Tuesday, July 21, 2015

నా ఐరోపా యాత్ర - 20 (లిచ్టేన్ స్టెయిన్)

​ఇక ఆరోజుకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని వాడుజ్ నుండి షాన్ పట్టణం మీదుగా ఆస్ట్రియా బోర్డర్ చేరుకున్నాము. 28 రాత్రికి ఆస్ట్రియాలో జుగెన్ బెర్గ్ లో బస చేసాం. మరుసటి రోజు ఉదయం బయలుదేరి షాన్ పట్టణానికి చేరుకున్నాం. వాడుజ్ కంటే కూడా షాన్ ఎంతో అందంగా కనిపించింది. అసలు అవి రోడ్లా లేక అద్దాలో తెలియలేదు. పార్కింగ్ మొత్తం భూమిలోపలే ఉంది. ఇక్కడ రోడ్ల మీద పాదచారులకే ప్రాధాన్యత ఎక్కువ. ఎవరైనా రోడ్డు దాటటానికి నిలబడితే చాలు,వాహనాలన్నీ ఆగిపోతాయి. పాదచారులు రోడ్డు దాటాకే కార్లు ముందుకి కదులుతాయి. ఇక్కడ 18 వ శతాబ్దంలో నిర్మించిన ఒక చర్చి ఉంది. ఆ చర్చి లోపల కొవ్వొత్తి వెలిగించి జీసస్ ని స్మరించుకున్నాం. ఇక్కడ నైట్ లైఫ్,పబ్ కల్చర్ ఎక్కువే. చాలావరకు పబ్బులు కనిపించాయి. యూరప్ లో ఉన్న అన్ని దేశాల లాగే ఇక్కడ కూడా రెస్టారెంట్లు అన్ని ఆరుబయటే సర్వ్ చేస్తున్నాయి. వేసవిలో ఇక్కడ ప్రజలంతా ఆరుబయట తినటానికి, తాగటానికి ఇష్టపడతారు.  బస్సు లలో ప్రయాణించేవారు తక్కువే అయినా Liechenstain Bus పేరుతో ప్రభుత్వం ఒక ట్రాన్స్ పోర్ట్ సంస్థ ని నడుపుతోంది. దేశంలో ఉన్న 11 నగరాలతో పాటు స్విట్జెర్లాండ్ మరియు ఆస్ట్రియా లకి బస్సు సౌకర్యం ఉంది. మేము చూసిన రెండు రోజులు బస్సులన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి. షాన్ బస్సు స్టేషన్ కొంచెం పెద్దది.

మేము అక్కడ ఉండగా ఒక వ్యక్తి ఇండియన్ లా అనిపించటంతో పలకరించాను. అతను ముంబై కి చెందిన వాడిగా చెప్పాడు. లండన్ లో చదువుకుంటున్నా అని ఈ దేశం గురించి తెలుసుకుని చూడటానికి వచ్చానని చెప్పాడు. లండన్ నుండి ఫ్లైట్ లో జురిచ్ వచ్చి అక్కడనుంచి బస్సు లో వచ్చాడట. ఎందుకంటే లిచ్టేన్ స్టెయిన్ లో ఎయిర్ పోర్ట్ లేదు. ప్రపంచంలో ఎయిర్ పోర్ట్ లేని అయిదు దేశాల్లో ఇదొకటి. కాని హెలిపాడ్ మాత్రం ఉంది. అండోరా,మొనాకో, సాన్ మారినో మరియు వాటికన్ సిటీ దేశాల్లో కూడా ఎయిర్ పోర్ట్ లేదు. ఇక సిటీ మధ్యలో గుటెన్ బర్గ్ అనే పేరుతో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ కనపడింది. బహుశా ఈ దేశంలో ఉన్న ఏకైక ముద్రణాలయం ఇదేనేమో. నేను వృత్తి రీత్యా ప్రింటింగ్ రంగంలో పనిచేస్తుండటంతో ఆసక్తిగా ఆ ప్రెస్ లోపలి వెళ్లి నన్ను పరిచయం చేసుకుని అక్కడ ఒక ఫోటో తీసుకున్నాను.

ఇక అక్కడినుంచి బయలుదేరి వాడుజ్ చేరుకున్నాం. వాడుజ్ లో బస్సు స్టేషన్ నుండి టూరిస్ట్ లకోసం ఒక టాయ్ ట్రైన్ ఉంది. పది యురోలు చెల్లిస్తే ఆ టాయ్ ట్రైన్లో 40 నిమిషాల్లో దేశం మొత్తం చూసేయచ్చు. మాకు కార్ ఉంది కాబట్టి మేము అది ఎక్కలేదు. ఇక అక్కడినుంచి పార్లమెంట్ కి చేరుకున్నాం. ఈ భవనం పెద్దదేమీ కాదు. కేవలం 11 నగరాలున్న ఈ దేశానికి సరిపోను ఉంది. ఈ దేశం రాచరిక పాలనతో పాటు ప్రజాస్వామ్యబద్ధమైన పార్లమెంట్ వ్యవస్థని కూడా కలిగి ఉంది. రాజుతో పాటు ప్రధాన మంత్రి కూడా ఉంటాడు. ప్రస్తుతం ఉన్న రాజు హాన్స్ ఆడమ్ 1989 నుండి పదవిలో ఉన్నాడు. కింగ్ పాలస్ కొండపైనే ఉంటుంది. అక్కడినుంచే రాజు దేశం మొత్తాన్ని చూడవచ్చు. ఐదు బిలియన్ డాలర్ల సంపదలో ప్రపంచంలో ఆరవ సంపన్నుడు హాన్స్ ఆడం. 

పార్లమెంట్ కి దగ్గరిలోనే పలు బాంకులు టూరిస్ట్ ఆఫీసులు ఉన్నయి. ఏకీకృత వీసా విధానం కాబట్టి యూరప్ లో ఎన్ని దేశాలు తిరిగినా ఆయా దేశాల వీసా స్టాంపింగ్ మన పాస్ పోర్ట్ మీద ఉండవు. కాని ఇక్కడ వీసా ఆఫీసులో కావాలంటే ఆ స్టాంప్ మన పాస్పోర్ట్ మీద వేయించుకోవచ్చు. నా శ్రీమతి ఇది చూసి మన పాస్ పోర్ట్ మీద వేయిద్దాం అంది. మన విజిట్ కి గుర్తుగా ఉంటుందని. కాని ఒక్కొక్క పాస్ పోర్ట్ కి రెండున్నర యూరోలు చెల్లించాలి. మా పాస్ పోర్ట్ ల మీద ఆ స్టాంప్ వేయించుకున్నాం. 
ప్రపంచంలో అతితక్కువ నిరుద్యోగం ఉన్న దేశాల్లో ఇది రెండవది. ఇక్కడ నిరుద్యోగుల శాతం కేవలం 1.5 %. అతితక్కువ అప్పు ఉన్న దేశాల్లో కూడా లిచ్టేన్ స్టెయిన్ దే అగ్రస్థానం. ప్రపంచంలో మరే ఇతర దేశంతో వీళ్లకి శత్రుత్వం లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా తటస్థంగా ఉన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. 
ఈ దేశంలో ఉన్న సౌకర్యాలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో నివసిస్తున్న ప్రజలున్న దేశాల్లో ఈ దేశం ఒకటి.మాకు అన్నీ లగ్జరీ కార్లు తప్ప కనీసం మీడియం సైజు కార్లు కూడా కనపడలా. 

కేవలం 36000 మంది జనాభానే కదా అని తక్కువ అంచనా వెయ్యటానికి లేదు. ప్రపంచం లో ఉన్న ప్రముఖ కార్ కంపెనీల షోరూం లు అన్నీ ఈ దేశంలో ఉన్నాయి. అవన్నీ చూసి మేము ఆశ్చర్యపోయాం. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఇక్కడ మిగతా దేశాలతో పోలిస్తే టాక్స్ చాలా తక్కువ. కాబట్టి చుట్టు పక్కల దేశాల వాళ్ళు చాలామంది కార్లు ఇక్కడే కొంటారట. స్విట్జెర్లాండ్ లాగే ఇక్కడ బ్యాంకుల్లో కూడా మీరు డిపాజిట్ చేసే డబ్బుకి లెక్కలు అడగరు. ఎంత డబ్బైనా బాంక్ లో దాచుకోవచ్చు. కార్పోరేట్ టాక్స్ కూడా తక్కువే అందుకే చాలా కంపెనీలు ఇక్కడ ఆఫీసులు తెరిచాయి. 

ఇక్కడ ఉద్యోగులపై ఉండే ఆదాయపు పన్ను కూడా మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అన్నిటినీ మించి ప్రకృతి ప్రసాదించిన అద్భుత దృశ్య కావ్యం ఈ దేశం.  ఇక ఆ రోజుకి వాడుజ్ లో ఉన్న మ్యూజియం చూసాం. ఆ దేశానికి సంభందించిన పలు పురాతన విశేషాలను అందులో పొందు పరచారు. ఇక అక్కడినుంచి ఆ దేశాన్ని వదలలేక కొంచెం మిస్ అవుతున్నామన్న దిగులుతోనే జురిచ్ కి బయలుదేరాం. కాని ఎందుకో ఐరోపాలో ఎన్ని దేశాలు చూసినా మాకు మాత్రం ఈ దేశమే బావుందనిపించింది.

No comments: