1982 కి ముందు ఊరిలో ఏ పిల్లవాడినైనా ఎక్కడ చదువుతున్నావురా అని అడిగితే చెరువు మీద బడి, కొత్తరాజా గారి బడి, మేడ మీద బడి, 6 వ తరగతి అయితే హైస్కూల్.. ఈ పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ 1982 తర్వాత మరో కొత్త జవాబు తోడయ్యింది. అదే లయోలా మోడల్ కాన్వెంట్. ఎవరైనా ఎక్కడ చదువుతున్నావురా అడిగినపుడు కొంచెం ఛాతి విశాలంగా చేసుకుని, సాగదీసి మరీ చెప్పేవాళ్ళు లయోలా మోడల్ కాన్వెంట్ అని. మన గ్రామం లో అదో కొత్త పిలుపు, ఇంగ్లిష్ మీడియం విద్య ని గ్రామస్తులకు పరిచయం చేసిన ఒక మేలి మలుపు. అందులో చదువుతున్నాం అని పిల్లలు చెప్పినా, చదివిస్తున్నాం అని పెద్దలు చెప్పినా అదో గొప్ప. మన ఉరిలో తొలి ప్రైవేటు స్కూల్ యార్లగడ్డ రాజబాబు గారిది. కానీ అది ఎక్కువ కాలం సాగలేదు.పూర్తి స్థాయి స్కూల్ గా రూపాంతరం చెందకముందే అది కనుమరుగైంది.
నాది ఆ స్కూల్ స్థాపించిన తర్వాత 4 వ బాచ్ అనుకుంటా,అక్షరాలు దిద్దింది,ఓనమాలు నేర్చుకున్నది అక్కడే. వడ్లమూడి కృష్ణయ్య గారి భవనం లో 1982 లో ప్రారంభమైన లయోలా ప్రస్థానం ఆ తర్వాత పక్కనే ఉన్న స్థలంలోకి మారాక పూర్తి స్థాయి స్కూల్ గా రూపొందింది. ఆ స్కూల్ లోగో లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మ ఉండేది. ఆఫీస్ లోను, టేబుల్ పైన ఎక్కడ చూసినా అయన చిత్ర పటాలు ఉండేవి. స్వతంత్ర సంగ్రామం లో ఒక అతివాది గా విప్లవాన్ని సృష్టించిన విప్లవ కారుడు నేతాజీ. అప్పటిదాకా కేవలం పట్టణాలకే పరిమితమైన ప్రైవేటు విద్య ని మన గ్రామానికి అందించిన విద్యా విప్లవ కారుడు శ్రీ తుమ్మల రాంబాబు గారు. ఇది అతిశయోక్తి కాదు అయన దగ్గర చదువుకున్న వాడిగా అయన దార్శనికత (Vision) ని ఎరిగిన వాడిగా ఇది నాకు అనిపించిన సత్యం. అప్పట్లో చిన్న గ్రామం లో ప్రైవేటు స్కూల్ పెట్టటం అంటే ఒక సాహసమే. యూనిఫాం , షూ , బెల్ట్, టక్, ఇవన్నీ ఇప్పుడు మనకి మామూలుగా అనిపించొచ్చు. కానీ అప్పటికి అదో కొత్త పద్దతి, తప్పని సరిగా వేసుకురావాలి అనే రూల్ ఒకటి. మన వాళ్లకేమో అవన్నీ పట్టేవి కాదు. చదువు చెప్తే చాలు కదా ఈయనకి మరీ చాదస్తం అని విమర్శించటం నాకు తెలుసు. కానీ కార్పొరేట్ స్థాయిలో గ్రామం లోని పిల్లల్ని, వారి ఆహర్యాన్ని(Body Language), అలవాట్లని తీర్చిదిద్దాలని ఆయన పడిన తపన ఎంతమందికి తెలుసు?
చదువు మాత్రమే కాదు,సాంస్కృతిక కార్యక్రమాలలోను,కళలలోను పిల్లలకి శిక్షణ ఇవ్వటానికి కూడా ఎంతో తపన పడేవారు. కూచిపూడి నాట్యం లో శిక్షణ ఇప్పించటానికి అప్పట్లోనే ఒక నాట్యాచార్యుడిని పిలిపించేవారు. రోజు కి 8 పీరియడ్స్ ఉంటే లాస్ట్ పిరియడ్ మాత్రం డ్రిల్ కి కానీ ఇలాంటి శిక్షణ కానీ ఉండేవి. అసలు science fair అనే పదమే తెలియని రోజుల్లో స్కూల్ తరపున హైదరాబాదు లో science fair లో పాల్గొన్నపుడు అసలు ఘంటసాల అనే ఒక ఊరు ఉందా అని అందరు ఆశ్చర్య పోయారు. అంత చిన్న గ్రామం నుంచి వచ్చిన Exhibits నగరాల్లో పిల్లలు చేసిన వాటి తో పోటీపడి విజేత గా నిలవటం అరుదైన విషయం. డబ్బులున్న వాళ్ళు ఎలాగూ విజయవాడ లోనో , పిల్లల్ని వదిలి ఉండలేని వాళ్ళు చల్లపల్లి లోనో తమ పిల్లలని చదివించే వాళ్ళు. మరి సామాన్యుడికి,మధ్య తరగతి వాళ్ళకి? అందరి గమ్యం లయోలానే అయ్యింది. స్కూల్ ప్రిన్సిపాల్ గా ఆఫీస్ లో దర్పం గా కూర్చునే మనిషి గా మాత్రమే కాదు,లంచ్ టైం లో పిల్లల లంచ్ బాక్స్ మూతల్ని తీసిచ్చిన రాంబాబు గారు నాకు తెలుసు. వాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా అని చూసాకే వారు భోజనానికి వెళ్ళేవారు. అన్నం తెచ్చుకోని పిల్లలకి మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లోనే తినిపించే లక్ష్మి టీచర్ అయన జీవిత సహచరి మాత్రమే కాదు, ఆ స్కూల్ ప్రయాణం లో నిర్మాణాత్మక భాగస్వామి. ఆవిడ లేని లయోలా ని, లక్ష్మి టిచర్ లేకుండా రాంబాబు గారిని నిర్వచించటం కష్టం.
నేను చదివిన స్కూల్ లో నే మా అబ్బాయి కూడా చదివాడు అని మన తల్లి దండ్రులు చెప్పటం మనం విన్నాం. కానీ అది మనం చూడని గతం,మన అమ్మ, నాన్నలు మాత్రమే పొందగలిగిన అనుభూతి. కానీ లయోలా మన కళ్ళముందు జరుగుతున్న వర్తమానం,ఈ స్కూల్ లో చదివి ఇక్కడే టీచర్ గా పనిచేసిన వాళ్ళని మనం చూడగలిగాం. తాము చదువుకున్నఈ స్కూల్ లోనే తమ పిల్లలని చదివిస్తున్న వాళ్ళున్నారు. ఊరికి దూరం గా ఉన్నా,సెంటిమెంట్ కోసం ఒక్క సంవత్సరం నర్సరీ ఇక్కడ చదివించి తర్వాత తమతో తీసుకెళ్ళిన తల్లి దండ్రుల్ని చూసాను.ఇవన్నీ మా తరం వాళ్ళు, ఆ స్కూల్ లో చదువుకున్న వాళ్ళు మాత్రమే పొందగలిగిన అనుభూతి.మన గ్రామమే కాదు పక్కనున్న పాలెం, కొత్తపల్లి నుంచి కూడా పిల్లలు రిక్షాలో వచ్చేవాళ్ళు. రిక్షా సుబ్బారావు,వాళ్ళ ఆవిడ సుబ్బమ్మ ఆయా గా దీర్ఘ కాలం స్కూల్ లో పనిచేసిన వాళ్ళు. పిల్లల ఆలనా పాలన విషయం లో వాళ్ళిద్దరూ పోట్లాడుకోవటం తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది.ఇప్పుడెక్కడ ఉన్నారో తెలీదు.ఆ మధ్య ఎవరినో అడిగే ప్రయత్నం చేశాను కానీ సరిగా తెలియలేదు.
ఈ స్కూల్ తొలి టీచర్ పాలడుగు జయశ్రీ తర్వాత గవర్నమెంట్ టీచర్ గా పోస్టింగ్ రావటం తో వెళ్ళిపోయారు. తొలినాళ్ళలో టీచర్ లు గా పని చేసిన రోజా,మాధవి,శైలజ, రాజ్యలక్ష్మి,లక్ష్మి రాజ్యం,సామ్రాజ్యం,కృష్ణ కుమారి, అప్పట్లో అదో స్పెషల్ అందరూ మహిళా టీచర్లే. నాకు గుర్తున్నంతవరకు తెలుగు చెప్పటానికి ఒకాయన వచ్చారు కానీ ఎక్కువ రోజులు ఉండలా. మా స్కూలింగ్ అయిపోయాక వచ్చిన వాళ్ళలో రేణు, శ్రీను ఎక్కువ కాలం పనిచేసినట్లు తెలుసు. కానీ ఎంతో మంది టీచర్ లు వచ్చినా, వెళ్ళినా సామ్రాజ్యం టీచర్ దే రికార్డ్. ఎక్కువ సంవత్సరాలు పని చేసింది ఆవిడే. ఇప్పటికీ అక్కడే పని చేస్తున్నారు.
అప్పటి టీచర్ గొర్రెపాటి ఝాన్సీలక్ష్మి తో 1983 - 84 బాచ్ విద్యార్ధులు
మేము చదువుకున్నపుడు 7 వ తరగతి వరకు మాత్రమే ఉండేది. తర్వాత మేము హైస్కూల్ కి వెళ్లి పోయాం. ఆ తర్వాత అది లయోలా మోడల్ హైస్కూల్ అయింది. కొన్నాళ్ళకి చల్లపల్లి పబ్లిక్ స్కూల్ అయ్యింది.ఇప్పుడసలు ఊర్లో నే ఆ స్కూల్ గుర్తులు లేవు. మొన్న వెళ్ళినపుడు చూస్తే మహనీయుల విగ్రహాలు మాత్రం ఆ స్కూల్ బిల్డింగ్ ముందు ఉన్నాయి అక్కడొక స్కూల్ ఉండేది అనే దానికి గుర్తుగా. ఎన్ని పేర్లు మారినా,చల్లపల్లికి మకాం మార్చినా, నాలాంటి ఎంతో మంది పూర్వ విద్యార్దులను మధుర జ్ఞాపకాల్లో ఓలలాడించే ఊయల ఆనాటి లయోలా...
No comments:
Post a Comment