Friday, July 3, 2015

నా ఐరోపా యాత్ర - 18 (వెనిస్)

కొత్తగా పెళ్ళైన జంటకి మొదటి డ్రీమ్ హనీమూన్ ప్రదేశం అంటే  వెనిస్ నగరమే. నేను బ్రహ్మ్మచారిగా సంవత్సరం పాటు యూరప్ లో నివసించినా , వెనిస్ వెళ్ళగల అవకాశం ఉండి కూడా అక్కడికి వెళ్ళలేదు. పెళ్ళయ్యాక సతీ సమేతంగా మాత్రమే  వెళ్ళాలనుకున్న నగరం వెనిస్. తరువాతి కాలంలో అన్ని దేశాలు ఏకకాలం లో చుట్టేసినా ,ఇటలీలో ఉన్న  వెనిస్ నగరాన్ని మాత్రం ప్రత్యేకంగా సందర్శించాము. మేము ఉండే పోలాండ్ కి వెనిస్ 1100 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే కష్టం. అలా అని మిగతా దేశాల సందర్శన తో పాటు కలుపుకుంటే చాలా వరకు సమయం డ్రైవింగ్ కే వృధా అవుతుంది. అందుకే ఈ ఒక్క నగరాన్ని ప్రత్యేకంగా చూడాలని అనుకున్నాం. ఏప్రిల్ 7, 2013 బెర్లిన్ లో బాద్షా చూసిన వారానికి అంటే సరిగ్గా ఏప్రిల్ 13 న వెనిస్ వెళదామని నిర్ణయించుకున్నాం. మేము పోలాండ్ లో ఉంటున్నా , మేము ఎక్కువగా ఉపయోగించేది జర్మనీ లో ఉన్న బెర్లిన్ ఎయిర్పోర్ట్. బెర్లిన్ లో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయ విమానాలు వచ్చే తెగెల్ ఎయిర్పోర్ట్. ఇంకోటి యూరప్ దేశాలకు చిన్న విమానాలు నడిపే శేనిఫోల్ద్ విమానాశ్రయం. 13 వ తేది ఉదయం 6 గంటలకి ఇక్కడినుండి వెనిస్ మార్కోపోలో కి ఈజీ జెట్ విమానం ఉంది. మేము బెర్లిన్ వెళ్ళాలంటే మింజుజేర్జ్ నుండి 2 గంటలు పడుతుంది. నా కొలీగ్ రఘునాథ్ బాబు మమ్మల్ని బెర్లిన్ లో డ్రాప్ చేస్తానని చెప్పాడు. మా ఆఫీస్ లో పనిచేస్తున్న భారతీయుల్లో కారు , డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది నాకు , రఘుకి మాత్రమే. అందుకే మిగతా వాళ్లకి ఏ సాయం కావాలన్నా మేమిద్దరమే వెళ్ళేవాళ్ళం. సరిగ్గా తెల్లవారు ఝామున 3 గంటలకి మింజు జేర్జ్ లో నేను , భార్గవి రఘు కార్ లో బయలుదేరాము. శేనిఫోల్ద్ విమానాశ్రయం బెర్లిన్ నగర సరిహద్దుల్లోనే ఉంది.5 గంటలకల్లా రఘు మమ్మల్ని డ్రాప్ చేసాడు. అనుకున్న సమయానికంటే గంట ఆలస్యంగా 7 గంటలకి ఈజీ జెట్ విమానం వెనిస్ వైపుగా టేక్ ఆఫ్ తీసుకుంది. సరిగ్గా గంటా నలభై నిమిషాల తరువాతా సముద్రానికి దగ్గరగా ఉన్న మార్కోపోలో విమానాశ్రయంలో దిగాం. నీటిలో తేలియాడే వెనిస్ నగరం ఉండే ప్రాంతం పేరు PIAZZALE ROMA. మార్కో పోలో నుండి ప్రతి పదినిమిషాలకి ఒక బస్ ఉంటుంది. అక్కడినుండి PIAZZALE ROMA 25 నిమిషాల ప్రయాణం. వెనిస్ నగరం అంతా నీళ్ళలో ఏమి ఉండదు PIAZZALE ROMA ప్రాంతం మాత్రం మనం విన్నట్లుగా నీళ్ళలో ఉంటుంది. నేను ముందుగానే హోటల్ బుక్ చేసుకోవటంతో ఆ హోటల్ ప్రతినిధి మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి బస్సు దగ్గరకి వచ్చాడు. మమ్మల్ని వెంటబెట్టుకుని అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న పెద్ద భవనం దగ్గరకి తీసికెళ్ళాడు. అసలు ఆ భవనాల తలుపుల ముందు మేము పిట్టల్లా ఉన్నాం. ఎన్నో ఏళ్ల క్రితం భారీ నిర్మాణంలా ఉంది. 4 అంతస్తులు లిఫ్ట్ లేకుండానే మెట్లు ఎక్కాం. అసలు ఆ భవనాలకి లిఫ్ట్ ఉండే అవకాశమే లేదు. 4 వ అంతస్తులో ఒక తలుపు తీసి మాకు తాళం ఇచ్చి ఆ వ్యక్తీ వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది విశాలమైన 4 బెడ్రూమ్స్ ఉన్న అపార్ట్మెంట్. అత్యంత పొందికగా ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చి ఉన్నాయి. 
 అప్పటికి సమయం ఉదయం 11 అయింది  ప్రయాణ బడలికగా ఉండటంతో కాసేపు విశ్రాంతి తీసుకుని కిందకి వచ్చి పిజ్జా తిని నీళ్ళలో తేలియాడే వెనిస్ నగర వీధుల్ని చూడాలనే ఉత్సాహంతో బయలుదేరాం. వెనిస్ ను క్రీ.శ 421 ప్రాంతంలో నిర్మించారు. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రం. తర్వాతి రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. పద్నాలుగో శతాబ్దంలో ఇక్కడ రెండు లక్షల మంది నివాసం ఉండేవారట. 1966 లో వచ్చిన వరద తాకిడికి వెనిస్ లో నీటిమట్టం మీటరు ఎత్తుకు పెరిగింది. అప్పటి నుంచీ అక్కడి జనాభా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు అసలు ఆ ఇళ్ళల్లో ఎవరూ నివసించటం లేదు. ఆ దీవి మొత్తం తిరగటానికి పడవలే ఆధారం ఇది దాదాపు 140 దీవుల సమూహం. ఒక దీవి నుండి మరో దీవికి పడవలో వెళ్ళటం అక్కడ దిగి కాసేపు ఆ ప్రాంతంలో గడిపి మళ్లీ అక్కడికి వచ్చే తరువాతి పడవ ఎక్కి వేరే దీవికి వెళ్ళటం. రోజుకి 11 యూరోలు కట్టి టికెట్ కొంటే ఆ రోజంతా ఆ దీవుల్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. నీళ్ళ ఒడ్డునే కట్టిన స్కూళ్ళు, ఆసుపత్రులు, ఆఫీసులు. ఇక్కడ బస్టాపులు, టాక్సీ స్టాండులు కూడా నీళ్ళల్లో తేలుతూ వుంటాయి.
మన ఒడ్డు వేపు నించీ ఎక్కి, రెండో పక్కన వున్న బస్సులు ఎక్కుతామన్నమాట!  మేము మొదటి రోజు పాస్ కొనలేదు. వెనిస్ నగర వీధుల్లో నడుస్త్తూ ఆ పురాతన భవంతుల  వైభవాన్ని చూస్తుంటే ఎన్నేళ్ళ క్రితం వాటిని నిర్మించారో అనిపించింది. ఎటు చూసినా సావనీర్లు అమ్మేషాపులు , రకరకాల ఫాషన్ దుస్తులు , ఆభరణాల దుకాణాలు కనిపిస్తాయి. భార్గవి అక్కడ షాపులో వస్తువులన్నీ చూసి వాటి ధరలు యూరోల్లో చూడగానే గబగబా ఇండియా రూపాయల్లో లెక్క వేసేసి మన హైదరాబాద్ లో అయితే ఇందులో సగం కంటే తక్కువే అని నిట్టూర్చేది. ఏది కొనుక్కోమని చెప్పినా నాకు అసలు ప్రాణం ఒప్పట్లేదంటూ తిరిగి వచ్చేసింది. చివరికి ఏవో ఐటమ్స్ మాత్రం బాగా నచ్చటంతో వదల్లేక కొనుక్కుంది. ఆ రోజంతా అక్కడ దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని చూస్తూ గడిపాం. కాసేపటికి  చీకటి పడేసరికీ అంతా మారిపోయింది .వెనిస్ అంతా  ఎన్నో వేల లైట్లతో వెలిగిపోతోంది . మూడు నాలుగు చోట్ల, కొంతమంది చిన్న స్టేజ్ మీద పియానో, వయోలిన్,  మొదలైన వాయిద్యాలతో చెవులకి ఎంతో హాయిగా వుండే సంగీతం. కొన్ని చోట్ల ఇటాలియన్ భాషలో మధురమైన పాటలు కూడా పాడుతున్నారు. అసలు రాత్రి పూట వెనిస్ చాలా రొమాంటిక్ గా అనిపించింది.
మళ్ళీ ఆత్మారాముడు గోల చేస్తుండటంతో అక్కడే నీటి మధ్యలోనే ఉన్న ఒక రెస్టారెంట్ ని చూసుకుని నేను   పిజ్జా తో పాటు వైన్ ఆర్డర్ చేశాను. భార్గవి మాత్రం తనకి పాస్తా కావాలి అంది.ఇండియా లో తినే ఇటాలియన్ పదార్దాలకీ, ఇటలీలో తినే వాటికీ చాలా  తేడా వుంది. చీజ్  ఎన్నో రకాలు ఉంటుంది . ఒకే పిజ్జా మీద రక రకాల చీజులు వేస్తారు.మాకు సర్వ్ చేసిన వ్యక్తి ఇటాలియన్ దేశస్తుడే. తను ఒకసారి పాకిస్తాన్ వెళ్ళాడట. ఏవో రెండు మూడు ఉర్దూ పదాలతో మమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. వెనిస్ లో అలా రాత్రి పూట వెలుగులో నీళ్ళలో తేలియాడుతూ భోజనం చేయటం తీయని అనుభూతిని ఇచ్చింది. ఇక ఆ రోజుకి మా సందర్శన ముగించుకుని అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి ఆ రోజు మొత్తం అక్కడున్న దీవుల్లో కొన్నైనా చూడాలనుకున్నాం.ముందుగా వెనిస్ లో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం. యూరప్లో ఉన్న మిగతా దేశాలనుండి అలాగే ఇటలీ లోని మిగతా నగరాలనుండి వచ్చే ట్రైన్స్ అక్కడ ఆగుతాయి. అక్కడ ఆగి ఉన్న కొన్ని రైళ్ళని చూశాం. బోగీలన్నీసకల వసతులతో ఉన్నాయి. నేను ఇంతకుముందు పోలాండ్ లో వెళ్ళిన వార్సా రైల్ కంటే ఇది చాలా బాగుంది. ఇక అక్కడినుండి 10 గంటలకల్లా డే టికెట్ తీసుకుని బోటులో బయలుదేరి ఒక్కో దీవి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా  వున్నాయి. 
అన్నిటిలోకి ముఖ్యమైనది సైంట్ మార్క్స్ స్క్వేర్. దీన్ని ఇటాలియన్ భాషలో శాన్ మార్కో పియాజాజ్ అనికూడా అంటారు. వెనిస్ వచ్చిన ప్రతి యాత్రీకుడు చూడవలసిన ప్రదేశం ఇది. ఎంతో అందంగా కట్టిన కట్టడాలు. మూడు పక్కలా ఎన్నో రెస్టారెంట్లు, ఆరు బయట షామియానాలు, కొన్ని గొడుగులు. వాటి క్రింద జనం కబుర్లు చెప్పుకుంటూ, వచ్చే పోయేవాళ్ళని చూస్తూ, పాస్టా తింటూ, కూర్చుని వుంటారు. ఎక్కడ చూసినా ఇటాలియన్ వైన్ సీసాలు. దాని పక్కనే సైంట్ మార్క్స్ బసీలికా చర్చి. చాలా అందమైన కట్టడం. లోపలా, బయటా కూడా బాగుంటుంది. ఆ పియాజాజ్ మధ్యలో ఎన్నో పావురాలు, ఆహారం పడేస్తుంటే అక్కడే ఎగురుతూ ఇంకా ఎంతో అందాన్నిస్తాయి. మేము ఎక్కువ సేపు ఈ ప్రాంతంలోనే గడిపాము. ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో మరో ముఖ్యమైనది గాలరీ డెల్ ఎకాడమియా. ఇక్కడ వెనీషియన్ చిత్రకారులు టిటియాన్, టింటరెట్టో మొదలైనవారి చిత్రాలు వున్నాయి. 
వెనిస్ వెళ్ళినవాళ్ళందరూ చేయవలసిన పని ఇంకొకటి వుంది. అదే ‘గండోలా’ బోటులో ‘లాహిరి లాహిరి’ విహారం. ఎనభై యూరోలు ఇస్తే దాదాపు నలభై ఐదు నిమిషాలు, మనల్ని ఆ చిన్న పడవలో సందుల గొందుల మధ్య తిప్పుతాడు. నేను వెళదాం అనేలోపు భార్గవి మాత్రం నాకు ఆసక్తి లేదు అంది. అప్పటిదాకా తిరిగింది కూడా పడవల్లోనే,  కాకపొతే గండోలా లో తిరుగుతుంటే మనమే ఒక రాకుమారుడు , రాకుమార్తె లాగా ఫీల్ అవుతాం. నీట్ గా డ్రెస్ చేసుకున్న వ్యక్తి ఆ గండోలలో రాచ మర్యాదలతో మనల్ని విహరింప చేస్తాడు. గండోలా విహారం వెన్నెల రాత్రులలో ఇంకా బాగుంటుంది. 
నేను తెలుసుకున్నదేమిటంటే, నీళ్ళల్లో పూర్తిగా మునిగిన చెక్కలు, ఆక్సిజన్ తగలక పాడవవు. అదే చెక్క నీళ్ళలో బయట వుంటే త్వరగా పాడవుతుంది. అదీకాక నీళ్ళని తగులుతున్న ప్రతి భవనం మొదటి అంతస్తు ఖాళీగా వుంచుతారుట. మనుష్యులు వుండేది రెండు, మూడు, ఆ పైన అంతస్తులలో. కాని ఇప్పుడు కొన్ని దీవుల్లో అసలు మనుషులే లేరు. అందరూ యాత్రీకులే. అప్పటికి సాయంకాలం అయ్యింది. మా తిరుగు ప్రయాణం అదే రోజు రాత్రి 9 గంటలకి. 6 గంటలకల్లా బస్ ఎక్కి 7 గంటలకల్లా మార్కోపోలో విమానాశ్రయానికి వెళ్ళిపోయాం. మళ్లీ ఈజీ జెట్ విమానంలోనే మరో రెండు గంటల్లో బెర్లిన్ చేరుకున్నాం. ఈసారి నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ క్రదోహా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చాడు. ముగ్గురం కలిసి మింజు జేర్జ్ బయలుదేరాం. నాకు వెనిస్ లో తిరుగుతున్నంత సేపు చిన్నప్పుడు చదివిన షేక్స్ పియర్ రాసిన కధ మర్చంట్ ఆఫ్ వెనిస్ గుర్తొచ్చింది. చందమామ పుస్తకాల్లో చదువుకున్న అభూత కల్పనల్ని వాస్తవంలో చూడలేకపోయినా మర్చంట్ ఆఫ్ వెనిస్ చదివి అదే వెనిస్ ని చూడటం చాలా అధ్బుతంగా అనిపించింది. 

No comments: