ఇటీవలే ఒక మిత్రుడికి ఎదురైన అనుభవం ఇది.పాతికేళ్ళ క్రితం పాతుకుపోయిన భావాలు నేటికీ సజీవంగా ఉన్నాయనటానికి నిదర్శనం ఈ సంఘటన.సరదాగా చెప్పుకుంటే ఓ మిత్రుడు తనకి తెలిసిన అమ్మాయికి సంభంధం చూడటానికి తమ దూరపు బంధువులని సంప్రదించాడు. మంచి కుటుంబం, మంచి అమ్మాయి, అయినా సరే వాళ్ళనుంచి అతనికి ఎదురైన సమాధానానికి ఆశ్చర్యపోయాడు. అమ్మో ఘంటసాల అమ్మాయిలా ?? మనవాడికి అర్ధం కాలేదు. ఇదెప్పుడో పాతమాట. ఈ తరానికి బొత్తిగా తెలియని విషయం. ఆశ్చర్యం కాక మరేమిటి.
సహజంగానే అటు దివిసీమ ఇటు మచిలీపట్టణం ప్రాంతాలతో పోలిస్తే మనది మెరక ప్రాంతం. పాత నానుడి ఏంటంటే మెరక ఊర్ల ఆడవాళ్ళతో గెలవలేము అని. మన ఊరి ఆడవాళ్లంటే గడుసు వాళ్ళు అని పేరు. ఈ మాట నేను కూడా చాలా సార్లు విన్నాను. ఇప్పటి తరం గురించి తెలియదు కాని, ఒకప్పుడు మన ఊరి వాళ్లతో వియ్యమందాలంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించే వాళ్ళట. వీళ్ళతో మనం ఇమడగలమా అని. అయినా మన ఊరి అమ్మాయిలని చేసుకోవాలనే ఆశ మాత్రం మనసులో ఉండేది. మన వాళ్ళ మర్యాదలు,పెట్టిపోతలు అలా ఉండేవి మరి. ఈనాటికీ అవి అలాగే ఉన్నాయనుకోండి. కాని ఘంటసాల అమ్మాయిలంటే భయం మాత్రం అలాగే ఉంది అనటానికి నిదర్శనం పైన జరిగిన సంఘటన. ఇదే మన వాళ్ళని అడిగితే అది నిజమే కదా అని నవ్వుతూ చెప్తారు. ఇది రాసే ముందు నాకు సన్నిహితంగా ఉండే కొంతమంది మన ఊరి ఆడపడుచులని ఇదే మాట అడిగితే అందులో ఏమన్నా డౌటా అని నన్నే ప్రశ్నించారు. మనం అధికులమని ఎవరైనా భయపడుతుంటే లోలోపల ఆనందం సహజం కదా. కాని కుటుంబం గురించి, పిల్లల గురించి మన ఊరి ఆడవాళ్ళ ఆలోచనలే వేరు. ఎప్పుడూ తన పిల్లలు,తన భర్త నెంబర్ వన్ గా ఉండాలనే తాపత్రయం అడుగడుగునా కనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం తమవైన సుఖాల్ని, భాద్యతలని, పణంగా పెట్టే తెగువ మన ఊరి ఆడవాళ్ళ సొంతం. బహుశా ఆ తాపత్రయమే వాళ్ళని గడుసువాళ్ళుగా లోకానికి చుపించిందేమో.
గత పది సంవత్సరాల్లో అమెరికాలోనూ,ఆస్ట్రేలియాలోనూ,లేక దేశంలో ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళ విజయాల వెనుక ఇలాంటి గడుసు వాళ్ళ త్యాగాలే ఉన్నాయి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, వాళ్ళని వివాహం చేసుకున్న ఘంటసాల అల్లుడైనా, కోడలైనా, ఇప్పుడు హాయిగా ఉన్నారంటే ఈ గడుసు వాళ్ళ త్యాగమే. స్కూల్ దశ నుండి కొంతమంది, కాలేజి దశ నుండి కొంతమంది, కేవలం పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ ఆలనా పాలన తామే చూసుకోవాలనే తాపత్రయంతో భర్తని, ఇంటి భాద్యతలని వదిలేసి బెజవాడలో, హైదరాబాదులో, చల్లపల్లిలో కూడా ఉండి పిల్లల్ని చదివించుకున్న ఎంతో మంది ఇల్లాళ్ళని నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఇక్కడ చదువయ్యాక MS కోసం లేక ఉద్యోగం కోసమో వాళ్ళు వెళ్ళిపోతే ఆ తరువాత గ్రామానికి తిరిగివచ్చేవాళ్ళు. కేవలం అమ్మలే కాదు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఇందులో భాగస్వాములే. వారి అవసరాలని చూసుకుంటూ వారానికో, నెలకో మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళుతూ, ఊర్లో వ్యవసాయాన్ని చూసుకుంటూ, గ్రామం నుంచి కూరగాయలు, పాలు రోజు పొద్దున్నే ఆరున్నర్ర కల్లా బెజవాడ బస్సులో టంచన్ గా ఇచ్చే తండ్రులు లేకపోతే వారి త్యాగం పరిపూర్ణం అయ్యేదే కాదు.(ఇప్పుడు పంపట్లేదు కాని పదేళ్ళ క్రితం మాత్రం అన్నీ గ్రామం నుంచే పంపేవారు.అక్కడ దొరకవని కాదు,ఏదో మన దొడ్లో మొక్క, మన గేద పాలు అని.) ఘంటసాల అమ్మాయిలని లేక అబ్బాయిలని పెళ్లి చేసుకునే వాళ్ళంతా కేవలం వాళ్ళ గడుసు తనాన్ని మాత్రమే కాదు దాని వెనుక ఉన్న తాపత్రయాన్ని, త్యాగాన్ని కూడా గుర్తించాలి.
కాని ఇది మన గ్రామానికే పరిమితం అంటే నేను ఏకీభవించను. నేను పని చేసే సంస్థలో నా పైస్థాయి అధికారి నెల్లూరుకి చెందిన వ్యక్తి. నేను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళకి ఏదో సందర్భంలో మీ కృష్ణాజిల్లా వాళ్ళకి ఎకరాలు ఉన్నా లేకపోయినా నకరాలు మాత్రం తగ్గవయ్యా అన్నాడు. అది నవ్వుతూనే అన్నా అందులో వాస్తవం లేకపోలేదు. మన వాళ్ళ నకరాల ముందు ఎదుటి వాడికి ఎకరాలు ఉన్నా అవి దిగదుడుపే...
Dated : 24.11.2012