Thursday, October 29, 2015

నా ఐరోపా యాత్ర - 25 (లక్సెంబర్గ్)

పారిస్ నుండి నేరుగా బెల్జియం వెళ్దామని అనుకున్నాం. అలా వెళితే కేవలం 4 గంటల్లో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరుకోవచ్చు. కాని ఈలోపు మార్చిన్ మరో ఆలోచన చేశాడు నేరుగా బెల్జియం వెళ్లి ఏమి చేస్తాం అర్దరాత్రి పూట అని కారుని లక్సెంబర్గ్ వైపు పోనిచ్చాడు. అలా మా ప్లాన్ లో లేకుండానే మరో దేశం వెళ్ళాము. వెర్సైల్స్ నుండి లక్సెంబర్గ్  430 కిలోమీటర్లు దూరం. అప్పటికి సమయం రాత్రి 9 గంటలు అవుతోంది.అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఈ వాతావరణంలో గొప్పతనమో లేక రోడ్ల మహత్యమో కాని ఎంత దూరం ప్రయాణం చేసినా అలసట ఉండేది కాదు. మార్చిన్ అయితే ఏకధాటిగా 600 కిలోమీటర్లు డ్రైవ్ చేసినా అసలు అలిసిపోయేవాడు కాదు. మేము లక్సెంబర్గ్ చేరుకునేటప్పటికి ఉదయం 8 గంటలు అయ్యింది. పెద్దగా జన సంచారం లేదు.

యూరోపియన్ యూనియన్ ఆవిర్భావానికి , ఏకీకృత వీసా విధాన ఒప్పందం జరిగింది ఈ దేశంలోనే. 1985 జూన్ 14 న బెల్జియం, లక్సెంబర్గ్ , ఫ్రాన్స్ , నెదర్లాండ్స్, పశ్చిమ జర్మనీ (అప్పటికి తూర్పు జర్మనీ వేరుగా ఉండేది 1990 లోనే బెర్లిన్ గోడని కూల్చటం ద్వారా జర్మనీ ఏకం అయ్యింది) దేశాలు లక్సెంబర్గ్ లో ఉన్న Schengen అనే పట్టణంలో మొదటిసారి యూరోపియన్ యూనియన్ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఒక దేశానికి మరో దేశానికి మధ్య సరిహద్దుల్ని తీసివేసి ఒకే వీసా తో ఈ 5 దేశాలు వెళ్ళగలిగే సౌకర్యాన్ని కల్పించాయి. తరువాత దశల వారీ గా మరో 23 దేశాలు ఇందులో భాగస్వాములయ్యి ప్రస్తుతం 28 దేశాలు ఈ ఒప్పందం కిందకి వచ్చాయి. ఈ ఒప్పందం Schengen అనే పట్టణంలో జరిగింది కాబట్టి యూరోప్ వీసా ని Schengen వీసా అంటారు.ఇప్పుడు మేము ఉన్నది ఆ Schengen ఉన్న దేశంలోనే. రాత్రి పెద్దగా ఏమీ తినకపోవటంతో ఆకలి దంచేస్తోంది.కార్ పార్క్ చేసిన వెంటనే ఎదురుగా మెక్ డొనాల్డ్స్ కనిపించటంతో ప్రాణం లేచి వచ్చింది.

ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మెక్ డొనాల్డ్స్ లో మాత్రం ఒకే రుచిలో ఒకే ధరలో ఆహరం దొరుకుతుంది. మేము తిరిగిన 10 రోజుల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, అన్నీ ఎక్కువ సార్లు మెక్ డొనాల్డ్స్ లోనే తిన్నాం. ప్రపంచ వ్యాప్తంగా 33000 అవుట్ లెట్స్ ఉన్న అతి పెద్ద చైన్ రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్. యూరప్ హైవేల మీద ప్రతి 20 కిలోమీటర్లకి ఒక మెక్ డొనాల్డ్స్ కనిపిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేసి బయటకి రాగానే పక్కన షాపులో అద్దాలలో నుండి ఒక హాండ్ బాగ్ కనిపించింది. భార్గవికి అది బాగా నచ్చటంతో లోపలి వెళ్లి 25 యూరోలు పెట్టి అది కొనుక్కుంది.అప్పటిదాకా ఏది కొనుక్కోమని చెప్పినా యూరోని ఇండియా డబ్బుల్లో లెక్క వేసేసుకుని బాబోయ్ నాకొద్దు అంటూ వచ్చేసేది. మొత్తమ్మీద లక్సెంబర్గ్ లో ఒక హ్యాండ్ బాగ్ కొనుక్కుంది. అక్కడినుండి సిటీ మొత్తం కారులోనే తిరుగుతూ చూశాము. 

లక్సెంబర్గ్ ఐరోపాలో 8 వ తక్కువ జనాభా కలిగిన దేశం.మొత్తం జనాభా 5 లక్షలు. దీని ముఖ్య నగరం కూడా లక్సెంబర్గ్. ఇటీవలే ఈ దేశ ప్రధాని తన సహచరుడుని వివాహమాడాడు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఒక దేశాధ్యక్షుడు చేసుకున్న" గే " వివాహంగా ఇది పేరు పొందింది.2014 లో యునైటెడ్ నేషన్స్ సర్వే  ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక  తలసరి ఆదాయం కలిగి అత్యధిక GDP తో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడింది. ప్రపంచంలో ఉన్న బహుళ జాతి కంపెనీలు అన్నీ ఇక్కడొక ఆఫీసుని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టాక్స్ విధానాలన్నీ చాలా సరళీకృతం గా ఉంటాయి. మీరు తెచ్చే డబ్బులకి లెక్కలు అవసరంలేదు. మన దేశంలో ఉన్న బ్లాక్ మనీ ని తెల్ల డబ్బుగా మార్చుకోవాలంటే ఇక్కడొక కంపెనీ ని తెరిచి దాని ద్వారా విదేశీ పెట్టుబడి కింద మన దేశంలోని కంపెనీలకి తరలించవచ్చు. మారిషస్ , సైప్రస్ ,లక్సెంబర్గ్ ఇంకొన్ని దేశాల్లో ఈ సౌకర్యం ఉంది. ఇక్కడ పెట్టె కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలుగా పిలుస్తారు. కేవలం డబ్బుని దాచుకోవటానికి , ఇతర దేశాల్లో ఉన్న తమ కంపెనీలు ఉత్పత్తుల అమ్మకాల పై సేల్స్ టాక్స్ ఎగ్గొట్టటానికి బిల్లులన్నీలక్సెంబర్గ్ ఆఫీసునుండి తయారు చేస్తారు.ఈ కామర్స్ వచ్చాక ఈ ప్రక్రియ మరింతగా విస్తరించింది. మీరు కొన్ని వెబ్ సైట్లలో కొనే ఉత్పత్తులు మీకు తెలీకుండానే లక్సెంబర్గ్ నుండి బిల్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూస్తే ఆ విషయం అవగతమవుతుంది. లక్సెంబర్గ్ లో మూడు లుక్సంబర్గిష్, ఫ్రెంచ్ మరియు జర్మన్ అధికార భాషలు. లౌకిక దేశం అయినప్పటికీ లక్సెంబర్గ్ ప్రధాన మతం రోమన్ కాథలిక్. లక్సెంబర్గ్ సిటీ చూశాక అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియాన్ డెన్ (Vianden) అనే నగరానికి వెళ్లాం. అక్కడ 11 వ శతాబ్దంలో నిర్మించిన పాలెస్ ఒకటి ఉంది దీనిని Vianden castle అంటారు.కొండ మీద నిర్మించబడిన ఈ పాలస్ కింద లోయలు కొండలు కనిపిస్తాయి.చాలామంది అక్కడినుండి కిందికి లోయలోకి ట్రెక్కింగ్ కి వెళుతున్నారు. మేము పాలస్ బయటనుండే చూశాము. 

ఈ పట్టణ జనాభా కేవలం 1800.నగర వైశాల్యం 9 చదరపు కిలోమీటర్లు. మొత్తం రెండు వీధుల్లోనే ఇళ్ళన్నీ ఉన్నాయి. లక్సెంబర్గ్ లో అత్యధికులు దర్శించే పర్యాటక ప్రాంతం ఇదే. లోయలోనుండి కొండపైకి ఛైర్ రోప్ వే ఉంది. దాంట్లో పైకి వెళ్లి కాసేపు ఆ కొండ మీద గడిపి మళ్ళీ మన ఇష్టం వచ్చినప్పుడు కిందకి రావచ్చు. టికెట్ 5 యూరోలు. మేము అందరం ఆ చైర్ కార్ ఎక్కాం.సగం దూరం వెళ్ళాక కింద చూస్తే పెద్ద లోయ , ఒక్కసారిగా భయం వేసింది. కొండమీద నుండి దేశం మొత్తం కనిపించింది.కాసేపు అక్కడే గడిపాక కిందకి వచ్చేశాం. అప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది.పొద్దున్న తిన్న బ్రేక్ ఫాస్ట్ అరిగిపోయి అప్పటికి అరగంట అయిపొయింది. మళ్ళీ మెక్ డొనాల్డ్స్ జిందాబాద్ అంటూ లంచ్ కానిచ్చేసి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్  వైపు కారుని పోనిచ్చాడు మార్చిన్. 



No comments: