Friday, August 31, 2012

భౌద్ధ స్తూపం


                భౌద్ధ స్తూపం                         
                        ఈ స్తూపం ఘంటసాలకు ఈశాన్య భాగాన ఉంది.వాడుక భాషలో మనందరికి తెలిసిన దీని పేరు లంజదిబ్బ.కాని అతి పవిత్రమైన ఈ స్తూపాన్ని అలా పిలవటం సరికాదు.1870లో మొదటిసారిగా ఈ స్తూపం వెలుగులోకి వచ్చింది.అప్పటి కలెక్టర్ అయిన బాస్పెల్ మొదటిసారిగా స్తూపాన్ని గురించి ప్రభుత్వానికి తెలియచేశారు.ఆ తరువాత 1906 లో పురావస్తు శాఖాధికారి అయిన అలెగ్జాండర్ రే స్తూపాన్ని తవ్వించి ఒక రిపోర్టును ప్రచురించాడు.ఈ స్తూపమువంటిది దక్షిణభారత దేశం లోనే లేదని ప్రకటించాడు.ఘంటసాల ఒకప్పటి భౌద్ధ క్షేత్రమని ప్రపంచానికి తెలియ చేసింది ఆయనే.ఘంటసాలలో మొత్తం ఇలాంటివి అయిదు స్తూపాలున్నాయి.దక్షిణం వైపు ఉన్న కోటదిబ్బ,పశ్చిమాన ఉన్న ఎర్రంపాళ్ల దిబ్బ,మాలపల్లె లోని గొర్రెపందాల దిబ్బ,ఉర్లోనే ఉన్న కోడిపందాల దిబ్బ.స్తూపం అనగా సంస్కృత శబ్ధం దీని అర్ధం దిబ్బ.
                                          మౌర్య చక్రవర్తి అశోకుడు భౌద్ధ మత ప్రచారం కోసం క్రీస్తుపూర్వం 249వ సంవత్సరం లో మహదేవుడనే భౌద్ధ భిక్షువు ను దేశంలోని వివిధప్రాంతాలకు పంపాడని మహదేవుడు తన వెంట తెచ్చిన భౌద్ధ ధాతువులను ఘంటసాల,నాగార్జునకొండ,అమరావతి లలో నిక్షిప్తం చేశాడని 'దివ్య వాదన 'అనే గ్రంధం లో వివరించబడింది.ప్రస్తుతం ఘంటసాల లో ఉన్నంత పెద్ద స్తూపం నాగార్జునకొండ,అమరావతి ల లో లేదు.అదీ కాక మన స్తూపం  70శాతం యధాతధంగా ఉంది.మిగతా స్తూపాలు శిధిలం అయిపోగా పునర్నిర్మించారు .భౌద్ధ మతస్తులు తమ మత స్తూపాలను,సంఘారామములను,సహజ సుందర ప్రదేశములలోనూ విస్తార జలసంపదలున్న ప్రాంతాలలోనూ నిర్మించారు .బుద్ధభగవానుడు సకల భోగాలతో జీవనం సాగించే సమయం లో మానవ జీవితంలో దుఖ నివారణకి మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం లో అర్ధరాత్రి వేళ భార్యాపిల్లలనురాజ్యాన్ని విడిచి ఒక అశ్వము పై ఎక్కి వెళ్ళిపోతాడు.బుద్ధునికి ప్రియమైన ఆ అశ్వము పేరు కంటకము.ఆ కంటకము పేరిట నిర్మించబడిన మన గ్రామము కంటకశైల గా ప్రసిద్ధి పొంది ఆ తరువాత ఘంటసాల గా నామాంతరం చెంది ఉండవచ్చు.ఇక స్తూపం అంటే భౌద్ధం లో చైత్యం అని అర్ధం.అయిదు స్తూపాలు ఒకచోట ఉంటే అది మహాచైత్యం అంటారు కాబట్టి ఘంటసాల మహాచైత్యం.అనేక భౌద్ధ శిల్పాలు,పూసలు,రోమను నాణాలు,పాలరాతి స్తంభాలు ఈ స్తూపము సమీపం లో దొరికాయి.
ఘంటసాల పురాతన రేవు అని చెప్పటానికి ఆధారాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి 13వ శతాబ్ధం వరకు ఘంటసాల ఓడరేవు గా గుర్తించబడింది.ఈ ఓడరేవు నుంచి పాశ్చ్యాత్య దేశాలకు వ్యాపారులు తరలి వెళ్ళేవారు.ఆ రోజుల్లో రోమను నాణాలు చెలామణి లో ఉండేవి.ఈ స్తూపము దగ్గర జరిపిన తవ్వకాలలో రోమను చక్రవర్తి బొమ్మ ఒకవైపు,సముద్రుడి బొమ్మ ఒక వైపు ఉన్న నాణేలు దొరికాయి.
ప్రస్తుతం జలధీశ్వరాలయం లో మనం పూజిస్తున్న మహానాగము ఇక్కడ దొరికినదే.ఆ తరువాత దానికి సిమెంట్ చేయించి సుబ్బారాయుడి గుడి వెనుక ప్రతిష్టించారు.విచిత్రమైన విషయం ఏమిటంటే భౌద్ధమత సిద్ధాంతం ప్రకారం విగ్రహారాధన చెయ్యరాదు.కాని ఆయన శిష్యులు భౌద్ధమత వ్యాప్తి కొరకు స్తూపములు నిర్మించి ప్రచారం చేసేవారు

For more details : www.managhantasala.net

Thursday, August 30, 2012

పురావస్తు శాఖ మ్యూజియం


                                                               పురావస్తు  శాఖ మ్యూజియం 
                               ఎన్నో సంవత్సరాల తపస్సు,మరెంతోమంది మహానుభావుల కృషీఫలం మన మ్యూజియం.19వ శతాబ్ధపు ప్రధమంలో ప్రజలకు అవగాహన లేక దొరికిన బౌద్ధ అవశేషాలను,మరియు పాలరాతి శిల్పాలను,చాకలి బండలు గాను ,పిల్లలు వాటిని పగులగొట్టి గోడలపైన రాసే చాక్ పీసులుగాను వాడేవారు.అప్పటి వారి అవగాహనాలేమి వల్ల అరుదైన మన శిల్ప సంపద అంతా పారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియం కి తరలిపొయింది.మరికొన్ని మద్రాస్ మ్యుజియం లో భద్రపరిచారు.ఇప్పటికీ మన గ్రామశిల్పసంపదని అక్కడ చూడవఛ్చు.1920ల ప్రాంతం లో ఒక రైతు కోటదిబ్బల ప్రాంతం లో పొలం దున్నుతుండగా దాదాపు 60శిల్పశిలలు బయటపడ్డాయి.కొన్నాళ్ళు ఆ రాతిఫలకాలన్నీ గుట్టగా ఒక చెట్టుకింద ఉంచారు .కొన్నాళ్లకి పారిస్ నుంచి డూబ్రియేల్ అనే సందర్శకుదు వచ్చి మొత్తం శిల్పాలను5000 రూపాయలకు కొనుక్కుని వెళ్ళిపోయాడు.మరికొన్నాళ్ళకి స్తూప పరిశొధనకై వచ్చిన    Ernest ree అనే పరిశోధకుడు శిల్ప వివరాలను తన రిపోర్టులో పొందుపరచి తన నివేదికను సమర్పించాడు.
తదనంతరం దొరికిన శిల్పాలన్నిటిని పాత గ్రంధాలయ ఆవరణలో ఉంచారు.1945-జనవరి 1న ఘంటసాలలో మొదటి ఓపెన్ మ్యూజియం ను అప్పటి పురావస్తు శాఖాధికారి అయిన డాక్టర్ చాబ్రా ప్రారంభించారు పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం 100 శిల్పాలు ఉంటే కాని మ్యూజియం ను నెలకొల్పడానికి ఆస్కారం లేదు.అప్పటికి ఇంకా శిల్పాల సంఖ్య 100దాటలేదు.ఆ తర్వాత మళ్ళీ16.07.1963 న శ్రీ గొర్రెపాటి పరమేశ్వరరావు గారు ఢిల్లీ వెళ్ళి అప్పటి ఆర్కియాలజికల్ డైరెక్టర్ అయిన శ్ర్రీ ఎ.కె.ఘోష్ గారిని కలిసి మ్యూజియం నిర్మాణానికై వినతి పత్రం సమర్పించారు .ఆయన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు.అప్పటికి గ్రామస్తులంతా అచిరకాలం లోనే మ్యూజియం నిర్మాణం జరగగలదని ఆశించారు.కాని ఆ కల నెరవేరటానికి పట్టిన సమయం43సంవత్సరాలు.నమ్మశక్యంగా లేదు కదూ ?తదనంతరం ఆ భాధ్యతను భుజాన వేసుకున్న మహనీయుడు శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు (కిసాన్ మరియు పండిత కాదు). ఓపెన్ మ్యూజియం మూతపడిన తర్వాత వీధులలో అనాధల వలే పడి ఉన్న విగ్రహాలను ఒకచోట చేర్చి తన స్వంత ఇంటిలో భద్రపరిచి మ్యూజియం నిర్మాణం అయ్యేవరకూ వాటిని పరిరక్షించారు .అప్పటి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎన్.జి.రంగా మరియు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గార్ల ద్వారా కేంద్రప్రభుత్వంలో కృషి చేయించి మ్యూజియం నిర్మాణం అయ్యేంత వరకు అవిశ్రాంతంగా పోరాడారు.చివరికి 1997 లో మ్యూజియం నిర్మాణం ప్రారంభమైంది నత్తనడకన ఈ నిర్మాణం సాగుతూ 8సంవత్సరాల అనంతరం4జనవరి 2006లో కాలచక్ర కార్యక్రమం అమరావతి లో జరగనున్న సంధర్భం లో పురావస్తు శాఖాధికారులు హడావుడిగా ఈ మ్యూజియం ను అధికారికంగా ప్రారంభించారు .ఈ క్రమంలో కేంద్ర పురావస్తుశాఖ సూపరిండెంట్ డి.జితేంద్రదాస్ మరియు అప్పటి MLAమండలి బుద్ధప్రసాద్ చూపిన చొరవ ప్రశంసనీయం భాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మ్యూజియం నిర్మాణం ప్రారంభానికి 2సంవత్సరాల ముందే శ్రీ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారు 1994 లో కీర్తిశేషులయ్యారు.ఆయన కృషికి గుర్తుగా మ్యూజియం ముందు ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.మహాయాన గుర్తులైన బుద్ధదేవుని పాదాలు,ఛత్రము,గోటకం లో లభించిన ఆయక స్తంభము,శిలాస్తంభం,పూర్ణకుంభం,ధర్మచక్రం,నరసిం హస్వామి కాలభైరవుడు,రతీదేవి,సిం హ విగ్రహం,అర్హతుని విగ్రహం,బుద్ధప్రతిమ మహాభినిష్క్రమణ దృశ్య శిల్పాలను మ్యూజియం లో చూడవచ్చు.

Wednesday, August 29, 2012

శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయం


మన ఊరిలో తప్ప ప్రపంచం లో మరెక్కడా వినపడని కనపడని ఆలయం మన జలధీశ్వరాలయం.ఇటీవల కాలంలో బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయం గా మరింత ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఆగస్త్య మహాముని చేత ప్రతిష్టించబడిన ఈ ఆలయం మహిమాన్విత పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ స్వామి వారికి జలాభిషేకం చెయ్యరు.లింగం విభూది పూతతో తెల్లగా ఉంటుంది.ఈ గుడిలో జలధీశ్వరితో పాటు స్వామివారు ఒకే పానపట్టం పై వెలసి ఉన్నారు.

                                            శ్రీ బాలపార్వతీ  సమేత జలధీశ్వర  స్వామి
ఏకపీఠే విరాజంతం సర్వమంగళయా సహా '
    ఘంటసాల పురాధీశం జలధీశ్వర ఉపాస్మహే "
   భస్మాలంకృత సర్వాంగం అగస్త్యేన ప్రతిష్ఠితం '
భక్తాభీష్టప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే "


      జలధీశ్వరాలయ   స్థలపురాణం 
            
పార్వతీదేవి కల్యాణం చుడటానికి సమస్త ప్రాణికోటి ఉత్తరాపధమునకు పొయినదిఉత్తరాపధము బరువు పెరిగి కృంగిపోతుంది.పరమేశ్వరుడు ఆగస్త్యమహాముని ని పిలిచి తక్షణమే దక్షిణపధంలో ఒక పుణ్యప్రదేశంలో ఏకపీఠంపై పార్వతీపరమేశ్వరులను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే తన కళ్యాణ దర్శనభాగ్యం కలుగుతుందని సెలవిచ్చాడు.ఆగస్త్య మహాముని దక్షిణపధంలో ప్రతిష్టించిన క్షేత్రమే జలధీశ్వరాలయం.
పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠంపై ఉన్న ప్రాచీన క్షేత్రం.దక్షిణ కైలాసంగా ఈ ఆలయాన్ని ప్రజలు భావిస్తారు.ఈ ఆలయ విమాన శిఖరం ఇతర ఆలయాలకు భిన్నంగా మూడు శిఖరాలతో గజపృష్టాకారం గా ఉంటుంది.జలధీశ్వరుడు భక్తసులభుడు.స్వామిభక్తుల కోర్కెలు తీర్చే భక్తసులభుడుగా వాసికెక్కాడు.స్వామివారి దేవాలయంలో ఇరవైఒక్క ప్రదక్షిణలు చేసి స్వామివారికి రుద్రాభిషేకం చేసినవారికి సత్వరమే కోరికలు నెరవేరతాయి.
                         ఆలయంలో ప్రతి సోమవారం విశేష రుద్రాభిషేకం,ప్రతిరోజూ ఉదయం అయ్యవారికి అభిషేకం,ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారికి అష్టోత్తరనామార్చన,లలిత సహస్రనామ పారాయణం,ప్రతి శుక్రవారం అమ్మవారికి స్థపన,సహస్ర కుంకుమార్చన ,పౌర్ణమి రోజున శ్రీ సూక్తసహిత అమ్మవారికి స్థపన,సహస్ర కుంకుమార్చన,శుద్ధ చతుర్దశి రోజున మహాన్యాస పూర్వక ఏకవారభిషేకం,చతుర్వేద పారాయణం,ప్రతి సంవత్సరం మాఘశుద్ధపూర్ణిమ రోజున స్వామివారి జగాజ్యోతి ప్రజ్వలన మరియు వార్షిక కల్యాణం జరుపబడును.


భూమండలంలో ఎక్కడా లేని విధంగా ఏక పీఠం పై కొలువైన
శ్రీ బాలా పార్వతీ సమేత జలధీశ్వర స్వామి దేవస్థానం
ఘంటసాల - కృష్ణా జిల్లా

దూర ప్రాంతాల్లో ఉండే స్వామి వారి భక్తుల సౌకర్యార్ధం ఈ కింది సేవలను ఆన్ లైన్ ద్వారా కూడా అందుబాటులో ఉంచటం జరిగినది.కనుక ఈ సేవలను భక్తులు విశేషముగా ఉపయోగించుకుని స్వామి వారి సేవకు పాత్రులు కాగలరు.
ఓం
1) ప్రతి సోమవారం : మహా న్యాస పూర్వక ఏకవార అభిషేకం,మహా రుద్రాభిషేకం.
2) శుక్రవారం : శ్రీ సూక్త కుంకుమార్చన (అష్టోత్తరం)
3) ప్రతినెల మాస శివరాత్రి - మహన్యాస పూర్వక ఏకవార అభిషేకం,శ్రీ సూక్త కుంకుమార్చన (సహస్ర నామార్చన)   రాత్రివేళ - శాంతి కల్యాణం ,మాడ వీధులలో ఊరేగింపు.
4) మాఘ పౌర్ణమి : వార్షిక కల్యాణం 
మీ పేరు గోత్ర వివరాలను మరియు అభిషేకం చేయించవలసిన వారి వివరాలు మాకు మెయిల్ చేయండి.ప్రసాదం మరియు స్వామి వారి చిత్రపటం మీ అడ్రస్ కి కొరియర్ చేయబడతాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ సెల్ : 99854 63899

ఇవే కాకుండా మీకు గల దోషాలకు చేయించవలసిన పరిహారాలు, శాంతి పూజలు, జపం చెయ్యాలన్నా పండితులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ పిశుపాటి నరసింహారావు గారు Cell: 9440226212 ఈ సేవలు పూర్తిగా ఉచితం.


Tuesday, August 28, 2012

లయోలా మోడల్ కాన్వెంట్


1982 కి ముందు ఊరిలో ఏ పిల్లవాడినైనా ఎక్కడ చదువుతున్నావురా అని అడిగితే చెరువు మీద బడి, కొత్తరాజా గారి బడి, మేడ మీద బడి, 6 వ తరగతి అయితే హైస్కూల్.. ఈ పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ 1982 తర్వాత మరో కొత్త జవాబు తోడయ్యింది. అదే లయోలా మోడల్ కాన్వెంట్. ఎవరైనా ఎక్కడ చదువుతున్నావురా  అడిగినపుడు కొంచెం ఛాతి విశాలంగా చేసుకుని, సాగదీసి మరీ చెప్పేవాళ్ళు లయోలా మోడల్ కాన్వెంట్ అని. మన గ్రామం లో అదో కొత్త పిలుపు, ఇంగ్లిష్ మీడియం విద్య ని గ్రామస్తులకు పరిచయం చేసిన ఒక మేలి మలుపు. అందులో చదువుతున్నాం అని పిల్లలు చెప్పినా, చదివిస్తున్నాం అని పెద్దలు చెప్పినా అదో గొప్ప. మన ఉరిలో తొలి ప్రైవేటు స్కూల్ యార్లగడ్డ రాజబాబు గారిది. కానీ అది ఎక్కువ కాలం సాగలేదు.పూర్తి స్థాయి స్కూల్ గా రూపాంతరం చెందకముందే అది కనుమరుగైంది.
నాది ఆ స్కూల్ స్థాపించిన తర్వాత 4 వ బాచ్ అనుకుంటా,అక్షరాలు దిద్దింది,ఓనమాలు నేర్చుకున్నది అక్కడే. వడ్లమూడి కృష్ణయ్య గారి భవనం లో 1982 లో ప్రారంభమైన లయోలా ప్రస్థానం ఆ తర్వాత పక్కనే ఉన్న స్థలంలోకి మారాక  పూర్తి స్థాయి స్కూల్ గా రూపొందింది. ఆ స్కూల్ లోగో లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మ ఉండేది. ఆఫీస్ లోను, టేబుల్ పైన ఎక్కడ చూసినా అయన చిత్ర పటాలు ఉండేవి. స్వతంత్ర సంగ్రామం లో ఒక అతివాది గా విప్లవాన్ని సృష్టించిన విప్లవ కారుడు నేతాజీ. అప్పటిదాకా కేవలం పట్టణాలకే పరిమితమైన ప్రైవేటు విద్య ని మన గ్రామానికి అందించిన విద్యా విప్లవ కారుడు శ్రీ తుమ్మల రాంబాబు గారు. ఇది అతిశయోక్తి కాదు అయన దగ్గర చదువుకున్న వాడిగా అయన దార్శనికత (Vision) ని ఎరిగిన వాడిగా ఇది నాకు అనిపించిన సత్యం. అప్పట్లో చిన్న గ్రామం లో ప్రైవేటు స్కూల్ పెట్టటం అంటే ఒక సాహసమే. యూనిఫాం , షూ , బెల్ట్, టక్, ఇవన్నీ ఇప్పుడు మనకి మామూలుగా అనిపించొచ్చు. కానీ అప్పటికి అదో కొత్త పద్దతి, తప్పని సరిగా వేసుకురావాలి అనే రూల్ ఒకటి. మన వాళ్లకేమో అవన్నీ పట్టేవి కాదు. చదువు చెప్తే చాలు కదా ఈయనకి మరీ చాదస్తం అని విమర్శించటం నాకు తెలుసు. కానీ కార్పొరేట్ స్థాయిలో గ్రామం లోని  పిల్లల్ని, వారి ఆహర్యాన్ని(Body Language), అలవాట్లని తీర్చిదిద్దాలని ఆయన పడిన తపన ఎంతమందికి తెలుసు?
చదువు మాత్రమే కాదు,సాంస్కృతిక కార్యక్రమాలలోను,కళలలోను పిల్లలకి శిక్షణ ఇవ్వటానికి కూడా ఎంతో తపన పడేవారు. కూచిపూడి నాట్యం లో శిక్షణ ఇప్పించటానికి అప్పట్లోనే ఒక నాట్యాచార్యుడిని పిలిపించేవారు. రోజు కి 8 పీరియడ్స్ ఉంటే లాస్ట్ పిరియడ్ మాత్రం డ్రిల్ కి కానీ ఇలాంటి శిక్షణ కానీ ఉండేవి. అసలు science fair అనే పదమే తెలియని రోజుల్లో స్కూల్ తరపున హైదరాబాదు లో science fair లో పాల్గొన్నపుడు అసలు ఘంటసాల అనే ఒక ఊరు ఉందా అని అందరు ఆశ్చర్య పోయారు. అంత చిన్న గ్రామం నుంచి వచ్చిన Exhibits నగరాల్లో పిల్లలు చేసిన వాటి తో పోటీపడి విజేత గా నిలవటం అరుదైన విషయం. డబ్బులున్న వాళ్ళు ఎలాగూ విజయవాడ లోనో , పిల్లల్ని వదిలి ఉండలేని వాళ్ళు చల్లపల్లి లోనో తమ పిల్లలని చదివించే వాళ్ళు. మరి సామాన్యుడికి,మధ్య తరగతి వాళ్ళకి? అందరి గమ్యం లయోలానే అయ్యింది. స్కూల్ ప్రిన్సిపాల్ గా ఆఫీస్ లో దర్పం గా కూర్చునే మనిషి గా మాత్రమే కాదు,లంచ్ టైం లో పిల్లల లంచ్ బాక్స్ మూతల్ని తీసిచ్చిన రాంబాబు గారు నాకు తెలుసు. వాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా అని చూసాకే వారు భోజనానికి వెళ్ళేవారు. అన్నం తెచ్చుకోని పిల్లలకి మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లోనే తినిపించే లక్ష్మి టీచర్ అయన జీవిత సహచరి మాత్రమే కాదు, ఆ స్కూల్ ప్రయాణం లో నిర్మాణాత్మక భాగస్వామి. ఆవిడ లేని లయోలా ని, లక్ష్మి టిచర్ లేకుండా రాంబాబు గారిని  నిర్వచించటం కష్టం.
 
 
నేను చదివిన స్కూల్ లో నే మా అబ్బాయి కూడా చదివాడు అని మన తల్లి దండ్రులు చెప్పటం మనం విన్నాం. కానీ అది మనం చూడని గతం,మన అమ్మ, నాన్నలు మాత్రమే పొందగలిగిన అనుభూతి. కానీ లయోలా మన కళ్ళముందు జరుగుతున్న వర్తమానం,ఈ స్కూల్ లో  చదివి ఇక్కడే టీచర్ గా పనిచేసిన వాళ్ళని మనం చూడగలిగాం. తాము చదువుకున్నఈ స్కూల్ లోనే తమ పిల్లలని చదివిస్తున్న    వాళ్ళున్నారు. ఊరికి దూరం గా ఉన్నా,సెంటిమెంట్ కోసం ఒక్క సంవత్సరం నర్సరీ ఇక్కడ చదివించి తర్వాత తమతో తీసుకెళ్ళిన తల్లి దండ్రుల్ని చూసాను.ఇవన్నీ మా తరం వాళ్ళు, ఆ స్కూల్ లో చదువుకున్న వాళ్ళు మాత్రమే పొందగలిగిన అనుభూతి.మన గ్రామమే కాదు  పక్కనున్న పాలెం, కొత్తపల్లి నుంచి కూడా పిల్లలు రిక్షాలో వచ్చేవాళ్ళు. రిక్షా సుబ్బారావు,వాళ్ళ ఆవిడ సుబ్బమ్మ ఆయా గా దీర్ఘ కాలం స్కూల్ లో పనిచేసిన వాళ్ళు. పిల్లల ఆలనా పాలన విషయం లో వాళ్ళిద్దరూ పోట్లాడుకోవటం తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది.ఇప్పుడెక్కడ ఉన్నారో తెలీదు.ఆ మధ్య ఎవరినో అడిగే ప్రయత్నం చేశాను కానీ సరిగా తెలియలేదు.

ఈ స్కూల్ తొలి టీచర్ పాలడుగు జయశ్రీ తర్వాత గవర్నమెంట్ టీచర్ గా పోస్టింగ్ రావటం తో వెళ్ళిపోయారు. తొలినాళ్ళలో టీచర్ లు గా పని చేసిన రోజా,మాధవి,శైలజ, రాజ్యలక్ష్మి,లక్ష్మి రాజ్యం,సామ్రాజ్యం,కృష్ణ కుమారి, అప్పట్లో అదో స్పెషల్ అందరూ మహిళా టీచర్లే. నాకు గుర్తున్నంతవరకు తెలుగు చెప్పటానికి ఒకాయన వచ్చారు కానీ ఎక్కువ రోజులు ఉండలా. మా స్కూలింగ్ అయిపోయాక వచ్చిన వాళ్ళలో రేణు, శ్రీను ఎక్కువ కాలం పనిచేసినట్లు తెలుసు. కానీ ఎంతో మంది టీచర్ లు వచ్చినా, వెళ్ళినా సామ్రాజ్యం టీచర్ దే  రికార్డ్. ఎక్కువ సంవత్సరాలు పని చేసింది ఆవిడే. ఇప్పటికీ అక్కడే పని చేస్తున్నారు.
 
 
 అప్పటి టీచర్ గొర్రెపాటి ఝాన్సీలక్ష్మి తో 1983 - 84  బాచ్ విద్యార్ధులు
 
 మేము చదువుకున్నపుడు 7 వ తరగతి వరకు మాత్రమే ఉండేది. తర్వాత మేము హైస్కూల్ కి వెళ్లి పోయాం. ఆ తర్వాత అది లయోలా మోడల్ హైస్కూల్ అయింది. కొన్నాళ్ళకి చల్లపల్లి పబ్లిక్ స్కూల్ అయ్యింది.ఇప్పుడసలు ఊర్లో నే ఆ స్కూల్ గుర్తులు లేవు. మొన్న వెళ్ళినపుడు చూస్తే మహనీయుల విగ్రహాలు మాత్రం ఆ స్కూల్ బిల్డింగ్ ముందు ఉన్నాయి అక్కడొక స్కూల్ ఉండేది అనే దానికి గుర్తుగా. ఎన్ని పేర్లు మారినా,చల్లపల్లికి మకాం మార్చినా, నాలాంటి ఎంతో మంది పూర్వ విద్యార్దులను మధుర జ్ఞాపకాల్లో ఓలలాడించే ఊయల ఆనాటి లయోలా...

Monday, August 27, 2012

ఎనీ టైం మనీ



 ATM వచ్చిన కొత్తల్లో ఎవరికి తగ్గట్లు వాళ్ళు దాని అర్ధాన్ని చెప్పేసే వాళ్ళు Any time money, All time money ఇలా రకరకాలుగా. చాలామందికి అది Auto Teller Machine అని తెలియదు. మన దేశంలో తొలి ఎ టి ఎమ్ 1987 లో ముంబై లో ఏర్పాటు అయ్యింది. ఆ ఘనతని దక్కించుకున్న తొలి బ్యాంక్ HSBC. నేను తొలిసారి ATM ని చూసింది సికింద్రాబాద్ లో సంగీత్ ధియేటర్ పక్కనున్న Global Trust Bank 1999 సంవత్సరం లో. ఇప్పుడు ఈ బ్యాంక్ పేరు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ గా  మారింది. నేను వాడిన తొలి ATM కార్డ్ ICICI బ్యాంకుది. ఆ కార్డు అందుకున్నరోజు పట్టలేని ఆనందం, బ్యాంక్ లో బాలన్సు లేకపోయినా బిల్డప్ కోసం మెషిన్ లో కార్డ్ పెట్టి బాలన్సు ఎంక్వైరీ చేసే వాళ్ళం. కాలేజి లో చదువుకునే రోజుల్లో ICICI Bank లో ఎకౌంట్ అంటే అదొక పెద్ద స్టేటస్. ఇప్పుడు అందరికీ ATM Card కామన్ అవసరం అయిపోయింది. మొత్తానికి మన ఊరికి కూడా ATM వచ్చేసింది. గ్రామం లో అవసరమైన మౌలిక సదుపాయాల్లో Internet, ATM ఎప్పుడో చేరిపోయాయి.
ఒకప్పుడు ఎంతో కాలం ఎదురు చూస్తే కానీ రాని సాంకేతికమైన అవసరాలు ఇప్పుడు త్వర త్వరగానే గ్రామాలకి వచ్చేస్తున్నాయి. మన రాష్ట్రం లో ATM ల ఒరవడి ప్రారంభమైన 12 సంవత్సరాలకి మన ఊరికి ఆ సౌకర్యం రావటం సంతోషించదగిన విషయమే. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇది త్వరితగతిన అందిన సౌకర్యమే. మన దేశం సగటున ప్రతి 3000 మందికి ఒక ATM ఉంది. ఎలక్ట్రానిక్ చెల్లింపులు, ప్లాస్టిక్ మనీ (క్రెడిట్ కార్డ్) వాడటానికి అలవాటు పడ్డ సిటీ బాబులకి సెలవులకి ఊరొస్తే మనీ కోసం చల్లపల్లి దాకా వెళ్ళాల్సి వచ్చేది. SBI మన ఊరికి రావటంతోనే ఈ సాంకేతిక విప్లవం మొదలైంది. తోలి మేనేజర్ గా ఆనందబాబు నియామకం గ్రామంలో బ్యాంకింగ్ సేవలని కొత్త పుంతలు తోక్కించింది. నెట్ బ్యాంకింగ్, విదేశాలనుంచి నేరుగా డబ్బు పంపేందుకు western money Transfer లాంటి సదుపాయాలూ ఏర్పాటు అయ్యాయి. ఆయన చొరవతోనే 8 నెలల క్రితం ATM స్థాపనకి అంకురార్పణ జరిగింది. కానీ అది ప్రారంభం కాకముందే ఆయన బదిలీ కావటం కొంత విచారించదగ్గ విషయమే.
గ్రామానికి ప్రభుత్వ సంభందిత సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన క్రమాన్ని పరిశీలిస్తే పోస్టాఫీస్ 1902 లో, గ్రంధాలయం 1914 లో, హైస్కూల్ 1946 లో, కరెంట్ 1960 లో, టెలిగ్రాం సౌకర్యం 1960 లో, ఇంటింటికి టెలిఫోన్ 1962 లో, ఆంధ్రా బ్యాంక్ 1971 లో, పోలీస్ స్టేషన్ 1987 లో, విద్యుత్ సబ్ స్టేషన్ 2002 లో, స్టేట్ బ్యాంక్ 2009 లో, ఏర్పాటు అయ్యాయి.ఆ సౌకర్యాలు అప్పట్లో వచ్చాయని మనం ఇప్పుడు అనుకుంటున్నాం.అవన్నీ ఒక చారిత్రక ఘట్టాలు. రేపు మన తర్వాతి తరం వాళ్ళు కూడా ఈ ATM సౌకర్యం ఏర్పాటు అయిన క్రమాన్ని ఒక చారిత్రక ఘట్టం గా తలుచుకుంటారు. అందుకే 08.08.2012 వ తేది గ్రామ చరిత్ర లో మరొక చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచిపోతుంది. గ్రామం నడిబొడ్డున గ్రామానికి గుండెకాయ లాంటి ప్రదేశంలో ఈ ATM నెలకొల్పటం తో గ్రామానికే కొత్త హంగు అద్దినట్లు గా ఉండటం గర్వించదగ్గ విషయం. ఇక సెలవలకి గ్రామానికే వెళ్ళే వారంతా మనీ చేతిలో పెట్టుకోనవసరం లేకుండా నిర్భయంగా మీ ప్లాస్టిక్ కార్డులని వినియోగించుకోవచ్చు.