లిచ్టేన్ స్టెయిన్ నుండి మా తరువాతి ప్రయాణం ఆస్ట్రియా లోని రోల్స్ రాయ్స్ మ్యూజియం. ఈ మ్యూజియం ఒక ప్రైవేటు వ్యక్తిది. Franz Vonier అనే వ్యక్తి తనకున్న హాబీ తో దాదాపు 1000 రోల్స్ రాయస్ కార్లని సేకరించి మ్యూజియం గా ఏర్పాటు చేసాడు. ముందు రోజు రాత్రి మేము బస చేసిన హోటల్ లో ఈ మ్యూజియం తాలూకు వివరాలని చూడటంతో ఇది చూశాక అక్కడినుండి స్విట్జెర్లాండ్ వెళదామని అనుకున్నాం. లిచ్టేన్ స్టెయిన్ నుండి స్విట్జెర్లాండ్ వెళ్ళాలంటే ఆస్ట్రియా మీదుగానే వెళ్ళాలి.
ఆస్ట్రియాలో మేము బస చేసిన హోటల్
ఇళ్ళు కూడా పర్వత పాదాల్లో , కొన్ని పర్వతాల మీద విసిరేసినట్లు అక్కడొకటి , అక్కడొకటి కనిపించాయి. అసలు ఆస్ట్రియాలో ప్రయాణిస్తున్నంత సేపు ఆ ప్రకృతి రమణీయత మమ్మల్ని మరో లోకంలోకి తీసుకువెళ్ళింది. ఎటు చూసినా పచ్చిక బయళ్ళు , పచ్చటి కొండలు , ఆకులు అసలు కనపడని పూల తోటలు, అడవులు సైతం పద్దతిగా పెరిగినట్లు ఉన్నాయి. ఈ వాతావరణమే వీళ్ళ అదృష్టమేమో అనిపించింది.మన తెలుగు సినిమా పాటల కోసం దర్శక నిర్మాతలంతా వచ్చేది ఇక్కడికే. సినిమాల్లో పాటలలో కనిపించే ప్రకృతి అందాలన్నీ ఎక్కువ భాగం ఆస్ట్రియా లోనే చిత్రీకరించారు. ఇక్కడ అధికారిక భాష జర్మన్. స్లావెన్ క్రోషియన్ భాషలు కూడా మాట్లాడతారు. కరెన్సీ యూరో. ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం. ఇది దేశానికి ఒక మూలన ఉంటుంది.మేము ఈ నగరాన్ని చూడలేదు.
లిచ్టేన్ స్టెయిన్ నుండి రోల్స్ రాయస్ మ్యూజియం 50 కిలోమీటర్ల దూరంలో దోర్న్ బిర్న్ అనే ప్రాంతంలో ఉంది. ఒక పాత బట్టలమిల్లు ఉన్న ప్రదేశంలో ఈ మ్యూజియం నెలకొల్పారు. మేము వెళ్తున్న దారిలో చుట్టూ ఎత్తైన వృక్షాలు తో పాటు వీనులవిందుగా సవ్వడి చేస్తున్న జలపాతాల హోరు వినిపిస్తోంది. దాదాపు మేము వెళ్తున్న ప్రాంతం అంతా కొండలు , జలపాతాల మధ్యలోనే ఉంది. మార్చిన్ వాళ్ళ అబ్బాయి మాక్సిమ్ జలపాతం చూస్తానని మారాం చెయ్యటంతో ఒకచోట పక్కగా కారుని ఆపాడు మార్చిన్. అక్కడ దిగి కాసేపు ఆ జలపాతాన్ని చూస్తూ ఫోటోలు తీసుకున్నాం. తరువాత అక్కడినుండి కొద్ది దూరంలో ఉన్న మ్యూజియం ని చేరుకున్న మాకు నిరాశే ఎదురైంది. ఆరోజు మ్యూజియం కి సెలవు. మా ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లైంది. ఇక ఆ మ్యూజియం ముందు ఫోటో తీసుకుని వెనక్కి బయలుదేరాం. అప్పటికే సమయం మధ్యాహ్నం 2.30 అయ్యింది. అక్కడినుండి మా ప్రయాణం స్విట్జెర్లాండ్ లో ఉన్న రైన్ ఫాల్స్ ( Rhine Falls).
మార్చిన్ మరియు వాళ్ళ అబ్బాయి మాక్సిమ్ తో ఆస్ట్రియాలో మేము బస చేసిన హోటల్ దగ్గర
No comments:
Post a Comment