“The greatness of a nation and its moral progress can be judged by the way its animals are treated" దేశం యొక్క గొప్పతనం, నైతిక విలువలు ఆ దేశంలో జంతువుల్ని,మూగజీవాలని పరిరక్షించే విధానాల ద్వారా తెలుస్తాయని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తి మన గ్రామం లో పశువుల ఆస్పత్రి లో కనిపిస్తుంది.మనం పట్టించుకోని చాలా ముఖ్యమైన విభాగాల్లో పశువుల ఆసుపత్రి ఒకటి. మనుషులకి నోరుంది, మన భాధని డాక్టర్ కి చెప్పుకోవటానికి ఆ భగవంతుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ భాధని విని తగిన వైద్యం చేసే అవకాశం డాక్టర్లకి ఉంది.కానీ నోరు లేని మూగజీవాలకి, వాటి భాధని తమంతట తాముగా తప్ప తెలుసుకోలేని పశువైద్యులకి ఆ అవకాశం, అదృష్టం లేవు. మీలో ఎంతమందికి ఈ ఆలోచన మదిలో మెదిలి ఉంటుందో చెప్పండి? వ్యవసాయానికి, పశుపోషణకి నిలయమైన మన గ్రామంలో ఒకప్పుడు అసలు పశువుల డాక్టర్ పేరు కూడా రైతులకి తెలీదు.
చదువుకునే వాళ్లకి మాత్రం ఏదైనా సర్టిఫికేట్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలంటే మాత్రం అత్యంత అలుసైన వ్యక్తిగా మాత్రం మన ఊర్లో పశువుల డాక్టర్ గుర్తొస్తాడు. కానీ కొన్ని సంవత్సరాలపాటు ఈ సాంప్రదాయాన్ని మార్చేసి, పశువుల డాక్టర్ అంటే ఇలా ఉంటాడు,ఆసుపత్రి అంటే ఇలా ఉండాలి అని, ఆసుపత్రి రూపు రేఖల్ని మార్చటంతో పాటు పశు వైద్య విధానంలో మన గ్రామంలో నవ పోకడలకి నడకలు నేర్పిన వ్యక్తి మనోరంజన్.
అప్పటివరకు గేదలకి ఏదైనా జబ్బు వస్తే ఆసుపత్రికి తీసికెళ్ళటం అలవాటు లేని సన్న, చిన్నకారు, రైతులు కూడా ఆసుపత్రి బాట పట్టారు.ప్రభుత్వం నుంచి పశుపోషణకి సబ్సిడీలు వస్తాయని చాలామంది రైతులకి తెలిసింది ఆయన వచ్చిన తర్వాతే. పాడి పరిశ్రమకి నెలవైన గ్రామంలో ఆ విభాగపు వైద్యుల వివరాలని కూడా సేకరించి పొందు పరచాలని పశువుల హాస్పిటల్ కి వెళ్ళిన నాకు, ఎదురుగా దండతో ఉన్న ఫోటో చూడగానే షాక్ కొట్టినట్లైంది. కాసేపు ఏమి అర్ధం కాక అక్కడున్న డాక్టర్ వివరాలు తీసుకుని వచ్చేసాను. మనసు ఒక పది సంవత్సరాలు వెనక్కెళ్ళింది. బక్క పల్చని శరీరం, నిండా పాతికేళ్ళు అయినా లేని ఓ యువకుడు అప్పుడే చదువు పూర్తి చేసుకుని మొట్ట మొదటి పోస్టింగ్ మన గ్రామంలోనే రావటం తో వెటర్నరీ డాక్టర్ గా మన పశువుల హాస్పిటల్ లో నియమితుడయ్యాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రామంలో రైతుల్ని, పశుపోషకులని తన సేవాభావంతో ఆకట్టుకున్నాడు. అప్పట్లో బజాజ్ కాలిబర్ బైక్ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. ఆ బైక్ మీదే ఊర్లో రైతులు అర్ధరాత్రి పిలిచినా అపరాత్రి పిలిచినా కాదనుకుండా వెళ్ళేవారు. ఊరిలో యువకులకి అయనంటే కొద్ది రోజుల్లోనే ఎంతో అభిమానం ఏర్పడింది. స్కూలు నుంచి కాలేజి కి వెళ్ళేవాళ్ళకి, ఏదైనా ఉద్యోగానికి అప్లయ్ చేసుకునే వాళ్ళకి, పాస్ పోర్ట్ అప్లై చెయ్యాలన్నా, ఏదైనా గెజిటెడ్ రాంక్ ఆఫీసర్ సంతకం కావాలి. వెటర్నరీ డాక్టర్ ది గెజిటెడ్ రాంక్ కావటంతో చాలామంది ఆయన్నే ఆశ్రయించేవారు.
కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు నెలకి వేలకి వేలు జీతాలు తీసుకుంటున్నా సరే ఇలాంటి సంతకాలకి పదో పరకో మాత్రం పుచ్చుకునే అలవాటు.లేదా వాళ్ళ దగ్గర ఉండే అటెండర్ కైనా ఆ తాయిలం సమర్పించాల్సిందే. ఇంత చేసినా రెండు మూడు సార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ఈ అనుభవాలు నాకు చాలానే ఎదురయ్యాయి. కానీ మనోరంజన్ సంతకం చేసి మనకే ఎదురు తాయిలం ఇచ్చేవారు,ALL THE BEST అని చెప్పి. ఒక సారి ఇలాగే ఏదో అవసరం అయ్యి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాల్సి వచ్చింది. నా క్లాస్ మేట్ రెహమాన్ ఆయన దగ్గర సహాయకుడుగా పనిచేస్తుండేవాడు. వాడిని అడిగితే హాస్పిటల్ కి రమ్మని చెప్పటం తో బయలుదేరాను, దారిలోనే ఏదో పని నిమిత్తం వెళుతూ ఎదురవటంతో మళ్లీ హాస్పిటల్ కి రాగానే వెళదాంలే అనుకుంటూ వెనక్కి తిరిగాను. అప్పటికే ఆయనకి విషయం తెలిసి ఉండటంతో బైక్ ఆపి దీనికేందుకండి మళ్లీ రావటం అని రోడ్డు మీదే సంతకం చేసి హాస్పిటల్ కి వెళ్లి స్టాంప్ వెయించుకోమని సింపుల్ గా చెప్పి సాగి పోయాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత నేను చదువు రిత్యా గ్రామం నుంచి బయటకి వెళ్లి పోవటంతో ఆయన గురించి అంత ఆరా లేదు. ఏదైనా ఊరికి ట్రాన్స్ ఫర్ అయ్యి వెళ్లి పోయారేమో అనుకున్నాను తప్ప ఆ హాస్పిటల్ లోనే అయన ఫోటోని దండతో చూస్తానని అనుకోలేదు.ఆ ఆసుపత్రి వివరాలని కానీ, ఆ డాక్టర్ వివరాలు కానీ నేను వెబ్సైట్ లో పొందు పరచలేదు. తర్వాత మన గ్రామం నుంచి అదే విభాగంలో డాక్టర్ చదివిన సోదరుడు రాకేష్ వేమూరి ఆ జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ఆ అతి సేవాభావమే అయన ప్రాణాల మీదకి తెచ్చిందని,పశువుల్లో ఉండే ప్రాణాంతకమైన BRUCELLA అనే వైరస్ ఆయన శరీరంలో ప్రవేశించటంతో మూడుపదులు నిండకుండానే ఆ మనిషికి నూరేళ్ళు నిండిపోయాయని. రైతు గేదల్ని హాస్పిటల్ కి తీసుకు రాకపోయినా తానె స్వయంగా వెళ్లి పరిశీలించి ఆ జబ్బులకి మందుల్ని రాసిచ్చేవారు.ఈ క్రమంలో గేదల్ని పరీక్షించేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకపోవటమే ఆయన ప్రాణాల మీదకి తెచ్చింది. అప్పటికే BRUCELLA వైరస్ సోకిన పశువుల్ని చంపేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా మన గ్రామంలో అది అమలు కాలేదు.మనోరంజన్ శాంత స్వభావుడు కావటంతో రైతులకి ఎదురు చెప్పలేక ఆ వైరస్ సోకిన పశువులకి వైద్యం చెయ్యటంతో ఆ వైరస్ ఆయనకి కూడా ప్రభావాన్ని చూపించింది. మన గ్రామంలో ఉండగానే ఆయనకి వివాహం అయ్యింది. పెళ్లి అయిన మూడవ రోజునే తిరిగి డ్యూటీ లో జాయిన్ అవ్వటం వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత కి నిదర్శనం. చనిపోయేనాటికి ఆయనకి రెండు సంవత్సరాల పాప. ఆయన ద్వారా ప్రయోజనాలు పొందిన ఎంతో మంది రైతులు అయన చనిపోయాక హాస్పిటల్లో ఒక ఫోటో పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని కానీ ,ఆయన జ్ఞాపకాల్ని కానీ పట్టించుకున్న నాధుడు లేదు. మన గ్రామం కాకపోయినా, గ్రామ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని అధిరోహించిన వ్యక్తి శ్రీ మనోరంజన్. ఇదంతా చెప్తున్నపుడు రాకేష్ కళ్ళు వర్షించటం బాగా గుర్తు. తాను వెటర్నరీ సైన్స్ చదువుకునేటప్పుడు సెలవులకి గ్రామం వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు తన కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయని, అప్రెంటిస్ గా అయన దగ్గర పని చేసిన కొద్ది రోజుల్లోనే వృత్తి ని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నానంటాడు రాకేష్. కానీ ఆ కధ విన్నాక నా కళ్ళు చెమర్చటం కూడా నాకు తెలియలేదు....
1 comment:
great.....hats off to Dr.P.mano ranjan
Post a Comment