Sunday, September 9, 2012

చల్లపల్లి ఎస్టేట్ రైతాంగ పోరాటం

కమ్మ,రెడ్డి కలిస్తే కామ్రేడ్ అని ఒక కమ్మాయన చెప్పినప్పుడు, నిజమే కదా అనుకున్నా. బడుగు వర్గాల కోసం పాటుబడే కమ్యునిష్టు నాయకులు రెండు అగ్రకులాలకి చెందిన వారే అవ్వటం మన రాష్ట్రం లో ఉన్న పెద్ద వింత. వారసత్వ రాజకీయాలు లేని, వారసులు ఏ మాత్రం రాజకీయాల్లోకి రావటానికి ఆసక్తి కనబరచని ఏకైన పార్టీ ఉందంటే అది  కమ్యునిష్టు పార్టీలే. ఒకప్పుడు మన ఊరు నిడుమోలు నియోజక వర్గం లో ఉండేదనే విషయం చాలా మందికి తెలిసిందే. చిన్నప్పుడు జరిగిన రెండు మూడు ఎలక్షన్లు నాకు బాగా గుర్తు. ఎప్పుడు చూసినా మన నియోజకవర్గానికి పాటూరి రామయ్య కమ్యునిష్టు పార్టీ తరపున పోటీ చేసేవారు. అది సి.పి.ఐ లేక సి.పి.ఎమ్ పార్టీ నో గుర్తు లేదు. కత్తి, సుత్తి, కొడవలికే మీ ఓటు అంటూ ప్రచారం జరుగుతూ ఉండేది. ఎప్పుడైనా ఊరు వెళ్ళినపుడు గుడి ముందు ఉన్న కమ్యునిష్టు దిమ్మ దగ్గర కూర్చునేవాళ్ళం.

మన గ్రామం లో ఒకప్పుడు కరడు గట్టిన కమ్యునిష్టులుగా ఉన్నఅగ్రకులాల వారంతా ఎన్.టి.ఆర్ పార్టీ పెట్టగానే తెలుగు దేశం లో చేరిపోయారు. మిగతా సామాజిక వర్గాల వారు మాత్రం కమ్యునిష్టులు గానే చెలామణి అవుతూ ఉండేవారు. సోవియట్ భూమి అని రష్యా లో రెపరెపలాడుతున్న ఎర్ర సామ్రాజ్యపు విశేషాలతో 1989 వరకు దళసరి కాగితంతో, రంగుల్లో వచ్చే కమ్యునిష్టు పత్రిక పిల్లల నోటు పుస్తకాలకి అట్టలు వేసుకునే కాగితంగా మారిపోయింది. నేను కూడా ఆ పత్రిక ని అట్టలు వేసుకోవటానికి ఉపయోగించిన గురుతులు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1999 వరకు ఎప్పుడూ కమ్యునిష్టుల తో పొత్తు పెట్టుకోవటంతో మన నియోజక వర్గంలో తెలుగుదేశం పోటీ చేసే అవకాశం రాలేదు. అదీ కాక రిజర్వుడు కావటంతో అగ్రకులాధిపత్యం ఉన్న ప్రాంతం అయినా ఆ కులాల వారికి పోటీ చేసే అవకాశం లేకపోయింది. అందుకే పసుపు రంగు లోకి మారిన కమ్యునిష్టులంతా ఎరుపు రంగు పార్టీ సానుభూతి పరులుగానే ఉండేవారు. నాకు ఊహ తెలిసే నాటికే కమ్యునిజం దాదాపు కనుమరుగవుతున్న దశ లో ఉంది. కానీ అనుకోకుండానే ఆ చరిత్ర కి సంభందించిన పుస్తకాలు ఎక్కువ చదివే అవకాశం కలిగింది. అలా అని విధానాల పట్ల ఆసక్తి మాత్రం కాదు. ఆ సాహిత్యం,చరిత్ర ఆసక్తి కరంగా ఉండటంతో కనపడ్డ ప్రతి పుస్తకం చదివేవాడిని. మలి తెలంగాణా ఉద్యమ ప్రారంభం,నేను హైదరాబాదుకి మకాం మారటం ఒక్కసారే జరిగాయి. తెలంగాణా సాయుధ పోరాటం,స్వతంత్రం వచ్చాక ఆ ప్రాంతం లో జరిగిన పోలీసు చర్య,నిజాం కి వ్యతిరేకం గా కామ్రేడ్లు సాగించిన అలుపెరగని పోరాటం, విప్లవ రచయితలు కాళోజీ నారాయణ రావు, రావి నారాయణ్ రెడ్డి ల గురించి తెలుసుకున్నచిన్న చిన్న సంగతులు ఆసక్తి కరంగా ఉండటంతో వాటికి సంభందించిన పుస్తకాల కోసం అబిడ్స్ లో ఉన్న విశాలాంధ్ర బుక్ హౌస్ కి వెళ్లి మరీ ఆ పుస్తకాలు కొనుక్కుని చదివే వాడిని. ఆ క్రమంలోనే  తెలంగాణా రాలిన రత్నాలు వంటి పలు రచనలు చదివే అవకాశం కలిగింది. కేవలం నల్లగొండ,వరంగల్ జిల్లాలోనే అత్యంత ప్రాబల్యం ఉన్న పార్టీ గా తెలిసిన నాకు మన ప్రాంతంలో ఉన్న కమ్యునిష్టుల చరిత్ర గురించి తెలిసింది చాలా తక్కువ. వృత్తి రిత్యా ముద్రణ రంగంలో పని చేస్తుండటంతో ఒక రోజు మిత్రుడిని కలవటానికి ఓ ప్రెస్ కి వెళ్ళినపుడు వారొక పుస్తకం అచ్చు వేస్తున్నారు. దాని పేరు చల్లపల్లి ఎస్టేట్ రైతాంగ పోరాటం. ఇదెప్పుడు జరిగింది అసలు, ఎవరు రాసారు ఇది అని ఆశ్చర్యంగా అడగటంతో ఆఫీసు లో కూర్చున్న ఒక ఎనభై పైబడిన పెద్దాయన్ని చూపించారు. ఆయనే కావూరి కుటుంబరావు గారు. హైదరాబాదులో మాదాపూర్ వెళ్ళేటప్పుడు వాటర్ ట్యాంక్ పైన కనిపించే కావూరి హిల్స్ అనే పదాల్లో మొదటి మూడక్షరాలు ఆయన మీద గౌరవంతో పెట్టుకున్నవే అని చాలామందికి తెలియకపోవచ్చు.ఆ పుస్తకాన్ని ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు.ఈ వెబ్ సైట్ లో e-books విభాగం లో మొట్ట మొదట పెట్టిన పుస్తకం కూడా అదే.
చల్లపల్లి లో ఉన్న కోట ని చాలా సార్లు చూసినా,ఆ కోట మాటున దాగిన ఈ చారిత్రక ఉద్యమం గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక్కడ ఎవరిది కరెక్ట్ అనేది బేరీజు వేయకుండా ఆనాటి చారిత్రక నేపధ్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత తోనే ఈ పుస్తకాన్ని చదవటం మొదపెడితే ఆ ప్రాంతంతో అనుభంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం తప్పక నచ్చి తీరుతుంది. చరిత్ర యావత్తు పోరాటం కాకపోవచ్చు. కానీ పోరాటం మాత్రం చరిత్రే అంటూ రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలు నిజంగా అలరిస్తాయి.

2 comments:

Praveen Mandangi said...

చల్లపల్లి & నాదెళ్ళవారిపాలెం గ్రామాలలో ఉన్న రైతులందరూ చల్లపల్లి జమీందార్‌‌లకి కౌళ్ళు కట్టినవాళ్ళే. కౌల్‌దారీ నుంచి విముక్తి కోసం కులంతో నిమిత్తం లేకుండా అందరూ పోరాడారు. జమీందారీ వ్యవస్థ రద్దైన తరువాతే వీళ్ళలో కులతత్వం పెరిగి వ్యక్తివాదం కూడా పెరిగింది.

Praveen Mandangi said...

ఆ పుస్తకం నేను చదివాను. చల్లపల్లి జమీందార్‌లకి వ్యతిరేకంగా పోరాడినవాళ్ళలో ఎక్కువ మంది చల్లపల్లి & నాదెళ్ళవారిపాలెం గ్రామాలకి చెందినవాళ్ళే. పోలీసుల చేతిలో చనిపోయినవాళ్ళలో కూడా ఎక్కువ మంది ఆ రెండు గ్రామాలకి చెందినవాళ్ళే. కమ్యూనిస్ట్‌లని ఓడించడానికి బ్రాహ్మణవాద పార్టీ అయిన కాంగ్రెస్, కమ్మవాళ్ళ పార్టీ అయిన జస్టిస్ పార్టీ రెండూ ఏకమయ్యాయి. నిజానికి ఇక్కడ కులానికీ, దోపిడీకీ మధ్య సంబంధం లేదు. చల్లపల్లి జమీందార్‌లు కులంతో సంబంధం లేకుండా అందరినీ దోచుకున్నారు. జస్టిస్ పార్టీ నాయకుడైన చల్లపల్లి రాజాని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి, కాంగ్రెస్‌వాళ్ళు తమకి పార్టీ బేధాలు లేవని కలరింగ్ ఇచ్చుకుని ఎన్నికలలో గెలిచారు, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు.