కవి , తత్వవేత్త తమ కాలం కంటే ముందు ఉంటారనేది నిర్వివాదాంశం. మిగతా వాళ్ళంతా ఆ రెండూ కాదు కాబట్టి గతించిన కాలంలో జరిగిన మార్పుల్నిమాత్రం విశ్లేషిస్తూ ఉంటారు. ఇది ఒకరకంగా అలాంటి విశ్లేషణ. ఒక్క 20 సంవత్సరాలు వెనక్కి వెళదాం. గ్రామంలో గత ఇరవై సంవత్సరాల్లో మనం ఊహించనివి, భవిష్యత్తులో ఇలా కూడా అవుతుంది అని ఎవరూ ఏ మాత్రం అంచనా వెయ్యని కొన్ని సంఘటనలు, మార్పులు తలచుకుంటే నిజంగా ఆశ్చర్యమే. ఇది మన గ్రామానికే పరిమితం అని కాదు నా ఉద్దేశం. ఇది మన వెబ్ సైట్ కాబట్టి మన వరకు మాట్లాడుకుందాం. ఘంటసాలలో మంచినీళ్ళు కొనుక్కుని తాగుతారని అసలు మనం ఊహించి కూడా ఉండము. పెద్దవాడైనా, పేద వాడైనా ఊరి చివర చేతి పంపు నీళ్ళే తాగేవాళ్లు. కాకపొతే ఉన్నవాళ్ళకి పాలేర్లు, లేని వాళ్ళు సొంతంగానూ కావిళ్ళతో నీళ్ళు చేరవేసుకునే వాళ్ళు. Bisleri Water బాటిల్స్ ని ఎప్పుడో తప్ప గ్రామంలో చూడటం అరుదు. మరి ఇప్పుడు? అందరికీ సురక్షిత మంచినీరు, లీటర్ రూపాయికి అమ్మినా, పది రూపాయలకి అమ్మినా అందరం కొనుక్కునే తాగుతున్నాం. సిటీలలో అద్దె ఇళ్ళలో స్థలం లేక కళ్యాణ మండపాలలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. గ్రామంలో పశువుల దొడ్లు, విశాలమైన వాకిళ్ళు, వీధిలో షామియానాలలో భోజనాలతోనే ఆ తంతు ముగిసిపోయేది. మరిప్పుడు? చిన్నపాటి కార్యక్రమాలకి కూడా కళ్యాణ మండపమే వినియోగిస్తున్నాం. ఇంటిలో పెళ్ళనేది మానేసి చాలాకాలం అయ్యింది. ఒకరో ఇద్దరో బఫే డిన్నర్ కూడా పెట్టినట్లు గుర్తు. అందరూ బఫే పెట్టే రాజులు కూడా త్వరలోనే ఉన్నాయి. ఇంట్లో ఫంక్షన్లకి మామయ్యలు బాబాయిలు వడ్డన చేయటం మానేసి చాలా కాలమే అయ్యింది. మన ఊర్లో కళ్యాణ మండపమా ? అని ఆశ్చర్యం,అసహనం వ్యక్తం చేసిన వాళ్లే చక్కగా దానిని వాడుకుంటున్నారు. గ్రామంలో కళ్యాణ మండపం కొందరు వ్యక్తుల ముందు చూపుకి, సంకల్పానికి, విరాళాలి చ్చి ప్రోత్సహించిన వితరణ శీలుర దాతృత్వానికి ప్రతీక.
మాతరం ఊహ తెలిసే నాటికి దిగువ మధ్య తరగతి కుటుంబాలకి మరుగు దొడ్లు ఏర్పడ్డాయి. మన తండ్రుల కాలంలో కూడా కాలకృత్యాలకి బయటికే వెళ్ళే వాళ్ళట. ఇది ఒక భూస్వామి స్వయంగా నాతో చెప్పిన మాట. నా చిన్నతనంలో స్నానాల దొడ్లు ఇంటి బయట ఉండేవి. మెల్ల మెల్లగా అందరికి మరుగు దొడ్లు ఏర్పాటు కావటం నా చిన్నతనం నుంచి నేను గమనించిన ఒక అంశం. కానీ మన ఊర్లో ఆటాచ్డ బాత్రూంతో బెడ్రూములు కడతారని ఎప్పుడూ అనుకోలా. ఇక AC ల విషయం,, ఉషా ఫాన్ అంటే పెద్ద గొప్ప ఒకప్పుడు. కరెంట్ ఉన్నా ఒక్క గదిలోనే ఫాన్ ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న డాబాల్లో కూడా AC లు, గదికి ఒక ఫాన్. ఇంకొక ముఖ్యమైన అంశం టెలిఫోన్ సౌకర్యం. 1962 లో ఊరికి ఫోన్ సౌకర్యం వస్తే 1995 దాకా మన గ్రామంలో ఉన్న ఫోన్ల సంఖ్య వంద కూడా లేదు. అమెరికాలో ఉన్న పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి తమ ఇంటికి ఫర్లాంగు దూరంలో ఫోన్ ఉన్న వాళ్ళింటికి ఫోన్ చేసి తమ వాళ్ళని పిలవమని, వాళ్ళు వచ్చాక మళ్లీ కాల్ చేసి మాట్లాడటం నాకు గుర్తుంది. ఇది ఎప్పుడో 80 లలో అనుకునేరు సుమా, 1997 లో. ఇక ఆ తర్వాత నుంచి ల్యాండ్ ఫోన్ల వరద ప్రారంభం అయ్యింది. ఇక సెల్ ఫోన్ విప్లవం, ఈ మార్పుని నేను గ్రామంలో దగ్గరగా చూడలేదు. ఎందుకంటే అప్పటికే హైదరాబాదు వెళ్ళిపోవటం వల్ల ప్రత్యక్షంగా ఆ మార్పుని గమనించలేదు. కానీ సెలవలకి వెళ్ళినప్పుడల్లా దశల వారీగా ఆ మార్పుల్ని చూసేవాడిని. మొదట కాస్త డబ్బున్న వాళ్ళు, తెల్లటి సిల్కు ఖద్దరు చొక్కాల్లో 500 రూపాయల నోటు మాత్రం కనిపించేలా పెట్టే షోకిల్లా రాయుళ్ళు దానితో పాటు సెల్ ఫోన్ కూడా పెట్టటం ప్రారంభించారు. మాది వ్యవసాయ కుటుంబం, ట్రాక్టర్లు కిరాయికి తిప్పే బిజినెస్ కావటంతో నా చిన్నతనంలో తెల్లారేటప్పటికి మా ఇంటి చుట్టూ ఒక పదిమంది వచ్చి ఉండేవాళ్ళు. తమ పొలాలు దున్ని పెట్టాలనో లేక ఇసుక తోలి పెట్టాలనో. లాండ్ ఫోన్స్ వచ్చాక ఆ ఫ్లో కొంత తగ్గింది. ఇప్పుడు అయితే ఒక్కళ్ళు కూడా రావట్లా. అన్నీ ఫోన్లలోనే. మెల్లగా ట్రాక్టర్ ఓనర్లు, వాళ్లతోపాటే డ్రైవర్లు, కొన్నాళ్ళకి ముఠా మేస్త్రీలు, ఇప్పుడు ముఠా కూలీలు అందరికీ సెల్. కూలి బేరం కుదరకపోతే క్షణాల్లో అందరికీ సమాచారం వెళ్ళిపోతుంది లొకేషన్ చేంజ్ అని (వేరే పొలానికి). సెల్ ఫోన్ల పుణ్యమా అని ఒక మంచి మాత్రం జరిగింది. మనం అణాలు, బేడలు వినటమే తప్ప చూడలేదు వాడలేదు. కనీసం మాటల్లో కూడా మనం అని ఉండము. మన ముందు వాళ్ళతోనే అవి అంతరించిపోయాయి. సెల్ ఫోన్ కాల్ చార్జీల వల్ల కనుమరుగైపోయిన పైసలు వాడుకలో లేకపోయినా, మాటల్లో వాడుతున్నారు, సెకను కి పైసా అని అరపైసా అని. నేను అయిదు పైసల నాణెం చూసాను, ఖర్చు పెట్టాను కూడా. ఇపుడు బిక్షగాళ్ళకి రూపాయి వేస్తేనే అదోలా చూస్తున్నారు. ఇంతకుముందు పావలాకి ఏమొస్తది అంటే సమాధానం ఉండేది కాదు. ఇప్పుడు ధైర్యంగా చెప్పచ్చు 25 నిమిషాలు టాక్ టైం వస్తుంది అని. ఇక జలధీశ్వరాలయంలో షష్టి లాంటి పండుగలకి తప్ప మామూలు రోజుల్లో నర మానవుడు కూడా ఆ గుడిలో కనిపించేవాడు కాదు. ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం నుంచి రోజూ వచ్చే జనం. రేపో మాపో దర్శనానికి టికెట్ పెట్టినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ రోజుని కూడా మనం తప్పకుండా చూస్తామని నా గట్టి నమ్మకం. ఇది కూడా కొందరు వ్యక్తుల ముందు చూపుకి నిదర్శనం. దీనికి కూడా పెదవి విరుపులు, అసహనాలు యధాతధం.
ఈ మార్పులన్నీ జరుగుతున్నపుడు మనం గమనించలేదు, ఇలా కూడా అవుతుంది అని ఊహించలేదు. ఒక వేళ ఎవరన్నా ఊహించి చెప్పినా ఇదంతా అయ్యే పనులు కావులే అని పెదవి విరిచిన వాళ్ళే ఎక్కువ ఉండి ఉంటారు. మనం పెదవి విరవటానికి కారణం బహుశా సమాజంలో జరుగుతున్న మార్పుల్ని తెలుసుకుని వాటిని అందిపుచ్చుకోలేకపోవటం కావచ్చు. దానికి సమాచార లోపమూ ఒక కారణం .కానీ అవన్నీ జరిగాయి. ఇప్పటి దాకా జరిగిన వాటికి మనం విశ్లేషకులుగానే మిగిలిపోదామా? లేక ఇకనుంచైనా ఆ ముందుచూపుతో అవసరాలని, అవకాశాలని అందిపుచ్చుకుందామా? ఇప్పుడు సమాచార లోపం లేదు, ప్రపంచం లో ఎక్కడ ఏ మార్పు జరిగినా క్షణాల్లో మారుమూల గ్రామాలకి సైతం తెలిసిపోతోంది. ఈ మధ్య టీవిలో ఒక వార్త ని చూసాను,విజయవాడలో స్వర్గపురి అని నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన స్మశానం అని. (వీడియో దృశ్యాలు ఇక్కడ చూడండి.) కానీ ఈ అంశాన్ని రెండు సంవత్సరాలకి ముందే ఆలోచించిన కొంతమంది దార్శనికులు మన గ్రామంలోనూ దానికి శ్రీకారం చుట్టారు. షరా మాములుగానే ఆ ఇదంతా అవుతుందా,అవసరమా అనే పెదవి విరుపులు కూడా అయిపోయాయి. కానీ ఆల్రెడి సమాజం లో మార్పు మొదలైంది, ఇంకా మనం దానిని అందిపుచ్చుకోలేకపోతే ఈ మార్పు కూడా విశ్లేషణల కోవలోకే వెళ్ళిపోతుంది. మనల్ని మనం దార్శనికులుగా నిరూపించుకోవటానికి తక్షణం మన ముందు ఉన్న అంశం ఇది. గుడికి వందలు పెట్టి టికెట్ కొనుక్కుని దర్శనానికి వెళ్ళే మనం స్మశానానికి కూడా టికెట్ పెట్టుకుని వెళ్ళే రోజులు వచ్చేసాయి. కానీ అవి పెద్ద పెద్ద సిటీ లలోనే కావచ్చు. కానీ మనమే నిర్మించుకునే ఈ స్వర్గపురి ఆ సౌకర్యాలని పేద గొప్ప తేడా లేకుండా అందరికీ ఉచితంగానే అందించే ప్రయత్నంలోనే ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకున్న చాలామంది స్పందించటం ఎంతో ఆనందించదగ్గ విషయం. కానీ ఈ బృహత్తర ప్రణాళికకి చాలా మంది పెద్దల పెద్ద మనసులు కావాలి. లేదంటే ఇంకో పదేళ్ళ తరువాత ఇది కూడా పైన విశ్లేషించుకున్న మార్పుల చెంతన మన ప్రమేయం లేకుండానే జరిగిన మార్పుగా మిగిలిపోతుంది. ముందుచూపుతో ఎవరు దీనికి కారకులు అవుతారో, ఎవరు కేవలం సాక్షులుగా మిగిలిపోతారో కాలమే నిర్ణయిస్తుంది.