Wednesday, September 12, 2012

మన తొలి ఇంజనీర్


మన గ్రామంలో తొలి ఇంజనీరింగ్ పట్టభద్రుడు శ్రీ ఉప్పల వెంకటేశ్వర్లు గారు. ఆయనతో పాటు చదువుకున్న వారు, అయనని చిన్నతనం నుంచి ఎరిగిన వారు చెప్పిన ఎన్నో విషయాలు నా మదిలో ప్రోది చేసుకుని ఉన్నాయి. నేను హైదరాబాదులో ఓ సంస్థ లో ఉద్యోగం చేస్తున్నపుడు ఆయన అతిధిగా ఆ కంపెనీ కి వచ్చినపుడు ఆయన్ని కలుసుకునే అవకాశం కలిగింది. ఎవరి అబ్బాయివి అని అడిగి అప్యాయంగా పలకరించిన తీరు ఇప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. వర్లు గారు 16,డిసెంబర్ 1927 న మన గ్రామంలో అత్యంత పేద కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా చల్లపల్లి రాజా గారి బడిలోనే సాగింది. ఆయనతో పాటు చదువుకున్న ఎంతో మంది ఇప్పటికీ అయన వేషధారణని, అతి సామాన్యమైన ఆ మూర్తీభవిత్వాన్ని మరిచిపోలేదు. జీవితం లో ఎన్ని ఎత్తులకి ఎదిగినా ఆయన వేషధారణలో మాత్రం అత్యంత సామాన్యం గా ఉండేవారు. ఆయన వివాహానికి సంభందించిన విశేషాన్ని గ్రామస్తులు ఇప్పటికీ చెప్పుకుంటారు. మన గ్రామంలోనే ఉన్నత రైతు కుటుంబంలో జన్మించిన సక్కుబాయి గారిని వివాహం చేసుకున్నారు. సక్కుబాయమ్మ గారి తండ్రి తుమ్మల కొండ తాత పెద్ద రైతు. ఏమీ లేని వాడికి పిల్లనివ్వటం ఏమిటని గ్రామస్తులంతా ఆయన్ని వారించారు. కానీ ఆయన ఎవరి మాట వినలేదు. ఆర్ధికంగా రెండు కుటుంబాలకి ఎంతో అంతరం ఉన్నా, వర్లు విద్యాధికుడు, ఆ విద్య ముందు ఎన్ని ఎకరాలున్నా అవి దిగదుడుపే అని చెప్పి తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. ఆయన నమ్మకం వృధా పోలేదు.మన గ్రామం లో తొలిసారిగా జనరేటర్ తో లైటింగ్ ఏర్పాటు చేసి జరిగిన వివాహం వర్లు గారిదే.


  
ఇక విద్యార్ధిగా Madras Institute of Technology లో DMIT (ప్రస్తుతం ఇది B.tech) కోర్సు పూర్తి చేశారు. బొంబాయి లో అణు పరిశోధక శాఖ లో ఇంజినీర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ప్రభుత్వ రంగ సంస్థ  E.C.I.L ని స్థాపించటం లో కీలక పాత్రని పోషించారు. మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో I.T.I చదువుకున్న వాళ్ళ దగ్గర్నుంచి ఇంజినీర్ల వరకు ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొన్ని వేల మందికి ఉపాధి కలిగే మార్గాలు నిర్మించి వారి భవితకి సులువైన ప్రయాణాన్ని అందించారు. హైదరాబాదు E.C.I.L ప్రాంతంలో మన చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు ఎక్కువమంది స్థిరపడటానికి  కారణం కూడా వర్లు గారే.05.09.1957 న ప్రభుత్వం ఆయనని పరిశోధనల నిమిత్తం అమెరికా,ఇంగ్లాండ్, ఫ్రాన్సు దేశాలకు పంపింది.1963 లో ఇటలీ లో జరిగిన అణు శాస్త్ర పరిశోధకుల సమావేశం లో భారత దేశం తరపున పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ రంగం లో అయన అందించిన విశిష్ట సేవలకు గాను ఎన్నో అవార్డులు ఆయన ఇంట్లో కొలువుదీరాయి.1986 లో నాయుడమ్మ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి వర్లు గారే. పదవీ కాలం లోనూ మరియు పదవీ విరమణ తర్వాత పన్నెండు కంపెనీలకు డైరెక్టర్ గా తన సేవలను అందించారు. గ్రామీణ విద్యార్ధులకు సాంకేతిక విద్య అందుబాటు లో ఉండాలనే ఉద్దేశం తో వర్లు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించి మన గ్రామం లో ఐ టి ఐ ని స్థాపించారు. 2 అక్టోబర్ 2004 న ఆయన అస్తమించినపుడు ఆయన నివాసం, బంధువులతో కంటే ఆయన్ని ఆత్మ బంధువుగా భావించిన వేలాది మంది కన్నీటితోనే తడిచి పోయింది. ఆ దృశ్యానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. హైదరాబాద్ లో ECIL సమీపంలోని అణుపురంలో తాను ముచ్చట పడి కట్టుకున్న ఇంట్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. మంచం మీద ఉన్న స్థితి లో కూడా ఉద్యోగనిమిత్తం తన సిఫార్సులకోసం వచ్చిన వారికి తగిన మాట సాయం చేసి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. ఆయన నిరాడంబర జీవితం ఈ తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.

2 comments:

వాత్సల్య said...

బ్లాగు ఇప్పుడే చూసానండీ. మీ ఊరి విషయాలు బాగా రాస్తున్నారు. గోపాల క్రిష్ణ గారి టపా చదివాకా ఆగకుండా మిగిలినవి చదివేసాను.

తెలీని నా లాంటి వాళ్ళ కోసం మీ ఊరు యే జిల్లాలో ఉంది లాంటి విషయాలు కూడా తెలియచేయండి. మీ టపాలు చదివాకా మీ ఊరు ప్రకాశం జిల్లా ఏమో అనిపిస్తోంది.కరెక్టో కాదో చెప్పండి

Rajesh Vemuri said...

Hi rishi Garu,Thank you.This village is located in Krishna District.You can check the full web site www.managhantasala.net