Monday, August 27, 2012

ఎనీ టైం మనీ



 ATM వచ్చిన కొత్తల్లో ఎవరికి తగ్గట్లు వాళ్ళు దాని అర్ధాన్ని చెప్పేసే వాళ్ళు Any time money, All time money ఇలా రకరకాలుగా. చాలామందికి అది Auto Teller Machine అని తెలియదు. మన దేశంలో తొలి ఎ టి ఎమ్ 1987 లో ముంబై లో ఏర్పాటు అయ్యింది. ఆ ఘనతని దక్కించుకున్న తొలి బ్యాంక్ HSBC. నేను తొలిసారి ATM ని చూసింది సికింద్రాబాద్ లో సంగీత్ ధియేటర్ పక్కనున్న Global Trust Bank 1999 సంవత్సరం లో. ఇప్పుడు ఈ బ్యాంక్ పేరు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ గా  మారింది. నేను వాడిన తొలి ATM కార్డ్ ICICI బ్యాంకుది. ఆ కార్డు అందుకున్నరోజు పట్టలేని ఆనందం, బ్యాంక్ లో బాలన్సు లేకపోయినా బిల్డప్ కోసం మెషిన్ లో కార్డ్ పెట్టి బాలన్సు ఎంక్వైరీ చేసే వాళ్ళం. కాలేజి లో చదువుకునే రోజుల్లో ICICI Bank లో ఎకౌంట్ అంటే అదొక పెద్ద స్టేటస్. ఇప్పుడు అందరికీ ATM Card కామన్ అవసరం అయిపోయింది. మొత్తానికి మన ఊరికి కూడా ATM వచ్చేసింది. గ్రామం లో అవసరమైన మౌలిక సదుపాయాల్లో Internet, ATM ఎప్పుడో చేరిపోయాయి.
ఒకప్పుడు ఎంతో కాలం ఎదురు చూస్తే కానీ రాని సాంకేతికమైన అవసరాలు ఇప్పుడు త్వర త్వరగానే గ్రామాలకి వచ్చేస్తున్నాయి. మన రాష్ట్రం లో ATM ల ఒరవడి ప్రారంభమైన 12 సంవత్సరాలకి మన ఊరికి ఆ సౌకర్యం రావటం సంతోషించదగిన విషయమే. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇది త్వరితగతిన అందిన సౌకర్యమే. మన దేశం సగటున ప్రతి 3000 మందికి ఒక ATM ఉంది. ఎలక్ట్రానిక్ చెల్లింపులు, ప్లాస్టిక్ మనీ (క్రెడిట్ కార్డ్) వాడటానికి అలవాటు పడ్డ సిటీ బాబులకి సెలవులకి ఊరొస్తే మనీ కోసం చల్లపల్లి దాకా వెళ్ళాల్సి వచ్చేది. SBI మన ఊరికి రావటంతోనే ఈ సాంకేతిక విప్లవం మొదలైంది. తోలి మేనేజర్ గా ఆనందబాబు నియామకం గ్రామంలో బ్యాంకింగ్ సేవలని కొత్త పుంతలు తోక్కించింది. నెట్ బ్యాంకింగ్, విదేశాలనుంచి నేరుగా డబ్బు పంపేందుకు western money Transfer లాంటి సదుపాయాలూ ఏర్పాటు అయ్యాయి. ఆయన చొరవతోనే 8 నెలల క్రితం ATM స్థాపనకి అంకురార్పణ జరిగింది. కానీ అది ప్రారంభం కాకముందే ఆయన బదిలీ కావటం కొంత విచారించదగ్గ విషయమే.
గ్రామానికి ప్రభుత్వ సంభందిత సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన క్రమాన్ని పరిశీలిస్తే పోస్టాఫీస్ 1902 లో, గ్రంధాలయం 1914 లో, హైస్కూల్ 1946 లో, కరెంట్ 1960 లో, టెలిగ్రాం సౌకర్యం 1960 లో, ఇంటింటికి టెలిఫోన్ 1962 లో, ఆంధ్రా బ్యాంక్ 1971 లో, పోలీస్ స్టేషన్ 1987 లో, విద్యుత్ సబ్ స్టేషన్ 2002 లో, స్టేట్ బ్యాంక్ 2009 లో, ఏర్పాటు అయ్యాయి.ఆ సౌకర్యాలు అప్పట్లో వచ్చాయని మనం ఇప్పుడు అనుకుంటున్నాం.అవన్నీ ఒక చారిత్రక ఘట్టాలు. రేపు మన తర్వాతి తరం వాళ్ళు కూడా ఈ ATM సౌకర్యం ఏర్పాటు అయిన క్రమాన్ని ఒక చారిత్రక ఘట్టం గా తలుచుకుంటారు. అందుకే 08.08.2012 వ తేది గ్రామ చరిత్ర లో మరొక చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచిపోతుంది. గ్రామం నడిబొడ్డున గ్రామానికి గుండెకాయ లాంటి ప్రదేశంలో ఈ ATM నెలకొల్పటం తో గ్రామానికే కొత్త హంగు అద్దినట్లు గా ఉండటం గర్వించదగ్గ విషయం. ఇక సెలవలకి గ్రామానికే వెళ్ళే వారంతా మనీ చేతిలో పెట్టుకోనవసరం లేకుండా నిర్భయంగా మీ ప్లాస్టిక్ కార్డులని వినియోగించుకోవచ్చు.

No comments: