అవి నేను మొవ్వ గ్రామంలో ఇంటర్ చదువుతున్న రోజులు. మన గ్రామం నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్ధులు అక్కడ చదువుకోవటానికి వచ్చేవారు. అప్పటిదాకా సొంత గ్రామం లోని స్నేహితులతో చదువుకున్న మాలాంటి వాళ్లకి వేరే గ్రామాల విధ్యార్ధులతో కలిసి చదువుకోవటం అదే మొదటి సారి. స్కూల్ దశ నుంచి కాలేజి జీవితం లోకి వేసిన తొలి అడుగు ఇంటర్ కాలేజికే. ఒక రోజు మాథ్స్ క్లాస్ జరుగుతుంటే వెనక ఏదో చిన్నగా ఇద్దరు విద్యార్ధుల మధ్య గొడవ అయింది. లెక్చరర్ కోపంగా ఆ ఇద్దరు విద్యార్ధులని లేపి, ఏమిటిరా గొడవ అనగానే అందులో ఒకడు, వీడు నన్ను బెదిరిస్తున్నాడు సార్ " మాది కొడాలి, ఎక్కువ మాట్లాడావంటే మెడకాయ మీద తలకాయ ఉండదు అని " చెప్పాడు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఆ లెక్చరర్ కి ఏం మాట్లాడాలో తెలియలేదు. మామూలుగా అయితే ఏదో ఒక యాక్షన్ తీసుకునేవాడేమో. కానీ ఆ లెక్చరర్ కూడా ఆ మాటకి వెనక్కి తగ్గాడు. ఈ సంఘటన నాకు కొడాలి మీదుగా వెళ్తునప్పుడు, అలా అన్న వ్యక్తి కొడాలి సెంటర్ లో కనిపించినప్పుడల్లా గుర్తొస్తుం ది..
నేను చిన్నపట్నుంచి వింటున్న సంఘటన ఈ సందర్భం లో చెప్పాలనిపిస్తుంది. 1970 వ దశకం లో కొడాలి లో ఇరువర్గాల మధ్యన జరిగిన ఘర్షణల్లో కొంతమంది చనిపోయారు.ఈ కేసులో ఎదుటి వర్గం లో కొంతమందికి జీవిత ఖైదు విధించారట. 1977 లో దివిసీమ కి అతి పెద్ద ఉప్పెన వచ్చి కొన్ని వేల మంది చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే. ఇప్పటికి మన ప్రాంతం లో వచ్చిన అతి పెద్ద ఉప్పెన ఇదే. అయితే ఆ శవాలని తీయటానికి మనుషులు కూడా దొరకని పరిస్థితులలో జైలులో ఉన్న ఖైదీలని విడుదల చేసి వారి సాయంతో దహన సంస్కారాలు నిర్వహించారు. వారు చేసిన ఆ సేవలకి ప్రభుత్వం వారి శిక్షా కాలాన్ని తగ్గించి అప్పటికప్పుడే భేషరతు గా వారిని విడుదల చేసింది. ఒక రకంగా ఆ ఉప్పెన వారికి మేలు చేసినట్లే.
మన మండలంలో ఘంటసాల తో పాటు అత్యంత రాజకీయ చైతన్యం కల ఊరు కొడాలి. కొడాలి పేరు చెప్తేనే ఆ చుట్టుపక్కల గ్రామాలలో కొంచెం భయం ఉండేది. ఆ ఊర్లో జరిగిన గొడవలు, సంఘటనలు ఆ భయానికి కారణం కావచ్చు. రెండు సంవత్సరాల పాటు కొడాలి మీదుగా కాలేజికి వెళ్తున్నపుడు ప్రతి రోజు ఆ సెంటర్ కి రాగానే అక్కడ తిరిగే మనుషుల్ని చూస్తూ ఉండేవాళ్ళం. అందరు ఎంతో ఉత్సాహం గా సౌమ్యం గా కనిపించేవాళ్ళు. కానీ ఇదేమిటి అందరూ ఇలా చెప్తారు వీళ్ళంతా ఇలా ఉంటే అనే ఆలోచన నా మదిని తొలుస్తూ ఉండేది. కానీ సంఘటనలు జరిగినప్పుడల్లా మాత్రం ఇదేమిటి ఇలా ఇంత చిన్న కారణానికే ప్రాణాలు తీసేంత కోపం ఎలా వస్తుందో అనిపించేది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న కొడాలి, బండి వెంకటేశ్వర రావు హత్యతో మళ్లీ ఉలిక్కి పడింది. తప్పెవరిది అని విశ్లేషించే సాహసం నేను చేయలేను గాని, జరిగిన ఘటన మాత్రం భవిష్యత్తులో యువకులను ప్రభావితం చేస్తే ఈ హత్యల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.ఇప్పటిదాకా కేవలం రాయలసీమ ఫాక్షనిజాన్ని సినిమాల్లో చూసిన మనం, కోస్తా లో కత్తుల విన్యాసాలని లైవ్ లో చూడచ్చు...
No comments:
Post a Comment