నేడే చూడండి.. మీ అభిమాన ధియేటర్ రాజ్యలక్ష్మి డీలక్స్ లో ప్రతి రోజూ మూడు ఆటలు..ఆ మైక్ వినిపిస్తే చెవులు రిక్కిరించుకుని వినేవాళ్ళు అందరూ..రిక్షా వస్తుంటే పోస్టర్ అంటిస్తుంటే పిల్లలంతా గుమిగూడి పోస్టర్ ని తదేకం గా గమనించే వాళ్ళు.ఇక ఆ రిక్షా రాక ,ఆ మైక్ వినిపించక రెండేళ్ళు అయ్యింది.బహుశా ఇక వినిపించక పోవచ్చు..ఆ రిక్షా కనిపించక పోవచ్చు. నాకు ఊహ తెలిసాక నాకు గుర్తున్న సినిమా బాలభారతం 1989 లో అనుకుంటా.నేల టికెట్ నుంచి బాల్కనీ దాకా అన్నీ క్లాసుల్లో ను కూర్చుని సినిమా చూసిన రోజులున్నై.పండగ వస్తే కిక్కిరిసి పోయిన హాలు లో స్టూలు మీద కూర్చుని చూసిన రోజులు ఉన్నాయి.చుట్టు పక్కల ఎక్కడా ఇంత శుభ్రం గా ఉండే హాల్ లేదని అనుకోవటం జ్ఞాపకం.టిక్కెట్స్ ఇచ్చే చంద్రశేఖర్,ఎప్పుడూ హాల్లోనే ఉండే బాపినీడు, మిరపకాయ బజ్జీలు వేసే కాంటీన్ ,అందరినీ కోపం గా కసిరే సాయిబు.సాయంత్రం కాగానే ఫెళ ఫెళ లాడే ఇస్త్రి బట్టలతో వచ్చే పెద్దమనుషులు,ఊర్లో విషయాలనుంచి పార్లమెంట్ లో సమస్యల దాకా చర్చలు.ఇటీవల ఆ ధియేటర్ ని చూసినప్పుడు నన్ను ముప్పిరిగొన్న జ్ఞాపకాలు.
పెరిగిపొతున్న టెలివిజన్ ఛానెల్స్,చదువుల కోసం పిల్లలు, వారి వెనకే తల్లి తండ్రులు,గృహిణులెవ్వరు థియేటర్ వైపు కన్నెత్తి అయినా చూడని పరిస్ఠితి. ఫలితం..! ఒకప్పుడు చుట్టుపక్కల 20 గ్రామాలకి వెండి తెర వినొదాన్ని పంచిన రాజ్యలక్ష్మి థియేటర్ ఇప్పుడు సినిమాలు చూసేవాళ్ళు లేక కనీసం వచ్చిన వాళ్లకొసం సినిమా ప్రదర్శించినా కరెంట్ డబ్బులు కూడా రాని దుస్థితి లో మూతబడింది.ఒకప్పుడు సినిమా హాల్ రోడ్ అంటే ఎప్పుడూ సందడే. ఊరంతా పడుకున్నా 2nd Show అయ్యేవరకు ఆ రోడ్ మాత్రం సందడి గానే ఉండేది.ఇప్పుడు కనీసం ఆ రోడ్డు వైపు కన్నెత్తి అయినా చూసే వాళ్లు లేక చూపరుల హృదయాల్ని బరువెక్కిస్తూ రాజ్యలక్ష్మి డీలక్స్ గత వైభవానికి మూగ సాక్ష్యం గా నిలిచింది.ఈనాటికి సరిగ్గా పాతికేళ్ల క్రితం 1986 లో మన ఊరి అల్లుడైన శ్రీ పరంధామయ్య గారు తన సతీమణి పేరు తో ఈ థియేటర్ ని కట్టారు. స్వాతిముత్యం ఈ థియేటర్ లో ప్రదర్శించబడిన తొలి సినిమా.ఆరోగ్య కారణాల రీత్యా 1998 లో చల్లపల్లి వాసులకి అమ్మివేయటం జరిగింది.అప్పటినుంచి ఈనాటి వరకు థియేటర్ వారి ఆధీనం లోనే ఉంది. పెరిగిపోతున్న టాక్స్ లు,ఉన్నత వర్గాల గృహిణులెవ్వరూ సినిమాకి రాకపోవటం,యువత అందరూ చదువుల కై పట్టణాల కి వలస వెళ్ళటం,మారుతున్న జీవన ప్రమాణాలు,వేగవంతం అయిన రవాణా సౌకర్యాలు,మరియు రిలీజ్ సినిమాలన్ని చల్లపల్లి రావటం వల్ల ఎక్కువమంది మన ఊరికి ఆ సినిమా వచ్చే లోపే చూడటం తదితర కారణాల వల్ల నిర్వహణ కష్టతరమై విధి లేని పరిస్థితి.అలా అని మనమేదో సినిమాలు చూసి ఈ ధియేటర్ ని ఉద్ధరించమని నా ఉద్దేశం కాదు.కాల ప్రవాహం లో కనుమరుగవుతున్న ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలని మళ్లీ నెమరువేసుకోవటానికే ఈ కధనం.
No comments:
Post a Comment