కడ గడపటం కోసం ఇద్దరం బయలుదేరాం. విమానయాన సంస్థ విజ్జ్ ఎయిర్ పోలాండ్లోని పోజ్నాన్ నుండి స్వీడన్ కి విమానాలు నడుపుతుంది. నేను అప్పటికి కార్ కొనడంతో మేముండే మింజు జేర్జ్ నుండి పోజ్నాన్ వరకు కార్లో వెళ్లి ఎయిర్ పోర్ట్ లో కార్ పార్క్ చేసి వెళదామని నిర్ణయించుకున్నాం. ఆరోజు అంతా మబ్బుగా ఉండి అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకి మింజు జేర్జ్ నుండి బయలుదేరాం. మామూలుగా అయితే గంటన్నరలో పోజ్నాన్ చేరుకోవచ్చు. ఆరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో కొంచెం ఆందోళన పడుతూనే 4 గంటలకి ఎయిర్ పోర్ట్ చేరుకున్నాం. సాయంత్రం 5.45 నిమిషాలకి బయలుదేరాల్సిన విమానం కొంచెం ఆలస్యంగా 6.30 నిమిషాలకి బయలుదేరింది. యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలుగా ఉన్నా సరే స్వీడన్, నార్వే , డెన్మార్క్ దేశాలని మాత్రం స్కాండినేవియా దేశాలుగా పిలుస్తారు. కొన్ని సందర్భాలలో ఫిన్ లాండ్ మరియు ఐస్ లాండ్ కూడా ఈ కోవలోకే వస్తాయని చెపుతారు. ఈ మూడు దేశాల సంస్కృతీ, భాషని బట్టి వీటిని అలా పిలుస్తారు. యూరప్ లో అన్ని దేశాలు రోడ్డు, రైలు ద్వారా కలిసే ఉంటాయి కాని స్వీడన్ మాత్రం మధ్యలో సముద్రం ఉండటంతో కేవలం వాయు, జల మార్గాల ద్వారానే మిగతా దేశాలకి అనుసంధానించి ఉంది.ఇప్పుడు మేము వెళ్ళబోయేది స్వీడన్ రాజధాని స్టాక్ హోం నగరం.అక్కడ రెండు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. Stockholm Skavsta అనేది సిటీ కి కొంచెం దూరంగా ఉన్న ఎయిర్ పోర్ట్. మేము అక్కడ దిగి బస్సు లో నగరానికి చేరుకోవాలి. పోజ్నాన్ నుండి ఫ్లైట్ లో గంట ప్రయాణం అయితే మళ్లీ ఎయిర్ పోర్ట్ నుండి స్టాక్ హోం చేరుకోవటానికి బస్సు లో మరో గంట పట్టింది. ఈ టికెట్స్ అన్ని ఆన్ లైన్ లోనే శశి వాళ్ళ తమ్ముడు బుక్ చేయటంతో మేము ఎక్కడా ఆలోచించాల్సిన అవసరం రాలేదు. సరిగా 8. 45 నిమిషాలకి బస్సు ఒక మెట్రో స్టేషన్ ముందు ఆగింది. మాకోసం అప్పటికే శరవణన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మేము బస్సు దిగగానే ఆప్యాయంగా పలకరించి త్వరగా అంటూ భూగర్భంలో ఉన్న మెట్రో స్టేషన్ కి దారి తీసాడు. తను ఉండటంతో మేము స్వీడిష్ కరెన్సీ ఏమి తీసుకురాలేదు. స్వీడన్ కరెన్సీ పేరు క్రోనా. ఒక పోలిష్ జిలోటికి 2 క్రోనాలు వస్తాయి. ఖచ్చితంగా పోలాండ్ కరెన్సీ కి ఇది రెండింతలు అన్నమాట. మెట్రో స్టేషన్ కౌంటర్ లో 400 క్రోనాలు చెల్లించి మా ఇద్దరికీ చెరొక స్మార్ట్ కార్డు తీసుకున్నాడు. మేము స్టాక్ హోం లో ఉన్న మూడు రోజులూ ఆ కార్డుతో ఎక్కడికైనా ప్రయాణం చెయ్యచ్చు. బస్సు, ట్రాము, మెట్రో రైల్, వాటర్ బోటులు ఎందులోనైనా ఈ కార్డుతోనే ప్రయాణించవచ్చు. ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ఒకే గవాక్షం కిందే ఉండటం నాకు బాగా నచ్చిన అంశం.ఈ కార్డ్ పేరు ACCESS.
ఆ కార్డు తీసుకుని వడి వడిగా నడుచుకుంటూ మరో అంతస్తు కింద భూగర్భంలో ఉన్న మెట్రో స్టేషన్ లోకి వెళ్ళాము. అక్కడ నుండి 15 నిమిషాలు ప్రయాణించాక యూనివర్సిటీ స్టేషన్ కి చేరుకున్నాము. స్టేషన్ నుండి బయటకి వచ్చి శరవణన్ ఫ్లాట్ కి వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి. పోలాండ్ కంటే స్వీడన్ లో చలి కొంచెం ఎక్కువగానే ఉంది. పసిఫిక్ ధృవానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దేశాలలో హిమపాతం కూడా ఎక్కువే అని శరవణన్ చెప్పాడు.తనతో పాటు ఉండే మిత్రులు అన్బు , అరుణ్ లు తమ పని ముగిసాక ఆ సమయానికి అదే బస్ స్టాప్ కి చేరుకున్నారు. ఆ బస్ స్టాప్ లో తరువాతి బస్సు 9. 43 నిముషాలకి అని డిజిటల్ డిస్ ప్లే లో చూపిస్తోంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత ఖచ్చితంగా సమయానికి వస్తుందా అని శరవణన్ ని అడిగాను. తన దగ్గరున్న ఐ ఫోన్ లో ఒక అప్లికేషన్ చూపించి ఇక్కడ రవాణా వ్యవస్థ అంతా జిపిఎస్ తో అనుసంధానించి ఉంటుందని, ఆ అప్లికేషన్ సహాయంతో ఏ బస్సు ఎక్కడ ఉందో, ఎప్పుడు ఎక్కడికి వస్తుందో మనం కూడా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. ఒక వేళ ట్రాఫిక్ లో ఆలస్యం అయినా జిపిఎస్ ద్వారా ఆ బస్సు ఉన్న దూరాన్ని గ్రహించి ఆటోమాటిక్ గా అవి వచ్చే టైమింగ్స్ మారిపోతాయని చెప్పాడు. కాసేపటి తర్వాత అక్కడ చూపించినట్లు గానే సరిగా 9. 43 నిమిషాలకి మా ముందు బస్సు ఆగింది.యూనివర్సిటీ ఏరియా కావటంతో చాలామంది విద్యార్ధులే కనిపించారు. స్వీడన్ లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ. జి ఆర్ ఈ , టోఫెల్ లాంటి టెస్ట్ ఏమీ లేకుండానే నేరుగా యూనివర్సిటీ లోకి ప్రవేశం ఉంటుంది. ఐరోపా విద్యావ్యవస్థలోని అద్భుత లక్షణం... యూనివర్సిటీలకు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం. పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి యూనివర్సిటీలు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. వివిధ కోర్సులు చేసిన విద్యార్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి యూనివర్సిటీలు అవకాశం కల్పిస్తాయి. లైవ్ రిసెర్చ్ ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు. పాఠ్యప్రణాళికలో నవ్యత్వం ఉంటుంది. సాంస్కృతిక పరంగా కూడా ఐరోపా దేశాల్లో మరింత భిన్నత్వం, పోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త భాషలు నేర్చుకోవడానికి వీలుంటుంది. మంచి ఉద్యోగ అవకాశాలు సాధించడానికి ఇవి తోడ్పడతాయి. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడానికి అనుమతిస్తారు.అనేక ఇతర దేశాలతో పోల్చుకుంటే ఐరోపా దేశాల్లో నేరశాతం చాలా తక్కువ. పర్యావరణానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.నాకు ఎక్కువగా అక్కడ తమిళియన్స్ కనిపించారు.కాని వాళ్ళంతా ఇండియన్ తమిళ్ కాదు. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చి స్థిర పడ్డ మిళులే ఎక్కువ. లంకలో ఎల్ టి టి ఈ మీద నిషేధం ఉన్నపుడు స్విట్జెర్లాండ్, స్వీడన్, నార్వే దేశాలు చాలామంది తమిళులకి ఆశ్రయాన్ని కల్పించాయి. తదనంతర కాలంలో వారందరికీ ఆయా దేశాల సభ్యత్వం కూడా లభించింది. అయితే ఇక్కడ మెట్రోపాలిటన్ నగరాలను మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో జన సాంద్రత చ.కి.మీ కు 20 మాత్రమే. 84% శాతం మంది నగరాలలోనే నివసిస్తారు. నగరాల మొత్తం వైశాల్యం దేశ వైశాల్యంలో 1.3% మాత్రమే. దాదాపు జనాభా అంతా స్టాక్ హోం లోనే ఉంటుంది.శరవణన్ మిత్రులు అన్బు , అరుణ్ లతోపాటు ఒకటే ఫ్లాట్ లో నివసిస్తున్నారు. ఇక్కడ ఇంటి అద్దెలు చాలా ఖరీదు. కాని స్టూడెంట్ లకి మాత్రం ప్రభుత్వమే రాయితీలతో కొన్ని నివాస సముదాయాలని కేటాయిస్తుంది. అందుకే వీళ్ళ మాస్టర్స్ డిగ్రీ అయిపోయినా ఏదో కోర్సుల పేరుతో స్టూడెంట్ గానే నివసిస్తారు.అలాంటి ఫ్లాట్స్ లోనే వీరు ముగ్గురు ఉంటున్నారు. అందరం కలిసి ఫ్లాట్ కి చేరుకున్నాం.
ఆరోజు అరుణ్ పుట్టిన రోజు కావటంతో అక్కడ ఉండే స్థానిక మిత్రులంతా వారి ఫ్లాట్ కి వచ్చి ఉన్నారు.పరస్పర పరిచయాలయ్యాక 12 గంటలకు కేక్ కట్ చేసి అందరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు తుపాకి అనే తమిళ్ సినిమా రిలీజ్ అవుతోంది. అందరం వెళదాం అని అన్నారు. యూరప్ లో నేను ధియేటర్ లో చూసిన మొట్ట మొదటి సినిమా తుపాకి. నేను నా కెరీర్లో పని చేసిన అన్ని సంస్థలలోనూ తమిళ మిత్రులు ఉన్నారు.ఎందుకో ఆ భాష మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం . దుబాయిలో పని చేసే సమయంలో కొంత మంది మిత్రుల దగ్గర తమిళ్ మాట్లాడటం నేర్చుకున్నాను. కాబట్టి నాకు ఆ భాషా సమస్య కూడా లేదు. నేను తెలుగువాడిని అని తెలుసుకున్నాక అన్బు ఒక తెలుగు మిత్రుడిని నాకు పరిచయం చెయ్యాలని అతనికి కాల్ చేసాడు . ఆరోజు అతనికి వేరే పని ఉండటంతో రేపు వచ్చి కలుస్తానని చెప్పాడు. నేను యూరప్ వెళ్ళిన 6 నెలల తర్వాత కలుసుకున్న మొట్ట మొదటి తెలుగు వ్యక్తి ఇతనే. అతని పేరు మధ్యాహ్నపు నాగార్జున.
Monday, December 2, 2013
ఘంటసాల గ్రామ చరిత్ర kinige లో
ఘంటసాల గ్రామ చరిత్రను బౌద్ధుల కాలం నుండి ఆధునిక యుగం వరకు అలవోకగా వివరిస్తూ, ఆర్థిక, సాంఘిక, సామాజిక మార్పులను తెలియజేసే గ్రంథమే ఈ ఘంటసాల చరిత్ర.
Read the book in below link.
http://kinige.com/kbook.php?id=2377&name=Ghantasala+Charitra
ఈ గ్రంథాన్ని గొర్రెపాటి వెంకటసుబ్బయ్య 1946 ప్రాంతంలో మొదట రచించి ప్రచురించారు. ఇరవై సంవత్సరాల తర్వాత జరిగిన పరిశోధనలతో విస్తృత పరచి తిరిగి 1966లో పునర్ముద్రించారు. ఘంటసాల గతాన్ని 'ఆవిష్కరించడం' (1947), 'పునరావిష్కరించడం' (1966) గొర్రెపాటి వెంకట సుబ్బయ్య జీవితకాలంలో సాధించిన ఘనకార్యం.
ఈ అర్థశతాబ్దకాలంలో చరిత్ర రచనా పద్దతుల్లో వస్తున్న మార్పులను పక్కనబెట్టి, ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఈ గ్రంథ రచనలోని లోపాలు వారు జీవించిన కాలానివే గాని, వారివి కావు. పండిత గొర్రెపాటి తను జీవించిన కాలపు ప్రతినిధిగా స్థానిక చరిత్రాధ్యయనానికి గట్టి పునాదులు వేసి చరిత్రకారులకు మార్గదర్శకులైనారు.
ఈ గ్రంథంలో కూర్చిన చరిత్రక వివరాలు, చరిత్ర పరిశీలనా పద్ధతులు, కాలక్రమంలో ఘంటసాల నూతన సమాజ అవతరణకు కృషి చేసిన స్థానిక జనసమూహాల, సంఘటనల, వ్యవస్థల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు రచించిన ఈ గ్రంథం సామాన్య ప్రజలతో పాటు పరిశోధకులకు కూడా ఈనాటికీ ఎంతో ఉపయుక్తమని భావిస్తున్నాను.
- కుర్రా జితేంద్రబాబు
న్యాయవాది - చారిత్రక పరిశోధకులు
న్యాయవాది - చారిత్రక పరిశోధకులు
Read the book in below link.
http://kinige.com/kbook.php?id=2377&name=Ghantasala+Charitra
Saturday, November 30, 2013
కమ్మవారంతా చౌదర్లేనా ???
చాలా కాలం నుండి నా మనసులో ఉన్న ప్రశ్న ఇది. నాకు సమాధానం దొరికి చాలా రోజులే అయినా ఇప్పటివరకూ ఎక్కడా చర్చించాల్సిన అవసరం రాలెదు. మొన్నామధ్య గ్రామానికి వెళ్ళినప్పుడు విజయవాడలో ఇంజినీరింగ్ చదువుకునే మా బంధువుల అబ్బాయిని ఇంటికి ఆహ్వానిస్తే, తనకి C పార్టీ ఉంది కాబట్టి అది అయ్యాక వస్తాను అని చెప్పాడు. అంటే కాలేజి లో ఉన్న కమ్మ విద్యార్ధులు మాత్రమే జరుపుకునే పార్టీ అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇటీవల గ్రామానికి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దల దగ్గర దగ్గర ఈ విషయం చర్చకి వచ్చినప్పుడు, నాకు ఉన్న సందేహాలు పూర్తిగా నివృత్తి అయ్యాక అందరికీ కూడా ఇది తెలిస్తే బావుంటుంది అనిపించింది. మన గ్రామానికి సంభందించినంతవరకూ నేను ఎరిగిన కుటుంబాల్లో అత్యధికంగా చౌదరి అనే పేరు చివర పెట్టుకున్న కుటుంబం గొర్రెపాటి నరసింహం గారిది. గ్రామంలో వీరిని బోళ్ళపాడు మునసబు గారి కుటుంబం అంటారు. పడమట వీధి చివర్లో ఉంటుంది వీరి ఇల్లు. దాదాపు 70 సంవత్సరాల క్రితమే వీళ్ళ కుటుంబంలో వారి పేర్ల వెనుక చౌదరి అనే నామం కూడా ఉండేది. వారంతా తమ తాత ముత్తాతల పేర్లు తమ పిల్లలకి పెట్టుకునేటప్పుడు అవి మోటుగా ఉంటాయేమో (పేరయ్య చౌదరి,బసవయ్య చౌదరి) అని ఆ పేర్ల చివర చౌదరి అని తగిలించారేమో అనే ఆలోచనలోనే నేను ఉండేవాడిని. గ్రామంలో మిగతా వాళ్ళెవరూ పెద్దగా ఆ హోదాని తగిలించుకునట్లు కనబడలేదు.
గొర్రెపాటి నరసింహం గారి ఇల్లు
సహజంగానే కృష్ణా జిల్లాలో ఉన్న కులజాడ్యం వల్ల స్కూల్స్ లోనూ కాలేజీల్లోనూ,ఇప్పుడు బెజవాడ లో ఇంజినీరింగ్ చదివే వాళ్ళంతా తమ పేరు చివర చౌదరి అనే ఒక తోక ని తగిలించుకుంటున్నారు.( తల్లిదండ్రులు తమకి ఆ పేరు పెట్టకపోయినా,వారే సొంతగా తగిలించు కుంటున్నారు. ) అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాము జరుపుకునే కమ్మ పార్టీలకి "C" పార్టీ అని పేర్లు పెట్టుకుంటున్నారు. చౌదర్లు మాత్రమే పాల్గొనే పార్టీలన్న మాట. కాని చౌదరి అనేది కమ్మవారికి ప్రత్యామ్నాయ పదం కానే కాదు. కేవలం కృష్ణా,గుంటూరు జిల్లాల్లో తప్ప రాయలసీమలో,తెలంగాణాలో కమ్మవారు తమ పేర్ల వెనుక చౌదరి అని పెట్టుకోలేదు. అక్కడి వారంతా నాయుడు అని పెట్టుకున్నారు. కాని అక్కడ కూడా నాయుడు అని పెట్టుకున్న వాళ్ళంతా కమ్మవారు కాదు. కమ్మ నాయుడు అంటేనే వారు కమ్మవారు. భూస్వాములు జమీందార్లు తమ పేరు వెనుక చౌదరి అని పెట్టుకుంటారని చాలామంది పొరబడతారు. చల్లపల్లిని పాలించిన యార్లగడ్డ వంశీకులు, ముక్త్యాల ని పాలించిన వాసిరెడ్డి వంశస్తులు ఎవరూ తమ పేర్ల వెనుక ఈ చౌదరి ని తగిలించుకోలేదు. పేరుకి ముందు రాజా అని లేదా పేర్లకి చివర నాయుడు అనే తగిలించుకున్నారు. అంటే వారంతా చౌదర్లు కాదా? కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కమ్మవారు కూడా అందరూ చౌదరి అని పెట్టుకోలేదు. ఇటీవల కమ్మవారంతా దీనిని ఒక గౌరవ నామంగా, హోదాని సూచించే గుర్తుగా వాడటం ఎక్కువైంది. కాని కమ్మలంతా చౌదర్లు కాదు. 1579 లో కుతుబ్ షాహిలు కొండవీడుని జయించినప్పుడు, కుతుబ్ షాహిల దగ్గర పనిచేసే రాయరావు అనే మరాఠా సేనాని కృష్ణా,గుంటూరు జిల్లాల్లో ఉన్న 497 గ్రామాలకి పన్నులు వసూలు చేసేవారిగా కమ్మవారిని నియమించాడు. మహారాష్ట్రలో ఆదాయంలో పావు వంతుని పన్నుగా వసూలు చేసేవారు. మరాఠా లో ఆదాయంలో పావు వంతుని చౌత్ అంటారు. ఆ చౌత్ ని వసూలు చేసేవారు కాబట్టి ఆ కుటుంబాల వారిని చౌదరి అన్నారు. అలా ఆ పదం వాడుక లోకి వచ్చింది. ఈస్టిండియా కంపెనీ, బెంగాల్,బీహార్ లలో పన్నులు వేలం వేసి అక్కడి జమిందార్లకి అప్పగించేవారు. వాళ్ళు అక్కడి నాలుగో వంతు భూమికి హక్కుదార్లు అనే అర్ధం లో వారికి చౌధురి,రాయ్ చౌధురి అని బిరుదులు ఇచ్చేవారు. కాని ఈ చౌధుర్ల లో అన్ని కులాల వాళ్ళు కనబడతారు. వారు దానిని ఇంటిపేరుగా కూడా కొనసాగించారు. కాని మన వాళ్ళు ఇంటిపేరు కొనసాగిస్తూనే పేరుకు చివర ఇది కూడా తగిలించటం మొదలు పెట్టారు. ఉత్తరాదిన ఉండే ఈ చౌదర్లకి మన ప్రాంతం లో ఉండే చౌదర్లకి సంభంధమే లేదు. ఇక్కడ కేవలం కమ్మవారినే పన్నులు వసూలు చెయ్యటానికి నియమించటం వల్ల చౌదరి అనేది కమ్మకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు తప్ప చౌదరి అనేది హోదాని లేదా కులాన్ని సూచించే పేరు కాదు. తర్వాత కాలంలో ఈ పన్ను వసూలు దార్లు కొంతమంది మునసబులుగా, జిల్లాలో ఉన్న కమ్మ జమిందార్ల దగ్గర సముద్దార్లు గా పనిచేశారు. వారసత్వంగా అది వారి పిల్లలకి సంక్రమించింది. కాబట్టి చౌదర్లంటే 16 వ శతాబ్దం లో నియమించబడ్డ ఆ 497 కమ్మ కుటుంబాల వారు మాత్రమే. మీ తాత,ముత్తాతలెవరైనా ఆ 497 కుటుంబాలకి చెందినవారైతేనే మీరు చౌదరి అని పెట్టుకోవటం లో అర్ధం ఉంది . చౌదరి అంటే పదవిని సూచించే నామమే తప్ప కులాన్ని సూచించేది కాదు. నేను పైన ఉదహరించిన ఆ కుటుంబంలో వాళ్ళు తమ తాత ముత్తాతలంతా పన్నులు వసూలు చేసేవారని చెప్పటం వల్ల వారి పేర్ల చివర చౌదరి అని పెట్టుకుని ఉండవచ్చు. కాబట్టి చౌదర్లంతా కమ్మవారే కాని ,కమ్మవారంతా చౌదర్లు కాదు.
ఇప్పుడు ఇది తెలిశాక చౌదరి అని పెట్టుకోవటం మానేస్తారని కాని, మానేయాలని కాని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పదం ఇప్పటికే కమ్మవారికి ప్రత్యామ్నాయం గా మారిపోయింది. కాని వాస్తవాలు తెలుసుకోవటం అవసరం కాబట్టి దీని వెనుక కధ ని వివరించటం జరిగింది.
Monday, November 18, 2013
నా ఐరోపా యాత్ర - 12(పోలాండ్)
వార్సా అనేది పోలాండ్ రాజధాని నగరం. నేను మొత్తం 3 సార్లు ఈ నగరాన్ని సందర్శించటం జరిగింది. ఇప్పుడు మేము వెళుతున్నది అక్కడున్న ఇండియన్ ఎంబసీ నుండి జన్మదిన ధృవీకరణ పత్రం తీసుకోవటానికి. నేను మొదట్లో చెప్పినట్లుగా ఇక్కడ అన్నీ స్థానిక పరిపాలనలోనే జరుగుతాయి. మేము నివసించే మింజు జేర్జ్ నగర కార్యాలయంలోనే నివాస ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుంది. ఆ కార్డ్ కాల పరిమితి కూడా ఆయా స్థానిక అధికారే నిర్ణయిస్తాడు. ఆ కార్డు ఉంటే యూరప్ లో ఉన్న 24 దేశాలకి ఎటువంటి వీసా అవసరం లేదు. దానినే మన పాస్ పోర్ట్ గా పరిగణిస్తారు. ఆ కార్డ్ కావాలంటే ఇండియన్ ఎంబసీ నుండి జన్మదిన ధృవీకరణ పత్రం తీసుకుని స్థానిక ఆఫీసులో ఇస్తే మనకి రెసిడెన్స్ కార్డు జారీ చేస్తారు. ఉదయ్ అమ్మణ్ణ , నేను దాదాపు ఒకేసారి పోలాండ్ వచ్చాం. అంతకుముందు 10 సంవత్సరాలు అమ్మణ్ణ అమెరికాలో వర్జీనియాలో ఉన్న బ్రాంచ్ లో పని చేసి ఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయ్యాడు. సోజో జార్జ్ అనే మలయాళీ ఇక్కడ 5 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. తన పాస్ పోర్ట్ కాలపరిమితి ముగియటంతో అది పునరుద్ధరించుకోవటానికి ఇండియన్ ఎంబసి కి వస్తున్నాడు. యూరప్ దేశాలన్నీ రైలు మార్గంతో అనుసంధానించబడ్డాయి. కొన్ని రైళ్ళ వేగం గంటకి 300 కిలోమీటర్లు కూడా ఉంటుంది. ఏ దేశానికా దేశపు రైలు వ్యవస్థ తో పాటు యూరో రైల్ అనేది అన్ని దేశాలని కలుపుకుంటూ పోయే వ్యవస్థ. పోలాండ్లో రైల్ సంస్థ ని పోల్ రైల్ అంటారు. మేము వార్సా వెళ్ళాలంటే పోజ్ నాన్ వెళ్లి అక్కడినుండి ట్రైన్ లో వెళ్ళాలి. మింజు జేర్జ్ నుండి పోజ్ నాన్ గంట ప్రయాణం. ట్రైన్ 6.30 నిమిషాలకి కావటంతో మేము 4 గంటలకల్లా మింజు జేర్జ్ లో బయలుదేరితే ఆ ట్రైన్ ని అందుకోగలం. 4 గంటలకల్లా రెడీ గా ఉండమని కంపెనీ ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్ ఆడమ్ చెప్పాడు. ఇక్కడ ఆడమ్ గురించి కొంత చెప్పాలి. మా కంపెనీ పునాది వేసిన దగ్గరనుండి ఆడం మా కంపెనీకి పని చేస్తున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడటం రావటంతో కంపెనీ కి వచ్చే అతిధులని తీసుకు రావటానికి కంపెనీ అతనినే పురమాయించేది. ఇక్కడ ఉన్న ఇండియన్స్ అందరికీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడమ్ టాక్సీ లోనే వెళ్ళే వాళ్ళం. అతను కేవలం మా కంపెనీ పనులకు మాత్రమే టాక్సీ ని నడుపుతాడు. మేము టాక్సీ లో పోజ్నాన్ చేరేటప్పటికి 4.15 అయ్యింది. అక్కడున్న కౌంటర్ లో టికెట్ తీసుకుని ప్లాట్ ఫారం మీదికి వెళ్ళాం. పోలిష్ భాషలో ప్లాట్ ఫారంని పెరోన్ అంటారు. మేము ఎక్కింది పోల్ రైల్, అంటే కేవలం పోలాండ్లో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే రైల్ మాత్రమే.
ఒక అరగంట నిరీక్షించాక ట్రైన్ బయలు దేరింది. దాదాపు 3 గంటలు ప్రయాణించాక వార్సా చేరుకున్నాం. అప్పటిదాకా జనాలు పెద్దగా కనిపించని రూరల్ ఏరియాలు మాత్రమే చూసిన నాకు పెద్ద నగరాన్ని చూడటం కొత్తగా అనిపించింది. యూరప్ లో పెద్దగా స్కై స్క్రాపర్స్ కనిపించవు. అన్నీ వందల ఏళ్ళ నాటి భవంతులే ఉంటాయి. వార్సా అతి పురాతన నగరం. రెండవ ప్రపంచ యుద్ధ పతనం ప్రారంభమైంది ఇక్కడే. నాజీలు ఈ నగరాన్ని బాంబులతో నేల మట్టం చేశారు. యూదులు అందరినీ ఇక్కడ ఘెట్టో లో ( యూదులు నివసించే ప్రాంతాన్ని ఘెట్టో అంటారు ) బంధించి హింసిస్తుంటే కొంతమంది యువకులు ప్రతిఘటించి నాజీలని ఎదిరించి పోరాడారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పతనానికి నాంది ఇక్కడే మొదలైంది. అప్పటిదాకా యుదులంతా తమపై జరుగుతున్న దాడులని ఎక్కడా ప్రతిఘటించలేక పోయారు. వార్సా ఘెట్టో ఆ ప్రతిఘటనకి వేదికైంది. రైల్వే స్టేషన్ నుండి ఇండియన్ ఎంబసీకి టాక్సీలో వెళ్ళాలి. సోజో ఇంతకుముందు వెళ్ళిన అనుభవం ఉండటంతో తనే టాక్సీ ని పిలిచి అడ్రెస్ చెప్పాడు.10 నిమిషాల తర్వాత టాక్సీ ఒక పదంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది. ఆ బిల్డింగ్ ఎనిమిదో ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ లో ఇండియన్ ఎంబసీ ఉంది. నేను ఇంతకుముందు పోలాండ్ వీసా కోసం నేను మన దేశంలో ఉన్న పోలాండ్ ఎంబసీ కి వెళ్ళాను. డిల్లీ లో చాణక్య పురి లో అన్ని దేశాల ఎంబసీలు కొలువై ఉంటాయి. ఒక్కోటి 2 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో విశాలంగా ఉండటం చూశాను. కాని ఇక్కడ మన ఎంబసీని చూశాక చాలా ఆశ్చర్య పోయాను. అగ్గిపెట్టె లాంటి చిన్న లిఫ్ట్ లో 8 వ అంతస్తుకి వెళితే కనీసం విజిటర్స్ కూర్చోవటానికి సరైన కుర్చీలు కూడా లేవు. దేశం కాని దేశంలో కూడా వచ్చిన వారితో అక్కడి ఉద్యోగులు కనీస మర్యాదలు కూడా పాటించటం లేదు. మేము వచ్చిన పని చెప్పి మా పాస్ పోర్ట్ ఇచ్చి నిలబడ్డాం. దాదాపు గంట నిరీక్షణ తరువాత లోపలికి పిలిచి మాకు కావాల్సిన లెటర్స్ ఇచ్చారు. సోజో జార్జ్ కి కూడా రెన్యువల్ అయిన పాస్ పోర్ట్ ఇచ్చారు. మళ్లీ తిరుగు ప్రయాణానికి చాలా సమయం ఉంది. సిటీ చూద్దామని బయటకి వచ్చాము. అక్కడికి కొద్ది దూరంలోనే పెద్ద పార్క్ ఉంది. ఆ పార్క్ లో రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి గుర్తుగా కట్టిన ఒక స్థూపం దగ్గర నిలబడి చూస్తున్నాం. మమ్మల్ని చూసిన ఒక 70 ఏళ్ల మహిళ మా దగ్గరకి వచ్చి ఆవేశంగా ఆ స్థూపాన్ని చూపిస్తూ ఏదో చెప్పింది. మేమిద్దరం కొత్త కావటంతో మాకు ఆ పోలిష్ భాషలో ఏమి చెప్తుందో అర్ధం కాలేదు. సోజో కి పోలిష్ భాష రావటంతో ఆమె చెప్పేది విని మాకు వివరించాడు. యుద్ధం జరిగినపుడు నాజీలు ఎన్ని అకృత్యాలకి పాల్పడ్డారో చెపుతూ ఆ పార్క్ లో నే జరిగిన నర మేధం గురించి చెప్పింది.
అక్కడ కాసేపు గడిపాక బయటకి వచ్చాం. రోడ్డు మధ్యలో ట్రాములు తిరుగుతున్నాయి,నేను ట్రాము చూడటం అదే మొదటి సారి. రోడ్ల మధ్యన ట్రాఫిక్ కి , నడిచేవాళ్ళకి ఇబ్బంది లేకుండా నడుస్తున్న వాటిని చూస్తే కొంచెం ఆశ్చర్యం వేసింది. సిగ్నలింగ్ వ్యవస్థ అంతా రోడ్లకి, ట్రాము మార్గానికి సమకాలీకరించి ఉంది. జూన్ 8 నుండి యూరో ఫుట్ బాల్ క్రీడలు జరుగుతున్నాయి. మేము వెళ్ళిన రోజు వార్సా లో మాచ్ ఉంది. ఆ రోజు వార్సా అంతా ఎటు చూసినా పోలాండ్ జండాలతో పట్టుకుని ఫుట్ బాల్ ఫీవర్ తో జనాలంతా ఉత్సాహంగా ఉన్నారు.మనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో ఇక్కడ వాళ్ళకి ఫుట్ బాల్ అంటే అంత పిచ్చి.కాసేపు ఆ హడావుడి అంతా చూశాక పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్ళాము. ప్రపంచీకరణ మొదలయ్యాక కొన్ని ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా ఒకేరకంగా అన్పిస్తాయి. నేను హైదరాబాదు లో చూసిన షాపింగ్ మాల్స్ కి ఇతర దేశాలన్నిటిలో చూసిన షాపింగ్ మాల్స్ కి ఎక్కడా తేడా లేదు. షాపింగ్ మాల్ ఫార్మాట్ అంతా అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటుంది. భారత దేశంలో ఉన్న పేరొందిన మౌలిక సదుపాయాల కల్పన కంపెనీలన్నీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులని నిర్మిస్తుండటంతో, ఆధునిక నిర్మాణాలలో మిగతా దేశాలలో నిర్మాణాలకి, మన వాటికి పెద్ద తేడా కనిపించదు. అందుకే ఆ మాల్ చూస్తున్నంత సేపు నాకు ఏ జివికె లోనో, ఇనార్బిట్ మాల్ లోనో ఉన్నట్లే ఉంది. చాన్నాళ్ళకి కే ఎఫ్ సి కనపడటంతో లంచ్ అక్కడే కానిచ్చేసి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము. ఇప్పుడు మేము వెళ్లబోయేది యూరో రైల్. వార్సా నుండి బెర్లిన్ వెళ్ళే రైలు అది. మేమున్న ప్రాంతానికి వెళ్ళటానికి బోశినేక్ అనే స్టేషన్లో దిగాలి. పోల్ రైల్ కంటే యూరో రైల్ స్పీడ్ ఎక్కువ,అలాగే టికెట్ రేట్ కూడా ఎక్కువే.ప్రతి ఆరుగురికి ఒక కాబిన్ ఉంటుంది. ట్రైన్ లో పెద్దగా జనాలు లేకపోవటంతో ఒక కాబిన్ లో ముగ్గురం కూర్చున్నాం. ఒక గంట తరువాత ఒక అమ్మాయి మేమున్న కాబిన్ లోకి వచ్చి కూర్చుంది. ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఆ అమ్మాయిని మీరేం చేస్తుంటారని అడిగాను.తను ఒక బస్సుల తయారీ కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నానని చెప్పింది. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతోంది. కాసేపు ఇండియా కల్చర్ మీద పోలాండ్ కల్చర్ మీద కొంత ఆసక్తి కరమైన విషయాలు చర్చించాము. తనకి ఒక హిందీ పదం వచ్చు అని చెప్పింది. ఏంటో చెప్పమని అడిగాం, మైనే ప్యార్ కియా అని నవ్వింది. ఇంతకుముందు పోలాండ్ లో జరిగిన ఒక ఎక్స్ పో లో ఇండియన్ స్టాల్ లో పని చేసినపుడు ఒకతను ఆ పదం నేర్పించాడట. దాని అర్ధం కూడా తనకి తెలుసు అని చెప్పింది. కాసేపటికి పోజ్ నాన్ స్టేషన్ రావటంతో ఆమె ఆ స్టేషన్లో దిగిపోయింది.
మేము ఇప్పడు పోజ్ నాన్ లో దిగకుండా తర్వాతి స్టేషన్ లో దిగాలి. మేము దిగగానే ఆడం మాకోసం స్టేషన్ బయట సిద్ధంగా ఉన్నాడు. వార్సా కాకుండా మేము తరచుగా సులేచిన్, పోజ్ నాన్, గోజుఫ్, జెలన గోర నగరాలకి తరచుగా వెళ్తుండే వాళ్ళం. సులేచిన్ లో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. పోజ్ నాన్ లో కూడా 2 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కాని మేము ఒక్కటే చూసాము. మధ్య ప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి దీనిని నడుపుతున్నాడు. జెలన గోర కొంచెం పెద్ద నగరం, అక్కడ నమస్తే ఇండియా అనే ఒక రెస్టారెంట్ ఉంది. హర్యానా కి చెందిన వ్యక్తి ఇక్కడ స్థానిక యువతిని వివాహమాడి ఇక్కడే స్థిర పడ్డాడు. సులేచిన్ లో తాజ్ మహల్ అనే రెస్టారెంట్ ఉంది, కాని ఇక్కడ వంట వాడు బంగ్లాదేశ్ కి చెందినవాడు. యూరోపియన్ దేశాలలో అత్యంత చవకగా నివసించగలిగిన దేశం పోలాండ్.మిగతా దేశాలలో నివసించే ఖర్చులో 50 శాతంలోనే ఇక్కడ జీవించవచ్చు. ఇప్పుడిప్పుడే భారత విద్యార్ధులు పోలాండ్ వైపు చూస్తున్నారు. వార్సా లో ఉన్న పలు యూనివర్సిటీలు ఇంగ్లీష్ భోధనా మాధ్యమంలో మన వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఒక్క భాషా సమస్యని మినహాయిస్తే ఇక్కడి ప్రజలు చాలా మంచి వారు. వర్ణ వివక్ష, అసూయా ద్వేషాలనేవి వారిలో మచ్చుకైనా కనిపించలేదు. సహాయ పడటంలోనూ స్నేహం చేయటంలోనూ వారి తరువాతే ఎవరైనా. ఇప్పటికీ అక్కడి కుటుంబాలతో మా స్నేహం అవిచ్చిన్నంగా కొనసాగుతోంది. పోలాండ్ తరువాత నేను చూసిన దేశం స్వీడన్.
Sunday, October 20, 2013
నా ఐరోపా యాత్ర - 11(పోలాండ్)
జాకోపాన అనేది గ్రామం పేరు. అక్కడున్న పర్వతాల్ని Tatra Mountains అంటారు. క్రాకో నుండి 110 కిలోమీటర్లు ప్రయాణించాక జాకోపాన చేరుకున్నాం. ఆదివారం కావటంతో అక్కడికి వెళ్ళే కార్లతో అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దారిలో చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ, ఎత్తైన కొండలు మధ్యలో విశాలమైన రోడ్డు మీదుగా అత్యంత ఆహ్లాద కరంగా మా ప్రయాణం సాగింది. మధ్యలో ఒక ఊరుని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఊర్లోనే జన్మించాడు అని.జాకోపాన చేరుకున్నాక ఊరు మొదట్లోనే కార్ పార్క్ చెయ్యాలి. అక్కడినుండి పర్వతాల పైకి వెళ్ళే చోటుకు బస్సు లో కాని గుర్రపు బగ్గీలో కాని వెళ్ళాలి. పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడికి వాహనాలు నిషేధం. నాతొ పాటు ఉన్నవాళ్ళంతా నడిచి వెళ్దాం అన్నారు. కాని నా వల్ల కాదు అని గుర్రపు బండిలో వెళ్దాం అని చెప్పాను.నా జీవితంలో అప్పటిదాకా గుర్రపు బండి ఎక్కలేదు.ఆ ముచ్చట కూడా తీరినట్లుంటుందని గుర్రపు బండి ఎక్కాము. అది ఎక్కిన తర్వాత దిగేదాకా ముక్కు మూసుకునే ఉన్నాం. ఆ గుర్రం నుండి ఒకటే వాసన.
మొత్తం మీద ఒక కిలోమీటర్ పైగా ఏటవాలు ప్రాంతంలోకి ప్రయాణించాక పర్వతాల దగ్గరకి చేరుకున్నాం. పర్వతాలకి ఆవైపున స్లోవేకియా దేశం ఉంది. జెకోస్లోవేకియా దేశం 1993 లో చెక్ రిపబ్లిక్ మరియు స్లోవేకియా అనే రెండు దేశాలుగా విడిపోయింది. జాకోపానా పర్వతాలు పోలాండ్ లోనే అతి ఎత్తైన ప్రాంతం. వీటి విస్తీర్ణం 785 చదరపు కిలోమీటర్లు. ఎత్తు 2600 మీటర్లు. ఈ పర్వతాలలో 22 % స్లోవేకియాలో , మిగతా భాగం పోలాండ్ లో ఉన్నాయి.ఆ రోజు ఉష్ణోగ్రత 5 డిగ్రీలు ఉంది,పర్వతాల పైన -5 డిగ్రీలు చూపిస్తోంది.పర్వతాల పైకి వెళ్ళటానికి కేబుల్ కార్లు ఉన్నాయి.కొంతమంది హ్యాండ్ స్టిక్స్ పట్టుకుని ట్రెక్కింగ్ కి వెళుతున్నారు. మరికొంతమంది వెళ్ళేటప్పుడు కేబుల్ కార్ లో వెళ్లి వచ్చేటప్పుడు నడిచి వస్తున్నారు. టికెట్ కౌంటర్ దగ్గర ఒక 50 మందికి పైగా క్యూ లో ఉన్నారు.పైకి వెళ్లి కిందకి రావటానికి మనిషికి 50 జిలోటీలు. నేను, మార్చిన్ క్యూ లో నిల్చున్నాం.
ఆ క్యూ పక్కనే ఒక వయసు పైబడిన వ్యక్తి సన్నని రాగి తీగలతో ఒక వస్తువు తయారు చేయటం గమనించాను. విద్యుత్ వైర్లలో ఉండే కాపర్ తీగలని సమాన మైన ముక్కలుగా చేసి ఒకే కోణంలో వాటిని వంచి అతను తయారు చేసిన వస్తువు రకరకాల ఆకృతులలోకి మారుతోంది. అతను వేసుకున్న కోటు అంతా చిరుగులే. ఇల కాస్టుయ ( ile koszt) అని పోలిష్ భాషలో ప్రశ్నించాను. దానికతను 10 జిలోటీ అని బదులిచ్చాడు. అతని పని తనానికి అది చాలా తక్కువ అనిపించింది. నేను రెండు కొని మిగతావాళ్ళ చేత తలా ఒకటి కొనిపించాను.అందరూ డబ్బులిచ్చాక అతని కళ్ళలో కృతజ్ఞతా భావం కనిపించింది. టికెట్ తీసుకుని కేబుల్ కార్ స్టేషన్ లోకి నడిచాం.దూరం నుండి పైనుండి కిందకి వచ్చే యాత్రీకులు ఉన్న కేబుల్ కార్ కనిపించింది. అసలు అంత ఎత్తువరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర కింద అంతా అడవి ఉన్న ప్రాంతంలో ఆ కేబుల్ ఎలా వేసారో అంతు పట్టలేదు.ఈ నిర్మాణాన్ని 1936 లోనే నిర్మించారు,అప్పుడు కేవలం ఒక చైర్ కార్ మాత్రమే ఉండేది. కాల క్రమేణా వాటి స్వరూపం మారుతూ వచ్చింది. అప్పటి చిత్రాలన్నీ అక్కడ ప్రదర్శన కి ఉన్నాయి. కాని అప్పట్లో అంతమంది యాత్రీకులు వచ్చేవారు కాదట. 1980 వ దశకం నుండే ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎక్కువైంది. సాధారణంగా పోలాండ్ వాసులంతా వేసవి సెలవలకి ఇక్కడికి వస్తారు.మేము వెళ్ళింది అటు వేసవికాలం ఇటు చలికాలం కాని సమయం.
కేబుల్ కార్ రాగానే అక్కడ నిరీక్షిస్తున్నవారంతా వడి వడిగా అందులోకి ఎక్కాము. ఇక్కడ కూడా మేము మాత్రమే ఇండియన్స్. 2600 మీటర్ల ఎత్తులోకి మా ప్రయాణం మొదలైంది.10 నిమిషాలు ప్రయాణించా క మధ్యలో ఒక స్టేషన్లో ఆగింది. అంత దూరం కేబుల్ ని వెయ్యటం సాధ్యం కాదు కాబట్టి మధ్యలో ఒక స్టేషన్ ని ఏర్పాటు చేశారు. అక్కడ దిగి మరో కార్ ఎక్కాలి. అక్కడనుంచి మరో 10 నిమిషాలు ప్రయాణించాకపర్వతాల పైకి చేరుకున్నాం.కేబుల్ కార్ దిగి బయటకి రాగానే జివ్వుమంటూ చలిగాలి శరీరాన్ని తాకింది.చుట్టూ చూడగానే మేఘాలు, పొగమంచు తో ప్రకృతి కను విందు చేసింది.ఎటు చూసినా యాత్రికులంతా హ్యాండ్ స్టిక్స్ తో అక్కడున్న గుట్టలపైన ట్రెక్కింగ్ చేస్తున్నారు. అక్కడ ఒక రెస్టారెంట్, సావనీర్స్ అమ్మే షాపు,కొన్ని బొమ్మల దుకాణాలు ఉన్నాయి.
యూరప్ లో ప్రతి సందర్శనీయ స్థలంలో ఆ నిర్మాణం తాలూకు మినియెచర్, కాయిన్స్, ఫొటోస్ లభిస్తాయి. వెళ్ళిన టూరిష్టులంతా మెమరీ కోసం అవి కొంటుంటారు. పైన దాదాపు 5కిలోమీటర్ల మేర నడిచే ప్రాంతం ఉంది. చుట్టూ ఉన్న పర్వతాల అంచులలో చీమలలగా జనాలు కనిపిస్తున్నారు.మేము కూడా సరదాగా ఫోటోలు తీసుకుంటూ 2 కిలోమీటర్లు నడిచాం. పర్వతాల పైన సిగరెట్ తాగటం నిషేధం.అది పర్వతాలలో అగ్ని ప్రమాదానికి దారి తీస్తే వాటిని నియంత్రించటం ఎవరి వల్లా కాదు.నియమాలని పాటించటంలో పోలాండ్ వాసులు ముందు ఉంటారు. ఒకవేళ సిగరెట్ కాల్చినా దానిని నీటితో ఆర్పి పారేస్తున్న సందర్శకులు చాలామంది కనిపించారు.ఆ పర్వతాలమీద అన్నిటికంటే ఎత్తులో ఉన్న హై పాయింట్ కి చేరుకున్న్నాం.
అప్పటికి మధ్యాహ్నం 2 గంటలైంది. మళ్లీ కేబుల్ కార్ లోనే కిందకి వచ్చేసాం. అప్పటికే ఆకలి దంచేస్తుండటం తో ఏమైనా తిందామని అక్కడున్న రెస్టారెంట్ కి వెళ్ళాం. కాని శశికి అవేమి నచ్చకపోవటంతో దారిలో తిందాం అని కార్ దగ్గరికి బయలు దేరాం. ఇప్పుడు మాత్రం గుర్రపు బండి ఎక్కకుండా, బస్సు ఎక్కాము.బస్ చార్జ్ ఒక్కొక్కరికి 3 జిలోటీలు.జాకోపాన నుండి కారులో మా తిరుగు ప్రయాణం మొదలైంది.దారిలో మెక్ డొనాల్డ్స్ కనిపించటంతో ప్రాణం లేచివచ్చింది.ఆబగా బిగ్ మాక్ లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి,అందరూ నిద్రలోకి జారుకున్నారు.నేను ముందు సీట్లో ఉండటంతో మార్చిన్ కి నిద్ర రాకుండా కబుర్లు చెపుతూ ఉన్నాను. ఇంకా మింజు జేర్జ్ 500 కిలోమీటర్లు ఉంది. వెళ్ళేటపుడు ఉత్సాహంగా వెళ్ళినా, తిరిగి వచ్చేటపుడు మాత్రం ఇంత దూరమా అనిపించింది.ఆ రోజుతో సెలవలు ముగియటంతో రోడ్లన్నీ తిరిగి వెళ్ళే జనాలతో జామ్ అయిపోయాయి. మేము అక్కడక్కడా షార్ట్ కట్స్ వెతుకుంటూ చిన్న చిన్న రోడ్లలోనుండి 4 గంటలు ప్రయాణించాక హైవే ని చేరుకున్నాం.నా దగ్గర ఐపాడ్ ఉండటంతో అందులో మాప్స్ ద్వారా ఎప్పటికపుడు మేమున్న ప్రాంతాన్ని తెలుసుకోగలిగాం.దాదాపు 7 గంటలు ప్రయాణించాక రాత్రి 11 గంటలకి మింజు జేర్జ్ చేరుకున్నాం.ఇలా నా మొదటి పోలాండ్ యాత్ర ముగిసింది.ఈ యాత్ర కాకుండా నేను చూసిన మరో పట్టణం పోలాండ్ రాజధాని వార్సా.ఇక్కడే మన ఇండియన్ ఎంబసీ ఉంది.పోలాండ్ లో భారతీయులకి ఎవరికైనా రెసిడెన్స్ వీసా కావాలంటే మన ఎంబసీ నుండి జనన ధృవీకరణ పత్రం కావాలి. ఇదంతా పెద్ద ఫార్సు వ్యవహారం.పుట్టిన తేదీ ఆల్రెడీ పాస్ పోర్ట్ మీద ఉంటుంది. అయినా సరే వీళ్ళకి ఆ లెటర్ కావాలి. మింజు జేర్జ్ నుండి వార్సా 550 కిలోమీటర్లు.పోజ్ నాన్ నుండి ట్రైన్ లో వెళ్ళాలి.నేను పోలాండ్ వెళ్ళిన నెల రోజులకి జూన్ 14న ఉదయం నేను, ఉదయ్ అమ్మణ , అప్పటికే 5 సంవత్సరాలనుండి అక్కడ పనిచేస్తున్న సోజో జార్జ్ అనే మలయాళీ కలిసి బయలుదేరాం.
Dated : 17.10.2013
Thursday, September 12, 2013
నా ఐరోపా యాత్ర - 10 (పోలాండ్)
ఎటు చూసినా గుంపులు గా సందర్శకులు ఉన్నారు. లోపల మెట్లు, తలుపులు అన్నీ చెక్కతో చేసినవే ఉన్నాయి. గైడ్ అన్నీ వివరంగా చెప్తూ ముందుకు వెళుతోంది. నా అమ్ములపొదిలో ఎప్పుడూ ఉండే ఆ మొదటి ప్రశ్న అడిగేశాను. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినపుడు నాజీలు ఇక్కడికి కూడా వచ్చారా అని. యుద్ధం మొదలైన దగ్గరనుంచి ఇది కొన్నాళ్ళు నాజీల ఆధ్వర్యంలోనే ఉందని గైడ్ చెప్పింది. ఇప్పుడు మేము తిరుగుతున్న ప్రాంతం అంతా గత కొన్నేళ్లుగా ఉప్పు కోసం తొలచిన గుహ. ఇది ఒక చిన్నపాటి నగరమంత ఉంది. కాని మొత్తం ఏరియా లో మేము చూసింది నాలుగు శాతమే. ఇంకా 250 కిలోమీటర్ల మేర ఈ గని విస్తరించి ఉంది. ఈ గనిలో పని చేస్తున్న కార్మికులు దీనిని ఒక దేవాలయంగా మార్చేసారు. ఎటు చూసినా పోలాండ్ రాజుల విగ్రహాలు , క్రీస్తు, మేరి మాత విగ్రహాలే ఉన్నాయి. ఇవన్నీ ఆ ఉప్పు రాతితో చేసినవే.
అసలు విషయం మర్చిపోయా, రాతి నుంచి కూడా ఉప్పు తీస్తారని నాకు తెలిసింది ఇప్పుడే. ఆ రాయి కూడా నీళ్ళతో కలిసిన ఘన పదార్ధంలా ఉంది. కింద తయారయిన ఉప్పుని పైకి పంపడానికి కప్పీల సాయంతో పెద్ద లిఫ్ట్ ఉంది. గుర్రాల సాయంతో ఆ కప్పీలని తిప్పటం ద్వారా ఉప్పు ట్రాలీ పైకి వెళుతుంది. 13 వ శతాబ్దం నుండి పని వారు ఉప్పుని తీయడానికి ఉపయోగించిన పద్ధతులన్నీ బొమ్మల రూపంలో చెక్కారు. అక్కడక్కడా నీళ్ళ కొలనులు కూడా ఉన్నాయి. మన వాళ్ళు గోదారిలో, కృష్ణ లో చిల్లర వేసినట్లే, ఇక్కడ వాళ్ళు కూడా ఆ తటాకాలలో నాణేలు వేస్తున్నారు.
దాదాపు లోపల ఇవన్నీ చూసుకుంటూ 3 కిలోమీటర్లు నడిచాం.అంతిమంగా ఇంకా కిందకి 50 మీటర్ల లోతులో ఉన్న చర్చి కి చేరుకున్నాం, ఇక్కడే పెళ్ళిళ్ళు , ఫంక్షన్లు చేసుకోవచ్చు. ఆ రోజు కూడా ఏదో పెళ్లి జరుగుతోంది. ఇక్కడ పెళ్ళిళ్ళు మనలాగా వేలాది మందిని పిలిచి భోజనాలు పెట్టి హంగు ఆర్భాటాలతో చెయ్యరు.మహా అయితే ఒక 50 మంది ని పిలుస్తారేమో.ఇక్కడి వాళ్ళకి మన వివాహ పరిశ్రమ గురించి చెపితే వీళ్ళు నోళ్ళు తెరిచారు.1000 మందికి భోజనాలా ? అన్ని లక్షల ఖర్చు ఎందుకు ? అని వాపోయారు. ఇక ఈ మధ్య జరిగిన సెలబ్రిటీల పెళ్ళిళ్ళు యూ ట్యూబులో చూపించేసరికి వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఆ చర్చ్ లో క్రీస్తు జీవితానికి సంభందించిన పలు సంఘటనలని గోడలపై చెక్కారు. ది లాస్ట్ సప్పర్ వృత్తాంతం తెలిపే చిత్రం ముందు ఒక ఫోటో తీసుకున్నాను. ఇక అక్కడితో గైడ్ మాకు వీడ్కోలు చెప్పేసి పైకి ఎలా వెళ్ళాలో దారి చూపించింది.
అక్కడ సావనీర్ షాపులో ఆ గనిలో రాళ్లతో చేసిన రక రకాల గొలుసులు ఆభరణాలు ఉన్నాయి. ఖరీదు కొంచెం ఎక్కువే. రంగు రంగుల్లో ఉప్పు సీసాలు కూడా ఉన్నాయి. తన భార్య కోసం మార్చిన్ ఒక డబ్బా కొన్నాడు. అది నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే మంచిదట. ఒక్కోటి 10 జిలోటిలు. నేను కూడా ఒకటి కొన్నాను. ఇక అక్కడున్న లిఫ్ట్ ద్వారా పైకి చేరుకున్నాం. అప్పటికే సమయం 8 గంటలు అయ్యింది. మసక మసకగా చీకటి పడుతోంది. ఇక ఆ రాత్రికి క్రాకో లోనే బస చేసి మరుసటి రోజు ఉదయం జాకోపానా అనే పర్వతాలు చూడటానికి వెళ్దాం అనుకున్నాం. నేను ఏదైనా హోటల్ బుక్ చేద్దామంటే శశి ఒప్పుకోలేదు. యూత్ హాస్టల్ కి వెళదాం అన్నాడు. నాకెందుకో హాస్టల్ అనగానే అంత సౌకర్యంగా ఉంటుందనిపించలేదు. కాని శశి అప్పటికే ఒకసారి యూరప్ అంతా తిరిగి ఉన్నాడు. సరే తనకి అన్నీ తెలుసు కదా అని అందరం ఓకే అన్నాం. ఐపాడ్ సాయంతో క్రాకోలో ఉన్న హాస్టళ్ళ వివరాలు వెతికితే తక్కువ ధరలో ఒక యూత్ హాస్టల్ దొరికింది. యూరప్ లో ఉన్న అన్ని దేశాలలో ఈ హాస్టల్స్ ఉంటాయి. విద్యార్ధులు ఉండే వసతి గృహాలలో పర్యాటకులు కూడా ఉండవచ్చు. వీటినే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ అని కూడా అంటారు.ఒక రాత్రి బస మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ తో అద్దెకి ఇస్తారు.పర్యాటకులకి ఎంతో సౌకర్యంగా, అతి తక్కువ బడ్జెట్ లో ఉండటంతో ఎక్కువ శాతం మంది వీటిని వినియోగిస్తారు. క్రాకో సిటీ స్క్వేర్ లోనే ఒక బిల్డింగ్ లో మూడవ అంతస్తులో ఈ హాస్టల్ ఉంది. మార్చిన్ అడ్రెస్ కనుక్కుని కార్ ఒక ప్రైవేటు పార్కింగ్లో పెట్టేసి అక్కడినుంచి ఒక కిలోమీటరు నడుచుకుంటూ సిటీ స్క్వేర్ చేరుకున్నాం. ఆరోజు సన్నగా వాన పడుతోంది, మేము హాస్టల్ కి చేరుకునేటప్పటికి వాన పెద్దదైంది.మాకు క్రాకోలో ఒక్క నూతన భవంతి కూడా కనపడలా. అన్నీ వందల ఏళ్ల నాటి పెద్ద పెద్ద పురాతన భవనాలే ఉన్నాయి. సిటీ స్క్వేర్ చాలా పెద్దది, అక్కడ కార్లకి ప్రవేశం లేదు. ఎటు చూసినా జనాలంతా ఆరుబయట రెస్టారెంట్ లలో కాంతులీనే లైట్ల మధ్య బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.ఒక పక్క వాన పడుతున్నా రెస్టారెంట్ గొడుగుల కింద అలాగే ఉన్నారు.మరుసటి రోజు శనివారం కావటంతో కొన్ని వేలమంది వీకెండ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.అసలు క్రాకో లో ఉన్న ప్రజలంతా ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. పర్యాటకుల్ని ఆ స్క్వేర్ చుట్టూ తిప్పటానికి గుర్రపు బగ్గీలు ఉన్నాయి. సూటు వేసుకుని ఉన్న ఆజానుబాహులు తమ బగ్గీలని ఠీవిగా అలంకరించి, వచ్చేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.హాస్టల్ రిసెప్షన్ కి వెళ్లి మార్చిన్ రూమ్ గురించి అడిగాడు. మేము ఐదుగురం కావటంతో ఒకే రూములో అందరికీ వసతి దొరికింది.అది 8 మంది ఉండగలిగే గది.అసలు రూమ్ ఎంత నీట్ గా ఉందంటే అప్పటిదాకా అసలు హాస్టల్ అంటే ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మాతో పాటు పోలాండ్ కే చెందిన మరో ఇద్దరు కూడా ఆ గదిలో ఉన్నారు.నేను అప్పటికే బాగా అలసిపోయి ఉండటంతో స్నానం చేసి కింద ఉన్న రెస్టారెంట్ లో అందరికీ పిజ్జా ఆర్డర్ చేసి తినేసి పడుకుండి పోయాను.మిగతా వాళ్ళంతా తిన్న తర్వాత వర్షం తగ్గటంతో మళ్ళీ కిందకి వెళ్లి కాసేపు చూసి వచ్చారు.తెల్లవారుఝాము 3 గంటలదాకా ఆ కోలాహలం అలాగే ఉంది.
క్రాకో సిటి స్క్వేర్ లో
పొద్దునే 8 గంటలకి అందరం లేచి బ్రేక్ ఫాస్ట్ చేసి బయలు దేరాం. మా కార్ దగ్గరికి వెళ్ళేదారిలో సిటీ అంతా చూసుకుంటూ అక్కడొక పురాతన పాలస్ ఉందని మార్చిన్ చెప్పటంతో కొండ మీద ఉన్న ఆ పాలస్ కి వెళ్ళాం. ఆ పాలస్ పై నుండి క్రాకో నగరం అంతా కనిపించింది.రోడ్ల మీద జనాలు పల్చగా ఉన్నారు.ట్రాములు, బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. జనాలకి వీకెండ్ హంగోవెర్ ఇంకా దిగలేదు అనుకున్నాం. క్రాకో అంతా పెద్ద పెద్ద వీధులు, రోడ్లమీదే నడిచే ట్రాములు తో ప్రశాంతంగా ఉంది. ఎన్ని వేల ఏళ్ల నాటి నగరమో అనిపించింది. ప్రాచీన కట్టడాలని వీళ్ళు పరిరక్షించినట్లు ఇంకెవరూ చేయలేదు. సామాన్యుడి ఇల్లు దగ్గర్నుంచి రాజుల భవంతుల వరకూ అన్నిట్లోనూ భారీ తనం ఉట్టి పడుతుంది. ఆ ప్రాచీన కట్టడాలని అలాగే ఉంచి అందులోనే వీళ్ళు ఆధునికతని చూపించటం యూరప్ ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించేలా చేసింది. ఆ వీధుల లో నడుస్తుంటే కలిగిన అనుభూతి మాటలలో చెప్పలేనిది. పాలస్ నుండి కారు దగ్గరికి చేరుకున్నాం.ఇక్కడి నుండి జాకోపానా పర్వతం 109 కిలోమీటర్లు.క్రాకో జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకుని మా ప్రయాణం జకోపాన వైపు మొదలైంది...
Thursday, September 5, 2013
నా ఐరోపా యాత్ర - 9 (పోలాండ్)
నా ఐరోపా యాత్ర - 9 (పోలాండ్)
ఆశ్విత్జ్ నుండి క్రాకో నగరంలో ఉన్న ఉప్పు గని 90 కిలోమీటర్లు. ఆష్విత్జ్ చూశాక మనసంతా భారంగా తయారయ్యింది. అందరం కారులో నిశబ్ధంగానే కూర్చున్నాం. మార్చిన్ కి ఇవన్నీ తెలిసి ఉండటంతో తను త్వరగానే ఆ మూడ్ నుండి బయటకి వచ్చాడు. GPS సహాయంతో ఇంకా ఎంత దూరం ఉందో చూసుకున్నాడు. మమ్మల్ని మూడ్ లోకి తీసుకు రావటానికి పోలిష్ జోక్స్ చెప్పటం ప్రారంభించాడు. మా సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో ఇంగ్లీషు మాట్లాడగలిగిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో మార్చిన్ ఒకడు. ఇండియన్స్ అందరికీ స్థానికంగా ఏ సహాయం కావాలన్నా తనే చేసేవాడు. ఒకరకంగా అతనికి ఇంగ్లీషు భాష రావటం అనేది మాకు బాగా దగ్గరయ్యేలా చేసింది. అక్కడ షాపింగ్ అయినా , ఏదైనా ప్రభుత్వ ఆఫీసుల్లో పని ఉన్నా మాకు మార్చిన్ తోడు రావాల్సిందే. అమెరికా తరహాలో మన వాళ్ళు యూరప్ లో ఎక్కువగా ఉండకపోవటానికి కారణం ఈ భాషా సమస్య. ఇక్కడంతా ఆయా దేశపు స్థానిక భాషలే మాట్లాడతారు. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా ఎవరికీ తెలియదు. ఇక ఆశ్విత్జ్ నుండి క్రాకో వైపు మా ప్రయాణం మొదలైంది. దారిలో ఒక చిన్న గ్రామాన్ని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు ఈ గ్రామంలోనే వారి పూర్వీకులు జన్మించారట.
సాల్ట్ మైన్ బయట నేను, మార్చిన్, చోటురాం, శశి కుమార్
క్రాకో అనేది పోలాండ్ లో ఉన్న రెండవ అతిపెద్ద పురాతన నగరం. పలు విశ్వ విద్యాలయాలు, బహుళ జాతి కంపెనీలు ఈ నగరంలో ఉన్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా వార్సా కంటే ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. మన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తరచుగా ప్రాజెక్టుల నిమిత్తం ఈ నగరానికే వస్తుంటారు. ఒకప్పుడు ఇక్కడ యూదుల జనాభా ఎక్కువగా ఉండేది. యుద్ధానంతరం వారి జనాభా తగ్గిపోయింది. తోలి ఇటలీయేతర పోప్ గా ఖ్యాతికెక్కిన జాన్ పాల్ II పోలాండ్ లోని క్రాకో లోనే జన్మించారు.పలు చారిత్రక భవనాలు, మ్యూజియం లు ఈ నగర వైభవాన్ని చాటుతాయి. దాదాపు గంటా 20 నిమిషాలు ప్రయాణించాక సాల్ట్ మైన్ అని రాసున్న బోర్డు కనిపించింది. ఈ ఉప్పు గని గురించి నేను ఇంతకుముందే ఒక బ్లాగు లో చదివాను. సంవత్సరానికి 12 లక్షలమంది ఈ గని ని సందర్శిస్తారట.13 వ శతాబ్దం నుండి 2007 వరకు ఈ గనిలో కార్యకలాపాలు కొనసాగాయి. రాతి నుండి ఉప్పుని తీసే అతి కొద్ది ప్రాచీన గనుల్లో ఇది కూడా ఒకటి. సాల్ట్ రేట్ తగ్గిపోవటం మరియు గనిలోకి నీళ్ళు రావటంతో 2007 లోనే మైనింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం ఇది కేవలం సందర్శనీయ స్థలం మాత్రమే. ఈ గనిలో పని చేసే కార్మికులు అప్పుడప్పుడు చెక్కిన రాతి విగ్రహాలు, అప్పటి పోలాండ్ సంస్కృతీ, పని విధానాలని ప్రతిబింబించే విధంగా చెక్కిన పలు బొమ్మలు, క్రీస్తు జీవిత వృత్తాంతాన్ని వివరించే పలు రాతి చిత్రాలు దీనిని మ్యూజియంగా మార్చేశాయి.
అంతే కాదు పెద్ద చర్చ్ కూడా లోపల ఉంది. ఇక్కడ వివాహాలు కూడా జరుగుతాయి. ఆకాశంలోనూ, నీళ్ళలోనూ పెళ్లి చేసుకోవటం ఫాషన్ అయినట్లే భూమికి 375 మీటర్ల లోతున పెళ్లి చేసుకోవటం కూడా అరుదైన విషయమే. కాకపోతే కాస్త కాసులెక్కువ సమర్పించుకోవాలి. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలైంది.బయట చాలా మంది సందర్శకులు ఉన్నారు. మొట్ట మొదటి సారి ఇండియన్ టూరిస్ట్ లని ఇక్కడే చూశాను. గనిలోపలికి ప్రవేశ రుసుము 50 పోలిష్ జీలోటీలు. టైం టేబుల్ ప్రకారం ఒక్కో భాష గైడ్ కి ఒక్కొక్క టైం ఉంది. ఇంగ్లీష్ గైడ్ కావాలంటే కొంచెం ఖరీదు ఎక్కువ. మేము పోలిష్ గైడ్ ని ఎంచుకున్నాం. మా బాచ్ కి ఇంకా గంటన్నర టైం ఉండటంతో ఏమన్నా తిందామని బయటకి వచ్చాం.సాల్ట్ మైన్ ఎదురుగానే ఒక రెస్టారెంట్ ఉంది. నేను సాల్మన్ ఫిష్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. శశి, ఉదయ్ , చోటు రామ్ చికెన్ ఆర్డర్ చేశారు. మార్చిన్ మాత్రం పోలిష్ సాంప్రదాయ వంటకం పిరోగి ఆర్డర్ చేసాడు. ఇక్కడ ఫుడ్ చాలా చవక.పిరోగి అనేది మన సమోసా లాగే ఉంటుంది. రెడీ మెడ్ గా కూడా దొరుకుతుంది. వేడి నీళ్ళలో కాసేపు ఉడికించి టమోటా సాస్ తో తినేస్తారు. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ లోనూ కూరగాయలతో చేసే సాలన్ తప్పకుండా ఇస్తారు. ఇక్కడ సర్వ్ చేసే ఫుడ్ కూడా అందంగా డెకరేట్ చేసి ఇస్తారు. అసలు ఆ డెకరేషన్ చూస్తేనే ఎంతో ముచ్చటగా ఉంటుంది. యూరప్ అంతా స్టైలిష్ లివింగ్, తినటంలోనూ నడవటంలోనూ డ్రెస్సింగ్ లో చాలా ఆధునికంగా ఉంటారు. ఇండియన్స్ చేతితో అన్నం తింటారని వీళ్ళకి కొంత ఆశ్చర్యం కూడా. ఫోర్క్ , నైఫ్ , స్పూన్ తో తప్ప ఆహారాన్ని చేతితో అసలు తినరు. వారి ఆహరం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. మొదట్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది, తర్వాత తర్వాత అలవాటు అయ్యింది.తినేటప్పుడు నైఫ్ కుడి చేత్తోనూ, ఫోర్క్ ఎడమ చేతితోనూ పట్టుకోవాలి. లంచ్ అయ్యాక మళ్ళీ లోపలకి వచ్చాం, మా బాచ్ వాళ్ళంతా అప్పుడప్పుడే వెయిటింగ్ హాల్లోకి చేరుకుంటున్నారు. అక్కడున్న గైడ్ అమ్మాయి అందరినీ లెక్కపెడుతోంది. మేము మా టికెట్స్ ఇచ్చి క్యూ లో నిలుచున్నాం. అందరూ వచ్చాక పోలిష్ భాషలో తనని తాను పరిచయం చేసుకుని లోపల ఉన్న ఉష్ణోగ్రత -3 డిగ్రీలుగా ఉందని చెప్పింది.ఈ గని లోతు 327 మీటర్లు, మొత్తం గని పొడవు 287 కిలోమీటర్లు. కాని అందులో 4 కిలోమీటర్లు మాత్రమే సందర్శనీయ స్థలంగా ఉంది. యునెస్కో దీనిని ప్రపంచ ప్రాచీన సంపదగా గుర్తించింది. ప్రపంచంలో ఉన్న సందర్శనీయ స్థలాలలో దీనిది 12 వ స్థానం. అక్కడున్న డోర్ గుండా లోపలకి వెళ్ళాక కిందకి వెళ్ళటానికి చెక్క మెట్లు ఉన్నాయి. 375 మీటర్ల లోతుకి ఆ మెట్ల గుండానే వెళ్ళాలి.మధ్యలో ఆగుతూ దిగుతున్న కొద్దీ చలి ఎక్కువ అవసాగింది. అందరం ముందే కోట్లు వేసుకుని ఉండటంతో పెద్దగా చలి తెలియలేదు. యూరప్ లో దాదాపు 8 నెలలు చలి కోటు ధరించటం తప్పని సరి. అసలు వీళ్ళకి మంచి బట్టలు వేసుకున్నా పాపం వాటిని బయటకి చూపించుకునే అదృష్టం లేదు కదా అనిపించేది. లోపల అంతా చీకటిగానూ మసక వెలుతురు మాత్రమే ఉంది. భూమికి 375 మీటర్ల అడుగున ఉన్నామన్న ఉహే అధ్బుతంగా అనిపించింది
Friday, August 23, 2013
నా ఐరోపా యాత్ర - 8 (పోలాండ్)
నా ఐరోపా యాత్ర - 8 (పోలాండ్)
పదవ బారక్ ఆడవాళ్ళ పాలిట నరక కూపం. అందులో జర్మన్ డాక్టర్లు ఆడవాళ్ళపై రక రకాల ప్రయోగాలు చేసేవారట. గర్భిణి స్త్రీలకి ఎటువంటి మత్తు మందు ఇవ్వకుండానే లోపల పిండం ఎలా ఉందో అని కోసి చూసేవారు. ఇంకా స్త్రీల అవయవాలన్నీ కోసి వాటిపై పరిశోధనలు చేసారు. రకరకాల ఔషధాలని ప్రయోగించి అవి పనిచేస్తునాయో లేదో అని పరీక్షించేవారు. ఇవన్నీ బతికున్న మనుషులపైన ఎటువంటి మత్తు మందు లేకుండా జరిపిన పాశవిక హత్యా కాండ. ఆ బారక్ లో లోపలి వెళ్ళిన వారెవరూ ప్రాణాలతో బయటకి వచ్చేవారు కాదు. మిగతా వారికి ఆ బారక్ లో ప్రవేశం నిషిద్ధం. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా. ఈ పని ఏ ఆటవిక ప్రజలు కూడా చేసి ఉండరు. అందుకే హిట్లర్ అనే ఒక మానవుడిని మృగం తో పోల్చినా పాపమే.ఇక ఒక నాజీ అధికారి భార్య చేసిన పని వింటే రక్తం మరిగిపోతుంది. గ్యాస్ చాంబర్లలో మరణించిన యూదుల ఆడవారి స్తనాలని కోసి ఆ చర్మంతో ఫాన్సీ పర్సులు కుట్టేది. యుద్ధం ముగిశాక ఈమె బ్రిటన్ సైన్యానికి చిక్కి జైల్లోనే ఆత్మహత్య చేసుకుంది. అసలు ఇక్కడ ఎం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలిసేది కాదు.ఇక్కడ ఖైదీలందరికీ ఒక యునిఫామ్ ఉంది. కాంపులోకి ప్రవేశించగానే చేతిపై వారి నంబర్ ని పచ్చ పొడిచేవారు. చచ్చేదాకా వాడిని ఆ నెంబర్ తోనే పిలిచేవారు. కొందరికి ఆ పచ్చ పొడవటం వల్ల అయిన గాయం సెప్టిక్ అయ్యి మరణించేవారు.
మేము చూస్తున్నంత సేపు సందర్శకులలో చాలామంది ఏడుస్తూనే ఉన్నారు.యుద్ధం ముగిసాక కాని ఈ కాంపుల్లో అకృత్యాలు బయటి ప్రపంచానికి తెలియలేదు. యుద్ధంలో ఓడిపోయామని తెలియగానే ఇక్కడి అధికారులు రికార్డులన్నీ తగలబెట్టేసారు. అమెరికా, బ్రిటన్ సైన్యాలు వచ్చేటప్పటికి సగం కాలుతున్న శవాలు, ఆస్థి పంజరాలు, కుళ్ళిపోయిన వేలాది మంది శవాలు మీదుగా నడవాల్సి వచ్చిందట. 1941 నుండి 1944 వరకు ఈ కాంపుకి తీసుకొచ్చిన వారిలో ఒక్కరు కూడా యుద్ధం ముగిసే నాటికి జీవించి లేరు. 1945 లో మూడు నెలలకి ముందు తీసుకు వచ్చిన వారు మాత్రమే యుద్ధం ముగిసాక బయట పడ్డారు.ఇక యుద్ధం అయ్యాక పట్టుబడిన నాజీ అధికారులని జర్మనీ లో ఉన్న న్యురేం బర్గ్ లో న్యాయ విచారణ చేసారు. అందరికీ మరణ శిక్ష విధించారు. ఇక కాంపులో అత్యాచారాలకి పాల్పడిన నాజీ అధికారులని ఇక్కడే తమ ముందే ఉరి తీయాలని యూదులు కోరడంతో కొంతమందిని ఇక్కడే ఉరి తీసారు. కాని ఎన్ని శిక్షలు విధించినా పోయిన 60 లక్షలమంది ప్రాణాలు, బతికుండగానే జీవచ్చవాలు గా మిగిలిన లక్షలాది మంది జీవితాలు తిరిగి రావుగా.ఎన్నో పసి మొగ్గలు నాజీల దురహంకారం కింద నలిగిపోయాయి. ప్రపంచంలోనే జరిగిన అతి పెద్ద మానవ హననం ఈ యూదుల మారణ కాండ. దీనిని హాలో కాస్ట్ అంటారు. ఈ పేరుతొ జర్మనీ లోనూ అమెరికాలోనూ పలు మ్యుజియాలు ఉన్నాయి.
పోలాండ్ వాసులకి జర్మనీ అంటే ఎంత కోపమో, తమని కాపాడిన రష్యా అన్నా అంతే కోపం.1945 నుండి 1989 వరకు ఇది రష్యా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కాని పోలిష్ ప్రజలు ఆ కమ్యూనిస్టు విధానాలకి వ్యతిరేకం. జర్మనీ నుండి 1945 లో విముక్తి చేశామనే సాకుతో రష్యా ఈ దేశాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. సోవియట్ యూనియన్ ముక్కలయ్యాక పోలాండ్ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. 2004 లో యూరోపియన్ యూనియన్ లో భాగస్వామ్య దేశం అయ్యింది. అయినప్పటికీ మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే ఆర్ధిక ప్రగతిలో ఈ దేశం ముందు ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కరెన్సీ యూరో కి మారకపోవటం వల్లే పోలాండ్ స్థిమితంగా ఉందనేది నా అభిప్రాయం. కరెన్సీ ల మధ్య వ్యత్యాసం ఉంటేనే ఒక దేశపు ప్రజలు మరొక దేశానికి విహారానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. యూరప్ దేశాల ప్రజలు ఎక్కువ విహారాన్ని ఇష్టపడతారు. సెలవలు వస్తే ఇతర దేశాలకి వెళుతూ ఉంటారు.అన్ని దేశాలకి ఉన్న ప్రధాన ఆదాయ వనరు టూరిజం. అన్ని దేశాలలో యూరో కరెన్సీ ఉంటే ఒక దేశం అవలంబించే ఆర్ధిక విధానాల వల్ల మాంద్యం ఏర్పడితే ఆ ప్రభావం యూరో మీద పడి యూరో చలామణి లో ఉన్న మిగతా దేశాల ఆర్ధిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపుతుంది. కరెన్సీ లో వ్యత్యాసం ఉంటే ఏదైనా దేశం ఆర్ధిక సంక్షోభంలో పడినప్పుడు ఆ దేశపు కరెన్సీ తో యూరో మారకం విలువ పెరుగుతుంది.యూరో చలామణిలో ఉన్న దేశస్తులు చవకలో వినోదం పొందటానికి ఆ దేశానికి వెళతారు. దాని ద్వారా ఆ దేశం సంక్షోభం నుండి సునాయాసంగా గట్టేక్కవచ్చు. ఉదాహరణకి ఇటలీలో ఒక పిజ్జా ఖరీదు 12 యూరోలు, అదే పిజ్జా పోలాండ్లో 14 జిలోటీలు. ఒక యూరోకి 4.50 జిలోటి లు వస్తాయి.అంటే ఇటలీ లో కంటే మూడో వంతులో పోలాండ్ లో వినోదం దొరుకుతుంది. ఇటాలియన్స్ వీకెండ్స్ కి , సెలవలకి పోలాండ్ వచ్చి హాయిగా గడపచ్చు. అదే ఇక్కడ కూడా యూరో ఉంటే వచ్చేవారికి అంత ఆసక్తి ఉండదు. ఇటీవల సైప్రస్, స్పెయిన్, గ్రీస్ లలో ఆర్ధిక సంక్షోభం వచ్చింది. వాటిని నిలబెట్టటానికి యూరోప్ యూనియన్ మొత్తం పూనుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ ని ఆయా దేశాల్లో యధా తధంగా ఉంచటం మంచిది.ఇక ఆశ్విత్జ్ చూసాక అత్యంత బాధా తప్త హృదయంతో అక్కడినుండి బయలుదేరాం. మా తరువాతి గమ్యం క్రాకో నగరంలో ఉన్న సాల్ట్ మైన్. ( ఉప్పుగని )
Friday, August 16, 2013
నా ఐరోపా యాత్ర - 7 (పోలాండ్)
అక్కడ ఉన్న టూరిస్టులు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అందరి వదనాల్లో విచారమే తప్ప ఉత్సాహం లేదు. రుస్కి ఎంట్రన్స్ అంటే రష్యా యుద్ధ ఖైదీలని తీసికెళ్ళే ద్వారం అది. ఇప్పుడు కాంపులోకి వెళ్ళటానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. వెళ్ళే దారిలో ఆ ప్రాంతాన్ని దర్శించి నివాళులర్పించిన వివిధ దేశాల అధ్యక్షుల వివరాలన్నీ ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టారు.వాటిని దాటుకుంటూ టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. ఇంగ్లీష్ గైడ్ కావాలంటే మనిషికి 25 జిలోటీ లు పోలిష్ భాష అయితే 15 జిలోటీలు ప్రవేశ రుసుము. 20 మందికి ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్ చెప్పేది వినటానికి ఒక ఎలెక్ట్రానిక్ రేడియో మరియు హెడ్ ఫోన్స్ ఇస్తారు. మనం గుంపులో ఉన్నా ఆ గైడ్ చెప్పేది స్పష్టంగా వినపడుతుంది. ఈ కాంపు మూడు భాగాలుగా నిర్మించారు. ఆష్విత్జ్ - 1 లోకి మేము ఇప్పుడు వెళ్ళబోయేది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ఖైదీలని, యూదులని ఉంచటానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ ప్రాంతాన్ని ప్రతిపాదించాడు. రైలు మార్గం అనువుగా ఉండటంతో అన్ని దేశాలనుండి యూదులని ఇక్కడికి తరలించటానికి అనువుగా ఉంటుందని జర్మన్ నాజీ ఆఫీసర్ హిమ్లర్ ఈ ప్రాంతంలో నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ గ్రామంలో అప్పటికే ఉన్న 1200 మందిని ఖాళీ చేయించి 40 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతాన్ని నాజీ సైన్యం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. 300 మంది యూదుల చేత దీనికి పునాది రాళ్ళు వేయించి, తరువాతి కాలంలో ఇక్కడి ఖైదీల చేతనే మిగతా 2 బ్లాకులు కట్టించారు.
ఇక్కడికి రైళ్ళలో ఒక్కో పెట్టెలో 200 మందిని కుక్కి 3 రోజుల పాటు ప్రయాణించాక రైళ్ళు ఇక్కడికి చేరుకునేవి. అవి ఇక్కడికి చేరుకునేలోపే ఆ పెట్టెల్లో సగం మంది చనిపోయేవారు. మిగిలిన వారిని ఇక్కడ చంపేసేవారు.కేవలం ఈ ఆశ్విత్జ్ కాంపుల్లో చంపబడ్డ మనుషుల సంఖ్య దాదాపు 12 లక్షలు. మనుషుల్ని తీసుకురావటానికి నేరుగా రైలు మార్గాన్ని కాంప్ లోపలికే నిర్మించారు. యూరప్ లో అన్ని దేశాలనుండి యూదులని, యుద్ధఖైదీలని రైళ్ళలో ఈ కాంపుకి తరలించేవారు. రైలు దిగగానే నాజీ డాక్టర్లు, కమాండర్లు వారిని పరీక్షించేవారు. కొంచెం శారీరకంగా ధృడంగా ఉన్నవారిని ఒక పక్కకి, మిగతా వారిని నేరుగా చంపటానికి వేరు చేసేవారు. ఆరోగ్యం గా ఉన్నవారిని కొంతకాలం పని చేయించుకుని వారిలో సత్తువ అయిపోగానే చంపేసేవారు. కొత్త బాచ్ మనుషులు వచ్చినపుడు గదులు ఖాళీ లేకపోతే వెంటనే వచ్చిన వారిని చంపేయటమో లేక అప్పటికే కాంపులో బలహీనంగా ఉన్న వారిని ఆఘమేఘాల మీద కాల్చేసి, కొత్తవారిని ఆ గదుల్లో ఉంచేవారు. మా గైడ్ తో పాటు ఉన్న 20 మందిలో మేము నలుగురం ఇండియన్స్ ,మార్చిన్ కూడా మాతోనే ఉన్నాడు. గైడ్ ని అనుసరిస్తూ ఆ సువిశాల ప్రాంగణంలోకి ప్రవేశించాం. అప్పటికే అక్కడ చాలామంది టూరిస్టులు ఉన్నారు.అక్కడ నిర్మించిన బ్లాకులన్నీ దేశాల వారిగా పేర్లు పెట్టారు. అంటే ఆక్రమిత దేశాలనుండి తీసుకు వచ్చే యూదులందరినీ ఆయా దేశాల పేరుతో నిర్మించిన బ్లాకులో ఉంచేవారు. మేము ప్రవేశించిన బ్లాకు కి పేరు ఏమీ లేదు. అక్కడి యుద్ధ ఖైదీలు వాడిన దుస్తులు, బూట్లు, వారి వస్తువులు, వికలాంగులు వాడే చేతి కర్రలు అక్కడ కుప్పలుగా పోసి ఉన్నాయి. వచ్చిన ఖైదీలకి బంగారు దంతాలు ఉంటే వాళ్ళు బతికుండగానే నాజీలు అవి పీకేసేవారట. మొదటి బ్లాకు చూడటం పూర్తవగానే శశి బయటకి వచ్చి అక్కడ ఒక మెట్టు దగ్గర కూలబడిపోయాడు. అసలేం జరిగింది ఇక్కడ ? అసలు మనుషుల్ని ఇలా చంపటం ఏంటి అంటూ ఇక నేను చూడలేను మీరు వెళ్ళండి అని అక్కడే ఉండిపోయాడు. ఉదయ అమ్మణ్ణ నాతో పాటే వచ్చాడు. మార్చిన్, నేను, చోటు రామ్ కలిసి తరువాతి బ్లాకు కి వెళ్ళాం. మార్చిన్ కి అన్నీ తెలిసి ఉండటంతో మేము మా గ్రూపు నుండి విడిపోయి సొంతంగా తిరగటం మొదలు పెట్టాం. తరువాతి బ్లాకులో ఆ కాంపులో చంపబడ్డ మనుషుల ఫోటోలు వారు వాడిన తిండి పాత్రలు ఉన్నాయి. హిట్లర్ యుద్ధాన్ని ఒక సంస్థ ని నడిపినట్టే నడిపాడు. బతికున్న ముడి పదార్ధాలని నిర్జీవంగా చెయ్యటం ఈ ఫాక్టరీ యొక్క పని. మనుషుల్ని చంపటానికి నాజీలు ఉపయోగించిన పద్ధతులు వింటే మన హృదయం ద్రవించక మానదు. రోజుకి 4000 మంది నుండి 6000 మందిని చంపాలనేది టార్గెట్. గాస్ చాంబర్లు, శవాలని కాల్చే ఫర్నేస్ లు 24 గంటలు పని చేస్తూ ఉండేవి. వారానికొకసారి స్నానం అనే నెపంతో టాయ్లెట్ అని రాసున్న గదుల్లోకి ఖైదీలని పంపేవారు. ఒక్కో బాత్రూంలోకి 50 మందిని పంపి పైన ఉన్న షవర్ ఆన్ చెయ్యగానే గ్యాస్ విడుదలయ్యి లోపల ఉన్న వాళ్ళంతా శవాలుగా మారేవాళ్ళు. ఆ తరువాత పక్కనే ఉన్న ఫర్నేస్ లో వారిని తగలబెట్టేసేవాళ్ళు ఇదంతా 20 నిముషాల్లో పూర్తయ్యేది. రోజూ కొన్ని వేల శవాలు కాలుతుండటంతో ఈ ప్రాంతం అంతా పొగ, దుర్వాసనతో నిండి ఉండేది.
వాటి మధ్యే మిగిలిన ఖైదీలు ఉండేవారు. నాజీలు ఎంత కర్కోటకులంటే ఏదైనా బారక్ లో ఖైదీ కనపడకపోతే ఆ బారక్ లో ఉన్న మిగతా పదిమందిని చంపేసే వాళ్ళు. ఆ భయంతో తోటి వాళ్ళు తప్పించుకోకుండా సహా ఖైదీలే కాపలా కాసేవాళ్ళు. ఆ కాంపులోకి తీసుకు వచ్చిన ప్రతి ఖైదీ వివరాలు రికార్డ్ చేశారు. వాళ్ళు పట్టుబడిన ప్రాంతం,కాంపులోకి తీసుకు వచ్చిన తేదీ,వారిని చంపిన తేదీ, అందుకు వాడిన పద్ధతులు కూడా రికార్డ్ చేశారు. అంతే కాక ప్రతి వ్యక్తినీ ఫోటో తీశారు. కాంపుకి వచ్చినపుడు తీసిన ఫోటోకి తరువాతి మూడునెలల తర్వాత అదే మనిషి ఫోటోకి అసలు పోలికలే లేవు. ఆ ఫోటోలన్నీ ఇక్కడ ప్రదర్శనలో చూడచ్చు.మగ వాళ్ళకి ఆడవాళ్ళకి విడి విడిగా బారక్ లు ఉన్నయి.ఇక్కడికి వచ్చిన వాళ్ళ సగటు జీవితం మూడు నెలల కంటే ఎక్కువ ఉండేది కాదట.ఒక్కో గదిలో 400 మందిని ఉంచేవారు. ఆ మంచాలు ఇప్పటికీ యధాతధంగా ఉన్నాయి. ఎలుకలు, చలి తో సహవాసం. ఎవరికీ అక్కడినుంచి తప్పించుకునే ఆలోచన కూడా వచ్చేది కాదట.ఇన్ని లక్షలమందిలో తప్పించుకోవటానికి చూసిన 802 మందిలో 700 మంది తిరిగి పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారంతా కొద్ది గంటల్లోనే చంపబడ్డారు. పట్టుబడగానే ఒక గోడ ముందు నిలబెట్టి తుపాకీతో కాల్చేసే వారు. ఇప్పుడు ఆ గోడ లేదు కాని అదే నమూనాతో గోడని నిర్మించారు. అక్కడ చనిపోయిన వారి స్మారకార్ధం సందర్శకులు కొవ్వొత్తులు పెడతారు. మేము ఆ గోడ దగ్గర నిలబడి కాసేపు శ్రద్ధాంజలి ఘటించాం.
ఈ కాంపు కి ఖైదీల తాకిడి ఎక్కువవటంతో సామర్ధ్యం సరిపోక అస్విత్జ్ - 2 ఆస్విత్జ్ -3 కాంపులని 1942 - 43 ప్రాంతాల్లో నిర్మించారు. కొంచెం బలిష్టంగా ఉన్న యూదులని అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాక్తరీల్లో పని చెయ్యటానికి తీసుకు వెళ్ళేవాళ్ళు. ఒక ఎండిపోయిన బ్రెడ్ మరియు సూప్ ఆహారంగా ఇచ్చి రోజంతా పని చేయించేవాళ్ళు. రెండు మూడు నెలల్లోనే వారు నీరసించి మరణించే వాళ్ళు. ఒకసారి గ్యాస్ కొరత ఏర్పడి జనాలని చంపటానికి ఇబ్బంది ఏర్పడటంతో, కొన్ని వేల మందిని మంచులో నడిపించుకుంటూ కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్ళారు. నడక పూర్తయ్యేలోపు సగం మంది ఆ చలికి దారిలోనే ప్రాణాలు వదిలారు. నడవలేని వారిని నాజీలు ఎక్కడికక్కడ కాల్చి చంపారు. చరిత్రలో దీనిని డెత్ వాక్ గా పిలిచారు. 22 వ బారక్ లో అతిచిన్న డార్క్ రూము చూశాం. ఒక మనిషి నిలబడగల రూం అది. అందులో 4గురు మనుషుల్ని పెట్టేవారు, వారు నిలబడే ఉండాలి గాలి వెలుతురూ లేదు,ఒక రోజులోనే ఆ నలుగురూ శవాలయ్యేవారు. యూదుల రక్తంతో వారి హాహాకారాలతో ఈ నేల ఎంతటి పాపాలకి వేదిక అయ్యిందో తలచుకోగానే కళ్ళ వెంట అప్రయత్నంగానే జల జలా నీళ్ళు కారాయి. నాతో పాటు ఉన్న మార్చిన్ కూడా ఒక్కో చోట నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎందుకంటే 30 లక్షలమంది పోలాండ్ వాసులే ఈ యుద్ధంలో చనిపోయారు. అది కూడా తమ దేశంలో నిర్మించిన ఈ మృత్యు సౌధంలో 12 లక్షలమంది చంపబడ్డారు.10 వ నంబర్ బారక్ వైపు చూపిస్తూ మార్చిన్ చెప్పిన విషయం వింటే కడుపులో దేవినట్లైంది.....
Friday, August 9, 2013
నా ఐరోపా యాత్ర - 6 (పోలాండ్)
యూదులు పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు. క్రీస్తు పూర్వం ఈ మతం ఉంది. వీరి దేవుడు మెసయ్య ఎప్పటికైనా వస్తాడని నమ్ముతారు . వీరి ప్రార్ధనా మందిరాలని సినగోగాస్ అంటారు. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. అక్కడ ఏసుక్రీస్తును శిలువ చేసి చంపిన తరువాత యూదులు భయకంపితులై ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి చెల్లాచెదురుగా ఐరోపా, అమెరికాలకు వలస పోయి అక్కడ స్థిరపడ్డారు.మరి కొంతమంది అమెరికా కి వెళ్లారు. ఇలా వెళ్ళిన వారంతా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఆ దేశపు పౌరులుగానే ఉండిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ తరపున ఎంతో మంది యూదులు పోరాడారు. మెడల్స్ సంపాదించారు. కాని హిట్లర్ కి ఎందుకో యూదుల వల్లే కుట్ర జరిగి మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని నమ్మాడు. వారి నిర్మూలనే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. మనుషుల్లో ఉండే జెనెటిక్ లక్షణాల ఆధారంగా వారిని వేర్వేరు జాతులుగా పేర్కొన్నాడు. జర్మనీ వాసుల లక్షణాలు ఎలా ఉంటాయో వివరించి వారిని మిగతా జాతుల వారితో కలవకూడదని ఆజ్ఞాపించాడు. తాను 1934 లో అధికారంలోకి రాగానే ఈ యూదు విద్వేష చర్యల్ని చేపట్టాడు. యూదులని అధమజాతి పౌరులుగా ప్రకటించి వారిని తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు. 1938 లో ఒక యూదు ఈ పరిణామాలకి ఎదురు తిరగటంతో దానికి ప్రతీకారంగా నవంబర్ 9 రాత్రి నాజీ సైన్యం ఒక్కసారిగా యూదులపై విరుచుకు పడింది. 91 మందిని కాల్చి చంపారు. 30000 మందికి ఒకేసారి అరెస్ట్ చేసి concentration camp కి తరలించారు. యూదుల ప్రార్ధనా మందిరాలు తగులబెట్టారు. వారి షాపుల అద్దాలన్నీ పగలగొట్టారు. బెర్లిన్ అంతా గాజుముక్కలతో నిండిపోయింది. అందుకే దీనికి జర్మన్ భాషలో Crystal Nacht అని పేరు వచ్చింది. అంటే "అద్దాలు పగిలిన రాత్రి".
ఇక అక్కడినుండి యూదుల నిర్భందం ప్రారంభమైంది. జైళ్ళు చాలక concentration camp లు నిర్మించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కాంపుల్లో కుక్కారు. ఇక హిట్లర్ జర్మనీ విస్తరణ దిశగా దృష్టి సారించాడు. పశ్చిమాన ఉన్న పోలాండ్ ని జర్మనీ తో కలిపేయాలని భావించాడు.అసలు ప్రపంచ పటంలో పోలాండ్ అనే దేశం ఉండరాదు అనేది హిట్లర్ ఆలోచన. అప్పటికి అత్యధికంగా 30 లక్షలమంది యూదులు ఉన్న దేశం పోలాండ్. అయితే పోల్స్ ఈ ప్రతిపాదన కి అంగీకరించలేదు. ఈలోగా రష్యా అధ్యక్షుడు స్టాలిన్ తో హిట్లర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలాండ్ ని తూర్పునుండి రష్యా, పశ్చిమం నుండి జర్మనీ ఆక్రమించుకోవాలని ఆ ఒప్పంద సారాంశం. దీనికి ప్రతిగా రష్యా జర్మన్ ఇతర ఆక్రమిత దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. దీని ప్రకారం సెప్టెంబర్ 1, 1939 న జర్మన్ బాంబర్లు ఎటువంటి హెచ్చరికా లేకుండానే పోలాండ్ ఆర్మీ పై విరుచుకు పడ్డాయి. మొదట్లో తీవ్రంగా ప్రతిఘటించినా జర్మన్ నాజీల ధాటికి తట్టుకోలేక పోలాండ్ లొంగిపోయింది. సెప్టెంబర్ 17 న రష్యా తూర్పునుండి పోలాండ్ ని ఆక్రమించింది. ఈ విధంగా పోలాండ్ దేశం 1945 వరకు అస్తిత్వం లేకుండా ఇరు దేశాల ఆక్రమణలో ఉండిపోయింది. 30 లక్షలమంది యూదులు మరియు ఇతర పోల్స్ లక్షలాది మంది ఈ కాలంలో చంపబడ్డారు. వీళ్ళందరినీ చంపటానికి మొత్తం 48 డెత్ ఫాక్టరీ లు concentration camp ల పేరుతో పోలాండ్ మరియు జర్మనీ లలో నిర్మించారు. అత్యంత పెద్ద డెత్ ఫాక్టరీ పోలాండ్ లో auschwitz అనే ప్రాంతంలో నిర్మించారు. పోలాండ్లో నేను చూసిన తరువాతి ప్రదేశం ఇదే. చాలామంది మిత్రులు అది చూడవద్దని వారించారు. వారెందుకు అలా అన్నారో నాకు అర్ధం కాలేదు. కాని నేను ఈ ప్రదేశం చూశాక ఒక మనిషిగా చలించిపోయాను. చెలియల కట్ట కూడా ఆపలేని అశ్రువులు ధారగా కారుతుంటే అంతకుమించిన ఆవేదన నా మనసుని చిద్రం చేసింది. అసలు ఈ ప్రాంతం చూడకుండా ఉంటే బావుండేది అనిపించింది. ఇప్పటికీ,ఎప్పటికీ ఆ డెత్ కాంప్ నేను మరువలేని మరణ సౌధం. సాటి మనుషుల్ని చంపటానికి మనుషులే నిర్మించిన ఆ సువిశాల మరణ ప్రాంగణం ఎన్ని రోదనలని భరించిందో, ఎంతమంది పసి వాళ్ళ ప్రాణాలు గ్యాస్ చాంబర్ల ఆకలికి బలై పోయాయో తలుచుకునప్పుడల్లా గుండె చెమ్మగిల్లిపోతుంది.
Auschwitz అనే ప్రదేశం మేము ఉన్న మింజు జెర్జ్ కి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవంబర్లో వరుసగా వారం రోజులు సెలవు కావటంతో అక్కడి మాతోపాటు పనిచేసే స్థానిక మిత్రుడు మార్చిన్ క్రదోహా ( Marcin Krajdoha) ని అడిగితే తను తీసుకువెళ్తా అని చెప్పాడు. తరువాతి కాలంలో నేను చూసిన అన్ని ప్రదేశాలకి తానే గైడ్ గా వ్యవహరించాడు. మా స్నేహ బంధం ఇప్పటికీ అంతే ఆత్మీయంగా కొనసాగుతోంది.మింజు జేర్జ్ నుండి నవంబర్ న తోటి భారతీయ మిత్రులు ముగ్గురు ఉదయ్ అమ్మణ్ణ , శశి కుమార్, చోటురాం లతో కలిసి మార్చిన్ కారులో బయలుదేరాం. Auschwitz చూసి అక్కడినుంచి పోలాండ్ ఒకప్పటి రాజధాని అయిన క్రాకో పట్టణం మరియు జాకోపానా అనే పర్వతాలు చూడాలి అనేది మా ప్లాన్. పోలాండ్ కి దక్షిణంగా 5 గంటలు ప్రయాణించాక Auschwitz చేరుకున్నాం. దానిని ఇప్పుడు ఆష్విత్జ్ మ్యూజియం గా పిలుస్తున్నారు. మేము వెళ్ళే దారిలో ఉన్న పాడుబడిన రైలు పట్టాలని చూపిస్తూ మార్చిన్ చెప్పాడు, ఈ పట్టాలమీదుగానే రైలు ఆ డెత్ కాంపులోకి వివిధ దేశాలనుంచి మనుషుల్ని తీసుకు వచ్చేది అని. పార్కింగ్ లో కార్ పార్క్ చేసి రుస్కి ఎంట్రన్స్ అనే గేటు గుండా టికెట్ కౌంటర్ కి వెళ్ళాం. బయట 50 కి పైగా టూరిస్ట్ బస్సులు ఉన్నాయి. అంతమంది జనాలు అక్కడ ఉన్నా కాని ఆ ప్రాంతం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది.
Friday, August 2, 2013
నా ఐరోపా యాత్ర - 5 (పోలాండ్)
నా ఐరోపా యాత్ర - 5 (పోలాండ్)
నేను ఎంతోమంది గొప్పవాళ్ళ ఆటో బయోగ్రఫీలని చదివాను. జీవితంలో వారి ప్రతి లక్ష్యం వెనుక ఒక ఆశయం కనపడింది. అది వారికైనా మేలు చేసేది,లేక సమాజానికైనా మేలు చేసేదిగా ఉండేది. నాకు అర్ధం కానిది, నాకు ఇప్పటికీ అంతు చిక్కనిది హిట్లర్ జీవితం, అతని ఆశయం. నియంతృత్వంతో ప్రపంచాధిపత్యం సాధించాలనే కోరికతో ఎంతోమంది యుద్ధ పిపాసులు నియంతలుగా అవతరించారు. తన సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని మట్టు బెడుతూ మాత్రమే వారు నియంతృత్వంతో వ్యవహరించారు. కాని ఎవరూ లక్ష్యాన్ని చేరుకోకుండానే మరణించారు. కాని అలాంటి వారికి భిన్నమైన మనస్తత్వం హిట్లర్ ది. తనతో ఏకీభవించని వారిని మాత్రమే కాకుండా, అసలు తనకు ఏమాత్రం సంభంధం లేని యూదులు, జెర్మనీ అభివృద్ధి కి ఆటంకాలుగా ఉన్నారనే అసత్య ఆరోపణలతో, జర్మనీ నుండి యూదుల నిర్మూలనే నా లక్ష్యం అనే నినాదంతో పార్టీని స్థాపించి, ప్రజల మధ్య జాతి విద్వేషాలని రెచ్చగొట్టి తాను అధికారంలోకి వచ్చాక 60 లక్షలమంది యూదులని అత్యంత కిరాతంగా మట్టుబెట్టాడు. చాలామందికి హిట్లర్ అంటే నియంతగా మాత్రమే తెలుసు. కాని తెలియని మరో కోణం ఈ యూదు విద్వేషం, జాత్యహంకారం.
మొదటి ప్రపంచ యుద్ధం
యూరప్ లో ఉన్న సెర్బియా దేశస్థుడు తమ దేశపు వ్యక్తిని హత్య చేయటంతో ఆస్ట్రియా, హంగరీ ఆ దేశంపై యుద్ధం ప్రకటించాయి. ఆ యుద్ధం పెరిగి సెర్బియాకి మద్దతుగా ప్రపంచంలో 28 దేశాలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. వీటిలో ముఖ్యమైనవి అమెరికా,బ్రిటన్ ,ఫ్రాన్స్ . వాటికి ప్రత్యర్ధులుగా జర్మనీ, ఆస్ట్రియా ,హంగరీ, బల్గేరియా అక్షరాజ్యాలుగా అవతరించాయి. ఈ మిత్ర రాజ్యాలు,అక్ష రాజ్యాల మధ్య జరిగిన యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం. 1918 వరకు యుద్ధం జరిగింది. ఎంతో ప్రాణ నష్టం , ధన నష్టం జరిగింది. జర్మనీ ఆర్ధికంగా చితికిపోయింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెయిమర్ రిపబ్లిక్ ప్రభుత్వం యూదులకి స్వేచ్చనిచ్చింది. వారు ఆర్ధికంగా సంక్షోభంలో ఉన్న జర్మనీ ని గాడిలో పెడతారని నమ్మింది. యూదులు మంచి వ్యాపార దక్షత కలవారు. వీరు అంతర్జాతీయ బాంకర్లుగా కూడా పిలవబడ్డారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ యూదు మేధావి. ఈ కాలంలోనే థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆవిష్కరించాడు. జర్మనీకి గర్వకారణం అంటూ వెయిమర్ ప్రభుత్వం ఆయన్ని కీర్తించింది. కాని జర్మనీ కి కాలం కలిసి రాలేదు. యుద్ధంలో ఓడిపోవటంతో గెలిచిన దేశాలు తమకు జరిగిన నష్టానికి పరిహారం కట్టమన్నాయి. దీనిని వేర్సైల్స్ సంధి అంటారు. ఫ్రాన్సు లో ఉన్న వేర్సైల్స్ రాజ ప్రాసాదంలో ఈ ఒడంబడిక జరిగింది. ఈ దెబ్బతో జర్మనీ ఆర్ధికంగా కుదేలయింది.డబ్బు కట్టటం కోసం కరెన్సీ అధికంగా ముద్రించారు. దీని వల్ల దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారింది. ఇక డబ్బు కట్టలేమని జర్మనీ చేతులెత్తేయటంతో ఫ్రాన్సు ఆ దేశపు బొగ్గు పరిశ్రమ ని స్వాధీనం చేసుకుంది. 1929 నాటికి దేశంలో The great Depression మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో జర్మన్స్ కి దేవుడిలా కనపడ్డాడు అడాల్ఫ్ హిట్లర్.
అడాల్ఫ్ హిట్లర్ ఏప్రిల్ 20, 1889 న బ్రౌనౌ అం ఇన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా, జర్మనీ దేశ సరిహద్దులలో ఉంది. ఆరుగురు పిల్లలలో హిట్లర్ నాలుగోవవాడు మరియు మూడవ మగ బిడ్డ. హిట్లర్ తండ్రి అలోఇస్ హిట్లర్ (అసలు పేరు శ్చిక్క్ల్ గ్రుబర్) వాణిజ్య శాఖలో గుమాస్తా. హిట్లర్ తల్లి క్లారా పోల్జ్ (1860–1907), అలోఇస్ కు రెండవ మరదలు మరియు మూడవ భార్య. వీరికి కలిగిన ఆరుగురు సంతనంలో హిట్లర్ మరియు అతని చెల్లెలు పౌలా మాత్రమే బతికారు. అలోఇస్ జూనియర్, ఏంజెలా, ఈ ఇద్దరు అలోఇస్ కు రెండవ భార్య వలన కలిగిన సంతానం. అలోఇస్ మొదటి భార్యకు పిల్లలు లేరు. అలోఇస్ హిట్లర్ (హిట్లర్ తండ్రి) ఆక్రమ సంతానం. తన జీవితపు తొలి 39 సంవత్సరాలు అతడు తన తల్లి ఇంటి పేరునే తన ఇంటి పేరుగా చేర్చుకున్నాడు. 1876 లో జనాభా లెక్కల ప్రకారం ఒక గుమస్తా ఇతని సవతి తండ్రి 'జోహాన్న్ గెఒర్గ్ హైడ్లార్' ను అలోఇస్ తండ్రిగా పేర్కొన్నాడు. ఆ పేరు రకరకాలుగా పిలవబడి చివరకు 'హిట్లర్' గా స్థిరపడింది. పురాతన జర్మన్ భాషలో 'హిట్లర్' అంటే గుడిశె లో నివసించే వాడని అర్థం. యుక్త వయసు వచ్చేనాటికి సరిహద్దు అధికారుల కళ్లుగప్పి జర్మనీ లోకి ప్రవేశించాడు. హిట్లర్ గొప్ప చిత్రకారుడు,కొన్నాళ్ళు రోడ్డు మీద రక రకాల ;బొమ్మలు వేసి పొట్ట పోసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యం లో చేరాడు. యుద్ధ మెళకువల్ని రాజకీయాలని అక్కడే వంటబట్టిన్చుకున్నాడు. 1918 లో జర్మనీ యుద్ధంలో ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక పోయాడు.ఆ ఓటమికి యూదులే కారణం అని వారి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు.1920 లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలో చేరి దానికి నాయకుడయ్యాడు. దాని పేరుని నేషనల్ సోషలిస్ట్ పార్టీ గా మార్చాడు.దీనినే క్లుప్తంగా నాజీ పార్టీ అన్నారు.దీనికి పనిచేసిన సైన్యం నాజీలుగా పిలవబడ్డారు. పార్టీ గుర్తుగా స్వస్తిక్ ని హిట్లర్ రూపొందించాడు.పార్టీ అన్నీ తానై వ్యవహరించాడు.జర్మన్స్ అంటే ఆర్య జాతికి చెందిన వారని, వారికి మాత్రమె ప్రపంచాన్ని ఏలగల సత్తా ఉందని ప్రజలలో ప్రచారం చేశాడు.జర్మన్స్ మాత్రమే జర్మనీ లో ఉండాలని పిలుపునిచ్చాడు. 1923 లో అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని కవాతు చేయించాడు. ఇది ఒక బీర్ హాల్ దగ్గర జరగటంతో చరిత్ర లో ఇది బీర్ హాల్ పుష్ గా పిలిచారు.
ఇందుకుగాను అప్పటి ప్రభుత్వం హిట్లర్ ని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఆ సమయాన్ని హిట్లర్ వృధా చేసుకోలేదు. ది మెయిన్ కాంఫ్ అనే పుస్తకాన్ని రాసాడు. జర్మనీ ఎలా ఉండాలో తాను ఎలాంటి జర్మనీ ని చూడాలనుకుంటున్నాడో అందులో రాసాడు. జర్మనీ వాసులు ఆర్యజాతి అని మిగతా వాళ్ళంతా సెమిటిక్ జాతులు గా వర్ణించాడు. ఆర్యులు మాత్రమే గొప్పజాతిగా ఉండాలని,ప్రపంచాన్ని ఏలాలని ఉద్బొదించాడు. ఆ పుస్తకం 1925 నాటికి 240000 కాపీలు అమ్ముడు పోయింది.యుద్ధం ముగిసే నాటికి 10 లక్షల కాపీలు అమ్ముడు పోయిందని ఒక అంచనా.1924 లో జైలు నుండి విడుదలయ్యాక నాజీ పార్టీని మరింత బలోపేతం చెయ్యటం మొదలు పెట్టాడు. 1929 మొదలైన సంక్షోభం 1933 నాటికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సమయంలో హిట్లర్ ఆవేశ పూరిత ప్రసంగాలు జర్మనీ ప్రజలని ఆకట్టుకున్నాయి. యూదులు లేని జర్మనీ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని నాజీల చేత చేయించిన ప్రతిజ్ఞలు జర్మనీ వాసుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. హిట్లర్ జర్మనీ రక్షకుడుగా వారికి కనిపించాడు. 1933 ఎన్నికలలో మెజారిటీ కూడగట్టుకున్న హిట్లర్,1934 నాటికి దేశాధ్యక్షుడు హిండెన్ బర్గ్ మరణించటంతో పూర్తి స్థాయి జర్మనీ అధ్యక్షుడుగా అవతరించాడు.ఇక అక్కడ్నుంచే యూదులకి, జర్మనేతర జాతులకి కష్టాలు మొదలయ్యాయి. యూదుల వ్యాపారాల్ని నిషేదించారు. వారు నగరాల మధ్యలో ఉండకూడదని ఆంక్షలు విధించారు. అసలు ఈ యూదులంటే ఎవరు? ఎందుకు జర్మనీలో ఉన్నారు ? హిట్లర్ కి వాళ్ళంటే ఎందుకు అంత కోపం?
Thursday, July 25, 2013
నా ఐరోపా యాత్ర - 4 (పోలాండ్)
మింజు జేర్జ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో బెర్లిన్ వెళ్ళే దారిలో ఈ బంకర్స్ ఉన్నాయి. తోటి భారతీయ మిత్రులు మరియు అక్కడి స్థానిక మిత్రుడితో కలిసి అవి చూడటానికి వెళ్ళాం. మొట్ట మొదటిసారి రెండవ ప్రపంచ యుద్ధం గురించి, హిట్లర్ గురించి విన్నది అక్కడే. జ్యూయిష్ అనే ఒక మతం ఉందని, వారినే యూదులు అంటారని అప్పుడే తెలిసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో పోలాండ్ పశ్చిమ భాగాన్ని రష్యా, తూర్పు భాగాన్ని జర్మనీ ఆక్రమించుకున్నాయి. రష్యా సైన్యం జర్మనీ ని ఆక్రమించాలంటే ఈ దారి గుండానే వెళ్ళాలి. వారిని నియంత్రించటం కోసం సరిహద్దులో భూమిలో 300 అడుగుల లోతున ఈ బంకర్ ని నిర్మించారు. దీని మొత్తం పొడవు 32 కిలోమీటర్లు. కాని కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే సందర్శనీయ ప్రాంతంగా ఉంది. అక్కడ ఇంగ్లీష్ గైడ్ కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. స్థానిక మిత్రుడు ముందుగానే ఏర్పాట్లు చెయ్యటంతో అప్పటికే మాకోసం ఎదురు చూస్తున్న గైడ్ సహాయంతో బంకర్ లోపలకి వెళ్ళాం. అతి ఇరుకైన తలుపు గుండా కిందకి 300 మీటర్లు మెట్లు దిగాక పొడవాటి వీధులు ఉన్న నిర్మాణంలోకి ప్రవేశించాం. లోపల ఉష్ణోగ్రత - 5 డిగ్రీలు. లోపల సైనికులు ప్రయాణించటానికి చిన్న ట్రైన్ కూడా ఉంది.అప్పుడు నాజీ సైనికులు వాడిన టూత్ పేస్టు, బూట్లు,టెలిఫోను, రేడియో ఇప్పటికీ అలాగే ఉంచారు.
అసలు అది 1940 లో కట్టిన నిర్మాణం అనిపించలా, పటిష్టమైన గోడలు, ఎక్కడా చెక్కు చెదరని ఈ నిర్మాణాన్ని ఒక క్రమ పద్దతి లో ప్రణాళికా బద్ధంగా నిర్మించారు. హిట్లర్ యుద్ధాన్ని ఒక పరిశ్రమ లాగే భావించాడు. దానికి తగ్గట్టే యుద్ధానికి అవసరమైనవి అన్నీ శాశ్వత ప్రాతిపదికనే నిర్మించాడు. అత్యాధునిక యుద్ధ సామాగ్రిని ఆ రోజుల్లోనే సమకూర్చుకున్నాడు. యుద్ధం కోసం రోడ్లు వేసారు, మనుషుల్ని చంపటానికి కాన్ సన్ ట్రేషన్ కాంపుల పేరుతో మృత్యు కుహరాలని నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక కాని రష్యన్ రెడ్ ఆర్మీ ఈ బంకర్ని చేరుకోలేదు. ఇందులో ఏమైనా సంపద దాచారేమో అని అక్కడక్కడా రెడ్ ఆర్మీ దీనిని ధ్వంసం చేసింది. అందుకే లోపల గోడలకి అక్కడక్కడా రంద్రాలు, బులెట్ గుర్తులు ఉన్నాయి. ఈ బంకర్ ఉన్నంత మేరా భూమి పైన డ్రాగన్ వే ఉంటుంది. యుద్ధ టాంకర్లు ఈ సరిహద్దుని దాటకుండా కొంత ఎత్తులో సిమెంట్ దిమ్మలు నిర్మించారు.
రష్యా సైన్యం ఈ దారిని వినియోగించకపోవటంతో ఈ బంకర్ నిర్మించిన ఉద్దేశం సఫలీకృతం కాలేదు. దీని నిర్మాణం జరుగుతున్నపుడు హిట్లర్ ఇక్కడికి వచ్చాడని గైడ్ చెప్పాడు. ఈ బంకర్ లో కొన్నాళ్ళు నాజీ సైనికుల కాంప్ ఉండేది. యుద్ధం ముగిసి జర్మనీ ఓడిపోయాక ఇందులో ఉన్న సైనికులంతా చెల్లా చెదురుగా పారిపోయారు. పోలాండ్ లో జర్మనీ ఆక్రమిత భాగాన్ని కూడా రష్యా ఆక్రమించుకుంది. 1989 లో కమ్యూనిస్టు పాలన అంతమై సోవియట్ యూనియన్ ముక్కలయ్యేవరకు పోలాండ్ దేశం రష్యా ఆధీనంలోనే ఉంది. ఇవన్నీ విషయాలు గైడ్ చెప్తుంటే తలపంకించి వింటూ ఉండిపోయాను. నా అసలు అన్వేషణ అప్పుడే మొదలైంది. అసలు యుద్ధం ఎందుకొచ్చింది? ఈ హిట్లర్ ఎవరు ? యూదుల్ని ఎందుకు అంత క్రూరంగా చంపాడు ? నాజీలంటే ఎవరు ? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కొంత హిట్లర్ గురించి పరిచయం అవసరం. అసలు సిసలు జాత్యహంకారానికి ప్రతిరూపం హిట్లర్, మానవత్వం లేకుండా సాటి మనుషుల్ని డెత్ ఫాక్టరీల్లొ అమానుషంగా చంపిన నాజీల కధ తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి.
Dated : 18.07.2013
Monday, July 1, 2013
Saturday, June 29, 2013
నా ఐరోపా యాత్ర - 3 (పోలాండ్)
నా ఐరోపా యాత్ర - 3 (పోలాండ్)
మేము నివసించిన అపార్ట్మెంట్స్
మింజు జెర్జ్ అనేది 20000 జనాభా గల ఒక చిన్న పట్టణం. మింజు జేర్జ్ అంటే పోలిష్ భాషలో రెండు నదుల మధ్య ఉండే ప్రాంతం అని అర్ధం. ఓబ్రా మరియు పాక్లిసా అనే రెండు నదులు పట్టణానికి ఇరువైపులా ప్రవహిస్తుంటాయి. ఇది పోలాండ్ కి పశ్చిమ భాగాన ఉంది. ఇక్కడినుండి జర్మనీ రాజధాని బెర్లిన్ 150 కిలోమీటర్లు మాత్రమే. 80 కిలోమీటర్ల లోనే జర్మనీ బోర్డర్ ఉంటుంది. పోలాండ్ రాజధాని వార్సా కి మాత్రం 500 కిలోమీటర్లు దూరం. అందుకే ఇక్కడి ప్రజలు బెర్లిన్ ఎయిర్ పోర్ట్ నే ఎక్కువ వినియోగిస్తుంటారు. నేను ఫ్లాట్ కి చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది. అప్పటికి ఇంకా సూర్యాస్తమయం కాలేదు. ముందుగా చెప్పుకునట్లు వేసవి కాలంలో రాత్రి 10 గంటల వరకు సూర్యుడు ఉంటాడు. అదే చలికాలంలో అయితే మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. నేను వెళ్ళింది శుక్రవారం కావటంతో మరుసటి రెండు రోజులు సెలవు దినాలు. నేను వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ఇండియన్ మిత్రులు అందరూ ఆ రెండు రోజుల్లో కలిశారు. చిన్న చిన్న పోలిష్ పదాలు కొన్ని నేర్చుకున్నాను. (హాయ్ చెప్పాలంటే చేష్, థాంక్యూ అంటే జిన్కుయా, గుడ్ మార్నింగ్ అంటే జిందాబ్రే, ) పోలిష్ భాష చాలా కష్టమైనది. ఆ పదాలని పలకటం చాలా కష్టం. కొంచెం ఓపిక, శ్రమ పడితే తప్పకుండా నేర్చుకోవచ్చు. మింజు జెర్జ్ అన్నీ సౌకర్యాలు గల మినీ పట్టణం. స్థానిక సంస్థలు ఎంత సమర్ధవంతంగా పని చేస్తాయో ఇక్కడి పాలక వ్యవస్థ చూశాక అర్ధం అయ్యింది. మనం ఉండే నివాస ప్రాంతం వివరాలు వారంలోపుగా ఆయా మున్సిపాలిటీ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఊరుకి ఒక టౌన్ హాల్, మరియు స్క్వేర్ (కూడలి) తప్పనిసరిగా ఉంటాయి. అభివృద్ధి అంతా స్థానిక మేయర్లు ,ప్రజా ప్రతినిధుల చొరవతోనే జరుగుతుంది. పట్టణ మేయర్ ఒక సామాన్య వ్యక్తిలాగే నివసిస్తుంటాడు. ఎటువంటి హంగులు,ఆర్భాటాలు ఉండవు.
మింజు జెర్జ్ టౌన్ హాల్
ఇక్కడి ఆహరం బ్రెడ్ మరియు మాంసం. చికెన్ మరియు పోర్క్ ఎక్కువగా తింటారు. బర్గర్, పిజ్జా లు కూడా ఎక్కువే. మన వాళ్ళు ఇతరదేశాలకి వెళ్ళినపుడు ఆ రేట్లు అన్నీమన రూపాయల్లోకి లెక్కవేసుకుని చూసుకోవటం చాలామందికి అలవాటు. పోలాండ్ కరెన్సీ పేరు PLN . పోలిష్ భాషలో జిలోటి అంటారు. ఒక జిలోటి కి మన డబ్బులు 17 రూపాయలు వస్తాయి. యూరప్ దేశాలన్నీ ఒక్కటి అయినా, కరెన్సీ విషయంలో మాత్రం ఇంకా ఒక్కటి కాలేదు. యూరో చలామణీ లో ఉన్న దేశాల ఆర్ధిక వ్యవస్థలని చూశాక మిగతా దేశాల ప్రజలు యూరో విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. పోలాండ్ ప్రభుత్వం కూడా 2014 నాటికల్లా యూరోని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నా, ప్రజల నుండి ప్రతికూలత ఎదురవుతోంది. ఒకరకంగా ఐరోపా సమితి బలవంతంగా యూరోని అన్ని దేశాలమీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఏకీకృత నగదు విధానం మంచిదే అయినా,దానిని ప్రవేశ పెట్టటంలో మాత్రం పాటించిన విధానాలు, కొన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలని పతనం చేశాయి. దానికి పెద్ద ఉదాహరణ గ్రీసు దేశం. యూరోని వాళ్ళ స్థానిక కరెన్సీకి సమాన విలువతో ప్రవేశ పెట్టటంలో విఫలం అవ్వటం వల్ల అక్కడి ప్రజల సంపద సగానికి సగం తరిగిపోయింది. వస్తువుల ధరలు, ఆహార పదార్ధాల ధరలు యూరోకి మారాక, ఇంతకుముందు కరెన్సీ ధరతో పోల్చుకుంటే రెట్టింపు అయ్యాయి. నేను చూసిన యూరప్ దేశాల్లో అత్యంత చవకైన దేశం పోలాండ్ మాత్రమే. అన్ని వస్తువుల ధరలు, ఆహార పదార్ధాల ధరలు మన రూపాయల్లో పోల్చి చూసుకుంటే దాదాపు ఒక్కటే. ఇక్కడి సూపర్ మార్కెట్లలో బియ్యం దొరుకుతాయి. కూరగాయలు మాత్రం పరిమితం. బంగాళా దుంపలు, టమోటాలు మనకంటే చవుక. ఏదైనా మన మసాలాలు, కూరగాయలు కావాలంటే వార్సాలో ఉన్న లిటిల్ ఇండియా అనే స్టోర్ నుండి తెచ్చుకోవాలి. మరో విశేషం ఏమిటంటే ఈ స్టోర్ నడుపుతోంది గన్నవరానికి చెందిన తెలుగువాడు కాట్రగడ్డ చందు. ఉన్నత విద్య కోసం 2007 లో పోలాండ్ వచ్చిన చందు ఇక్కడి స్థానిక యువతిని వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. ఏదైనా కూరగాయలు, ఇండియన్ మసాలా లు కావాలంటే ఫోన్ చేసి చెప్తే చాలు మరుసటి రోజుకల్లా కొరియర్ లో వచ్చేస్తాయి. మన వాళ్ళంతా వేరే దేశాలకి వెళ్ళినపుడు కూడా మన ఆహరం కోసం వెతుకుతుంటారు. స్విట్జెర్లాండ్ వెళ్లి కూడా ఇడ్లీ,దోశ కోసం వెతకటంలో అర్ధం లేదనేది నా అభిప్రాయం. ఏ దేశపు ఆహారపు అలవాట్లైనా అక్కడి స్థానిక వాతావరణ పరిస్థితులు, అక్కడ నివసించే వాళ్ళ శరీరానికి అనుకూలంగా ఉండేటట్లు ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రాంతానికి వెళ్ళినపుడు అక్కడి ఆహరం తీసుకుంటేనే మన శరీరం ఆ వాతావరణానికి తగినట్లుగా అలవాటు అవుతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ దొరికే ఆహారాన్ని తినటానికే ఆసక్తి చూపిస్తుంటాను.Continued...
Subscribe to:
Posts (Atom)