Sunday, September 9, 2012

పరిమళించని పాట



వేటూరి పాటంటే నాకు చాలా ఇష్టం, మబ్బుల్లో నీళ్ళకోసం ఉన్న ముంతలో నీళ్ళు వంపేస్తారు అని మధ్య తరగతి మనస్తత్వాలని గేలి చేస్తూ నిరాశ వాదం వైపు నడిపిస్తున్న సాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లోనే, నింగి నైనా కిందకి దించగల సత్తా ఉన్నపుడు, మన చేతిలో ఉన్ననీళ్ళు వంపేసినా తప్పులేదు ....అనే ప్రతివాదం తో ఆశావాదాన్ని, స్ఫూర్తిని రగిలించిన సాహితీ మూర్తి వేటూరి. అయన సాహిత్యంలో ఆ  మాట నా జీవితానికి టాగ్ లైన్. ఆ ఒక్క మాటని అనుసరించటమే నా జీవితంలో ప్రతి మెట్టుకి సోపానంగా నిలిచింది. అది అనుసరిస్తున్నపుడు, నేను దుబారా గా ఖర్చుపెడతానని, రేపటి గురించి దాచుకోనని కుటుంబ సభ్యులు,బంధువులు నా మీద స్టాంప్ వేసేసినా, నేను నమ్మిన వేటూరి తత్వాన్ని వదులుకోలేదు. చివరికి నా ఆలోచనే కరెక్ట్ అని నన్ను అన్నవాళ్ళకి అర్ధం అయ్యింది.
తలంబ్రాలతో దోసిళ్ళు, తనువందాల దోపిళ్ళు. కందిన అందపు తావిళ్ళు, కన్నె బుగ్గలో క్రావిళ్ళు.
దోసిళ్ళు ఎత్తిన చేతుల చాటున దోచక తప్పని దోరసొగసులు. దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేతసిగ్గులు.... పెళ్ళంటే ఆసక్తి లేని నమ్మకం లేని బ్రహ్మచారులేవరైనా ఈ పాట వింటే పెళ్లి చేసుకోవాలి ఆ ముచ్చట ఎలా ఉంటుందో చూడాలి అని మాత్రం ఖచ్చితం గా అనుకుంటారు. నేను సినిమా రంగం లో పని చేసేటప్పుడు ఒక్క సారి చూడాలనుకున్న మొట్ట మొదటి వ్యక్తి శ్రీ వేటూరి సుందరరామమూర్తి. ఒక రోజు అన్నపూర్ణా స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చేతి కర్ర తో నడుస్తూ వస్తున్న ఆయన్ని ఒక్కసారిగా చూడగానే నేను పరుగున వెళ్లి చెప్పిన మాట నా పేరు వేటూరి అండీ నేను మీ అభిమానిని అని. ఆయన నవ్వారు. మళ్లీ నాలుక కరచుకుని, సారీ అండీ మిమ్మల్ని చూసిన ఆనందం లో ఏం మాట్లాడాలో తెలియట్లేదు నా పేరు రాజేష్ నేను మీ అభిమానిని అని చెప్పాను. అంతకుమించి ఒక్క మాట కూడా నాకు గొంతు పెగల్లేదు కొన్ని వందల సార్లు విన్న ఆయన పాటలేవీ ఆ క్షణం లో గుర్తు రాలేదు. ఏదో ఉద్విగ్నత,తెలీని ఉత్సుకత. ఈలోపు కార్ రావటం తో ఎక్కి వెళ్ళిపోయారు. కనీసం ఫోటో దిగాలన్న విషయం కూడా నాకు తట్టలేదు. ఎన్నో సాయంత్రాలని డబ్బులు లేకపోయినా రిచ్ గానూ, గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా రొమాంటిక్ గా ఫీల్ అయ్యేట్లు చేసింది వేటూరి పాట. వాక్ మెన్ కాలం నుంచి నేటి ఐపాడ్ దాకా సాంకేతికత మారింది కానీ అందులో వినిపించే పాటల చాయిస్ మాత్రం ఒకటే. ఆ అంటే అమలాపురం అని కుర్రాళ్ళని తమకి  తెలియకుండానే స్టెప్పులు వేయించింది, అందం గా లేనా అసలేం బాలేనా అంటూ కన్నెపిల్ల భావాల్ని పలికించింది 70 ఏళ్ల వృద్ధ కలం అంటే మిగతా భాషల వాళ్ళెవరు నమ్మరు.అంత్య ప్రాస అనేది తెలుగు భాష కి మాత్రమే ఉన్న అరుదైన సాహితీ ప్రక్రియ. వేటూరి పాట విన్నాకే అంత్య ప్రాస అనేది ఒకటి ఉంటుందని తెలిసింది. తకిట తథిమి తకిట తథిమి తందాన” పాటలో ”నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన ఇక్కడ న అనేది అంత్య ప్రాస. హైస్కూల్ లో చదువుకునేటప్పుడు తెలుగు పాఠాలు నేర్పిన పదాల కంటే వేటూరి పదాల్లోనే ఎక్కువ వ్యాకరణాన్ని శబ్ద ప్రయోగాన్ని గ్రహించానేమో.
వేటూరికి మన గ్రామానికి ఉన్న సంభంధం అనుభంధం చాలామందికి తెలీదు. మన గ్రామానికి దగ్గరలోనే ఉన్న పెదకళ్ళేపల్లి లో 1936 జనవరి 6 న జన్మించిన వేటూరి,కొత్త నుడికారంతో సరికొత్త పద ప్రయోగాలతో సినీ పాటల పూదోట కి వనమాలి అయ్యారు. వారి బాబాయి సుప్రసిద్ధ పండితుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఘంటసాల చరిత్ర రచన లో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారికి తోడ్పడిన వ్యక్తి. ఈ విషయం స్వయం గా వెంకట సుబ్బయ్య గారే రాసారు. పెదకళ్ళేపల్లి ,మొవ్వ,ఘంటసాల పరిసర గ్రామాలంటే వేటూరికి అమితమైన అభిమానం. ఇక శ్రీకాకుళం గురించి అయితే ఆయన రాసిన సిరికాకొలను చిన్నది అనే రేడియో సంగీత నాటిక ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపింది. శ్రీకాకుళే మహా క్షేత్రే అని మూడు తరాలు జరిగిన అజ్జ్ఞాత కధ ని రాయటం ద్వారా ఆయనకి ఆ గ్రామం మీద ఉన్న అవగాహన ని తెలియచేస్తుంది. ఆ కధ లో సాని వాడలో మిగిలిపోయిన సామెతని కొంచెం వెటకారంగానే అయన వర్ణించిన తీరు అద్భుతం.
శ్రీకాకుళే మహాక్షేత్రే ,
గుండెరే మహానది ,
ఈతముల్లే ప్రాణ హాని,
అంకినీడే అధోగతి. 
శంకరా నాద శరీరాపరా అంటూ శంకరుడిని కీర్తించిన ఆ కలం తోనే మన జలధీశ్వర స్వామి పై  పాట రాయించే ప్రయత్నమూ జరిగింది. దీనికోసం ప్రయత్నించిన వ్యక్తి వేమూరి విశ్వేశ్వర రావు గారు. ఆయన పరమ పదించటానికి కొద్ది రోజులముందే ఆయన్ని కలిసే ప్రయత్నమూ జరిగింది. ప్రయత్న లోపం లేకపోయినా అది కార్య రూపం దాల్చలేదు. సమయా భావం వల్ల ఇక లోకం లో నేను ఉండలేను అని వేటూరి నిష్క్రమించారు. ఒక వేళ ఆయన పాట రాసి ఉంటే జలధీశ్వరస్వామి కి ఉన్న నగలలో అత్యంత విలువైన హారం గా ఆ పాట ఒదిగిపోయేది.

2 comments:

నీహారిక said...

సిరికాకొలను చిన్నది నాటిక ఎక్కడ దొరుకుతుంది? తెలియపరచగలరు.

Rajesh Vemuri said...

Kinige lo undi chudandi
http://kinige.com/book/Sirikakolanu+Chinnadi