Wednesday, July 1, 2015

నా ఐరోపా యాత్ర - 17 (బెర్లిన్)

అక్కడినుండి బయలు దేరి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో అందరం లంచ్ చేసాం. బెర్లిన్ రావటం నాకు రెండోసారి. మొదటిసారి IELTS test రాయటం కోసం వచ్చాను, అప్పుడు అంతా మంచు కురవటంతో నేను అంతగా బెర్లిన్ ని చూడలేదు. జర్మనీలో ఈశాన్య దిశలో గల బెర్లిన్‌ది యూరప్‌లో జనాభాలో ఏడవ స్థానం. వెస్ట్ ఫ్లావిక్ భాషలో దీని అసలు పేరు బెర్ల్‌బిర్. అంటే, బురదనేల. అది బెర్లిన్‌గా రూపాంతరం చెందింది. 13వ శతాబ్దంలో ప్రష్యా సామ్రాజ్యానికి ఇది రాజధాని. 1918లో, అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రష్యా సామ్రాజ్యం కూలిపోయాక జర్మన్ ఎంపైర్‌గా మారింది. హిట్లర్ ని అంతమొందించే క్రమంలో 1945 లో బెర్లిన్‌పై అనేక సైనిక విమానాలు బాంబులు కురిపించడంతో నగరంలో అధిక భాగం నాశనం అయింది. పన్నెండు రోజుల పాటు రష్యన్స్ రోజుకి నలభై కిలోమీటర్ల చొప్పున చొచ్చుకు వస్తూ దీన్ని మూడువైపుల నించి ముట్టడించారు. దీన్ని ‘బేటిల్ ఆఫ్ బెర్లిన్’ అంటారు. కాని జర్మన్ సైనికులు రష్యన్స్‌కి కాక అమెరికా మిత్ర సైన్యాలకే లొంగిపోయారు.  లంచ్ అయ్యాక అక్కడినుండి కార్ లో బెర్లిన్ గోడ చూడటానికి వెళుతున్నాం. ఒక సిగ్నల్ దగ్గర కార్ ఆగగానే కొంతమంది నల్ల యువకులు అద్దం దించ మంటూ కార్ దగ్గరికి వచ్చి సైగలు చేస్తున్నారు. మార్చిన్ మాత్రం వాళ్ళని పట్టించుకోలేదు. కొంతమంది అలా డబ్బులు కోసం చేస్తారని గ్లాస్ దించితే కార్ లో ఉన్నవి లాక్కుంటారని మార్చిన్ చెప్పాడు. యూరప్ లో నాకు ఇలాంటి తరహా అనుభవం మొదటిసారి. భార్గవి వాళ్ళని చూడగానే భయపడింది. 
                                  మార్చిన్ భార్య కాషా, వారి అబ్బాయి మాక్సిన్  తో భార్గవి, నేను 
బెర్లిన్ గోడ చూడాలని నాకు ఎప్పటినుండో కోరిక. హిట్లర్ చనిపోయి జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాక అమెరికా , రష్యాలు జర్మనీ ని రెండు భాగాలుగా పంచుకున్నాయి.రష్యా ఆధిపత్యంలో తూర్పు జర్మనీ, అమెరికా ఆధిపత్యంలో పశ్చిమ జర్మనీ ఉండేవి. రెండింటికీ అడ్డుగా ఈ గోడ నిర్మాణం ఆగష్టు 13, 1961 ప్రారంభమైనది.దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకుల చేతిల్లో ఉంటే పశ్చిమ జర్మనీ ప్రజాస్వామ్య ప్రభుత్వం చేతుల్లో ఉంది. తూర్పు జర్మనీనుంచి పశ్చిమ జర్మనీలోకి జనం వలసలు వెళ్ళకుండా కట్టుదిట్టం చేయడం కోసం తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్ని మూసివేయ నిర్ణయించి 1961లో గోడ నిర్మాణం చేశారు. ఈ చర్య తూర్పు పశ్చిమ జర్మనీలలోని ప్రజల్లో గొప్ప వేదన కలిగించింది. కొంతకాలం గడిచిన తర్వాత తూర్పునుంచి ఆ గోడను దాటడానికి యత్నించిన 136మందిని తూర్పు జర్మనీ భద్రతా దళాలు కాల్చిచంపాయి. వేలమందిని అదుపులోకి తీసుకొని జైలు పాలుజేశాయి. కాలగమనంలో 28 సంవత్సరాలు గడిచాయి. ప్రజల మధ్య గోడ నిర్మాణం పట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు, వారి మధ్య సౌహార్ధాన్ని నిలువరించడం ఇంక ఎంతమాత్రం సాధ్యమయ్యే పనికాదని గుర్తించిన తూర్పు జర్మనీ పాలకులు సోవియట్ యూనియన్ పతనం తరువాత గోడను 1989 నవంబర్ 9న పడగొట్టడంతో తిరిగి ఐక్య జర్మనీ ఏర్పాటైంది. జర్మనీవాసులు ప్రతియేటా ఈ రోజున పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటారు.​తరువాత కాలంలో ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలు ప్రజలే తొలగించడం మొదలుపెట్టారు. మిగిలిన భాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది.బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం అక్టోబర్ 3, 1990 లో పూర్తయింది.  బెర్లిన్ గోడ ఇంకొక కిలోమీటర్ ఉందనగానే అక్కడున్న పార్కింగ్ లో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళుతున్నాం. ఆ దారి మొత్తం బెర్లిన్ గోడ కి సంభందించిన ఫోటోలు ఉన్నాయి. ఆ గోడ ఎక్కుతూ చనిపోయిన వారివి , అమెరికన్ మరియు రష్యా పోలీసుల తూటాలకి బలయిన ఎంతోమంది జర్మన్ యువకుల వివరాలు కూడా ఉన్నాయి. మేము వెళుతున్న దారిలోనే అమెరికన్ ఎంబసీ ఉంది. మరో  147 దేశాల ఎంబసీలు బెర్లిన్ లో  ఉన్నాయి.  బెర్లిన్‌కి గ్రీన్ సిటీ అని పేరు.బెర్లిన్‌లో ఎంత ఖరీదైన జీవితాన్ని అనుభవించవచ్చో... సామాన్యమైన జీవితం కూడా అంతే సౌకర్యంగా ఉంటుంది. బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్స్ ఉంటాయి. వాటిలో చాలా తక్కువ ఖర్చుతో రోజులు గడపవచ్చు. చదువు, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లు ఆర్థికంగా స్థిరపడే వరకు ఇలా గడిపేయవచ్చు. తక్కువ ఖర్చు కాబట్టి కనీస సౌకర్యాలు, పరిశుభ్రత లోపం వంటివేమీ ఉండవు. సాధారణ వసతులతో శుభ్రంగా, సౌకర్యంగా ఉంటాయి. బెర్లిన్‌లో మంచి ఆహారం దొరుకుతుంది. స్థానిక భోజనం నుంచి కాంటినెంటల్ అన్ని రకాలూ దొరుకుతాయి. ఇండియన్ ఫుడ్‌లో చాలా రకాలుంటాయి. ఇండియన్లు నడుపుతున్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 
బెర్లిన్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే... సంస్కృతి, రాజకీయాలు, శాస్త్రసాంకేతిక, ప్రసార మాధ్యమం వంటి అన్ని ప్రధాన రంగాల్లోనూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరం. విశ్వవిద్యాలయాలు, సంగీత పరిశోధన సంస్థలు, మ్యూజియం, సమకాలీన కళలు, వైవిధ్యభరితమైన వాస్తుశైలి, క్రీడలకు కేంద్రస్థానం. ఈ నగరంలో పర్యటించటం గొప్ప అనుభూతిగా మిగులుతుంది. జర్మన్ భాషని ప్రపంచంలో తొమ్మిది కోట్ల మందికి పైగా మాట్లాడతారు. ఒక్క జర్మనీలోనే కాక, ఆస్ట్రియా, లైఎస్టెయిన్, లగ్జంబర్గ్ దేశాల్లో కూడా ఇది అధికారిక భాష. అందుకే మన వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ లలో చేరాలంటే జర్మన్ తప్పని సరిగా నేర్చుకుని రావాలి. చాలా వరకు ఆటో మొబైల్ , ఏరో నాటికల్ చదవటానికి మన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. బెర్లిన్‌లో ఉన్నత విద్యావంతుల సంఖ్య ఎక్కువ. ప్రతివారూ కనీసం సెకండరీ విద్య అయినా పూర్తి చేసి ఉంటారు. సంతోషంగా జీవించడం ఎలాగో వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే. ఇది చాలా ఓపెన్ సొసైటీ. అందరూ పీస్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఎవరిని పలకరించినా చిరునవ్వుతో మాట్లాడతారు. అడిగిన వివరాలు చెప్తారు. విదేశీయులనూ కొత్తవాళ్లలా చూడరు. ఎప్పటి నుంచో తెలిసినట్లు ఆత్మీయుల్లాగ మాట్లాడతారు. బెర్లిన్ గోడలో కొంత భాగాన్నైనా చూద్దామని ఆశపడిన నాకు అక్కడిదాకా వెళ్ళాక నిరాశే ఎదురైంది. కేవలం రెండు ముక్కలు మాత్రమే రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద నిలబెట్టి ఉన్నాయి. అసలు అక్కడ గోడ ఉండేది అనే ఆనవాలే లేకుండా ప్రజలే దానిని కూల్చేశారు. టూరిస్ట్ లు అందరూ ఆ రెండు ముక్కల ముందు నిలబడే ఫోటోలు తీసుకుంటున్నారు. భార్గవి కి అసలు ఈ చరిత్ర అంటే ఆసక్తి లేదు. ఏదో నా ఉత్సాహం చూసి నన్ను నిరుత్సాహ పరచటం ఇష్టం లేక నాతో పాటు వస్తుంటుంది.ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్దాం అంటే మ్యూజియం కి మాత్రం వద్దు అంటుంది. 

అక్కడినుండి వెనక్కి నడుస్తూ వస్తుండగా దాదాపు 4 ఎకరాల విస్తీర్ణం ఒక విచిత్రమైన నిర్మాణాలు కలిగిన ప్రదేశం కనిపించింది. మార్చిన్ చెప్పాడు , రెండవ ప్రపంచం లో ఊచకోత కోయబడిన యూదుల స్మారకార్ధం జర్మనీ ప్రభుత్వం నిర్మించిన హాలోకాస్ట్ మెమోరియల్ అది. భూమి ఉపరితలానికి సమాన ఎత్తులో ఆ సిమెంటు దిమ్మల్ని సమాధుల తరహాలో నిర్మించారు. వాటి మధ్య మనుషులు నడిచే దారులు ఉన్నాయి. ఆ ప్రాంతం మొత్తం లోతుగా తవ్వి ఒక్కో సమాధి ఒక్కో ఎత్తులో ఉండేట్లు నిర్మించి మనం లోపలి నుండి బయటికి వచ్చేటప్పుడు ఏటవాలుగా ఉంటుంది. ఆ వాలుకి తగ్గ ఎత్తులు భూమి సమానంగా ఈ సిమెంటు దిమ్మలు నిర్మించారు. వాటి మధ్యలోకి వెళితే ఎటు వస్తామో కూడా తెలియదు. ఒకప్పుడు బెర్లిన్ లో లక్షా యాభై వేల మంది యూదులు ఉండేవారట. రెండవ ప్రపంచంలో వారందరినీ హిట్లర్ చంపేసాక మిగిలిన వారు ఇజ్రాయిల్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 10 వేలమంది కూడా లేరు. యూదులకి సానుభూతిగా ప్రపంచంలో మరికొన్ని దేశాల్లో ఇలాంటి హోలోకాస్ట్ మెమోరియల్ నిర్మించారు.

ఇక్కడికి దగ్గరలోనే సిటీ స్క్వేర్ ఉంది దీనినే బ్రాన్దేన్ బర్గ్ గేటు అంటారు. బెర్లిన్ నగరానికి ఇది లాండ్ మార్క్. పర్యాటకులు అందరూ ఇది చూడకుండా మాత్రం వెళ్ళరు. అక్కడ ఒక పోలీస్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అందరి పాస్ పోర్ట్ ల మీద స్టాంప్ వేస్తున్నాడు. అది అధికారిక ఇమ్మిగ్రేషన్ ముద్ర లాగే ఉంది.తర్వాత నాకు అర్ధం అయిందేమిటంటే యూరప్ లో ఏ దేశంలో ముందుగా అడుగు పెడతామో ఆ దేశపు ఇమ్మిగ్రేషన్ స్టాంప్ మాత్రమే మన పాస్ పోర్ట్ మీద ఉంటుంది. మిగతా ఎన్ని దేశాలు తిరిగినా ఇమ్మిగ్రేషన్ చెక్ ఉండదు కనుక ఆయా దేశాల స్టాంప్ లు కూడా మన పాస్ పోర్ట్ లో ఉండవు. అందుకే పర్యాటకులంతా జర్మనీ ని దర్శించిన గుర్తుగా ఆ స్టాంప్ వేయించుకుంటున్నారు. దానికి ఆ వ్యక్తీ 5 యూరోలు తీసుకుంటున్నాడు. మేము ఆ స్టాంప్ వేయించుకోలేదు. అక్కడికి నడిచే దూరంలోనే జర్మనీ పార్లమెంట్ ఉంది. ఇది అతి పురాతనమైన భారీ నిర్మాణం.పెద్దగా సెక్యురిటి ఏమి లేదు. దాని చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకున్నాం. చలిగాలులు ఇంకా తగ్గకపోవటంతో ఎటు చూసినా అందరూ కోట్లు వేసుకునే తిరుగుతున్నారు. ఇక మా ప్రయాణాన్ని ముగించుకుని అందరం పోలాండ్ కి బయలుదేరాం. 

జర్మనీ పార్లమెంట్ ముందు మార్చిన్ భార్య కాషా తో భార్గవి


2 comments:

నీహారిక said...

చరిత్రకి సంబంధించిన చాలా మంచి విషయాలు తెలియపరుస్తున్నారు,ధన్యవాదాలు !

its me said...

Excellent . Your language is commendable. Keep writing and one day your name is reckoned with the best writers.