Tuesday, July 21, 2015

నా ఐరోపా యాత్ర - 20 (లిచ్టేన్ స్టెయిన్)

​ఇక ఆరోజుకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని వాడుజ్ నుండి షాన్ పట్టణం మీదుగా ఆస్ట్రియా బోర్డర్ చేరుకున్నాము. 28 రాత్రికి ఆస్ట్రియాలో జుగెన్ బెర్గ్ లో బస చేసాం. మరుసటి రోజు ఉదయం బయలుదేరి షాన్ పట్టణానికి చేరుకున్నాం. వాడుజ్ కంటే కూడా షాన్ ఎంతో అందంగా కనిపించింది. అసలు అవి రోడ్లా లేక అద్దాలో తెలియలేదు. పార్కింగ్ మొత్తం భూమిలోపలే ఉంది. ఇక్కడ రోడ్ల మీద పాదచారులకే ప్రాధాన్యత ఎక్కువ. ఎవరైనా రోడ్డు దాటటానికి నిలబడితే చాలు,వాహనాలన్నీ ఆగిపోతాయి. పాదచారులు రోడ్డు దాటాకే కార్లు ముందుకి కదులుతాయి. ఇక్కడ 18 వ శతాబ్దంలో నిర్మించిన ఒక చర్చి ఉంది. ఆ చర్చి లోపల కొవ్వొత్తి వెలిగించి జీసస్ ని స్మరించుకున్నాం. ఇక్కడ నైట్ లైఫ్,పబ్ కల్చర్ ఎక్కువే. చాలావరకు పబ్బులు కనిపించాయి. యూరప్ లో ఉన్న అన్ని దేశాల లాగే ఇక్కడ కూడా రెస్టారెంట్లు అన్ని ఆరుబయటే సర్వ్ చేస్తున్నాయి. వేసవిలో ఇక్కడ ప్రజలంతా ఆరుబయట తినటానికి, తాగటానికి ఇష్టపడతారు.  బస్సు లలో ప్రయాణించేవారు తక్కువే అయినా Liechenstain Bus పేరుతో ప్రభుత్వం ఒక ట్రాన్స్ పోర్ట్ సంస్థ ని నడుపుతోంది. దేశంలో ఉన్న 11 నగరాలతో పాటు స్విట్జెర్లాండ్ మరియు ఆస్ట్రియా లకి బస్సు సౌకర్యం ఉంది. మేము చూసిన రెండు రోజులు బస్సులన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి. షాన్ బస్సు స్టేషన్ కొంచెం పెద్దది.

మేము అక్కడ ఉండగా ఒక వ్యక్తి ఇండియన్ లా అనిపించటంతో పలకరించాను. అతను ముంబై కి చెందిన వాడిగా చెప్పాడు. లండన్ లో చదువుకుంటున్నా అని ఈ దేశం గురించి తెలుసుకుని చూడటానికి వచ్చానని చెప్పాడు. లండన్ నుండి ఫ్లైట్ లో జురిచ్ వచ్చి అక్కడనుంచి బస్సు లో వచ్చాడట. ఎందుకంటే లిచ్టేన్ స్టెయిన్ లో ఎయిర్ పోర్ట్ లేదు. ప్రపంచంలో ఎయిర్ పోర్ట్ లేని అయిదు దేశాల్లో ఇదొకటి. కాని హెలిపాడ్ మాత్రం ఉంది. అండోరా,మొనాకో, సాన్ మారినో మరియు వాటికన్ సిటీ దేశాల్లో కూడా ఎయిర్ పోర్ట్ లేదు. ఇక సిటీ మధ్యలో గుటెన్ బర్గ్ అనే పేరుతో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ కనపడింది. బహుశా ఈ దేశంలో ఉన్న ఏకైక ముద్రణాలయం ఇదేనేమో. నేను వృత్తి రీత్యా ప్రింటింగ్ రంగంలో పనిచేస్తుండటంతో ఆసక్తిగా ఆ ప్రెస్ లోపలి వెళ్లి నన్ను పరిచయం చేసుకుని అక్కడ ఒక ఫోటో తీసుకున్నాను.

ఇక అక్కడినుంచి బయలుదేరి వాడుజ్ చేరుకున్నాం. వాడుజ్ లో బస్సు స్టేషన్ నుండి టూరిస్ట్ లకోసం ఒక టాయ్ ట్రైన్ ఉంది. పది యురోలు చెల్లిస్తే ఆ టాయ్ ట్రైన్లో 40 నిమిషాల్లో దేశం మొత్తం చూసేయచ్చు. మాకు కార్ ఉంది కాబట్టి మేము అది ఎక్కలేదు. ఇక అక్కడినుంచి పార్లమెంట్ కి చేరుకున్నాం. ఈ భవనం పెద్దదేమీ కాదు. కేవలం 11 నగరాలున్న ఈ దేశానికి సరిపోను ఉంది. ఈ దేశం రాచరిక పాలనతో పాటు ప్రజాస్వామ్యబద్ధమైన పార్లమెంట్ వ్యవస్థని కూడా కలిగి ఉంది. రాజుతో పాటు ప్రధాన మంత్రి కూడా ఉంటాడు. ప్రస్తుతం ఉన్న రాజు హాన్స్ ఆడమ్ 1989 నుండి పదవిలో ఉన్నాడు. కింగ్ పాలస్ కొండపైనే ఉంటుంది. అక్కడినుంచే రాజు దేశం మొత్తాన్ని చూడవచ్చు. ఐదు బిలియన్ డాలర్ల సంపదలో ప్రపంచంలో ఆరవ సంపన్నుడు హాన్స్ ఆడం. 

పార్లమెంట్ కి దగ్గరిలోనే పలు బాంకులు టూరిస్ట్ ఆఫీసులు ఉన్నయి. ఏకీకృత వీసా విధానం కాబట్టి యూరప్ లో ఎన్ని దేశాలు తిరిగినా ఆయా దేశాల వీసా స్టాంపింగ్ మన పాస్ పోర్ట్ మీద ఉండవు. కాని ఇక్కడ వీసా ఆఫీసులో కావాలంటే ఆ స్టాంప్ మన పాస్పోర్ట్ మీద వేయించుకోవచ్చు. నా శ్రీమతి ఇది చూసి మన పాస్ పోర్ట్ మీద వేయిద్దాం అంది. మన విజిట్ కి గుర్తుగా ఉంటుందని. కాని ఒక్కొక్క పాస్ పోర్ట్ కి రెండున్నర యూరోలు చెల్లించాలి. మా పాస్ పోర్ట్ ల మీద ఆ స్టాంప్ వేయించుకున్నాం. 
ప్రపంచంలో అతితక్కువ నిరుద్యోగం ఉన్న దేశాల్లో ఇది రెండవది. ఇక్కడ నిరుద్యోగుల శాతం కేవలం 1.5 %. అతితక్కువ అప్పు ఉన్న దేశాల్లో కూడా లిచ్టేన్ స్టెయిన్ దే అగ్రస్థానం. ప్రపంచంలో మరే ఇతర దేశంతో వీళ్లకి శత్రుత్వం లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా తటస్థంగా ఉన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. 
ఈ దేశంలో ఉన్న సౌకర్యాలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో నివసిస్తున్న ప్రజలున్న దేశాల్లో ఈ దేశం ఒకటి.మాకు అన్నీ లగ్జరీ కార్లు తప్ప కనీసం మీడియం సైజు కార్లు కూడా కనపడలా. 

కేవలం 36000 మంది జనాభానే కదా అని తక్కువ అంచనా వెయ్యటానికి లేదు. ప్రపంచం లో ఉన్న ప్రముఖ కార్ కంపెనీల షోరూం లు అన్నీ ఈ దేశంలో ఉన్నాయి. అవన్నీ చూసి మేము ఆశ్చర్యపోయాం. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఇక్కడ మిగతా దేశాలతో పోలిస్తే టాక్స్ చాలా తక్కువ. కాబట్టి చుట్టు పక్కల దేశాల వాళ్ళు చాలామంది కార్లు ఇక్కడే కొంటారట. స్విట్జెర్లాండ్ లాగే ఇక్కడ బ్యాంకుల్లో కూడా మీరు డిపాజిట్ చేసే డబ్బుకి లెక్కలు అడగరు. ఎంత డబ్బైనా బాంక్ లో దాచుకోవచ్చు. కార్పోరేట్ టాక్స్ కూడా తక్కువే అందుకే చాలా కంపెనీలు ఇక్కడ ఆఫీసులు తెరిచాయి. 

ఇక్కడ ఉద్యోగులపై ఉండే ఆదాయపు పన్ను కూడా మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అన్నిటినీ మించి ప్రకృతి ప్రసాదించిన అద్భుత దృశ్య కావ్యం ఈ దేశం.  ఇక ఆ రోజుకి వాడుజ్ లో ఉన్న మ్యూజియం చూసాం. ఆ దేశానికి సంభందించిన పలు పురాతన విశేషాలను అందులో పొందు పరచారు. ఇక అక్కడినుంచి ఆ దేశాన్ని వదలలేక కొంచెం మిస్ అవుతున్నామన్న దిగులుతోనే జురిచ్ కి బయలుదేరాం. కాని ఎందుకో ఐరోపాలో ఎన్ని దేశాలు చూసినా మాకు మాత్రం ఈ దేశమే బావుందనిపించింది.

Sunday, July 19, 2015

నా ఐరోపా యాత్ర - 19 (లిచ్టేన్ స్టెయిన్)

వెనిస్ చూసి వచ్చిన 15 రోజులకి మా అసలైన ఐరోపా యాత్ర ప్రారంభమైంది. మాతో పాటు నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ క్రదోహ దంపతులు వారి అబ్బాయి మాక్సిమ్ తో కలిసి కారులో 15 రోజుల పాటు జర్మనీ, ఆస్ట్రియా, లిచెన్ స్టైన్, స్విట్జెర్లాండ్, ఫ్రాన్స్, లక్సెం బర్గ్ , బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో మేము సాగించిన దాదాపు 4000 కిలోమీటర్ల ప్రయాణం ఇది. యూరప్ లో ఉన్న ఒకానొక అతి చిన్న దేశం లిచ్టేన్ స్టెయిన్. 

ఎప్పుడూ అందరూ వెళ్ళే పారిస్స్విట్జెర్లాండ్ కాకుండా ఇంకేమన్నా కొత్త దేశాలున్నాయేమో అని నా శ్రీమతి ఇంటర్నెట్ లో వెతికి ఈ దేశపు వివరాలని తెలుసుకుంది. ఆస్ట్రియాకి స్విట్జెర్లాండ్ కి మధ్య కేవలం 61 చదరపు మైళ్ళ వైశాల్యంతో ఉన్న ఈ అతిచిన్న దేశం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కలగటంతో ముందుగా ఈ దేశాన్ని చూసి అక్కడ నుంచి స్విట్జర్లాండ్ మీదుగా మిగతా దేశాలన్నీ వెళదామని ప్లాన్ చేసుకున్నాం. సాధారణంగా యూరప్ టూర్ కి మే మొదటివారం నుండే అనుకూలం . అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ దేశాలన్నీ మంచుతో కప్పబడే ఉంటాయి.శీతా కాలం తరువాత వచ్చే వసంతాన్ని చూడటానికి రెండుకళ్ళూ చాలవు. భూమి అంతా ఆకుపచ్చని దుప్పటి కప్పుకున్నట్లు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి నయనానంద కరంగా ఉంటుంది2011 డిసెంబర్ నుండి  లిచ్టేన్ స్టెయిన్ Schengen దేశాలతో ఒకటిగా కలిసింది. దేశపు సరిహద్దుల్ని తొలగించింది కూడా అప్పుడే. ఐరోపా యూనియన్లో ఆఖరున 26 వ దేశంగా సభ్యత్వం పొందింది. 


 పోలాండ్ లో నేనుండే ప్రాంతం నుండి లిచ్టేన్ స్టెయిన్ 930 కిలోమీటర్లు,అక్కడనుండి స్విట్జెర్లాండ్ 150 కిలోమీటర్లు. పోలాండ్ నుండి జర్మనీలో బెర్లిన్ మీదుగా 880 కిలోమీటర్లు ప్రయాణించి ఆస్ట్రియాలో మరో 40 కిలోమీటర్లు ప్రయాణించాక ఆ దేశపు సరిహద్దు నుంచి పదికిలోమీటర్ల లోపే లిచ్టేన్ స్టెయిన్ రాజధాని వాడుజ్ చేరుకోవచ్చు. ఇక్కడి రోడ్లమీద సగటు వేగం గంటకి 120 కిలోమీటర్లు. వెయ్యి కిలోమీటర్లు ఏకదాటిన ప్రయాణించినా మనకి అలసట అనేది ఉండదు. ఎక్కడా చిన్న కుదుపు కాని గతుకులు కాని ఉండవు. హైవేలు అన్నీ ఇరుపక్కలా బారికేడ్స్ తో ఉండటంతో రోడ్ మధ్యలోకి ఎవరూ వచ్చే అవకాశం కూడా లేదు.దూరం ఎక్కువైనా కార్లో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తుంటే ఆ సంతోషమే వేరు. అందుకే ఏప్రిల్ 28 తెల్లవారిఝామున కార్లో బయలుదేరాం. చాలా మంది విదేశాలకి వెళ్ళినపుడు కూడా ఇండియన్ ఫుడ్ కోసం వెతుకుతుంటారు. స్విట్జెర్లాండ్ దాకా వెళ్లి ఇడ్లి తినాలా అనేది నా అభిప్రాయం. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళేది ఆ ప్రాంతపు విశేషాలుఆహారపు అలవాట్లు తెలుసుకోవటానికి,అలాంటప్పుడు అక్కడ లభించే ఆహారాన్ని రుచి చూడాలి తప్ప,మన ఆవకాయన్నంపులిహోరా అవసరమా అనేది నా ఆలోచన. నా శ్రీమతి కూడా నాతొ ఏకీభవించటంతో అలాంటి ఫుడ్ పార్సిల్ ఏమి లేకుండానే బయలుదేరాం. ఆ రోజు వర్షం పడుతుండటంతో కొంచెం నెమ్మదిగానే డ్రైవ్ చేసుకుంటూ జర్మనీలోని బెర్లిన్ , న్యురేం బర్గ్ మీదుగా మధ్యాహ్నం మూడు గంటల కల్లా జర్మనీ- ఆస్ట్రియా సరిహద్దుకి చేరుకున్నాం. ఇతర దేశాల కార్లు ఆస్ట్రియా రోడ్లపై ప్రయాణించాలంటే టోల్ చెల్లించాలి. టోల్ రుసుము వారానికి యూరోలు. బోర్డర్ దగ్గర ఆగి ఆ రుసుము చెల్లించి రసీదు తీసుకున్నాం. జర్మనీ ని ఆస్ట్రియా ని వేరు చేస్తూ మధ్యలో ఆల్ఫ్స్ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల కిందుగా కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ గుండా ప్రయాణించి ఆస్ట్రియాలో కి ప్రవేశించాం. ఆస్ట్రియా నుండి స్విట్జెర్లాండ్ వెళ్ళే హైవే పై 30 కిలోమీటర్లు ప్రయాణించాక ఫెడ్రిక్ అనే ప్రాంతం నుండి కుడివైపు పది కిలోమీటర్లు ప్రయాణించాక ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల మధ్య పారే రైన్ నది అందాల్ని ఆస్వాదిస్తూ fürstentum of Liechtenstein అనే బోర్డ్ ని దాటుకుని లిచ్టేన్ స్టెయిన్ రాజధాని వాడుజ్ చేరుకున్నాం.
fürstentum అంటే జర్మన్ భాషలో రాజ్యం అని అర్ధం.ఈ దేశం రాచరిక వ్యవస్థని కలిగి ఉంది కనుక అలా పిలుస్తారు. ఈ దేశానికి తూర్పున ఆస్ట్రియాపడమర,దక్షిణాన స్విట్జెర్లాండ్ సరిహద్దు దేశాలు. స్విట్జెర్లాండ్ నిలిచ్టేన్ స్టెయిన్ తో వేరు చేస్తూ రైన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దేశంలోకి వెళ్ళాలంటే ఈ నదిపై ఉన్న వంతెన మీదుగానే వెళ్ళాలి. లిచ్టేన్ స్టెయిన్ యూరప్ లో నాలుగవ అతి చిన్నదేశం(వాటికన్ సిటీ,మొనాకో,సాన్ మారినో వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి) మరియు ప్రపంచం లో ఆరవ చిన్న దేశం. దీని జనాభా కేవలం 36000. దేశం మొత్తం దాదాపు కొండవాలులోనే ఏటవాలుగా ఉంటుంది.

నగరంలోకి ప్రవేశించగానే అసలు మనం ఉన్నది భూమి మీదేనా అన్న భావన కలిగింది. ఎదురుగా పచ్చటి ఆల్ఫ్స్ పర్వతాలువాటి మీద అక్కడక్కడా ఇళ్ళు. స్వర్గం ఎలా ఉంటుందో ఎవ్వరూ చూడలేదు కాని,మాకు మాత్రం నిజంగా ఇదే స్వర్గమేమో అనిపించింది. రోడ్ల వెడల్పు తక్కువైనా అద్దాల్లా మెరిసిపోతూ మాకు స్వాగతం పలికాయి. అప్పటికే సాయంత్రం గంటలు అయింది. యూరప్ లో రాత్రి 9 గంటలదాకా సూర్యుడు ఉంటాడు. పదిగంటలకి కాని చీకటి పడదు. ఈ దేశంలో ఉన్న పట్టణాల సంఖ్య పదకొండు. వాడుజ్ అనే పట్టణం దేశానికి రాజధాని. కాని ఎక్కువమంది నివసించేది మాత్రం షాన్ అనే పట్టణంలో. పది చదరపు మైళ్ళ వైశాల్యం, 5800 మంది జనాభాతో షాన్ పట్టణం అతి పెద్ద నగరంగా ఉంది. దేశరాజధాని వాడుజ్ లో 5300 మంది నివసిస్తారు. కేవలం నాలుగు పట్టణాలు మాత్రమే నేలమీద ఉంటాయి. మిగతా ఏడు పట్టణాలు కొండవాలులో మరియు కొండపైనే ఉంటాయి. ట్రైసన్ బెర్గ్ అనే పట్టణం పూర్తిగా కొండపైనే ఉంటుంది. ఎక్కువ టూరిస్టులు బస చేసేది ఇక్కడే. ఇకడ్నుంచి  చూస్తే దేశం మొత్తాన్ని ఒకే ఫ్రేం లో బంధించేయచ్చు. 
మా ప్లాన్ ప్రకారం ఆ రాత్రికే బయలుదేరి స్విట్జెర్లాండ్ లో జురిచ్ చేరుకొని బస చేయాలి. కాని ఎందుకో ఈ దేశాన్ని వదిలి వెళ్ళ బుద్ధి కాలేదు. ట్రైసన్ బెర్గ్ లో బస చేద్దామని హోటల్ కోసం వెతికాం. ఆరోజు ఆదివారం కావటంతో టూరిస్ట్ లతో హోటల్స్ అన్నీ నిండిపోయాయి. ఒక హోటల్ రిసెప్షనిస్ట్ ఆస్ట్రియాలో ఒక హోటల్లో ఖాళీ ఉందని చెప్పి అడ్రస్ తో సహా రాసి ఇచ్చాడు. ఇక్కడ మనుషులు ఎంత మంచివారంటే,మేము ఏదైనా అడిగితే వారికి ఇంగ్లీష్ రాకపోయినా మాకు ఎలాగోలా సహాయం చెయ్యాలనే తపన మమ్మల్నెంతగానో ఆకట్టుకుంది.అమెరికాలో స్థిరపడినంతగా మనవాళ్ళు యూరప్ లో లేకపోవటానికి ముఖ్యకారణం భాష మరియు వాతావరణం అనేది నా అభిప్రాయం. లిచ్టేన్ స్టెయిన్ అధికారిక భాష జర్మన్.జర్మన్ తో పాటు అల్మీనిక్ భాష కూడా మాట్లాడతారు. మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఈ దేశం పూర్తిగా ఆస్త్రియాతో సంభంధాలు కలిగి ఉండేది. ఆతరువాత స్విట్జెర్లాండ్ కి దగ్గరగా జరిగింది. ఇక్కడ అధికారిక కరెన్సీ కూడా స్విస్ ఫ్రాంకు లే. కాకపొతే యూరో కూడా చెల్లుబాటు అవుతుంది. ప్రతి షాపులో యూరో అయితే ఎంత చెల్లించాలొఫ్రాంకు లైతే ఎంత చెల్లించాలొ ఉంటుంది.మొదటగా 1608 లో హోలీ రోమన్ ఎంపైర్ ఈ దేశాన్ని నిర్మించాడు. షెల్లేన్ బెర్గ్ మరియు వాడుజ్ పట్టణాలు మాత్రమే అప్పుడు నిర్మించబడ్డాయి. మిగతావన్నీ తరువాతి కాలంలో విస్తరించారు. తదనంతరకాలంలో రోమన్ సామ్రాజ్యం పతనం అవటంతో 1815 జూన్ నుండి జర్మన్ ఫెడరేషన్ లో ఉంది. ఆ తరువాత 1866 లో జర్మనీ నుండి వేరు పడి ఆస్త్రియాతో కలిసి స్వతంత్ర రాజ్యంగా ఉంది.మనదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్ట్ 15 రోజు ఈ దేశానికి స్వతంత్రం రావటం విశేషం. కాబట్టి ఆ రోజుని జాతీయ దినంగా జరుపుకుంటారు.1923 నుండి స్విట్జెర్లాండ్ తో సన్నిహితంగా ఉండటంతో దాదాపుగా ఆ సంస్కృతే ఇక్కడ కూడా కన్పిస్తుంది.  1836 లో ఇక్కడ తోలి ఫాక్టరీ ని నిర్మించారు. పింగాణి టైల్స్ ని తయారు చేసేవారు.ఇప్పటికీ ఇదే పెద్ద పరిశ్రమ. ఇక ఆరోజుకి ట్రైసన్ బెర్గ్ మరియు కొండ పై ఉన్న మరో చిన్నగ్రామంతో పాటు రాజు నివసించే పాలస్ కూడా చూసాం.
కొండలమీద ఆవులతోపాటు,మేకలు గొర్రెలు కూడా మేత మేస్తూ కనిపించాయి. కొండమీదకి ఎక్కుతున్నపుడుదిగుతున్నప్పుడు రోడ్ కొంచెం భయంగా అనిపించినా అక్కడున్న ట్రాఫిక్ క్రమశిక్షణ వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవట. అన్ని ఇళ్ళు ఒకేచోట కాకుండా విసిరేసినట్లు అక్కడొకటి అక్కడొకటి కొండ మీద నిర్మించుకున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువ ప్రైవసీ ని ప్రశాంతతని కోరుకుంటారు. ఇక కిందకి దిగాక వాడుజ్ లో ఉన్న మ్యూజియం కి వెళ్ళాం. అప్పటికే సమయం మించిపోవటంతో ఆ రోజు ప్రవేశం లేదు.ఇక అక్కడనుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఆస్ట్రియా బోర్డర్ ఉంది. మేము వచ్చిన దారి కాకుండా ఆస్ట్రియా లో ప్రవేశించటానికి ఇది మరొక సరిహద్దు. 

Friday, July 3, 2015

నా ఐరోపా యాత్ర - 18 (వెనిస్)

కొత్తగా పెళ్ళైన జంటకి మొదటి డ్రీమ్ హనీమూన్ ప్రదేశం అంటే  వెనిస్ నగరమే. నేను బ్రహ్మ్మచారిగా సంవత్సరం పాటు యూరప్ లో నివసించినా , వెనిస్ వెళ్ళగల అవకాశం ఉండి కూడా అక్కడికి వెళ్ళలేదు. పెళ్ళయ్యాక సతీ సమేతంగా మాత్రమే  వెళ్ళాలనుకున్న నగరం వెనిస్. తరువాతి కాలంలో అన్ని దేశాలు ఏకకాలం లో చుట్టేసినా ,ఇటలీలో ఉన్న  వెనిస్ నగరాన్ని మాత్రం ప్రత్యేకంగా సందర్శించాము. మేము ఉండే పోలాండ్ కి వెనిస్ 1100 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే కష్టం. అలా అని మిగతా దేశాల సందర్శన తో పాటు కలుపుకుంటే చాలా వరకు సమయం డ్రైవింగ్ కే వృధా అవుతుంది. అందుకే ఈ ఒక్క నగరాన్ని ప్రత్యేకంగా చూడాలని అనుకున్నాం. ఏప్రిల్ 7, 2013 బెర్లిన్ లో బాద్షా చూసిన వారానికి అంటే సరిగ్గా ఏప్రిల్ 13 న వెనిస్ వెళదామని నిర్ణయించుకున్నాం. మేము పోలాండ్ లో ఉంటున్నా , మేము ఎక్కువగా ఉపయోగించేది జర్మనీ లో ఉన్న బెర్లిన్ ఎయిర్పోర్ట్. బెర్లిన్ లో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయ విమానాలు వచ్చే తెగెల్ ఎయిర్పోర్ట్. ఇంకోటి యూరప్ దేశాలకు చిన్న విమానాలు నడిపే శేనిఫోల్ద్ విమానాశ్రయం. 13 వ తేది ఉదయం 6 గంటలకి ఇక్కడినుండి వెనిస్ మార్కోపోలో కి ఈజీ జెట్ విమానం ఉంది. మేము బెర్లిన్ వెళ్ళాలంటే మింజుజేర్జ్ నుండి 2 గంటలు పడుతుంది. నా కొలీగ్ రఘునాథ్ బాబు మమ్మల్ని బెర్లిన్ లో డ్రాప్ చేస్తానని చెప్పాడు. మా ఆఫీస్ లో పనిచేస్తున్న భారతీయుల్లో కారు , డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది నాకు , రఘుకి మాత్రమే. అందుకే మిగతా వాళ్లకి ఏ సాయం కావాలన్నా మేమిద్దరమే వెళ్ళేవాళ్ళం. సరిగ్గా తెల్లవారు ఝామున 3 గంటలకి మింజు జేర్జ్ లో నేను , భార్గవి రఘు కార్ లో బయలుదేరాము. శేనిఫోల్ద్ విమానాశ్రయం బెర్లిన్ నగర సరిహద్దుల్లోనే ఉంది.5 గంటలకల్లా రఘు మమ్మల్ని డ్రాప్ చేసాడు. అనుకున్న సమయానికంటే గంట ఆలస్యంగా 7 గంటలకి ఈజీ జెట్ విమానం వెనిస్ వైపుగా టేక్ ఆఫ్ తీసుకుంది. సరిగ్గా గంటా నలభై నిమిషాల తరువాతా సముద్రానికి దగ్గరగా ఉన్న మార్కోపోలో విమానాశ్రయంలో దిగాం. నీటిలో తేలియాడే వెనిస్ నగరం ఉండే ప్రాంతం పేరు PIAZZALE ROMA. మార్కో పోలో నుండి ప్రతి పదినిమిషాలకి ఒక బస్ ఉంటుంది. అక్కడినుండి PIAZZALE ROMA 25 నిమిషాల ప్రయాణం. వెనిస్ నగరం అంతా నీళ్ళలో ఏమి ఉండదు PIAZZALE ROMA ప్రాంతం మాత్రం మనం విన్నట్లుగా నీళ్ళలో ఉంటుంది. నేను ముందుగానే హోటల్ బుక్ చేసుకోవటంతో ఆ హోటల్ ప్రతినిధి మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి బస్సు దగ్గరకి వచ్చాడు. మమ్మల్ని వెంటబెట్టుకుని అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న పెద్ద భవనం దగ్గరకి తీసికెళ్ళాడు. అసలు ఆ భవనాల తలుపుల ముందు మేము పిట్టల్లా ఉన్నాం. ఎన్నో ఏళ్ల క్రితం భారీ నిర్మాణంలా ఉంది. 4 అంతస్తులు లిఫ్ట్ లేకుండానే మెట్లు ఎక్కాం. అసలు ఆ భవనాలకి లిఫ్ట్ ఉండే అవకాశమే లేదు. 4 వ అంతస్తులో ఒక తలుపు తీసి మాకు తాళం ఇచ్చి ఆ వ్యక్తీ వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది విశాలమైన 4 బెడ్రూమ్స్ ఉన్న అపార్ట్మెంట్. అత్యంత పొందికగా ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చి ఉన్నాయి. 
 అప్పటికి సమయం ఉదయం 11 అయింది  ప్రయాణ బడలికగా ఉండటంతో కాసేపు విశ్రాంతి తీసుకుని కిందకి వచ్చి పిజ్జా తిని నీళ్ళలో తేలియాడే వెనిస్ నగర వీధుల్ని చూడాలనే ఉత్సాహంతో బయలుదేరాం. వెనిస్ ను క్రీ.శ 421 ప్రాంతంలో నిర్మించారు. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రం. తర్వాతి రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. పద్నాలుగో శతాబ్దంలో ఇక్కడ రెండు లక్షల మంది నివాసం ఉండేవారట. 1966 లో వచ్చిన వరద తాకిడికి వెనిస్ లో నీటిమట్టం మీటరు ఎత్తుకు పెరిగింది. అప్పటి నుంచీ అక్కడి జనాభా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు అసలు ఆ ఇళ్ళల్లో ఎవరూ నివసించటం లేదు. ఆ దీవి మొత్తం తిరగటానికి పడవలే ఆధారం ఇది దాదాపు 140 దీవుల సమూహం. ఒక దీవి నుండి మరో దీవికి పడవలో వెళ్ళటం అక్కడ దిగి కాసేపు ఆ ప్రాంతంలో గడిపి మళ్లీ అక్కడికి వచ్చే తరువాతి పడవ ఎక్కి వేరే దీవికి వెళ్ళటం. రోజుకి 11 యూరోలు కట్టి టికెట్ కొంటే ఆ రోజంతా ఆ దీవుల్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. నీళ్ళ ఒడ్డునే కట్టిన స్కూళ్ళు, ఆసుపత్రులు, ఆఫీసులు. ఇక్కడ బస్టాపులు, టాక్సీ స్టాండులు కూడా నీళ్ళల్లో తేలుతూ వుంటాయి.
మన ఒడ్డు వేపు నించీ ఎక్కి, రెండో పక్కన వున్న బస్సులు ఎక్కుతామన్నమాట!  మేము మొదటి రోజు పాస్ కొనలేదు. వెనిస్ నగర వీధుల్లో నడుస్త్తూ ఆ పురాతన భవంతుల  వైభవాన్ని చూస్తుంటే ఎన్నేళ్ళ క్రితం వాటిని నిర్మించారో అనిపించింది. ఎటు చూసినా సావనీర్లు అమ్మేషాపులు , రకరకాల ఫాషన్ దుస్తులు , ఆభరణాల దుకాణాలు కనిపిస్తాయి. భార్గవి అక్కడ షాపులో వస్తువులన్నీ చూసి వాటి ధరలు యూరోల్లో చూడగానే గబగబా ఇండియా రూపాయల్లో లెక్క వేసేసి మన హైదరాబాద్ లో అయితే ఇందులో సగం కంటే తక్కువే అని నిట్టూర్చేది. ఏది కొనుక్కోమని చెప్పినా నాకు అసలు ప్రాణం ఒప్పట్లేదంటూ తిరిగి వచ్చేసింది. చివరికి ఏవో ఐటమ్స్ మాత్రం బాగా నచ్చటంతో వదల్లేక కొనుక్కుంది. ఆ రోజంతా అక్కడ దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని చూస్తూ గడిపాం. కాసేపటికి  చీకటి పడేసరికీ అంతా మారిపోయింది .వెనిస్ అంతా  ఎన్నో వేల లైట్లతో వెలిగిపోతోంది . మూడు నాలుగు చోట్ల, కొంతమంది చిన్న స్టేజ్ మీద పియానో, వయోలిన్,  మొదలైన వాయిద్యాలతో చెవులకి ఎంతో హాయిగా వుండే సంగీతం. కొన్ని చోట్ల ఇటాలియన్ భాషలో మధురమైన పాటలు కూడా పాడుతున్నారు. అసలు రాత్రి పూట వెనిస్ చాలా రొమాంటిక్ గా అనిపించింది.
మళ్ళీ ఆత్మారాముడు గోల చేస్తుండటంతో అక్కడే నీటి మధ్యలోనే ఉన్న ఒక రెస్టారెంట్ ని చూసుకుని నేను   పిజ్జా తో పాటు వైన్ ఆర్డర్ చేశాను. భార్గవి మాత్రం తనకి పాస్తా కావాలి అంది.ఇండియా లో తినే ఇటాలియన్ పదార్దాలకీ, ఇటలీలో తినే వాటికీ చాలా  తేడా వుంది. చీజ్  ఎన్నో రకాలు ఉంటుంది . ఒకే పిజ్జా మీద రక రకాల చీజులు వేస్తారు.మాకు సర్వ్ చేసిన వ్యక్తి ఇటాలియన్ దేశస్తుడే. తను ఒకసారి పాకిస్తాన్ వెళ్ళాడట. ఏవో రెండు మూడు ఉర్దూ పదాలతో మమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. వెనిస్ లో అలా రాత్రి పూట వెలుగులో నీళ్ళలో తేలియాడుతూ భోజనం చేయటం తీయని అనుభూతిని ఇచ్చింది. ఇక ఆ రోజుకి మా సందర్శన ముగించుకుని అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి ఆ రోజు మొత్తం అక్కడున్న దీవుల్లో కొన్నైనా చూడాలనుకున్నాం.ముందుగా వెనిస్ లో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం. యూరప్లో ఉన్న మిగతా దేశాలనుండి అలాగే ఇటలీ లోని మిగతా నగరాలనుండి వచ్చే ట్రైన్స్ అక్కడ ఆగుతాయి. అక్కడ ఆగి ఉన్న కొన్ని రైళ్ళని చూశాం. బోగీలన్నీసకల వసతులతో ఉన్నాయి. నేను ఇంతకుముందు పోలాండ్ లో వెళ్ళిన వార్సా రైల్ కంటే ఇది చాలా బాగుంది. ఇక అక్కడినుండి 10 గంటలకల్లా డే టికెట్ తీసుకుని బోటులో బయలుదేరి ఒక్కో దీవి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా  వున్నాయి. 
అన్నిటిలోకి ముఖ్యమైనది సైంట్ మార్క్స్ స్క్వేర్. దీన్ని ఇటాలియన్ భాషలో శాన్ మార్కో పియాజాజ్ అనికూడా అంటారు. వెనిస్ వచ్చిన ప్రతి యాత్రీకుడు చూడవలసిన ప్రదేశం ఇది. ఎంతో అందంగా కట్టిన కట్టడాలు. మూడు పక్కలా ఎన్నో రెస్టారెంట్లు, ఆరు బయట షామియానాలు, కొన్ని గొడుగులు. వాటి క్రింద జనం కబుర్లు చెప్పుకుంటూ, వచ్చే పోయేవాళ్ళని చూస్తూ, పాస్టా తింటూ, కూర్చుని వుంటారు. ఎక్కడ చూసినా ఇటాలియన్ వైన్ సీసాలు. దాని పక్కనే సైంట్ మార్క్స్ బసీలికా చర్చి. చాలా అందమైన కట్టడం. లోపలా, బయటా కూడా బాగుంటుంది. ఆ పియాజాజ్ మధ్యలో ఎన్నో పావురాలు, ఆహారం పడేస్తుంటే అక్కడే ఎగురుతూ ఇంకా ఎంతో అందాన్నిస్తాయి. మేము ఎక్కువ సేపు ఈ ప్రాంతంలోనే గడిపాము. ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో మరో ముఖ్యమైనది గాలరీ డెల్ ఎకాడమియా. ఇక్కడ వెనీషియన్ చిత్రకారులు టిటియాన్, టింటరెట్టో మొదలైనవారి చిత్రాలు వున్నాయి. 
వెనిస్ వెళ్ళినవాళ్ళందరూ చేయవలసిన పని ఇంకొకటి వుంది. అదే ‘గండోలా’ బోటులో ‘లాహిరి లాహిరి’ విహారం. ఎనభై యూరోలు ఇస్తే దాదాపు నలభై ఐదు నిమిషాలు, మనల్ని ఆ చిన్న పడవలో సందుల గొందుల మధ్య తిప్పుతాడు. నేను వెళదాం అనేలోపు భార్గవి మాత్రం నాకు ఆసక్తి లేదు అంది. అప్పటిదాకా తిరిగింది కూడా పడవల్లోనే,  కాకపొతే గండోలా లో తిరుగుతుంటే మనమే ఒక రాకుమారుడు , రాకుమార్తె లాగా ఫీల్ అవుతాం. నీట్ గా డ్రెస్ చేసుకున్న వ్యక్తి ఆ గండోలలో రాచ మర్యాదలతో మనల్ని విహరింప చేస్తాడు. గండోలా విహారం వెన్నెల రాత్రులలో ఇంకా బాగుంటుంది. 
నేను తెలుసుకున్నదేమిటంటే, నీళ్ళల్లో పూర్తిగా మునిగిన చెక్కలు, ఆక్సిజన్ తగలక పాడవవు. అదే చెక్క నీళ్ళలో బయట వుంటే త్వరగా పాడవుతుంది. అదీకాక నీళ్ళని తగులుతున్న ప్రతి భవనం మొదటి అంతస్తు ఖాళీగా వుంచుతారుట. మనుష్యులు వుండేది రెండు, మూడు, ఆ పైన అంతస్తులలో. కాని ఇప్పుడు కొన్ని దీవుల్లో అసలు మనుషులే లేరు. అందరూ యాత్రీకులే. అప్పటికి సాయంకాలం అయ్యింది. మా తిరుగు ప్రయాణం అదే రోజు రాత్రి 9 గంటలకి. 6 గంటలకల్లా బస్ ఎక్కి 7 గంటలకల్లా మార్కోపోలో విమానాశ్రయానికి వెళ్ళిపోయాం. మళ్లీ ఈజీ జెట్ విమానంలోనే మరో రెండు గంటల్లో బెర్లిన్ చేరుకున్నాం. ఈసారి నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ క్రదోహా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చాడు. ముగ్గురం కలిసి మింజు జేర్జ్ బయలుదేరాం. నాకు వెనిస్ లో తిరుగుతున్నంత సేపు చిన్నప్పుడు చదివిన షేక్స్ పియర్ రాసిన కధ మర్చంట్ ఆఫ్ వెనిస్ గుర్తొచ్చింది. చందమామ పుస్తకాల్లో చదువుకున్న అభూత కల్పనల్ని వాస్తవంలో చూడలేకపోయినా మర్చంట్ ఆఫ్ వెనిస్ చదివి అదే వెనిస్ ని చూడటం చాలా అధ్బుతంగా అనిపించింది. 

Wednesday, July 1, 2015

నా ఐరోపా యాత్ర - 17 (బెర్లిన్)

అక్కడినుండి బయలు దేరి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో అందరం లంచ్ చేసాం. బెర్లిన్ రావటం నాకు రెండోసారి. మొదటిసారి IELTS test రాయటం కోసం వచ్చాను, అప్పుడు అంతా మంచు కురవటంతో నేను అంతగా బెర్లిన్ ని చూడలేదు. జర్మనీలో ఈశాన్య దిశలో గల బెర్లిన్‌ది యూరప్‌లో జనాభాలో ఏడవ స్థానం. వెస్ట్ ఫ్లావిక్ భాషలో దీని అసలు పేరు బెర్ల్‌బిర్. అంటే, బురదనేల. అది బెర్లిన్‌గా రూపాంతరం చెందింది. 13వ శతాబ్దంలో ప్రష్యా సామ్రాజ్యానికి ఇది రాజధాని. 1918లో, అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రష్యా సామ్రాజ్యం కూలిపోయాక జర్మన్ ఎంపైర్‌గా మారింది. హిట్లర్ ని అంతమొందించే క్రమంలో 1945 లో బెర్లిన్‌పై అనేక సైనిక విమానాలు బాంబులు కురిపించడంతో నగరంలో అధిక భాగం నాశనం అయింది. పన్నెండు రోజుల పాటు రష్యన్స్ రోజుకి నలభై కిలోమీటర్ల చొప్పున చొచ్చుకు వస్తూ దీన్ని మూడువైపుల నించి ముట్టడించారు. దీన్ని ‘బేటిల్ ఆఫ్ బెర్లిన్’ అంటారు. కాని జర్మన్ సైనికులు రష్యన్స్‌కి కాక అమెరికా మిత్ర సైన్యాలకే లొంగిపోయారు.  లంచ్ అయ్యాక అక్కడినుండి కార్ లో బెర్లిన్ గోడ చూడటానికి వెళుతున్నాం. ఒక సిగ్నల్ దగ్గర కార్ ఆగగానే కొంతమంది నల్ల యువకులు అద్దం దించ మంటూ కార్ దగ్గరికి వచ్చి సైగలు చేస్తున్నారు. మార్చిన్ మాత్రం వాళ్ళని పట్టించుకోలేదు. కొంతమంది అలా డబ్బులు కోసం చేస్తారని గ్లాస్ దించితే కార్ లో ఉన్నవి లాక్కుంటారని మార్చిన్ చెప్పాడు. యూరప్ లో నాకు ఇలాంటి తరహా అనుభవం మొదటిసారి. భార్గవి వాళ్ళని చూడగానే భయపడింది. 
                                  మార్చిన్ భార్య కాషా, వారి అబ్బాయి మాక్సిన్  తో భార్గవి, నేను 
బెర్లిన్ గోడ చూడాలని నాకు ఎప్పటినుండో కోరిక. హిట్లర్ చనిపోయి జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాక అమెరికా , రష్యాలు జర్మనీ ని రెండు భాగాలుగా పంచుకున్నాయి.రష్యా ఆధిపత్యంలో తూర్పు జర్మనీ, అమెరికా ఆధిపత్యంలో పశ్చిమ జర్మనీ ఉండేవి. రెండింటికీ అడ్డుగా ఈ గోడ నిర్మాణం ఆగష్టు 13, 1961 ప్రారంభమైనది.దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకుల చేతిల్లో ఉంటే పశ్చిమ జర్మనీ ప్రజాస్వామ్య ప్రభుత్వం చేతుల్లో ఉంది. తూర్పు జర్మనీనుంచి పశ్చిమ జర్మనీలోకి జనం వలసలు వెళ్ళకుండా కట్టుదిట్టం చేయడం కోసం తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్ని మూసివేయ నిర్ణయించి 1961లో గోడ నిర్మాణం చేశారు. ఈ చర్య తూర్పు పశ్చిమ జర్మనీలలోని ప్రజల్లో గొప్ప వేదన కలిగించింది. కొంతకాలం గడిచిన తర్వాత తూర్పునుంచి ఆ గోడను దాటడానికి యత్నించిన 136మందిని తూర్పు జర్మనీ భద్రతా దళాలు కాల్చిచంపాయి. వేలమందిని అదుపులోకి తీసుకొని జైలు పాలుజేశాయి. కాలగమనంలో 28 సంవత్సరాలు గడిచాయి. ప్రజల మధ్య గోడ నిర్మాణం పట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు, వారి మధ్య సౌహార్ధాన్ని నిలువరించడం ఇంక ఎంతమాత్రం సాధ్యమయ్యే పనికాదని గుర్తించిన తూర్పు జర్మనీ పాలకులు సోవియట్ యూనియన్ పతనం తరువాత గోడను 1989 నవంబర్ 9న పడగొట్టడంతో తిరిగి ఐక్య జర్మనీ ఏర్పాటైంది. జర్మనీవాసులు ప్రతియేటా ఈ రోజున పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటారు.​తరువాత కాలంలో ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలు ప్రజలే తొలగించడం మొదలుపెట్టారు. మిగిలిన భాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది.బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం అక్టోబర్ 3, 1990 లో పూర్తయింది.  బెర్లిన్ గోడ ఇంకొక కిలోమీటర్ ఉందనగానే అక్కడున్న పార్కింగ్ లో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళుతున్నాం. ఆ దారి మొత్తం బెర్లిన్ గోడ కి సంభందించిన ఫోటోలు ఉన్నాయి. ఆ గోడ ఎక్కుతూ చనిపోయిన వారివి , అమెరికన్ మరియు రష్యా పోలీసుల తూటాలకి బలయిన ఎంతోమంది జర్మన్ యువకుల వివరాలు కూడా ఉన్నాయి. మేము వెళుతున్న దారిలోనే అమెరికన్ ఎంబసీ ఉంది. మరో  147 దేశాల ఎంబసీలు బెర్లిన్ లో  ఉన్నాయి.  బెర్లిన్‌కి గ్రీన్ సిటీ అని పేరు.బెర్లిన్‌లో ఎంత ఖరీదైన జీవితాన్ని అనుభవించవచ్చో... సామాన్యమైన జీవితం కూడా అంతే సౌకర్యంగా ఉంటుంది. బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్స్ ఉంటాయి. వాటిలో చాలా తక్కువ ఖర్చుతో రోజులు గడపవచ్చు. చదువు, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లు ఆర్థికంగా స్థిరపడే వరకు ఇలా గడిపేయవచ్చు. తక్కువ ఖర్చు కాబట్టి కనీస సౌకర్యాలు, పరిశుభ్రత లోపం వంటివేమీ ఉండవు. సాధారణ వసతులతో శుభ్రంగా, సౌకర్యంగా ఉంటాయి. బెర్లిన్‌లో మంచి ఆహారం దొరుకుతుంది. స్థానిక భోజనం నుంచి కాంటినెంటల్ అన్ని రకాలూ దొరుకుతాయి. ఇండియన్ ఫుడ్‌లో చాలా రకాలుంటాయి. ఇండియన్లు నడుపుతున్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 
బెర్లిన్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే... సంస్కృతి, రాజకీయాలు, శాస్త్రసాంకేతిక, ప్రసార మాధ్యమం వంటి అన్ని ప్రధాన రంగాల్లోనూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరం. విశ్వవిద్యాలయాలు, సంగీత పరిశోధన సంస్థలు, మ్యూజియం, సమకాలీన కళలు, వైవిధ్యభరితమైన వాస్తుశైలి, క్రీడలకు కేంద్రస్థానం. ఈ నగరంలో పర్యటించటం గొప్ప అనుభూతిగా మిగులుతుంది. జర్మన్ భాషని ప్రపంచంలో తొమ్మిది కోట్ల మందికి పైగా మాట్లాడతారు. ఒక్క జర్మనీలోనే కాక, ఆస్ట్రియా, లైఎస్టెయిన్, లగ్జంబర్గ్ దేశాల్లో కూడా ఇది అధికారిక భాష. అందుకే మన వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ లలో చేరాలంటే జర్మన్ తప్పని సరిగా నేర్చుకుని రావాలి. చాలా వరకు ఆటో మొబైల్ , ఏరో నాటికల్ చదవటానికి మన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. బెర్లిన్‌లో ఉన్నత విద్యావంతుల సంఖ్య ఎక్కువ. ప్రతివారూ కనీసం సెకండరీ విద్య అయినా పూర్తి చేసి ఉంటారు. సంతోషంగా జీవించడం ఎలాగో వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే. ఇది చాలా ఓపెన్ సొసైటీ. అందరూ పీస్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఎవరిని పలకరించినా చిరునవ్వుతో మాట్లాడతారు. అడిగిన వివరాలు చెప్తారు. విదేశీయులనూ కొత్తవాళ్లలా చూడరు. ఎప్పటి నుంచో తెలిసినట్లు ఆత్మీయుల్లాగ మాట్లాడతారు. బెర్లిన్ గోడలో కొంత భాగాన్నైనా చూద్దామని ఆశపడిన నాకు అక్కడిదాకా వెళ్ళాక నిరాశే ఎదురైంది. కేవలం రెండు ముక్కలు మాత్రమే రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద నిలబెట్టి ఉన్నాయి. అసలు అక్కడ గోడ ఉండేది అనే ఆనవాలే లేకుండా ప్రజలే దానిని కూల్చేశారు. టూరిస్ట్ లు అందరూ ఆ రెండు ముక్కల ముందు నిలబడే ఫోటోలు తీసుకుంటున్నారు. భార్గవి కి అసలు ఈ చరిత్ర అంటే ఆసక్తి లేదు. ఏదో నా ఉత్సాహం చూసి నన్ను నిరుత్సాహ పరచటం ఇష్టం లేక నాతో పాటు వస్తుంటుంది.ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్దాం అంటే మ్యూజియం కి మాత్రం వద్దు అంటుంది. 

అక్కడినుండి వెనక్కి నడుస్తూ వస్తుండగా దాదాపు 4 ఎకరాల విస్తీర్ణం ఒక విచిత్రమైన నిర్మాణాలు కలిగిన ప్రదేశం కనిపించింది. మార్చిన్ చెప్పాడు , రెండవ ప్రపంచం లో ఊచకోత కోయబడిన యూదుల స్మారకార్ధం జర్మనీ ప్రభుత్వం నిర్మించిన హాలోకాస్ట్ మెమోరియల్ అది. భూమి ఉపరితలానికి సమాన ఎత్తులో ఆ సిమెంటు దిమ్మల్ని సమాధుల తరహాలో నిర్మించారు. వాటి మధ్య మనుషులు నడిచే దారులు ఉన్నాయి. ఆ ప్రాంతం మొత్తం లోతుగా తవ్వి ఒక్కో సమాధి ఒక్కో ఎత్తులో ఉండేట్లు నిర్మించి మనం లోపలి నుండి బయటికి వచ్చేటప్పుడు ఏటవాలుగా ఉంటుంది. ఆ వాలుకి తగ్గ ఎత్తులు భూమి సమానంగా ఈ సిమెంటు దిమ్మలు నిర్మించారు. వాటి మధ్యలోకి వెళితే ఎటు వస్తామో కూడా తెలియదు. ఒకప్పుడు బెర్లిన్ లో లక్షా యాభై వేల మంది యూదులు ఉండేవారట. రెండవ ప్రపంచంలో వారందరినీ హిట్లర్ చంపేసాక మిగిలిన వారు ఇజ్రాయిల్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 10 వేలమంది కూడా లేరు. యూదులకి సానుభూతిగా ప్రపంచంలో మరికొన్ని దేశాల్లో ఇలాంటి హోలోకాస్ట్ మెమోరియల్ నిర్మించారు.

ఇక్కడికి దగ్గరలోనే సిటీ స్క్వేర్ ఉంది దీనినే బ్రాన్దేన్ బర్గ్ గేటు అంటారు. బెర్లిన్ నగరానికి ఇది లాండ్ మార్క్. పర్యాటకులు అందరూ ఇది చూడకుండా మాత్రం వెళ్ళరు. అక్కడ ఒక పోలీస్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అందరి పాస్ పోర్ట్ ల మీద స్టాంప్ వేస్తున్నాడు. అది అధికారిక ఇమ్మిగ్రేషన్ ముద్ర లాగే ఉంది.తర్వాత నాకు అర్ధం అయిందేమిటంటే యూరప్ లో ఏ దేశంలో ముందుగా అడుగు పెడతామో ఆ దేశపు ఇమ్మిగ్రేషన్ స్టాంప్ మాత్రమే మన పాస్ పోర్ట్ మీద ఉంటుంది. మిగతా ఎన్ని దేశాలు తిరిగినా ఇమ్మిగ్రేషన్ చెక్ ఉండదు కనుక ఆయా దేశాల స్టాంప్ లు కూడా మన పాస్ పోర్ట్ లో ఉండవు. అందుకే పర్యాటకులంతా జర్మనీ ని దర్శించిన గుర్తుగా ఆ స్టాంప్ వేయించుకుంటున్నారు. దానికి ఆ వ్యక్తీ 5 యూరోలు తీసుకుంటున్నాడు. మేము ఆ స్టాంప్ వేయించుకోలేదు. అక్కడికి నడిచే దూరంలోనే జర్మనీ పార్లమెంట్ ఉంది. ఇది అతి పురాతనమైన భారీ నిర్మాణం.పెద్దగా సెక్యురిటి ఏమి లేదు. దాని చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకున్నాం. చలిగాలులు ఇంకా తగ్గకపోవటంతో ఎటు చూసినా అందరూ కోట్లు వేసుకునే తిరుగుతున్నారు. ఇక మా ప్రయాణాన్ని ముగించుకుని అందరం పోలాండ్ కి బయలుదేరాం. 

జర్మనీ పార్లమెంట్ ముందు మార్చిన్ భార్య కాషా తో భార్గవి