పురావస్తు శాఖ మ్యూజియం
ఎన్నో సంవత్సరాల తపస్సు,మరెంతోమంది మహానుభావుల కృషీఫలం మన మ్యూజియం.19వ శతాబ్ధపు ప్రధమంలో ప్రజలకు అవగాహన లేక దొరికిన బౌద్ధ అవశేషాలను,మరియు పాలరాతి శిల్పాలను,చాకలి బండలు గాను ,పిల్లలు వాటిని పగులగొట్టి గోడలపైన రాసే చాక్ పీసులుగాను వాడేవారు.అప్పటి వారి అవగాహనాలేమి వల్ల అరుదైన మన శిల్ప సంపద అంతా పారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియం కి తరలిపొయింది.మరికొన్ని మద్రాస్ మ్యుజియం లో భద్రపరిచారు.ఇప్పటికీ మన గ్రామశిల్పసంపదని అక్కడ చూడవఛ్చు.1920ల ప్రాంతం లో ఒక రైతు కోటదిబ్బల ప్రాంతం లో పొలం దున్నుతుండగా దాదాపు 60శిల్పశిలలు బయటపడ్డాయి.కొన్నాళ్ళు ఆ రాతిఫలకాలన్నీ గుట్టగా ఒక చెట్టుకింద ఉంచారు .కొన్నాళ్లకి పారిస్ నుంచి డూబ్రియేల్ అనే సందర్శకుదు వచ్చి మొత్తం శిల్పాలను5000 రూపాయలకు కొనుక్కుని వెళ్ళిపోయాడు.మరికొన్నాళ్ళకి స్తూప పరిశొధనకై వచ్చిన Ernest ree అనే పరిశోధకుడు శిల్ప వివరాలను తన రిపోర్టులో పొందుపరచి తన నివేదికను సమర్పించాడు.
తదనంతరం దొరికిన శిల్పాలన్నిటిని పాత గ్రంధాలయ ఆవరణలో ఉంచారు.1945-జనవరి 1న ఘంటసాలలో మొదటి ఓపెన్ మ్యూజియం ను అప్పటి పురావస్తు శాఖాధికారి అయిన డాక్టర్ చాబ్రా ప్రారంభించారు . పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం 100 శిల్పాలు ఉంటే కాని మ్యూజియం ను నెలకొల్పడానికి ఆస్కారం లేదు.అప్పటికి ఇంకా శిల్పాల సంఖ్య 100దాటలేదు.ఆ తర్వాత మళ్ళీ16.07.1963 న శ్రీ గొర్రెపాటి పరమేశ్వరరావు గారు ఢిల్లీ వెళ్ళి అప్పటి ఆర్కియాలజికల్ డైరెక్టర్ అయిన శ్ర్రీ ఎ.కె.ఘోష్ గారిని కలిసి మ్యూజియం నిర్మాణానికై వినతి పత్రం సమర్పించారు .ఆయన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు.అప్పటికి గ్రామస్తులంతా అచిరకాలం లోనే మ్యూజియం నిర్మాణం జరగగలదని ఆశించారు.కాని ఆ కల నెరవేరటానికి పట్టిన సమయం43సంవత్సరాలు.నమ్మశక్యంగా లేదు కదూ ?తదనంతరం ఆ భాధ్యతను భుజాన వేసుకున్న మహనీయుడు శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు (కిసాన్ మరియు పండిత కాదు). ఓపెన్ మ్యూజియం మూతపడిన తర్వాత వీధులలో అనాధల వలే పడి ఉన్న విగ్రహాలను ఒకచోట చేర్చి తన స్వంత ఇంటిలో భద్రపరిచి మ్యూజియం నిర్మాణం అయ్యేవరకూ వాటిని పరిరక్షించారు .అప్పటి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎన్.జి.రంగా మరియు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గార్ల ద్వారా కేంద్రప్రభుత్వంలో కృషి చేయించి మ్యూజియం నిర్మాణం అయ్యేంత వరకు అవిశ్రాంతంగా పోరాడారు.చివరికి 1997 లో మ్యూజియం నిర్మాణం ప్రారంభమైంది నత్తనడకన ఈ నిర్మాణం సాగుతూ 8సంవత్సరాల అనంతరం4జనవరి 2006లో కాలచక్ర కార్యక్రమం అమరావతి లో జరగనున్న సంధర్భం లో పురావస్తు శాఖాధికారులు హడావుడిగా ఈ మ్యూజియం ను అధికారికంగా ప్రారంభించారు .ఈ క్రమంలో కేంద్ర పురావస్తుశాఖ సూపరిండెంట్ డి.జితేంద్రదాస్ మరియు అప్పటి MLAమండలి బుద్ధప్రసాద్ చూపిన చొరవ ప్రశంసనీయం . భాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మ్యూజియం నిర్మాణం ప్రారంభానికి 2సంవత్సరాల ముందే శ్రీ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారు 1994 లో కీర్తిశేషులయ్యారు.ఆయన కృషికి గుర్తుగా మ్యూజియం ముందు ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.మహాయాన గుర్తులైన బుద్ధదేవుని పాదాలు,ఛత్రము,గోటకం లో లభించిన ఆయక స్తంభము,శిలాస్తంభం,పూర్ణకుంభం,ధర్మచక్రం,నరసిం హస్వామి కాలభైరవుడు,రతీదేవి,సిం హ విగ్రహం,అర్హతుని విగ్రహం,బుద్ధప్రతిమ మహాభినిష్క్రమణ దృశ్య శిల్పాలను మ్యూజియం లో చూడవచ్చు.
No comments:
Post a Comment