జూరిచ్ నుండి పారిస్ 600 కిలోమీటర్లు. భార్గవి, కాషా వెనుక సీట్లో కునికి పాట్లు పడుతున్నారు. మాక్సిమ్ అప్పటికే నిద్రపోయాడు. నేను మార్చిన్ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మధ్యలో 2 టోల్ గేట్స్ వచ్చాయి. మన దగ్గర లాగా మనుషులెవరూ అక్కడ లేరు. మనం అవసరమైన చిల్లర వేస్తే ఎలక్ట్రానిక్ గేటు తెరుచుకుంటుంది. సరిపడినంత చిల్లర లేకపోవటంతో నేను క్రెడిట్ కార్డులోనే పే చేసాను. నాకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. కాసేపటి తరువాత కారు ఒక విశాలమైన పెట్రోల్ బంక్ ఆవరణలో ఆగింది. మార్చిన్ కి కూడా నిద్ర రావటంతో 4 గంటల తరువాత ఆ పెట్రోల్ స్టేషన్లో ఆపాడు. 2 గంటలు తను కూడా నిద్రపోయి మళ్లీ ఫ్రెష్ అయ్యాక ప్రయాణం మొదలు పెట్టాడు. అప్పటికే తెల తెల వారుతోంది. మరో 2 గంటల తరువాత మరో దగ్గర బ్రేక్ ఫాస్ట్ కోసం కార్ ఆపాడు మార్చిన్. యూరప్ లో పెట్రోల్ బంకులన్నీ అన్ని సౌకర్యాలతో ఉంటాయి. మరీ ముఖ్యంగా దేశాల మధ్య ఉండే హైవే రోడ్లపైన ఉండే పెట్రోల్ బంకుల్లో హోటల్,వాష్ రూమ్స్ మరియు రెస్ట్ రూమ్ ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని బయలు దేరాము. అక్కడికి ఫ్రాన్సు బోర్డర్ ఇంకో 100 కిలోమీటర్లు ఉంది. పారిస్... ఐరోపా సాంస్కృతిక రాజధాని.. కళాకారుల కలల నగరం.. ఫాషన్ ప్రపంచ రాజధాని కూడా కదా .. ఎన్ని నవలల్లో చదివాం.. ఎన్ని రకాలు గా ఊహించుకున్నాం..మూడు రోజులు పారిస్ లో ఉంటామనగానే ఒక రకమైన ఉద్విగ్నత.. పారిస్ నగరమనగానే అందరికీ ఈఫిల్ టవర్ చూడాలని ఉంటుంది. కాని నేను చూడాలనుకున్నది మాత్రం గుయ్ మెట్ అనే మ్యూజియం.నేను జన్మించిన ఘంటసాల గ్రామానికి చెందిన అపురూప బౌద్ధ శిల్ప సంపద 100 ఏళ్ల క్రితం పారిస్ లో ఉన్న గుయ్ మెట్ అనే మ్యూజియం కి తరలించబడింది. ఘంటసాల చరిత్రలో ఆ మ్యూజియం పేరు తప్ప మరే ఇతర వివరాలు లేవు. నేను పోలాండ్ రాగానే ఎప్పటికైనా పారిస్ వెళ్లి ఆ శిల్పాలు చూడాలి అనుకున్నాను. అందుకే బయలుదేరేముందు గూగుల్ లో ఆ మ్యూజియం వివరాలు అన్నీ వెతికి సేకరించి పెట్టుకున్నాను. నేనిలా ఆలోచనల్లో ఉండగానే పారిస్ నగరం మాకు కనిపించ సాగింది. మరి కొద్ది దూరం వెళ్ళగానే దూరంగా ఈఫిల్ టవర్ పై భాగం కనిపించసాగింది. అది చూడగానే మాక్సిం ఐఫ్లా అంటూ ఉత్సాహంతో అరిచాడు. స్కూల్ లో మా స్నేహితులందరికీ అందరికీ చెప్తాను నేను ఐఫ్లా టవర్ చూసా అని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. (పోలిష్ భాషలో ఈఫిల్ టవర్ ని ఐఫ్లా టవర్ అంటారు) నేను ముందుగానే హోటల్ బుక్ చేసి ఉండటంతో నేరుగా హోటల్ కి వెళ్ళిపోయాం. పారిస్ లో పెద్ద సమస్య పార్కింగ్, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది.మా హోటల్ కి దగ్గరలో ఒక ప్రైవేటు పార్కింగ్ ఉంది. రోజుకి 24 యూరోలు పార్కింగ్ ఫీజు.పార్కింగ్ మొత్తం భూమి లోపలే ఉంటుంది. అక్కడే కార్ పార్క్ చేసేసి హోటల్ కి వెళ్లి అందరం ఫ్రెష్ అయ్యాం. హోటల్ పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. పారిస్ నగరం భూమి పైన ఎంత ఉందో అంత కు అంత భూగర్భం లో ఉంది. ఎక్కడినుంచి ఎక్కడికైనా భూగర్భంలో ఉన్న మెట్రో రైలులో కొద్ది నిమిషాల్లోనే చేరుకోవచ్చు. పారిస్ అంతా రాజప్రాసాదాలు, మ్యూజియంలు, సీల్ నదిపై ఎక్కడికక్కడ నిర్మించిన బ్రిడ్జిల మయం. ప్రతి మెట్రో స్టేషన్లో సిటీ మాప్ తో పాటు చూడాల్సిన ప్రదేశాల వివరాలు,వాటిని చేరుకోవటానికి అవసరమైన మెట్రో రైలు, బస్సు, టూరిస్ట్ గైడ్ ల వివరాలు ఉంటాయి.చరిత్రను భద్రపరుచుకోవటం పారిస్ దగ్గర నుంచే నేర్చుకోవాలి.సీన్ నది చుట్టూ శతాబ్దాల నాటి భవనాల అందం ఒకెత్తయితే, ఎవరి ప్రపంచంలో వారు విహరిస్తున్న మనుషులు ఒకెత్తు.వివరాల్లోకి వెళ్లేముందు నేను చెప్పాల్సింది ఒకటుంది. జీవితంలో మీరెప్పుడైనా పారిస్ వెళ్ళా లనుకుంటే మాత్రం పెళ్ళయాక భార్యతో వెళ్ళండి.లేదా పిల్లలు పుట్టాక వాళ్లకి ఒక 10 ఏళ్ళు వచ్చాక ఇద్దరూ వెళ్ళండి. బ్రహ్మచారిగా నో లేక కేవలం మీ మిత్రులతో కలిసి మాత్రం పారిస్ వెళ్ళటం శుద్ధ దండగ. పారిస్ ఒక రొమాంటిక్ నగరం, చరిత్ర మిగిల్చిన వందల ఏళ్ల శిల్పాల నుండి నేటి ఆధునిక ఫాషన్ ప్రపంచం దాకా అడుగడుగునా శృంగార సౌందర్యం ఉట్టిపడుతుంది. అప్పటిదాకా మేము చూసిన యూరప్ దేశాలన్నీ చల్లగా , ప్రకృతి ఒడిలో సేదదీరుతునట్లు ఉన్నాయి. కాని పారిస్ మాత్రం వందల ఏళ్ల నాటి రాచరికపు హంగులతో ఏదో ఒక రాజ్యంలో ఉన్నట్లు ఉంది. ఏ భవనాన్ని చూసినా తక్కువలో తక్కువ 200 ఏళ్ల క్రితం కట్టినవే ఉన్నాయి. మేము హోటల్ నుండి బయటపడేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది. మెట్రో స్టేషన్లో రోజు వారీ టికెట్లు ఉంటాయి ధర 11 యూరోలు. ఆ టికెట్ తో పారిస్ మొత్తం ఎక్కడినుండి ఎక్కడికైనా మెట్రో లో ప్రయాణించవచ్చు. మార్చిన్ కి ఇవన్నీ అవగాహన ఉన్నాయి కాబట్టి మేము మెట్రో లో వెళ్ళాము. లేదంటే ఏదైనా బస్ టూర్ తీసుకోవటం మంచిది.బస్ అయితే 2 రోజులకి 36 యూరోలు టికెట్ చార్జి. ఆడియో గైడ్ ఉంటుంది , అదీ కాకుండా రోడ్ మీద వెళుతూ పారిస్ వీదులన్నీ కూడా చూడవచ్చు. మెట్రో మొత్తం భూగర్భంలో ఉంటుంది కాబట్టి దిగిన చోట మాత్రమే చూడగలం. మేమున్న ప్రాంతం నుండి మేము మొదటగా వెళ్ళింది నోటార్ డాం అనే చర్చి.
మెట్రో స్టేషన్ నుండి బయటకి వచ్చి చూస్తే ఏముంది? అకస్మాత్తుగా ఒక టైం మషీన్ లో ఎక్కి మూడు వందల ఏళ్ల క్రితం రోజుల్లోకి వెళ్లామా అని ఆశ్చర్యం వేసింది. చుట్టూ పాతకాలపు రాజరిక చిహ్నాలున్న భవనాలు. 1160 లో ఈ చర్చి నిర్మాణం మొదలైతే 1345 నాటికి పూర్తయ్యింది, దాదాపు 200 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగింది.ఈ మధ్య కాలంలో ఎన్నో అవాంతరాలు ఎదురై కొంతకాలం నిర్మాణం కూడా ఆగిపోయింది. పూర్తిగా ఫ్రెంచ్ గోతిక్ శైలి లో ఉన్న ఈ చర్చ్ రోమన్ కాథలిక్ లకి ప్రార్ధనా స్థలం. అసలు అన్నేళ్ల క్రితం ఇది ఎలా కట్టారా అనిపించింది. మొత్తం దీని ఎత్తు 300 అడుగులు మత పెద్దలు బిషప్ ల విగ్రహాలు చుట్టూ చెక్కి ఉన్నాయి. సీన్ నది ఒడ్డునే ఈ చర్చ్ ఉంది. మాకు ఫోటో తీసుకోవాలంటే 100 అడుగులు వెనక నుండి తీస్తే కాని ఆ మొత్తం బిల్డింగ్ ని కవర్ చెయ్యలేకపోయాం.
ఇక అక్కడినుండి ఈఫిల్ టవర్ వెళ్దామని మాక్సిం మారాం చెయ్యడం మొదలు పెట్టాడు. ఆ చిన్న పిల్లవాడికి ఈ చర్చ్ లు బిల్డింగ్ లు ఏం అర్ధం అవుతాయి. వాడికి ఈఫిల్ టవర్ మాత్రమే కావాలి. ఇక అక్కడినుండి మళ్ళీ మెట్రో ఎక్కి డైరెక్ట్ గా ఈఫిల్ టవర్ స్టేషన్లో దిగాము. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది , అప్పటిదాకా సినిమాల్లో చూసిన ఈ శతాబ్దపు ఏడో వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు.అసలు విషయం మర్చిపోయా మన తెలుగు సినిమాల్లో మన్మధుడు లో చూపించినట్లు గా పారిస్ ని ఇంకెవరూ చూపించలేదేమో. మేము పారిస్ లో ఉన్నంత సేపు ఎస్కలేటర్ చూసినా సీన్ నది మీద వంతెన చూసినా బ్రహ్మి డైలాగులే గుర్తొచ్చాయి. నీళ్ళంటే పారిస్ వాళ్ళకి కూడా భయమే అందుకే వంతెనలు కట్టారు అని నేను భార్గవి అవన్నీ చెప్పుకుని నవ్వుకుంటుంటే మార్చిన్ వాళ్ళకి అర్ధం కాలేదు. మెట్రో స్టేషన్ లోంచి బయటకి రాగానే చాలా మంది రోడ్ల మీద నుంచుని బొమ్మలమ్ముకుంటున్నారు.. ఒకర్ని ఈఫిల్ టవర్ ఎక్కడుంది? అని అడగగానే.. నవ్వి వెనక్కి చూపించాడు. ఆకాశమంత ఎత్తులో టవర్.. గుగుర్పాటు గా అనిపించింది. ఆ అనుభూతి చెందిన క్షణం ఇప్పటికీ మరిచిపోలేనిది.మన్మదుడులో మొదటి సారి ఈఫిల్ టవర్ ని ఎలా చూపించాడో మేము చూసినపుడు కూడా అలాంటి దర్శనమే జరిగింది. లవ్ సిటీ అని పారిస్ ని ఎందుకంటారో ఈఫిల్ టవర్ దగ్గర టూరిస్ట్ లని చూడగానే అనిపించింది. 20 ఏళ్ల వయసున్న జంటల దగ్గరనుండి 70 ఏళ్ల వయసున్న జంటలు ఈఫిల్ టవర్ పైకి వెళ్ళటానికి క్యూ లో నిలబడి ఉన్నారు. పైకి వెళ్ళేటప్పుడు ఒకరి కొకరు అధరచుంబనాల తో తమ ప్రేమని వ్యక్తీకరించుకుంటున్నారు. టికెట్ కౌంటర్ పక్కనే ఈ టవర్ నిర్మాణ కర్త ఈఫిల్ విగ్రహం ఉంది. కొంతకాలం ఈఫిల్ ఈ టవర్ పై ఉన్న గదిలో నివాసం ఉండేవాడు.
1889 లో దీనిని స్థాపించినప్పటి నుంచీ ఇరవై కోట్లు మందికి పైగా దీన్ని సందర్శించారు . వీరిలో 67,19,200 (అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు) మంది 2006 లో సందర్శించారు.దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది.దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.
ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు. దీనికి 2 అంతస్థులు ఉన్నాయి మొదటి అంతస్థు వరకే అయితే 11 యూరోలు టికెట్ , అదే చివరి వరకు అయితే 17 యూరోలు. మేము మొత్తం పైకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము టికెట్ తీసుకుని పైకి వెళ్ళటానికే గంట పట్టింది. ఇలా 365 రోజులు జనాలు క్యూ లో పైకి వెళుతూనే ఉంటారు. పై నుండి పారిస్ నగరం మొత్తం అద్భుతంగా కనిపించింది. నగరం మొత్తం అందులో భవనాలన్నీ ఎవరో పెయింట్ వేసిన కాన్వాస్ లా అనిపించింది. అక్కడి నుండే గుయ్ మెట్ మ్యూజియం ఎక్కడుందా అని వెతికాను. నా దగ్గరున్న మాప్ ప్రకారం చూస్తే గుయ్ మెట్ ఈ టవర్ కి దగ్గరలోనే ఉండాలి. టవర్ కి అభిముఖంగా దగ్గరలోనే ఈ మ్యూజియం కనిపించింది. అక్కడినుండే ఒక ఫోటో తీశాను.
అప్పటికె సమయం 6 గంటలు అవడంతో ఆరోజు మ్యూజియం కి వెళ్ళటం కుదరదు. రేపు వెళదామని మార్క్ చేసి పెట్టుకున్నాం. అక్కడి నుండి మార్చిన్ గార్ డు నార్డ్ అనే ప్రాంతానికి వెళదామా అని అడిగాడు. గార్ డు నార్డ్ అనేది సెంట్రల్ మెట్రో స్టేషన్.యూరప్ లో ఉన్న మిగతా దేశాల నుండి వచ్చే రైళ్ళు అన్నీ ఈ స్టేషన్ కే వస్తాయి. ప్రముఖ తమిళ రెస్టారెంట్ శరవణ భవన్ ఇక్కడే ఉంది. బయటి నుండి చూస్తే అక్కడ మన వాళ్ళు తప్ప మిగతా దేశాల వాళ్ళంతా మన ఫుడ్ లాగించేస్తున్నారు. మేము ఆ ప్రాంతమంతా తిరుగుతూ ఉండగానే చీకటి పడింది. వెంటనే భార్గవి రాత్రి పూట ఈఫిల్ టవర్ బావుంటుంది కదా మళ్ళీ వెళ్దామా అంది. మా అందరి ముఖాల్లో వెలుగు , అవును కదా ఇదెలా గుర్తురాలేదు మనకి అనుకుని హోటల్ కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్లమల్లా మళ్ళీ ఈఫిల్ టవర్ కి బయలుదేరాం. విద్యుద్దీపాల కాంతుల్లో ధగ ధగ లాడే ఈఫిల్ టవర్ మేము పగలు చూసినదానికంటే ఎన్నో రెట్లు అందంగా ఉంది. అందుకేనేమో మన్మధుడు సినిమా లో త్రివిక్రమ్ రాసినట్లు ఈఫిల్ టవర్ పగలు పెర్ఫ్యూమ్ బాటిల్ లాగ రాత్రి పూట షాంపేన్ బాటిల్ లాగా కనిపిస్తుంది. నిజంగానే షాంపేన్ కిక్ లా ఉంది అలా వెలుగుతున్న ఈఫిల్ ని చూస్తుంటే. అక్కడే కాసేపు గడిపి ఆ రోజుకి విశ్రాంతి తీసుకుని హోటల్ కి వెళ్ళిపోయాం.
No comments:
Post a Comment